నేలరాలిన నక్షత్రం

-అత్తలూరి విజయలక్ష్మి

          “ మేడమ్! ఆండ్రి అసలు పేరు, ఆమె జీవితం మొత్తం మీకు తెలుసు కదా! మీరు ఆమెకి మంచి ఫ్రెండ్ అని కూడా చెబుతున్నారు చాలా మంది. ప్లీజ్ ఆమె గురించి చెప్తారా! హాలీవుడ్ పోర్న్ స్టార్ ఇక్కడ మన హైదరాబాద్ లో ఇలా అవడం వెనుక కారణం ఏంటి? “

          రాహుల్ సొల్యూషన్ సి.ఈ. వో మహిత ఛాంబర్లో ఆమె ముందు కూర్చున్న ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ధ్వని అడిగింది. మహిత మాట్లాడలేదు.

          “ప్లీజ్ మేడమ్ !  నాకు తెలిసి ఆమె స్టోరీ చాలా interesting గా ఉంది మీ ద్వారా పూర్తిగా వినాలి అనుకుంటున్నాను. ఆమె industryలో ఈ స్థాయికి రావడానికి చాలా పోరాటం చేసిందని విన్నాను…గెలిచిందని అనుకుంటున్నారా! ఓడిందని అనుకుంటు న్నారా ” మహిత సన్నగా నిట్టూర్చి అంది.

          “ఆమె గెలిచిందో, ఓడిందో, గెలిచి ఓడిందో నాకు తెలియదు. ఆమె కథ విని మీరే చెప్పాలి” అంది మహిత.

          ధ్వని ఐపాడ్ లో నోట్ చేసుకోడానికి సిద్ధంగా కూర్చుని ఉత్సుకతతో వినసాగింది.

          మహిత గంభీరంగా చెప్పడం మొదలు పెట్టింది.

          “ నటన కి తెరలు వేదికలు..  ఒకప్పుడు వెండితెర… ఇప్పుడు బుల్లితెర కూడా జత కూడింది. శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. ఎందరో భుక్తి కోసం ఈ తెరలను నమ్ముకుని బతుకుతున్నారు, కీర్తి కోసం, డబ్బు కోసం నటనని ఉపాధిగా చేసుకుని జీవిస్తున్నారు. అలాంటి  వాళ్ళను కళాకారులు అనలేము. మీడియాని జీవనోపాధిగా మలచుకుని బతుకుతున్నవారెందరో. వారంతా నటులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్.. దర్శకులు, కెమెరా మెన్ రచయితలు కేవలం ఉద్యోగులు.

          ఆండ్రి కూడా ఒక ఉద్యోగిలాగానే ఇండస్ట్రికి వెళ్ళింది.

          ఆమె అసలు పేరు ఖ్యాతి . తల్లి, తండ్రులు బిందు, పాణి… పాణి రియల్టర్… ఒక్కగానొక్క కూతురు ఖ్యాతి. అల్లారుముద్దుగా పెరిగింది. అందం, చలాకీతనంతో పాటు కొంచెం తెగువ, ధైర్యం ఉన్న అమ్మాయి. మహిత, ఖ్యాతి ఆరో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. ఇళ్ళు కూడా ఒకే అపార్ట్ మెంట్ లో ఒకే ఫ్లోర్ లో.

          మహిత తల్లి, ఎల్ ఐ సి లో, తండ్రి బ్యాంక్ లో ఉద్యోగం. మహిత, శ్రీ హిత ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికీ ఐదేళ్ళు తేడా. ఆ ఇంట్లో లక్ష్మీ, సరస్వతి గుమ్మంలో కూర్చున్నట్టు ఉండేది. ఇద్దరూ చదువులో, సంగీతంలో కూడా రాణిస్తూ , సంప్రదాయాలకు ఆధునిక నగిషీలు చెక్కుతూ, అన్నిట్లో ముందంజ వేస్తూ కూడా, ఒద్దికగా, పొందికగా ఉండేవారు.  శ్రీ హిత పెద్దది. బి. టెక్ అవగానే మంచి సంబంధం చూసి ఆమెకి పెళ్ళి చేశారు. అక్క అత్తగారింటికి వెళ్ళాక మహితకి ఖ్యాతి సన్నిహితంగా వచ్చింది.

          ఖ్యాతికి చిన్నప్పటి నుంచి అలంకరణాల పట్ల, అందం పట్ల మోజు ఎక్కువ. సినిమాలు, సినిమా తారలు అంటే పిచ్చి. రిలీజ్ అయిన ప్రతి సినిమాకి తీసుకుని వెళ్ళమని తల్లి, తండ్రులని పోరు పెట్టేది. వాళ్ళకి కుదరకపోతే ఒక్కతే వెళ్ళిపోయేది. మహిత ఆ విషయంలో ఆమెకి దూరంగానే ఉండేది. బిందు, పాణిలకు కూతురు సినిమా వ్యామోహంలో చదువు నిర్లక్ష్యం చేయడం నచ్చలేదు. మహిత అంటే మంచి అభిప్రాయం. ఎలాగైనా మహితలా ఖ్యాతి కూడా బుద్ధిగా ఉండాలి అని వాళ్ళ ఆశ. అందుకు ఏంచేయాలో వాళ్ళకి తెలిసేది కాదు. మహితతో స్నేహం ఖ్యాతిని మంచి మార్గంలో నడిపిస్తుందేమోనన్న ఆశతో  మహితని వాళ్ళు బాగా చేరదీసారు.

