విజ్ఞానశాస్త్రంలో వనితలు-16
సూక్ష్మజీవుల జన్యు శాస్త్రవేత్త – ఎస్తెర్లెడెర్‌బర్గ్ (1922-2006)
– బ్రిస్బేన్ శారద
విజ్ఞాన శాస్త్రంలో పరిశోధన, ఆటల్లో క్రికెట్, హాకీ లాటిది. అంటే, జట్టు అంతా కలిసి కట్టుగా గెలుపు కోసం శ్రమిస్తారు. తమ తమ వ్యక్తిగత విజయాలు, రికార్డుల మీది ఆశా, పరస్పరం వుండే స్పర్థలూ అన్నీ పక్కన పెట్టి జట్టు విజయం అనే ఒకే లక్ష్యం వైపు నడవాల్సి వుంటుంది. గెలుపు వల్ల వచ్చే కీర్తి ఎక్కువగా కేప్టెన్‌దే అయినా, జట్టు సభ్యులందరూ దాదాపు సమానంగా లాభపడతారు.
అయితే కొన్నిసార్లు, విజ్ఞాన శాస్త్ర పరిశొధనలవల్ల వచ్చే పేరు ప్రఖ్యాతులూ, పేటెంట్ హక్కులూ, డబ్బూ, పురస్కారాలూ అన్నీ జట్టు నాయకుడికీ, అతని వెన్నంటి వుండే ఏ ఒక్కరిద్దరికో తప్ప, జట్టులోని మిగతా సభ్యులూ, ముఖ్యంగా స్త్రీలూ, చాలా వరకు పక్కకే నెట్టివేయబాడతారు. ఈ విషయం మనం క్రితం నెల ఇడానోడక్ విషయం లో కూడా జరిగిందని తెలుసుకున్నాం.
ప్రస్తుతం పరిస్థితి కొంచెం మారింది కానీ, పంతొమ్మిది, ఇరవయ్య శతాబ్దపు మొదట్లో ఇది చాలా తరచుగా జరిగేది. భర్తా, వృత్తి సహచరుడు అయిన జోషువాలెడెర్‌బెర్గ్ నోబెల్ పురస్కారాన్నందుకుంటే, అవే పరిశోధనల్లో చురుగ్గా పాల్గొన్నఎస్తెర్లేడెర్‌బర్గ్ మాత్రం నీడల్లోనే నిలబడిపోయింది. ఈ విషయం పై ఆమె గళం విప్పింది కూడా.
కంటికి కనబడని సూక్ష్మ జీవులంతటా (మైక్రోబ్స్) వ్యాపించి వున్నాయి. బేక్టీరియా, వైరస్సులూ, ఫంగస్సులూ అన్నీ రకరకాల సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవుల జన్యు శాస్త్రంలో పరిశోధనలు ఎంతో ముఖ్యమైనవి.
సూక్ష్మజీవుల జన్యు శాస్త్రం అధ్యయనం వైద్యం, వ్యవసాయం, మందుల తయారీలూలాటి విభిన్న విషయాల్లో అవసరమవుతుంది. ఈ మధ్యనే మానవాళిని భయపెట్టిన కరోనా వైరస్ కి వేక్సిన్ ని కనిపెట్టడంలో ఈ సూక్ష్మజీవుల జన్యుశాస్త్రం (మైక్రోబియల్ జెనెటిక్స్) పాత్ర ఎంతో ముఖ్యమైనది.
జన్యు పరమైన సమాచారం సూక్ష్మజీవుల్లో ఎలా ప్రయాణిస్తుందో అర్థం చేసుకునే శాస్త్రమే మైక్రోబియల్ జెనెటిక్స్. ఈ పరిశోధనలని ఎంతో ముందుండి నడిపిన ధీర వనిత ఎస్తెర్లెడెర్‌బెర్గ్.
న్యూయార్క్‌లో డేవిడ్, పాలిన్జిమ్మెర్దంపతులకు 1922 డిసెంబర్ లో జన్మించారు ఎస్తెర్ మిరియం జిమ్మెర్. ప్రపంచం ఆర్థిక సంక్షోభ సమస్యల్లో చిక్కుకుని వున్న సమయంలో ఎంతో పేదరికం అనుభవించింది జిమ్మెర్ కుటుంబం.
యూదుల కుటుంబం కావడంతో హీబ్రూ భాష నేర్చుకున్నారు ఎస్తెర్. నిజానికి ఆ రోజుల్లో సాంప్రదాయక యూదు కుటుంబాల్లోని స్త్రీలకు హీబ్రూ భాష నేర్చుకోవడం నిషిద్ధం. అయితే డేవిడ్ జిమ్మర్కూతురి పై ప్రేమతో ఆమెకు తానేహీబ్రూ భాష నేర్పిం చాడు.
పదహారేళ్ళకు ఎస్తెర్హైస్కూలు చదువు ముగించి, పై చదువుల కోసం న్యూ యార్క్ లోని హంటర్ కాలేజీలో స్కాలర్‌షిప్పు సంపాదించుకుంది. ముందుగా బియే చదవాలనుకుంది కానీ మనసు మార్చుకోని బయో కెమిస్ట్రీ చదువు మొదలుపెట్టింది.
1942లో డిగ్రి పూర్తి చేయడమే కాకుండా, 1944లో స్టాన్‌ఫార్డ్ విశ్వ విద్యాలయంలో జెనెటిక్స్‌లో ఉన్నత విద్యకై సీటూ, వేతనమూ సంపాదించుకొంది. 1946లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో పీహెచ్‌డీ కై నమోదు చేసుకుంది ఎస్తెర్.
