చక్కని చుక్క

-దామరాజు విశాలాక్షి

          “ఏంటి ? ఆ పిల్ల నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే, నేను వెళ్ళి వాళ్ళ బామ్మతో మాటాడాలా? నాకున్న పలుకుబడి పేరు ప్రతిష్టలు చూసి, నీకు పిల్లనివ్వడానికి, బోల్డు మంది లైనుకడుతుంటే, ఆ పిల్ల కోసం నేను…..నేను…..  …ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే  చేసినవాడిని,  దేహీ। అని వాళ్ళ ఇంటికెళ్ళి పిల్లనడగాలా? మండిపడ్డాడు. మనోజ్ తాత మరిడయ్య ….

          అడగకు. నేను ఆ అమ్మాయిని పెండ్లాడి వాళ్ళింటికి వెళ్ళిపోతాను. లేకపోతే ! ఏదో దేశం వెళ్ళిపోతాను. మా అమ్మను కూడా తీసుకుపోతాను. 

          ఖచ్చితంగా చెప్పాడు మనోజ్ …

           “ వాళ్ళు బాగా ఆస్థి పాస్తులున్న వాళ్ళేనా?మన హోదాకు సరిపోతారా ? మస్తుగా కట్నకానుక లిస్తారా ? మరిడయ్య  భార్య మహంకాళి అడిగింది. మెడలో కాసుల పేరు సరిజేసుకుంటూ మనుమడిని మనోజ్ నాయనమ్మ.

          “ వాళ్ళేమీ! కలిగిన వాళ్ళుకాదట …ఏదో ఎకరం పొలం ,.ఒకఇల్లు ఉన్నాయట. అదీ పల్లెటూరిలోనే ఉన్నాయిట.

          ఈ పిల్ల మాత్రం చాలా తెలివైందట. కాలేజీ ఫస్ట్ వస్తాదిట.. చాలా అందంగా ఉంటుందిట. వాళ్ళ బామ్మ ఈ పిల్లకు తోడుగా ఉంటుదిట. ఒక గది ఇల్లు అద్దెకు తీసుకొని ఈ ఊర్లో ఉంటున్నారట. ఆ పిల్ల గొప్ప ధైర్యవతురాలట. అవేవో. కరటేలు, కర్రసాములూ వచ్చట. చదువులో, ఆటల్లో ,పాటల్లో ,ఆపిల్లే ముందట ఉంటుందట .అందుకే మనవాడు మనసుపడ్డాడుట..

          మనకి తప్పదు గదా ! ఆ పిల్ల బామ్మ, వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి నాతో మాటాడితే గానీ, నీవు ఆ అబ్బాయితో మాటాడ్డానికి వీల్లేదన్నదట.  ఆ పిల్ల వాళ్ళ బామ్మ మాట మనవాడికి చెప్పి . .అందుకే మనలను  రమ్మని చెప్పిందట అంది మనోజ్ తల్లి మహలక్ష్మి  అత్తగారికి వివరాలు చెప్తూ……

          ”ఓహో ! నీకు తెలిసే ఈ గ్రంథం అంతా నడుస్తోందన్న మాట” . వీడికి వీడి బామ్మ మాటంటే ఖాతరులేదు. గానీ! ఆ  అమ్మాయి అలాగా కాదన్నమాట. దీర్ఘాలు తీసింది మహంకాళి .

          వెంటనే బుస్సున లేచాడు మనోజ్. ఆమె నీలాగ కాదులే. గొప్ప పేరున్న మనిషి. ఆమె చిన్న పిల్లప్పుడే తండ్రితో స్వాతంత్రోద్యమంలో తిరిగిందట. సంఘసేవ, దేశసేవ చేసిందట … ఎందరో స్త్రీలను కష్టాల నుండి కాపాడి రక్షించిందంట. తను పెద్దగా చదువుకోలేదు కాబట్టి, మనమరాల్ని దగ్గరుండి చదివిస్తానని ఈ ఊరు వచ్చిందిట.           

