స్త్రీ – గాలిపటం – దారం

(`स्त्री, पतंग और डोर’)

హిందీ మూలం – డా. లతా అగ్రవాల్

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          “నీరూ! …. ఎక్కడున్నావ్?….ఇలా రా…”  అజయ్ ఆ రోజు ఆఫీసు నుంచి వస్తూనే మండిపడ్డారు.

          “ఏమయింది డాడీ… ఇంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారు, ఇదే సంగతి నెమ్మదిగా కూడా చెప్పవచ్చు కదా?”

          “నేను గట్టిగా అరుస్తున్నానా?… బయట నీ పేరు మోగిపోతోంది. దాన్నేమంటావ్?…”

          “అంతగా నేనేం చేశాను?”

          “పైగా నేనేం చేశానని అడుగుతున్నావా…. నీకు బాగా రెక్కలొచ్చాశాయి నీరూ… నీకు స్వతంత్రం ఇచ్చానంటే దాని అర్థం నువ్వు ఏమయినా చెయ్యమని కాదు కదా?” అజయ్ ఆవేశంతో ఊగిపోతున్నారు. ఆయన కంఠస్వరం కోపంతో వణికిపోతోంది. నేను వంటింట్లో మూకుడులో నూనె వేడిచేస్తున్నాను. సలసలమనే దాని ధ్వనితో పాటు నా గుండె కొట్టు కునే సవ్వడికూడా అదే వేగంతో ప్రస్ఫుటితమవుతోంది. బహుశా అజయ్ ఇవాళ కూడా ఏదో చిరాకు కలిగించేది చూసినట్లున్నారు. ఆయన కోపంతో ఉన్నారు. కారణం నాకు తెలుసు. నిన్న రాత్రే అజయ్ నాతో దీని గురించి మాట్లాడారు.

          “అరుణా! నీరూ కొంచెం హద్దు మీరుతోందని నాకనిపిస్తోంది.”

          “ఇదెలా చెప్పగలరు మీరు?”

          “నేను బయట నలుగురితో కలుస్తూ ఉంటాను. వద్దనుకున్నా కొన్ని విషయాలు నాదాకా వస్తూనే ఉన్నాయి.”

          “జనం ఏదో ఒకటి అంటూనే ఉంటారు…. ఎవళ్ళో చెప్పుకునేదాన్ని విని పిల్ల మీద సందేహం పెట్టుకోవడం తెలివైనపని కాదు కదండీ.”

          “లేదు అరుణా, నేను విన్నదానితో బాటు, చూసిన విషయమే చెబుతున్నాను.”

          “అంటే ఏమిటి మీరనేది?”

          “నేను స్వయంగా నీరూని ఆ కుర్రాడితో రెండు-మూడుసార్లు బైక్ మీద తిరుగుతూ ఉండగా చూశాను. బహుశా తను కూడా నన్ను చూసి ఉండవచ్చు. లేదా చూసి ఉండక పోవచ్చు.”

          “చూసిందా…! అయితే అప్పుడే ఎందుకు ఆపలేదు? అతను నీరూకి మంచి స్నేహితుడు అయివుండచ్చునేమో. ఈరోజుల్లో బాయ్ ఫ్రెండ్ అనేది ఒక సాధారణ విషయం అయిపోయిందని మీకు తెలుసుకదా.”

          “అదేకాదు అరుణా, నేను ఆ కుర్రాడి గురించి తెలుసుకున్నాను. వాడో నెంబరువన్ పోకిరి వెధవ…జల్సారాయుడు. పనీపాటా లేకుండా తిరుగుతూ ఉంటాడు. చాలా మంది అమ్మాయిలతో వాడిపేరు మోగిపోతోంది. ఈ రోజుల్లో ఇటువంటి విషయాలు సర్వ సామాన్యమైపోయాయి. ఈ ఆవారాగాళ్ళు అమాయకులైన ఆడపిల్లలని తమ ప్రేమ బంధంలో ఇరికించి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు.”

          “ఇప్పుడేంచేస్తే బాగుంటుంది…?” నాకు దిగులు పట్టుకుంది.

          “చెయ్యడానికే ముంది, మన బంగారాన్నే జాగ్రత్తపెట్టుకోవాలి.”

          “కాని ఏంచేసినా కాస్త ఆలోచించుకుని చేసుకోవాలి…. వయసొచ్చిన పిల్ల. పైగా ప్రేమా-గీమా అన్నదాంతో ఉడుకురక్తం మంచిచెడ్డలని విస్మరించి ఎలా అడుగు వేయిస్తుందో తెలియదు.

          “ఊఁ!”

          నీరూలో మార్పు నేను కూడా గమనిస్తున్నాను. ఒకప్పుడు తండ్రి వేలు పట్టుకుని నడిచే ఈ పిల్ల ఒక్కసారిగా పెద్దదైపోయింది. అందుకే వాళ్ళ నాన్నగారితో కూడా తెగించి వాగ్వాదం చేస్తోంది.

          “రితేష్ లో ఏం తక్కువ డాడీ?”

          “అతనిలో మంచి లక్షణం ఏముంది?”

          “మీరు చూసివుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అతను ఎంత హ్యాండ్సమ్ అన్నది.”

          “జీవితంలో కేవలం హ్యాండ్సమ్ గా ఉండటం ఒక్కటే సరిపోదు.” అజయ్ అదే ఆవేశంలో పరిస్థితిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్పేది కూడా తోసిపారేసే విషయం కాదు… నాకన్నా ఈ పరిస్థితులను బాగా ఎవరు అర్ధం చేసుకోగలరు. నేను తలుపు దగ్గర తల వంచుకొని మౌనంగా నిలబడివున్నాను…. ఒక్కొక్క మాట నన్ను ఆహతురాలిని చేస్తోంది.

          “డాడీ, అతను కొంచెం ఫ్రాంక్ గా ఉంటాడు. దాని అర్థం అతను జల్సారాయుడని కాదు కదా.”

          “నేను నీతో వాదించదలుచుకోలేదు. నేను అతన్ని కలుసుకోవద్దని నీకు చెబుతు న్నాను. అంటే దాని అర్థం ఇక మీదట అతన్ని కలుసుకోవద్దని. నీ తలకి పట్టిన అతని దెయ్యం దిగిపోయే వరకూ నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళటానికి వీల్లేదు.” అజయ్ తన నిర్ణయం స్పష్టంగా చెప్పి బయటికి వెళ్ళిపోయారు. 

          నేనేమీ చెయ్యలేక, చెప్పలేక తండ్రి-కూతుళ్ళ మధ్య నెలకొన్న వివాదంలోచిక్కుకు పోయాను. కాని మధ్యలో కల్పించుకునే హక్కు నాకు ఉందని ఎందుకనో నాకు అనిపించ డంలేదు….దీనికి కారణం… సంబంధాలు అప్పుడప్పుడూ పేరుకయితే చాలా దగ్గరగా ఉంటాయి. కాని అందులో కొన్నిస్వయంగా నా స్వంతం అనుకుని భావించేవి, కొన్నింటి లో కొంత పరాయితనం ఉంటుంది. అవును. ఈ ఇంటితోనూ, నీరూ తోనూ నాకు అటు వంటి సంబంధమే ఉంది…నీరూకి తల్లిని కావడానికి నేను సుదీర్ఘమైన తపస్సు చేయ వలసి వచ్చింది. ఆ తరువాత కూడా తను నన్ను ఎంత స్వీకరించిందన్నది నాకు తెలియదు. ఎందుకంటే తను ఎప్పుడూ నన్ను అమ్మా అని పిలవలేదు. చెప్పేదేదో కేవలం తిన్నగా, సూటిగా చెప్పేస్తుంది.

          “ఇవాళ నా లంచ్ బాక్స్ లో ఆలూ పరాఠా పెట్టండి.”

          “నిన్న మీరు నా సాక్స్ వాష్ చేశారు కదా, ఎక్కడున్నాయి?”

          “మిమ్మల్ని బయట ఆంటీ పిలుస్తున్నారు… మొదలైనవి.” నేను కూడా నీరూ మీద నా తల్లిదనాన్ని బలవంతంగా ఆపాదించదలుచుకోలేదు. తనకి తగిన సమయం ఇవ్వాలని అనుకుంటున్నాను. కాని ఈ  పదమూడేళ్ళలో ఆ సమయం ఎప్పుడూ రాలేదు. ఎదురుతెన్నులు చూడటం, నిరీక్షించడం అలాగే ఉండిపోయింది. ఈ కారణంగానే మా మధ్య సంబంధాలలో కొంత దూరం అనేది అలా ఉండిపోయింది. నా దృష్టిలో ఇందులో నీరూది కూడా తప్పేమీ లేదు. జీవితం అనే కేన్వాస్ లో ఉన్న ఒక చిత్రాన్ని తుడిచేసి దాని మీద మరో చిత్రాన్ని వెయ్యడం… అదే, ఆ రెండో చిత్రాన్నినేనే…. అజయ్ కి రెండో భార్యని. నీరూకి పన్నెండేళ్ళ వయస్సులోనే తన తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. నీరూ (నీరజ), చిన్న వీరూ (వీరేంద్ర) ల బాధ్యత తల మీద ఉండగా, బాగా నడుస్తున్న కుటుంబం చెదిరిపోతోందని ఆత్మీయులు, శ్రేయోభిలాషులు చెప్పిన మీదట అజయ్ రెండో పెళ్ళికి సరేనన్నారు. ఆ తరువాతనే నాకన్నా తొమ్మిదేళ్ళు పెద్ద అయిన, ఇద్దరు పిల్లల తండ్రికి భార్యగా ఈ కుటుంబంలోకి అడుగు పెట్టాను. ఈ పరిస్థితి నాకు కూడా తేలికైనది కాదు. కాని అప్పుడప్పుడూ గతంలో చేసిన పొరపాట్లకి ఫలితాన్ని సరిదిద్దుకు నేందుకు వర్తమానంతోనూ, భవిష్యత్తుతోనూ రాజీ పడవలసి వస్తుంది. నిజానికి అజయ్ హ్యాండ్సమ్ గానూ, స్మార్ట్ గానూ ఉన్నారు. పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. అన్నిటికన్నా చెప్పుకోతగ్గది స్త్రీ మనస్తత్వం బాగా తెలిసినవారు.

          పన్నెండేళ్ళ తల్లి సాన్నిధ్యం తక్కువేమీ కాదు. నీరూలో తన తల్లి అణువణువు లోనూ నిండిపోయివుంది. తన ఒక్కొక్క జ్ఞాపకంలోనూ తల్లి రూపం వేళ్ళు తన్నుకుని వుంది. అలాంటప్పుడు నేను రావడం నిస్సందేహంగా తనకి ఒక  సవాల్ గా ఏర్పడింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే అజయ్ నా ఆలోచనలకి గౌరవం ఇస్తారు. ఆ రీత్యా నేను కూడా నీరూ ఆలోచనలని అర్దం చేసుకునేందుకు ప్రతిక్షణం ప్రయత్నం చేస్తాను. ఇందులో నేనెంత సఫలీకృతురాలినయ్యానో తెలియదు కాని, ఈ చెదిరిపోయిన కుటుంబాన్ని పూర్తి అంకితభావంతోనూ, గంభీరతతోనూ తిరిగి రూపొందించానని చెప్ప గలను.

          అజయ్ నా వైఖరితోనూ, నేను వ్యవహరించే తీరుతోనూ సంతృప్తిగా ఉన్నారు. వీరూ బాగా చిన్నవాడు కావడంవల్ల వాడి మనస్సులో తన తల్లికి చెందిన కొన్ని అస్పష్టమైన జ్ఞాపకాలు ఉండేవి. కాని సమయం గడుస్తున్నకొద్దీ త్వరగానే అవి చెరిగిపోయాయి. వాడు సహజంగానే నన్ను తల్లి రూపంలో స్వీకరించాడు.

