పాండిచ్చేరి ప్రస్థానము
-శాంతిశ్రీ బెనర్జీ
జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ, ఢిల్లీలో నాతోపాటు చదువుకుని, తర్వాత అదే యూనివర్సిటీలో ప్రాచీన భారత చరిత్ర బోధించే ప్రొఫెసర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేసింది నా బెంగాలీ స్నేహితురాలు కుమ్ కుమ్ రాయ్. ఆమె తన తల్లితోపాటు తరచుగా శ్రీ అరవిందుడి ఆశ్రమాన్ని దర్శించడానికి పాండిచ్చేరి వెడుతూ ఉండేది. అందువలన ఆమెకి ఆ పట్టణంతో అవినాభావ సంబంధం ఏర్పడిరది. తల్లి మరణం తర్వాత పాండిచ్చేరి ఎక్కువగా వెళ్ళలేక పోయినా, తన రిటైర్మెంట్ తర్వాత అక్కడ స్థిరపడా లన్న కోరిక ఆమెలో బలంగా కలగసాగింది. అనుకున్న ప్రకారం 2022, నవంబరు నుండి అక్కడ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉండసాగింది. పాండిచ్చేరి రమ్మనమని నన్ను పలు మార్లు సాదరంగా ఆహ్వానించింది. ఎన్నో సంవత్సరాల క్రితం పాండిచ్చేరి వెళ్ళిన జ్ఞాపకాలు నామమాత్రంగానే మిగిలిపోవడం వలన, స్నేహితురాలి ఆహ్వానాన్ని మన్నించి మళ్ళీ అక్కడకి వెడితే బాగుంటుందనుకుని ఆ ప్రయత్నంలో పడ్డాను.
హైదరాబాద్ నుంచి స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ మాత్రమే పాండిచ్చేరి వెళ్ళే విమానాలు నడుపుతుందని తెలిసివచ్చింది. నా స్నేహితురాలు చెన్నై వరకు ఫ్లైటులో వచ్చి, అక్కడ నుండి టాక్సీలో రమ్మని సలహా ఇచ్చింది. హైదరాబాద్ నుండి పాండిచ్చేరికి నేరుగా ఫ్లైట్ ఉండగా చెన్నై వెళ్ళడం, అక్కడ నుండి టాక్సీలో వెళ్ళడం ఎక్కువ సమయం తీసుకోవడమే కాకుండా, ఖర్చు కూడా ఎక్కువవుతుందని గ్రహించి స్పైస్‌జెట్ వారి ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాను. మార్చి 29న ప్రయాణం. ప్రయాణానికి నాలుగు రోజులు ముందుగా స్పైస్‌జెట్ వాళ్ళ దగ్గరి నుంచి ఫోను వచ్చింది. 29న వెళ్ళే ఫ్లైట్ కాన్సిల్ అయ్యిందని, అదే ఫ్లైట్ అదే సమయానికి 30వ తారీఖున ఉంటుందని చెప్పారు. నేను వెంటనే నా స్నేహితురాలికి విషయం తెలిపాను. తర్వాత తెల్సిందేమి టంటే స్పైస్‌జెట్ వాళ్ళు ప్రయాణికులు తక్కువగా ఉన్న ఫ్లైట్స్‌ని కాన్సిల్ చేసి మరుసటి రోజుకి మారుస్తారని. దీనివలన మార్చిన ఫ్లైట్ ప్రయాణికులతో నిండిపోవడమే కాకుండా ఆర్ధిక సమస్య కూడా పరిష్కారం అవుతుందని.
మార్చి 30వ తారీఖున మావారు నన్ను విమానాశ్రయంలో దించి వెళ్ళారు. స్పైస్‌జెట్ విమానం అటు రెండు వరసల సీట్లు, ఇటు రెండు వరుసల సీట్లు ఉన్న చిన్న విమానం. ప్రయాణికులతో నిండిపోయింది. విమానం పాండిచ్చేరి చేరేసరికి దాదాపు మూడయింది. విమానంలోనే బాక్స్‌లో తెచ్చుకున్న ఉప్మా తినేశాను. పాండిచ్చేరి విమానాశ్రయం చిన్నగా, ముద్దుగా ఉంది. బయటికి రాగానే నా స్నేహితురాలు కుమ్ కుమ్, ఆమె వచ్చిన టాక్సీ కనబడ్డాయి. టాక్సీ నడిపే సుమారు నలభై ఐదు సంవత్సరాల తమిళ యువతి రాజీ నన్ను చూడగానే ముందుకు వచ్చి చొరవగా నా బాగ్ అందుకుని టాక్సీలో పెట్టింది. ఆమె ఇంగ్లీషు అర్ధం చేసుకోగలదని, కొద్దికొద్దిగా మాట్లాడగలదని తెలిసి సంతోషం వేసింది.
పాండిచ్చేరి వీధుల గుండా ప్రయాణం సాగినంతసేపు పిచ్చాపాటి మాట్లాడుతూ పరిసరాలు గమనించసాగాను. అప్పుడే పాండిచ్చేరి చరిత్రకి సంబంధించిన కొన్ని విశేషాలు జ్ఞాపకం వచ్చాయి. పాండిచ్చేరి దక్షిణాన తూర్పు దిశగా బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉంది. 1674లో ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీ దీని వాణిజ్య కేంద్రంగా చేయగా, ఇండియాలో ఫ్రెంచ్ సెటిల్‌మెంట్‌గా మారింది. ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధాల మూలంగా (1742-1763) పాండిచ్చేరి పాలకులు తరుచుగా మారుతూ వచ్చారు. పారిస్ సంధి (1763) ప్రకారం ఇది ఫ్రెంచ్ పరిపాలన క్రిందకు వచ్చింది. 1850ల తర్వాత ఇండియా ఆంగ్లేయుల స్వాధీనంలోకి వచ్చాక వాళ్ళు ఫ్రెంచ్ కాలనీలైన పాండిచ్చేరి, మాహి, యానమ్, కరైకాల్, చందర్‌నగర్‌లను ఫ్రెంచ్ వారి పాలన క్రింద ఉండటానికి అనుమతించారు. 1954లో ఫ్రెంచ్ సెటిల్‌మెంట్స్ భారతదేశంలో విలీనమయ్యాయి. 1963లో భారత ప్రభుత్వం పాండిచ్చేరిని, యూనియన్ టెర్రిటరీగా చేసింది. 2006లో పాండిచ్చేరి పేరును పుదుచ్చేరిగా మార్చారు.
