దేవి చౌధురాణి

(మొదటి భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

మొదటి భాగం

          “ఫీ ఫీ…., ప్రఫుల్లా, ఓయ్ ప్రఫుల్లా” 

          వస్తున్నానమ్మా. ఇదిగో వస్తున్నా

          “ఏమీటో చెప్పమ్మాకూతురు దగ్గరకు వచ్చి అడిగింది.

          “ఘోస్ ఇంటికి వెళ్ళి ఒక వంకాయ తీసుకుని రా.”

          “నేను వెళ్ళనమ్మా. అడుక్కుని రావటం నాకు చేతకాదు.”

          “అయితే ఏం తింటావ్? ఇంట్లో ఏమీ లేదు.”

          “అడుక్కుని ఎందుకు తినాలి? వట్టి చద్దన్నం తింటాను.”

          “అరే, బీదవాళ్ళకి అడుక్కోవటానికి సిగ్గెందుకు? మన దౌర్భాగ్యామే అట్లాంటిది!” 

          ప్రఫుల్ల ఏమీ జవాబు చెప్పలేదు, తల్లి మళ్ళీ అన్నదిసర్లే, నువ్వు బియ్యం పొయ్యి మీదకెక్కించు, నే వెళ్ళివస్తా.”

          “అమ్మా, నా మీద ఒట్టు, మనం అడుక్కుని తినవద్దుఅన్నం వుంది, ఉప్పు వుంది, పచ్చి మిరపకాయ ఒకటి ఉంది, ఇంకా మనకు ఏం కావాలి?”

          ప్రఫుల్ల తల్లి ఒక పొడినవ్వు నవ్వింది. బియ్యం కడగడానికని బయలుదేరి, బియ్యపు డబ్బా చూసిబియ్యం మాత్రం ఉన్నాయీ!? గుప్పెట్లో సగం కూడా లేవు, ఒక్కరికి కూడా పొట్ట నిండదు!” అన్నది

          తల్లి బియ్యపు డబ్బా తీసుకుని  బయల్దేరుతుంటే, “ఎక్కడకి వెళ్తున్నావమ్మా? అని ప్రఫుల్ల అడిగింది.

          “కొంచెం బియ్యం అరువు తీసుకొద్దామని వెళ్తున్నాబదులు చెప్పింది తల్లి.

          “ఇప్పటి దాకా ఎంత బియ్యం అరువు తీసుకున్నావు? ఇక అరువుకోసం వెళ్ళమాకు.”  

          “మరి ఏం తింటావు? ఇంట్లో ఒక్క పైసా కూడా లేదు, ఎక్కడి నుంచి తీసుకు వస్తావు?” 

          “ఉపవాసం వుంటాను“, దుఃఖంతో అన్నది ప్రఫుల్ల

          “ఉపవాసంతో ఎన్నేళ్ళు ఉంటావేమిటి?” 

          “ఛస్తాను, లేకపోతే ఏంటంటా?” 

          నేను చచ్చిన తరువాత నీ కిష్టమయ్యింది చేసుకో. నేను మాత్రం చూస్తూ కూర్చోలేను. అరువు అడుక్కుని తీసుకువచ్చి నీకు తిండి పెడతా.”

          “అడుక్కుని తినటం చాలా తప్పు అమ్మా. ఒక్క రోజు ఉపవాసంతోనే మనుష్యులు చచ్చిపోరు. రా, ఇద్దరం కలసి యజ్ఞోపవీతాలు అల్లుదాము. రేపు అవి అమ్మి పైసలు తీసుకువస్తాను.

          నూలు ఎక్కడుంది?”

          “చరఖా వుంది. ఇప్పుడే దూదిని ఏకటం మొదలుపెడతాను.”

          “దూది ఎక్కడుంది?”