          కాని నీరూ చిన్నతనం నుండి తన వరకు మాత్రమే పరిమితమైపోయింది. కూతుళ్ళు సాధారణంగా ఎక్కువ సెంటిమెంటల్ గా ఉంటారు. తను తరచు ఒంటరిగా ఉన్నప్పుడు డాబా మీదకి వెడుతూ ఉంటుంది. ఒకసారి నేను కూడా తనవెనుకగా టెరస్ మీదకి వెళ్ళాను.

          “ఇలా తదేకంగా ఆకాశంలో ఏం చూస్తున్నావమ్మా?…” నీరూ తన తల్లిని వెతుకు తోందేమోనని నాకనిపించింది.

          “గాలిపటం…” తను సంక్షిప్తంగా జవాబిచ్చింది.

          “నీకు గాలిపటం అంటే ఇష్టమా?… అయితే చెప్పలేదేమమ్మా? మీ డాడీతో చెప్పి నేను తెప్పిస్తాను. మనం ఇద్దరం కలిసి గాలిపటం ఎగరేద్దాం.”

          “నాకు గాలిపటం ఎగరేసే సరదా ఏమీ లేదు…. అది దారంతో ముడిపడి ఉండటం కూడా.” తను మొండిగా జవాబిచ్చింది.

          “అయితే మరి నీకిష్టమైనదేమిటి?”

          “నాకిష్టమైంది గాలిపటం చాలా ఎత్తుగా ఎగరడం, ఎటు వంటి అడ్డంకులు, అవరోధాలు, ఆంక్షలు లేని విశాలమైన ఆకాశం…”

          “నీకు కూడా ఎగరాలని ఉందా?”

          “అవును. చాలా ఎత్తుగా ఎగరాలని ఉంది. నన్నెవరూ ఆపుజేసేవాళ్ళు లేని చోటికి.” నిజంగా నీరూ చాలా ఉన్నతంగా ఆకాశంలో తేలియాడాలనే కలలలో లీనమైపోయి వుంది… తనని నేను కనకపోయినంతమాత్రాన ఏమయింది. నేను కూడా ఒక స్త్రీనే కదా… ఎక్కడైనా కొన్ని మినహాయింపులు ఉంటే ఉండవచ్చు కాని, మొత్తం మీద ప్రతి స్త్రీ యొక్క గతం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కావాలనుకున్నా నేను తనకి ఏమీ చెప్పలేకపోతున్నాను. ఒక్కోసారి నాకు భయం వేస్తుంది సవతితల్లిననే లేబిల్ నా మీద అతికిస్తుందేమోనని. ‘ఇంకో అమ్మ వస్తే నాన్న కూడా పరాయివాడైపోతాడు’ అనే సామెత బహుశా తనకి వర్తించకుండా అజయ్ ప్రతి విషయంలోనూ తను ఇష్టపడిన విధంగా సమకూరుస్తూ, చేసుకుంటూవస్తున్నారు. అప్పుడప్పుడూ మరీ ఎక్కువ గారాబంతో ఇచ్చిన స్వేచ్ఛ జీవితం అనే గాలిపటంలోని బిగువుని, స్థిరత్వాన్ని తగ్గించిపారేస్తుందని ఆయనకెలా చెప్పను. దానితో దానికి దారి తప్పటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ప్రస్తుతం నీరూ తనకి ఏంతోస్తే అదే తను అనుకున్నట్లుగా చేసే విధంగా తయారవుతోంది.

          అజయ్ తన మనస్సులోని మాటని బహిర్గతం చేసి వెళ్ళిపోయారు. ఇంక నేను మిగిలాను. పిల్ల ఏదైనా చెయ్యకూడని పని చేస్తుందేమోనని… లేదా ఏమయినా అఘాయిత్యం చేస్తుందేమోనని… నాకు భయంగా ఉంది. సవతి తల్లి కదా… అమ్మాయిని సంబాళించుకోలేక పోయిందని పదిమందీ అంటారు. కన్నతల్లి అయితే తెలిసేది అని. కాని నిజానికి అజయ్ కుటుంబాన్ని నేను ఆరాధించాను. చూస్తే నీరూ తన గదిలో లేదు. ఎప్పటిలాగా డాబా మీద ఉండవచ్చునని నేను డాబామీదికి చేరుకున్నాను. పరిశీలిస్తే అక్కడ ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. నీరూ మౌనంగా ఆ గాలిపటాలని తన్మయత్వంతో చూస్తోంది. అది గమనించి కాస్త ఊరట లభించింది. నేను నీరూ భుజం మీద చెయ్యి వేశాను.

