కేర్ టేకర్

-వై.కె.సంధ్య శర్మ

          ఉదయం కాఫీ తాగుతూ దినపత్రిక తిరగేస్తుంటే అందులోంచి క్రిందపడిన కర పత్రాల్లోని ఒక దానిపై చూపు అలాగే నిలబడిపోయింది వంశీకి. దిన పత్రికను పక్కకు పెట్టి ఆ కర పత్రాన్ని చేతిలోకి తీసుకుని అందులో వున్న సమాచారాన్ని సరాసరి గదిలో మంచంపై కదలలేని స్థితిలో వున్న తల్లి సుభద్రకు చూపించాడు.

          “తులసీ వనం” అన్న పేరు పెద్ద అక్షరాలతో తెలుగులో వుంది క్రింద మంచానికే పరిమితమైన వృద్ధులకు మరియు ప్రమాదవశాత్తు నడవలేని పరిస్థితుల్లో వున్న వారికి
మా సేవలను అందించగలము. కేర్ టేకర్ కై వివరాలకు సంప్రదించండి అని చివరిలో ఫోన్ నెంబర్.

          సుభద్ర అది చదువుతుండగానే కళ్ళలో నీరు ధారాపాతంగా కారుతున్నాయి. చేయి ఎత్తి కనీసం తుడుచుకోలేదు. తన పరిస్థితి చూసి తనకే బాధ కోపం కలుగుతోంది. నెల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నముక విరిగి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి సుభద్రకు.

          తల్లి కన్నీళ్ళను చూసి వంశీ…

          “అమ్మా..! ఇప్పుడు ఏమైందని ఇలా ఏడుస్తున్నారు, ఒక నెలగా నాన్న అక్కా నేను అందరం శెలవు పెట్టి నీ దగ్గరే వున్నాం.. ఇంకా ఎక్కువ శెలవురోజులు పొడిగించలేక పోతున్నాం.. , అక్కకు వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీటై పిల్లలకు స్కూల్ మొదలవుతోంది , నాన్న పెట్టిన మెడికల్ లీవు కూడా పూర్తైపోయిందంటున్నారు.. ,నేను డిల్లీ వెళ్ళాలి నా ప్రాజెక్ట్ థీసిస్ సబ్మిట్ చేసి రావాలి.. అంతవరకు.. మీకు ఒక కేర్ టేకర్ ని చూడాలని మా ఫ్రెండ్ కు చెప్పాను ..నాన్న కూడా చాలా మందిని అడిగారు.. కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు.. ఇదిగో ఇంతలో ఈ రోజు పత్రికలో ఈ పాంప్లెట్ కనిపించింది.. అందుకే ముందు గా మీకు చూపించాను..అమ్మా!”అంటూ తల్లి పడుతున్న ఆందోళనను తగ్గించాలని పక్కనే కూర్చుని తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు వంశీ.

          “నీ ఇష్టం నాన్న”అంటూ తల పక్కకు తిప్పుకుంది సుభద్ర.

          “ఇప్పుడే ఫోన్ చేసి వివరాలు అడుగుతానమ్మా” అంటూ అందులోని నెంబర్ కు డయల్ చేశాడు.

          అవతలి వైపు నుండి “హలో..!” అనగానే

          “హలో..హలో..నమస్తే మేడం, ఈ రోజు పేపర్ లో మీ ఆడ్ చూశాను , దాని గురించి మాట్లాడాలని కాల్ చేశాను మేడం “అన్నాడు వంశీ.

          “నమస్తే సర్ , థ్యాంక్యూ మీ పేరు , డీటెయిల్స్ చెప్పండి అలాగే పేషంట్ ఆడ, మగనా వారి వయస్సు , మీకు ఎన్ని రోజులు కేర్ టేకర్ అవసరం వుంటుంది వాటి వివరాలన్నీ మా వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయండి” అంది అవతలి వైపు నుండి పాతికేళ్ళ వయసున్న ఓ అమ్మాయి. 

          ఈ రోజు పత్రికల్లో పెట్టి పంపిన పాంప్లెట్స్ కు రెస్పాన్స్ బాగా వస్తున్నందుకు గొంతులో కాస్త సంతోషం నిండి.

