కాదేదీ కథకనర్హం-4

రొట్టె ముక్క

-డి.కామేశ్వరి 

          రైలు కీచుమంటూ ప్లాట్ ఫారం మీద ఆగింది. అంతవరకు నిద్ర పోతున్నట్టున్న ప్లాట్ ఫారం ఒక్కసారిగా మేల్కొంది. రైలు ఆగడం చూసి అంతవరకు చింతచెట్టు కింద గోటేబిళ్ళ ఆడుతున్న పెంటిగాడు, సిన్నిగాడు ఒక్క పరుగున వచ్చి గద్దల్లా వ్రాలారు రైలు దగ్గిర. అక్కడనించి వాళ్ళ ఆకలి పాట మొదలు “అమ్మా ఒక ముద్దపడేయి తల్లీ — బాబూ నిన్నకాడ నించి గంజి నీళ్ళు లేవు ఒక పైసయియ్యి బాబూ, సిన్న రొట్టె ముక్క దెయ్యి తల్లీ మీకు పున్నెం వుంటది. అమ్మా- బాబూ మీ కాల్లకీ దండం బాబూ’ అరిగి పోయిన గ్రామఫోను ప్లేటులా ప్రతి రైలు వచ్చేసరికి ఆ పాట మొదలుపెడ్తారు. యీగల్లా రైల్లో తింటున్న వాళ్ళ మీద ముసురుతారు. జలగల్లా పట్టుకు పీకుతారు. తింటున్న వాళ్ళు వాళ్ళ కాకిగోల భరించలేక, వాళ్ళ గజ్జి చేతులు, చింపిరి తలలు, కళ్ళ పుసులు, దినమొలలు చూసి తింటున్న తిండి మింగుడు పడక వాళ్ళని వదిలించుకుంటే చాలని తింటున్న అన్నం ఓ ముద్దో— ఓ రొట్టె ముక్కో తిట్టుకుంటూ పడేస్తారు. యిచ్చే వరకు కంపార్ట్ మెంట్ కిటికీ పట్టుక వేళ్ళాడతారు— రైలు కింద నించి పాముల్లా జరజర పాకి యీ ప్లాట్ ఫారం మీద నించి ఆ ప్లాట్ ఫారంకి యీ రైలు పెట్టె నించి మరో రైలు పెట్టెకి’ ఎగబాకుతారు —–ప్లాట్ ఫారం అంతా కలయతిరుగుతారు. టీ స్టాలు వాడిని బతిమిలాడ తారు —–కాంటినీ వాడిని దేబిరిస్తారు —బెంచీల మీద కూర్చున్న ప్రయాణీకుల ప్రాణాలు తోడ్తారు. ఓ ముద్ద అన్నం కోసం , ఓ రొట్టె ముక్క కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఆ చిన్న కడుపు కోసం వాళ్ళ ఆరాటం అంతా యింతా గాదు!

          పెంటిగాడు, సిన్ని గాడు కవలలు – ఎనిమిదేళ్ళ క్రితం అదే ఫ్లాట్ ఫారం మీద అదే చింతచెట్టు కింద ఓ గొనె పరదా చాటున, మరో గొనె పరదా మీద ఓ ముష్టి తల్లి వాళ్ళిద్ద రిని కని పడేసింది. వాళ్ళిద్దరి తండ్రి ఎవడో ఆ తల్లికే తెలియదు. ముష్టి సింహాద్రికే పుట్టారో, లైసెన్సు కూలీల్లో ఎవడికి పుట్టారో, స్వీపర్ నర్సింహులు, రంగడికే పుట్టారో ఆ దేముడికే తెలియాలి. ముష్టిదైతేనేం శరీరం నిండా రోగాలుంటేనేం , వళ్ళంతా దుమ్ము కొట్టుకునుంటే నేం, తల నిండా పేలు కులకుల్లాడితేనేం , మైలు దూరానికి కంపు కొడితేనేం అవసరానికి అడదన్న నిజం మరచిపోలేని వాళ్ళలో ఏ పుణ్యాత్ముడో ఆమెకి మాతృత్వం ప్రసాదించాడు — ఆ మాతృత్వం ఆమె పాలిట వరం గాదు, శాపం! ఒకరికి యిద్దరు భూమ్మీద పడ్డాక ‘నా కడుపుకే లేదు, ఈ గుంటేదవల్ని ఏటి పెట్టి సాకను ,’ అంటూ నెత్తి బాదుకుంది. ‘నారు పోసినోడు నీరు పొయ్యడేటి , నీవు బతకడం లేదా, నాను బతకడం లేదా అల్లే పెరుగుతారు గాలికి ధూళికి’ అంటూ ఓదార్చింది మరో ముష్టి తల్లి.