1950లో ఆమె పీహెచ్‌డీ ముగించారు. ఈ వ్యవధిలో ఆమె జోషువాలెడెర్‌బెర్గ్ అనే తోటి శాస్త్రవేత్తను పెళ్ళాడారు. తన పీహెచ్‌డిలో భాగంగా జరిపిన పరిశోధనలో ఎస్తెర్ తన మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నారు.
ఎస్తెర్ఇ-కోలీ అనే బాక్టీరియాని గురించి అధ్యయనం చేస్తూవుండగా, ఆ బాక్టీరియాను ఉంచిన గాజు ఫలకాల్లో ఆమె ఒక బాక్టీరియోఫేజ్ ని కనుక్కొన్నారు. దీనికి ఆమె గ్రీకు అక్షరం “లాంబ్డా” (Lambda) అని పేరు పెట్టారు.
(బాక్టీరియాఫేజి (Bacteriophage)బాక్టీరియాలాటి ఇంకో సూక్ష్మ క్రిమి. రెండిటి మధ్యా చాలా తేడాలున్నాయి. బాక్టీరియాఫేజి వైరస్ జాతికి చెందిన సూక్ష్మ క్రిమి. ఇది బాక్టీరియా క్రిముల్లో ప్రవేశించి తనని తాను పెంపొందించుకుంటూ పోతుంది.)
ఈ లాంబ్‌డాబాక్టీరియీఫేజి రెండు రకాల జీవిత చక్రాల్లో జీవిస్తుంది. ఎస్తెర్ పరిశోధనల్లో ఈ జీవిత చక్రాలను కూలంకషంగా అధ్యయనం చేసారు. ఈ పరిశోధనలూ, వాటి ఫలితాలూ ఆ తరవాత మైక్రో బయాలజీ, జన్యు శాస్త్రమూ, వైరాలజీలో ఎంతో పనికొచ్చాయి.
ఇదేకాదు, ఎస్తెర్ సాధించిన ఇంకో పెద్ద విజయం ప్రయోగ శాలలో బేక్టీరియాను సమర్థవంతంగా పెంపొందించి అధ్యయనం చేయడంలో కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టడం. ఎస్తెర్ కనిపెట్టిన రెప్లికాప్లాటింగ్ పద్ధతి వల్ల మున్ముందు బేక్టీరియా పరిశోధనలూ, ప్రయోగాలూ ఎంతో సులువయ్యాయి.
ఆమెని గురించి మాట్లాడుతూ తోటి శాస్త్రవేత్త స్టాన్లీఫాకో, “ప్రయోగ శాలలో ఆమె మేధస్సూ, క్రమశిక్షణా, సూక్ష్మ గ్రాహిత్వమూ ఎనలేనివి” అని పేర్కొన్నారు.
వృత్తిపరంగా ఎంతో అద్భుతమైన కృషీ, ఫలితాలూ చూపించినా ఎస్తెర్ తన జీవిత కాలంలో చాలా వివక్ష ఎదుర్కొంది. 1958లో జోషువా నోబెల్ బహుమతికి ఎన్నికయ్యారు. అతను జార్జి వెల్ల్స్, ఎడ్వర్డ్ టాటంలతో కలిసి నోబెల్ బహుమతి తీసుకున్నారు. నిజానికి వాళ్ళు బహుమతి తీసుకున్న విషయం జన్యు శాస్త్రంలో ముఖ్య పరిశోధనలు చేసిన ఎస్తెర్ పేరు ఎక్కడా ప్రస్తావించనేలేదు. పదేళ్ళ తరవాత అంటే1968లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇప్పటికీ మైక్రో బయాలజీలో జోషువాకున్నంత పేరు ప్రఖ్యాతులేవీఎస్తెర్‌కు లేవు.
జోషువాలాడెర్‌బెర్గ్ నుంచి విడాకులు తీసుకున్నా ఆమెని ఇంకా ఎస్తెర్లాడెర్‌బెర్గ్ గానే వ్యవహరిస్తారు. తన కోసమే కాదు, తనతోటి ఇతర స్త్రీల పక్షాన కూడా ఎన్నో పోరాటాలు చేసారు ఎస్తెర్.
1959నుంచీ స్టాన్‌ఫోర్డ్ జెనెటిక్స్ విభాగంలో ఎన్నో పరిశోధనలు సాగించారు ఎస్తెర్. ఆమె స్థాపించిన ప్లాస్మిడ్రెఫెరెన్స్ సెంటర్ లో(PRC) 1976 నుంచి 1986 దాకా పనిచేసారు. అయినా, స్టాన్‌ఫోర్డ్ విద్యాలయం ఆమెకి ఏ మాత్రం గుర్తింపు ఇవ్వలేదు.
జోషువాస్టాన్‌ఫోర్డ్లో జెనెటిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్డుగా ఎదిగితే, ఎస్తెర్‌కి కనీసం లెక్చరర్ ఉద్యోగం కూడా దొరకలేదు. డెబ్భైయేళ్ళ వయసులో ఎస్తెర్మాథ్యూసైమన్ అనే ఇంజినీర్‌ను పెళ్ళాడారు. ఎనభై మూడేళ్ళ వయసులో 2006 నవంబరులో న్యుమోనియా బారినపడి మరణించారు.
*****
ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు.
“నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు.. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా కినిగెలో ఉచితంగా లభ్యమవుతున్నాయి. “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటి ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఉచితంగా లభ్యమవుతుంది.