          “సరే, మేడం చేస్తాను. మీ పేరు ” అనడిగాడు సందేహంగా వంశీ తను ఫోన్లో వింటున్న గొంతు బాగా పరియచమున్న వ్యక్తి లా వుంది..”తులసీ “అంది.

          ఆ పేరు వినగానే వంశీ ఒకింత ఆశ్చర్యంతో “మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి మేడం , నేను డైరెక్ట్ గా వచ్చి వివరాలు చెప్తాను”అన్నాడు వంశీ. తను చెప్పగానే కాల్ కట్ చేసి,

          “అమ్మా.. ఈ తులసీవనం కేర్ టేకర్ సెంటర్ ఎవరిదో కాదమ్మా… నీ తులసిదే.. ” అన్నాడు తల్లి కళ్ళలో సంతోషాన్ని చూడాలని.

          “అవునా..తులసీనా మాట్లాడింది ఇప్పుడు , ఐతే చెప్పావా నువ్వు వంశీవని.. “అని ఆత్రుతగా అడుగుతోంది సుభద్ర.

          “లేదమ్మా..చెప్పలేదు డైరెక్టుగా వెళ్ళి కలుస్తాను.. నీ తులసిని నీ దగ్గరకు తీసు కొస్తాను”అంటూ ఆరేళ్ళ జ్ఞాపకాలను తడుముకుంటూ బయల్దేరాడు. వంశీ అలావెళ్ళగానే సుభద్ర కళ్ళలో తను పుట్టి పెరిగిన ఊరు గోపాల పురం మెదిలింది.

***

          “అమ్మా…! నా వల్ల కాదే మా అత్త గారికి చాకిరీ చేయడం అన్నీ మంచం పైనే.. రోజంతా ఐతే ఎలాగోలా పని వాళ్ళతో చెప్పి చేసుకుపోతున్నా.. రాత్రి పూట నిద్ర కూడా పోనివ్వడం లేదస్సలు” అంటూ పెరాలసిస్ తో కాలు చేయి పడిపోయి మంచానికే పరిమితమైన అత్తగారి పై వున్న కోపంతో తల్లి దగ్గర వాపోతోంది సుభద్ర.

          “అట్లాగంటే , ఎట్లాగమ్మా.. వయసైపోయిం తర్వాతే కదా చూడాల్సింది ,..ఆ..అంటే ఇంకో ఏడాదో.. రెండేళ్ళు అంతే ..” అంటూ నచ్చజెప్ప చూసింది సుభద్ర తల్లి కామాక్షమ్మ.

          “ఆ.. పోనీ ఎవరైనా ఆమె పనికి మనిషి దొరుకుతాదేమో చూసి పెట్టుకో” అంది ఏదో బుర్రకు తోచింది చెప్తూ. “పట్నం.. లో అట్టా ఎవరూ రారమ్మా…పోని మన గౌరిని పంపిం చవే” అంది అక్కడే పశువుకు మేత పెట్టి తమ దగ్గరకే వస్తున్న దాన్ని చూసి.

          “దాన్ని పంపితే నన్నెవురు చూసుకుంటారే…తల్లి” అంది నిష్ఠూరంగా కామాక్షమ్మ.

          “సరే నువ్వుండు నేను గౌరినే అడుగుతా” అంది.

          సుభద్ర గౌరి వంక నవ్వుతా.. “గౌరి, రేపు నాతో ఊరికి వస్తావా..” అనడిగింది.

          “నేనెట్టా వచ్చేదమ్మా…అమ్మకు మోకాళ్ళ నొప్పితో ఏ పని సేసుకోలేందు , గొడ్లు గోద .. ఇల్లు వాకిలి అంతా నేనే శుభ్రం సేసి పెట్టాలా.. నేను ఆడికొస్తే అమ్మకి కట్టమైపోతాది “అంది గౌరి.

          ఇంతకు ముందైతే సుభద్ర కాన్పులకు , వాళ్ళ మరిది ఆడపడుచు పెళ్ళిళ్ళకు అన్నింటికీ పోయి నెలల తరబడి వుండి వచ్చేది. ఇప్పుడు ఇటు కామాక్షమ్మను అటు గౌరి మొగుడు కిట్టప్పను కొడుకు స్కూలుకు పోయే చిన్నోడిని చూసుకోవాలి. కూతురు కూడా కాలేజీకెళ్ళిపోతుందని..ఊర్లో ఎవరూ పిలిచిన ఎక్కడికి పోదు. అదే చెప్పింది సుభద్రకు.