పాండిచ్చేరిలో ఆశ్రమ కట్టడాలన్నీ గ్రే రంగు (బూడిదరంగు) లోనూ, ప్రభుత్వ కట్టడాలన్నీ తెల్లరంగులోనూ, ఫ్రెంచ్ కట్టడాలన్నీ పసుపురంగులోనూ ఉంటాయి. ఫ్రెంచ్ పాలన ప్రభావం మనకి ఇప్పటికీ ఇక్కడ కనడుతుంది. ఉదాహరణకి వీధుల పేర్ల ముందు ‘రూ’ అనే పదం వాడతారు. మచ్చుకకి రూ డెలా మారిన్, ‘రూ’ అనే ఫ్రెంచ్ పదానికి అర్థం వీధి లేక స్ట్రీట్.
దాదాపు ఇరవై ఐదు నిముషాల తర్వాత కురుచికుప్పమ్ ప్రాంతంలో ఉన్న శ్రీ మిర్రా అపార్ట్‌మెంట్స్ ఉన్న భవనానికి చేరుకున్నాం. సముద్రపు ఒడ్డుకి అతి దగ్గరగా ఉన్న ఐదంతస్థుల బిల్డింగ్ అది. కుమ్ కుమ్ ఐదవ అంతస్థులోని ఫ్లాటులో ఉంటుంది. లిఫ్ట్‌లో పైకి వెళ్ళాం. వెస్ట్ ఫేసింగ్ రూములో నా బాగ్ పెట్టి, ఇల్లు చూపించడం మొదలు పెట్టింది కుమ్ కుమ్. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న ఇంకో పడక గది, డ్రాయింగ్ రూమ్ చూపిం చింది. ఆ గదుల కిటికీల నుంచి విశాలమైన సముద్రం దర్శనమిచ్చింది. కళ్ళ ముందుకొచ్చిన సాగర దృశ్యాన్ని అబ్బురంగా చూడసాగాను. నా జన్మ సార్ధకమైనట్లని పించింది. నా పాండిచ్చేరి యాత్రలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం ఇది అన్న భావన మనస్సులో అలవోకగా మెదిలింది. అలా సముద్రాన్ని చూస్తూ ఎంతోసేపు కబుర్లు చెప్పుకున్నాం. చివరికి కుమ్ కుమ్ కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని, లేచిన తర్వాత టీ తాగి సముద్ర వ్యాహ్యాళికి వెడదామని చెప్పడంతో నా బాగ్ పెట్టిన గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాను.
ఐదున్నరకి లేచి టీతో పాటు కేక్, బిస్కెట్స్ తిని, రెడీ అయి, బిల్డింగ్ వెనుకనున్న రోడ్డులో సముద్రాన్ని చూసుకుంటూ నడక సాగించాం. కొంచెం దూరం తర్వాత ఆ రోడ్డు పాండిచ్చేరిలో పేరుగాంచిన ప్రామినేడ్ బీచ్ రోడ్డుతో కలిసింది. ఈ సముద్ర తీరపు బీచ్ రోడ్డు సుమారు 1.5 కిలోమీటర్ల పొడవుంటుంది. ఉదయం, సాయంత్రం ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ఆపుచేస్తారు. దానివలన ప్రజలు యథేచ్ఛగా తిరగడానికి వీలుంటుంది. ఇక్కడి సముద్ర తీరంలో నల్లటి రాళ్ళు ఉండటం వలన దీన్ని రాక్ బీచ్ అని కూడా అంటారు. అంతేకాకుండా పాండిచ్చేరి బీచ్, మహాత్మాగాంధీ బీచ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.
ఈ రోడ్డులో చారిత్రాత్మక స్థలాలతో పాటు సెక్రటేరియట్ బిల్డింగ్, రకరకాల రెస్టారెంట్స్, వసతి సౌకర్యాలున్న ఆశ్రమ భవనాలు ఉన్నాయి. లే కెఫే అనే రెస్టారెంట్ సీ ఫుడ్‌కి ప్రసిద్ధి చెందినదని అంటారు. ఇక్కడ సముద్ర తీరానికి చేరువగా పిట్టగోడ, పేవ్‌మెంట్ కట్టారు. కొంతమంది పిట్టగోడ మీద కూర్చుని సముద్రాన్ని వీక్షిస్తుంటే, కొంతమంది పేవ్‌మెంట్ మీద వాకింగ్ చేస్తున్నారు. వార్ మెమొరియల్‌తో మొదలుపెట్టి, గౌబర్ట్ ఎవన్యూలో ఉన్న డూప్లెక్స్ పార్క్ వరకు సాగిన ఈ బీచ్ రోడ్డు మీద తినుబండా రాలు అమ్మేవాళ్ళు, హేండీక్రాఫ్ట్స్ అమ్మేవాళ్ళు హడావిడిగా తిరుగుతున్నారు.
కొంచెంసేపు పిట్టగోడ మీద కూర్చుని సముద్రాన్ని తనివితీర కళ్ళనిండా నింపు కున్నాం. ఆ తర్వాత అదే రోడ్డులో ఉన్న వార్ మెమొరియల్‌కి వెళ్ళాం. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన ఫ్రెంచ్ ఇండియా సైనికుల జ్ఞాపకార్ధం 1937లో దీన్ని కట్టారు. ఇక్కడ ఉన్న తామ్ర ఫలకం మీద ప్రాణాలర్పించిన సైనికుల పేర్లున్నాయి. దీన్ని బాస్టిల్ డే న అంటే జులై 14న లైట్లతో ప్రకాశింప జేస్తారు. ఈ కట్టడాన్ని 1970లో పునరుద్ధ రించారు. తర్వాత వార్ మెమొరియల్‌కి ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళాం. నాలుగు మీటర్ల ఎత్తున ఉన్న ఈ విగ్రహాన్ని మలిచిన శిల్పి పేరుగాంచిన రాయ్ చౌదరి. ఈయన మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో చదివారట. జనవరి 26, 1965న ఆవిష్కరించబడిన ఈ విగ్రహం చుట్టూ ఎనిమిది గ్రానైట్ స్థంభాలున్నాయి. వీటిని పాండిచ్చేరికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిన్‌జి కోట నుంచి తెచ్చారని చెప్తారు.
