కుట్ర (హిందీ కథ)

(`साजिश’)

హిందీ మూలం – మాలతీ జోషీ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          మొత్తం ఇల్లంతా ఒక విధమైన టెన్షన్ నెలకొంది. అంతకు ముందురోజే పమ్మీ దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది. ఎప్పటిలాగే మొత్తం ఇల్లు ఒక ప్రకంపనకులోనై కదిలి పోయింది. నాన్నగారు డాబా మీద విరామంలేకుండా పచార్లు చేస్తున్నారు. అమ్మ వంటింట్లో కూర్చుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటోంది. సోహన్ చదువుకోవాలనే వంకతో స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయాడు. అన్నాలు తినే వేళ కూడా వాడు ముఖం  చూపించ లేదు. నిమ్మీ మరోపక్క ముఖం ముడుచుకుని తను చదువుకునే గదిలో కూర్చునివుంది. పిల్లలు అమాయకంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.

          మోహన్, షీలా అందరికన్నా ఎక్కువగా భయభ్రాంతులై దిగులు పడుతున్నారు. ఏమీ చెప్పలేక వాళ్ళు తమవాళ్ళ ముఖాలే చూడలేకపోతున్నారు. ఇద్దరూ ఒక విధంగా మౌనవ్రతం ధరించారు. నోట్లోంచి ఏదయినా అక్కరలేని మాట బయటికి వస్తే పేలుడు సామాను మీద నిప్పురవ్వ పడినట్లవుతుందని ఆందోళన చెందుతున్నారు. నిజానికి వాళ్ళిద్దరే ఎప్పుడూ నిందితుల్లాగా నేరస్థులబోనులో నిలబడుతున్నారు. ఇంట్లో మంచి-చెడ్డలు ఏంవచ్చినా వాళ్ళ తలమీదకే వస్తాయి.

          పమ్మీ దగ్గర నుంచి ఎప్పుడు ఉత్తరం వచ్చినా భార్యాభర్తలిద్దరూ ఏదో నేరం చేసినట్లు అనుభూతి చెందుతున్నారు. ఎందుకంటే ఆ ఉత్తరానికి మొట్టమొదటగా స్పందన అమ్మదగ్గర నుంచే వస్తుంది. ఆవిడ సణుగుడు అనబడే స్వగతభాషణం మొదలవుతుంది. “వీళ్ళకి చెల్లెలు భారమైపోయింది. వెనకా-ముందూ చూసుకోకుండా తీసుకెళ్ళి ఓ అగ్నిగుండంలో పడేశారు.”

          అమ్మకయితే ఏదో ఒకటి అంటూ ఉండాలి. ఆవిడ అనే ఇటువంటి మాటలతోనే విసుగెత్తిపోయి వాళ్ళు నిమ్మీకి సంబంధాలు చూసే విషయానికి వచ్చేసరికి కాస్త నెమ్మదించారు. ఇంక అమ్మ, నాన్నగారు వారు చెప్పదలుచుకున్నది వందసార్లు చెప్పారు- “ఇద్దరు అన్నయ్యలున్నారు. ఎందుకు? ఆనందంగా చేతులు ముడుచుకుని కూర్చున్నారు. రేపు పిల్ల ఎవరితోనైనా వెళ్ళిపోతే అప్పుడు వస్తుంది బుద్ధి.”

          మోహన్ కి, షీలాకి ఏకోశానా మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ పమ్మీ నుంచి ఉత్తరం వచ్చింది- “ఇప్పుడింక ఈ యింట్లో నేను మనుగడ సాగించలేను. మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళండి. లేకపోతే ఏదయినా తిని నేను శాశ్వతంగా వెళ్ళిపోతా ను.”

