లేఖాస్త్రం కథలు-5

ప్రేమఖైదీ

– కోసూరి ఉమాభారతి

 

          “ఏమ్మా నిఖిలా, అక్కకి మనం పెళ్ళికొడుకుల ఫోటోలు, వివరాలు పంపించి రెండు వారాలయింది  కదూ!.  తన వద్ద నుండి ఏమన్నా జవాబు వచ్చిందా?  లేదంటే ఫోన్ చేసి కనుక్కో.” అన్నాడు జగన్నాధం… పొద్దుటే కాఫీ అందిస్తున్న కూతురితో.

          “అవును నాన్నా, పదిహేను రోజులైనా అయింది. పెళ్ళికొడుకుల వివరాలు సేకరించి పంపానే గాని… నేరుగా అక్కతో నేను మాట్లాడనే లేదు తెలుసా? ఇక ఇవాళో, రేపో మాట్లాడుతాను.” అంది నిఖిల తండ్రి గది సర్దుతూ.

          “నిజానికి, అక్క పెళ్ళికంటే ముందే నీ వివాహం జరిపిస్తామని ఊహించలేదమ్మా.  ఆరేళ్ళ క్రితం అఖిలకి పైచదువుల నిమిత్తం అమెరికా వెళ్ళే అవకాశం రావడం, వెళ్ళే లోగా పట్టుబట్టి తన చేతుల మీదగా ‘నీల్ వ్యాస్’ అనే యువకుడితో నీ వివాహం జరిపించ డం … నిన్న గాక  మొన్న జరిగినట్టుగా అనిపిస్తుంది. అప్పటికి ఇంకా నీ చదువు పూర్తవ్వలేదనే తప్ప… నిజానికి మీ అమ్మకు, నాకు కూడా నీవు ప్రేమించిన ‘నీల్ బాగా నచ్చాడులేమ్మా నిఖిలా. 

          ఇకిప్పుడు ఆరోగ్యం కుదుట పడి స్థిమితంగా ఉన్నాను కనుకనే వీలయినంత త్వరగా అఖిల పెళ్ళి చేయగలిగితే…మీ అమ్మ ఆత్మకి కూడా శాంతి కలుగుతుంది. అఖిలకి తగ్గ విద్యావంతుడైన వరుడు త్వరగా దొరికితే బాగుణ్ణు.” అన్నాడు జగన్నాధం.

          “నిజమే నాన్న, మన ‘చదువుల సరస్వతికి సాటి ఎవరుంటారు? స్టాన్-ఫోర్డ్ స్కాలర్షిప్ తో చదువుకుని, ఓ ప్రొఫెసర్ గా కాలిఫోర్నియాలో స్థిరపడ్డం సామాన్యమైన విషయం కాదాయే. అన్నింటా అక్క పర్ఫెక్ట్. చెల్లెలినే అయినా అఖిలలా ఉండాలంటే నేను మరో జన్మ ఎత్తాల్సిందే.”  అంటూ పకపకా నవ్వింది నిఖిల. 

          “మీకు తెలియదు కానీ నాన్నగారు, చిన్నతనంలో నేను చేసిన అల్లరికి, ఆగడాలకి … లెక్కలేనన్ని సార్లు.. మీ నుండి అక్కే నన్ను కాపేడేది. అంతేకాదు..నీల్ తో నా ప్రేమని సమర్ధించి, మిమ్మల్ని ఒప్పించి, జైన్ మతస్థులైన నీల్ కుటుంబాన్ని కలిసి.. పెళ్ళి  కుదిర్చింది. నేను కోరుకున్న ఈ జీవితం అక్క వల్లే నాకు లభించింది. ఆ కృతజ్ఞత నాలో ఎప్పటికీ ఉండిపోతుంది.” అంటూ వెళ్ళి తన లాప్-టాప్ తెచ్చుకుని తండ్రి ఎదురుగా కూర్చుంది నిఖిల.

          ఈ-మెయిల్ చెక్ చేస్తూ, “నాన్నగారు, అఖిల నుండి మెసేజ్ వచ్చింది… కాకపోతే, చాలా పొడవైన సందేశమే పంపింది. మీరు వాకింగ్ నుండి వచ్చాక, వివరాలు చెబుతాను.” అంది.

          అఖిల పంపిన సందేశం తీరిగ్గా చదవసాగింది నిఖిల. 

