ఒక హిజ్రా ఆత్మకథ (ఎ.రేవతి)
(పరిచయం)
-పి. యస్. ప్రకాశరావు
హిజ్రాలను రైళ్ళలోనో, బజారులో వ్యాపారస్తుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ డబ్బు లు వసూలు చేసుకునేటప్పుడో చూడటమే కానీ వాళ్ళ జీవితం గురించీ, వాళ్ళ మనో వేదన గురించీ ఈ పుస్తకం చదివే వరకూ నాకు తెలియదు.
దొరైస్వామి మగపిల్లవాడిగా తమిళనాడులోని ఓ గ్రామంలో, తిండికీ బట్టకీ లోటు లేని కుటుంబంలో పుట్టాడు. ముగ్గురన్నలూ ఒక అక్కా ఉన్నారు. ఇతనికి పదో ఏటనుంచే తన అక్క బట్టలు వేసుకోవడం, బొట్టూ కాటుకా గాజులూ, చెవికమ్మలూ, పెట్టుకోవడం, వాలుజడ వేసుకుని పూలు పెట్టుకోవడం, ఇళ్ళలో ఆడ పిల్లలు చేసే పనులు చేయడం చాలా ఇష్టం. ఈ అబ్బాయి పదో తరతగతికి వచ్చే సరికి ‘ మగ శరీరంలో ఇరుక్కుపోయిన స్త్రీ’ లా భావించాడు. మగ బట్టలు వేసుకుంటే మారువేషం వేసుకున్నట్టు అనిపించేది. ఒక స్త్రీలా మారిపోయి పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనాలనే కోరిక ఎక్కువైంది. అది జరగా లంటే ఇంటి నుంచి వెళ్ళిపోయి హిజ్రాలను కలిసి ఆపరేషన్ చేయించుకోవాలని తెలుసుకున్నాడు.
ఇల్లు విడిచి డిల్లీ వెళ్ళిపోయాడు. హిజ్రాలతో చేరాడు. వాళ్ళు దానికి సంబంధించిన నియమాలన్నీ చెప్పారు.
ముక్కూ చెవులూ కుట్టించుకోవాలి, స్త్రీలాగా కన్పించడానికి జుట్టు పొడవుగా పెంచు కోవడం చాలా ముఖ్యం, ఒక గురువు (సీనియర్ హిజ్రా)కి శిష్యురాలిగా ఉండాలి, బహిర్భూ మికి వెళ్ళినపుడు పురుషాంగం బయట పడకూడదు. ఆపరేషన్ అయ్యే వరకూ పురుషుడనే విషయం బయట పడకూడదు. మొహం మీద మొలిచే వెంట్రుకల్ని క్షవరం చేసుకోకుండా పీకేసుకోవాలి. తన సంపాదన గురువుతో పంచుకోవాలి. రెండేళ్ళు గురువుకి సేవచేసి డబ్బు సంపాదించి పెట్టాలి. పెద్ద వయసు గల హిజ్రాల బట్టలుతకాలి. మంచి నీళ్ళు మోసుకురావాలి. బజారుకు వెళ్ళి రావాలి. వంటలో సాయం చెయ్యాలి. పెద్ద వాళ్ళకు పాన్ ఇచ్చి ‘కాల్మొక్కుతా ‘ అనాలి. తరువాత ఉమ్మి వేసుకునే గిన్నె కడిగి తేవాలి. ఈ కష్టాలకు తట్టుకుంటేనే ఆ గురువు దొరైస్వామికి ‘నిర్వాణం’ (పురుషాంగాన్ని తొలగించుకునే ఆపరేషన్ ) జరగడానికి సహకరిస్తుంది.
నాలుగేళ్ళ పాటు శిష్యురాలి సంపాదనలో వాటా తీసుకుని, చాకిరీ చేయించుకుని, ఆపరేషన్ కి సహకరించని గురువులు కూడా ఉంటారు. గురువుతో ఉండలేని హిజ్రా బయటికి పోయి ఒక్కతే ఉండాలి. అయినా డబ్బు కోసం గురువు వేధింపులు ఆగవు.
దొరై స్వామి హిజ్రాల చరిత్ర చెప్పమని గురువుని అడిగాడు. ఆ గురువు చెప్పింది.