          అలాగే గాలికి, ధూళికి పెరిగినట్టే  —– ఆ చెట్టు కిందే పెంటిగాడు, సిన్నిగాడు పెరిగారు. చింతచెట్టు కింద ఎండలో వళ్ళు కాచుకున్నారు, వర్షం నీళ్ళలో స్నానం చేశారు. చెట్టు కింద దుమ్ము పౌడరు రాసుకున్నారు — పక్షుల కిలకిలా రావాలే జోల పాటలయాయి—– చింత చెట్టుకిందే పారాడడం నేర్చుకున్నారు –ప్లాట్ ఫారం మీద అడుగు లేయ్యడం నేర్చారు. రైళ్ళ కూతల మధ్య పలుకులు నేర్చారు. ముష్టితల్లి యిద్దర్నీ చెరో చంకని జోలె కట్టుకుని వచ్చే పోయే రైళ్ళ దగ్గిర అడుక్కునేది —- దొరికిన దేదో పిల్లల నోట్లో యింత పెట్టి తన నోట్లో యింత పెట్టుకునేది — ఏం దొరకని నాడు తిని పారేసిన ఎంగిలాకులు నాకి, పంపులో నీళ్ళు కడుపు పట్టినన్ని తాగేవారు. చెట్టు కింద పిల్ల లిద్దరిని చెరో పక్కని పెట్టుకుని పడుకునేది ఆ తల్లి —- పెంటిగాడు, సిన్నిగాడు నడక, మాటలు నేర్పిం దగ్గిర నించి తల్లి వెంట అడుగు వేసి , చిన్న చేతులు చాపి, ‘అమ్మా బువ్వ – ఒక ముద్దా తల్లీ — మీకు దండం తల్లీ —‘ అని అడుక్కోడం నేర్చారు.

          పిల్లలకి అడుక్కోడం వచ్చేసింది. యింక తన అవసరం లేదన్నట్టు రెక్క లోచ్చిన పక్షులని వదిలిపోయిన పక్షిలా ఆ ముష్టి తల్లి కలరా సోకి ఆ చెట్టు కిందే కన్ను మూసింది — ఆ మూడేళ్ళ దిక్కు మొక్కు లేని ఆ పిల్లలని చూసి తోటి ముష్టి వాళ్ళు జాలిపడి అడుక్కు తెచ్చుకున్నది తలో కాస్త ముద్ద పడేసేవారు. టీ స్టాల్ వాళ్ళు సీనా రేకు డబ్బా లో యింత టీ పోసి చెల్లని పాసిపోయిన రొట్టె ముక్కలు పడేసేవారు. కాంటీను దగ్గిర ఎంగిలాకులు ఏరుకుని నాకేవారు. రైలు ఆగగానే ప్రయానికుల ముందు చేతులు చాపె వారు. దొరికిందేదో తిని చెట్టు కింద పగలల్లా మట్టిలో దొర్లి దొర్లి ఆడి రాత్రి కాగానే వళ్ళేరగ కుండా ఒకరి నొకరు కౌగలించుకుని నిద్ర పోయేవారు.