          “ఏం చూస్తున్నావు తల్లీ?”

          “అఁ… గాలిపటం…” దీర్ఘంగా నిశ్వసిస్తూ తను చెప్పింది.

          “వేరు-వేరు రంగుల్లో, డిజైనుల్లో ఈ గాలిపటాలు ఎంత బాగున్నాయో చూడు.” నేను పరిస్థితిని తేలికపరచాలనే ఆలోచనతో సంభాషణను కొనసాగించాను.

          “అవును.” ఎప్పటిలాగే చాలా సంక్షిప్తమైన సమాధానం.

          “ఈ గాలిపటం అనేది మొట్టమొదట ఎవరి కల్పనతో వచ్చి ఉంటుందో”– నేను తనకి ఇంకా దగ్గరగా వస్తూ అన్నాను.

          “ఎవరో నాలాంటి వాళ్ళే అయివుండచ్చు… వాళ్ళ రెక్కలని బంధించి ఉంచి నప్పుడు వాళ్ళు తమ కల్పనలో ఇలా ఎగరాలనే కలకి రూపం ఇచ్చి ఉండచ్చు.” నేను తన మాటల్లోని పదును అర్థం చేసుకుంటున్నాను.

          “నీ రెక్కలని ఎవరూ బంధించి ఉంచలేదమ్మా. నువ్వు ఆకాశమంత ఎత్తుకి ఎదగాలని మీ డాడీ తనంతట తనే కోరుకుంటున్నారు. కాని నువ్వు ఎగరాలనుకుంటున్న దిశ సరైనదిగా ఉంటే చాలు.”

          “నేను ఏదో తగని దిశగా వెడుతున్నానని డాడీకి ఎలా తెలుసు?”

          ఆయన ఒక తండ్రి అని నేను తనకి ఎలా తెలియజెప్పను… తండ్రి దృష్టిని కూతుళ్ళు ఎప్పుడు అర్ధం చేసుకున్నారు. నీరూ ధ్యాసని మళ్ళిస్తూ నేను ఆకాశంవంక చూస్తూ అన్నాను- “అదిగో అటు చూడు. రెండు గాలిపటాలు పరస్పరం ఎలా చిక్కుకు పోయాయో. ఆ పసుపుపచ్చని గాలిపటం బలహీనపడుతోందని అనిపిస్తోంది.” నీరూ కూడా కొన్ని క్షణాలు తన ధ్యాసని మరిచి గాలిపటాలని పరిశీలిస్తోంది.

          “ఆ రెండింటిలో ఒకదాని అదృష్టంలో తెగిపోవాలని రాసిపెట్టివుంది.” నేను బరువెక్కిన మనస్సుతో అన్నాను. 

          “ఒకవేళ పసుపుపచ్చని గాలిపటం తెగిపోతేనో…?” నీరూ ప్రశ్నించింది.

          “అలా అయితే ఈ గాలిపటం అస్తిత్వమే లేకుండా పోయిందనుకో.”

          “అదెలా సాధ్యం?”

          “తల్లీ! నువ్వు ఏ దారాన్ని బంధం అనుకుంటున్నావో అది నిజానికి గాలిపటానికి రక్షణ కవచం. దారం లేకుండా గాలిపటానికి ఉనికి అనేది లేదు… అదిగో చూడు పసుపు పచ్చటి గాలిపటం తెగిపోయింది.” తన దారంతో సంబంధం తెగిపోగానే గాలిపటం గాలిలో తేలియాడుతూ కిందకి నేల మీదకు రాసాగింది.

