ఈళిక ఎత్తిన కాళిక
-డా. కొండపల్లి నీహారిణి
ఎన్ని కల్లోలాలనైనా క్రీగంట చూసినట్లు
ఎన్ని కన్నీటి చెలిమెలనైనా కొనగోటితో తీసేసినట్టు
పరాభవాలు అపరాధ భావాలు
నీ గుండె దిటవు ముందు
బలాదూర్ అయిపోతాయి
చినుకుల పలకరింపులు నీ కను దోయి దాటవు
కష్టపు కడవలు నిన్ను కాదని
ఎక్కడెక్కడ తారాడుతాయి గానీ
చలువ మబ్బుల పందిర్లేవి భజంత్రీలు కావు
కోపం కొలిమిలోంచి ఎగిసినా
ఈటెలు మొనదేరిన మాటలు విన్నా
సహనము స్త్రీ సహజాతాల మిధునాలని చెప్పేసి
మనసు తడిని మగ సమాజానికి మన సమాజానికి ఇచ్చేసి
ఇష్టాన్ని మూటగట్టుకొని గడప దాటిన కొమ్మ
కొమ్మ కొమ్మకు చిక్కి భంగపడని పతంగులాగానో
గాలివాటుకు మారగానే
తనను తాను మార్చుకునే పంతం గానో
ఆత్మ నిర్భీతి వెంటరాగా
వంట చేసినంత సులువుగ
అనుమానాల బోను నుండి
ఆలోచనల శివంగిలా నవచైతన్యమవుతావా?
ఆకాశమైనా
అంతరిక్షమైనా
ఆడపిల్ల అంటే అభిజాత్యాన్ని వీడి అడుగేస్తావా?
జాగ్రత్తల మౌనసాక్షివై
అజాగ్రత్తల జీవిత నిందవై
రాగల కాలానికి రాటుదేలి నిలబడుతున్నందుకు
ఆనందంతో అభినందిస్తావా?
బంతి నీ ఆవరణలో ఉన్నది
ఈసుగల లోకం ముందు
ఈళిక ఎత్తిన కాళికవవుతావా?
*****
ప్రాస చాలా బాగా వాడారు. చక్కటి పదజాలంతో ప్రశ్నిస్తూ , ఆ ప్రశ్నలోనే సమాధానమిస్తూ రాసిన మీ కవిత చాలా బాగుంది , నిహారిణి గారు !!
“చినుకుల పలకరింపులు నీ కను దోయి దాటవు”.. బాగుంది అండి..👌