          ఒక్క తిండి విషయంలో తప్ప వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులు — తిండి దగ్గిరికి వచ్చే సరికి మాత్రం బద్దశత్రువుల్లా మారిపోతారు. ఒకడి చేతిలో ఏదన్నా పడిందంటే రెండో వాడు ఎక్కడ అడుగుతాడోనని చేతిలోది చటుక్కున నోట్లో పెట్టేసుకుని గుటుక్కున మింగేస్తారు. అప్పుడప్పుడు ఒకడి చేతిలోది ఒకళ్ళు గద్దలా వాలి తన్నుకుపోతారు. దాని కోసం యిద్దరూ కుమ్ముకుంటారు. కుళ్ళ బోడుచుకుంటారు. జుత్తు పీక్కుంటారు. బండ బూతులు తిట్టుకుంటారు. కాసేపు ఏడ్చుకుని తరువాత మరచిపోయి మరో రైలు వచ్చే సరికి యిద్దరూ కలిసి పరిగెత్తి ఏక కంఠంతో ముష్టి పాట మొదలుపెడ్తారు.

***

          పెంటిగాడు , సిన్నిగాడు అప్పటికి తిండి మొహం చూసి ముప్పై గంటలయింది – నిన్నటి నించి ఎంగిలాకులలో పచ్చళ్ళు — మిగిలిన కూర ముక్కలు అయినా తినడం కుదరలేదు. నిన్న ఉదయం జరిగిన ఒక ఉదంతం వాళ్ళిద్దరి నోట దుమ్ము కొట్టింది. నిన్న ఉదయం మెయిలు వచ్చి ఆగగానే పెంటిగాడు, సిన్నిగాడు యధాప్రకారం ముష్టిపాట మొదలుపెట్టి ప్రయాణీకులని పీడించడం మొదలు పెట్టారు. ఒక ఫస్టు క్లాసు కంపార్టు మెంటులో ఓ పెద్ద ప్రభుత్వాధికారి బ్రేక్ ఫాస్ట్ తింటున్నాడు — పెంటిగాడు కిటికీ పట్టుకు వేళ్ళాడుతూ ‘బాబూ చిన్న రొట్టెముక్క పడేయండి, మీ కళ్ళకి దండం బాబు, కడుపు మండి పోతంది బాబూ – “అంటూ – ఫో — ఫో — అని కసిరినా ,విసుక్కున్నా వదలకుండా జలగలా పట్టుకున్నాడు. — అయన తింటున్న అమ్లేటు ఆశగా, ఆబగా చూస్తూ వాసన ఆఘ్రాణిస్తూ నోట చొంగ కారుస్తూ ఆకలి చూపులతో , గజ్జి చేతులతో దేబిరుస్తున్న వాళ్ళిద్దరినీ చూడగానే తింటున్న ఆమ్లెట్ గొంతు దిగనంది ఆయనకి. హాయిగా పేపరు చదువుకుంటూ బ్రేక్ ఫాస్టు ఎంజాయ్ చేయనీయకుండా , మూడు దవ్వ బిళ్ళల్లాంటి రూపాయలిచ్చి అర్దరిచ్చిన యీ బ్రేక్ ఫాస్ట్ ఈ ముష్టి వెధవల కోసం అన్నట్టు అడుగుతున్న వాళ్ళిద్దరిని చూసేసరికి దొరగారికి తిక్కరేగింది. ఆఫీసులో రెండు వేలు తెచ్చుకునే అధికారయినా ఎదురుగా చేతులు కట్టుకుని నిల్చుని చెప్పింది తుచ తప్ప కుండా పాటించడం మాత్రం అలవాటయిన ఆ అధికారిగారికి ఆఫ్ ట్రాల్ ముష్టి వెధవలు తన మాటకి గడ్డి పోచకన్నా విలువ యీయకుండా , కేకలేస్తున్ననిర్లక్ష్యంగా నిలబడిన వాళ్ళిద్దరిని చూసేసరికి అయన కోపం కంట్రోలవలేదు – చేతిలో ఆమ్లెట్ ప్లేటులో విసిరి కొట్టి – చరచర కంపార్టు మెంటు దిగి , బిరబిర స్టేషన్ మాస్టర్ రూమ్ వైపు నడిచాడు. అక్కడ అగ్నిపర్వతం బద్దలయినట్టు బరస్ట్ అయ్యాడు. అ స్టేషన్ మాస్టార్ని చెడామడా తిట్టాడు. దేశంలో ముష్టి వెధవలందరినీ శపించాడు. ముష్టి వెధవల్ని ప్లాట్ ఫారం మీదకి అడుగు పెట్టకుండా కంట్రోల్ చేయలేని అతని అసమర్ధతని దుమ్మెత్తి పోశాడు. స్టేషన్లనీ స్టేషను మాస్టర్లనీ , రైల్వే సిబ్బందిని, ముష్టి వెధవల్ని, పీడరీకన్నీ, డర్టీ ఇండియాని తిట్టి తిట్టి ఆఖర్ని ముష్టి వెధవన్న వాడు ఫ్లాట్ ఫారం మీద కనిపిస్తే నీ ఉద్యోగం ఊడదీస్తా, చిప్ప చేతికిస్తా —– అంటూ రైలక్కడ యిరవై నిమిషాలు ఆగుతుంది కనక సావకాశంగా తిట్టి —- ఆఖరి వార్నింగ్ యిచ్చి ఊపిరి పీల్చుకున్నాడు ఆ అధికారి.