          పమ్మీ ఆడుతున్న ఈ నాటకం గత నాలుగు సంవత్సరాలుగా నడుస్తోంది. పెళ్ళి అయ్యాక ఈ అయిదేళ్ళలో ఒక్క సంవత్సరం మాత్రం కాస్త శాంతిగా గడిచివుంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తన పిల్లని ఎత్తుకుని తను ఇక్కడికి వచ్చేస్తుంది. మొదట్లో అయితే అందరూ తనని ఎంతో అభిమానంగా చూసేవారు. అందరికీ తనంటే సానుభూతి ఉండేది. నాన్నగారు స్వయంగా వెళ్ళి రెండు-మూడుసార్లు వియ్యంకుడు గారిని తన కూతురు చెయ్యని నేరాలకి క్షమాపణ అడిగి వచ్చారు. రెండు-మూడుసార్లు అల్లుడిని ఇంటికి పిలిచి నచ్చజెప్పారు. కాని అలా ప్రతిసారి ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎలా కుదురుతుంది?

          ఇప్పుడయితే ఇదంతా చూసి చిరాకు కలుగుతోంది.

          పమ్మీ వచ్చినప్పుడల్లా ఇంట్లో ఏర్పడిన రొటీన్ పరిస్థితి నాశనమైపోతోంది. బడ్జెట్ నామరూపాలు లేకుండా పోతోంది. షీలా ఆ రోజుల్లో తన అభిలాషలను, ఆలోచనలను మూటకట్టి మనస్సులో ఒకమూల పడేసి ఉంచుతుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ తమ-తమ పనుల్లో బయటికి వెళ్ళిపోతారు. పమ్మీ వ్యథాభరితమైన కథ, అత్తగారి దెప్పుళ్ళు తనవంతుకే వస్తాయి. ఇదంతా తను ఎలాగో సహించుకుంటుంది. కాని పువ్వుల్లాంటి తన లేతవయస్సు పిల్లలు నిర్లక్ష్యానికి గురి అయితే మాత్రం ఆమె రక్తం ఉడికిపోతుంది. వాళ్ళ బట్టలు, బొమ్మలు, ఆఖరికి వాళ్ళు తాగే పాలలో కూడా పమ్మీ కూతురు మున్ మున్ వాటా తీసి పెట్టవలసివస్తుంది. రోజంతా తాతగారు, నాయనమ్మల చివాట్లు పడుతూవుంటాయి. అది వేరే సంగతి.

          బాధపడుతున్న కూతురి కోసం అత్తగారు ఆ రోజుల్లో కాస్త ఎక్కువగానే ద్రవించి పోతూ, కరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో పిండివంటలు తయారవుతూ ఉంటాయి. అత్తగారు రోజూ పమ్మీని తీసుకుని బంధువుల ఇళ్ళకి వెడుతూ ఉంటుంది. రిక్షాలకి, గుర్రపుబళ్ళకి లెక్కలేకుండా డబ్బు ఖర్చు అవుతూ వుంటుంది. పమ్మీ మనస్సు తేలికపడేందుకు నిమ్మీని ఎలాగో ఒప్పించి ఆమెతోపాటు సినిమాకో, పార్కుకో పంపిస్తూ ఉంటుంది. ఈ అన్ని కార్యక్రమాలకి డబ్బులు షీలాయే ఇవ్వవలసివస్తుంది. అదికూడా సంతోషంగా. లేకపోతే అత్తగారి కోపం తారాస్థాయిని అందుకుంటుంది.  

          బడ్జెట్ దెబ్బతినేసరికి మొత్తం ఏర్పాటులన్నీ ధ్వంసం అయిపోతాయి. ప్రతి ఒక్కరూ మరొకరి పైన విసుగు చూపిస్తూ ఉంటారు. ఆరోపణలు-ప్రత్యారోపణలు ఒక క్రమంగా మొదలవుతాయి. ఇల్లు ఒక విధంగా నరకంగా మారుతుంది. అప్పుడు పమ్మీ అంటుంది- “ఇదే సహించుకోవాలంటే నాకు నా యింట్లో ఏం బాగుండలేదని?”