“ పూర్వం హిజ్రాలు రాజుల కొలువులో పనిచేసేవారు. రాణులకూ రాజకుమార్తెలకూ సేవ చేసేవారు. ఇప్పుడు రాజులూ రాణులూ లేరు. ప్రభుత్వం మనకేపనులూ ఇవ్వదు”
“ మన పూర్వీకుల కాలం నుంచీ అలాగే ఉంది. చాలా కాలం ఈ దిల్లీలో మనని దేవత వలె చూశారు. మన పాదాలంటి ఆశీర్వచనం కోరేవారు. మన వాక్కు చాలా శక్తివంతమైన దనీ, మనం ఏం పలికినా నిజమవుతుందనీ అనేవారు. మనం దుకాణాల్లోకి వెళ్ళి చప్పట్లు కొట్టి ‘ రాం రాం జీ నమస్తే బాబూ’ అంటే వాళ్ళు మనకి రూపాయో అయిదు రూపాయలో ఇస్తారు. వాళ్ళేమిచ్చినా తీసుకుని దుకాణ దారుడి తలమీద చెయ్యిపెట్టి ‘ బాగుండు నాయనా! నీ వ్యాపారం బాగా సాగాలి” అని దీవిస్తాం.
హిజ్రాల గురించిన కథలు వందలకొద్దీ ఉన్నాయి. వాటిలో ఒకటి చెబుతాను.
రాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి బయలుదేరినప్పుడు ఆయనకు వీడ్కోలు చెప్పడానికి చాలా మంది జనం అడవి పొలిమేరలదాకా వెళ్ళారు. ఇంకా లోపలికి వెళదామనుకున్నారు కానీ రాముడు స్త్రీలనూ పురుషులనూ పిల్లలనూ తిరిగి ఇళ్ళకు వెళ్ళిపొమ్మనీ, తను పధ్నాలుగేళ్ళ తరువాత వచ్చి వారిని పరిపాలిస్తాననీ చెప్పాడు. స్త్రీలూ పురుషులూ పిల్లలూ వెనక్కి వెళ్ళారు. కానీ కొంత మంది ఆ అడవి పొలిమేరలలోనే ఆ పధ్నాలుగేళ్ళూ నిరీక్షిస్తూ ఉండిపోయారు. అప్పుడు రాముడు ఆశ్చర్యపడుతూ మీరెవరు? ఎందుకిక్కడ ఉండిపోయారు? అనడిగాడు. అప్పుడు వాళ్ళు ‘మీరు స్త్రీపురుషులను మాత్రమే పొమ్మన్నారు. అందుకే మేము పోలేదు’ అన్నారు. అప్పుడు రాముడు వారికో వరమిచ్చాడు. ‘ మీ పలుకు సత్యమౌ గాక! అని. అప్పటి నుంచీ ఇక్కడి వాళ్ళు హిజ్రాల మాట నిజమౌతుందని, వాళ్ళను చూసి పని మొదలుపెడితే విజయవంతం అవుతుందని నమ్ముతారు. వ్యాపారస్తులు వారి వ్యాపారం బాగుంటుందని నమ్ముతారు. అందుకే మనకి డబ్బు ఇచ్చి దీవెన అందుకుంటారు.‘ అని చెప్పింది.
హిజ్రాలకు కులమతవర్గ వివక్ష లేదు. కానీ 7 తెగలున్నాయి. వాటికి నాయకురాళ్లుం టారు. కొత్త హిజ్రాలు తమకు నచ్చిన తెగలోని నాయకురాలిని ఎంచుకోవచ్చు. . రేవతికి నాయకురాలు లభించింది. కోడిపుంజును అధిరోహించి ఉన్న ‘ పోతిరాజ మాత’ అనే దేవత పటం ముందు పూజ చేశారు.
హిజ్రాలకు జరిగే నిర్వాణం (ఆపరేషన్ ) రెండు రకాలు. తాయమ్మ (మరొక హిజ్రా) చేసేది ఓరకం. డాక్టర్ చేసేది రెండో రకం. దొరై స్వామికి“ ఆపరేషన్ అంటే సంబరం కలిగింది. ఎగిరి గంతులు పెట్టాలనిపించింది” రెండొందల యాభై రూపాయలతో ఆపరేషన్ చేయించుకుని రేవతిగా మారిపోయాడు(యింది). ఇలాంటి ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు 40 రోజులపాటు పాలూ పళ్ళూ తీసుకోకూడదు. 40 వ రోజు తరువాత ‘పోతిరాజు మాత’ కు పూజ చేస్తారు. కొన్నాళ్ళ పాటు బాత్రూంకి పోవడం నరకంగా ఉంటుంది. కొన్నిసార్లు రక్తం వస్తుంది. ఆ బాధ వర్ణనా తీతం. 40 వ రోజు వచ్చే సరికి స్త్రీ లక్షణాలు వస్తున్నట్టు అనిపిస్తుంది. గొంతు మాత్రం మారదు. అప్పుడు పూజ చేసి బయటికి పోవడానికి అనుమతి ఇస్తారు.