ఆ తర్వాత అదే రోడ్డులో ఉన్న పాత లైట్‌హౌస్‌కి వెళ్ళాం. ఫ్రెంచ్ ప్రభుత్వం దీన్ని 1886లో కట్టించింది. 29 మీటర్ల ఎత్తులో ఉన్న దీని లైట్ పదిహేను మైళ్ళ దూరం వరకు కనబడేదట! తర్వాత ఈ పాతలైట్ హౌస్ పాడయిపోయినపుడు భారత ప్రభుత్వం 1971లో కొత్త లైట్‌హౌస్ కట్టించింది. దానిని గురించి తర్వాత తెలుసుకుందాం. అక్కడ నుండి నడుచుకుంటూ చివర్లో ఉన్న గౌబర్ట్ పార్క్ చేరుకున్నాం. 1742-1754 మధ్యలో ఫ్రెంచ్ గవర్నర్‌గా చేసిన జోసెఫ్ ఫ్రాన్‌కాయిస్ డూప్లే విగ్రహం కనపడిందక్కడ. డూప్లే ఇంగ్లీషు వాళ్ళ పరిపాలన పాండిచ్చేరికి విస్తరించకుండా ఆపాడనీ, అందుకే ఆయన పరిపాలనకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చెప్తారు. మూడవ కర్ణాటక యుద్ధంలో ఓడిపోయిన తర్వాత డూప్లే గవర్నర్‌గా రాజీనామా చేసి ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు. 2.88 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ విగ్రహాన్ని 1870లో ప్రతిష్టించారు. ఇవన్నీ చూసుకుంటూ దాదాపు రెండున్నర గంటలు ప్రామినేడ్ బీచ్‌లో గడిపాం. తర్వాత ఆటోలో రూ డెలా మారిన్‌లో ఉన్న ఢల్లీవాలా రెస్టారెంట్‌కి వెళ్ళి డిన్నర్ చేశాం. పుదీనా పరోటాలతో, మిక్స్‌డ్ వెజిటబుల్ కూరతో, రైతాతో రుచిగా ఉన్న భోజనం తిని, మళ్ళీ ఆటో తీసుకుని ఇంటికి చేరుకున్నాం.
మరునాడు అంటే మార్చి 31న కుమ్ కుమ్ ఉదయం ఆరింటికి నన్ను లేపి ‘‘త్వరగా ముఖం కడుక్కుని రా ! పైన దాబా మీదకి వెళ్ళి సూర్యోదయం చూద్దాం!’’ అంది. నేను గబగబా కాలకృత్యాలు తీర్చుకుని ఆమెతో పాటు డాబా మీదకు వెళ్ళాను. అక్కడ నుండి సముద్రం ఇంకా గంభీరంగా, అందంగా, నిండుగా కనబడిరది. ఆరున్నరకల్లా సూర్యుడు పైకి రావడం మొదలయింది. అద్భుత సౌందర్యం కళ్ళముందుకొచ్చింది. కిరణాల వెలుగులు, రంగులు నీళ్ళమీద తళతళలాడాయి. అప్పటికే జాలర్లు చిన్నచిన్న పడవల మీద తిరుగుతూ చేపల కోసం వలలు వేస్తున్నారు. సెల్‌ఫోన్‌లోని కెమెరాతో ఆ దృశ్యాల ను వివిధ కోణాలలో బంధించడానికి ప్రయత్నం చేశాను. ఏడింటి వరకూ తృప్తిగా సూర్యోదయాన్ని తిలకించి క్రిందకి వచ్చాం.
ఆ తర్వాత స్నానపానాదులు, బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని 9:30 కల్లా పాండిచ్చేరి దర్శనానికి బయలుదేరాం. ఈసారి టాక్సీని రాజీ భర్త మురుగన్ నడిపాడు. మురుగన్‌కి కూడా ఇంగ్లీషు అర్థమవుతుంది. కొద్ది కొద్దిగా మాట్లాడగలడు. మొదటిగా రూ డెల్లా మారిన్‌లో ఉన్న అరవిందుని ఆశ్రమానికి వెళ్ళాం. గ్రే కలర్‌లో ఉన్న ఆశ్రమ భవనం లోపలికి వెళ్ళి, కుడివైపునున్న మార్గం గుండా శ్రీ అరవిందుని, మదర్ సమాధుల దగ్గరికి వెళ్ళాం. పూలతో చక్కగా అలంకరించబడిన సమాధులకు వినమ్రతతో నమస్కరించాం. అక్కడ చాలామంది కూర్చుని మెడిటేషన్ చేస్తున్నప్పటికీ ఎటువంటి అలికిడి లేకుండా నిశ్శబ్దంగా ఉంది.
ఇక్కడ శ్రీ అరవిందుని గురించి, మదర్ గురించి కొంత తెల్సుకుందాం. 1872లో కలకత్తాలో జన్మించిన అరవిందుని విద్యాభ్యాసం ఇంగ్లాండులో జరిగింది. తన ఇరవయ్యో ఏట ఇండియా వచ్చారు. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలని ప్రకటించిన మొదటి వ్యక్తి ఆయన. దేశద్రోహం క్రింద అరెస్టయిన ఆయన అదృష్టవశాత్తు ఉరిశిక్షను తప్పించుకున్నారు. జైలులో ఉన్నప్పుడే ఆయనికి ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. 1910లో బెంగాల్ వదిలి పాండిచ్చేరి వచ్చారు. ప్రాపంచిక విషయాల నుండి విముక్తుడై, 40 సంవత్సరాలు ఆధ్యాత్మిక జీవితం గడిపి తన ఫిలాసఫీకి ఆధారమైన ఇంటెగ్రెల్ యోగాని ప్రతిపాదించారు. 1950లో అరవిందుడు స్వర్గస్తులయ్యారు.