          ఖ్యాతిది అదృష్టమో, దూరదృష్టమో ఆమె చేసిన ప్రయత్నాల ఫలమో గ్లామర్ ప్రపంచం పట్ల వ్యామోహంతో ఉన్న ఆమెకి అనుకోకుండా చిన్న రెడీమేడ్ షాప్ కి మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఉపయోగించుకోడానికి ఇంట్లో చిన్న యుద్ధం జరిగింది కానీ ఖ్యాతి లెక్క చేయలేదు. తను కోరుకున్న మార్గం అనుసరించింది. ఆ తరవాత మరికొన్ని మోడలింగ్ అవకాశాలు రావడంతో చదువు మానేసింది.

          ఒక జ్యూయలరీ షాప్ కి మోడలింగ్ చేసినప్పుడు సినిమాల్లో అవకాశం వచ్చింది. ఇంట్లో వాళ్ళు వద్దు అన్నా వినకుండా ఆ అవకాశం ఉపయోగించుకుంది. సెకండ్ హీరోయిన్ గా చేసిన ఖ్యాతి అందం చూసి భయపడిన సుప్రియ ఆమె ఉంటే తన కాల్షీట్ కాన్సెల్ చేసుకుంటానని బెదిరించడంతో అప్పటికే మంచి హీరోయిన్ గా పేరు సంపా దించుకున్న సుప్రియని వదులుకోడం ఇష్టంలేని నిర్మాత ఖ్యాతితో తీసిన షాట్స్ అన్నీ తీసేసి, ఎక్కడో ఒక గ్రూప్ డాన్స్ లో చూపించడంతో ఆ అవమానం భరించలేని ఖ్యాతి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. 

          కూతురి ప్రవర్తనకి విసిగిపోయిన తల్లి ఆమెకి మంచి సంబంధం చూసి బలవంతంగా పెళ్ళి జరిపించింది.

          ఆకాష్ ఉన్నతమైన సంస్కారం ఉన్నవాడు. భార్య  మీడియా అంటే సరదా పడు తోంది అని ఆమెని ప్రోత్సహించాడు. తనకు తెలిసిన కొందరు నిర్మాతలకి చెప్పి మంచి అవకాశాలు ఇప్పించాడు. కథానాయికగా ఐదారు సినిమా లు చేసింది. అన్నీ కమర్షియల్ గా విజయం సాధించినా ఆమెకి నటిగా ప్రతిభ చూపించుకునే అవకాశం రాలేదు. ఆమె నిరాశపడలేదు. ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈలోగా బాబు పుట్టాడు. వాడికి మూడోనెల వచ్చాక హటాత్తుగా మాయమై పోయింది ఖ్యాతి.

          వ్యామోహం అనేది దీర్ఘకాల వ్యాధి లాంటిది.. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు సాగే ఆ ప్రయాణంలో ఎన్నో ప్రలోభాలు, ఆకర్షణలు, ఆశలు, కోరికలు వ్యాధిని తగ్గించక పోగా మరింత ముదిరిపోడానికి ఆ వ్యామోహమే కారణం అవుతుంది. అదే వ్యామోహం వైకుంఠపాళి ఆటలోలా నిచ్చెనలు ఎక్కిస్తుంది.. పాము నోట్లో పడేసి కిందకు దిగజాఋ స్తుంది.

          అల్లుడు ఫోన్ చేసి ఖ్యాతి అదృశ్యం గురించి చెప్పగానే  ఖ్యాతి తల్లి వెక్కి, వెక్కి గుండెలు పగిలేలా ఏడ్చింది.

          “లక్షణమైన సంసారం వదులుకుని వెళ్ళింది. ఏం చేస్తోందో! ఎక్కడుందో!” అంది  ఆవేదనగా. ఆమెని మహిత ఓదార్చింది. “ ఇప్పుడు మీడియా అనేది ఇదివరకటిలా లేదు. ఆర్టిస్ట్ గానో, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గానో, టెక్నికల్ గానో ఏదో విధంగా మీడియాలో సెటిల్ అవుతున్నారు యూత్… అది కూడా ఒక ఉద్యోగం అంతే… కాకపోతే క్లిక్ అవ్వాలి… ఒకసారి క్లిక్ అయితే డబ్బు వర్షంలా కురుస్తుంది. మీరేం వర్రీ అవకండి. హిందీ సీరియల్స్ మీరు చూడరు కదా ఎక్కడో ఒక దానిలో సెటిల్ అయి ఉంటుంది. “

          అలా వెళ్ళిపోయిన ఖ్యాతి కొంతకాలం తరవాత, ఒకరోజు మహితకి ఫోన్ చేసి అర్జెంట్ గా దస్ పలాకి రా అనడంతో మహితకి వెళ్ళక తప్పలేదు.. రిసెప్షన్ లోనే ఎదురు వచ్చింది ఖ్యాతి. గోధుమ రంగు మెరుపు డ్రస్, దట్టంగా మేకప్లో మెరిసిపోతోంది.

          “ ఒక హెర్బల్ ప్రోడక్ట్స్ కి మోడలింగ్ చేస్తున్నాను. చాలా పెద్ద ప్రాడక్ట్ ఇక్కడ కాదు ముంబైలో.. రాత్రికే ఫ్లయిట్… నీకు ట్రీట్ ఇద్దామని రమ్మన్నా “అంది మహితని కౌగలించుకుని ఆనందం వెలిబుచ్చుతూ.

          “నిజం! కంగ్రాచులేషన్స్ .. కానీ ఎలా? హౌ డిడ్ యు గెట్ “ ఆశ్చర్యంగా అడిగింది మహిత.