          ఆ  అమ్మాయి కూడా కాలేజీలో, అబ్బాయిలెవరైనా అమ్మాయిల నేడిపించినా , తాట తీస్తుంది. పోలీసులనైనా ,ఆఫీసర్లనైనా ,ఆఖరుకు లెక్చరర్లు, ప్రిన్సి పల్  గారైనా , తప్పు చేస్తే ధైర్యంగా నిలదీస్తుంది. ఎదిరిస్తుంది. ఆ పిల్ల తల్లి మా అమ్మ లాంటిదే నట.

          ఆ అమ్మాయి ధైర్యస్తురాలు అందుకే ఆ అమ్మాయంటే నాకు చాలా ఇష్టం ఆవేశంగా  అన్నాడు మనోజ్ .

          ఇంకేమి.. .మీ అమ్మ ఈ ఇంటికి వచ్చినట్లే, మీ ఆవిడొస్తుందన్న మాట!

          ఇక మా పెత్తనమెందుకు ? నువ్వు మీ అమ్మా చూసికోండి, విసురుగా అంది మహంకాళి .

          “ అలాగే చూసుకుంటాములే. నువ్వు ,తాత పెద్దవాళ్ళు, నా పెళ్ళికి  పెద్దలను చేద్దామనుకున్నాను. మా నాన్న లేడు. నాకు ఎవరూ లేరు అనుకుంటాను.

          మీరు రాను ఆవిడతో మాట్లాడము అంటే, మా అమ్మనే తీసుకెళ్ళి పెళ్ళి కుదుర్చుకుని దూరంగా వెళ్ళి పోతాను బెదిరించాడు మనోజ్” ….

          బాబ్బాబు :అంత పనిచెయ్యకురా!.నాకొడుకుని నీలో చూసుకొని బ్రతుకుతున్నాను

 బ్రతిమాలింది మహంకాళి …

          “ నోటికొచ్చిందల్లా వాగుతావు.మళ్ళీ వాడేమన్నా అంటే ఏడుస్తావు. అని మహంకాళి పై కేకలేసి , నువ్వు ఒప్పుకున్నాక మాకు తప్పదు గదా !  అసలు ముందు వాళ్ళెవరో? ఎలాంటివారో ?చూసాక ఆలోచిద్దాం అన్నాడు భార్యకు సౌంజ్ఞ చేస్తూ ,మరిడయ్య …

          నేను చూసాను తాతా ! నీ సౌంజ్ఞలు. వాళ్ళని బెదిరించి తప్పించాలని చూస్తే,  నేనూరుకోను. నా మాట దేముడెరుగు. ఆ అమ్మాయే, నీ అంతం చూస్తుంది కోపంగా అన్నాడు మనోజ్ .

          “నేనెక్కడ సౌంజ్ఞ చేసానురా? నీకే మా మీద గౌరవం లేదు.

          ఆ అమ్మాయికి వాళ్ళ వాళ్ళమీద గౌరవం . ఉంది.. ఆ అమ్మాయి మీద మోజుతో నువ్వే మా మీదకు వాళ్ళని ఉసిగొల్పేలా ఉన్నావు. అయినా నువ్వు ఆ అమ్మాయిని గురించి చెప్పు . అమ్మాయి భామను గురించి చెప్తూ ఉంటే నాకు ఎవరో గుర్తొస్తున్నారు కొంపదీసి ఆవిడ కాదు కదా అయినా నువ్వు పెంట మీదకి పంట మీదిది ఇంటి మీదకి తీసుకొచ్చాక తప్పుతుందా?  సరే తినబోతు రుచులు అడగడం ఎందుకు? నువ్వు చెప్పినట్లే చూద్దాంలే!

          అయినా తండ్రి లేని పిల్లాడివని గారాబం చేస్తే ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇరుక్కుని పెట్టే స్థితికి తీసుకొచ్చావ్.. నిన్ను విడిచి ఉండలేము. నీ మాట కాదని బతకలేము.

          బయలుదేరవే చూస్తాము అని భార్యకి చెప్పి , సరే పద వస్తాము . భగవంతుడెవరికే రాత రాస్తాడో? అని బయల్దేరాడు మరిడయ్య…

***

          “ ఉయ్యాల బల్లమీద కూర్చుని ఊగుతూ, రాజమాతలా ఉన్న, రామనామం చెప్పుకుంటున్న పెద్దామెతో ….

