కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-18

“శ్యామల” – ఆచంట కొండమ్మ

 -డా. సిహెచ్. సుశీల

          1935 గృహలక్ష్మి పత్రిక జూన్ నెలలో ప్రచురింపబడిన ఆచంట కొండమ్మ రచించిన ” శ్యామల” కథ ఒక ‘ట్రయాంగిల్ లవ్ స్టొరీ ‘. ఆ రోజుల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఒక ఆశ్చర్యం. అదీ ఒక రచయిత్రి రాయడం అంటే సంచలనమే. ఆడపిల్లలు కాలేజీ చదువుల వరకు రావడం, పొరుగూరుకి వెళ్ళి చదవడం, అక్కడ ‘ప్రేమ’ చిగురించడం అనే కథాంశం స్వీకరించిన రచయిత్రి ఆచంట కొండమ్మ సాహసశీలి అని చెప్పవచ్చు.
***
 
శ్యామల
 
కథలోని ప్రథాన పాత్ర పేరే కథకు శీర్షిక “శ్యామల” గా రచయిత్రి పెట్టారంటే కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
 
          ఏలూరులో మోహనరావు గారు ఒక ప్రసిద్ధి చెందిన ప్లీడర్. ఆయనకు పద్దెనిమిదేళ్ళ కుమార్తె శ్యామల, పదేళ్ళ కుమారుడు రామారావు ఉన్నారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత భార్య చనిపోవడంతో, పిల్లలకు ఏ లోటు రాకుండా అన్ని విధాల తల్లి తండ్రి తానే అయి పెంచారు మోహనరావు. వారి పక్క వీధిలో నాగభూషణరావు, రాజేశ్వరమ్మ దంపతులు ఉన్నారు. పెద్ద మేడ, కొన్ని భూములు గల ఆసామి ఆయన. ఆయన కుమారుడు కమలాకరరావు. పిల్లలు ముగ్గురు చాలా చనువుగా, సంతోషంగా ఆడుకునేవారు. రాజేశ్వరమ్మ కూడా వీరిని ప్రేమగా చూసుకునేది. కమలాకరంకి శ్యామల అంటే మనసులో ప్రేమ ఉంది కానీ ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. శ్యామల మాత్రం కేవలం స్నేహంగానే మసలేది.
 
          శ్యామల మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత ఎఫ్ ఏ చదువుకో మద్రాసుకు పంపాలనుకున్నారు మోహనరావు. కమలాకరంతో శ్యామల వివాహం చేస్తే బాగుంటుం దని మోహనరావు కూడా అనుకున్నారు.
 
          కమలాకరాన్ని తండ్రి కాశీలో ఇంజనీరింగ్ చదువుకి పంపాలనుకోవటంతో అతను విచారంగా రామారావుతో తన బాధను వ్యక్తపరిచాడు. అప్పుడే  అక్కడికి వచ్చిన శ్యామల “కమలం! ఏల ఎంత విచారం! ఎక్కువ విద్య నేర్చి మంచి ఉన్నత ఉద్యోగం సంపాదించి ఒక గృహస్థుడివై తల్లిదండ్రులను సంతోష సుఖపెట్టుట కదా నీవంటి వారి స్వభావం! ఎల్లకాలము అందరము ఒకచోట ఉండటం తటస్ధించునా! నన్ను మా తండ్రి చెన్న పట్నంకు పంపదలచినారు”  అన్నది ధైర్యంగా. కమలాకరం మిత్రులను విడవలేక విడువలేక వెళ్ళినాడు.
 
          శ్యామల చెన్నపట్నంలో ఎఫ్.ఏ.  చదువుకు వెళ్ళినది. అక్కడ పద్మిని అనే స్నేహితురాలు దొరికినది. ఆమె అన్న కృష్ణారావుతో కూడా స్నేహం లభించింది. ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు బీచ్ కి వెళ్ళినప్పుడు కృష్ణారావు తన మనసులోని  ప్రేమను శ్యామలకు చెప్పాడు. శ్యామల కూడ అంగీకరించింది. సెలవులకు ఇంటికి వచ్చిన శ్యామల తండ్రికి కృష్ణారావు విషయం చెప్పింది. ఆయన మనసులో కమలాకరం ఉన్నా, కూతురు మాటకు విలువనిచ్చాడు. రెండు కుటుంబాల మధ్య మాటలు జరిగాయి.
 
          తన కూతురు పెళ్ళికి పెళ్ళిపీటల మీద కూర్చొని కన్యాదానం చేయవలసిందిగా మోహనరావు నాగభూషణం దంపతులను కోరారు. ఇంటికి వచ్చిన  కమలాకరం ఈ పరిణామాలకి దిగ్భ్రాంతికి లోనైనాడు. పెళ్ళి హడావుడిలో ఉండి కూడా శ్యామల కమలాకరాన్ని చూసి ఆనందంగా పలకరించింది. కానీ కమలాకరం ప్రేమ ధ్యాసలో మాట్లాడబోయాడు.
 
          ” కమలాకరా! ఎట్టి వెర్రి భ్రమలో  ఉఃటివి! స్త్రీల హృదయమును పూర్తిగా గ్రహించ నిదే పురుషులు ఇట్టి ఆసరాను కల్పించుకొని, తిరిగి స్త్రీలను ఇట్లు నిష్టూర్య పరచుట భావ్యమా!” అంది శ్యామల. పైగా కృష్ణారావు చెల్లెలు, తన స్నేహితురాలు పద్మిని  మంచిదని, ఆమెను వివాహమాడవలసిందని కోరింది. అతడూ ఆమె మాటను గౌరవించాడు. రెండు పెళ్ళిళ్ళు వైభవంగా జరిగాయి.
 
          ట్రయాంగిల్ లవ్ స్టోరీలకి కొత్త కొత్త హంగులు చేర్చి పాతకాలంలో చాలా సినిమాలు తీసేవారు. పాత్రలు ఎవరూ తమ మనసులోని విషయాలు చెప్పుకోరు. చివరి వరకు సాగదీస్తారు. కానీ ఒక రచయిత్రి ఈ కథలో “స్త్రీల ఉన్నత విద్యను, ప్రేమను” వర్ణించటం గొప్ప విషయమే. తన ప్రేమను తండ్రికి చెప్పి ఒప్పించటం శ్యామల ధైర్యానికి ప్రతీక.
 
          తనపట్ల ప్రేమ భావనని మనసులో పెట్టుకున్న కమలాకరానికి స్పష్టంగా తన మనసును, తను కృష్ణారావుని ప్రేమించిన విషయంను నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పటం బాగుంది.
 
          “స్త్రీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకుని, తమ మానాన తాము ప్రేమ (?) పెంచుకోవడం, తనను కూడా ‘ప్రేమించమని’ వేధించడం” రానురాను పరిపాటిగా మారింది. ప్రేమించకపోతే నరికెయ్యడమో, యాసిడ్ పోయడమో నేటి ఉన్మాదం. స్త్రీ మనసుకి గౌరవం ఇవ్వడం అనేదే లేదు. ఇది ‘నాగరికత’ అనిపించు కుంటుందా! స్త్రీ తన మనసును నిర్భయంగా వెల్లడించడం, దానిని ఎదుటి వ్యక్తి గౌరవించడం చాలా చాలా అరుదు.
 
          అలాంటిది – ఆ రోజుల్లో ఒక ధైర్యవంతురాలిని, విద్యావంతురాలిని, వివేకవతిని చిత్రించిన ఆచంట కొండమ్మ చిత్రించిన “శ్యామల” పాత్ర  చాలా సమంజసంగా అర్థవంతంగా ఉంది.

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us: