నడక దారిలో-42
-శీలా సుభద్రా దేవి
***
జీవితకాలమంతా ఎన్నో ఆటుపోటులు,నిందలూ,అపనిందలూ,అవమా
మర్నాడు స్కూలు కి వెళ్తే పదిరోజుల సెలవంతటినీ ఎర్నెడ్ లీవుకింద కట్ చేసారు.”అదేమిటి ఇంకా జనవరే కదా క్యాజువల్ లీవ్ గా పరిగణించాలని ఉత్తరం పంపాను కదా “అన్నాను.ఆఫీసు స్టాపుతో లాలూచిపడి ఎవో కథలు చెప్పింది కాబోయే హెచ్చెమ్ అయిన ఉషా టీచర్.తగువు పెట్టుకునే మూడ్ లేక మౌనంగా వూరుకున్నాను.
నేను వూరు నుండి వచ్చిన వారం రోజులకే గంటి వెంకటరమణ కూతురు పెళ్ళి.అందరికీ ఇచ్చి నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు.హడావుడిలో మర్చిపోయిందో ఏమో అనుకున్నాను.పిల్లల చదువులకూ,ఇంకా అనేక ఇతరేతర ఆర్థిక ఆటుపోట్లలో ఆమెను సాయశక్తులా ఆదుకున్న నన్ను ఎందుకు దూరం పెట్టిందో అర్థం కాలేదు.అయినా నేనూ వీర్రాజుగారూ పెళ్ళికి వెళ్ళాం.పిలవని పేరంటానికి వెళ్ళామేమోనని నేను ఇబ్బంది పడ్డాను.ఆ తర్వాత ఇంకేదో సందర్భంలో తెలిసింది.మా అమ్మ పోయినందుకు నన్ను పిలవలేదని.ఎక్కడో వేరే వూరిలో అమ్మ పోయింది.అందరూ నమ్మే ఆచారాలు ప్రకారమే అయినా నాకు పెళ్ళయ్యింది కనుక నా గోత్రం వేరే అవుతుంది కనుక నిజానికి నాకు చావు మైల లేనట్లే కదా.నాకు ఈ విషయాలపట్ల మరింత అసహ్యం వేసింది.నా డబ్బుకు మైల లేదా అనుకున్నాను.అప్పటి నుండి సాంప్రదాయాలనీ ,ఆచారాలనే కొన్ని సామాజిక వర్గాలకు దూరంగా వుండటం మంచిదని తెలిసింది.అంతే కాదు వ్యక్తులు కన్నా డబ్బుకు విలువనిచ్చే వ్యక్తుల దగ్గరా మెలకువగా వుండాలనుకున్నాను.
1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలోకి చొరబడి రాజ్యాంగేతరశక్తిగా కలు ఎదగాలనుకోవటం పార్టీలో ఇతరులకు అసహనం కలిగించటంతో రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో అనివార్యంగా ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది.అంతేకాదు అనారోగ్యసమస్యలు కూడా ఆయన్ని చుట్టుముట్టాయి.
అంతలోనే మళ్ళా విజయనగరం ప్రయాణం వచ్చింది.చిన్నక్క కూతురు రంజనకు పెళ్ళి కుదిరింది.మళ్ళా అందరం వెళ్ళాం.అమ్మ ఉంటుండగానే తెలుస్తూనే అమ్మ ఎంత సంతోషపడి ఉండేదో అని నేనూ,మా చిన్నక్క అనుకున్నాం.సంబంధం వెతకటం,సెటిల్ చేయటం అన్నీ అక్కబావగారు బంకుపల్లె మల్లయ్య శాస్త్రిగారే చూసినట్లు ఉన్నారు.ఈ పెళ్ళిలో అక్క అత్తింటి వారందర్నీ సుమారు ఇరవై ఏళ్ళ తర్వాత కలుసుకోవటం జరిగింది.అక్కకి పెద్ద బాధ్యత తీరిందని మేమంతా అనుకున్నాము.
ఇంకా స్కూల్ లో గణితంలో స్కూల్ అసిస్టెంట్ ఇందిర కుమారి పదవీవిరమణ చేసారు.సబ్జెక్టు ప్రకారం అయితే నాకు ప్రమోషన్ రావాలి.కానీ మాది ఎయిడెడ్ స్కూల్ కావటంతో నాకన్నా సీనియర్ అయిన బయాలజీ టీచర్ కి ప్రమోషన్ చేసారు.అయితే హైస్కూల్ కు లెక్కలూ, ఫిజికల్ సైన్సెస్ నేను చెప్తున్నాను.అంటే పరీక్షలు పరంగా మూడు పేపర్లు ,ముఖ్యమైన ఒకటిన్నర సబ్జెక్టులు చెప్తున్నట్లు.బయాలజీ టీచర్ సగం సబ్జెక్టే చెప్తున్నట్లు.