          వయ్యారంగా వెనక్కి తిరిగి కొంచెం ఎడంగా నిలబడిన కాఫీ రంగు సూట్ వాలాను “ శశాంక్ “ అని పిలిచింది. అతను వస్తూనే మహితను “హాయ్ “ అంటూ పలకరించాడు.

          “ హి ఈజ్ శశాంక్.. హి ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రోడక్ట్స్..” అతని కుడిచేయి తన ఎడమ చేత్తో పెనవేసి గర్వంగా చెప్పింది. 

          ఎవరితను? ఖ్యాతికి ఎలా పరిచయం? మహితకి అర్థం కాలేదు. ఆమె ఆలోచనలు చెదరగొడుతూ “ కమాన్! “ అంటూ ఆమె చేయి పట్టుకుని టేబుల్ దగ్గరకు లాక్కుని వెళ్ళింది ఖ్యాతి. అక్కడికీ వీలు చూసుకుని రహస్యంగా అడిగింది “ మీ ఆయనకి తెలుసా”

          “ చెప్పాను..“ అంది నిర్లక్ష్యంగా.

          “చెప్పడం కాదు… ఒప్పుకున్నాడా !”

          గట్టిగా నవ్వి “ నేను పర్మిషన్ అడగలేదు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను” అంది.

          “మరి బాబు?” అడిగింది.

          “తను చూసుకుంటాడు. నేనే చూడాలని లేదుగా” అంది.

          మహితకి మతిపోయింది. భర్త ఎంత మంచివాడు. ఎంత మంచి లైఫ్! ఎలా వదులు కుంటోంది? ఎన్నో ఆలోచనలు…

          ఆమె ఆలోచనలు చెదరగొడుతూ అంది ఖ్యాతి. “ బై ద బై మహీ! నా ఈ కొత్త జీవితంలో నా పేరు కూడా కొత్తగా పెట్టుకున్నాను. నా పేరు ఆండ్రీ” నవ్వింది.

          అంటే! నువ్వు… మహిత ప్రశ్న ఆమె నోటి నుంచి బయటకి వచ్చేలోపలే శశాంక్ తో చెట్టాపట్టాలేసుకొని ఖ్యాతి ముంబై వెళ్ళిపోయింది.

          మహిత ఖ్యాతి గురించి ఆలోచించడం మానేసి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. పి జి చేసి మంచి ఉద్యోగంలో చేరింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్  జయంత్ తో పెళ్ళిఅయింది.

          మరికొంత కాలం గడిచింది.  మహితకి ఉద్యోగంలో మంచి హైక్ వచ్చింది. గచ్చీబౌలిలో స్వంత ఫ్లాట్ కొనుక్కుంది. ఒక బాబు పుట్టాడు. ఆమె జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా, హుందాగా సాగిపోతోంది. 

          ఖ్యాతి బాలివుడ్ సినిమాల్లో సైడ్ రోల్స్ లో కనిపిస్తోందని, కొందరి ద్వారా తెలుస్తోంది కానీ మహిత పట్టించుకోలేదు. ఆమె తల్లి, తండ్రులు కూతురి మీద మమకారంతో ఖ్యాతిని ఆదరించారని, అప్పుడప్పుడు వచ్చి వెళ్తోందని తన తల్లి ద్వారా తెలిసింది మహితకి.

          ఆకాష్ యు.ఎస్ వెళ్ళిపోయాడు బాబుని తీసుకుని.

          కాకపోతే ఇంతవరకు లీడ్ రోల్స్ లో మాత్రం కనిపించలేదని తెలిసింది. మహితకి ఖ్యాతి మీద అభిమానం కానీ, ఆసక్తి గానీ లేవు, తన కెరియర్, తన సంసారం, బాబు పెంపకం ఇదే ఆమె లోకం.

          ఏదెలా ఉన్నా కాలం మాత్రం పాదరసంలా జారిపోతూనే ఉంటుంది.

          అనూహ్యంగా ఒకరోజు రాత్రి ఖ్యాతి మహిత ఇంటికి వచ్చింది. సరిగ్గా పదకొండు న్నరకి ఆఖరి మెయిల్ ఇచ్చి లాప్ టాప్ పక్కన పెట్టి పడుకోబోతుండగా కాలింగ్ బెల్ మోగింది.

          ఆ రోజే జయంత్ బెంగుళూరు వెళ్ళాడు ఆఫీసు పని మీద. బాబు నిద్రపోతున్నాడు.

          ఆ సమయంలో సాధారణంగా ఎవరూ రారు. అలాంటిది ఎవరొచ్చారు అని ఆశ్చర్యంతో తలుపు తీసేసరికి సుడిగాలిలా దూసుకుని వచ్చింది ఖ్యాతి. వస్తూనే తలుపులు మూసి “మహీ! ఇదిగో నా నగలు, ఈ పాస్ బుక్స్ మా పేరెంట్స్ కి అందచేయి. నాకు వాళ్ళతో రుణం తీరిపోయింది అని చెప్పు. ఇంక నేను కనిపించనని, ఈ ప్రపంచం అనే డయాస్ మీద నా పాత్ర ముగిసింది అని చెప్పు.. నీకు కూడా బై. ఇదే నా లాస్ట్ హగ్ ”  తన భుజం మీద ఉన్న బ్యాగ్ మంచం మీద పడేసి మహితని గట్టిగా కౌగలించుకుంది ఖ్యాతి ఏడుస్తూ.

          “ డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి కానీ, ఇంతకీ ఏమైంది? ఇండస్ట్రి వైరాగ్యమా! “ పరిహాసంగా అడిగింది మహిత.