***

ప్రియమైన నిఖీ,

          ఎలా ఉన్నావురా చెల్లాయ్? నాన్నగారి ఆరోగ్యం గురించి బెంగ లేదుగాని… ప్రస్తుతం ఆయన ఆలోచనంతా నాకు పెళ్ళిచేయడంపై  లగ్నమయిందనే… కాస్త కంగారుగా ఉంది.

          ఇక, ఆయనతో కలిసి నీవూ వరాన్వేషణ సాగిస్తున్నావంటే మాత్రం…  బాధ్యతలని ఆమడదూరం పెట్టే ఒకప్పటి చెల్లాయివేనా అని ఆశ్చర్యంగా ఉందిరా నిఖిల.

          నిజానికి … అమ్మానాన్నలకు ఆదినుండీ అండదండలుగా నిలిచింది చిన్న బిడ్డవైన నీవేరా. అమ్మ అకస్మాత్తుగా చనిపోయినప్పుడు …వచ్చి నీకు, నాన్నకి రెండు వారాల పాటు తోడుండి అమ్మని పోగొట్టుకున్న దుఃఖంతోనే తిరిగి వచ్చేసాను. నీ ఆలంబనతో  నాన్నగారు కోలుకుని… మళ్ళీ ఆలయ కార్యక్రమాల్లో భగవద్గీత పఠనం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ మధ్య … తన గురువుగారి అమ్మాయి వైజయంతీ వివాహానికి పౌరోహిత్యం వహించానని కూడా సంతోషంగా చెప్పారు. 

          మొత్తానికి నాకున్న ‘ఉత్తమ తనయ’ బిరుదుని కొట్టేసావురా నువ్వు. పైగా ఇప్పుడే మో నాతో ముచ్చటించకుండానే నా పెళ్ళిప్రయత్నాలు చేసేంత ఆరిందావయ్యా వంటే… ఎలారా చెల్లాయ్?

          ఆ రోజు గుర్తుందా? నా పుట్టినరోజునాడు అమ్మ చేసిన పాయసం అందిస్తూ … నీల్ తో నీ ‘ప్రేమ’ విషయం బయటపెట్టి, నేను అమెరికా వెళ్ళేలోగా అతనితో నీ పెళ్ళికి అమ్మానాన్నలని ఒప్పించమని నన్నాదేశించావే?. ఆ రోజునే … నా చెల్లెలికున్న తెగువ, ఆమెలోని గడసరితనం తెలుసుకున్నాను.       

          చెల్లాయ్ ప్రేమించింది కనుక, గొడవచేయకుండా వివాహానికి అంగీకరించడమే సమంజసమని వాదించి… అమ్మానాన్నలని ఒప్పించగలిగాను. పెళ్ళిచేసి ఘనంగా నిన్ను అత్తారింటికి పంపిన నాడు నాకెంతో సంతోషంగా అనిపించింది.

          ఏమైనా ..  ప్రేమ పుడితే తెగువ పుడుతుంది. వలచిన వాడి చేయందుకుంటే కట్టుబాట్లు, కులం, మతం వంటివి అడ్డు కాలేవు అని నా ఆకతాయి చెల్లి వల్లే ఆ నాడు తెలిసింది. 

          గడచిన ఆరేళ్ళలో మనందరి జీవితాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయిరా చెల్లాయ్. అయినాగాని ఎక్కడో అమెరికాలో నివశిస్తున్న ఇరవైఆరేళ్ళ స్వతంత్రురాలైన యువతికి దూరంగా వైజాగులో నివశించే  తండ్రి, చెల్లెలు కలిసి పెళ్ళి సంబంధాలు చూడ్డం ఏమిట్రా?

          ఇక నీకు తెలియని నా జీవితంలోకి వస్తాను. నా జీవితం మొదలైంది కాలిఫోర్నియా లో. నా చదువు బ్రహ్మాండంగా సాగుతున్న తరుణంలో ‘జస్టిన్ డేవిడ్’ అనే మా సీనియర్ తో పరిచయం స్నేహంగా మారింది. అతను అమెరికన్ క్రిస్టియన్. మంచివాడు, తెలివైన వాడని పేరు. ఏడాది పాటు నీడలా నన్ను వెన్నంటే ఉండేవాడు. అందంలో ఇంద్రుడు, చెలిమిలో చంద్రుడు. నిజం. 

