అనుసృజన
ఇదిగో చూడండి!
హిందీ మూలం: నీలమ్ కులశ్రేష్ఠ
అనుసృజన: ఆర్ శాంతసుందరి
మట్టిరంగు సహ్యాద్రి కొండల మీద క్యాబ్ వెళ్తోంది. మధ్య మధ్య చదునైన రోడ్డు, మళ్ళీ పాములా మెలికలు తిరిగిన కొండ దారిలో పైకి ప్రయాణం. సాపూతారా కొండలు మూడువేల అడుగులే అని అమ్మ ఎంత నవ్విందో, ”ఆహా! గుజరాత్ హిల్ స్టేషన్ ఎంత బావుంది. ఒక మట్టి దిబ్బని ‘హిల్స్’ అంటున్నారు” అంది వ్యంగ్యంగా.
అమ్మ మాటలకి నాకు కోపం వచ్చింది. ‘ఏమైంది దీనికి? ఎంత అందమైన హిల్ స్టేషన్ ఇది. మధ్యలో లేక్ కూడా ఉంది’ అన్నాను.
అమ్మ నా బుగ్గని సుతారంగా తట్టి, ”యూ.పీ., కాశ్మీరీ హిల్ స్టేషన్లను చూశావంటే నువ్వు కూడా వెక్కిరిస్తావు తెలుసా?” అంది.
సాపూతారా, అంటే పాకే ప్రాణి, పాము లాంటిది. సర్ప గంగా నది ఒడ్డున ఉంది ఈ కొండ. హోలీ పండుగనాడు ఆదివాసీలు దీనికి పూజలు చేస్తారు. కొంత దూరం పైకెక్క గానే పచ్చదనం కనిపిస్తుంది. తొంభై ఏళ్ళ క్రితం చెట్ల గుబుర్లలో, పొదల మధ్య ఆదివాసీ లు ఎలా నివసించేవారో!
పొట్ట నింపుకోవటమే వాళ్ళ జీవితం అయ్యుంటుంది. అమ్మే చెప్పింది అలాగని. వీళ్ళు భల్లులయినా మరే తెగవాళ్ళయినా మగవాళ్ళందరూ ఇళ్ళూ, భవనాలు కట్టే చోట కూలి చేస్తూ బతికేవారు, ఆడవాళ్ళు పొయ్యిలోకి కట్టెలూ, పుల్లలూ ఏరేందుకు అడవిలోకి పోయేవారు. పాకల్లో వదిలి వెళ్ళే పిల్లలని చూసేందుకు ఎవరూ ఉండరు కదా, అందుకని వాళ్ళకి నల్ల మందు కొద్దిగా తాగించి నిద్రపుచ్చేవారు. ఇలా నల్లమందు తాగి తాగి ఆ పిల్లల్లో బుద్దిమాంద్యం, ఎప్పుడూ మత్తుగా ఉండడం కనిపించేది.. పెరిగి పెద్దవాళ్ళ య్యాక ఎందుకూ పనికిరాకుండా తయారయేవాళ్ళేమో!
పూర్ణిమగారు ముంబై నుంచి ఇక్కడికి విహార యాత్రకి వచ్చినపుడు వీళ్ళని చూసిందేమో. పధ్నాలుగేళ్ళ ఆడపిల్లలు చోళీ, ఓణీ వేసుకుని, తల మీద కట్టెల మోపుతో సరాసరి రోడ్డు మధ్యన వయ్యారంగా నడుస్తూ పోవడం చూసి ఆశ్చర్యపోయి ఉంటుం దావిడ. ఒకసారి ఆవిడ కారుకి అడ్డంగా నడుస్తున్న అలాంటి అమ్మాయి ఎంత గట్టిగా హారన్ మోగించినా పక్కకి తప్పుకోనేలేదు. డ్రైవర్ ఆఖరి నిమిషంలో కారు పక్కకు తప్పించి వెళ్తూ ఉంటే కిటికీలోంచి ”హారన్ వినిపించలేదా అమ్మాయ్?” అని అడిగిందట ఆవిడ. ఆమె ప్రశ్నకి ఆ అమ్మాయి తల తిప్పి చూసింది. ఆ పిల్ల కళ్ళల్లో కనిపించిన శూన్యం, మొహంలో ఏ భావమూ లేకపోవడం చూసి ఆవిడ అవాక్కయింది. తర్వాత వాకబు చేస్తే వాళ్ళందరూ నల్లమందు వ్యసనానికి బానిసలైపోయారని తెలిసింది. 1953లో ఇలాంటి ఆడపిల్లల్ని బాగుచేసేందుకు ఆవిడ ‘శక్తిదల్’ అనే సంస్థను ప్రారంభిం చి కాలక్రమాన నల్లమందు అలవాటు మాన్పించడమే కాక వాళ్ళ కోసం స్కూళ్ళూ, కాలేజీ కూడా ప్రారంభించిందట.