          “అరే! ఇది నిజంగా కిందికి వచ్చేస్తోంది. ఇప్పుడెలా దానికి!” నీరూ గొంతుకలో దిగులు ధ్వనిస్తోంది. ఎందుకో అది నాకు మంచిదనిపించింది.

          “అది ఏదయినా చెట్టుకొమ్మకి చిక్కుకుని చిరిగిముక్కలైపోతుంది. లేకపోతే నేల మీదికి వచ్చి పడిందంటే ఎంత మంది కొంటెకుర్రాళ్ళ చేతుల్లో ఒక బొమ్మలాగా అయి ఉండిపోతుంది. వాళ్ళు ఒకరి చేతుల్లోంచి మరొకరు లాక్కోవడంలో దాని అస్తిత్వమే లేకుండాపోయినా ఆశ్చర్యపోవక్కరలేదు. ఆ తరువాత ఆ అందమైన గాలిపటం ఒక కాగితం ముక్కలాగా మిగిలిపోతుంది. అప్పుడు జనం కాళ్ళ కింద పడి నలిగిపోతుంది లేదా అది ఎటు వెళ్ళాలన్నది గాలి నిర్ణయిస్తుంది.” నేను భావోద్వేగంలో చెప్పుకు పోతున్నాను.

          “మీరు చెప్పేది వింటూ ఉంటే తెగిన గాలిపటం బాధ ఎటువంటిదో మీకు చాలా అనుభవం ఉన్నట్లు అనిపిస్తోంది…”

          “గాలిపటం అనుభవం లేకపోయినా జీవితంలోని అనుభవం తప్పకుండా ఉంది తల్లీ.”

          “అంటే…?”

          “అంటే, స్త్రీ జీవితం కూడా ఒక గాలిపటం లాంటిదే నమ్మా. యవ్వనంలో అడుగు పెడుతూనే అది ఆకాశంలో విహరించాలని అనుకుంటుంది. అది కూడా ఎటు వంటి దారం లేకుండా…. పిచ్చితల్లీ, ఎప్పుడైనా దారం లేకుండా ఏ గాలిపటమైనా ఎగిరిందా? అలాంటి ఒక అమ్మాయి తన మూర్ఖత్వంతో తను అనుకున్నది చెయ్యాలని భావించింది. ఒక రోజున తన బాయ్ ఫ్రెండ్ తో దూరంగా ఎక్కడో తన గూడు కట్టుకోవాలని బయలు దేరింది. తనవాళ్ళు ఆపుజేయటానికి ప్రయత్నిస్తే తను ఒక్క ఉదుటున తన బంధాలనీ, సంబంధాలనీ తెంచిపారేసి ఆ అపరిచిత వ్యక్తి మీద నమ్మకం ఉంచింది. అతని గతం కాని, అతని భవిష్యత్తు కాని తెలియకపోయినా…” అలా చెబుతూ నేను ఊపిరి పీల్చు కునేందుకు కాస్త ఆగాను…. నేను ఆగడం చూసి నీరూ ఆత్రుతగా అడిగింది-  “తర్వాత ఏమయింది… ఆగిపోయారెందుకని? ఆ ప్రేమకథలో తరువాత ఏం జరిగిందో చెప్పకూ డదా?”

          “తర్వాత… ఎవరి మీద నమ్మకంతో తను దారాన్ని తెంచుకుందో ఆ నమ్మకం ఒక మాయాజాలమని తెలిసింది. అతనొక మోసగాడు. ఒక అమాయకురాలిని నమ్మించి ఉల్లాసంగా, వినోదంగా కాలక్షేపం చేసి తనని సంఘంలో ఎదురుదెబ్బలు తినడానికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.”

          “అయ్యో!  వాడు చాలా నీచుడు…అధముడు…దుర్మార్గుడు … వాడు…” నీరూ ముఖంలో జుగుప్సతో కూడిన భావం  నాకు స్పష్టంగా కనిపిస్తోంది.

          “నువ్వు నిజం చెప్పావు తల్లీ. ఈ రోజుల్లో ఇటు వంటి దుర్మార్గులకి లోటు లేదు.”

