చెలులూ! ఈరోజు మీకు అత్యంత పురాతనమైన, వైదికమైన రాగాన్ని పరిచయం చేయబోతున్నాను. అదే ఖరహరప్రియ రాగం. అనేక జన్యరాగ సంతతి కలిగిన జనక రాగం, కచేరీలలో ముఖ్య భూమికను పోషించగల అపూర్వ రాగం యొక్క విశేషాలు తెలుసుకుందాం, నేటి సంచికలో.
ఈ రాగం పుట్టుక గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శాస్త్రకారులు కొందరు విభేదించినా కథలుగా తెలుసుకుందాం. దేవ, ప్రమథగణాలు చుట్టూ కూర్చొని ఉండగా, పరమశివుడు ఋగ్వేద. యజుర్వేదాలను ఏకస్వరం, ద్విస్వరం, త్రిస్వరాలలో బోధించాడు. స, రి, ని అనే మూడు స్వరాలను స్వరితము, ఉదాత్తము, అనుదాత్తము అంటారు. అపుడు వింటున్న గణాలు ఎక్కువ స్వరాలతో ఒక వేదాన్ని బోధించమని అడిగారట. పరమశివుడు సప్తస్వరయుక్తంగా సామవేదాన్ని బోధించాడట. ఈ సంపూర్ణ రాగమే మొదటిది. దీనిని సామగానంగా పిలిచేవారట.
రావణాసురుడు బలమదగర్వంతో శివుని కైలాసాన్నే పెకిలించగలనని ప్రగల్భాలాడి, కైలాస పర్వతం కింద చిక్కుకున్నాడట. వేరొకదారి లేక, డస్సి పోయి, మహాశివుని పరిపరి విధాలుగా స్తోత్రం చేసి, చివరగా సామగానంలో స్తోత్రం చేయగానే శివుడు ఆనందించి రావణాసురుడిని కాపాడాడట. అందుకే సామగానాన్ని ‘హరప్రియ’ అని కూడా అనేవారట.
15వ శతాబ్దంలో శ్రీ ‘గోవిందాచార్యులు’ అనే సంగీత శాస్త్రకారుడు రాగాలను స్వరాలకు అనుగుణంగా కటపయాది సూత్రం ప్రకారం 72 మేళ కర్తల ప్రణాళికను ఏర్పరచారు. ఆ సమయంలో కటపయాది సూత్రం ప్రకారం హరప్రియ రాగానికి ముందు ‘ఖర’ అని అక్షరాలను చేర్చి, 22వ మేళకర్తగా నిర్ణయించారు. ఈ విధంగా, నాటి సామగానం, ఖరహరప్రియగా మార్పు చెందింది.
ఇక ఈ రాగలక్షణాలు ఏమిటో చూద్దామా? సప్తస్వరాలు ఉండటం వలన ఇది సంపూర్ణరాగం, జనక రాగం, మేళకర్త రాగంగా పిలువబడుతుంది. 72 మేళకర్తలలో 22వరాగం. ఇందులోని స్వరాలు షడ్జమం, చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కైశికి నిషాదం. సరి, గమ, పద, నిస స్వరాల మధ్య సమాన దూరం ఉండటం వలన ఈ రాగం కూడా సంగీత శిక్షణకి యోగ్యమైనదే అని కొందరి అభిప్రాయం. ఇది సర్వ స్వరగమకవరీక రక్తి రాగమ రాగాంగ రాగము. చక్కని విస్తృతికలిగిన రాగము. కచేరీలకు అనుగుణమైన రాగం. మంచి శ్రావ్యతను కలిగి అనురాగాన్ని, కరుణరసాన్ని చిందించగలది. ఏ సమయంలోనైనా పాడదగిన రాగము. ఈ రాగాన్ని హిందుస్తానీ సాంప్రదాయంలో కాఫీ థాట్ అంటారు.
సామగానంగా పిలువబడిన ఈ అపూర్వమైన రాగంలో చాలా కాలం సంగీత రచనలు రాలేదు. 17వ శతాబ్దంలో శ్రీ త్యాగరాజస్వామి అనేక కీర్తనలు రచించి, ఈ రాగానికి పూర్వ వైభవాన్ని తెచ్చారు. ఎక్కువగా చౌక (slow) మధ్యమ (Medium) కాలగతిలోనే ఈ రాగం రాణిస్తుంది. శ్రీముత్తుస్వామి దీక్షితులు, శ్రీశ్యామశాస్త్రి ఈ రాగంలో రచనలు చేయలేదు.
ఇక ఈ రాగం కుంగుబాటు, నరాల బలహీనత, హృదయ సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ఇస్తుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయము.
ఇక ఈ రాగంలో కొన్ని రచనలు చూద్దాము.
శాస్త్రీయ సంగీతం:
- చక్కనిరాజమార్గము – త్యాగరాజు
- ప్రక్కల నిలబడి– త్యాగరాజు
- రామనీ సమానమెవరు – త్యాగరాజు
- నడచి నడచి – త్యాగరాజు
- విడెము సేయవే– త్యాగరాజు
- సంకల్పమెట్టిదో – పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
- త్యాగరాజు- తిరువత్తియూర్ త్యాగయ్య
లలిత సంగీతం:
- ఎల్లలెరుగని వాళ్ళము – సుధామ – చిత్తరంజన్
- ఎదలో ఎవరో – పుట్టపర్తి నారాయణాచార్యులు –పాలగుమ్మి విశ్వనాథం
- సరిగమ పదని స్వరాలే – కలగా కృష్ణమోహన్ –రామాచారి
- వెడలెనిదే – దేవులపల్లి – రజని
సినీసంగీతం:
- సంగీత సాహిత్య సమలంకృతే – స్వాతికిరణం – Spb, బృందం .
- బాలనురా మదనా – మిస్సమ్మ – పి. సుశీల
- మేఘమా దేహమా… – మంచుపల్లకి – ఎస్. జానకి
చూశారా? అత్యంత ప్రాచీన రాగంగా సాక్షాత్తూ పరమశివుని గళం నుంచి ఉద్భవించిన తొలిరాగమైన ఖరహరప్రియ, నేడు కచేరీలలో ప్రధాన రాగంగా బహుళ జనాదరణం పొందింది.
వచ్చేనెల మరొక అద్భుతమైన రాగ సౌరభాన్ని ఆఘ్రాణిద్దాము.
అంతవరకూ సెలవా మరి!
చాలా బాగా సులభంగా అర్థమయ్యేలా వివరించాకా వాణిగారు 🙏👌👏👏👏
Chalaa thanks andi
Excellent Vani garu!!! In a simple and a unique style.. you have explained about the raaga!!! Keep going 👏👏
Very Nice. చాలా బాగా వివరించారు వాణి గారు
Thanks a lot Surekha😊
Chala thanks Balaji garu