”ఏయ్, ఏమిటాలోచిస్తున్నావు?” అన్నాడు అరవింద్ నా మొహం ముందు చెయ్యి ఆడిస్తూ.
నేను సిగ్గుపడుతూ, ”ఈ కొండల గురించీ, ఇక్కడ ఆదివాసీల గురించీ మా అమ్మ ఎన్నో విషయాలు చెప్పింది. అవన్నీ జ్ఞాపకం వచ్చాయి” అన్నాను.
నీరవ్, మొబైల్‌లో ఏవో గేమ్స్ ఆడుతున్న త్రిషా నవ్వారు. మీనల్ కిటికీలోంచి బైటికి చూస్తూ కూర్చుంది. అరవింద్ కారు వేగం తగ్గిస్తూ, ”హోటల్ వచ్చేసింది. మొబైళ్ళు ఆఫ్ చెయ్యండి” అన్నాడు.
సాపూతారా లేక్ చూడగానే నేను చిన్నపిల్లలా ఆనందపడిపోయాను. ”ఎంత బావుందో అద్దంలా మెరిసిపోతోంది కదూ?” అన్నాను.
సామాను గదుల్లో పెట్టి కాస్త మొహం అదీ కడుక్కుని నలుగురం విద్యాపీఠ్ వైపు నడిచాం. సోషల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ మాకు ఈ ప్రాజెక్టు చేయమని ఇచ్చింది. ‘ఆదివాసీల అభివృద్ధికి ఎన్జీఓలు అందించే సహకారం’. అక్కడ ప్రిన్సిపాల్ మమ్మల్ని ముందు ఒక చిన్న మైదానంలోకి తీసుకెళ్ళింది. అక్కడ నేల మీద తివాచీలు పరుచుకుని అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. కొందరు కాలేజి విద్యార్థులు వాళ్ళతో మాట్లాడేందుకు వస్తున్నారని ముందే వాళ్ళకి తెలియజేశారు. నలుగురైదుగురు అమ్మాయిలు పూలదండ లతో మమ్మల్ని ఆహ్వానించి ప్రార్థనా గీతం పాడారు.
మేము నలుగురం వాళ్ళకి మా ప్రాజెక్టు గురించి చెప్పి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధిం చిన కొన్ని ప్రశ్నలు అడిగాం. అమ్మాయిలు చక్కగా జవాబులు చెప్పారు. ఒక లెక్చరర్ మాకు విద్యాపీఠ్‌లోని వివిధ విభాగాలను చూపించింది. నల్లమందుకి అలవాటుపడ్డ అమ్మాయిలను ఇంత సమర్ధంగా సంగీతం, ఆటలు, చదువు సంధ్యల వైపు మళ్ళించిన ఆ విద్యాపీఠ్ ఎంత గొప్పగా పనిచేస్తోందో అనుకున్నాను.
రోజంతా వివరాలు రాసుకుంటూనే ఉన్నాం. సాయంత్రం వరకు అక్కడ గడిపి అలసిపోయి క్యాబ్‌లో జారగిలపడి కూర్చుని హోటల్‌కు బయలుదేరాం. విద్యాపీఠ్ ప్రార్థనా గీతం – ”సాపూతారా నా, రుతంభరా నా, సారా సపన్ బనానా, అమే సృష్టి సజావీ, జ్యోతి జగావీ…’ మనసులో ఇంకా మారుమోగుతూనే ఉంది.