సెకెండరీ గ్రేడ్ పోష్టులో ఉంటూ అంత శ్రమ పడటం అవసరమనిపించలేదు.అందుకని నేను తొమ్మిది,పది తరగతులకు మాత్రమే రెండూ చెప్తాననీ ఎనిమిది,ఏడూ తరగతులు వేరే టీచర్లకు వేయమని పట్టు పట్టాను.తప్పని పరిస్తితుల్లో మూలుగుతూనే కొత్త హెచ్చెమ్ ఒప్పుకుంది.
రెడ్డీ ఫౌండేషన్ వాళ్ళు బస్తీల్లోనూ, వీథిబాలలనూ సేకరించి ఏడవతరగతీ,పదవతరగతి పరీక్షలకు సిద్ధపరిచే కార్యక్రమాల్లో భాగంగా మా స్కూల్ లో కూడా కోచింగ్ కోసం ఒక తరగతి గది ఏర్పాటు చేసారు వాళ్ళతో కలిసి మా హెచ్చెమ్. మా ఖాళీ పిరియడ్ లలో వాళ్ళకు పాఠాలు చెప్పమని మాకు కూడా చెప్పారు.సామాజిక సేవలో భాగంగా అప్పుడప్పుడు నేనూ,నా స్నేహితురాలు ఉమా చెప్పేవాళ్ళం.
తర్వాత్తర్వాత తెలిసిందేమిటంటే ఫౌండేషన్ వాళ్ళు స్కూల్లో తరగతి గది ఏర్పాటు చేసినందుకే కాక పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకూ రెమ్యునరేషన్లు ఇస్తున్నారని.కానీ అవి మా వరకూ రాలేదు.ఏమయ్యాయో తెలియదు.
పోలీస్ వారు మైత్రీ,దివ్యదిశల ద్వారా వీథిబాలలను తీసుకువచ్చి స్కూల్ లో చేర్చేవారు.అది కాక ఒక ఆమె అనాధాశ్రమం నడుపుతూ ఆ పిల్లల్ని స్కూల్ లో చేర్చింది.ఈ పిల్లలు ఎక్కువ అయిపోవటంతో చదువుమీద శ్రద్ధ ఉన్న పిల్లలు తగ్గిపోవటం వలన ఆ ప్రభావం పదోతరగతి ఫలితాల మీద పడటం మొదలైంది.దాంతో పని వత్తిడి పెరిగింది.అప్పటికీ బాగా చదువుతారనుకునే పిల్లలను కోచింగుకి పంపటానికి ప్రయత్నించాము.
ఒకవైపు హెచ్చెమ్ కక్ష కట్టినట్లుగా ముఖ్యంగా నన్ను,మరొక టీచర్ను పరోక్షంగా ఏదోరకంగా కించపరుస్తూ మాట్లాడటం కొంత చికాకులకు లోనయ్యాను.కానీ అవేవీ ఇంట్లో చెప్పేదాన్ని కాదు.
ఈ లోగా అమ్మ సంవత్సరానికి ఆకులు రమ్మని చిన్నన్నయ్యనుండి ఆహ్వానం.ఈసారి ముందుగానే మెడికల్ లీవ్,స్పెషల్ క్యాజువల్ లీవులు పెట్టాను. జనవరి 17 కి విజయనగరం చేరాము.మర్నాడు అమ్మ సంవత్సరీకం.
ఉదయం తెల్లవారేసరికి రాష్ట్రమే కాకుండా దేశం అంతా దిగ్భ్రాంతి చెందే వార్త.మాజీముఖ్యమంత్రీ, తెలుగు వారి అభిమాన నటుడు ఎన్టీఆర్ మరణించాడు.విజయనగరంలోనే ఉన్న మా అక్కయ్యా వాళ్ళూ, ఇతర బంధువులూ రావటానికి కూడా ఏవిధమైన వాహనాలూ దొరక్క ఇబ్బందులు పడుతూ వచ్చారు.అంతటా ఈ విషయం గురించే చర్చ.రకరకాలుగా అనేకానేక పుకారులూ,ఊహాగానాలూ, నందమూరి కుటుంబమంతా ఏకమయ్యారు.వేడివేడి వార్తలు పేపర్ల నిండా,ఛానెల్స్ నిండా.
