బొమ్మల్కతలు-21
-గిరిధర్ పొట్టేపాళెం
ఈ పెయింటింగ్ లోని నిండైన “తెలుగుదనం” తెలుగు వారిట్టే గుర్తుపట్టేయ గలరు. ఆ చీరకట్టు, నుదుటిన గుండ్రని బొట్టు, చందమామ వెన్నెల పడి ఆ చందమామ కన్నా నిండుగ మెరిసిపోతున్న పెద్ద కళ్ళతో అందమైన “వెలుగు” లాంటి తెలుగమ్మాయి. ఈ పెయింటింగ్ కి మూలంగా నేను తీసుకున్న పెయింటింగ్ వేసిన చిత్రకారుడు “ఉత్తమ్ కుమార్”. అప్పట్లో ఆంధ్రభూమి వారపత్రిక, ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం స్పెషల్ సంచికల్లో విరివిగా ఇలస్ట్రేషన్స్ వేసేవారు. ఇలస్ట్రేషన్స్ అనేకన్నా “పెయింటింగ్స్” అంటేనే బెటర్. వారపత్రికలకి పూర్తి స్థాయి పెయింటింగ్స్ ఈయన కన్నా ముందు బహుశా తెలుగులో ఒక్క “వడ్డాది పాపయ్య” గారే వేసి ఉంటారు. ఆయన తరువాత నాకు తెలిసి “ఉత్తమ్ గారు” ఆ ట్రెండ్ కొనసాగించారు. ఆయన స్ఫూర్తిగా అప్పట్లో ఆధ్రభూమి వారపత్రికలో అలా వేసిన ఇంకొక ఆర్టిస్ట్ “కళా భాస్కర్” గారు. “ఎంకి” శీర్షికన వారం వారం వేసే వారు. అవన్నీ కూడా పూర్తి స్థాయి పోస్టర్ కలర్ పెయింటింగ్సే.
ఈ పెయింటింగ్ నాకైతే చూసినపుడల్లా “ఉత్తమ్ గారు” వేసిన “బాపు ఎంకి” అనిపిస్తుంది. నిజానికి బాపు లైన్ డ్రాయింగ్స్ ఎక్కువగా వేశారు. వాటిని పెయింటింగ్స్ అని అనలేము. కానీ బాపు బొమ్మ అంత అందంగా ఒక తెలుగు అందం ఇందులో కనిపిస్తుంది.
అవి విజయవాడలో నా ఇంజనీరింగ్ కాలేజి రోజులు. పెయింటింగ్ ప్రయాణం మొదలుపెట్టి ముందుకి సాగుతూ ఉన్నాను. సాధనకై “ఆంధ్రభూమి” వారపత్రికలోని “ఉత్తమ్ కుమార్” గారి బొమ్మలు నాకు పాఠాలయ్యాయి. నాకు “ఉత్తమ్ కుమార్” గారు ద్రోణాచార్యుడయారు. అంటే ఆయన బొమ్మల్ని చూసి శిష్యరికం మొదలుపెట్టిన “ఏకలవ్యుడిని”. దొరికిన పోస్టర్ కలర్స్ తో ఒకటొకటీ వేసుకుంటూ కొంచెం కొంచెం ప్రావీణ్యం సంపాదించుకుంటూ, మెరుగులు దిద్దుకుంటూ పోతున్నాను.