ప్రాపంచిక విషయాల నుండి తప్పుకున్నప్పుడే ఆశ్రమాన్ని నడిపే బాధ్యతని అరవిందుడు మదర్‌కి అప్పగించారు. మీరా అల్‌ఫాస్సాగా పారిస్‌లో 1878లో జన్మించిన మదర్ 1914 పాండిచ్చేరిలో అరవిందుని కలసి, తన విజన్స్‌లో కనపడిన వ్యక్తిగా గుర్తించింది. 1920లో శాశ్వతంగా పాండిచ్చేరిలో ఉండిపోవడానికి వచ్చి, ఆయన ఆధ్యాత్మిక సహచరిగా మారి, ఆశ్రమ బాధ్యతలను చేపట్టింది. 1926 నుండి మదర్ అధ్వర్యంలో ఆశ్రమం ఒక స్థిరమైన సంస్థగా మారి, శీఘ్రగతిన అభివృద్ధి చెందింది. ఆఫీసులు, లైబ్రరీ, వర్క్ షాప్స్, ప్రింటింగ్, పోస్టాఫీస్, డైనింగ్ రూమ్, పువ్వుల తోటలతో ప్రస్తుతం 400 భవంతులతో పాండిచ్చేరిలో విస్తరించింది. మదర్ 1968లో అంతర్జాతీయ నగరం ఆరోవిల్‌ని స్థాపించింది. 1973లో స్వర్గస్తురాలయింది.
దేశవిదేశాల నుంచి సాధకులు, యాత్రికులు ఆశ్రమ దర్శనానికి వస్తారు. అరవిందుని ఫిలాసఫీ, యోగాని తెలియజేసే పత్రికలు ఆశ్రమ ప్రచురణ విభాగం నుంచి వెలువడుతాయి. అరవిందుని, మదర్ రచనలు కూడా రీప్రింట్లతో వస్తున్నాయి. సమాధుల దగ్గర నుండి ఆశ్రమం నడిపే లైబ్రరీకి వెడదామని అనుకున్నాం. కానీ ఏవో కారణాల వలన మూసివేయబడిందని తెలుసుకుని ఆ ప్రయత్నం విరమించుకున్నాం.
అక్కడి నుండి రాజ్‌నివాస్ వెనుక భారతి వీధిలోనున్న మనకుల వినయగర్ గుడికెళ్ళాం. ఇది ఐదువందల ఏళ్ళ పురాతనమైన వినాయకుడి గుడి. దీన్ని పాండిచ్చేరి వచ్చిన భక్తులు, టూరిస్టులు తప్పనిసరిగా దర్శిస్తారని వినికిడి. ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరికి రాకముందు నుంచే అంటే 1666 పూర్వం నుండే ఈ గుడి ఉందని చెబుతారు. ద్రవిడియన్ వాస్తుశాస్త్ర విధానం ప్రకారం కట్టబడిన ఈ గుడికి మండపము, ప్రహారము, రాజగోపురము ఉన్నాయి. గుడి గోడల మీద, రాజ గోపురము మీద దేవీదేవతల విగ్రహాలు (ఉదాహరణకి కృష్ణుడు, శివుడు, పార్వతి, మురుగన్ మొదలైన వారు) మనకి దర్శనమిస్తాయి. వీటి వలన గుడి మరింత అందంగా కనపడుతుంది. రాజగోపురం మీద ఏనుగు తలతో కూర్చున్న గణేశుడి విగ్రహం పక్కగా, మామూలు మనుష్యుని తలతో ఉన్న వినాయకుడు మనకు కనబడతాడు. ఈ విషయం నాకు కుమ్ కుమ్ చెప్పగా తెలిసింది. గర్భగుడిలో వినాయకుడి విగ్రహం తూర్పుముఖంగా ఉంది. చెరోపక్కన భార్యలు బుద్ధి, సిద్ధి విగ్రహాలున్నాయి. నాట్యం చేసే గుడి విగ్రహం అంటే నర్తన గణపతి విగ్రహం కూడా గుడిలో మనకు కనబడుతుంది. గణేశుని ఊరేగించడానికి బంగారు రథం ఉంది. సంవత్సరం పొడుగునా ఇక్కడ పండుగలు జరుపుతారు. ఫ్రెంచ్ జెస్యూట్స్, మిషనరీలు ఈ గుడిని ధ్వంసం చెయ్యాలని చూశారని, ప్రతిసారీ స్థానికులు రక్షించుకున్నారన్న కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఆ తర్వాత రూ డ్యూమాస్‌లో ఉన్న నోట్రే డేమ్ చర్చికి వెళ్ళాం. దీన్ని లేడీ ఎంజెల్స్ చర్చ్ అని కూడా అంటారు. దీన్ని 1835లో నెపోలియన్ III గ్రీకు – రోమన్ వాస్తు విధానం ప్రకారం కట్టించడమే కాకుండా, ఈ చర్చిని దర్శించడానికి పాండిచ్చేరి వచ్చినట్లు చెబుతారు. ఇక్కడ లేడీ ఎంజెల్స్ విగ్రహం మొదట్లో ఉండేదని, తర్వాత దాని స్థానంలో శిలువను పెట్టారని వినికిడి. ఈ చర్చ్ రెండువైపులా రెండు స్థంభాలుండగా, లోపలి కిటికీల అద్దాలు నీలం, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. చర్చ్‌లోని గంటలు ఫ్రాన్స్ నుండి తెప్పించారంటారు. డ్యూమాస్ వీధిలో ఉండడం వలన ఈ చర్చ్‌ని డ్యూమాస్ చర్చ్ అని కూడా అంటారు. బంగాళాఖాతానికి ఎదురుగా కట్టబడిన ఈ చర్చ్‌ని పాండిచ్చేరిలో నాల్గవ పురాతన చర్చ్‌గా పేర్కొంటారు. ఇక్కడ ప్రార్థనలు ఫ్రెంచ్, ఇంగ్లీషు, తమిళ భాషల్లో జరుపుతారు.