          ‘ఎవడవయ్యా నీవు —–నీ మోచేతి కింద నీళ్ళు తాగుతున్నామా , నీ బాబుగాడి సొమ్ము జీతం యిస్తున్నారా పోవయ్యా నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను….ఆ హాహా –ప్లాట్ ఫారం మీదకి ముష్టి వెధవని రాకుండా చెయ్యడమా …. ఇదేదో పెద్ద జోక్ సార్ —-ఎప్పుడూ వినలేదు . మీరేదో పిచ్చివాళ్ళులా వున్నారు సార్ , వాళ్ళని ఆపడం , రానీకుండా చెయ్యడం అన్నదీ నాకే కాదు, నన్ను పుట్టించిన  దేముడికైనా చేతకాదు  —ప్రైం మినిష్టరోచ్చినా ఏం చెయ్యలేడు — వెళ్ళండి సార్ ——– మీ కోపం యింట్లో పెళ్ళాం పడితే ఆవిడ మీద చూపుకోండి , అంతేకాని నా మీద కాదు చూపడం , ఆహాహా ఉద్యోగం ఊడబీకిస్తావూ ——అసలింతకీ నీవేవడివయ్యా —— ఏ బోడి అధికారంతో నన్ను నిలబెట్టి దులుపుతున్నావు ——-రైల్వే మినిస్టరువా, సెక్రటరీవా– ఆ చెప్పు వింటాను – కావలిస్తే కంప్లయింటు రాసుకో- ఫో – ఫో ….అనేద్దామనుకున్నాడు స్టేషను మాస్టరు ఆవేశంగా. అనేసేవాడే ——- ఖర్మ కొద్దీ ఎమర్జన్సీ వుండబట్టి కోపం కంట్రోల్ చేసుకున్నాడు. ఏ పుట్టలో ఏ పాముందో వీడెవడో ఇంత ఎత్తు ఎగురుతున్నాడంటే ఎంతేత్తాఫీసరో అయే వుండచ్చు —వీడి కోపం మండిపోనూ – నిజంగా కంప్లయింట్ రాశాడంటే — ఎమర్జన్సీ దేబ్బాల్లో ఉద్యోగం ఊడినా ఊడచ్చు అని ……..లోపల్నించి తన్ను కొచ్చిన కోపాన్ని పౌరుషాన్ని శివుడు గొంతులో గరళం యిముడ్చుకున్నట్టు యిముడ్చుకుని — మరీ భయపడినట్లు కనిపించడానికి నామోషి అన్పించి కాస్త దర్పం గా తలెత్తి —‘ ఏం చెయ్యమంటార్ సార్ . ఆ వెధవలు యిటు తన్నితే అటు వస్తారు —- ఈ మిష్టి వెధవల్ని తోలడమేనా మాకున్న డ్యూటీ …..’ అన్నాడు కాస్త దబాయిస్తున్నట్టు.