అన్ని ఆటంకాలు లోనూ రావాల్సిన ముఖ్యమైన వారందరూ రావటంతో అమ్మసంవతసరీకాలు బాగాజరిగాయి.బైట వాళ్ళందరూ వెళ్ళిపోయాను చిన్నన్నయ్య మా అక్కచెల్లెళ్ళకీ,మా పెద్దవదినకీ తాను కొన్ని చీరలు ఇచ్చాడు.ఇప్పుడు అర్థాంతరంగా చీరలు ఎందుకో అర్థం కాలేదు.ఎందుకో అకస్మాత్తుగా మా పెద్ద వదిన అప్పట్లో అన్నమాట ‘ రుణం తీరిపోయింది ‘ గుర్తు వచ్చింది.ఇన్నాళ్ళు అమ్మ వుంది కనుక “ఆమ్మ దగ్గరకు వెళ్తున్నాం ” అనుకునేదాన్ని.ఇప్పుడు అమ్మ లేదు.అన్నయ్య ఇంటికి వెళ్తున్నాం అనుకోవాలి కదా.కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి.
ఆ సాయంత్రం బండికే తిరిగి హైదరాబాద్ బయలుదేరాము.
వీర్రాజు గారికి రెండేళ్ళ క్రితం అనుకుంటాను తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం వచ్చింది.మాకు పురస్కారాలు గానీ,పుస్తకాలు అమ్మకం పై వచ్చిన డబ్బు గానీ ఒకచోట చేర్చి దాంతో కళాకృతులు గానీ,తిరిగి మరో పుస్తకం ప్రచురించారు కోవటం గానీ అలవాటు.ఈసారి వీర్రాజు గారు శిల్పారామం లో కార్వింగు చేసిన తలుపులు చూసి ముచ్చట పడ్డారు.దానికోసం ముందుగా టేకు కొని తలుపులు చేయించేసారు.ఒకసారి ఎప్పుడో ఒక కుర్రాడు కాళహస్తిలో ఉడ్ కార్వింగ్ నేర్చుకున్నానని ఏదైనా పని చెప్పమని అడగటం గుర్తువచ్చి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఇంటికి పిలుచుకు వచ్చారు.ఆ తలుపులకి కార్వింగ్ చేయమన్నారు.అతనిపేరు సిద్ధిరాములు ఒక డిజైను వేసుకు వేస్తే దానిని మరింత ఎక్కువగా మార్పులు చేసారు వీర్రాజు గారు.సిద్దిరాములు మా ఇంటి వరండాలోనే కూర్చుని కార్వింగ్ చేసాడు.చివరికి వీర్రాజు గారు కోరుకున్న విధంగా అద్భుతంగా కళాత్మకంగా తయారయ్యే సరికి ఆయన పరమానందంతో సిద్ధిరాములి ప్రతిభకి చెప్పిన దానికన్నా ఎక్కువగానే డబ్బు ఇచ్చారు.
అయితే మళ్ళా దగ్గర్లోనే విజయనగరం వెళ్ళాల్సి వచ్చింది.చిన్నక్క కొడుకు కళ్యాణ్ కి పెళ్ళి అని పిలుపు వచ్చింది.సంబరంగా బయలుదేరాము.రంజనకు బాబు పుట్టాడు.మా అక్కచెల్లెళ్ళకు మొట్టమొదటి మనవడు.అమ్మమ్మనైపోయాను.అదో సంబరం.వీర్రాజు గారు కొత్తగా కెమేరా కొన్నారు.దాంతో బాబుని ఒళ్ళో వేసుకొని అందరం ఫొటోలు తీయించుకున్నాం.సాంప్రదాయంగా జరుగు తోన్న ఆ పెళ్ళి తంతులన్నీ వరుసగా వీర్రాజు గారు ఫొటోలు తీసారు.చిన్నక్క తన కోడలు జయని మాకు పరిచయం చేసారు.సన్నగా,చిన్నగా మంచిరంగుతో పెద్దజడతో చక్కగా వుంది.ఇంతకు ముందు అందరి పెళ్ళిళ్ళలో మేమంతా ఆడపెళ్ళివారం.ఇప్పుడు కళ్యాణ్ పెళ్ళిలో మగపెళ్ళివారంగా జరుగుతోన్న కార్యక్రమాలలో పాల్గొన్నాము.పెళ్ళి సంబరాలు పూర్తై తిరిగి హైదరాబాద్ చేరుకున్నాం.
డా.వరలక్ష్మి జనపతి గారు ఇంగ్లీష్ లో FINESSE AND FANTASY OF TELUGU WOMEN అనే పేరుతో తెలుగు సంస్కృతి , సంప్రదాయాలు, అలవాట్లు, అభిరుచులు వీటన్నింటి మీద ఒక పుస్తకం రాశారు.ఆ పుస్తకంలో కళ్యాణ్ పెళ్ళిఫొటోలనన్నింటినీ చేర్చి చాలా శ్రద్ధగా ఆ పుస్తకాన్ని రూపొందించారు వీర్రాజుగారు.అది మొత్తం తెలుగువారి జీవితం,జీవనవిధానం,కళలూ,పండుగలూ
వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేసరికి పల్లవికి కూడా చేయాలనే విషయం మనసులోకి వచ్చింది.చదువు పూర్తై ఉద్యోగం కూడా చేస్తోంది.