          “ దేని మీద వైరాగ్యం లేదు. జీవితం మీదే విరక్తిగా ఉంది…  బతకాలని లేదు… చచ్చిపోతాను.” గబుక్కున గుప్పిట్లో ఉన్న చిన్న సీసా ఓపెన్ చేసి, గొంతులో వేసు కుంటూ ఉండగా “ నీకేం పిచ్చా “ అంటూ ఆ చేతి మీద విసిరి కొట్టింది మహిత.

          మహితని దూరం తోసి, ఒంగి కిందపడిన మాత్రలన్నీ ఏరి నోట్లో వేసుకోబోతున్న ఖ్యాతి చెంప మీద చెళ్ళున కొట్టి “ ఏంటి? నీ టాలెంట్ నా దగ్గర ప్రదర్శించడానికి వచ్చావా ! తమాషాగా ఉందా ! చావాలనుకుంటే ఏ హుస్సేన్ సాగర్ లోనో, హిమాయత సాగర్ లోనో దూకి చావకపోయావా.. . నా ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటే నేను వెళ్ళి జైల్లో కూర్చోనా!” మహిత మండిపడింది.

          ఖ్యాతి ఉన్నట్టుండి కింద కూలబడి వెక్కి, వెక్కి ఏడవటం మొదలుపెట్టింది.

          ఆ ఏడుపు చూసి మహిత ఆవేశం చల్లారిపోయింది. “ ఏమైంది ఎందుకేడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఆత్మహత్య చేసుకోవాలన్నంత కష్టం నీకేం వచ్చింది? నువ్వు కోరుకున్నట్టే బతుకుతున్నావు గా ” ఊరడిస్తూ అడిగింది.

          వెక్కుతూ ఖ్యాతి చెప్పిన విషయం విన్న మహిత విస్మయంతో రెప్పవేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయింది. విషయం ఏమిటంటే ఖ్యాతికి ఆమె పేరెంట్స్  మళ్ళీ  సంబంధం చూసి పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారు. అతను అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట.. “ఇప్పటి వరకు నీకు నచ్చినట్టు బతికావు.. మేము నిన్నేమి అనలేదు.. ఇప్పుడు నువ్వు అనుకున్నంత సక్సెస్ అవలేదు కాబట్టి మా మాట విని పెళ్ళి చేసుకో” అన్నారుట.

          “ఇప్పుడు చెప్పు నేను బతికి ఉండి ఏం చేయాలి?” అడిగింది ఖ్యాతి ఎర్రబడిన కళ్ళు విశాలం చేసి చూస్తూ.

          మహితకి మతి పోయింది. ఆమె పేరెంట్స్ తప్పా .. ఆమె తప్పా అర్థం కాలేదు. పిల్లలని మొదటి నుంచీ క్రమశిక్షణతో పెంచాలి. వాళ్ళు అలా పెంచలేదు. ఒక్కతే కూతురని అల్లారుముద్దుగా పెంచారు. అది వాళ్ళ తప్పు కాదు.. మమకారం అనేది పెద్దవాళ్ళని విచక్షణ మర్చిపోయేలా చేస్తుందేమో ! లేక కూతురు మరీ ఇంత విచ్చల విడిగా, విశృంఖలంగా మారుతుందని ఊహించలేదో!

          జరగాల్సింది జరిగిపోయింది. ఖ్యాతి వ్యామోహాలకు ఒక యువకుడు జీవితంలో అమూల్యమైన అనుభూతులు కోల్పోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకడిని బలి ఇవ్వాలను కోడం వాళ్ళ మూర్ఖత్వమా! అమాయకత్వమా! పైగా అవకాశాల కోసం ఆమె కొందరి వలలో పడి, మోసపోయిందన్న విషయం అందరికీ తెలుసు. మరి వాళ్ళకు తెలియదనుకోవాలా ! 

          “ ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా! సరిగ్గా కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు మానమని చెప్పడం ఏంటి? పైగా వాళ్ళని కాదని వెళితే మళ్ళీ ఇంటికి రానివ్వరుట. నువ్వు చెప్పు నాకు వేరే మార్గం ఉందా!”

          మహిత మాట్లాడలేదు. రెప్పవేయకుండా ఖ్యాతి మొహంలోకి నిశితంగా చూసింది. “ నువ్వు మీ అమ్మా, నాన్నని కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మొదటి రోజే నీకీ ఆలోచన ఉంటే బాగుండేది. వాళ్ళు మంచివాళ్ళు, నీ శ్రేయస్సు కోరేవాళ్ళు కాబట్టి, నిన్ను క్షమించి ఇంటికి రానిస్తున్నారు. అయినా, నీ జీవితం నీకుందిగా … వాళ్ళు రానివ్వకపోతే ఏమైంది” అంది.

          ఖ్యాతి రెండు చేతుల్లో మొహం దాచుకుని బావురుమని ఏడవసాగింది. మహితకి ముందు జాలేసినా ఖ్యాతి తెలివితక్కువ ఆలోచనకి చిరాకు వేసింది. తన చిరాకు పైకి వ్యక్తం చేయకుండా అంది “ ఖ్యాతీ ! నీలాంటి అమ్మాయిల కథ ఈ నాటి కథ కాదు.. తర, తరాలుగా ఈ కథ పునరావృతం అవుతూనే ఉంది. ఇది నిజానికి కథ కూడా కాదు. ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అమ్మాయిలు ఎన్ని రకాల కథలు విన్నా, సినిమా పిచ్చితో ఎందరివో జీవితాలు అసంపూర్తిగా ముగిసినా ఇంకా, ఇంకా ఇదే పిచ్చి ఉంటుంది?  భేతాళ కథల్లోలాగా ఒక సమాధానం చెబితే మరో ప్రశ్న రైస్ అవుతూ ఉంటుంది. నువ్వు మర్చిపోయావేమో! నీ మొదటి సినిమా అనుభవం. ఇన్నేళ్ళ ప్రస్థానంలో అటు బుల్లితెర మీద కానీ, ఇటు వెండితెర మీద కానీ కలకాలం ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్ర ఒక్కటన్నా వేశావా!”