          ‘ఆఫ్ కోర్స్ – అదీ నీ డ్యూటీలో భాగమే – స్టేషనులోకి ప్రతి ముష్టి వెధవా జొరబడి ప్రయాణికులని యిబ్బంది పెట్టకుండా కంట్రోలు చెయ్యడం నీ డ్యూటీ ‘ అన్నాడు ఆఫీసరు మరింత ఫైరవుతూ ——-తన పై అధికారి కాకుండా మరెవరో వచ్చి చెడామడా నిలబెట్టి దులిపెస్తుంటే , చుట్టూ జనం మూగి వింత చూస్తుంటే అవమానం ముంచుకు వచ్చింది. పౌరుషం తలెత్తింది . మొహంలో రక్తం పొంగి ఎర్రబడింది. ఏదో అనేలోపలె యింకా పూర్తవ్వలేదన్నట్టు ఆఫీసరు తోటి ప్రయాణికులు సపోర్టు బలంతో మరింత పుంజుకుని విజ్రుంభించి “నీ డ్యూటీ కాదంటే —- నీ డ్యూటీ నీవు చెయ్యలేనంటే చెప్పు — అది నీ డ్యూటీ కాదో అవునో పైవాళ్ళనే తెల్చమంటాను. ఏదీ కంప్లయింట్ బుక్ యిలాతే — నేనెవరో తెలుసా ——నే తల్చుకుంటే ….నీవు మరింక ఏ డ్యూటీ చెయ్యక్కర లేకుండా చేసేస్తా ——-‘ అంటూ  యింగ్లీషులో అరిచాడు . చుట్టూ జనం —-‘ అవునండి ఎవరో వకరు కలగజేసుకోకపోతే లాభం లేదు — చా –చా  — తిండి తిననీరు, కంపార్టుమెంటులో చొరబడి పోవడం, రామ – రామ – ప్రయాణం అంటే అసహ్యం ….కావాల్సిందే – బొత్తిగా ఎవడికీ పట్టనట్టూరుకుంటే వాళ్ళు జలగల్లా పీక్కు తినకేం చేస్తారు. స్టేషను మాస్టర్ ఆ మాత్రం కంట్రోలు చెయ్యకపోతే మరింకెందుకు ….నాలుగు తగలనిస్తే మళ్ళీ వస్తారా….” ప్రయాణీకులంతా అఫీసరుతో కలిసి పోగానే స్టేషను మాస్టరు మొహం మరింత ఎర్రబడి పోయింది.

          “ఏం కంప్లయింట్ రాయమంటారా —-మళ్ళీ ప్లాట్ ఫారం మీద ముష్టి వెధవల్ని రాకుండా కంట్రోల్ చేస్తావా —– నీతో ఆర్గ్యూ చేయడానికి నాకు టైము లేదు –‘ అసహనంగా అరిచాడు ఆఫీసర్.

          “మీరు వెళ్ళండి సార్. మరెప్పుడూ యిలా జరగకుండా చూస్తాం లెండి. ట్రైను కదులుతుంది. పదండి సార్’ యిద్దరు ముగ్గురు టికెట్ కలక్టర్లు, గార్డు అంతా రాజీ ధోరణిలో మాట్లాడారు.

          “రైలు కదులుతుంది — ఎలా కదులుతుందో నేనూ చూస్తాను —— ఈ అంతు తేలందే కదలను ‘ ….ఆఫీసరు మొండి కేత్తాడు. స్టేషను మాష్టరు తల దించక తప్ప లేదు…..’ మీరు వెళ్ళండి సార్, ఏక్షన్ తీసుకుంటాను” అన్నాడు గొంతు పెగల్చుకుని ఆఖరికి.