          “మరి ఆ అమ్మాయికి ఏమయింది… తను తప్పకుండా సూయిసైడ్ చేసుకుందేమో.”

          “లేదమ్మా. తను బతికే ఉంది. ఎందుకంటే ఆమెకి ఒక వివేకవంతుడైన, ఉన్నత మైన భావాలు, ఆశయాలు, ఆలోచనలు గల జీవితభాగస్వామి దొరికాడు. అతను ఆమె జీవితానికి నిర్వచనాన్నే మార్చేశాడు.”

          “అంటే దాని అర్థం లోకంలో మంచివాళ్ళు కూడా ఉంటారన్న మాట.”

          “ఉంటారమ్మా. కాని ఎంత మంది అరుణలకి అజయ్ లభించాడు?” తెలియ కుండానే నా నోట్లోంచి మాట వచ్చేసింది. ఈ మాట వినగానే కొన్ని క్షణాలు మా యిద్దరి మధ్య మౌనం తాండవం చేసింది. నీరూ కన్నీళ్ళు ముప్పిరిగొన్న కళ్ళతో తదేకంగా నన్ను చూస్తూ ఉండిపోయింది. మరి… నేను…సిగ్గుతో కుంచించుకుపోతున్నాను. అప్పుడే అనుకోకుండా…

          “అమ్మా….!” అంటూ నీరూ నన్ను కౌగిట్లో గట్టిగా బంధించింది.

***

డా. లతా అగ్రవాల్ – పరిచయం

26 నవంబరు 1966 న షోలాపూర్, మహారాష్ట్రలో జన్మించిన డా. లతా అగ్రవాల్ `తులజ’  ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, విద్యావేత్త. ఎన్సిఇఆర్టీ, భోపాల్ లో లెక్చరర్ గా, వైష్ణవ యూనివర్సిటీ, ఇండోర్ లో బోర్డు మెంబరుగా, భోపాల్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ అయిన మిత్తల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, భోపాల్ కి ప్రిన్సిపాల్ గా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో కౌన్సెలర్ గా సేవలందించారు.

          వీరి రచనలు ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారితమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరి పుస్తకాలు 16 విద్యకి సంబంధిం చినవి, 7 కవితాసంకలనాలు, 12 బాలసాహిత్యం, 5 కథాసంకలనాలు, 7 మినీకథా సంకలనాలు, 3 నవలలు, 4 సమీక్షాగ్రంథాలు, 20 నాటికలు, 1 ఇంటర్ వ్యూల సంకలనం ప్రచురితమయ్యాయి.

          హిందీ కల్చరల్ ఆర్గనైజేషన్, టోక్యో, జపాన్ నుంచి `కళాశ్రీ’ సన్మానం, మారిషస్ హిందీ సాహిత్య అకాడమీ నుంచి `హిందీ సాహిత్యరత్న’ సన్మానంతో సహా అంతర్జాతీయ స్థాయిలో 4 సన్మానాలు పొందారు. 2 సార్లు కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటుజాతీయ స్థాయిలో ఇంచుమించు 60 కన్నా ఎక్కువగా పురస్కారాలతో సన్మానింపబడ్డారు. ఉత్తమ సాహిత్యసృజనకు 14 రాష్ట్రాల నుంచి సత్కారం పొందారు. డా. లతా అగ్రవాల్ భోపాల్ వాస్తవ్యులు.

*****

Please follow and like us:

6 thoughts on “స్త్రీ – గాలిపటం – దారం (హిందీ: `स्त्री, पतंग और डोर’ – డా. లతా అగ్రవాల్ గారి కథ)”

    1. ధన్యవాదాలండి.

  1. ధన్యవాదాలండి.

  2. స్త్రీ గాలిపటం దారం ‘ కథ ఎంత సహజంగా బావుందో దాని అనువాదం కూడా నరసింహారావు గారు అంత సజంగా రాశారు. చాలా బావుంది.

    1. ధన్యవాదాలండి.

  3. ఇప్పటి ఆడపిల్లలు తప్పక చదవాల్సిన కథ.

Leave a Reply

Your email address will not be published.