త్యాగాల నిలయం ( కవిత)

-సుధీర్ కుమార్ తేళ్ళపురి

ప్రపంచాన్నంతా నిద్రలేపే
సూర్యుడికి కూడా
తెల్లారిందని చెప్పేది
కల్లాపిచల్లే నీ గాజుల చేతులే కదా –
 
నువ్వు లేనిదే నిముషమైనా 
గడవదని తెలిసికూడా
లేని అహాన్ని ప్రదర్శించినప్పుడు
నీ మౌనంతోనే అందరి హృదయాలను
జయిస్తావు –
 
నిషిద్దాక్షరి, దత్తపది, 
అప్రస్తుత ప్రసంగాల వంటి వాటితో చేసే
అవధానాలకే గజమాలలు
గండపెండేరాలు తొడిగితే
అత్తమామలు , ఆడపడుచులు
కన్నవాళ్ళు, కట్టుకున్నవాడు,
విరామం లేకుండా వచ్చిపోయే
సమస్త బంధుగణంతో
అనునిత్యం నువ్వు చేసే అవధానానికి
ఎన్ని గజమాలలు వేయాలో
ఇంకెన్ని గండపెండేరాలు తొడగాలో –
 
కాలాన్ని నడిపించే ఋతువులు ఆరే
అనుకుంటాం కానీ
మానవజాతి మనుగడ కోసం
కనపడకుండా నీలో దాచుకున్న
ఏడో రుతువే లేకపోతే
ఏ ఒక్కడైనా పురుడు పోసుకొని
ఈ పుడమి పై పడేవాడా –
 
దిగంతాలవైపుకు పరుగులు తీస్తూ
విజయకేతనాన్ని ఎగరేశానని విర్రవీగే
ప్రతి మగాడి విజయం వెనక
గాయాల దేహంతో 
త్యాగాల నిలయమై ఉన్నది
నిస్సందేహంగా నువ్వేనని తెలిసినా
ఏమీ ఎరుగనట్టు
ఒకచిన్న చిరునవ్వు నవ్వుతూ
వినమ్రంగా వెనకాలే ఉండిపోతావు
అలుపెరుగక నడుస్తూనే ఉంటావు
సమస్త మానవాళిని 
ముందుకు నడిపిస్తూనే ఉంటావు..!

*****

Please follow and like us:

One thought on “త్యాగాల నిలయం ( కవిత)”

  1. త్యాగాల నిలయం కవితలో అన్యాపదేశంగా స్త్రీ ఔన్నత్యాన్ని చెప్పిన తీరు బాగుంది!
    కవికి అభినందనలు. 💐👍😊

Leave a Reply

Your email address will not be published.