ఈ తరం నడక – 4

ఊపిరి తీసుకునే స్వేచ్ఛ కావాలి

-రూపరుక్మిణి. కె

 

          స్త్రీ కేంద్రంగా సాగే రచన ఏదైనా స్వేచ్ఛనే కోరుతుంది. అందులో ఒక సామాజిక అవగాహన ఉన్న మహిళా జర్నలిస్టు రాస్తే మరింతగా ఆలోచనలలో మూలాలకు వెళ్ళి  రాస్తారు. అన్న ఆశ నాకు ఈ పుస్తకాన్ని చేరువచేసింది.

(దాస్తాన్ -నస్రీన్ ఖాన్ )

          అయితే ఈ దాస్తాన్లో ఏముంది…. మొత్తం స్త్రీని కేంద్రకంగా చేసుకున్న వాస్తవ ప్రతీకలు ఎదురవుతాయి, చరిత్రలో గూడుకట్టుకొని ప్రయాణిస్తున్న సంప్రదాయాల చట్టం చట్రంగా మారి మధ్యతరగతి జీవిత చక్రాల్ని కాలానికి బలి అవ్వడాన్ని చూపిస్తుంది.

          వందల ఏళ్ళ చరిత్రను స్త్రీ తనలో ఎలా నిక్షిప్తం చేసుకుంటూ తరాలు మారినా మారని నిశ్శబ్దాన్ని పరిచయం చేస్తాయి.

          కొందరు అనుకోవచ్చు ఎప్పుడూ ఉండేవేగా ప్రతి ఇంట. సంఘర్షణ లేని మనిషి ఉంటారా ! అంటే…

          నేనైతే చెప్తాను, సంఘర్షణ వేరు, ఎదురీత వేరు… తనలోని తనతోనే సంఘర్షణ పడాల్సిన సందర్భం వేరు… ఎక్కువగా ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీ సంఘర్షణల కల్లోలాన్ని అనుభవిస్తుందనేది మూల వాస్తవం.

          ఎన్ని చర్చలు జరిగినా, ఎన్ని చట్టాలు వచ్చినా, కొన్ని అలజడుల సంకెళ్ళు  తెంచుకోవడం చేతకాని మధ్యతరగతి స్త్రీల కథలు ఇవి. ఇవి కేవలం ముస్లిం స్త్రీల కథలు అంటే మాత్రం నేను తప్పక ఖండిస్తాను.

          మధ్యతరగతి జీవితాల్లో నిత్యం ఎదురయ్యే సంఘర్షణే ఈ “దాస్తాన్” చరిత్రలో ఎవరు పాలించినా పెత్తనం మాత్రం పురుషునిదే, అది ప్రపంచమంతా ఒకే నీతి ఇందులో మాత్రం ఏ తేడా ఉండదు.

          మురికి పట్టిన మనుషులు ఉన్నంతకాలం స్త్రీల పై హింస నడుస్తూనే ఉంటుంది. స్త్రీ విద్య అంటూ పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకున్నా… అందరూ తమ ఉన్నత విద్యను చదివి ఉద్యోగాలు చేసేవారు వుంటారు… పెళ్ళి అవగానే పిల్లలు అందగానే,… పనుల ఒత్తిడి పేరుతో ఉద్యోగానికి రాజీపడి వదిలేసి బానిసగా బతుకుని దుర్భరం చేసుకుంటు న్న మహిళలను దృష్టిలో ఉంచుకొని రాసిన కథ ‘పంచి ఔర్ పింజ్రె ‘

          ఒకానొక సందర్భంలో కాలం మనలను వెంట తీసుకుపోతుంది. పసితనం ఎంత అమాయకత్వంలో ఉంటుందో, ఆ కాలం అనుకూలించినప్పుడు విషాదం వెంట నడుస్తుంది. జీవితాంతం పరిచ్ఛాయలా వెంట నడుస్తూ భయం గుప్పెట్లో జీవించాల్సి వస్తుంది. అది తండ్రి నుండి ఏర్పడినా..! సంఘంలోని కట్టుబాట్ల మధ్య ఏర్పడినా..! కొన్నిసార్లు మనుషుల పై అసహ్యం భయంగా పేరుకుపోతుంది. మనుషుల నుండి దూరం చేసి ఒంటరిని చేస్తుంది. “దూప్ చావ్” లో జీవితం అంతా వెలుగునీడలు అని చెప్పిన కథే అయినా ఎందుకో ఆ పాత్ర పట్ల సానుభూతి మాత్రమే కలగడం ఆ పాత్రను మలిచిన తీరేనేమో. కథను నడిపించిన తీరు బావుంది. అయినా కొన్నిసార్లు కొంతసేపు కథ నుండి దూరం అయ్యామా..! అనిపిస్తుంది. మనసు ముద్రలు ఎంతగా పనిచేస్తాయో చూడాలంటే ఈ వెలుగునీడల్లో ప్రయాణించాల్సిందే.

          పంజరంలో చిలుకను పెట్టి ముద్దు చేయడం ఎందరికి నచ్చుతుందో కానీ నాకైతే నచ్చదు. స్వేచ్ఛగా రెక్కలు చాచి స్వతంత్రంగా ఎగరాల్సిన జీవితం బంధించి ఆనందించే మనుషులు ప్రేమిస్తున్నామని చెప్పడం భలే వింతగా అనిపిస్తుంది.