          “నీకేం తెలుసు నేనెంత షైన్ అయానో ! ముంబైలో ఖ్యాతి అంటే ఎంత పేరు ఉందో ఒకసారి రా చూపిస్తా..” రోషంగా అంది.

          “మరేందుకు మళ్ళీ తెలుగు ఇండస్ట్రి వైపు వచ్చావు. “

          “చెప్పాగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో ఛాన్స్ వచ్చింది. నీకు తెలియదు మహీ! ఇప్పుడు మీడియాకి ఉన్న విలువ, పవర్… ఈ రోజుల్లో నువ్వెలా బతికావు, ఎలా బతుకుతున్నావు అని ఎవరూ ఆలోచించడం లేదు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలేది గ్లామర్… నువ్వు ఎలా సంపాదించావు అని ఎవరూ అడగరు… నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అని చూస్తారు. నీకున్న పేరు, ప్రఖ్యాతులు చూసి నీతో ఒక్కసారి మాట్లాడాలి అని, ఒక్కసారి నిన్ను చూడాలి అని తహతహలాడతారు. ఆ కీర్తి ఎలా సంపాదించావు అని ఎవరన్నా అడుగుతున్నారా ! సెలెబ్రిటి అంతే… వాళ్ళు ఎలా సెలెబ్రిటి అయారు ఎవరికి కావాలి? ఒక పెళ్ళికి, ఒక షో రూమ్ ఓపెనింగ్ కి ఆఖరికి ఒక పుస్తకావిష్కరణ కూడా సెలెబ్రిటి కావాలి. ఆ స్థాయికి నేను చాలా కొంచెం దూరంలో ఉన్నాను. మధ్యలో పెళ్ళి, పరువు అంటూ అమ్మ, నాన్నా నా దారి మార్చాలి అనుకోడం ఫూలిష్ నెస్ కాదా!”

          మహితకి ఒళ్ళుమండిపోయింది. తమాయించుకుంటూ అంది. ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి భర్త, పిల్లలు , తనదంటూ ఒక జీవితం అక్కరలేదా!”

          “అదంతా ఆలోచించే టైం నాకు లేదు. నేను శ్రీదేవి అంతటి గొప్ప నటి కావాలి. అంతే! నిజానికి ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో నా అంత అందమైన వాళ్ళని ఒక్కళ్ళని చూపించు. బండ ముక్కు ఒకళ్ళకి, బండ పెదాలు ఒకళ్ళకి, అస్తిపంజారానికి చర్మం అతికించినట్టు ఉన్నవాళ్ళు ఒకళ్ళు. చెప్పవే.. నా ఫిగర్ చూడు… ఈ ఫిగర్ ఎవరికి ఉంది? ఏం నేనెందుకు హీరోయిన్ గా పనికిరాను. ఖచ్చితంగా పనికొస్తా. అమ్మా,నాన్నల అబ్జెక్షన్  చాలా సిల్లి. మీ అమ్మాయి ఏం చేస్తుంది అని ఎవరన్నా అడిగితే సినిమాల్లో చేస్తుంది అని చెప్పడానికి తల కొట్టేసినట్టు ఉంటోందిట. ఎంత మంది మంచి కుటుంబాల నుంచి ఇండస్ట్రి కి రాలేదు ! లేదులే నా వల్ల కాదు.. దీనికి రెండే సొల్యూషన్స్. ఒకటి నేను ఆత్మహత్య చేసుకోడం, రెండు “ ఆగింది ఖ్యాతి. “

          మహిత అనుమానంగా చూసింది… ఖ్యాతి చెక్ బుక్, జ్యులరి బాగ్ తీసుకుని  “  జీవితంలో ఇంకెపుడూ కనిపించకుండా పారిపోడం “ అని చెప్పి వేగంగా వెళ్ళిపోయింది.

          మహిత నిర్ఘాంతపోయింది. అసలు తను ఇక్కడ ఉంటున్నట్టు ఖ్యాతికి ఎలా తెలిసింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వెళ్ళింది? ఆమె బుర్ర తిరిగిపోయింది.

          మరునాడు తెల్లవారిసరికి ఖ్యాతి తల్లి నుంచి ఫోన్ “ మహీ!  ఖ్యాతి వెళ్ళిపోయింది.. ఇంకెప్పుడూ కనిపించను. కనిపిస్తే వెండి తెర మీద లేదా బుల్లి తెర మీద చూడాల్సిందే నన్ను అని ఉత్తరం రాసి, తన జూవలరీ మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది.”

          మహిత నిశ్చేష్టురాలు అయింది.

          కొంతకాలం గడిచాక తిరిగి ఖ్యాతి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఖ్యాతికి ఎందుకో  దస్ పలా అంటే ఇష్టం. ఆమె ఫేవరిట్  ప్లేస్. మహితని అక్కడికే రమ్మంది. “శుభవార్త చెబుతా త్వరగా రా” అంది.