ఈ చర్చ్‌కి ఎదురుగా ఉన్న స్థలంలో జోన్ ఆఫ్ ఆర్క్ విగ్రహం మాకు కనబడిఆశ్చర్య పరిచింది! చుట్టూ గోడలతో, చిన్న పార్క్‌లో ఉన్న ఈ విగ్రహాన్ని దగ్గరగా చూద్దామని చాలా ఉబలాట పడ్డాం. కానీ లోపలికి వెళ్ళే గేటుకు తాళం వేయడం వలన బయటి నుంచే ఫొటోలు తీసుకున్నాం. ప్రముఖ ఫ్రెంచ్ రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త, పాండిచ్చేరి మేయర్ అయిన ఫ్రాన్ కాయిస్ గౌడార్ట్ ఈ పాలరాతి విగ్రహాన్ని 1919లో నోట్రే డేమ్ చర్చ్‌కి బహూకరించారు.
ఫ్రెంచ్ చరిత్రలో ప్రసిద్ధురాలైన జోన్ ఆఫ్ ఆర్మ్ గురించి కొంత తెలుసుకుందాం. ఆమె ఫ్రాన్స్‌లో డోమ్‌రెమీ అనే ప్రాంతంలో రైతు కుటుంబానికి చెందినది. ఆమెకి ఛార్లెస్ VII కి సహాయం చెయ్యమని, వంద సంవత్సరాల యుద్ధంలో ఫ్రాన్స్‌ని ఆంగ్లేయుల పరం కాకుండా రక్షించమని విజన్స్ వచ్చేవట! చార్లెస్ VII ఆమెని అల్లియన్స్ స్వాధీనం చేసుకోమని పంపగా తొమ్మిది రోజుల్లోనే ఆ పని ముగించిందట! అందుకే ఆమెను మెయిడ్ ఆఫ్ ఆర్లియన్స్ అని కూడా పిలుస్తారు. ఆర్లియన్స్ విజయం వలన, మిగతా విజయాల వలన చార్లెస్ VII కి రాజ్యాధికారం వచ్చింది. కానీ ఆంగ్ల సైన్యాలు 23 మే 1430లో ఆమెను బంధించి, విచారణ జరిపించారు. 30 మే 1431న ఆమెని దోషిగా నిర్ణయించి, మరణశిక్ష విధించి, కాల్చి చంపారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే! 1920లో ఆమెని నిర్దోషిగా నిర్ణయించి రోమన్ కాథలిక్ సెయింట్‌గా గుర్తించారు.
అక్కడ నుండి మహాత్మాగాంధీ రోడ్డు ప్రాంతంలోనున్న సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసెస్ చర్చికి వెళ్ళాం. ఆర్చ్ బిషప్ గాంధీ ఆధ్వర్యంలో ఈ చర్చ్ నిర్మాణం ప్రారంభమయి 1907లో పూర్తి చేయబడిరది. గోథిక్ వాస్తు పద్ధతి ప్రకారం కట్టిన ఇది పాండిచ్చేరిలో ఉన్న అతి పెద్ద చర్చ్. అందులో 24 స్థంభాలున్నాయి. గ్లాస్ పానెల్స్ మీద జీసెస్‌కి, ఇతర సెయింట్స్‌కి సంబంధించిన జీవిత విశేషాలు చిత్రించబడ్డాయి. 2008-2009లో శత సంవత్సర ఉత్సవం ఈ చర్చ్‌లో జరిగినపుడు పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేశారు. 2011లో ఈ చర్చ్‌ని బాసిలికాగా మార్చారు. ఇది క్రైస్తవులు పాండిచ్చేరిలో తప్పక దర్శించవలసిన స్థలంగా పేరుపొందింది.
తర్వాత రూ సెయింట్ లూయిస్‌లో ఉన్న పాండిచ్చేరి సంగ్రహాలయానికి వెళ్ళాం. కలోనియల్ వాస్తు విధానం ప్రకారం 1788లో కట్టబడిన ఈ రెండంతస్థుల భవనాన్ని 1983లో మ్యూజియంగా మార్చారు. పసుపు, పీచ్ రంగుల్లో ఉన్న ఈ భవనంలో సుమారు 6,500 వస్తువులు ఉన్నట్లు చెబుతారు. చరిత్ర ప్రకారం ఇక్కడ ఉన్న అవశేషములను మూడు కాలాలకు సంబంధించినవిగా విభజించారు. మొదటివి 1 నుండి 4 శతాబ్దాల కామన్ ఎరాకి సంబంధించినవి. పాండిచ్చేరికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరికమేడులో పురాతత్వశాఖ త్రవ్వకాలు జరపగా మట్టిపాత్రలు, పింగాణీ పాత్రలు, ఆభరణాలు, నాణాలు మొదలైనవి దొరికాయి. నాణాలను బట్టి అరికమేడు ఈ శతాబ్దాల్లో చారిత్రాత్మక రేవు పట్టణంగా విలసిల్లిందని, రోమను సామ్రాజ్యంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉందని తెలిసింది. మేము అంతకు ముందు అరికమేడు వెళదామని కూడా ప్లాను వేసుకున్నాం. కానీ అక్కడ ఏమీ లేవని, త్రవ్వకాల్లో దొరికిన అవశేషములను మ్యూజియం కు తరలించారని తెలుసుకుని ఆ ప్రయత్నం విరమించుకున్నాం.
