చిత్రం-56

-గణేశ్వరరావు 

          ఈ తైలవర్ణ చిత్రం పేరు ‘స్వప్న సౌందర్యం’, చిత్రకారుడు క్లైవ్ బ్రయంట్. వాల్ట్ విట్మన్ కవిత ‘అశాశ్వత అమరత్వం’ నుంచి స్ఫూర్తి చెంది దీన్ని గీసాడు: ఎల్ల కాలం ఏదీ వుండదు. ప్రతీదీ కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. జరామరణాలు ఎవరూ తప్పించుకో లేరు. అయితే ఇక్కడో వైరుధ్యం ఉంది: కళాకారుడు మరణిస్తాడు, కాని అతను సృష్టిం చిన కళాకృతి అతని తర్వాత కూడా నిలుస్తూ అతనికి అమరత్వం కల్పిస్తుంది, తన చిత్రానికి పెట్టిన పేరులో ఈ అర్థం దాగి వుంది అని  క్లైవ్ అంటారు. వాల్ట్ విట్మన్ జీవిత చక్ర భ్రమణం పై దృష్టి పెట్టాడు. మనుషులు పుడతారు, పెరుగుతారు, పెళ్ళి చేసు కుంటారు, పిల్లల్ని కంటారు, ముసలవుతారు, మరణిస్తారు. విట్మన్ తన కవిత ‘లైలాక్స్ పూలు పూచిన వేళ..’ లో మరణాన్ని జీవితంలో అంతర్గత భాగంగా ఊహిస్తాడు, పూలు శిశిరంలో వాడిపోయి, వసంతంలో మళ్ళీ వికసిస్తాయి, వికసిస్తున్న మొగ్గలను చూస్తూ మరణించిన తన మిత్రులను తలచుకొని విట్మన్ దు:ఖిస్తాడు. ప్రకృతి జీవిత చక్రాన్ని చూసినప్పుడు, చావు పుట్టుకలకు ఉన్న సంబంధం అర్థం చేసుకోగలమని విట్మన్ అభిప్రాయం.
 
          సార్జంట్ వేసిన Ena-Betty ల చిత్రం తనకు స్ఫూర్తి కలిగించిందని క్లైవ్ అంటాడు. Ena-Betty లు లేరు, కాని వారి చిత్రం వుంది, అది వారిని మృత్యుంజయుల్ని చేసింది. దాన్నే ‘అశాశ్విత శాశ్వితత్వం’ అంటాడు ! కుంచెను ఉపయోగించడంలో సార్జంట్ చూపిన పనితనం, ప్రతిభ, టోన్ లోని ఖచ్చితత్వం క్లైవ్ ను ముగ్దుడిని చేసాయి. ఆ చిత్రంలోని అమ్మాయిలతో ఉండిపోవాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ మాటలు వినాలని వుందని క్లైవ్ అంటాడు; అంతకు ముందు తాను చూసిన ఏ చిత్రం ముందు తాను అలా అనుభూతి చెందలేదని, సార్జంట్ చిత్రంతో మాత్రం ప్రేమలో పడ్డానని అంటాడు.
 
          ఏ కళాకారుడైనా ముందు తన కోసం కళాకృతిని సృజిస్తాడు, తన కోసమే క్లైవ్ బొమ్మలు గీస్తాడు, అయితే సార్జంట్ రూప పటంలా తనని ఏదైనా కదిలించినప్పుడు, దానికి దీటుగా తను చిత్రం గీయాలనుకుంటాడు. తను పొందిన అనుభూతిని దాని ద్వారా వ్యక్తపరచాలని అనుకుంటాడు. తన బొమ్మలు చూసేవారు తన అనుభవాన్ని గ్రహించాలని కోరుకుంటాడు. కంటికి కనిపించిందే కాక, కనిపించనవి, అతీతమైన వాటిని కూడా గ్రహించాలంటాడు. క్లైవ్ కి మనస్తత్వ శాస్త్రంలో అభినివేశం వుంది, విరుద్ధమైన ప్రవృత్తులు అతన్ని ఆకర్షిస్తాయి, బాహ్యరూపం అనేక సార్లు అంతర్గతంగా వున్న మనో భావనలకు విరుద్ధంగా ఉంటుంది కనుక క్లైవ్ తన చిత్రాలలో వాస్తవికతతో పాటు నైరూప్య అంశాలు కూడా చిత్రిస్తాడు. నేను పోస్ట్ చేసిన క్లైవ్ చిత్రం అర్థం చేసుకోవడానికి నా వ్యాఖ్యలు కొంతవరకు పనికి రావొచ్చు.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.