          నిజంగానే ఏక్షన్ తీసుకున్నాడు. ఆఫీసరు జరిపిన అవమానం, నలుగురి ముందు జరిగిన పరాభవం —- దాని కంతటికీ కారణం ఆయిన ఆ గుంట వెధవల మీద చాలా పెద్ద ఏక్షనే తీసుకున్నాడు. కాంటీను దగ్గర ఎంగిలాకులు నాకుతున్న యిద్దరిని చెరో కాలితో తన్నాడు. బూటుతో కుళ్ళ బొడిచాడు, చేతిలో లాఠీతో కాళ్ళు విరగగొట్టాడు —కసిదీరా చెంపలు అదరగొట్టాడు —– గొడ్డుని బాదినట్టు యిద్దర్నీ బాది, ఇద్దర్నీ కలిపి పులిస్తరా కులు గోడ మీద నించి విసిరినట్టు స్టేషను కటకటాల మీద నించి రోడ్డు మీదకి విసిరేశాడు.

          బండబూతులు తిట్టాడు, మళ్ళీ ఆ చాయల కనిపిస్తే పాతేస్తానన్నాడు. లోపలికి అడుగు పెడితే కాళ్ళిరగకొడ్తానన్నాడు. నోరు మెదిపితే నాలుక తెగ గోస్తానన్నాడు. అరగంట సేపు వాళ్ళని తన్ని, కుమ్మి, తిట్టి తన కోపం శాంతించాక, “రాస్కేల్స్, డర్టీ రాస్కేల్స్ – లంజా కొడుకులు —- ఏ ముండో కని  పారేయడం —-ఈ వెధవలు మా పీకల మీద ఎక్కి కూచోడం …… గాడిద కొడుకులు యీసారి కనిపించండి …” అంటూ అరుస్తూ లోపలికెళ్ళాడు. పెంటిగాడు, సిన్నిగాడు యీ జరిగిన గొడవ కంతటికీ తామె కారణం అన్న సంగతి అర్ధం కాక స్టేషను మాష్టరు ఎందుకు కొడుతున్నాడో, తిడుతున్నాడో తెలియక కళ్ళప్పగించి బిక్కచచ్చిపోయి వుండిపోయారు. వాళ్ళిద్దరినీ కొట్టడం చూసి మిగతా ముష్టి వాళ్ళంతా తాత్కాలికంగా ఆ చెట్టు కింద నించి జారుకున్నారు.

          వంటికి అంటుకున్న దుమ్ము – నోట్లోంచి కారిన రక్తం చెక్కుకు పోయి మండుతున్న గాయాలు కారే కన్నీళ్ళు అన్నీ తుడుచుకున్నాక తోటి ముష్టివాళ్ళు ఆ దెబ్బలకి కారణం చెప్పాక మళ్ళీ ఆ స్టేషను లోపలికి అడుగు పెట్టడానికి ధైర్యం చాలలేదు. యిద్దరూ బితుకుబితుకుమంటూ ఆ గజాల దగ్గిరే ముడుచుకు కూర్చున్నారు. వాళ్ళిద్దరూ పుట్టి బుద్ది ఎరిగిన ఈ ఎనిమిదేళ్ళలో ఆ స్టేషను తప్ప బయట ఓ ప్రపంచం వున్నదన్న సంగతి ఎరగరు – ఆ స్టేషను ఆవరణ దాటి ఎరుగని ఆ యిద్దరూ స్టేషనులోకి రావద్దంటే మరెక్కడన్నా వెళ్ళి అడుక్కోవచ్చని కూడా తెలియనంత అయోమయంలో, ఎక్కడి కన్నా వెడితే తల్లి నించి తప్పడి జనంలో కలిసి పోతామని తల్లి కొంగు విడవని పసివాళ్ళ లా ఆ స్టేషను గజం బద్దలు పట్టుకుని వచ్చేపోయే రైళ్ళను చూస్తూ, అమ్మే తినుబండా రాలు చూస్తూ కింద విసిరేసిన ఎంగిలాకులు చూస్తూ నోట చొంగ కార్చుకుంటూ , ఆశగా, ఆబగా, దీనంగా ఆ రోజంతా ఆకలి కడుపులతో నకనకలాడి, రాత్రి కాంగానే ఆ మట్టిలోనే ఆ గజాల నానుకునే నిద్ర పోయేరు.