‘రుతంభరా అంటే సనాతన సత్యంతో నిండి ఉన్న’ అని ప్రిన్సిపల్ చెప్పింది. అక్కడ సనాతన సత్యమంటే ప్రగతి ద్వారాలు తెరుచుకుంటూ పోవడం అని ఆవిడ చెప్పింది. ఆదివాసీ అమ్మాయిలే ఇంత ప్రగతి సాధిస్తే మరి మనం మన స్టాండర్డ్‌ని ఇంకా పెంచాల్సి ఉంటుందని అనుకున్నాం నేనూ, త్రిషా. ఇంటికి చేరుకున్నాక విన్నదీ, చూసిందీ మొత్తం అమ్మకి చెప్పేయాలన్న తహతహతో రాత్రి బాగా పొద్దు పోయే వరకూ మాట్లాడుతూనే ఉంటే అమ్మ కోప్పడింది. ”ఇక చాలు రూహీ, చూడు ఎంత అలసి పోయావో, నేనెక్కడికీ పారిపోవటం లేదుగా, రేపు మిగతా కబుర్లు చెబుదువుగాని పడుకో” అంది.
పొద్దున్నే లేచి బ్రేక్‌ఫాస్ట్ చేసి, స్నానానికి బట్టలు తీసుకుంటుండగా మొబైల్‌లో మెసేజ్ వచ్చినట్టు ‘టింగ్’ అని చప్పుడయ్యింది. బట్టలు మంచం మీద పెట్టి మెసేజ్ ఓపెన్ చెయ్యగానే అందులో ఉన్న ఫోటో చూసి నా తల తిరిగిపోయింది. కుర్తీకున్న గుండీలన్నీ తీసేసి ఉన్న నా ఫోటో. నడుం వరకూ నగ్నంగా… చూడగానే నేను హోటల్‌లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు కిటికీ కర్టెన్ సందులోంచి తీసినదని తెలిసిపోయింది. మొబైల్ నంబర్ నీరవ్‌ది. మెసేజ్‌లో, ‘వాట్ ఎ బ్యూటీ యు హ్యావ్ ఇన్‌సైడ్’ అని ఉంది. నేను నిలువెల్లా వణికిపోయాను. పడిపోకుండా ఉండేందుకు పక్కనున్న కుర్చీని గట్టిగా పట్టుకున్నాను. నేను నిలదొక్కుకునే లోపల మరో మెసేజ్ వచ్చింది. ‘కాలేజ్‌కి వెళ్ళే లోపల నా గదికి రా, లేకపోతే మెసేజ్ వైరల్ అయిపోతుంది. అర్థమైంది కదా?’ ఇది చూసి నేను పూర్తిగా కుంగిపోయాను. నిలబడేందుకు కూడా శక్తి లేని దానిలో కుర్చీలో కూలబడ్డాను. ఇంతలో వంటింట్లోంచి అమ్మ గొంతు వినబడింది, ”రూహీ, లంచ్ బాక్స్ రెడీ చేశాను’.
భయంతో బిగుసుకుపోయి నాకు నోటంట మాట రాలేదు. కాసేపటికి అమ్మ నా గదిలోకొచ్చి, ”ఇంకా తయారవలేదేం? అదేమిటి మొహం అంత నీరసంగా కనిపిస్తోంది?” అంది గాభరాపడుతూ.
”అమ్మా!” కష్టం మీద ఆ ఒక్క మాటా నోట్లోంచి రాగానే నాకు ఏడుపు ముంచుకొచ్చిం ది. అమ్మ కంగారుపడుతూ నన్ను దగ్గరికి తీసుకుని ”ఏమైందే?” అంది.
”తల పగిలి పోతోందమ్మా, ఈ రోజు కాలేజీ మానేస్తాను” అన్నాను.
”అంతమాత్రానికే ఇలా ఏడవాలా? వెళ్ళి స్నానం చేసి రా, తేలికగా ఉంటుంది. ఇవాళ ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకో” అంది అమ్మ. వెంటనే అలమారలో ఉన్న తల నొప్పి మాత్ర తీసి నా మంచం పక్కనున్న బల్ల మీద పెట్టి ‘ఇవాళ ఆఫీసులో ఇన్‌స్పెక్షన్ ఉంది. లేకపోతే సెలవు పెట్టే దాన్నే. తల నొప్పి తగ్గకపోతే కొద్దిగా ఏమైనా తిని ఈ మాత్ర వేసుకో’ అంది.