          ప్రఫుల్ల తల దించుకుని ఏడవటం మొదలుపెట్టింది. తల్లి మళ్ళీ బియ్యం అరువు తీసుకురావటానికి బయలుదేరింది. ప్రఫుల్ల తల్లి చెయ్యిపట్టుకుని, “అమ్మా నేను అడుక్కుని కానీ అరువు తెచ్చుకుని కానీ ఎందుకు తినాలి? అసలు నాకేం తక్కువ? నాకు అన్నీ ఉన్నాయి.”

          “అన్నీ ఉన్నాయి, కానీ భాగ్యం కూడా ఉండాలి కదా.”

          “ భాగ్యం ఎందుకులేదమ్మా నాకు? నేనేమి అపరాధం చేసానని? మా అత్తవారిం ట్లో అంత ధాన్యం ఉన్నా నాకు తినటానికి ముద్ద లేదు.”

          “నాలాంటి అభాగ్యురాలి కడుపున పుట్టావమ్మా, అదే నీ తప్పు, నీ భాగ్యమూనూ.”

          “చూడమ్మా, ఇది నా నిశ్చయం. మా అత్తవారి ఇంట్లో నాకు అన్నభాగ్యముంటే నేను తింటాను. నీకిష్టమొచ్చింది నువ్వు తిను, నన్ను మాత్రం మా అత్తవారింటికి చేర్చు.”

          “ఇదేంటే పిల్లా, అలా కూడా జరుగుతుందంటావా?”

          “ఎందుకు జరగదమ్మా?”

          “వాళ్ళు కబురంపకుండా నిన్ను అత్తవారింటికి ఎలా పంపించటం?”

          “అడుక్కునైతే తినవచ్చుగానీ, పిలవకుండా అత్తారింటికి వెళ్ళకూడదా?” 

          “వాళ్లేప్పుడూ నీ గురించి తలుచుకోరు కూడా.” 

          “తలుచుకుంటే తల్చుకున్నారు, లేకపోతే లేదు. నా బరువు బాధ్యతలు ఎవరి మీదైతే ఉన్నాయో, వాళ్ళను అడిగి తీసుకోవటానికి నాకేమీ సిగ్గు లేదు. నాది నేను అడగటానికి నాకు సిగ్గెందుకు?”

          తల్లి ఏడవటం మొదలుపెట్టింది. “అమ్మా, నిన్ను వదిల్లి వెళ్ళటం నాకు అంత ఇష్టంలేదు. కానీ, నా దుఃఖం తగ్గితే నీ దుఃఖం కూడా తగ్గుతుందని వెళ్లాలనుకుంటు న్నానుఅన్నది ప్రఫుల్ల.

          ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. చివరకు తల్లికి కూతురి మాటే సరైనది అనిపించింది. తల్లి వండిన అన్నం కూతురుకి పెట్టబోతే తిననన్నది. తల్లి కూడా తిననని కూర్చుంది. అప్పుడు ప్రఫుల్ల, “సమయం వృథా చేసుకోవటమెందుకు? దూరం చాలా ఉన్నదిఅన్నది.

          “రా నీ జుట్టు దువ్వుతాను.”

          “వద్దు, ఇలాగే ఉండనివ్వు.”

          ఇద్దరూ మాసిన బట్టలతోనే  ఇంట్లో నుంచి బయట పడ్డారు

***

          బరేంద్ర భూమిలో భూతనాథ్ అనే గ్రామం ఉంది. ఊరిలో ప్రఫుల్ల అత్తవారుండే వారు. అక్కడ హరివల్లభనాథ్ బాబూ అనే పెద్ద జమిందారు ఉన్నాడు. ఆయనకు రెండు పెద్ద మేడలు, చుట్టూ ప్రహరీ గోడలు కట్టిన ఒక తోట, ఒక చెరువు ఉన్నాయి.   ఊరు ప్రఫుల్లముఖి కన్నవారింటికి ఆరు క్రోసుల దూరంలో ఉన్నది. అన్నపానాలు లేకుండా తల్లీ కూతుళ్ళు ఆరు క్రోసుల దూరం నడిచి మూడవ ఝాముకి అత్తవారింటికి చేరు కున్నారు.