          తెల్లారాగానే —– నిన్న భయానికి అణిచి పెట్టిన ఆకలి మండి ఏమయినా ఆగ నన్నట్టు విజ్రుంభించింది. పెంటిగాడు, సిన్నిగాడు నకనకలాడుతున్న కడుపులని ఎలా నింపుకోవాలో తెలియక బిక్కమొహాలు వేసుకు నిల్చున్నారు. ధైర్యం చేసి గజాల మధ్య నించి దూరి ఫ్లాట్ ఫారం మీదకి వెళ్ళాలన్న ఆరాటాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టమయి పోసాగింది వాళ్ళకి. మరుక్షణం నిన్న కొట్టిన దెబ్బలు తాలూకు నల్లగా కమిలిపోయిన , రక్తం కారిన, చెక్కుకు పోయిన గుర్తులు కళ్ళ ముందు కనపడుతుంటే – ఆకలి ముందుకు లాగుతుంటే భయం వెనక్కి లాగుతుంటే ఏం చెయ్యాలో తెలియక గజాలు పట్టుకు నిల్చున్నారు.

          అదే సమయంలో మెయిలు వచ్చి ఆగింది. గజాల అవతల నిలబడ్డ వాళ్ళిద్దరి ఎదురుగా ఓ ఫస్టు క్లాసు కంపార్టుమెంటు ఆగింది.

          అక్కడ కిటికీ దగ్గిర ముద్దులు మూటకట్టె ఐదేళ్ళ పిల్లాడు కూర్చుని అటూ యిటూ చూస్తున్నాడు. పిల్లాడికి యిరుపక్కలా అందం, యవ్వనం , ఐశ్వర్యం , ఆధునికత కలిసి మిసమిసలాడుతున్న తల్లిదండ్రులు కూర్చున్నారు. రైలు ఆగగానే కంపార్టుమెంటులోకి బేరార్ బ్రేక్ ఫాస్టు ట్రే తీసుకు వెళ్ళాడు. ఆ ట్రేలో నుంచి ఓ సాండ్ విచ్ తీసి కుర్రాడికి యిచ్చి తినమని బ్రతిమాలాడుతుంది తల్లి. కుర్రాడు వద్దంటూ తల అడిస్తున్నాడు. కుర్రాడి చేతిలో బలవంతంగా సాండ్ విచ్ పెట్టి తల్లి తండ్రి కాఫీ తాగసాగారు. కుర్రాడు చేతిలో రొట్టె పట్టుకుని తినకుండా ప్లాట్ ఫారం మీద సందడి కుతూహలంగా గమనిస్తు న్నాడు.

          ఆ కుర్రాడి చేతిలో రొట్టె చూసేసరికి పెంటిగాడికి సిన్నిగాడికి మరిచిపోయిన ఆకలి విజ్రుంభిన్చింది. ఆ రొట్టె చూడగానే యిద్దరి కళ్ళు మిలమిల్లాడాయి. నోట్లో నీరూరింది. యిద్దరి కళ్ళు కల్సుకున్నాయి. వెంటనే యిద్దరూ నిస్సహాయంగా , అటు యిటు తిరుగు తున్న టి.సి లని గార్డుని చూశారు. అంతలో పెంటిగాడి బుర్రలో ఓ ఆలోచన తళుక్కు మంది. వాడి కళ్ళు మెరిశాయి. ఆ రహస్యం సిన్నిగాడి చెవిలో ఊదాడు. యిద్దరూ రాబందుల్లా అవకాశం కోసం లేచారు.