          మొత్తం ఇల్లంతా ఊపిరి బిగబట్టి ఆక్షణం కోసమే ఎదురుచూస్తూ జీవిస్తుంది. మామయ్యగారు వెంటనే ఆ మాట పట్టుకుని ప్రయాణం ఏర్పాట్లు చెయ్యమని ఆదేశిస్తారు. ఆ తరువాత బోలెడు సామానుతో, వస్తువులతో అన్నయ్యలు ఆమెని అత్తవారింట్లో దిగబెట్టి వస్తారు. ఆ వీడ్కోలు వల్ల కూడా ఇంతా-అంతా ఇబ్బంది కాదు. ఇంట్లోని సామాన్యమైన ఆదాయంలో అది ఒక పెద్ద రంధ్రాన్ని, లోటుని ఏర్పరుస్తుంది. చాలా అవసరమైన ఖర్చులు, మచ్చుకి అత్తయ్యగారి చెప్పులు, మామయ్య గారి టానిక్, సోహన్ కి స్వెట్టరు, నిమ్మీకి సూట్, మరో శుభముహూర్తం కోసం వాయిదా పడతాయి. అయినా, అందరూ ఊరటగా, తృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు.

          అయినా ఖర్చువిషయంలో ఏర్పడిన ఈ పెద్దలోటు సరిగా భర్తీకాకుండానే, పమ్మీ దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం వస్తుంది.

          రెండురోజుల పాటు నిర్విరామంగా టెన్షన్ అనుభవించిన తరువాత షీలా ఇంక ఉండలేక భర్తతో అంది- “చూడండి. మీరు రోజంతా బయటే ఉంటారు. వీళ్ళ చూపులని ఎదుర్కొంటున్నది నేను. నన్నేదో హంతకురాలిని చూసినట్లుగా చూస్తున్నారు.”

          “అయితే నేనేం చెయ్యను?”

          “వెళ్ళి ఆమెని తీసుకురండి.”

          “దానికి అర్థం ఏమిటో తెలుసుకదా నీకు?”

          “తెలుసు. కాని మరో మార్గం ఏముంది? రేపేమన్నా అయితే బతికి ఉన్నన్నాళ్ళూ అందరి దెప్పుళ్ళు, ఎత్తిపొడుపులు  వినవలసివస్తుంది.”

          మర్నాడు ఉదయం ఆఫీసుకి వెడుతూ మోహన్ అందరి ఎదురుగా అందరూ వినే టట్లుగా సోహన్ తో అన్నాడు- “ఏరా, ఈ రెండు వందలు తీసుకుని ఉంచుకో. మధ్యాహ్నం బండికి బయలుదేరి వెళ్ళు.”

          “ఎక్కడికి?”

          “జైపూర్. పమ్మీని తీసుకురా. తరువాత ఇక్కడ ఎలా ఏం చేయగలుగుతామో చూద్దాం.”

          అత్తయ్యగారి ముఖం ఒక్కసారిగా సంతోషంతో వికసించింది. ఆవిడ ఎంతో ఆసక్తిగా సోహన్ వంక చూస్తూ ఉండిపోయింది. కాని అతను ఒక రాతిబొమ్మలాగా కదలకుండా నిలబడి ఉండిపోయాడు. డబ్బు మీద అతను చెయ్యి కూడా వెయ్యలేదు. చివరికి మోహన్ మళ్ళీ అడగవలసివచ్చింది. “ఏం ఆలోచిస్తున్నావు?”

          “అన్నయ్యా, అక్క రెండునెలల తరువాత రాకూడదా?”

          “ఎందుకని?”