          బామ్మగారూ :! ఇదుగో మా తాతను తీసుకొచ్చాను అన్న మనోజ్ మాటలకు ఇటు తిరిగి చూసిన ఆమెను చూసిన మరిడయ్య, మాటరాక చేష్టలుడిగి నిలుచుండి పోయాడు

***

          ఓహో। మరిడయ్యగారా? బాగున్నారా? ఎంతకాలమైంది చూసి,  అలాకూర్చోండి. అని. నీవు మరిడయ్యగారి మనుమడివని చెప్పలేదేమి మనుమడా? అంది చుక్కమ్మ …

          అమ్మాయి మీ మనుమరాలని మాకూ చెప్పలేదు వీడు .

          ఉక్రోషంగా అన్నాడు మరిడయ్య.

          మీరా? మీరని తెలిస్తే రాకపోదుము. మహంకాళి మండిపడుతూ అంది.

          మీరని తెలిస్తే నేనూ ఇంతవరకు రానివ్వకపోదును.

          ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎండపడి వచ్చారు కాస్త చల్లగా ఇంత మజ్జిగ తాగి వెళ్ళండి.

          అమ్మాయి మాధుర్యా!… వీళ్ళకి కాస్త చల్లని మజ్జిగ తీసుకురా అంది చుక్కమ్మ…

          మాకే మర్యాదలు అక్కర్లేదు. ముందు మీరు చేసిన మర్యాదలే మేము ఇంకా మరిచి పోలేదు

          అని విసవిసా నడిచారు మహంకాళి, మరిడయ్య.

          వారి వెనకాతలే వెళ్ళినట్లు వెళ్ళి, సెల్లు మర్చిపోయానని వెనక్కి వచ్చిన మనోజ్ తల్లి..

          చుక్కమ్మ పాదాలకు నమస్కారం చేసి, పెద్దమ్మా, ఎలాగైనా , నా కొడుక్కి, నీ మనవరాలను ఇచ్చి పెళ్ళి చేసి పుణ్యం కట్టుకో ..అని, కొంగు పట్టి అర్థిస్తున్నాను అని  కొంగు పట్టుకుని పెద్దామెకు ఎదురుగా నిలిచింది మనోజ్ తల్లి మహాలక్ష్మి …

          పిచ్చిదానా !బెంగపడకు..

          ఆ రోజుల్లోనే ! అంతమందిని ఎదిరించి, పదవి మదంతో కొట్టుకుంటున్న మీ మామను, బెదిరించి పెళ్ళి చేశాను.. ఇప్పుడేముంది?, మీ మామ చచ్చిన పాము?

          నీ కొడుకు యువరత్నం. భగవంతుడు వాళ్ళకి రాసిపెట్టి ఉంటే, ఈ పెళ్ళి తప్పకుండా జరుగుతుంది .వెళ్ళు అంది చుక్కమ్మ  ధైర్యం చెబుతూ…..

          కార్లో కూర్చున్న మరిడయ్యకు … కళ్ళ ముందు చాలా సంవత్సరాల క్రితం తన జీవితం, కళ్ళ ముందు నిలబడింది.

          చుక్కమ్మ రూపు. చక్కగా నిలబడిపోయింది.

          కాలం ఎంత చిత్రమైనది?

          పాలేరుగా ఉన్న తను పంతులుగారు సాయంతో, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావడం. ఆ పదవి మొదలుపెట్టి ఎమ్మెల్యే అవ్వడం .ఇంతలా ఎదగడం జరిగింది.. ఈమె మాత్రం ఎలాంటి పదవులు లేకపోయినా అలాగే ఉంది అనుకున్నాడు ..

          “  ఉషోదయంలా ఉల్లాసంగా, సాయం సంధ్యలా సంతోషంగా , సమీరంలా చురుకుగా తిరిగేది చుక్కమ్మ .

          ఎండల్లో తిరిగినా, ఏమాత్రం రంగుతగ్గని పసిమిచాయ .

          దేవతాంశ సంభూతురాలా! అన్నట్లు. నిగనిగలాడే పెద్ద జుట్టుతో పార్వతీదేవిలా,, ప్రకాశవంతమైన ముఖం పై పొద్దుపొడుపు లాంటి పెద్దబొట్టుతో , పొడుగు చేతులజాకెట్టు ,చక్కగా కట్టిన చీర చిలకట్టుతో, శ్రీ మహాలక్మిలా అందెలు కడియాలపాదాలతో, అందంగా చలాకిగా , పనిపాటల్లో తలమునకలై తిరిగేది..