          అప్పుడే చెక్క గేటు తోసుకుంటా లోపలికి వచ్చింది తులసి. వస్తూనే గౌరిని చూసి “అమ్మా…ఇదిగోనే మన దొడ్లో కాసిన కనకాంబరాలు సుభద్రక్క కోసం మాల కట్టి తెచ్చినా” అంది కళ్ళతోనే నవ్వుతూ అక్కడే వున్న సుభద్ర చేతిలో పెట్టి.

          “బాగున్నావా…తులసీ…”అంది సుభద్ర తులసీనే తదేకంగా చూస్తూ.”హా ..బాగున్నా ..అక్కా”అంటూ సిగ్గు పడుతూ తలొంచుకుంది.

          “ఇంటర్ మంచి మార్కులతో పాసయ్యావట కదా.. కంగ్రాట్స్ ఇంకా బాగా చదువుకో” అంది సుభద్ర.

          “లేదక్క..ఇంగ చదవలేను.. ఇంటర్ వరకు ఈడే వుండేది కాబట్టి మా నాయిన్ని ఒప్పించి కాలేజీకి పొయినా..డిగ్రీ చెయ్యాలంటే టౌన్ కు పోవాలి.. మాయమ్మ, నాయినొప్పుకో లేదు “అంటా గౌరినే చూసింది తులసి.

          గౌరి వెంటనే ” టౌన్లో సదువులంటే ఊరికే ఐపోతుందా సుభద్రమ్మ ..కూలి సేసుకొనేటోళ్ళం అంత డబ్బులేడ నుండి తెత్తాం”అంది గౌరి బాధగా.

          తులసి ముఖం కూడా మారిపోయింది. చిన్నప్పటి నుండి చూస్తున్న ,తులసి చాలా చురుకైన పిల్ల తెలివి గలది. చదువుకుంటే తనకు మంచి భవిష్యత్తు కూడా వుంటుందని ఆలోచించి… “తులసిని నాతో పంపించు నేను చదివిస్తా “అంది వెంటనే సుభద్ర.

          “సుభద్రమ్మా…వద్దమ్మా..అదేదో ఆశ పడతాంది , గాని వాళ్ళనాయిన ఈ ఏడాది పెళ్ళి సేసేయాలని..చూస్తాడాండు మా ఇండ్లలో “అంది గాబరాగా.

          ఆ మాటకు తులసి కళ్ళలో నీళ్ళు ఉబికి వచ్చి బుగ్గల పై పడతాంటే చేతులు అడ్ఢం పెట్టుకుని ముఖం అటు పక్కకు తిప్పుకుంది. సుభద్ర తులసిని చూసి

          “గౌరీ ,కిట్టప్పతో నేను మాట్లాడతా..రేపే తులసిని నాతో తీసుకుపోతా” అంతే అంది తన మాటే నిలబడాలన్నట్లు.

          సుభద్ర తండ్రికి చెప్పి కిట్టప్పను ఒప్పించి తులసిని తనతో తిరుపతికి తీసుకు పోయి తనకు ఇష్టమైన బియస్సీ నర్సింగ్ కాలేజీలో చేర్పించింది. తన ఇంట్లోనే వుండి చదువుతూనే చేదోడు వాదోడుగా వుండటంతో పాటు మంచం పట్టిన సుభద్ర అత్తగారి పనులు తినిపించడం మందులు వేయడం స్నానం చేయించి బట్టలు మార్చడం వంటి వన్నీ కూడా తులసినే చూసుకునేది. తనని వద్దని వారించినా , మా అవ్వ కూడా పడకలో వున్నప్పుడు అన్ని పనులు నేనే చేసేదాన్ని అక్క , నేను చదివే చదువు కూడా ఇదే కదక్కా అంటూ.. తనకు తలలో నాలుకయిపోయింది. ఒక్క రోజు తులసి లేకపోతే సుభద్ర కు ఊపిరిసలిపేది కాదు. అంతా బానే జరుగుతున్న సమయంలోనే ..