ఈ బొమ్మ పై సంతకం పెట్టిన తేదీ జనవరి 14, 1988. అంటే సంక్రాంతి రోజు. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరంలో ఉన్నాను. వేసిన చోటు, సమయం దాని వెనకున్న జ్ఞాపకాలూ ఇంకా చెక్కుచెదరకుండా మదిలో పదిలంగా అలానే ఉన్నాయి. “కావలి” లో మేము అద్దెకుంటున్న మా “నారాయణవ్వ” పెంకుటిల్లు ముందు కటకటాల వరండా. అదే అప్పటి నా ఆర్ట్ స్టుడియో. ఉదయం పూట ఇంటికి ఎవరొచ్చినా నేను బహుశా బొమ్మలు వేస్తూనే ఎక్కువగా కనిపించేవాడిని. పడమర ముఖం ఇల్లు అవటంతో ఉదయం పూట చల్లగా ఉండేది. ఉదయాన్నే లేచే అలవాటుతో తొందరగా తయారయ్యి, టిఫిన్ చేసి బొమ్మలు వేస్తూ కూర్చునే వాడిని. ప్లాస్టిక్ వైర్ తో అల్లిన ఒక అల్యూమినియం ఫోల్డింగ్ కుర్చీ, ఒక పెద్ద అట్ట, ఒక మగ్గుతో నీళ్ళు, ఆరు గుండ్రటి గుంటల అరలుగా ఉన్న ప్లాస్టిక్ ప్యాలెట్, క్యామెల్ పోస్టర్ కలర్ సెట్ రంగుల బాటిల్స్…ఇదీ నా ఆర్ట్ స్టూడియో సెటప్. పెయింటింగ్స్ వేసే ముందు సెట్ చేసుకునే వాడిని. పక్కనే వాల్చిన ప్లాస్టిక్ వైర్ ఫ్రేమ్ ఫోల్డింగ్ మంచం ఎప్పుడూ వేసే ఉండేది. మధ్యలో బ్రేక్ తీసుకోవాలని పిస్తే కాసేపు ఆ మంచం పై వాలే వాడిని.
మామూలుగా ఏ పెయింటింగ్ అయినా మొదలు పెడితే ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసేసే వాడిని. ఈ పెయింటింగ్ వెయటానికి కొంచెం టైమ్ ఎక్కువ తీసుకున్నా. బహుశా మూడు నాలుగు రోజులు పట్టిందేమో. ఈ పెయింటింగ్ చూసినపుడల్లా దీని వెనుక ఒక చిన్న సంఘటన తళుక్కున మెరుస్తుంది. మొదటిరోజు ఉత్సాహం ఉరకలువేస్తూ మొదలుపెట్టాను. కొద్ది గంటల్లో ముఖం, తల, చుట్టు పక్కల కొంత భాగం వరకూ పూర్తయింది. తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని వేస్తున్న పెయింటింగ్ అట్టతో సహా పక్కనున్న మంచం మీద పెట్టి లోపలికెళ్ళి నీళ్ళు తాగి వచ్చాను. వచ్చేసరికి మా పెద్ద మామయ్య మూడో కూతురు, బహుశా ఐదేళ్ళ వయసుండొచ్చేమో, వచ్చి నిలబడి అక్కడున్న బాల్ పాయింట్ పెన్నుతో గీస్తూ కనిపించింది. ఏంటా అని దగ్గరికెళ్ళి చూస్తే సరిగ్గా ముఖం మీద పిచ్చి సున్నాలు చుడుతూ ఉంది. అప్పటికే ఒక ఇంచ్ స్పేస్ లో ముక్కు పైన గజి బిజి సున్నాలు నాలుగైదు సార్లు గీకేసింది. ఒక్కసారిగా చూసి కోపం కట్టలు తెంచుకుంది. నన్ను చూడగానే తుర్రున మెట్లు దిగి పక్కన ఆనుకునే ఉన్న పోర్షన్లోనే ఉండేవాళ్ళ ఇంట్లోకి పరిగెత్తి లోపలికెళ్ళి వాళ్ళమ్మ వెనక దాక్కుంది. కొట్టేంత కోపంతో అరుస్తూ వెనక పడ్డా చిక్కకుండా తప్పించుకుంది. వాళ్ళింట్లో దూరే లోపల నాకొచ్చిన కోపానికి చిక్కుంటే దెబ్బలు తప్పకుండా తినుండేది. భయపడేలా మాత్రం చాలా అరిచా. ఆ భయంకి కొద్ది రోజులు మెల్లిగా మెట్లెక్కి మా ఇంట్లో అడుగుపెట్టే ముందు నక్కి నక్కి చూసేది, నేను కనపడితే వెనక్కి తిరిగి పరిగెత్తేది. నాలుగైదు రోజుల దాకా నన్ను చూస్తే అంతే, అదే తంతు.