          ఆమె వెళ్ళే సరికి ఖరీదైన సూట్ లో ముప్ఫై ఏళ్ళ యువకుడితో కూర్చుని వైన్ తాగుతోంది. తొడల వరకే ఉన్న బంగారు రంగు పొట్టి గౌను.. గుండెల దగ్గర ముప్పావు భాగం నగ్నంగా .. చాలా సన్నిహితంగా దాదాపు అతని ఒడిలో కూర్చున్న ఖ్యాతిని చూడగానే మహిత ఒళ్ళంతా జలదరించింది. ఈమె తన స్నేహితురాలు ఖ్యాతేనా! పొరపాటున ఎవరన్నా హాలీవుడ్ స్టార్ రూమ్ కి రాలేదు కదా అనిపించింది. మహితని చూడగానే ఖ్యాతి అతని ఒళ్ళో నుంచి లేచి వచ్చి ఆమెని హగ్ చేసుకుని చెంప మీద ముద్దు పెట్టుకుని “ మై డియర్ మహీ! ఐ లవ్ యు” అంటూ సోఫా దగ్గరకు తీసుకుని వెళ్ళి అతనికి , తనకి మధ్యలో కూర్చోబెట్టింది.

          “ హి ఈజ్ అలోక్ .. మై హెవెన్ “ అంది. అలోక్ హాయ్ అంటూ మహితని హగ్ చేసుకున్నాడు.

          చీదరగా అనిపించింది మహితకి. నాగరికత అని మురిసిపోతూ అనాగరికంగా జీవించే వాళ్ళని చూస్తుంటే ఆదిమానవుడికి, ఆధునిక మానవుడికి పెద్ద తేడా లేదేమో అనిపించింది.

          సున్నితంగా వాళ్ళని విడిపించుకుని “అక్కడ కూర్చుంటాలే” అంది మరో సోఫా వైపు చూసి.

          “ఓ కె ఓ కె మీరు మాట్లాడుకోండి నేను రెస్ట్ తీసుకుంటా” అంటూ అలోక్ బెడ్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు.

          “వైన్”  అంది మహిత వైపు చూసి ఖ్యాతి. “ నో..” అంది మహిత.

          “పోనీ జ్యూస్ తాగు” అంటూ ఆరెంజ్ జ్యూస్ బాటిల్ ఆమె ముందుకి జరిపింది. మహిత ఖాళీ గాజు గ్లాస్ లో కొంచెం జ్యూస్ పోసుకుని “చెప్పు ఏంటో శుభవార్త అన్నావు..” అంది.

          సోఫాలో వెనక్కి వాలి సిగరెట్ కాలుస్తున్న ఖ్యాతి కొంచెం ఒంగి తన వైన్ గ్లాస్ మహిత గ్లాస్ కి సున్నితంగా తాకించి  “చీర్స్ “ అంది. ఆఖరి పొగ పీల్చి సిగరెట్ యాష్ ట్రేలో పడేసి కాళ్ళు కింద పెట్టి సరిగా కూర్చుంటూ “ ఇంకా కాసేపట్లో అగ్రీమెంట్ సైనింగ్..”

          “ దేనికి అగ్రీమెంట్ “

          “నా జీవితంలో ట్రెమెండస్ మార్పు రాబోతోంది. బహుశా నిన్ను కలవడం ఇదే ఆఖరిసారి. చాలా దూరం వెళ్ళిపోతున్నాను.”

          “ఎక్కడికి” అనుమానంగా చూసింది మహిత.

          “వింటే షాక్ అవవు కదా” .. గలగలా నవ్వింది ఖ్యాతి.

          ఆ కదలికకి ఊగుతున్న ఆమె రొమ్ములు అసహ్యంగా అనిపించాయి. చూపులు తిప్పుకుంది మహిత.

          “నాకు హాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. అలోక్ ద్వారా.. రేపే వెళ్ళిపోతున్నాను.”

          “హాలీవుడా!” నిజంగానే షాక్ తగిలింది మహితకి.

          “అవునే. ఈ టాలీవుడ్ , బాలీవుడ్ లో నా కలలు నెరవేరుతాయి అనే ఆశ లేదు.  హీరోయిన్ అంటే కేవలం షో కేసులో బొమ్మ. నా టాలెంట్ ప్రూవ్ చేయడానికి సరైన పాత్రలు ఒక్కటన్నా వచ్చాయా! హిందీలో తాప్సీ, ప్రియాంక చోప్రా వీళ్ళ లాగా విమెన్ ఓరియెంటెడ్ మూవీలో యాక్ట్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేదే నా లక్ష్యం. కానీ ఇక్కడ ఆ అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు. expose ,expose.ఒకప్పటిలాగా దశాబ్దాల తరబడి హీరోయిన్ గా కొనసాగే రోజులు కావివి. నేను అర్ధనగ్నంగా నటిస్తే, ముప్పావు నగ్నంగా నటించే వాళ్ళు వస్తారు. మనం తరచూ మార్చే బ్రాండెడ్ cosmetics, డ్రస్స్ లాంటి వాళ్ళే ఆర్టిస్టులు కూడా.  కొత్త బ్రాండ్ వస్తే పాతది ట్రాష్ లో వేస్తాము కదా!  పూర్తి నగ్నంగా నటించే అమ్మాయి వస్తే ముప్పావు అమ్మాయి పాతబడుతుంది.. ఈ నయాజమానాలో నగ్నత్వమే టాలెంట్ . చూపించడమే నటన అయితే అదేదో ఇంటర్నేషనల్ లెవెల్ లో చేస్తే ఆకాశం అంచులు చూస్తాను.. ఎస్ ! నేను ఆకాశాన్ని చేరతాను … డబ్బు… కీర్తి ఓహ్ ” తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది ఖ్యాతి.

          మహిత ఆశ్చర్యంగా చూస్తూ  “ఇంక ఆకాష్ ని పూర్తిగా వదిలేసినట్టేనా!” అనడిగింది.