          సుభద్ర మరిదికి ఉద్యోగ రీత్యా తిరుపతికి ట్రాన్స్ఫర్ అవడంతో ఇక్కడికే మాకాం మార్చాడు. తన అన్న కూతురు వయసున్నా.. చూడచక్కని రూపంతో ఇంట్లో అటుఇటు తిరుగుతున్న తులసి పై కన్నుపడి వీలు దొరికినప్పుడల్లా తులసితో మాటా మంతి కలుపు తూ తనకు దగ్గరవ్వాలని చూసేవాడు. తులసి చదువు పేరుతో తప్పించుకు తిరిగినా..
తల్లి గదిలో వుండి తనకు తినిపించేటప్పుడో.. తనకు మందులు వేసేటప్పుడో ఎదురుగా వుండి తినేసేలా చూసేవాడు. సుభద్రకు చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించినా తనను చదివిస్తూ ఆదిరిస్తున్న ఇంట్లోని వారికే గొడవలొస్తాయోమానని భయపడి చెప్పలేక పోయింది. సుభద్ర కూడా రెండు మూడు సార్లు మరిది తులసి వెనుకనే తిరగడం గమనించి వయసులో వున్న పిల్ల కొంచెం జాగ్రత్తగా వుండమని చెప్పాలి అనుకున్నది.
ఇద్దరి మనసులోని మాటలు దేవుడికి కూడా వినిపించలేదేమో..

          ఓ రోజు సాయంత్రం ఎవరూ లేని సమయం చూసుకుని తులసిని లొంగదీసుకో వాలని చూశాడు సరిగ్గా అదే సమయంలోనే సుభద్ర భర్త రావడంతో తులసి భయంతో వారి తల్లి గదిలోకి పరుగులు తీసింది.

          తన కోరిక తీరలేదనే కోపంతో తులసే తన పై మనసు పడిందని, తన అవసరాలు తీర్చమని పదే పదే నన్ను అడిగేదని డ్రస్సులు కూడా కొనివ్వమని బెదిరించిందని భార్యకు కొన్న డ్రస్సు చూపిస్తూ అన్నకు చెప్పడంతో “పల్లెటూరు మనుషులు పల్లెటూరి బుద్ధులు.. వీరికెంత విలువ ఇచ్చినా.. ఇంట్లో పెట్టుకున్న కుక్క తోక వంకరే అన్నట్లు “వుంటారు అని కోపంతో సుభద్ర ముందే అనడంతో. తప్పు చేసిన వాడిని వదిలేసి తనదే తప్పన్నట్లు భర్త చూడటం సుభద్ర భరించలేకపోయింది.

          గుక్క పెట్టి ఏడుస్తున్న తులసిని అక్కున చేర్చుకుని ఊరడించి “నువ్వు ఇంక ఒక్క రోజు కూడా వుండద్దమ్మా తులసి… మానవ మృగాలు తిరిగే అడవి ఇది.. గంజాయి వనంలో నిష్కళంకమైన మనసున్న తులసీవనాన్ని పెంచలేను.. వెంటనే ఊరికెళ్ళిపో.. తులసీ”అంటూ. తనను గుండెలకు హత్తుకుంది.

          “అక్కా… నేనేం తప్పు చేయలేదక్కా…”అంటూ తులసి సుభద్ర ఒడిలో అలాగే పసిపిల్లలా ఒదిగిపోయింది.

          “నాకు తెలుసమ్మా..నేను ప్రమాదాన్ని ముందే పసి గట్టాను కానీ ఇంత తొందరగా దహనం చేయడానికి పూనుకుంటుదని తెలుసుకోలేకపోయాను..తప్పు నాదే.. తులసి.. నన్ను క్షమించు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాల్సింది కాదు “అంది సుభద్ర.

          “కన్నతల్లికన్నా ఎక్కువ ప్రేమతో చూసుకుంటున్న కుటుంబంలో తన వలన మనస్పర్థలు కలతలు రావడం మంచిది కాదనే తనను వేటాడుతున్న సమస్యను చెప్పలేకపోయానని” తులసి సుభద్రను అల్లుకుపోయింది.