అమ్మ త్వరగా ఆఫీసుకెళ్ళిపోతే బావుణ్ణు, గట్టిగా గొంతు చించుకుని అరిచిఏడవచ్చు అనుకున్నాను.
ఇక నేను ఎవరికీ నా మొహం చూపించలేను అనుకున్నాను. అమ్మ వెళ్ళిపోగానే ముందు నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేశాను. లేకపోతే నీరవ్ ఇంకా ఏ చెత్త మెసేజ్‌లు పంపిస్తాడోనని భయం వేసింది. గుండె దడదడ లాడటం ఇంకా పూర్తిగా తగ్గలేదు. వాడు ఈ మెసేజ్ నిజంగా వైరల్ చేస్తే? ఈ బాధ ఎవరికి చెప్పుకోను? అమ్మ నాతో స్నేహితురా లిగా అన్ని విషయాలూ మాట్లాడుతుంది. అయినా ఈ ఫోటో అమ్మకి చూపించటం నా వల్ల కాదు. నాన్న టూర్ నుంచి వెనక్కి వచ్చాక ఈ విషయం తెలిస్తే… దేవుడా! నాతోపాటు అందరికీ తలవంపులే కదా? అలా జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం. అమ్మ ఇంటికి వచ్చేలోగా ఆత్మహత్య చేసుకోవాలి. కానీ ఆత్మహత్య పాపమనీ, పిరికివాళ్ళు చేసే పని అనీ అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. మరి… మరి… ఏం చెయ్యాలి? నాకు ఏ దారీ తోచ లేదు. ఏడుస్తూ అలా కుర్చీలోనే పక్కకి వాలి కాసేపటికి నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.
అదేపనిగా డోర్ బెల్ మోగుతుంటే మెలకువ వచ్చింది. గడియారం వైపు చూశాను. ఒంటిగంట. ఈవేళప్పుడు ఎవరొచ్చారు చెప్మా, మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ ఉండరని అందరికీ తెలుసే అనుకున్నాను. నెమ్మదిగా నడుస్తూ మెయిన్ డోర్ కీ హోల్ నుంచి చూశాను. బయట అమ్మ రుమాలుతో మొహం తుడుచుకుంటూ నిలబడి ఉంది. నేను ఉలిక్కిపడి తలుపు తీశాను. ”ఇంత త్వరగా వచ్చేశావేం” అన్నాను.
”నీ ఒంట్లో బాలేదుగా, ఆఫీసులో ఉండలేకపోయాను. ఇన్‌స్పెక్షన్ అయిపోగానే సెలవు పెట్టి వచ్చేశాను” అంది అమ్మ. నా నుదురు తాకి చూసి, ”జ్వరం లేదు. అవునూ! మొబైల్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టావు? ఎన్నిసార్లు ఫోన్ చేశానో. నువ్వు ఎత్తక పోయేసరికి ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చాయి తెలుసా?” అంది.
నేను అమ్మ నడుముని వాటేసుకుని భోరుమని ఏడవసాగాను. అమ్మ గాభరాగా నా మొహం పైకెత్తి తల నిమురుతూ ”ఏమైందే? ఎందుకా ఏడుపు? చెప్పు…” అంది.
నేను ఏడుస్తూనే, ”నా ఒంట్లో అస్సలు బాలేదు…” అన్నాను తలదించుకుని.అమ్మ బలవంతాన నా మొహం మళ్ళీ పైకెత్తి, ”రూహీ! నేను నీ అమ్మని. నువ్వేదో పెద్ద ఆపదలో చిక్కుకున్నావు. చెప్పు అదేమిటో” అంది కాస్త గట్టిగా.
”అమ్మా…” అని ఇంకా గట్టిగా ఏడుస్తూ మొబైల్ వైపు చూపించాను.