          “ఎందుకని ఏముంది, ఇది మార్చి నెల అని అందరికీ తెలిసిందే. మీకు మీ టీపూ, మీనూ గురించిన ఆలోచన లేకపోవచ్చు. కాని నా గురించి, నిమ్మీ గురించి కాస్త ఆలోచించండి. మా ఇద్దరికీ పరీక్షలు వచ్చి నెత్తిమీద కూర్చున్నాయి. ఇలాంటి సమయం లో అతిథులెవరైనాసరే వస్తే ఇబ్బందిగానే ఉంటుంది. అక్కయ్య సంగతి మీకు తెలుసు. వస్తూనే వాతావరణమంతా పాడుచేసి పెడుతుంది. ఇంట్లో అడుగుపెట్టాలంటేనే మనస్కరించదు. ఇంక మేము చదువేం చదువుతాం?”

          “నువ్వు అదృష్టవంతుడివి చిన్నన్నయ్యా.” నిమ్మీ తన స్వరం కూడా కలిపింది- “ఇంట్లో అడుగుపెట్టాలని అనిపించకపోతే ఫ్రెండు ఇంటికి వెళ్ళి చదువుకోగలవు. నేనేం చెయ్యను? అక్కయ్య వచ్చిందంటే ఎంతగా పని పెరిగిపోతుంది. తనయితే ఒక్క పనిలోనూ చెయ్యి పెట్టదు. రోజంతా ఏడుస్తూ కూర్చుంటుంది. ఆఖరికి కూతురిని చూసు కోవడం కూడా తనవల్ల కాదు. ఆ పనికూడా నా నెత్తిమీదికే వస్తుంది.”

          అత్తయ్యగారి ముఖం ఒక్కసారిగా కళాకాంతులు లేకుండా మ్లానమైపోయింది—“మీ యిద్దరికీ మీ స్వంత అక్కయ్య కూడా అంత పనికిరాకుండా పోయిందర్రా. ఏమి కలి యుగం వచ్చిపడిందిరా.”

          కాని షీలా సంతోషంగా ఉంది. కనీసం పమ్మీ రావడం అంటే మొత్తం ఇంటిల్లిపాదికీ ఎంత ఇబ్బందికరమైనదన్న సంగతి అత్తయ్యగారికి తెలిసింది. అన్నిటికన్నా సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ఆ చెప్పిందేదో సోహన్ చెప్పాడు. పైగా నిమ్మీ కూడా చెప్పింది. మోహన్, షీలానెత్తిమీదకి తప్పుచేసిన నేరారోపణ ఏదీ రాలేదు.

          ఆ తరువాత ఆ ప్రసంగం ఒకవిధంగా ముగిసిందనే చెప్పాలి. మామయ్యగారు పమ్మీకి ఉత్తరం రాశారు పిల్లల పరీక్షలు అయ్యాక ఆయన స్వయంగా వచ్చి తనని తీసుకువస్తారని. అదే ఆశయం వెలిబుచ్చే విన్నపం చేస్తూ ఒక వినతి పత్రం ఆయన వియ్యంకుడుగారికి కూడా రాశారు. మీ బావగారికి కూడా ఒక ఉత్తరం రాయమని మోహన్ కి కూడా చెప్పారు. వాళ్ళిద్దరూ ఇంచుమించు ఒకే వయస్సువారు. ఇటు వంటి విషయాలు వాడు అల్లుడికి ప్రేమగా నచ్చజెప్పగలడు.

          కాని ఈ సారి పమ్మీ ఎవరికోసం ఎదురు చూడలేదు. ప్రస్తుతానికి బెడద తప్పిందని వాళ్ళు ఊపిరి కూడా పీల్చుకోకుండానే తను ఏడుస్తూ, మొత్తుకుంటూ, సణుక్కుంటూ వచ్చి చేరుకుంది. ఆమెని చూస్తూనే అందరి ముఖాలూ కళావిహీనమైపోయాయి.

          ఆ రోజు ఇంట్లో ఒక ఉత్సవంలాంటి వాతావరణం ఉంది. మోహన్ తనకు తెలిసిన ఒక కుటుంబాన్ని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానానికి కారణం లేకపోలేదు. నిమ్మీని ఆయింట్లో కోడలిగా ఇవ్వడానికి ఆకుటుంబంతో మాట్లాడుకోవాలని అనుకున్నారు.వాళ్ళు వచ్చి ఈ వంకతో ఇంటిని, నిమ్మీని చూసుకుంటారని భావించారు.