          తర్వాత రోజే తులసికి పరిక్షలు పూర్తయ్యే వరకూ వుండటానికి హాస్టల్లో మాట్లాడి చేర్పించి వచ్చింది.. ఇంకెప్పుడూ ఇంటికి రాకని తనకు నచ్చజెప్పి. తనకు చూడాలని పించినా నేనే వస్తానని . అంతే కాదు ఇంట్లో జరిగిన విషయాలేవి ఊళ్ళో వున్న మా అమ్మనాన్నలకు గానీ.. మీ అమ్మనాన్నలకు గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పవద్దని మాట తీసుకుంది.

          ఫైనలియర్ పరీక్షలు పూర్తి చేసి ఊరికి వెళ్ళిపోయిన తులసి, ఆ తర్వాత ఎప్పుడూ తన ఇంటికి రాలేదు.

          పుట్టిన ఊరైన గోపాల పురానికి ఎప్పుడైనా వెళితే తన చుట్టూ తిరుగుతూ  ఆప్యాయం గా ప్రేమతో పలకరించేది. కాలం కన్నీటిని మరిపిస్తుంది.. కన్నీరుని కురిపిస్తుంది.
కాలం నది ఒడ్డు పై అందరూ సమానమై మునిగి తేలుతూనే వుంటారు . అలాంటి సందర్భమే ఎదురైంది సుభద్రకు అనుకోకుండా సుభద్ర తల్లిదండ్రుల్లో ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు గుండె పోటుతో మరణించడంతో తర్వాత పూర్తిగా అటువైపు వెళ్ళడమే మానుకుంది సుభద్ర.

          ఇప్పుడు మళ్ళీ తులసి పేరు వినేసరికి మనసంతా ఆనందంగా వుంది. ‘కొడుకు వంశీ తులసితో మాట్లాడుతానన్నాడు..వెళ్ళి తనను తీసుకువస్తాడా..తనకు సేవచేయ డానికి కాదు తను పోయేలోపు ఒక్కసారి తులసిని చూడాలని’అదే ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంది.

***

          బండి సైడ్ కు పార్క్ చేసి ఫోన్లో చెప్పిన అడ్రస్ చూసి ఇదేనని కన్ఫర్మ్ చేసుకుని
లోపలికి వెళ్ళే ముందు తన ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకున్నాడు. ‘తులసి తనను గుర్తుపడుతుందా. తనేమో గుబురు మీసాలతో ఆజానుబాహుడిలా వున్నాడు మరి తులసి అలాగే వుంటుందా. తనకు పెళ్ళైపోయిందా’ అనే ఆలోచనలతోనే గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు.

          అందమైన బృందావనంలా వుంది ఆ ప్రాగణం కాంపౌండ్ చుట్టూ రకరకాల పూల చెట్లతో పాటు తులసిచెట్లు కూడా అక్కడక్కడా గుబురుగా వున్నాయి. లోపలి నుండి
పాతికేళ్ళ వయసున్న అమ్మాయి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ…

          “ఈ రోజే పంపిస్తామండి..,ఫర్వాలేదు డబ్బు తర్వాత ఇద్దురు కానీలేండి..అమ్మ ఆరోగ్యం కుదుటపడనివ్వండి ముందు “అంటూ కాల్ కట్ చేసి నన్ను చూసింది.

          “మీరు…అంటూ ఆగి..,

          ఉదయం ఫోన్ చేసింది మీరేనా…రండి లోపలికి” అంటూ ముందున్న చిన్న గదిలోకి వెళ్ళింది. 

          తన వెనుకే వెళ్ళిన నాకు “కూర్చోండి…అంటూ కుర్చీ చూపించి నేను కూర్చున్న తర్వాత తను ఓ పక్కగా కూర్చుంది.

          “చెప్పండి .. ఎవరికి కేర్ టేకర్” కావాలనడిగింది.

          తనను గుర్తు పట్టలేదని గ్రహించి “మా అమ్మకు ఈ మధ్య ఒక ఆక్సిడెంట్ లో వెన్నముక దెబ్బతిని కాళ్ళు చేతులు పనిచేయడం లేదు తను పూర్తిగా ఇప్పుడు బెడ్ రీడన్.. ఆమె కోసం మీరు ఓ కేర్ టేకర్ ను పంపగలరా…”అన్నాడు వంశీ.