రెండవది పల్లవులు, చోళుల కాలానికి సంబంధించినది. క్రీస్తు తర్వాత 3వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య పరిపాలించిన పల్లవులు, చోళుల కాలం నాటి రాతి శిల్పాలు, కాంస్య విగ్రహాలు సంగ్రహాలయంలో ఉన్నాయి. ఇవి ముఖ్యంగా దేవీదేవతా మూర్తులు. మూడవది కలోనియల్ కాలానికి సంబంధించిన వస్తువులు. ఫ్రెంచ్ ఫర్నిచర్, తుపాకు లు, కత్తులు, క్రోకరీ, ఖడ్గాలు, అద్దాలు, చిత్రాలు ముఖ్యమైనవి. క్రింద ఆరుబయట ఫాసిలైజడ్ చెట్టు దుంగ, రాతి శిల్పాలు ఉన్నాయి. క్రింద అంతస్థులో కలోనియల్ కాలానికి చెందిన పల్లకి, రిక్షా, కోచ్ ఉన్నాయి. మరో గదిలో టాంజోర్ పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ పాండిచ్చేరి వైవిధ్యభరిత చరిత్రను మన కళ్ళ ముందుంచుతాయి.
ఇక ఆఖరిగా బొటానికల్ గార్డెన్ చూద్దామని అనుకున్నాం. కానీ అక్కడ ఎక్కువ టైము పట్టే అవకాశం ఉందని తెలుసుకుని ముందుగా లంచ్ చేద్దామని అనుకున్నాం. మిషన్ స్ట్రీట్‌లో ఉన్న సర్‌గురు రెస్టారెంట్‌కి వెళ్ళాం. దక్షిణ భారతదేశ పదార్థాలను వడ్డించే ఆ రెస్టారెంట్‌కి మంచి పేరున్నదనీ, దాని బ్రాంచ్‌లు ఇంకా పాండిచ్చేరిలో పలుచోట్ల ఉన్నాయని తెలిసింది. రెస్టారెంట్ విశాలంగా ఉంది. సర్వర్లు చురుకుగా పనిచేస్తున్నారు. కొంతమంది విదేశీయులు కూడా అక్కడ భోజనం చేస్తూ కనబడ్డారు. మినీ థాలీ ఆర్డరు చేసుకుని తిన్నాం. భోజనం బాగుందని తృప్తి పడ్డాం.
తర్వాత రైల్వేస్టేషన్‌కి దగ్గరిగా సౌత్ బౌలేవార్డ్‌లో ఉన్న బొటానికల్ గార్డెన్‌కి వెళ్ళాం. పది రూపాయల టికెట్ తీసుకుని ఫ్రెంచ్ వాస్తు విధానాన్ని గుర్తుకు తెచ్చే గేటు గుండా లోపలికి ప్రవేశించాం. 1826లో మొదలు పెట్టబడిన ఈ గార్డెన్‌లో 1500 రకాల మొక్కలు న్నాయని చెబుతారు. దీని వైశాల్యం 22 ఎకరాలట! ఫ్రాన్సులోని తోటలను దృష్టిలో పెట్టుకుని, మొక్కల గురించి అవగాహన పెంచడానికి, పర్యావరణ రక్షణ కోసం ఈ తోట ప్రారంభించబడిరది. ప్రముఖ ఫ్రెంచ్ బోటనిస్ట్ జి.ఎస్. పెరోటెట్ (1790-1870) ఈ తోటకు అనేకములైన మొక్కల రకాలను చేర్చి అభివృద్ధి పరిచారట. తోటలో ఆయన విగ్రహం కూడా మాకు కనబడిరది. 1954 నుండి వ్యవసాయశాఖ దీన్ని పరిరక్షించే బాధ్యతను చేపట్టింది. ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం ఫ్లవర్ షో ఉంటుందిట. వర్క్‌షాప్స్, మొక్కల అమ్మకాలు కూడా జరుగుతాయట. మేము తోటలోని మ్యూజికల్ ఫౌంటన్ చూచుకుని, తోటకు ఇంకో గేటు దగ్గర ఉన్న ఎక్వేరియమ్‌కు వెళ్ళాం. రూ.50 టికెట్ తీసుకుని లోపల ప్రవేశించాం. అనేక రకాల రంగురంగుల చాపలు ముచ్చట గొల్పాయి. టికెట్ ధరకి న్యాయం జరిగిందని అనుకున్నాం. తోటలో టాయ్‌ట్రైన్ ఉందని విన్నాం. కానీ మాకు కనబడలేదు. తోట ఫర్వాలేదనిపించినప్పటికి సరైన సంరక్షణ ఉంటే ఇంకా అందంగా, ఆహ్లాదంగా ఉండేదని అనిపించింది. గంట, గంటన్నర అక్కడ గడిపి బయలుదేరాం.
ఇంటికి వెళ్ళే ముందుగా బొటానికల్ గార్డెన్‌కి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో దుబ్రాయపేటలో ఉన్న కొత్త లైట్‌హౌస్‌ని చూసి వెళదామని అనుకున్నాం. దీన్ని భారత ప్రభుత్వం 1971లో కట్టించినప్పటికీ, 1979 నుంచి పనిచెయ్యడం మొదలయింది. 48 మీటర్ల ఎత్తులో ఉన్న దీని పైకి వెళ్ళడానికి 200 మెట్లు ఉన్నాయి. పై నుంచి సముద్రతీరం, పాండిచ్చేరి పట్టణం చక్కగా కనపడి కన్నుల విందు చేస్తాయని చెప్తారు. అప్పటికే అలసిపోయిన మేము పైకి వెళ్ళే సాహసం చెయ్యలేదు. బయటినించే ఫోటోలు తీసుకుని తృప్తిపడి ఇంటికి వెళ్ళాం.