          ఇంటిని ఆ రోజు ప్రత్యేకంగా ప్రయత్నపూర్వకంగా అలంకరించారు. నిమ్మీ కూడా ముస్తాబై ఒక బొమ్మలాగా కూర్చునివుంది- మౌనంగా, నోట్లో అసలు నాలుక లేదన్నట్లుగా. అందరూ ఉన్నవాటిలో చూసుకుని మంచి బట్టలు వేసుకున్నారు. షీలా కూడా పట్టుపట్టి అత్తగారికి కూడా గంజి పెట్టి ఇస్త్రీ చేయించిన చీర ధరింపజేసింది. ఆవిడ వచ్చిన అతిథులతో తియ్యతియ్యగా తేనెలొలుకుతూ మాట్లాడుతోంది. మామయ్యగారు అందరి మధ్యలో మౌనంగా కూర్చుని ఎదురుగా వున్న కుటుంబాన్ని పరిశీలిస్తున్నారు. షీలా వంటింట్లో బిజీగా ఉంది. సోహన్ మాటిమాటికీ బజారుకి వెళ్ళివస్తున్నాడు. అవకాశం దొరకగానే చెల్లెలిని గిల్లుతున్నాడు.

          వాతావరణం అంతా సంతోషదాయకంగా ఉంది. ఇంతట్లోనే పమ్మీ ఒక భూకంపం లాగా ఇంట్లో ప్రవేశించింది. వస్తూనే తను పెద్దగొంతుకతో ఏడవడం మొదలుపెట్టింది—“నన్నక్కడ నిప్పులగుంటలో పడేసి ఇక్కడ మీరందరూ ఉల్లాసంగా పండగ చేసుకుం టున్నారా. ఎన్ని ఉత్తరాలు రాసినా ఎవరైనా వచ్చి కనీసం తొంగికూడా చూడలేదు. పమ్మీ బతికుందా లేదా అని ఎవరికీ అసలు లెక్కలేదు. నేనింత భారంగా ఉంటే నన్ను చేతులూ-కాళ్ళూ కట్టేసి ఏ నూతిలోనైనా పడేసివుంటే బాగుండేది. మిమ్మల్ని మాటి మాటికీ ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. మీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు అసలు నాకు పెళ్ళెందుకు చేశారు?”

          పెళ్ళిచూపులకోసం వచ్చిన అబ్బాయి తరఫువారి ముందు రసవత్తరంగా చాలా మంచి నాటకప్రదర్శన జరిగింది. ఆనందదాయకమైన ఆ సమావేశం ఆఖరికి చెదిరిపోక తప్పలేదు. మాటిమాటికీ క్షమాపణలు చెప్పుకుని ఆ వచ్చినవాళ్ళని ఎలాగో మర్యాదగా పంపించేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి జవాబు వస్తుందన్నది ఇంచుమించు అర్థమైపోయింది. ఎంతో శ్రమపడితే విషయం అంతవరకు వచ్చింది. చేసిన ప్రయత్నం అంతా నాశనమైపోయింది. నెలలోని ఆఖరి రోజులు. అయినా మోహన్ మనస్సుని దిటవు చేసుకుని వారికోసం స్వాగతసత్కారంలో డబ్బు బాగా ఖర్చుపెట్టాడు. చేసినదంతా బూడిదలో పోసిన పన్నీరయింది.

          ఇంట్లో ఒక దుఃఖపూరిత వాతావరణం నెలకొంది. నిమ్మీ అయితే తన మంచం మీద పడివుంది. తను అన్నం కూడా తినలేదు. మిగిలినవాళ్ళు కూడా పమ్మీకి సాధ్యమయి నంత దూరంగానే ఉన్నారు. అమ్మ, వదిన తప్ప ఇంకెవరూ కనీసం సరిగా ఎలావున్నావని కూడా అడగలేదు.