          అడిగిన వారికందరికీ ఆప్యాయంగా సాయం చేసేది.. వీళ్ళు రాజులు. అయినా   ఘోష పద్ధతి ఉండేది కాదు.

          “చీరకట్టు బిగించి చేలగట్ల పై తిరిగే చుక్కమ్మను చూసి, చిలిపిచేష్టలు చేయాలని చూస్తే, చింత బరికతో చితగ్గోట్టేది “.

          ఎంతఆత్మీయంగా ఉండేదో, అంత ఆత్మవిశ్వాసంతో ఉండేది.

          ఎంత అందంగా ఉండేదో , అంత అణుకువగా ఉండేది .

          ఎంత దయగా ఉండేదో అంత ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనేది” చుక్కమ్మ .

          అందుకే ,ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలoదరిచే ,చేతులెత్తి మొక్కించుకునేది.

          ఆ ఊరి పెద్ద ఆంజనేయశర్మగారు కూడా,  ఆప్యాయంగా అప్పా! అని పిలిచి,  అవసరం వస్తే ఆమెను పిలిపించి సంప్రదించేవారు .

          చేపాటి కర్రపట్టుకొని చేను కాపలాకి కూడా వెళ్ళిపోయేది .

          చుక్కమ్మ , చేయి తిరిగిన వంటగత్తె. పనిపాటలు చేస్తూ, నాట్లేస్తూ, ధాన్యం గాలికి పోయిస్తూ, విసురుతూ, దంచుతూ , గళంమిప్పి పాడిందంటే, గమ్మత్తుగా కాలం గడిచి పోయేది . 

          ఆడపిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే , చావగొట్టి తెచ్చి, వాళ్ళింట్లో పడేసేది. అందుకే ఆఊరి  ఆడపిల్లలకామె దేవత .

          అందుకే ఆ ఊరి ప్రజకు పెద్దమ్మంటే అంత గౌరవం. ఆంజనేయులు పంతులుగారి దగ్గరకు వెళ్ళడానికి భయపడే వారుజనాలు . ఒకప్పుడు వారింట్లో తాను పెద్ద పాలేరుగా పనిచేసేవాడు.

          చుక్కమ్మ ఎంతో చక్కగా మాట్లాడేది .

          ఆ రోజు గెడ్డ పోలంలోగడ్డి కోసుకొని పెద్దమోపు కట్టి నెత్తిమీద పెట్టుకొని ఆలస్యమై పోయిందని ఆదరాబాదరాగా వస్తున్నదట చుక్కమ్మ .

          సన్నని గొంతులో వస్తున్న ఏడుపు .చెవులు రిక్కించి విందట .

          చుక్కమ్మ తోవ ప్రక్క నుండి ఆ  ఏడుపు వస్తోందని  గ్రహించి , గడ్డి మోపక్కడ పడేసి, గబగబా పరిగెత్తిందిట . ఆ పిల్లని ఎత్తకపోతున్న వారు, ఈమె రావడం వలన , ఆ పక్కనే గోతిలో పడేసి పరిగెత్తారట. పంతులుగారి ఆఖరమ్మాయి లక్ష్మి. అత్తా ! అత్తా అని అరుస్తూ ఏడుస్తోంది .

          అయ్యో తల్లీ ! ఎలా పడిపోయావురా? అని, గడ్డిమోపుకి కట్టిన పలుపు తాడిప్పి,  ఒకకొస ప్రక్కనున్న కానుగు మానుకు కట్టి, ఒకకొన లోతైన ఆ పెద్ద గోతిలోనికి వదిలి,తాడు గట్టిగా పట్టుకోమని పైకి లాగి, గడ్డిమోపు అక్కడవదిలి, అమ్మాయిని ఎత్తుకొని తెచ్చి పంతులు గారి ఇంట్లో పిల్లను అప్పజెప్పిందిట. 