ఈ లోపున కొంతమందిబంధువులకూ, వీర్రాజు గారి మిత్రులకూ సంబంధాల గురించి ప్రస్తావించటం తో వీర్రాజు గారి మిత్రులు దేవాంగసంఘంలో పల్లవి పేరు నమోదు చేసారు.దాంతో సంబంధాలు రాసాగాయి.కానీ ఒక్కొక్క దానితో ఒక్కొక్క అనుభవం.అఃదరూ మా కున్న ఆస్తిపాస్తులు గురించే ఆరా తీయటం కొంత ఇబ్బంది కలిగింది.వచ్చిన డబ్బంతా పుస్తకాలు ప్లచురణలకూ,కళాకృతులు కొనటానికే అయిపోయింది.
సికింద్రాబాద్,కాప్రా ప్రాంతంలో పద్మశాలి వారు కొంతస్థలంసంఘం తరపున కొని ప్లాట్లు ఆ కులంవారికే కేటాయించాలని అనుకోవటం తెలిసి
నేను ఉద్యోగంలో చేరాక గోపీగారు వీర్రాజు గారిని ఒప్పించి ఆ యూనిట్ లో చేర్చారు.ఆ విధంగా అరుణ పేరు,నా పేరు అందులో నమోదు అయ్యాయి.అతి తక్కువ డబ్బు కట్టించు కానున్నారు.లాటరీ ద్వారా ప్లాట్లు అలాట్ చేసాక మిగతా వాయిదా పద్ధతిని కట్టాలి.అంతా అయ్యాక ఆ స్థలం డిస్ప్యూట్ లో పడింది.అది ఎప్పటికైనా తేలుతుందో లేదో తెలియదు.
మేమున్న ఇల్లు తప్ప మరేమీ లేదు.అంతకుముందు మా స్కూల్ దగ్గర షాపులో వేసిన చిట్టీ పూర్తి అయితే పల్లవికి నెక్లెస్ తీసుకున్నాను.అదేవిధంగా చిన్నచిన్న నగలు కొనటం జరిగింది.
నేవీలో పనిచేసే సంబంధంలో ఆర్నెల్ల సముద్రం మీదే ఉంటాడని,బహుశావ్యసనాలు కూడా ఉండొచ్చని వద్దనుకున్నాం.అమెరికా సంబంధాలు వచ్చినా, కట్నకానుకలపై వారి ఆశకి అంత దూరం ఉన్న ఒక్క పిల్లనీ పంపటం ఇష్టం లేకుండా మౌనం వహించాము.
అప్పటికి నాకు నలభై అయిదు ఏళ్ళు వయసు చిన్నగా కనిపించే దాన్ని.ఒకసారి సంబంధం కోసం వచ్చిన అబ్బాయితల్లి మీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారా అని అడిగింది.వెంటనే నాకు అర్థం కాలేదు.పల్లవి తర్వాత మరొకరు పుడితే ఆస్తి పంపకం గురించే ఆవిడ ఆరా అని తర్వాత కొంత అవగాహన చేసుకున్నాను.ఆ అనుభవం తర్వాత పల్లవి పెళ్ళి గురించి భయం కలిగింది.ఎన్నో కథలు చదువుతాం,రాస్తాం, వింటాం.కానీ మనకి అనుభవంలో ఎదురయ్యే కథలు ఎలా ఉంటాయో కదా.
జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.
సుభద్రా మేడం ,
అన్ని భాగాలూ ఈ రెండు రోజుల నుంచి చదువుతూ ఉన్నాను. చాల సార్లు కళ్ళు చెమర్చాయి. మీ నడక దారి అనే ఆత్మ కథ మీరు, మీతో పాటూ ముడిపడి ఉన్న వారే కాకుండా కొంతమంది మనుషుల స్వభావాలు,మాటల చేతలకు ,రాతలకు పొంతన కుదరని భావాలూ ,అప్పటి పరిస్థితులు చాల చక్కగా మీ దైన శైలి లో చక్కగా పొందు పరచారు.
నీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు మణీ
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు శాంతిశ్రీ గారూ
రామారావు గారి ప్రస్తావనలు, స్కూల్ అనుభవాలు, కుటుంబం లో జరిగిన పెళ్లిళ్ల వివరాలు, మీ అమ్మాయికి వస్తున్న సంబంధాలతో ముడి బడిన సమస్యలు అన్నీ చక్కగా వివరంగా రాసారు.