          ఏడాది తిరిగేప్పటికే జస్టిన్ని వీడి ఒక్కక్షణం ఉండలేని స్థితికి వచ్చేసాను.  మంత్ర ముగ్దలా అతన్ని అనుసరించసాగాను. అతని సహచర్యంలో అమ్మ పోయిన దిగులు నుండి కూడా అప్పట్లో ఒకింత కోలుకున్నానేమో.

          అప్పుడప్పుడు నా ఈ ప్రేమ వ్యవహారం తప్పనిపించినా…  కుల, మత, జాతి  బేధాలకి స్త్రీ పురుషుల నడుమ జనించే ‘ప్రేమ’ అతీతం కదా! అనిపించేది.

          పెళ్ళి చేసుకుందామని జస్టిన్ తో అన్నాను. పెళ్ళి అనే వ్యవస్థలో తనకి అంతగా నమ్మకం లేదన్నాడు. అతని పట్ల ప్రేమ తగ్గలేదు.. సరికదా ఓ వ్యసనంగా మారింది.  అతని ప్రేమలో ఖైదీగా ఉండిపోయాను. మనసా, వాచా జస్టిన్ని నేను జీవిత భాగస్వామిగా భావించాను. కానీ జస్టిన్ విషయంగా నోరు విప్పేందుకు సంశయించాను. ధైర్యం చాల్లేదు. అతన్ని పెళ్ళికి ఒప్పించాకే మా ప్రేమ విషయం నాన్నగారికి, నీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను.

          ‘శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ ముడిపడే వివాహబంధం మాత్రమే ఈ సృష్టిలో…  స్త్రీ పురుషులని ఒక్కటి చేయగల పవిత్ర బంధమౌతుందన్నది … నాన్నగారి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని కాదనగల వారు ఈ భూమ్మీద ఉండరు. అమ్మానాన్నల పెంపకంతో పాటు నేను నమ్మిన కట్టుబాట్లు, సంప్రదాయాలన్నింటినీ మరిచానా? అన్న బాధని కూడా జయించేసేది జస్టిన్ పట్ల నా ఆకర్షణ. నన్ను అంతలా తన ప్రేమలో ఓలలాడించాడు.

          చదువు విషయంగా … ఉత్తమ శ్రేణిలో నేను మాస్టర్స్ డిగ్రీ పొందాను. యూనివర్సిటీ వారే స్టైఫెండ్ అధికం చేసి పి.హెచ్.డి చేసేందుకు అవకాశం కల్పించారన్న సంగతి విన్న నాన్నగారు ఉప్పొంగిపోయారు.

          సైకాలజీ మాస్టర్స్ చేసాక జస్టిన్ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. మా ఇరువురి సాహచర్యం, సహజీవనం ఆనందంగా కొనసాగి, నేను గర్భవతినని తెలిసిన రోజున వివాహం చేసుకుందామని మరోమారు జస్టిన్ని అడిగాను. కానీ తనమాట తనదిగా ఉండి పోయాడు. 

***

          నేను పండంటి బాబుకి జన్మనిచ్చాను. పేరు అభినవ్.  ‘అమ్మతనం ఓ అద్భుత వరం’ అనిపించింది. అభి ప్రాపకంలో మునిగితేలాను. జస్టిన్ కూడా వాడిని ఒక్క క్షణమైనా విడువడు. వాడి మొదటి పుట్టినరోజు నాడు వివాహం విషయంగా అతనితో గొడవపడ్డాను. నా కుటుంబం కోసమైనా పెళ్ళి అవసరం అని వాదించాను. ఏ కళనున్నాడో ఒప్పుకున్నాడు. కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నాము.

          దూరాన ఉండి ‘పెళ్ళి చేసుకున్నాను. నాకో బిడ్డ కూడా ఉన్నాడు.’ అంటూ చెప్పేలాంటి సామాన్య పరిస్థితి కాకపోవడంతో … భర్త, బిడ్డతో సహా అతిత్వరలో వీలు చేసుకుని నాన్నగారి ఎదుటకి వచ్చి అన్ని విషయాలు వివరించాలని నిర్ణయించుకుని జస్టిన్ని కూడా ఒప్పించాను.