          అప్పటికే తల్లడిల్లిపోతున్న పంతులుగారు ఆంజనేయ శర్మగారి భార్యను ఊరడించి,  ఆగ్రహంతో ఊగిపోతున్న ఆంజనేయశర్మగారితో…

          అదేంటి తమ్ముడూ ? అసలేంటి జరిగిందో, వినకుండా అరుస్తావేంటి? అని మొదలు పెట్టింది చుక్కమ్మ . అందరితోపాటు బడి నుండి వస్తున్న పాపను, ఆఖరున నడుస్తున్నదానిని. కొంతదూరం వచ్చేసరికి , అమాంతం నోరునొక్కి , ఎవరో పక్కకు లాగారట .

          మిగతా పిల్లలెవరూ చూసుకోలేదట బాబూ !

          అయినా, చిన్నపిల్లని నోరు నొక్కి గోతిలో పడేసారంటే ,కోపానికి కారణమేమంటావు తమ్ముడూ? ఆరా తీస్తూ అంది చుక్కమ్మ .

          ఆ కాంట్రాక్టర్లకే మన మీద కక్ష. అప్పా!.వారు ఫ్యాక్టరీ కడతాను అనుకున్న భూమి  గవర్నమెంటు భూమప్పా! ఆ భూమి కలక్టరుగారి దృష్టిలో పడింది . అది సైనికులకు ఇవ్వాలంటే , నేనే ఇక్కడ ఉద్యోగిని కదా! ఆ కాగితాలు రాసాను. వీళ్ళు ఆ భూమి వాళ్ళ పరంచేస్తే నాకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామన్నారు , నేను న్యాయం పక్షాన నిలబడ తాను ఇది మీకు చెందదు అన్నాను . అందుకు వాళ్ళు నాపై కక్షగట్టి ఇలా చేసుంటారు  అంతకన్నా నాకు అన్నారు శర్మగారు .

          అతని భార్య  ఇలా అయితే  పిల్లలను బడికెలా పంపండం? కళ్ళనీళ్ళు పెట్టు కున్నారు.          

          చాల్లే !మరదలా ఎలకలున్నాయని ఇల్లు తగల బెట్టుకుంటామా ?

          మనూరి నుండి వెళ్ళే పిల్లలందరినీ ఒకేసారి వెళ్ళి, ఒకేసారి రమ్మని చెప్దాం .

          అందరిలో పెద్దోడిని వెల్లినప్పుడు వచ్చినప్పుడు అందరినీ సూసుకో మనీ చెప్తాం.

          పోలీసులకు ఫిర్యాదు చేద్దాం. ఊర్లో చాటింపు వేయించు తమ్ముడూ.

          ఊరు నుండి బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళ రక్షణ చూసుకోవాలని చెప్పించు….. బెంగపడకమ్మా  !అని చెప్పి, చుక్కమ్మ అంది . .తమ్ముడూ ! నీకు  నీ కుటుంబానికి కాలు ముల్లు గీరినా ప్రమాదం వచ్చినా, శత్రువులే కారణం అని, ముందే కేసు పెట్టీ శత్రువులకు తెలియజేయు అందిచుక్కమ్మ. .

          చాలా బాగాచెప్పావు అప్పా! అలాగే చేద్దాం అన్నారు ఆంజనేయ శర్మ గారు అసలు , అందరూ భయపడే నాన్నను ఆ అత్త ఎలా ఒప్పిస్తుందమ్మా ? అడిగాడు మనుమడు ఆంజనేయులు గారి అత్తగారిని.

          అదొక కధరా బాబూ .!

          హైస్కూల్ చందాల కోసం తిరుగుతున్న మీనాన్నని , నాగుపాము పొడిచింది. ప్రక్కనున్న పైడితల్లి కట్టు కడుతుంటే , ఈ చుక్కమ్మ పొలం నుండి వస్తూ చూసి ,కత్తితో  గంటు పెట్టి , విషం గట్టిగా పిండేసి, తన చీరచెంగు చింపి, ద్రౌపతీదేవి కృష్ణుడికి కట్టు కట్టినట్లు కట్టుగట్టి ,విషం పైకేక్కకుండా జేసిందిట.       

          అప్పటి నుండి మీ నాన్నకు ఆమె ఆంటే గురి .