హిజ్రాలకు ఆపరేషన్ పునర్జన్మ లాంటిది. నిర్వాణం అయిన వాళ్ళకి హిజ్రాల సమూహంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది. పూర్తి స్త్రీగా జీవించాలంటే నిర్వాణంతోనే సాధ్యం. కానీ సంతానం మాత్రం కలగదు.
రేవతికి ఇరవై ఏళ్ళు వచ్చాక కోరికలు కలవరపెట్టాయి. శారీరక వాంఛలు ఆకలంత సహజంగా అనిపించాయి. ఒక గురువు కొంత రుసుము తీసుకుని శిష్యురాలిగా చేర్చుకుని డాన్స్ నేర్పించింది.
ఆ తరువాత రేవతి నరకం అనుభవించింది. బొంబాయి, బెంగుళూరు తిరిగింది. రోడ్డు పక్క పాకల్లోసెక్స్ వృత్తి చేసింది. అందరిలాగే డబ్బులు అడుక్కుంది. ముంబాయి వెళ్ళింది. విటుల వికృత చేష్టలకు బలైంది. సిగరెట్లతో కాల్చి, కత్తులతో బెదిరించే రౌడీల నూ, సైకోల పైశాచిక కృత్యాలనూ కొన్నిసార్లు అసహజరీతి సెక్స్ లనూ, పోలీస్ స్టేషన్లో లాఠీ దెబ్బలనూ , బూటు కాళ్ళ తన్నులనూ భరించింది. ఆ భయం నుంచి తప్పించుకో డానికి తాగుడుకు అలవాటు పడింది. “లైంగిక వాంఛలు అణుచుకోలేక ఇందులో కొచ్చాను. ఇక్కడ హింస, ఘోరత్వం తెలుస్తున్నాయి.” అని కుమిలి పోయింది.
“ సాధారణ స్త్రీ పురుషులు వారికుటుంబాలతో బయటికి వచ్చినపుడు వారిని ఎవరైనా ఎగతాళి చేస్తారా? అంగవైకల్యం కలవారినీ, గుడ్డివారినీ చూసి జాలిపడి సాయం చేస్తారు. ఎవరైనా గాయపడితే వారి కుటుంబమూ బయటివారూ కూడా సాయం చేస్తారు. మరి మేమో! మమ్మల్ని మనుషులకిందే లెక్క వెయ్యరు” ( పే.45) జనాల చూపులూ ఆడిన మాటలూ ఆపరేషన్ గాయం కన్నా ఎక్కువ బాధపెట్టాయి.
“ ఇట్లా ఏ లింగానికీ చెందకుండా ఉండేకన్నా ఒక గుడ్డివాడిగానో గుడ్డిదానిగానో పుట్టినా బాగుండేదనిపించింది” అని కుమిలి పోయింది.
హిజ్రాల గురువులలో మంచివాళ్ళు కూడా ఉంటారు. “ ఇక్కడ నువ్వుండలేవు. మీ ఊరెళ్ళిపో. నేను నెలకు రెండు వేలు పంపిస్తాను’ అంది ఒక గురువు. రేవతి మూడుసార్లు ఇంటికి వెళ్ళింది. కుటుంబమంతా దాడిచేశారు. ‘ నాకు ఆపరేషన్ అయింది. నేనిప్పుడు ఆడదాన్ని’ అంది. తల్లి నెత్తీ నోరూ బాదుకుంది. అంగాన్ని కోయించుకుని ఆస్తి కోసం వచ్చావా అంటూ అన్నలు చితకబాదారు. ఏదో ఉద్యోగం చేసి బతకాలనుకుంది. కానీ ఎవరూ పనిలో పెట్టుకోలేదు. ‘ నీ లాంటివాళ్ళను పనిలో పెట్టుకోము’ నిన్ను పనిలో పెట్టుకుంటే మా పిల్లల్ని చెడగొడతావు’ ‘ మీరు రోడ్డు మీద డాన్స్ చెయ్యడానికి తప్ప పనికిరారు’ అన్నారు. అన్నలు లారీలోకి పాలక్యాన్లు ఎక్కించే పనిలో పెట్టారు. అందరూ హేళన చేయడమే. ఎవరూ చూడనపుడు గుండె మీద గిల్లడం, పిర్రల మీద చేతులు వేయడం చేసేవారు. బస్ స్టేషన్ లో అటు ఆడవాళ్ళ టాయిలెట్ లోకీ ఇటు మగవాళ్ళ టాయిలెట్ లోకీ కూడా పోనివ్వరు. స్కూటీ కొనుక్కుంటే ‘రేవతిగా మారిన దొరై స్వామి అనే అబ్బాయి’ అంటూ ఆర్.సీ. బుక్ ఇవ్వరు. లైసెన్స్ రాదు. అధికార్ల కాళ్ళా వేళ్ళా పడాలి. అవహేళనలను భరించాలి.