          “ఓకె అండి తప్పకుండా, మీ అడ్రస్ చెప్పండి “అంటూ ఓ పుస్తకం పెన్ను  తీసు కుంది అడ్రస్ నోట్ చేసుకోవడానికి. 

          “కె. సుభద్ర w/o సురేష్ , భవానీ నగర్ ,2-12/1 తిరుపతి” అన్నాడు.

          అడ్రస్ వినగానే

          “సుభద్రా…..సుభద్ర అక్క కొడుకువా నువ్వు..

          వంశీనా …వంశీ “అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది వంశీని తన చేతులు పట్టుకుని ఊపుతూ సంతోషంతో.. ,

          “అవును… మేడం తులసీ గారు”అంటూ తల వంచాడు .

          తులసి కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే “అమ్మకు ఆక్సిడెంట్ ఐందా…ఇప్పుడు ఎలా వుంది?”అనడిగింది.

          “బానే వున్నారు..కానీ మంచానికే”అంటూ వంశీ కళ్ళు తడి అవడంతో

          “తులసి కుర్చీలో నుంచి లేచి వంశీ దగ్గరగా వచ్చి

          “వంశీ నేను చూసుకుంటాను.. అమ్మకు ఏం కాదు..”ఇప్పుడే వెళదాం పద అంది.

          “అమ్మకు నీ తులసిని తీసుకువస్తానని మాట ఇచ్చి వచ్చాను తులసి “అన్నాడు వంశీ.

          “సుభద్ర అక్క ఋణం తీర్చుకునే అవకాశం రాలేదని ఎప్పుడూ అనుకునేదాన్ని… దేవుడు ఇలా ఇస్తాడని అనుకోలేదు నాకు” అన్నది తులసి బాధగా.

          తులసి కంటే ఏడాది చిన్నైన వంశీకి తులసిని సొంత అక్క కంటే ఎక్కువే అనే వాడు ఎప్పుడూ. తులసిలో కనిపించే పల్లెటూరి అమాయకత్వం ఇప్పటికీ అలాగే వుండటం గమనించి..

          “అవును ..తులసి.. నువ్వు బియస్సీ నర్సింగ్ పూర్తి చేశావు కదా ఎక్కడైనా నర్సింగ్ హోమ్ లో జాయిన్ అవకుండా… ఇలా…ఇదేంటీ..”అంటూ ప్రశ్నించాడు అక్కడే టేబుల్ పై వున్న పాంప్లెట్ చూపిస్తూ.

          “దీనికి కారణం కూడా ఓ రకంగా సుభద్ర అక్కనే వంశీ “అంది.

          “అంటే?” అన్నాడు సందేహంగా

          ” అమ్మ నన్ను చదివించడానికి ఇక్కడికి తీసుకువచ్చినా ..నేను ఎక్కువగా మీ నాయనమ్మకు సహాయకురాలిగానే వున్నాను.. ,అప్పట్లో మీ ఇంటికి ఎవరైనా వచ్చి నప్పుడు నా గురించి అడిగితే మీ వాళ్ళందరూ కూడా నన్ను కేర్ టేకర్ గా పరిచయం చేసేవారు అలా నాకు ఆ పేరుతో ఏదో కనెక్టివిటీ వుందనుకునే దాన్ని. అంతే కాదు వంశీ
మా ఊరు మా చుట్టూ పక్కల గ్రామాల్లోని వారంతా ఊర్లో పని చేయడానికి పనులు లేక.. వ్యవసాయం చేయడానికి సరైన వసతులు లేక అప్పుల పాలవుతుంటే మధ్యవర్తుల సలహాలతో డబ్బుల కోసం దుబాయ్ వంటి దేశాలకు వెళ్ళేవారు. అలా వెళ్ళి ఓ రెండు మూడు నెలలు కొంచెం డబ్బు పంపితే..ఆ తర్వాత వారు ఎక్కడ వుంటారో కూడా తెలిసేది కాదు. ఏదైనా అనారోగ్యంతో మరణిస్తే శవం ఆచూకీ గురించి పంపేవారు కాదు.. ఇక్కడ వారి కుటుంబాల్లోని పిల్లలు ఇటు తల్లి లేక…భర్తలు భార్య లేక వారు మద్యానికి బానిసలై.. వీధిన పడేవారు.. అలాంటి వారిని ఎంతో మందిని చూశాను.