ఏప్రిల్ మొదటి తారీఖున ఆరోవిల్ వెళ్ళే ప్లాను వేసుకుని ఉదయం 9:30 కల్లా రాజీ టాక్సీలో బయలుదేరి నలభై నిముషాల్లో చేరుకున్నాం. ఆరోవిల్ అంటే సూర్యోదయ నగరం (City of Dawn) అని అర్థం. ఒక అంతర్జాతీయ నగరంలో పలు దేశాలకు, కులాలకు, మతాలకు, జాతులకు, వర్గాలకు చెందిన ప్రజలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యావరణ సామరస్యంతో నివసించాలన్న మదర్ భావాలు, ఆలోచనల ప్రకారం 1968లో స్థాపించబడిరది. ఈ నగరం తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఎక్కువ భాగం విస్తరించగా, కొంత ప్రాంతం పాండిచ్చేరిలో ఉంది. ఫ్రెంచ్ వాస్తు నిపుణుడు రాజర్ ఏంగర్ ఈ నగరానికి ప్లాను వేశారట. ఇక్కడ ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన 2,500 మంది ఉంటున్నారట. వారిలో 1/3 శాతం ఇండియన్స్ అట ! భారత ప్రభుత్వం, యునెస్కో సహాయంతో ఆరోవిల్ ఫౌండేషన్ ఈ నగర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నది.
అరోవిల్‌కి మాతృమందిరం ఆత్మలాంటిది. ఇక్కడ ఇంటెగ్రల్ యోగా చెయ్యడానికి, ప్రశాంతతను పొందడానికి సాధకులు వస్తారు. మాతృమందిరం పద్మాకారంలోనున్న డోమ్. 30 మీటర్ల ఎత్తులో ఉన్న దీనికి బంగారపు తళుకులున్న చిప్స్ అద్దబడ్డాయి. అవి సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. మాతృమందిరం చుట్టూ చక్కగా పెంచబడిన తోటలు న్నాయి. మాతృమందిరం సోలార్ ఎనర్జీతో నడపబడుతుంది. అక్కడ నుండి నడుచు కుంటూ బయటికి వచ్చి చిన్న మ్యూజియం చూశాం. అక్కడ శ్రీ అరవిందుని, మదర్‌కి సంబంధించిన జీవిత విశేషాల, సిద్ధాంతాల వివరాలు ఉన్నాయి.
అరోవిల్ నుండి మధ్యాహ్నం 1:30 కల్లా పాండిచ్చేరి బయలుదేరాం. కుమ్ కుమ్ లంచ్ రైటర్స్ కెఫేలో చేద్దామంది. ఆ పేరు వినగానే ఎంతో కుతూహలం కలిగింది. నలభై ఐదు నిముషాల్లో మహాత్మాగాంధీ రోడ్డు ప్రాంతంలో ఉన్న కెఫేకి చేరుకున్నాం. మొదటి అంతస్థులో ఉన్న కెఫే నిరాడంబరంగా, ఆకర్షణీయం ఉంది. షేక్స్‌పియర్, అగధాక్రిష్టి, ఎడ్గార్ అలెన్‌పో మొదలైన రచయితల చిత్రాలు గోడల మీద కనబడ్డాయి. ఈ కెఫే కాఫీకి, పాస్తాలకి, పిజ్జాలకి, గ్రిల్డ్ చికెన్‌కి, ఆమ్లెట్లకి, గార్లిక్ బ్రెడ్‌కి, కాంటినెంటల్ ఫుడ్‌కి ప్రసిద్ధి. మేము కాంటినెంటల్ ఫుడ్ ఆర్డరు చేసుకుని తాపీగా ఆస్వాదిస్తూ తిన్నాం. మూడింటికి ఇంటికి బయలుదేరాం.
పాండిచ్చేరిలో చూడవల్సిన ప్రదేశాల లిస్టులో పారడైజ్ బీచ్‌ని తప్పకుండా చేర్చా లంటారు. అందుకే ఏప్రిల్ 2న ఉదయం 9:30 కల్లా మురుగన్ టాక్సీలో బయలుదేరాం. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చున్నంబార్ బోట్‌హవుస్‌కి చేరుకున్నాం. లోపలికి వెళ్ళడానికి, కారు పార్కింగ్‌కి టికెట్లు తీసుకుని ఐదు నిముషాల్లో బోట్లు బయలుదేరే స్థలానికి చేరుకున్నాం. పారడైజ్ బీచ్ చున్నంబార్ ద్వీపంలో ఉన్నది. ద్వీపాన్ని, పాండిచ్చేరిని కలిపే చున్నంబార్ నది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. మేము ఒక్కొక్కరికి 354 రూపాయల టికెట్ తీసుకుని మోటర్‌బోట్ ఎక్కాం. ప్రతి అరగంటకు ఒకటి చొప్పున మోటర్‌బోట్లు ఉంటాయి. బోటు ప్రయాణం దాదాపు అరగంట పట్టింది. నదికి రెండు వైపులా వ్యాపించిన గ్రీనరీ వలన ఆ పరిసరాలు ప్రకృతి సౌందర్యంతో విలసిల్లాయి. దారిలో ఫిషింగ్ చేస్తున్న, ఈత కొడుతున్న కొందరు కనబడ్డారు.
పారడైజ్ బీచ్ ఎంతో అందంగా ఉండి సమ్మోహన పరుస్తుంది. పక్షుల ప్రేమికులకు ఈ బీచ్ ప్రియమైనది. ఎందుకంటే ఇక్కడ రకరకాల పక్షులు మనకి కనబడతాయి. ఈ ద్వీపంలో కొబ్బరిచెట్లు, మాన్‌గ్రోవ్ అడవులు ఉండటం వలన మరింత అందంగా గోచరి స్తుంది. మేము ముందుగా ఎండ ఎక్కువగా ఉండటం వలన ఒక షాపులో జ్యూస్ తాగుతూ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఇసుకలో నడుచుకుంటూ సముద్రం వైపు సాగాం. దారిలో ఒంటెల మీద సవారి చేస్తూ కొందరు కనబడ్డారు. ఇసుక ఎక్కువగా ఉండటం వలన నడవడం కొంచెం కష్టం అనిపించింది. మధ్యమధ్యలో ఆగుతూ సముద్రతీరం చేరుకున్నాం. శాంతిపూర్వకమైన, ఆనందంతో కూడిన అనుభవాన్నిస్తుంది ఇక్కడ మహాసాగరం.