          అదేకాదురా బాబూ! ఈమె గొప్ప సాహస వంతురాలు. .బాగా బాణాలు వేస్తుంది. శత్రువులను ఎదుర్కొంటుంది. తండ్రి కత్తి సాము, కర్ర సాము కూడా నేర్పించాడట. “సున్నపు కాయల్లో కారం నింపించి.” ఊర్లమధ్య గోడవలోస్తే ఆడ సైన్యాన్ని సిద్ధం చేస్తుంది. మనూరిని కాపాడుతుంది .  

          ఎవరినైనా, ఎంత గొప్పవాడు అయినా, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే,,రామ మందిరం స్తంభానికి కట్టించి, ఒక రాత్రి ఒక పగలు అలాగే ఉంచి, ఊర్లో పంచాయితీ జరిపాక పంపించేది

          ఆమె భర్త మంచి పేరున్న నాయకుడు. భార్యను చక్కగా అర్థం చేసుకునేవాడు .

          ఒక కొడుకు కూతురు మంచి విద్యావంతులు. .మంచి చేస్తే మెచ్చుకునేది ..

          ఎవరైనా తప్పు చేశారో, తాటతీయిస్తుంది అంది అమ్మమ్మ . .

          అయ్యబాబోయ్! ఆడవాల్లందరికీ ఈమె ఆదర్శ మహిళ అన్నమాట అంది వారి పెద్దమ్మాయి . .అవును ఇలాంటి స్త్రీలను చూసి చాలా ధైర్య సాహసాలు నేర్చుకోవాలని ఈ తరం వారు అన్నారు అమ్మమ్మ..

          ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళే కావాలంది, ఆంజనేయులుగారి భార్య .

          నిజమే అన్నారు పిల్లలు.

          అసలు ఆమెతో ఏ ఊరు? అమ్మమ్మా ! అని అడిగిన మనవడితో .

          అప్పుడు చెప్పింది ఆ అమ్మమ్మ  అసలు రహస్యం.

          “చుక్కమ్మగా పేరు పడిన ఈమె,”  మీనాన్న మరికొందరు , ప్రపంచ నిధి కోసం, విరాళాలు పోగుజేయ్యడానికి తిరుగుతుంటే , ఆ గుంపులో పెద్దయిన నారాయణ రాజుగారు తనకూతురని, ఈమెను చూపెట్టి , బాబూ! నా చిన్న భార్య కూతురీమె.

          ఈమె తల్లి ఈ మధ్యన చనిపోయింది . నాకుటుంబం ఈమెను చేరనివ్వరు . నాకు క్షయవ్యాధి వచ్చింది . .నావాళ్ళు నన్ను దీనిని బయిటకు నెట్టేశారు. నేనెక్కడో గడిపి కళ్ళు మూస్తాను . మీరు చాలా మంచివారు . మనుసున్న మనిషి . ఎందరికో ఉపకారం చేస్తున్నారు. ఈమెను మీ అక్క చెల్లెలు అనుకోండి..మీకు తెలిసిన ఎవరికైనా,  ఈపిల్లని యిచ్చి పెళ్ళిచేసి, ,అన్నదమ్ముడిలా చూస్తారా? అని అడిగారట..మీనాన్న అతనికి ప్రమాణం చేసి ఈమెను తీసుకొచ్చాడు …

          మీ నాన్న ఈమెను, కోరి  ఇష్టపడిన, ఈ ఊరి వాడైన ,మోతుబరి రైతు, కృష్ణంరాజు కిచ్చి పెళ్ళి చేయించాడు.  మన తోటలో పాత ఇంట్లో ఆ పెద్దాయనని పెట్టి చాలా కాలం చూశాడు. ఈమెకు తల్లి పోలిక. ఆమె గొప్ప యుద్ధ ప్రవీణురాలట కూడా.. తండ్రి మంచి ఉపకార బుద్ధి కలవాడు.  ధైర్యవంతుడు  అంది  అమ్మమ్మ .

          అక్కడే ఉండి అంతా వింటున్న ఆ ఊరి మాస్టరు .మీరు మాత్రం తక్కువ తిన్నారా అమ్మా! ఆకలి అన్నవారికి అన్నం పెడుతూనే ఉంటారు.