          “ మహీ ! నేను ప్రవహించే నదిని. నాకు ఆనకట్ట ఎవరూ వేయలేరు.. పెద్దవాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. ఈ యవ్వనం జారిపోయాక నాకు అవకాశాలు వస్తాయా! ఆకాష్ తోటే ఉండి ఉంటే మరో పిల్లకో , పిల్లవాడికో జన్మనిచ్చి వాళ్ళ ఉచ్చలు, పీతులు తీసుకుంటూ ముప్ఫై ఏళ్ళకే బలవంతపు వార్ధక్యం నేను మోయాల్సి వచ్చేది. తనని, ఆ గుప్పెడు గూటిని వదిలేసినందుకు చూసావుగా ఎంత ఎదిగానో ! ఇంకా – ఇంకా మేఘాల మీద తేలాలి. ఇంద్రలోకం చేరాలి. అదే నా గమ్యం “ ట్రాన్స్ లో ఉన్నట్టు చెబుతున్న ఖ్యాతి  వైపు విస్మయంగా చూసింది.

          పైకి వెళ్ళాక కానీ కింద ఏముందో తెలియదు కదా! అనుకుంటూ  “ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్.. మీ పేరెంట్స్ గురించి ఏమన్నా తెలిసిందా !” అడిగింది మహిత.

          “ హు నేను వాళ్ళకి అవసరంలేనప్పుడు నాకు మాత్రం వాళ్ళ అవసరం ఏముంది? నాకు ఎవరూ వద్దు.. నా కెరియర్ నా ఎదుగుదల అంతే. “

          మహితకి ఆమెని అభినందించాలో అసహ్యించుకోవాలో అర్థం కాలేదు. ఇంక అక్కడ ఒక క్షణం కూడా ఉండాలని అనిపించలేదు. “ అరె పార్టీ ఇస్తాను ఉండు” అని ఖ్యాతి వారిస్తున్నా గబుక్కున లేచి “ ఒకే  నేను వెళ్తున్నాను.. ఎంజాయ్ విత్ యువర్ వే ” అంటూ వెళ్ళిపోయింది.

          ధ్వని ఇంకా ఆమె ఏం చెబుతుందా అన్నట్టు ఉద్వేగంగా చూడసాగింది. సరిగ్గా నెలరోజుల క్రితం అంటూ ఆగింది మహిత..

          “వాటర్ తాగుతారా” ధ్వని టీపాయ్ మీద ఉన్న వాటర్ బాటిల్ అందించింది. నవ్వి బాటిల్ తీసుకుని తిరిగి చెప్పసాగింది.

          “ఇంకా లాక్ డౌన్  ప్రభావం నుంచి బయటపడలేదు ప్రజలు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇళ్ళ నుంచే పనులు చేస్తున్నారు. జయంత్, మహిత చెరో లాప్ టాప్ పెట్టుకుని సోఫాలో చెరో పక్క కూర్చున్నారు. బాబు ఆన్లైన్ క్లాసులు అటండ్ అవుతున్నాడు. హటాత్తుగా మొబైలు మోగింది. మహిత పని ఆపి ఆన్సర్ బటన్ నొక్కింది.

          “హలో! ఖ్యాతి హియర్ “ ఉలిక్కిపడింది మహిత. ఆమె చేతిలో నుంచి జారి పడబోయిన మొబైలు గట్టిగా పట్టుకుంది.

          “ఖ్యాతీ ! నువ్వేనా! ఎక్కడి నుంచి! ఎలా ఉన్నావు?” లోలోపలి నుంచి దూసుకుని కెరటంలా విరుచుకుపడుతున్నఉద్వేగంతో అడిగింది.

          “ వెంటనే దస్ పలా కి వస్తావా ! నీతో అర్జెంట్ గా మాట్లాడాలి..”

          “ ఏయ్ ఏంటే హడావుడి..ఇంతకీ ఎప్పుడు వచ్చావు? “

          “ చెప్తాలే వస్తావుగా ! ఎదురుచూస్తుంటా “

          “ఇది ఖ్యాతి స్వరమేనా ! ఎప్పుడూ ఏవో కలలతో ఉత్సాహంగా, పైపైకి ఎగరడానికి ఉవ్విళ్లూరుతూ, ఆదేశిస్తున్నట్టు confident తో ఉండే ఆ స్వరంలో ఇంత అభ్యర్ధనా!

          “ ష్యూర్  వస్తాను. సి.ఈ. వో తో మీటింగ్ ఉంది… అవగానే వస్తాను. నీ రూమ్ నెంబర్ చెప్పు..”.  

          ఖ్యాతి చెప్పింది. “ఒకే వస్తాను… ఎలా ఉన్నావు?” అడిగింది మహిత.

          కొన్ని క్షణాలు నిశ్శబ్దం… ఆ నిశ్శబ్దం విస్ఫోటించినట్టు వినిపించింది ఆమె స్వరం. “ వస్తావుగా చూద్దువుగాని.. బై ది బై థాంక్స్ ఫర్ సేవింగ్ మై నెంబర్. “ ఫోన్ ఆఫ్ అయింది. అయోమయంగా ఫోన్ వైపే చూస్తున్న ఆమె వైపు పక్కనే కూర్చుని పని చేసుకుంటున్న జయంత్ తలెత్తి చూస్తూ అడిగాడు “ఎవరూ ఫోన్ !”. చెప్పింది మహిత.

          “ వాట్? హాలీవుడ్ సెలెబ్రిటి హైదరాబాద్ దస్పలాలోనా !” అదిరిపడినట్టు చూశాడు.

