గూడు కట్టిన గుండె
-బసు పోతన
గూడు కట్టిన గుండెను
గుట్టు విప్పమని అడిగితే
బిక్కుబిక్కు మంటూ చూసింది
గుట్టు చప్పుడు కాకుండా
దిక్కుమాలినదానిలాకూర్చున్న మనసు
చివుక్కుమన్న శబ్దానికి కూడా ఉలిక్కిపడింది.
మనసు మనసెరిగిన కళ్ళు
రెప్పలతో రహస్యంగా మాటాడి
ఓదార్చేందుకు కన్నీటి బొట్టును
పంపితే
రెప్ప జారిన నీటి బొట్టు
పగిలిన మనసులా నేలను తాకి
వేల ముక్కలైంది
ప్రతి రోజూ పగిలే ముక్కల్ని
ఒక్కటిగా చేర్చి అతికించడమే
రోజుటి బతుకులో భాగమైంది
చితికే మనసుతో పాటు గుండె
ఆగుందేమోనని భయం.
ముక్కల్ని అతికించడానికి
అందుకే తాపత్రయం.
చావడం కన్నా జీవచ్ఛవంలా
బతకడమే నయం.
కళ్ళేదుటే…
వాడిన వారి దుబ్బుల్లా పిల్లలు
నీళ్ళు లేక మోడైన నిమ్మ చెట్టులా నా అత్తా మామలు.
నెర్రలుబారిన భుమిలా మారిన మా బతుకుల్లో
ఎండిన వేళ్ళు తప్ప నీళ్ళు లేవు.
వాన కోసం వత్తులేసుకొని చూసిన నా పెనిమిటి
పగిలిన బతుకుని అతికిద్దామని
పట్టణానికి పోయాడు.
ఏరోజుకారోజే బతుకుదామని ఆశ
జీవితం మీద తీపి కాదు.
అతగాడి చివరి చూపు మీద కోరిక
అత్తా మామల్ని అతగాడికి చూపించాలని వేదన.
మస్తిస్ఖపు మహాసముద్రములో కనుచివరాల ఆవలితీరాన కరిగిపోతున్న కలల అంచున పురివిప్పే పుష్పాల రేకులలో జారిన ఇసుక రేనువును నేనైతే
*****