అమ్మ వెళ్ళి దాన్ని తీసుకొచ్చింది. నేను దాన్ని ఆన్‌చేసి నీరవ్ పంపిన మెసేజ్ ఆవిడకు చూపించాను. ఒక్క క్షణం అమ్మ మొహం పాలిపోయింది. కానీ వెంటనే తనని తాను సంబాళించుకుని, ”ఎప్పుడు తీసిన వీడియో ఇది?” అని అడిగింది.
”సాపుతారా హోటల్‌లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు తీసినట్లుందమ్మా”.
”కొత్త చోటికి వెళ్ళినప్పుడు కిటీకీలు, కర్టెన్లు బాగా మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలని నీకు చాలాసార్లు చెప్పాను”.
”సారీ అమ్మా!”
”అంత పరధ్యానంగా ఎలా ఉన్నావు? సర్లే, నువ్వేమీ బాధపడకు.”
”ఇంత ఘోరం జరిగితే బాధపడవద్దంటావేంటి? మన కుటుంబానికి ఎంత అవమానం ఇది.”
”అవమానమా? అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? నువ్వే తప్పూ చెయ్యలేదే. పాపపు పని అంతకన్నా చెయ్యలేదు. ఇక ఈ వీడియోలో కనిపించేది నీ శరీరంలో మాత్రమే ఉందా? ఇది లోకంలో ఉండే ప్రతి స్త్రీ శరీరంలోనూ ఉండే భాగమే కదా? వీటి నుంచి పాలు తాగే ప్రతి మనిషీ బ్రతికి ఉండగలుగుతాడు. ఎవడో రాస్కెల్ దొంగతనంగా వీటిని వీడియో తీసి అల్లరి చేద్దామనుకున్నాడు. అది వాడికి జరిగే అవమానమే తప్ప నీకు కాదు. లే, లేచి మొహం కడుక్కుని తయారవు. నీ అదృష్టం బావుంది.ఈ రోజు యూనివర్శిటీ ఫైనార్ట్స్ ఫేకల్టీలో ఎగ్జిబిషన్ నడుస్తోంది. బరోడాలో ఉన్న ఈ ఫేకల్టీ దేశం మొత్తంలో అతి పెద్ద ప్రసిద్ధ ఆర్ట్ ఫేకల్టీ అన్నది నీకు తెలుసుగా? అక్కడ ప్రస్తుతం ప్రదర్శనకి పెట్టిన కళాఖండాలు, నువ్వు చూసి తీరాలి.”
”ఎందుకు? ఏముందక్కడ?”
”అక్కడికెళ్ళాక నువ్వే చూస్తావుగా, పద”.
హాల్లో అడుగు పెట్టగానే నేను అవాక్కయి రెప్ప వెయ్యకుండా చూస్తూ ఉండి పోయాను. ఆర్ట్ స్టూడెంట్, ఇరవయ్యేళ్ళ అమ్మాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో రకరకాల భంగిమల్లో తయారుచేసిన తెల్లని రొమ్ముల శిల్పాలు ప్రదర్శనకి పెట్టింది. నేను సిగ్గు పడుతూ రహస్యంగా ”ఇలాంటి శిల్పాలు చేసేందుకు ఆ అమ్మాయికి సిగ్గనిపించలేదా?” అని అడిగాను అమ్మని.
”ఎందుకు సిగ్గుపడాలి? ఈ శరీర భాగాల వల్ల అమ్మాయిలూ, ఆడవాళ్ళూ ఎంత హింస అనుభవిస్తున్నారు? రద్దీలో ఉన్నప్పుడు అయ్యే అనుభవాలు వాళ్ళకే తెలుసు. ప్రకృతి ప్రసాదించిన అవయవాలని చూసి సిగ్గుపడడం దేనికి రూహీ? వీటిని అశ్లీలంగా చూపించడం మాత్రం తప్పే. యుక్తవయసు కుర్రాళ్ళు ఈ ప్రదర్శనని చూసేందుకు సిగ్గుపడుతున్నారని చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇప్పుడు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటారేమో.”