          అదే సమయంలో యూనివర్సిటీ వాళ్ళు నా ప్రతిభకి పట్టం కట్టినట్టు.. పదవీకాలం కలిగిన ప్రొఫెసర్ గా నన్ను నియామకం చేశారు. నమ్మలేకపోయాను. అంబరాన్నంటిన సంతోషాన్ని నాన్నగారితో పంచుకున్నప్పుడు … నా వంటి బిడ్డని కన్నందుకు తన జన్మ తరించిందన్నారు. నా చదువు విషయంలో అమ్మ పాత్ర ఎంతైనా ఉందని గుర్తు చేసు కున్నాము.

          నాన్నగారితో మాట్లాడిన ప్రతిసారి…  నా ప్రేమ, నా భర్త, నా బాబు గురించి… చెప్పేయాలని నా మనసు ఆరాట పడుతుంది. కానీ ఫోన్లో చెప్పడం పద్దతే కాదని, ఆయన్ని క్షోభకి గురిచేయకుండా, ఎదుటపడి సగౌరవంగా అన్ని విషయాలు విన్నవించు కోడమే సరయిన మార్గమని ఆలోచించి మిన్నకుండిపోయేదాన్ని. 

          ప్రొఫెసర్ గా నా నియామకం తరువాత కొన్నాళ్ళు దేశవిదేశాల్లో యూనివర్సిటీ తరఫున సెమినార్లు, చర్చావేదికలు నిర్వహించడంలో నిమగ్నమయి ఉంటానని, వీలయినంత త్వరగా వైజాగ్ వస్తానని నాన్నకి మాటిచ్చాను.

          నెలకోమారైనా ఈ దేశాంతర ప్రయాణాలు, విజిటింగ్ ప్రొఫెసర్ అసైన్మెంట్లతో నేను ఊహించనంతగా యూనివర్సిటీ పనిలో మునిగిపోయాననుకో..

          అయితే, రెండేళ్ళ సమయం వడిగానే సాగిపోయింది. రెండేళ్ళ వివాహబంధాన్ని కూడా జస్టిన్, నేను ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నాము. ఉద్యోగ బాధ్యతలు తేలికవడం తో, నెలక్రితం అతడికి చెప్పి …  వైజాగ్ కి ప్రయాణం ప్లాన్ చేసాను. 

          మొదటిసారిగా నా భర్తని, నా బిడ్డని నాన్నగారికి పరిచయం చేసి ఆయన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాలని కలలు కనసాగాను.

          ప్రయాణం రేపనగా గుండె పగిలే సంఘటన నన్ను పిచ్చిదాన్ని చేసింది.  ‘లిలియానా’ అనే యువతిని ఇంటికి తీసుకొచ్చాడు జస్టిన్. స్నేహితురాలిగా పరిచయం చేసాడు. నా హృదయం ముక్కలయింది. అతని పట్ల నా నమ్మకం కూడా చెదిరి పోయింది.

          ప్రతిఘటించినా లాభం లేకపోయింది. అతను తన ప్రేమని, జీవితాన్ని ఎన్ని ముక్కలైనా చేసి పంచగలనన్నట్టుగా సూచించాడు. నా మీద ప్రేమ మాత్రం చెక్కు చెదరదన్నాడు.

          కానీ నేనలా కాదని, నా భర్తని ఎవరితోనూ పంచుకోలేనని నిర్ణయించుకుని విడిపోయాను. విడాకులు తీసుకున్నాను.

          ఇప్పుడు నాకు నా కొడుకు, వాడికి నేనుగా హాయిగానే సాగిపోతున్నాము. వైజాగ్ రావాలనే ఉన్నా …  ఏదో తెలియని సంశయంతో .. మళ్ళీ జాప్యం.

          అయితే, కొత్తగా రెండువారాల క్రితం మీరు పంపిన పెళ్ళికొడుకుల లిస్ట్, వివరాలు చూసి అదిరిపడ్డాను. నా జీవితంలో ఇప్పుడు భర్త అనే వ్యక్తి లేకున్నా నా మనసు జస్టిన్ కే సొంతం. నాకు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. కాబట్టి నాకోసం పెళ్ళి ప్రయత్నాలు మానేసేయండి. 

          ఇక వైజాగ్ రావడానికున్న నా సంశయం పటాపంచలయ్యింది. అన్నీ మన మంచికే జరుగుతాయి అంటారు కదా! నాన్నగారికి ఎదురపడవలసిన సమయం వచ్చేసింది. అందుకే.. వచ్చేవారం నేను, నా అభినవ్ వచ్చేస్తున్నాము. అన్ని విషయా లు నాన్నగారికి స్వయంగా చెప్పుకుంటాను. క్షమించమని అర్ధిస్తాను. నీవు కూడా అంత వరకూ ఓపికపట్టు. నేను వస్తున్నానని మాత్రం నాన్నగారికి తెలియజేయి.