          మీ అమ్మాయిగారు వైద్యం చేస్తారు..నిజంగా మీలాంటి మనుషులు మధ్యన ఊర్లో ఉద్యోగం చేయడం నా అదృష్టం… అనాగారికులనుకున్న మీరంతా పల్లెలలోనున్నా , గొప్ప సంస్కారవంతులు అన్నారు. పట్నం నుండి బదిలీ మీద వచ్చిన ప్రసాదరావు    .

          ఇవన్నీ పెద్ద ఘనకార్యాలని చుక్కమ్మ, మా అల్లుడు, మేము అనుకోము. ..

          అందరినీ కాపాడడం గొప్ప కార్యము. “మానవసేవే మాధవసేవ  బాబూ”

          మీరు మాత్రం విద్యా దానం చేస్తున్నారు కదా! నవ్వింది ఆంజనేయులుగారి అత్త గారు …

          అలాంటి మనుషుల మధ్య నుండి వచ్చిన తను , పదవి నుంచి పదవికి వచ్చి ఎమ్మెల్యే అయ్యాక పట్టణం వచ్చేసాడు.. మధ్యలో ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు చుక్కమ్మ భర్త పాముపొడిస్తే చనిపోయాడని విన్నాడు తను, తర్వాత  ఊరు వెళ్ళడం కూడా మర్చిపోయాడు… సంపాదనలోపడి సాలిగూడులా అల్లుకున్నాడు. ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి.

          తన కొడుకు. ఈ మహాలక్ష్మిని ఇష్టపడ్డాడు .

          ఈ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోను అన్నప్పుడు, తను బెదిరించి ,ఈ  అమ్మాయి తండ్రిని, నా కూతుర్ని నీకు ఇవ్వను, అనేలా నాటకం ఆడింపించాడు ..

          తను.,దురదృష్టం కొద్దీ , వాడు చుక్కమ్మ బంధువట .,

          ఒప్పుకున్నట్టు ఒప్పుకుని వాడు చుక్కమ్మకు చెప్పాడట. ఇంకేముంది ?

           చుక్కమ్మ పంచాయతీ చేసి, ఆ పిల్లలిద్దరూ ఇష్టపడినపుడు, నువ్వు ఎలా కాదంటావని?

          నీ కొడుకు ఆ అమ్మాయిని నమ్మించి, పెళ్ళి చేసుకుంటానని, వాడితో తిప్పాక, ఇప్పుడు ఇంకొకరు ఈపిల్లను ఎలా చేసుకుంటారు?. పిల్ల చాలా మంచిది గుణవంతు రాలు కాబట్టి కట్నకానుకలు నేనిస్తాను అని , తనను పదిమందిలో నిలదీసి, వాళ్ళ పక్షాన పోరాడడం. ఎమ్మెల్యే ఎలక్షన్లు దగ్గరకావడం వలన , ప్రతిపక్షాల వాళ్ళ జోక్యం వలన ,  తప్పనిసరి పరిస్థితుల్లో ,తను కొడుక్కి, ఈమహలక్ష్మిని ఇచ్చి పెళ్ళి చేయడం జరిగి పోయాయి.

          ఈమె వలన కోట్లఆస్తికి వారసురాలు అయ్యింది తన కోడలు.. తనకు కట్నాలు పోయాయి .

          వ్యసనాల పాలైన తన కొడుకు చివరకు లివర్ పాడయి చనిపోయాడు. కోడలు మాత్రం చాలా మంచి పిల్ల. కొడుకికి ఒకే ఒక్కకొడుకు మనోజ్..

          కాలేజీ హాస్టల్ లో ఉండి పట్నంలో డాక్టర్ చదువుకుంటున్నాడు . తన మనవడు తల్లి పోలిక .,

          ఈ నాడు చుక్కమ్మ మనవరాలునే ఇష్టపడాలా ?తన కర్మ కాకపోతే,!,, ఆలోచిస్తున్న మరిడయ్య అకస్మాత్తుగా గుండె చేత్తో పట్టుకుని గిలగిల్లలాడిపోతున్నాడు…

          కంగారు పడిపోయి మనోజ్  మాధుర్యకు ఫోంచేసాడు ..