నేను చుట్టూ ఒకసారి చూశాను. వయసు మళ్ళిన మగవాళ్ళు, అమ్మాయిలూ, ఆడవాళ్ళూ మాత్రమే ఒక్కొక్క శిల్పం దగ్గర ఆగి చూస్తున్నారు. ఆ శిల్పాలు చాలా అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. అది చూసి నాకు పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ పుంజుకున్నట్టనిపించింది. సిగ్గుపడడం మానేసి తలెత్తి ఆ శిల్పాలని చూడటం మొదలుపెట్టాను. వాటి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పువ్వులూ, జలపాతాలూ, కొండల్లాగే సృష్టికర్త వీటిని కూడా సృష్టించాడు. వీటి గురించి సిగ్గుపడాల్సిన అవసరమేముంది? అనుకున్నాను.
”నువ్వు సాపూతారాకి వెళ్ళినపుడు అక్కడ పూర్ణిమగారు తీసుకొచ్చిన మార్పు చూశావు కదా! ఈ ప్రదర్శన కూడా మనుషుల్లో, వాళ్ళ దృష్టిలో మార్పు తీసుకురావడానికి ఈ అమ్మాయి ప్రయత్నించింది” అంది అమ్మ.
”రెంటికీ పోలికేముందమ్మా?” అన్నాను అర్థం కాక.
”చెబుతా విను. అక్కడ నల్లమందు మత్తులో మునిగి తేలే అమ్మాయిలని కావాలనే అలా వ్యక్తిత్వం అనేది లేకుండా చేస్తూ వచ్చారు కొందరు స్వార్థపరులు. అలాగే ఆడ వాళ్ళని వాళ్ళ అవయవాల గురించి భయపెట్టి, వాటిని తిట్లుగా తయారుచేసి, వాళ్ళని అవమానపరుస్తున్నారు. ఆడవాళ్ళ సగం శక్తిని ఈ భయమే మింగేస్తుంది. ఏం చేస్తే ఏం తప్పో అని ఆలోచించటంలోనే సగం సమయం వృథా అయిపోతుంది. ఈ అమ్మాయి ఎంతో ధైర్యంగా అలాంటి జడత్వాన్ని మట్టుపెట్టే ప్రయత్నమే చేసింది. ఎప్పుడైనా తనని నీకు పరిచయం చేస్తాను”
”ఇప్పుడే చేయొచ్చుగా?”
”తను ఏదో ముఖ్యమైన క్లాసు అటెండ్ అయ్యేందుకు వెళ్ళిందని రిసెప్షనిస్ట్ ఎవరితోనో అంటుంటే విన్నాను. ఈ అమ్మాయే కాదు చాలా మంది ఆడవాళ్ళు, కొందరు మగవాళ్ళూ స్త్రీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ నిద్ర లేపేందుకు ఎన్నో ప్రయత్నా లు చేస్తున్నారు. కానీ ఆడవాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే సమాజం భరించలేదు. వాళ్ళ జీవితాలను నరకం చేసేందుకు ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తుంది”
”సమాజం అంటే జనమే కదా? వాళ్ళేం చేస్తారు”
”కాస్త ముందడుగు వేసి కొత్త ప్రయత్నమేదైనా చెయ్యబోతే, ‘ఆ! వీళ్ళ మొహం, వీళ్ళవల్ల ఏమవుతుంది? వెనక మొగుడో, అన్నదమ్ములో ఎవరో ఉండి ఉంటారు అనో, పైకి రావడానికి ప్రతిభే ఉండాలా ఏంటి, వెధవ్వేషాలు వేస్తే చాలు ఎవరైనా పడిపోతారు అనో, వెకిలిగా మాట్లాడతారు.” అంది అమ్మ.
ఇంటికి వచ్చేలోపల నా భయం, సంకోచం పూర్తిగా తగ్గిపోయాయి. మొబైల్ ఆన్ చేసి అరవిందకీ, త్రిషకీ, మీనల్‌కీ అంతా చెప్పేశాను. ఇది నా పోరాటమనీ, నేనే దీనికి పరిష్కారం జరిగేలా చూస్తాననీ, వాళ్ళను జోక్యం చేసుకోద్దనీ కూడా చెప్పాను.
స్నేహితురాళ్ళిద్దరూ ఆవేశపడిపోతూ, ”పద ఆ మెసేజ్ పోలీసులకు చూపించి నీరవ్ మీద రిపోర్టిద్దాం” అన్నారు.