          నీకు తెలుసారా చెల్లాయ్? ఓ సైకాలజిస్ట్ గా … ‘ఆకర్షణ, ప్రేమ, పెళ్ళి’ విషయంగా తలెత్తే సమస్యలతో బాధితులనెందరినో చూస్తుంటాను. స్త్రీ, పురుషుల నడుమ ‘ప్రేమ’ అనేది ఓ భావోద్వేగ బంధం. అది ఎంత సహజమైనదో, ఎంత తీయనైనదో … అంతే సంక్లిష్టమైనదని వారికి  గుర్తు చేస్తుంటాను. 

          జీవితంలో ‘ప్రేమ’, ‘సాహచర్యం’ తెచ్చే సుఖసంతోషాలతో పాటు…  ఉత్పన్నమవ గల కష్టనష్టాలని, బరువుబాధ్యతలని ఎదుర్కునే నిబ్బరం, ఆత్మబలం అవసరం.’ అని కూడా వారికి గుర్తు చేస్తుంటాను.

          ఇక ఉంటానురా నిఖిలా.

ప్రేమతో,

నీ అఖిల.                                            

          ఉత్తరం చదివిన నిఖిల చేతలుడిగి కాసేపు మౌనంగా ఉండిపోయింది. తండ్రి గురించి కాస్త కలవరంగా అనిపించినా అఖిల కోరిన ప్రకారం తాను నడుచుకోడమే సబబని భావించింది.

***

          రాత్రి భోజనాలయ్యాక, తండ్రికి హార్లిక్స్ తో పాటు మందులిచ్చి, వెళ్ళి మేడ మీద టీవీ చూస్తున్న భర్త పక్కన కూర్చుంది. 

          ఆమె భుజం పై చేయి వేసి,  “సాయంత్రం నుండి చూస్తున్నాను. అన్యమనస్కంగా ఉన్నావు. ఏమైంది? మీ నాన్న ఆరోగ్యం బాగుంది. నాకు తెలిసి మనకెటువంటి సమస్యలూ లేవు. సంగతి చెబితే నీ మనసు తేలికవుతుంది.” అన్నాడు నీల్.

          ఒకింత సర్దుకుని …  “అఖిల త్వరలో ఇండియా వస్తుంది. తనకి మేము పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని మీకు తెలుసు కదా! మీ డాక్టార్ ఫ్రెండ్ దాసు బయో-డేటా కూడా అక్కకి పంపాముగా! కానీ మేము చూసిన సంబంధాల పై అఖిలకి ఆసక్తి ఉండ దేమో అనిపిస్తుంది.” అని మాత్రం చెప్పి మిన్నకుండిపోయింది నిఖిల. 

          కొద్దీ క్షణాల మౌనం వహించాడు ఆమె భర్త నీల్. “నిక్కీ, నిజం చెబుతున్నా… అఖిల పెళ్ళి విషయంలో మీ అత్యాశ, ఉత్సాహం కరెక్ట్ కాదు. అఖిల… అభ్యుదయ భావాలున్న విద్యాధికురాలు. గత ఏడేళ్ళుగా అమెరికాలో స్థిరపడిన స్త్రీ. తనకి అన్నివిధాలా నచ్చిన వాడిని ఎంపిక చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. నా దృష్టిలో అక్కడే పెళ్ళి చేసుకుని భర్తతో వచ్చే అవకాశం కూడా ఉండగలదు. 

          అంతేకానీ, తానేదో లోకం తెలియని సామాన్య యువతన్నట్టుగా ఆమె కోసం మీరు చేసే ఈ పెళ్ళి  ప్రయత్నాలకు అర్ధంలేదు. నేను కూడా హర్షించను.”  అన్నాడు నిర్మొహమాటంగా.

          భర్త మాటలు సమంజసంగా తోచాయి ఆమెకి.  ‘అఖిల విషయం నాన్న కూడా అర్ధం చేసుంటారేమోలే! తప్పదుగా’ అనుకుని, తేలికయిన మనసుతో అక్కడి నుండి లేచింది నిఖిల. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.