***

          మూడు రోజుల తర్వాత మరిడయ్య  కళ్ళు తెరిచేసరికి, ఆసుపత్రిలో కన్నీళ్ళతో

కోడలు , మనవడు……

          మనుమడి పక్కన చుక్కమ్మ మనవరాలు…..

          నేను డాక్టర్ శ్రీధర్  కార్డియాలజిస్ట్ ని…

          ఈ అమ్మాయి మా బంధువు . మీకు హార్ట్ ఎటాక్ రాగానే , మీ మనవడు ముందు ఈ అమ్మాయికి ఫోన్ చేశాడుట.

          ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి ,అంకుల్ ఎలాగైనా, వారిని సేవ్ చేయండి అంది.

          నేను రీసెంట్ గా  అమెరికా నుండి వచ్చి ,ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్  పెట్టుకున్నాను.. మీకు ఫస్ట్ ఎయిడ్ చేసి , వీళ్ళిద్దరూ టైంకి మిమ్మల్ని  తీసుకొచ్చారు .. కాబట్టి మీరు సేవయ్యారు .. మీ కండిషన్ చూసి టెన్షన్తో, ఆయాసం తెచ్చుకున్న మీ భార్య  ఆ బెడ్ పై ఉన్నారు.

          ఈ అమ్మాయి బామ్మ  చుక్కమ్మ గారు , నాకు ఫోన్ చేసి, మీరు మాజీ ఎమ్మెల్యే అని వారికి బాగా కావలసిన వారని , నేను పూర్తిగా మీ రక్షణ బాధ్యత తీసుకోవాలని , మరీ మరీ చెప్పారు. అందుకే !ఢిల్లీ వెళ్ళవలసిన కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకుని, ఫస్ట్ టైం ఒక పేషెంట్ తో నేను 24 గంటలు కూర్చున్నాను.

          చుక్కమ్మ గారు నా చదువుకు, ఆ రోజుల్లో నేను అమెరికా వెళ్ళడానికి, సహాయం చేశారు. ఈ రోజు ఆమె మాట నిలబెట్టగలిగాను. సంతోషంగా ఉంది అన్నాడు డాక్టర్ .

          కృతజ్ఞతగా చేతులు జోడించిన మరిడయ్యతో..ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పండి సర్.

          పాపం మీ కోడలు అటు అత్తగారిని , ఇటు మిమ్మల్ని చూసి, చాలా బాధపడు తున్నారు,

          మీ మనవడు ,ఈ అమ్మాయి, మీ ఇద్దరి  దగ్గరా ఉండి గొప్ప సేవ చేశారు.   

          ఇక మీకు ఏమీ పర్వాలేదు,..మీరు రెస్ట్ తీసుకోండి..

          మిస్టర్ మనోజ్ ,మీరు మీ తాతగారిని ,నాయనమ్మను చూసుకోండి అని చెప్పి వెళ్ళి పోయాడు డాక్టర్  శ్రీధర్..

          మనోజ్ ని మాధుర్యను దగ్గరకు రమ్మని , వాళ్ళ చేతులు కలిపి, ఇదే బంధం నాయనా! డబ్బే రక్షిస్తుందనుకున్నాను. కానీ! మీ ప్రేమ రక్షించింది.

          అందుకే, మీ ప్రేమను కూడా నేను విడదీయను..హాయిగా! మీకు పెళ్ళి చేసి మీ పిల్లలితో ఆడుకుంటాను.

          నేను నాకు ప్రేమను పంచిన నా పల్లెటూరికి పోయి ప్రశాంతంగా ఉంటాను అన్నాడు దృఢనిశ్చయంతో మరిడయ్య..

          వీల్ చైర్ లో మాధుర్య , కోడలు తోసుకొస్తే, భర్త దగ్గరికి వచ్చిన మహంకాళి , కళ్ళ నీళ్లు పెట్టుకుని,అలాగే చేద్దాం. మీరు ఆవేశ పడకండి .ఆరోగ్యంగా ఉండండి.

          మనం మునిమనమలితో ఆడుకోవాలి కదా !అంది నవ్వుతూ…

          మనమరాలు ఫోన్ చేస్తే, అప్పుడే అక్కడికి వచ్చిన చుక్కమ్మ.

          శుభం  అంది నవ్వుతూ.. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.