”ప్రతివాళ్ళకూ పోలీసులు ఎంతకని సాయం చేస్తారు?” అన్నాను.
మర్నాడు కాలేజి గేటు దగ్గరే నీరవ్ కనిపించి వంకరగా నవ్వుతూ, ”ఏమిటి నాతో వస్తున్నట్టేగా?” అన్నాడు.
”ఎక్కడికి? ఎందుకు రావటం?” అన్నాను.
”నువ్వేమైనా అభం శుభం తెలియని చిన్నపిల్లవా? ఒకబ్బాయి ఒకమ్మాయిని ఏకాంతంగా కలుసుకోవడమంటే అదెందుకో నీకు తెలీదా?”
నేను రెండు చేతులూ కట్టుకుని నిటారుగా నిలబడ్డాను. ”నీ వెంట నేనెక్కడికి రాదలుచుకోలేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో” అన్నాను నేరుగా అతని కళ్ళలోకి చూస్తూ.
నీరవ్ ఖంగుతిన్నట్టు దొంగచూపులు చూడసాగాడు. నేను క్లాస్‌వైపు నడిచాను. క్లాసులో అందరూ ఉన్నారు. సర్ ఇంకా రాలేదు. కొందరు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకొందరు చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని రహస్యంగా ఏదో అంటూ నవ్వుకుంటు న్నారు. నేను క్లాసులోకి రాగానే కొందరు కుర్రాళ్ళు నా వైపు అల్లరిగా చూస్తూ ఏవో సైగలు చేయడం మొదలుపెట్టారు. నేను చప్పట్లు చరిచి గట్టిగా, ”ప్లీజ్ లిజన్ గైస్” అన్నాను.
నా గొంతు విని మిగిలినవాళ్ళు కూడా నావైపు చూశారు. ”మాలో కొందరు సాపూతారాకి సర్వే చేసేందుకు వెళ్ళిన సంగతి మీకందరికీ తెలిసే ఉంటుంది. హోటల్‌లో నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకణ్ణని చెప్పుకునే ఈ నీరవ్ నాకు తెలీకుండా నా వీడియో తీశాడు. అంతేకాదు, దాన్ని మీ అందరికీ పంపాడు. ఇంతవరకూ చూడని వాళ్ళెవరైనా ఉంటే చూసేయండి” అన్నాను గొంతులో ఏ భావమూ పలికించ కుండా.
నీరవ్ వైపు చూశాను. తలొంచుకుని మూగ వాడిలా నేల చూపులు చూస్తున్నాడు. మొబైల్‌లో వీడియో చూస్తున్న కొందరు కుర్రాళ్ళు సిగ్గుపడి మొబైల్స్ ఆఫ్ చేసేశారు. కొందరు మాత్రం, ”యూ! నీరవ్… షేమ్ ఆన్ యూ!” అని కోపంగా అరిచారు.
ఒక అబ్బాయి తన చెప్పు తీసి నీరవ్ మీదికి విసిరేశాడు. కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు వాణ్ణి చుట్టుముట్టి అందిన చోటల్లా కొట్టడం మొదలుపెట్టారు. నేను అందర్నీ ఆగమన్నాను. ”నీరవ్‌కి శిక్ష పడింది. నేను తల్చుకుంటే వీసీ దగ్గరకెళ్ళి వీణ్ణి రస్టికేట్ చేయించగలను, లేదా పోలీస్ కంప్లయింట్ ఇవ్వగలను. కానీ అలా చేస్తే వీడి లైఫ్ పాడవుతుంది. ఇప్పుడు తన తోటివాళ్ళే వేసిన ఈ శిక్షవల్ల వీడు ఇక జన్మలో ఏ ఆడపిల్లనీ ఇలా అవమానపరచడు. ఆడపిల్లల్ని గౌరవించటం మొదలెడతాడు. దీంతో గుణపాఠం నేర్చుకున్నాడనే అనుకుంటున్నాను” అన్నాను.
”రూహీ… ప్లీజ్… నన్ను క్షమించు… ప్లీజ్ క్షమించానను రూహీ…” అంటూ వలవలా ఏడవడం మొదలుపెట్టాడు నీరవ్.
*****
ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.