తెల్లారని రాత్రి

-వి.విజయకుమార్

(ఒక నవలిక & 19 వ్యాసాల సంపుటి) సమీక్ష

          రంగనాయకమ్మ గారు ఇటీవల కాలంలో, వెంట వెంట జరిగిన ఆపరేషన్ల కారణంగా, అనివార్యంగా ఇంట్లోనే మంచానికి పరిమితమై వుంటూ, తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తనకు సేవలు అందించడానికి వచ్చిన మీనాక్షి అనే నర్స్ తో ముచ్చటిస్తూ ఆమె జీవితంలోకి తొంగిచూసిన కథా నేపథ్యమే తెల్లారని రాత్రి. ఈ సంపుటిలో 120 పేజీలు, దాదాపు అర్థ భాగం, అడపాదడపా ఆమె చెప్పిన తన జీవితం తాలూకు అనుభవాలను యధాతధంగా ఒక చిన్న నవలా రూపంలో అందిం చారు.

          నిజానికి మీనాక్షి కంటే ముందు కొందరు ఇటువంటి సేవలు అందించినా, ఈ కధ మీనాక్షికే పరిమితమైంది. 

          వ్యక్తిగత జీవితంలో మనకు శ్రమ చేసిపెట్టే వ్యక్తుల పట్ల సాధారణంగా మనకుండేది డబ్బు సంబంధాలే తప్ప వేరే వాటిగురించి శ్రద్ధ వుండదు. శ్రామిక కోణం గురించి నిరంతరం బోధించే రంగనాయకమ్మ గారు (తనకు సేవలు అందించే ఈ మీనాక్షికి ఇంట్లో విశ్రాంతి తీసుకునే గది కేటాయించి, పత్రికలూ అవీ సమకూర్చి, ఆదివారాల సెలవులు ఇచ్చి, తను రోజుకు రూ. 800 లు అడిగినా వెయ్యి ఇస్తూ, ఇంట్లో సభ్యురాలిగా చూసుకుంటూ రావడమే కాదు, ఆమె అధిక వడ్డీతో కడుతోన్న లక్ష రూపాయల రుణాన్ని తీర్చడం రంగనాయకమ్మ గారి కుటుంబం గురించి తెలిసిన వారికి ఇది కొత్తేమీ కాదు) ఇంతకూ తనింట్లో శ్రామికురాలికి తాను బోధించే అదనపు విలువ, శ్రమ దోపిడీ గురించిన స్పృహ తాను మీనాక్షికి చెల్లించే వేతనంలో ఇచ్చే సందర్భంలో ప్రతిఫలిస్తూ వుందా? తాను కూడా అందరిలాగే శ్రమ దోపిడీ చేస్తున్నానా? అనుకుంటూ చాలా సీరియస్ గా అంతర్మథనంలో పడటంతో నవలిక మొదలౌతుంది.

          మీనాక్షి భద్రాచలం నుంచి హైదరాబాద్ వస్తుంది. గోపాల్ అనే ఆర్ఎంపీ వైద్యుడి తో పెళ్ళి. ఇద్దరి పిల్లలు తల్లి అయినా సదరు మొగుడు గారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, క్షమించమనడం, మళ్ళీ యదేచ్ఛగా కొనసాగించటం ఇదీ తంతు. దాంతో వాడితో వుండలేక పిల్లలతో హైదరాబాద్ రావడం, వాళ్ళకు పెళ్ళిళ్ళు, సారెలూ, అవకాశాన్ని అందిపుచ్చుకొని అలంకారంగా ఉత్సవ విగ్రహం లాంటి మొగుడు తండ్రి పాత్రలో పెళ్ళిళ్ళలో జీవించడం, పబ్బమ్ గడవగానే నిష్క్రమించడం, మళ్ళీ ఒంటరి పోరూ, గోపయ్య లాంటి మనసున్న వ్యక్తులు, నారాయణ లాంటి అమాయకులు, వనజాక్షి, సుశీల, విశాల…నిత్యం ఏ గ్రామాల్లోనైనా తారసిల్లే సజీవ పాత్రలు మీనాక్షి అనుభవాల నుంచి సజీవ సాక్ష్యాలుగా ఈ నవల్లో వచ్చి నిలబడతాయి.

          స్త్రీ పురుషుల మధ్య నమ్మకం లేకపోవడం, పురుషుడు ఏది చేసినా తప్పుకాదు అనే ధోరణి, ఒకరిపై ఒకరు కపట ప్రేమలు, లుకలుకలాడే పునాదులపై నిలబడ్డ వైవాహిక సంబంధాల్లో ఆమోదయోగ్యంకాని అనేక సందర్భాలు మీనాక్షి బయట పెట్టిన అనేక నిజాల నుంచి బయటపడిన కథనమే తెల్లారని రాత్రి. మీనాక్షి అనుభవాలే అయినా వాటిని నవలిక రూపంలో తన సహజ శైలిలో రాసిన తీరు, పాఠకుడిని ఏక బిగిని నవల చదివించేలా చేస్తుంది.

          మిగతా వ్యాసాలు వేరువేరు పత్రికల్లో వచ్చిన వాటిని ఈ సంపుటిలో చేర్చారు. ఇందులో ప్రధానంగా, శ్రమ దోపిడీ అంటే ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? శ్రామికులు ఎవరిని నమ్మాలి? కావలసింది వర్గ పోరాటాల చరిత్ర! శ్రామికులు తెలుసుకోవాల్సిన సమాజ రహస్యాలు, ఉద్యోగాల ఊచ కోతలకు కారణాలు ఏమిటి? ఆదానీ కంపెనీల కహానీ, సనాతన ధర్మం, అధునాతన ధర్మం, శ్రామిక ధర్మం, బిచ్చగాడు అంటే క్షీణ కార్మికులే! లాంటి వ్యాసాలు శ్రామికకోణం నుంచి రాయగా ఎన్నికలు ఒక హాస్య నాటకం,ఎన్నికల్లో కోట్ల కోట్ల డబ్బు ఎక్కడిది?, చంద్రయానం సరే; పాకీ పని వారి సంగతేమిటి? – ఒక కథ చదివి, ఈ క్రూరత్వం ఈనాటిది కాదు, ఇవండీ దేశాధినేతలు చేసే ఘనకార్యాలు! – లాంటి జనరల్ అంశాలకు సంబంధించిన ఇతర వ్యాసాలు ఇందులో చోటుచేసుకున్నా యి. నేరుగా పత్రికల్లో చదవడం మిస్ అయినవారు ఈ సంపుటిలో చదువుకోవచ్చు. యే వ్యాసానికా వ్యాసం ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించి, పాఠకుడిని ఆలోచనలో పడేస్తుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.