          తనకి స్వాగతం చెప్పే ఈ కొత్త పద్ధతి చూసి పమ్మీకి ఏమీ అర్థం కాలేదు. రెండు రోజులు తను ఎలాగో ఓర్చుకుంది. మూడో రోజున తన బాధని వెళ్ళగక్కింది—“ఎవరికీ నేను రావడం ఇష్టం లేనట్టుంది. ముందుగా తెలిస్తే అసలు వచ్చేదాన్ని కాదు. అవమానమే సహించాలంటే నాయింట్లోనే సహించుకుంటాను. ఇంట్లో సరిపెట్టుకోవడం, సర్దుకుపోవడం వీలుకాకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటాను.”

          సోహన్ కూడా ఒక విధంగా సిద్ధంగానే ఉన్నాడు. “అయితే చేసుకో ఉద్యోగం. జీవిత మంతా అన్నయ్య-వదినలను ఇలా కాల్చుకుతినడం అవసరమా? బుద్ధిపుట్టినప్పుడల్లా వచ్చి కూర్చుంటావు. నీ కోసం ఎవరైనా ఎంతవరకని చేస్తారు? ఇంట్లో ఇంకో ఆడపిల్ల కూడా ఉంది.”

          “వస్తున్నానంటే నేను మా నాన్నదగ్గరికి మా నాన్నయింటికి వస్తున్నాను.” పమ్మీ ఆగ్రహంతో  అంది- “నీ ఇంటికి వచ్చినప్పుడు చూపించు నీ రోషం.”

          “నాన్న యింటికి, హూఁ…” అంటూ సోహన్ బయటికి వెళ్ళిపోయాడు. అతను తన మనస్సులోని మాట బయటికి వెళ్ళగక్కాడు. సోహన్ ఏ విధమైన ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉన్నాడు. ఇంకా పెళ్ళికాలేదు. అందువల్ల మనస్సులోని మాట నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పేస్తాడు. వాడి పెళ్ళాం వాడికి చెప్పిపెట్టిందని ఎవరూ అనలేరు.

          అవమానంతో పమ్మీ కళ్ళలో నీళ్ళు నిండాయి. అన్నిటికన్నా బాధకలిగించే విషయం సోహన్ ఇంత పెద్ద మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. అయినా నాన్నగారు ఏమీ మాట్లాడలేదు. ఎవరి అండ చూసుకుని తను దర్పం చూపిస్తోందో, బెట్టుసరి చేస్తోందో ఆయన చెవుల్లో దూది పెట్టుకుని మౌనంగా పైకప్పులోని బీమ్ లను లెక్కపెడుతున్నారు. 

          “నాన్నా!” తను జాలిగా పిలిచింది.

          “అంతా వింటున్నానమ్మా” ఆయన అదే విధంగా పైకప్పువంక తదేకంగా చూస్తూ అన్నారు- “నిజానికి ఇప్పుడు నీ తండ్రి ఇల్లంటూ ఎక్కడుందమ్మా. అంతా అయి పోయింది. నాకు దొరుకుతున్న పెన్షన్ నా మందుల ఖర్చుకి సరిపోవడం లేదు. కొడుకు మీద ఆధారపడి బతుకుతున్నాను. నా పెద్ద కుటుంబం బాధ్యతలన్నీ వాడి తల మీద పెట్టి కూర్చున్నాను. వాడి భారాన్ని ఇంకా ఎంత పెంచను?”

          “నాన్నా, కాని…”

          “పమ్మీ తల్లీ, మేము నువ్వు జన్మించడానికి బాధ్యులం. కర్మ అనేది నువ్వు స్వయం గా నీ అంతట నువ్వే అనుభవించాలి. కష్టసుఖాలేవైనా నీ యింట్లోనే సహించుకో అమ్మా. రేపటిరోజున నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే నిమ్మీ తమ కుటుంబంలో అడుగు పెట్టడానికి ఎవరు ఇష్టపడతారు?”