          ప్రఫుల్ల అత్తవారింటి గడప దాటి ప్రవేశించటానికి తల్లికి అడుగు పడలేదు. ప్రఫుల్ల పేద పిల్ల. హరివల్లభ బాబు ప్రఫుల్లని ఇంటిలోనికి రానివ్వకపోవటం కారణం పేదరికం కాదు. ప్రఫుల్ల పెళ్ళిలో పెద్ద అల్లరి జరిగింది. ప్రఫుల్ల చాలా అందమైన కన్య అవటం వలనే సంబంధం కుదుర్చుకున్నారు. ప్రఫుల్ల తల్లి తనకు ఉన్నదంతా పెట్టి పెళ్ళి  చేసింది. అయితేనేం, పెళ్ళిలో గొడవ మొదల్లయ్యింది. విందు భోజనాలకి అన్నం చాల లేదు. మగ పెళ్ళివారి వరకు చాలా మంచి భోజనమే వడ్డించారు. కానీ తమ వైపు వారికి వచ్చేసరికి అన్నం లేదు, అటుకులూ పెరుగుతోనే సరిపెట్టాల్సి వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళకి ఇది నచ్చలేదు, అవమానం అనుకున్నారు. తినకుండా లేచిపోయారు. ఇరుగు పొరుగు విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలను  కున్నారు.    

          ఆచారం ప్రకారం ప్రఫుల్ల పెళ్ళి జరిగిన మూడవ రోజున అత్తవారింటికి వెళ్ళి  వంటింటిలో ప్రవేశించి వంటకాలన్నీ చేతితో తాకింది. అప్పుడు వంటకాలతో విందు భోజనాలు చెయ్యాలి. పేరంటానికి ప్రఫుల్ల వైపు వాళ్ళందరినీ కూడా పిలిచారు. వచ్చిన వాళ్ళలో ప్రఫుల్ల ఇరుగు పొరుగులో ఎవరో ఒకరిద్దరు, పెళ్ళిలో తమకు అటుకులు పెట్టి అవమానించారని ప్రతీకారంగా చాడీలు చెప్పటం మొదలు పెట్టారు. ప్రఫుల్ల తల్లి విధవ, కులత కూడా, వెరే ఎవరితోనో సంబంధం పెట్టుకుందని అవాకుచెవాకులతో గుసగుసలు మొదలుపెట్టారు. కులత కూతురు పట్టుకున్నవి మేము తిని జాతిభ్రష్టులు కావటం జరగదు, మంచి నీళ్ళు కూడా తాగం అని చెప్పటం మొదలు పెట్టారు. అది నోటా, నోటా హరివల్లభ బాబుకి చేరింది. ఆయన ఆలోచనలో పడి, ‘ప్రఫుల్ల పెళ్ళిలో కూడా వాళ్ళ ఇరుగు పొరుగు తినలేదని అన్నారు కదా, వాళ్ళు తినక పోవటానికి ప్రఫుల్ల తల్లి కులత అవ్వటమే కారణమయ్యి ఉంటుంది, అబద్ధం ఎందుకు చెప్తారుఅని తను కూడా కోడలు ముట్టుకున్న అన్నాని తినలేదు. తరువాతి రోజునే ప్రఫుల్లని కన్నవారిం టికి తిప్పి పంపించి వేశాడు. తరువాత కొడుకుకి రెండో పెళ్ళి చేసాడు. ప్రఫుల్ల తల్లి ఒకటి రెండు సార్లు పెళ్ళికి చేయించిన వస్తువులు పంపించింది. కానీ, హరివల్లభ బాబూ తిప్పి పంపించేసాడు. అందుకునే ప్రఫుల్ల తల్లికి మళ్ళీ గడప తొక్కటానికి సంశయం.