“ సమాజం మనని ఛీకొడితే మనం మన కుటుంబాన్ని ఆశ్రయిస్తాం. మరి కుటుంబమే ఛీకొడితే ఎవర్ని ఆశ్రయించాలి? అందువల్లనే నా లాంటివాళ్ళు కుటుంబాలతో ఉండరు కాబోలు…” అంటూ గోడకి తల బాదుకుంటూ ఏడ్చింది.
చివరిగా రేవతి హిజ్రాల హక్కుల కోసం పోరాడే ‘సంగమ’ అనే సంస్థలో ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుంది. అక్కడ కూడా ఎదురు దెబ్బలు తప్పలేదు. ఇక్కడితో ‘ ఒక హిజ్రా ఆత్మకథ’ పూర్తయింది.
***
వయసులో ఎలా జరిగినా వృద్ధాప్యం హిజ్రాలకు ఊహించలేనంత బాధాకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
హిజ్రాలుగా మారాలని ఎవరూ కోరుకోరు. పుట్టుకతోనేవచ్చే అంధత్వం, అంగ వైకల్యం వంటి లోపమే హిజ్రా లక్షణాలు. కాబట్టి వీళ్ళను చూసి హేళనచేయడం మానేస్తేనో, జాలి పడితేనో ప్రయోజనం లేదు. శాస్త్రీయమైన వైద్యవిధానమే ( ఒకవేళ ఉంటే) పరిష్కారం.
ఈ పుస్తకం మొదట తమిళం నుంచి ఇంగ్లీష్ లోకి తర్జుమా అయింది. ఇంగ్లీష్ నుంచి ప్రముఖ కథారచయిత్రి పి.సత్యవతిగారు తెలుగులోకి చాలా సరళంగా అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.
(రంగనాయకమ్మగారు ‘ హిజ్రా సమస్య’ అనే పేరుతో రాసిన ఓ వ్యాసంలో ఈ సమస్యతో బాటు స్వలింగ సంపర్కుల సమస్య గురించి కూడా చర్చించారు. అది ఆమె వ్యాస సంపుటి‘అభ్యుదయ ప్రేమలు’ లో ఉంది.)
*****
పి యస్ ప్రకాశరావు రిటైర్డ్ టీచర్, కాకినాడ.
M. phil : దాశరధి రంగాచారయ నవల ‘ మోదుగు పూలు – ఒక పరిశీలన ’.
P.hd : ‘నూరేళ్ళ పంట’ (వందమంది రచయిత్రుల కథా సంకలనం)
రచనలు :
1. లేడీ డాక్టర్ (కవితారావు గారి ఇంగ్లీష్ పుస్తకానికి పరిచయం) డా. చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ
రామచంద్రపురం ప్రచురణ
2. గురజాడమాట – ప్రగతికి బాట JVV కాకినాడ ప్రచురణ
3. తొలి పార్లమెంట్ లో డా. చెలికాని రామారావు ( వేరొకరితో కలిసి ఇంగ్లిష్ నుంచి అనువాదం)
4. డా. చెలికాని రామరావు జీవన రేఖలు ( వేరొకరితో కలిసి రచన )
ప్రజాసాహితి, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, తెలుగు వెలుగు (మాసపత్రిక), దారిదీపం పత్రికలలో వ్యాసాలు,
సోషల్ మీడియాలో :
మక్సిం గోర్కీ, ఎంగెల్స్, ఆర్వీయార్, రంగనాయకమ్మ, రావిశాస్త్రి, ఆవంత్స సోమసుందర్, వీరేశ లింగం ఆరుద్ర, రాంభట్ల, శ్రీ శ్రీ రావు కృష్ణారావు, రారా, తిరుమల రామచంద్ర, మహీధర నళినీ మోహన్, కొ. కు, గిడుగు, శ్రీపాద, దర్శి చెంచయ్య అబ్రహం కోవూర్, తాపీ ధర్మారావు, సుందరయ్య, ఆలూరి భుజంగరావు, జవహర్లాల్
నెహ్రూ, పెరుమాళ్ మురుగన్, గాంధీ, అప్పలనాయుడు , డి. ఆర్ ఇంద్ర, అబే దుబాయ్ ‘ హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్’ (పుస్తకం నుండి కొన్ని వ్యాసాల అనువాదం) టాల్ స్టాయ్ మొదలైన రచయిత్ల పుస్తకాల పై సమీక్షలు.