          ఇలా దేశ విదేశాలకు బానిసలుగా వెళ్ళే బదులు ఇక్కడే వారికి ఏదైనా పని చూపించ గలిగితే బాగుండేదని ఆలోచించాను.. అప్పుడే నేను ఒక పెద్ద హాస్పిటల్లో పని చేస్తున్నప్పుడు చాలా మంది వయసైన వారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో వచ్చే వారికి అసిస్టెంట్ గా వారి పనివారో.. మరెవరో వచ్చి చూసుకుని వెళ్ళేవారు..,అప్పుడే తెలిసింది నాకు పెద్ద పెద్ద నగరాల్లో అలా కేర్ టేకర్ ని పంపే ప్రైవేటు సంస్థలు చాలా వున్నాయని.. అదే నేను మా చుట్టు ప్రక్కల గ్రామాల్లోని వారికి నచ్చచెప్పి ఓ ఉపాధి కల్పిద్దామన్న సంకల్పంతో ముందుగా అందరికీ నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వారి కుటుంబం అనుమతితో కేర్ టేకర్ గా పంపుతున్నాను. బాగా ఉన్నవాళ్ళైతే వారి తల్లి దండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకుంటే చాలని పెద్ద మొత్తంలోనే ఇచ్చేవారు. కానీ ఇక్కడ కూడా
ఆడవారిని ప్రలోభ పెట్టి వశం చేసుకునే తోడేళ్ళు వుంటారని జాగ్రత్తగా అటువంటి మాయలకు లొంగకూడదని అలాంటివి ఏదైనా మీకు అనుమానం వస్తే వెంటనే వచ్చే యాలని.. ఇలాంటివి ఎన్నో.. ఆలోచించి ఓ అడుగు ముందుకు వేసి.. ఈ తులసీవనాన్ని పెంచుతున్నాను.. “అంది తులసి వంశి కళ్ళలోకే చూస్తూ.

          “ఇంట్లో కన్నతల్లి ఒక్క రోజు పడుకుంటే ఇంటి పని చెయ్యడానికి ఎంతో ఆలోచించే మా లాంటి వారు ఎంతో మంది వున్న ఈ రోజుల్లో ఇలాంటి సేవా భావంతో సొంత మనుషుల్లా చూసుకునే నీ లాంటి వారు వుండటం చాలా గ్రేట్ తులసి.. నీ స్నేహితుడిగా
నేనెంతో గర్వ పడుతున్నాను. ఇలాంటి ఓ ఆర్గనైజేషన్ మన ఊరిలో వుందని నేనే అందరికీ చెప్తాను.. ” అన్నాడు వంశీ కనుబొమలు ఎగరేస్తూ గర్వంగా ఫీలై.

          “ఈ క్రెడిట్ లో నువ్వు కూడా ఓ భాగమే వంశీ, కొత్తగా కాలేజీకి వెళ్ళడానికి నేను చాలా భయపడేదాన్ని…. ఏది సొంతంగా నిర్ణయం తీసుకునే దాన్ని కాదు.,కానీ .. అప్పుడు నువ్విచ్చిన ధైర్యం కూడా ఓ పావు వంతు కలుపుకున్నాలే…”అంది నవ్వుతూ తులసి.

          ‘నువ్వు నవ్వితే చాలా అందంగా వుంటుంది. చక్కని పలువరుసతో మెరుస్తున్న కళ్ళతో ఇలాగే ఎప్పుడూ నవ్వుతూనే వుండాలి తులసీ అని మనసులో’ అనుకుంటూ వంశీ బండి స్ట్రాట్ చేశాడు..

          బాబాయ్ చేసిన పనికి తులసిని ఇంట్లో నుండి పంపించేశాక తన తల్లి ఎంత మథన పడేదో కళ్ళారా చూసిన తను .. ఇన్నాళ్ళకు మళ్ళీ తులసిని చూసి అమ్మ మామూలు మనిషవుతుందనే ఆశతో.. తండ్రిని ఒప్పించి ఓ మంచి స్నేహితుడిగా తనకు అండగా తోడుగా నిలవాలనే ఆశయంతో. తులసిని అమ్మ దగ్గరకు తీసుకెళుతున్నాడు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.