          పమ్మీ ప్రశ్నలన్నీ పూర్తి అయిపోయాయి. బహుశా వాటికి జవాబులు కూడా.

          నాలుగు రోజుల తరువాత పమ్మీని సోహన్ తో పాటు బండిలో కూర్చోబెట్టి తిరిగి వచ్చాక ఆయనకి తన కూతురికి ఆఖరిసారిగా వీడ్కోలు ఇచ్చినట్లు అనిపిస్తోంది. తరువాత ఏమయినా అయితే… పమ్మీ అత్తవారు నిజంగా ఏదయినా కుట్ర చేస్తే దానికి ఆయన కూడా తన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ఈ కుట్రలో ఆయన కూడా సమానంగా భాగస్వామి అవుతారు.

***

పద్మశ్రీ శ్రీమతి మాలతీ జోషీ – పరిచయం

The President, Shri Ram Nath Kovind presenting the Padma Shri Award to Smt. Malti Joshi, at the Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on March 20, 2018.

4 జూన్ 1934 న ఔరంగాబాద్ లోని ఒక మరాఠీ కుటుంబంలో జన్మించిన శ్రీమతి మాలతీ జోషీగారి సాహిత్యసేవ విస్తృతమైనది. వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేసిన వీరి కథాసంకలనాలు హిందీలో 50 కి పైగా, మరాఠీలో 11, ఒక గేయ సంకలనం, 2 నవలలు వెలువడ్డాయి. హిందీలోని ఇంచుమించు అన్ని ప్రముఖ పత్రికలలో కథలు, నవలికలు ప్రచురితం. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. దాదాపు 25 నాటకాలు రేడియో, టి.వి. ల ద్వారా ప్రసారితం. విద్యారంగానికి చెందిన రచనలతోపాటు కొంత బాలసాహిత్యంతో సహా, ఆధ్యాత్మిక అంశాల పై కూడా రచనలు చేశారు. తన విశిష్టమైన కథా కథనశైలితో ఆవిడ సాహిత్యరంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ఎక్కువగా మధ్యతరగతికి చెందిన అనుభవాలు, అంశాల మీద రచనలు చేశారు. సామాన్య పాఠకుల నుంచి విద్వాంసుల వరకూ అన్ని వర్గాలను ప్రభావితం చేసే వీరి రచనలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ప్రముఖనటి జయా బచ్చన్ నిర్మించిన టి.వి. కార్యక్రమం `సాత్ ఫేరే’ (ఏడు ప్రదక్షిణాలు), ప్రముఖ దర్శక నిర్మాత గుల్జార్ నిర్మించిన `కిర్దార్’ (పాత్ర) లలో మాలతీ జోషీ నటించారు. కొన్ని కథల స్వీయకథాపఠనం ద్వారా కూడా పాఠకుల అభిమానం చూరగొన్నారు. సాహిత్య శిఖర సమ్మాన్, భవభూతి, హిందీతరభాషా రచయిత్రిగా సన్మానం, అక్షర ఆదిత్య సమ్మాన్, కళామందిర సమ్మాన్, గురువందన సమ్మాన్, మహిళా సంవత్సర సమ్మాన్, హిందీసేవీ సమ్మాన్ మొ. అనేక సన్మానాలు, సత్కారాలు పొందారు. వీరి సాహిత్యం పైన యూనివర్సిటీలలో ఎం.ఫిల్., పి-హెచ్.డి. లకు  రీసెర్చ్ జరిగింది. సాహితీ, విద్యా రంగాలలో వీరి విశిష్టసేవలకు వీరికి భారతరాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ గారు 2018 మార్చి 20 న `పద్మశ్రీ’ ప్రదానం చేసి సత్కరించారు. గత డిసెంబరు నుంచి క్యాన్సర్ కు లోనై  శ్రీమతి మాలతీ జోషీ 2024 మే 15న న్యూఢిల్లీలో స్వర్గస్థులయ్యారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.