అప్పటికే అచ్చం ఇలాగే ఒకసారి “ఇందిరాగాంధి” గారి బొమ్మ వేస్తూ ఆపి లోపలికి వెళ్ళి వచ్చేసరికి, పెన్సిల్ తో అవుట్ లైన్ గీసుకుని బాల్ పాయింట్ పెన్నుతో నేనేస్తూ సగంలో ఆగిన బొమ్మ, మిగిలిన అవుట్ లైన్ మీద అన్న ఫ్రెండ్ “సంజీవరెడ్డి” బాల్ పాయింట్ పెన్నుతో గీసిన గీతలతో పాడయి పొయింది. దాన్నింక సరిదిద్దటం సాధ్యం కాక, అప్పటికే అదే “ఇందిరాగాంధి” గారి బొమ్మ రెండవసారి వేస్తుండటంతో బాధ, ఆక్రోశం కలిసిన కోపంలో ముక్కలుగా చించివెయ్యటం, మళ్ళీ సరిగ్గా అదే ఘటన ఈ పెయింటింగ్ కీ ఎదురవటం చాలా బాధించింది. బాధని దిగమింగి చింపేసి మళ్ళీ వేద్దామా అన్న సందిగ్ధంలో ఎందుకో మనసు మార్చుకుని పెయింటింగ్ కాబట్టి సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చెయ్యొచ్చేమో అన్న ఆలోచన రావటంతో, ప్రయోగం చేసి చూద్దామని ఆ గీసిన ముక్కు భాగం మీద వైట్ పెయింట్ వేసి మళ్ళీ దాని మీద సరిదిద్దే ప్రయత్నం చెయ్యొచ్చేమోనని చేసి చూశాను, పనిచేసింది. అయితే రెండు మూడు లేయర్స్ వైట్ పెయింట్ వేస్తేనే కానీ ఆ నల్లని బాల్ పెన్ గీతలు కనపడకుండా చెయ్యలేకపోయాను. పోస్టర్ కలర్స్ నిజానికి వాటర్ కలర్స్ లాగా పారదర్శకంగా ఉండవు. వాటర్ కలర్స్ అయితే ఈ ప్రయోగం సాధ్యం కాదు. అప్పుడు నాకలాంటివేవీ తెలీవు. అసలు పోస్టర్ కలర్స్ నే వాటర్ కలర్స్ అనుకుంటూ వేసుకుంటూ నేర్చుకుంటున్న రోజులు. అలా సరిదిద్దిన తర్వాత ఇంకో రెండు రోజుల్లో ఈ పెయింటింగ్ పూర్తిచెయ్య గలిగాను.
ఆ రెండు మూడేళ్ళ సాధనలో వేసిన ప్రతీ పెయింటింగ్ నాకు సరికొత్త మెళకువల పాఠాలు నేర్పింది. ఇందులో నేర్చుకున్న మొదటి మెళకువ, పెయింటింగ్ లో ఏ భాగమైనా రంగులు మార్చి సరిదిద్దాల్సి వస్తే, వైట్ పెయింట్ తో కవర్ చేసి మళ్ళీ దాని పైన సరిదిద్దే ప్రయత్నం చెయ్యొచ్చని. అయితే ఇది పారదర్శకం కాని పోస్టర్ కలర్స్ కనుక సాధ్యం అయ్యింది. ఇంకా బ్యాక్ గ్రౌండ్ లో వేసిన ఆ పసుపు ఆకాశం, ఆరెంజ్ రంగు నీళ్ళతో బ్లెండ్ అవుతూ నీళ్ళ పై మెరుస్తున్న వెలుగు, నీళ్ళపై దగ్గరగా ఎగురు తున్న పక్షులు, ఫోర్ గ్రౌండ్ లో ఆ పసుపు రంగు ఆకుల కొమ్మల పై సీతాకోకచిలుకలు, ఆకాశంలో గుండ్రని నిండు చందమామ, ఇందులో రంగులన్నీ డ్రమాటిక్ గా ఉన్నవే. ఈ రంగులు అచ్చంగా “ఉత్తమ్ కుమార్” గారు వేసిన ఒరిజినల్ పెయింటింగ్ లోవే. నేనేమీ సొంతగా మార్చింది లేదు. అయితే ప్రకృతిని వేసే రంగులు సహజంగా లేకున్నా ఆ అనుభూతిని మాత్రం పెయింటింగ్ లో తెప్పించొచ్చు అన్న మరో మెళకువ నేర్చు కున్నాను. నిజానికి ఇందులో ప్రకృతి రంగులు అసహజం, అయినా చూస్తుంటే అలాంటి ఫీలింగ్ కలగదు. ఏదో వెన్నెల్లో విహరిస్తున్నట్టే అనిపిస్తుంది.