          గార్డు విజిల్ వేశాడు. రైలు నెమ్మదిగా కదిలింది. వేగం అందుకుంటుంది. పెంటి గాడు చటుక్కున గజాల మధ్య నించి దూరి మెరుపులా పరిగెత్తి కిటికీ దగ్గిర కూర్చున్న కుర్రాడి చేతిలో రొట్టె ముక్క లాగేశాడు. మరో సెకనులో వెనక్కి పరిగెత్తేవాడే కాని వాడి ఖర్మ కాలి ఆ తండ్రి చూడడం ఏమిటి చటుక్కున ‘చోర్ చోర్’ అంటూ పెంటిగాడి చెయ్యి పట్టేశాడు. ఆ చేతిలోంచి తన చెయ్యి లాక్కోవాలని పెంటిగాడు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకపోయింది. భల్లూకం లాంటి ఆ పట్టు నించి తప్పించుకోలేక, రైలు వేగం అందుకుంటుంటే దాంతో సరిగా పరిగెత్తలేక, కుక్క నోట కరిచిన కోడి పెట్టలా గాలిలో కాళ్ళు తన్నుకుంటూ గిలగిల కొట్టుకున్నాడు. ‘చోర్ బద్మాష్ – పకడో – అంటూ తమ ధన ధాన్యాలు కొల్లగొట్టి నంత హడావుడిగా అరుస్తూ —- ‘పుల్ దట్ చైన్ ‘ అంటూ భార్య వంక తిరిగి అరిచాడు. పెంటిగాడు ఆఖరి ప్రయత్నంగా తన చెయ్యి పట్టుకున్న ఆ పెద్ద మనిషి చెయ్యి చటుక్కున కొరకడం ఆ పెద్ద మనిషి ఓ కేక పెట్టి పట్టు విడవడం రైలు వేగంతో బాలన్స్ కుదరక ప్లాట్ ఫారంకి రైలుకి మధ్య ఖాళీ స్థలంలో పెంటిగాడు పడడం, అంతవరకు తెల్లబోయి చూస్తున్న జనం హాహాకారాలు , సిన్నిగాడి కేవ్వుమన్న కేకతో – చైన్ లాగబడిన రైలాగింది.

          ఆగిన రైలు పెంటిగాడి కోసం మరి కాస్త ముందు కెళ్ళాక గాని పెంటిగాడు దొరక లేదు. దొరికిన పెంటిగాడు పెంటిగాడులా లేడు. ఏ ముక్కకాముక్క తెగిపడి రక్తం ముద్దలా వున్నాడు. రక్తం ముద్దని చూసి అంతా నోట మాట రాక ఒక్క క్షణం నిలబడిపోయారు. జనాన్ని తోసుకు ముందుకి పరిగెత్తి వచ్చిన సిన్నిగాడు — పెంటిగాడిని — తనకున్న ఏకైక బంధువు, తోబుట్టువు , ఆప్తుడు , మిత్రుడిని చూసి కేవ్వుమనలేదు. నెత్తి కొట్టుకుని ఏడవలేదు. ఒక్క క్షణం దిగ్భ్రాంతిలో నిలబడిపోయాడు. తరువాత వాడి కళ్ళు చురుకుగా దేనికోసమో వెతికాయి. రక్తం ముద్దకి కాస్త దూరంగా సిన్నిగాడు వెతుకుతున్నది కనపడిం ది. అది దూరంగా తెగిపడిన పెంటిగాడి చెయ్యి. ఆ చేతిలో గుప్పెట్లో బిగించిన రొట్టె ముక్క!! సిన్నిగాడు ఒక్క ఉరుకున అక్కడికి దూకి ఆ చేతిలోంచి రొట్టె ముక్క తీసి చటుక్కున నోట్లో పెట్టేసుకున్నాడు.

          అబ్బ – ఎంత ఘోరం – ఇంత చిన్న రొట్టె ముక్కకి ప్రాణం ‘కాపాడే శక్తే కాదు, తీసే శక్తి వుందని ఇవాళే తెల్సింది అనుకున్నారంతా.

*****

– జ్యోతి సౌజన్యంతో

( సశేషం)

Please follow and like us:

One thought on “కాదేదీ కథకనర్హం-4 రొట్టె ముక్క”

  1. డి. కామేశ్వరి గారి కధ ‘ రొట్టె ముక్క ‘ గుండెను పిండే కథనంతో, వాస్తవ చిత్రణ కళ్ళముందు జరుగుతున్న భావనను కలిగించింది! భాషా శిల్పం ఒక రాచకొండను, బీనాదేవిని గుర్తుకు తెచ్చింది!!
    కథను మళ్ళీ వెలికి తీసి ప్రచురించినందులకు ధన్యవాదములు. 💐🙏🤝😊

Leave a Reply

Your email address will not be published.