          మహితకి కూడా అదే అనిపించింది… మహితకి ఆఫీసు పనిమీద ఏకాగ్రత కుదరలేదు.

          సాయంత్రం అయిదు అయింది మీటింగ్ అయేసరికి … గబ,గబా రెఢీ అయి జయంత్ కి చెప్పి కారు తీసుకుని దస్ పలా బయలుదేరింది.

          ఎన్నో ఊహించుకుని వెళ్ళిన ఆమెకి అక్కడ కనిపించినది వేరు. రిసెప్షన్ లోనే ఆపేసి ఒక కవర్ ఇచ్చారు ఎవరో. ఆమె లేదని రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్పారు. మహితకి అయోమయంగా అనిపించింది. ఫోన్ చేసి మూడు గంటలు కూడా కాలేదు. ఇంతలొకే ఏమైంది. ఆలోచిస్తూనే వెనక్కి తిరిగింది. కారులో కూర్చుని కవర్ ఓపెన్ చేసిన మహితకి ప్రపంచం మొత్తం గిర్రున తిరిగిపోతున్నట్టు అనిపించింది.

          ” మహీ! వెంటనే వస్తావేమో ఆఖరిసారి నిన్ను చూడాలి అనుకున్నాను. ఇప్పటికే నా ప్రయాణానికి బాగా ఆలస్యం అయిందే. నీకు తెలుసుగా నాకు సహనం లేదు. ఎవరి కోసం, దేని కోసం ఆగను. ప్రవహించే నదిని కదా! అందుకే ఇవి రిసెప్షన్ లో ఇచ్చి వెళ్తున్నాను. నా ఆస్తి మొత్తం నా కొడుక్కి రాశాను. వీలైతే ఇవి ఆకాష్ కి అందచేయి. క్షమించమని అడగను అని చెప్పు. ఎందుకంటే అతనికి నేను చేసినది అన్యాయం కాదు.. ద్రోహం. మహీ! కోరుకున్నట్టే ఆకాశంలోకి ఎగిరాను. హీరోయిన్ గా కాదు.. నువ్వు అర్థం చేసుకోగలవు హాలీవుడ్ లో నా స్థానం. ఇంతకన్నా చెప్పలేను. మేఘాల అవతల ఏముందో అని అన్వేషిస్తూ ఇంకా, ఇంకా పై పైకి వెళ్తూ ఎయిర్ హోస్టెస్ ని అడిగాను.. ఇక్కడ  నాకు ఏమీ  కనిపించడం లేదేంటి అని.. నవ్వి “మీకు కావాల్సినవి కిందకు దిగాక మాత్రమే కనిపిస్తాయి.. పైన అంతా శూన్యం” అంది. ఇంక ఏమి చెప్పను ! ఉంటాను నీ ఖ్యాతి. 

          పేపర్స్ టేబల్ మీద పెట్టి రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి, వెక్కి ఏడుస్తు న్న మహిత వైపు సానుభూతిగా చూసింది ధన్య.

          “ అంత ఎత్తుకి ఎగిరి ఇలా పడిపోతుందని ఊహించలేదు నేను. పుట్టింది ఎక్కడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన దగ్గర నుంచీ అదే ఇంట్లో పెరిగింది. అక్కడే  తల్లి, తండ్రులతో యుద్ధం చేసింది, అనేక దారులు తొక్కి, తొక్కి తిరిగి వస్తూ చివరికి ఆ ఇంట్లో శవం అయింది. ఆ ఇల్లు వాళ్ళు అమ్మకుండా, అద్దెకి ఇవ్వకుండా కూతురు కోసమే అలా ఖాళీగా ఉంచారు కాబోలు. “ గాద్గదికంగా అంటున్న మహిత చేయి మీద ఓదార్పుగా చేయి వేసి హామీ ఇస్తున్నట్టు ఆవేశంగా అంది ధ్వని.

          “మేడమ్! నేను ఈ కథ రాస్తాను. తప్పకుండా రాస్తాను. ఖ్యాతి లాంటి అమ్మాయిలకి కనువిప్పు కలిగేలా రాస్తాను” .

          మహిత తెరలు, తెరలుగా నవ్వింది..”  అమ్మాయిలకి కాదు తల్లి, తండ్రులకి కను విప్పు కలిగేలా రాయాలి. ఎందుకంటే కథ పాతదే , పాత్రలు అవే.. .కానీ స్వభావాలు మారాయి. కెరియర్ అంటే ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు మాత్రమే కాదు, సంపాదన అంటే డాలర్ మాత్రమే కాదు, కాలానికి తగినట్టు జీవన విధానం మారుతుంది, అభిప్రాయాలు మారతాయి, అభిరుచులు మారతాయి. వాటిని అర్థం చేసుకుని, ఆ దిశగా తల్లి, తండ్రులు కూడా మారితే ఇలాంటి కథలు పునరావృతం కావు.”

          “అంటే!” ఆవిడ వైపు ప్రశ్నార్ధకంగా చూసింది ధ్వని.

          “మీరడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందా?” అంది మహిత.

          ధ్వని మొహంలో కనిపించిన ప్రశ్నార్ధకం zoom అయింది.

*****

Please follow and like us:

One thought on “నేలరాలిన నక్షత్రం (క‌థ‌)”

  1. ఈతరం తల్లిదండ్రులకి మంచి సందేశం. అమ్మాయిలు జాగ్రత్తగా లేకపోతే ఎంత హీనస్థితిలోకి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటారో గుణపాఠం. మంచికథ, అభినందనలు విజయ గారూ!

Leave a Reply

Your email address will not be published.