పూర్తి అయిన తర్వాత మా ఇంటికి దగ్గరే “ఒంగోల్ బస్టాండ్” దగ్గర ఫ్రేములు కట్టే షాప్ కెళ్ళి దీన్ని ఫ్రేమ్ చెయ్యమని ఇచ్చాను. అది వరకూ ఒక పెయింటింగ్ ఇక్కడే ఇస్తే బాగా చేసిచ్చాడు, గ్లాస్ ఫ్రేమ్ లోపల వెల్వెట్ క్లాత్ మీద భద్రంగా అతికించి. అయితే ఇది మాత్రం ఒక హార్డ్ అట్ట, స్కూల్ పిల్లలు క్లిప్ తో ఉండి వాడే అట్ట లాంటిది, దాని మీద అతికించి, వెనక వైపు చుట్టూ ఒక ఇంచ్ బోర్డర్ చెక్క కొట్టి గోడకి తగిలించేలా చేసిచ్చాడు. ఇది కొంచెం పెద్ద సైజ్ అందుకని అలా చేశాడేమో. నా అన్ని బొమ్మల్లాగే ఈ బొమ్మా నా తోనే ఉండేది. నాతో అమెరికాకి తెచ్చుకున్నాను. కొన్నేళ్ళ తర్వాత మంచి ఫ్రేమ్ లో పెడదామని వెనకున్న చెక్క బోర్డర్ తొలగించాను. అయితే పేపర్ మీద వేసిన పెయింటింగ్ అవటం, అదీ అట్ట మీద అతికించెయటంతో అట్ట మీది నుంచి పేపర్ ని వేరుచేయటం కుదర్లా. కాల క్రమంలో పాతబడి పై భాగం అక్కడక్కడా కాగితం కొంచెం చిరిగి పెచ్చులుగా ఊడింది. అయినా ఆ రంగుల వెన్నెల, తెలుగు వన్నెల వెలుగు మాత్రం అలానే ఉంది.
ఇప్పటికి ఎన్ని బొమ్మలేసినా, ఇంకెన్నెన్నో పెయింటింగ్స్ వేసినా మొదటి రోజుల్లో నేర్చుకుంటూ, విహరిస్తూ వేసిన ఆ నాటి గతం మాత్రం గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆ కాలం నాటి జ్ఞాపకాల తాలూకాలూ మదిలో మెదులుతూనే ఉంటాయి. ఒక్కోక్క బొమ్మలో ఒక్కోక్క అనుభూతి, ఒక్కొక్క అనుభూతిలో ఒక్కొక్క అనుభవం. అప్పటి ఆ బొమ్మలు చూసినపుడల్లా ఆ అనుభవం, అనుభూతులతో పెనవేసుకున్న జ్ఞాపకాలు మాత్రం వెన్నెలలో పారే సెలయేటి నీటి అలల పై దగ్గరగా వచ్చి తాకకుండా విహరించి వెళ్ళి పోయే పక్షుల్లా వచ్చి అందకుండా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయ్…
“హృదయ సాగర అలల పై ఎగిరే అందని పక్షులే అందమైన జ్ఞాపకాలు.”
“తెలుగు వన్నెల రంగుల వెన్నెల”
Poster Colors on Paper (10″ x 12″)
*****
గిరిధర్ పొట్టేపాళెం – వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. బోస్టన్, USA లో భార్య డా|| జయలక్ష్మి, కొడుకులు రిత్విక్, భువన్ లతో నివాసం. పుట్టిన ఊరు కావలి, నెల్లూరు జిల్లా, పెరిగిందంతా ఇంటికి దూరంగానే. విద్యాభ్యాసం- కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్, హిందూపురం లో హైస్కూల్, ఆంధ్ర లొయోలా, విజయవాడ లో ఇంటర్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళశాల, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, జె.యన్.టి.యు హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా T.C.S. India, పలు USA సంస్థల్లో అనుభవం.
హాబీలు – బొమ్మలు వెయ్యటం, నేర్చుకున్న విషయాలు, అనుభవాలు రాయడం, పుస్తకాలు చదవడం.