          ఒక ప్రాణాన్ని మీకు నచ్చినట్టు బతకమనడం స్వేచ్ఛగా భావించమనడం మన మహా సాంప్రదాయపు పురుష ప్రపంచానికే చెల్లుబాటు. అది ఏ కుల, మతాలను చూడదు సాంఘిక కట్టుబాటు మాత్రమే ఇది.. ఆ కట్టుబాట్లను తెంచుకునే మానసిక సంఘర్షణ స్థిరం లేక ఉనికిని కోల్పోతున్న భావన ప్రాణం ఉన్నా…లేనట్లుగా మనిషిని ఎంతలా చంపేస్తుందో చెప్పే అక్షర రూపం “దిశ మార్చుకున్న గాలి”.

          ఒంటరితనానికి, ఏకాకితనానికి మధ్య ఎంతో తేడా ఉంటుంది. ఒంటరి ప్రయాణం లో ఒడిదుడుకులు, యువత ఎదుర్కొంటున్న ఆధునిక ఇబ్బందులలో విప్పి చెప్పిన “విఆర్డ్” ఈనాటి ఆడపిల్లల కలబోత కబుర్లు. వింటూ ఉంటే భలే ఉంటుంది.

          యుక్త వయసులోకి రావడం స్త్రీ గా మారుతున్న క్రమంలో కొత్తగా పరిచయమయ్యే శారీరక వోడిదుడుకుల్లో సాంప్రదాయాల్లోని చిక్కుముడుల మధ్య సమాధానం వెతుక్కో వలసిన ప్రశ్నలెన్నో సమాజం చూసే చూపులో నుండి, నెలసరిని తప్పుగా చూపించే వ్యవస్థ నుండి, బయటికి రావలసిన ఆవశ్యకతను గురించి అవసరమైన అవగాహన కల్పించే విధంగా నడుస్తుంది ‘పాన్ ‘ నిజానికి ఈ కథ టైటిల్ మొదట కన్ఫ్యూజన్ చేసినా కథ చదివేక మాత్రం బాలికల చుట్టూ వున్న వారికి తెలియాల్సిన విషయం. చైతన్య అవసరమని వేదికలెక్కి ఆడపిల్లల పైన మాట్లాడేవాళ్ళు ఒక్కసారి చదివితే బాగుంటుం దేమో మారుతున్న సమాజాన్ని ప్రశ్నించే ఓ తరం అవసరం ఎంత ఉందో తప్పక అవగాహనకొస్తుంది.

          ఇలా ఈ పుస్తకం నడక చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకానికే బలమైన కథ ఉంది అది “లాపతా”

          అవును ఎంతోమంది ముస్లిం పిల్లలు అంతర్దానం అవడంలోని ఆంతర్యాన్ని ఒక కోణంలో చాలా చక్కటి శిల్పంతో చెప్పారు. తప్పిపోతున్న బాల్యాన్ని కళ్ళకు కట్టి చూపించారు. ఏది ఏమైనా మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న అన్యాయం పట్ల ఒక గొంతు వినిపించింది అని చెప్పవచ్చు.

          ఈ పుస్తకంలో కథలు అన్ని రీడబుల్ గా బాగున్నప్పటికీ కొన్ని చాలా లాగ్ అవుతూ.. కేవలం ఒక సమాజానికి చెందినవిగా మాత్రమే చెప్పి ఇలాంటి సమస్యలు ఉంటాయి అని చెప్పడం మాత్రం అంత కరెక్ట్ గా కాదనిపించింది. ముస్లిం సమాజంతో పాటు ఆర్థిక వెసులుబాటులేని ఎన్నో ఇళ్ళల్లో సమస్యలే ఈ పుస్తకంలో కథలయ్యాయి.

అభినందనలు (ఖానమ్మ )నస్రిన్ ఖాన్ గారు…

          మహిళల సమస్యలు ఓ మహిళగా మీరు ఆవిష్కరించిన పద్ధతి బావుంది. కానీ ఇది సాధారణంగా ఉండడం అనేది ఒక ఇంత ఆలోచింపజేసింది. కారణం లేకపోలేదు. మీ నుండి ఓ రియల్ ప్రాబ్లం ఫేసింగ్ ఉమెన్ తీసుకునే నిర్ణయాల పట్ల మీ అవగాహన ఎలా ఉంటుందో చూడాలని ఉంది.

          ఎందుకో సరిగ్గా ప్రశ్నించాల్సిన సమయాల్లో ప్రశ్నించలేదు..! అనిపించింది. మీ కారణాలు మీకు ఉండవచ్చు, లేదా.. మీలోని అతి సున్నితత్వం ఆ వైపు అడుగులు పడనీయలేదేమో…! మొత్తానికి “దాస్తాన్” కథలకు ఆహ్వానం పలుకుతూ… ప్రతి ఒక్కరూ ఈ కథలను చదివి నా అభిప్రాయం పై మీ విమర్శను తెలియజేస్తారని ఆశిస్తూ..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.