కొన్ని గంటలు గడిపి, దాదాపు రెండిరటికి ప్రామినేడ్ బీచ్ దగ్గరలోనున్న ప్రామినేడ్ హోటల్‌కి చేరుకున్నాం. అక్కడ బఫే లంచ్ ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను కొంచెం కొంచెం రుచి చూస్తూ చాలా సేపు గడిపాం. బిల్లు ఖరీదనిపించినా, సముద్రాన్ని చూస్తూ చేసిన భోజనం గుర్తుండి పోవాల్సిన విషయంగా తోచింది. సంతోషం గా ఇల్లు చేరుకున్నాం.
ఏప్రిల్ మూడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి హైదరాబాద్ ఫ్లైట్. లంచ్ చేసి ఒంటిగంటకల్లా రాజీ టాక్సీలో బయలుదేరాం. కుమ్ కుమ్‌ని శ్రమపడొద్దని, విమానాశ్రయానికి ఒక్కదాన్ని వెళ్ళిపోతానని చెప్పాను. కుమ్ కుమ్ ఒప్పుకోలేదు. నన్ను సాగనంపడానికి తను కూడా వచ్చింది. దారంత కబుర్లతో గడిపాం. నాకు అద్భుతమైన, ఆత్మీయమైన ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా, నేనెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నాతో విసుగు లేకుండా తిరిగి, నా కోరికలన్నీ తీర్చిన కుమ్ కుమ్‌కి కృతజ్ఞతలు తెలిపాను. అంతేకాకుండా సముద్రాన్ని అతి దగ్గరగా వీక్షిస్తూ గడిపిన మధుర క్షణాలు జీవితాంతం గుర్తుంచుకోదగ్గవి. ఎప్పుడు సముద్రం చూడాలనిపిస్తే అప్పుడు పాండిచ్చేరి వచ్చేయ మని ప్రేమగా మళ్ళీ ఆహ్వానించింది కుమ్ కుమ్. కుమ్ కుమ్ వలన పాండిచ్చేరిలో ప్రసిద్ధిగాంచిన రెస్టారెంట్స్‌కి వెళ్ళి భిన్న రుచుల ఆహార పదార్ధాలను ఆస్వాదించే అవకాశం కలిగించినందుకు కూడా ఆమెకి థ్యాంక్స్ చెప్పాను.
రెండవసారి పాండిచ్చేరికి చేసిన ఈ ప్రయాణం మరపురాని జ్ఞాపకాలను మిగిల్చింది. అరవిందుడికి ప్రియమైన ఈ ప్రదేశాన్ని, ఆయన ఆధ్యాత్మిక యాత్రను వీక్షించిన ఈ అద్భుత పట్టణాన్ని, ఇప్పటికీ ఫ్రెంచ్ వాసనలతో పరిమళభరితంగా, వైవిధ్యభరితంగా విలసిల్లుతున్న ఈ స్థలాన్ని దర్శించడం ఎంతో తృప్తిని మిగిల్చింది. అక్టోబరు, ఫిబ్రవరి నెలల మధ్యలో దర్శించడానికి వీలయిన ప్రదేశం ఇది. మార్చి ఏప్రిల్‌లో ఎండ విపరీతంగా ఉండి, ఉక్కపోత ఎక్కువగా ఉండడం వలన కొంత అసౌకర్యం కలగడం వాస్తవమే! కానీ విశాల మహాసాగరం, ఇక్కడి ప్రజల స్నేహభావం, చూడవల్సిన ఎన్నో వింతలు ఆ అసౌకర్యాన్ని మర్చిపోయేలా చేశాయి.
కుమ్ కుమ్ ఫ్రెండ్స్‌ని, బంధువులను తమ టాక్సీలో తిప్పుతూ సహాయంగా ఉంటారు రాజీ, ఆమె భర్త మురుగన్. నేను ఉన్నన్ని రోజులూ వంతుల వారీగా టాక్సీలో తిప్పి, నా పాండిచ్చేరి యాత్ర సఫలం చేసిన వారిద్దరికీ ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పు కున్నా తక్కువే ! అదే వాళ్ళతో చెప్పాను. ఇక్కడ నా దృష్టికి వచ్చిన ఇంకో విషయం చాలా మంది తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణా నుంచి ఇక్కడికి వస్తారని! వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ.. రెస్టారెంట్‌లోనూ, తెలుగు వాళ్ళు కనపడేవారు, తెలుగు మాటలు వినబడేవి. దీనిని బట్టి తెలుగువాళ్ళ లిస్ట్‌లో పాండిచ్చేరి ఇష్టంగా దర్శించే పట్టణమని అనిపించింది. కుమ్ కుమ్‌కి, రాజీకి బై చెప్పి ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్ళాను. స్పైస్‌జెట్‌వారి చిన్న విమానంలో హైదరాబాద్ చేరుకున్నాను.
*****
నేను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢీల్లీలో, ఎమ్.ఫిల్. చేశాను. తీన్ మూర్తి భవన్, ఢీల్లీలో, నెహ్రూ కి సంబంధించిన ప్రాజెక్ట్ లో అసోసియేట్ ఎడిటర్ గా పని చేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాను. వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత తెలుగు లో కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్సు రాయడం మొదలుపెట్టాను.
Travelogue chala bagundi. Pondicherry kallamundu kanpinchinattu anpinchindi. Pondicherry gatam gurunchi chala vishyalu telsinavi. Great.
పాండిచ్చేరి యాత్రని చాలా కూలంకుషంగా ఏ చిన్న అంశాన్నీ దాట వేయకుండా పాఠకులను కూడా మీ అక్షరాల వెంట నడిపించి తీసుకెళ్ళి వివరించారు.శైలి కూడా పరుగులు తీసింది.ట్రావెలాగ్ రాయటంలో మీ ప్రత్యేకత తెలుస్తోంది.
Good
ట్రావెలాగ్ అంటే కేవలం యాత్రగురించి చెప్పడం కాక, ఆ ప్రదేశంలో ఇమిడి ఉన్న చరిత్ర అందరికీ బోధపడేలా వివరంగా చెప్పడం శామనతిగారి ప్రత్యేకత. పాండిచెరిలో తిరుగుతున్న ఫీల్ వచ్చింది. అభినందనలు