          అలాగని తల్లీ కూతుళ్ళిద్దరూ ఇప్పుడు తిరిగి వెళ్ళనూ వెళ్ళలేరు. ఇద్దరూ ధైర్యం చేసి లోగిలిలోకి ప్రవేశించారు. సమయానికి ఇంటిపెద్ద మధ్యాహ్నం భోజనం చేసి లోపల కునుకు తీస్తున్నాడు. ఇంటికి యజమానురాలు కాబోలు, వసారాలో కూర్చుని జుట్టు చిక్కు తీసుకుంటూ, తెల్ల వెంట్రుకులు పీకించుకుంటున్నది. ప్రఫుల్ల తల పైన కప్పుకున్న పైట చెంగును సరిచేసుకుని, ఘూంఘట్‌ని ముఖం పైకి ఇంకొంచెం క్రిందకి దించుకున్నది. ప్రఫుల్లకి ఇప్పుడు పదునెనిమిది ఏళ్ళు

          ఇంటావిడఎవరు మీరు?” అని అడిగింది.

          ప్రఫుల్ల తల్లి ఒక పెద్దు నిట్టూర్పుతో, “మేమెవరమో పరిచయం చేసుకోవాలాఅని వాపోయింది.

          “ఏం, పరిచయం అంటే అంత చెప్పుకోవాల్సింది ఉందా ఏమిటి?” అన్నదా ఇంటావిడ.

          “మేము మీకు బంధువులముఅన్నది ప్రఫుల్ల తల్లి.

          “బంధువులా, రకంగా బంధువులు?” ప్రశ్నించింది ఇంటావిడ.

          ఇంతలో జుట్టు చిక్కు తీస్తున్న దాసి ప్రఫుల్ల తల్లిని చూస్తూ, “నేను గుర్తుపట్టాను, వియ్యపురాలుఅన్నది.

          “వియ్యపురాలా, ఎవరికీ?” అన్నది ఇంటావిడ.

          “దుర్గాపూర్ తాలూఖావాళ్ళు, మీ కొడుకుకి అత్తగారుఅన్నదా దాసి.

          ఇంటావిడా ఆశ్చర్యపోతూ చూసి, కాసేపటికి తేరుకునికూర్చోండిఅన్నది

          తల్లి కూర్చున్నది. ప్రఫుల్ల మాత్రం నిలబడే ఉన్నది. ఇంటావిడ అమ్మాయి ఎవరు?” అన్నది.

          “మీ కోడలు“, జవాబిచ్చింది ప్రఫుల్ల తల్లి.

          ఇంటావిడ కాసేపు మౌనంగా ఉండిపోయింది. తరువాత, “ఇక్కడ ఎవరి దగ్గరకు వచ్చారు?” ప్రశ్నించింది.

          “మీ దగ్గరకేఅన్నది ప్రఫుల్ల తల్లి.

          “ఎందుకు?”

          “మా అమ్మాయి అత్తవారింటికి రాకూడదా?”

          “ఎందుకు రాకూడదూ!? పిలిచినప్పుడు రావాలి. పరువున్న ఇంటి కోడళ్ళు అలాగే వస్తారు.”

          “మరి ఏడడుగుల బంధం ఏడు జన్మల బంధం అని అనలేదా రోజు?”

          “అయితే మాత్రం, పిలిస్తేనే రావాలి.”

          “అయితే మీ కోడలికి ఎవరు తిండి పెడతారు? నేను అనాధను, విధవను కూడా. మీ కోడలికి తిండి పెట్టే బాధ్యత నాకెందుకూ?”

          “తిండి పెట్టలేక పోతే అసలెందుకు కన్నావు?”

          “ఏం, నువ్వు కొడుకుని కంటున్నప్పుడు, వాడి తిండికీ బట్టకీ లెక్కేసావా? అట్లాంట ప్పుడు కోడలు వస్తుందని తెలీదూ? మరి దాని తిండికీ, బట్టకీ ఎందుకు లెక్క వెయ్య లేదు?” ఎదురు ప్రశ్న వేసింది ప్రఫుల్ల తల్లి.

          “ఓరి దేవుడా! గయ్యాళిది కయ్యానికి వచ్చింది.”

          “కయ్యానికేమీ రాలేదు. మీ కోడలు ఒక్కతే రాలేకపోయింది. అందుకనే దిగబెట్టటా నికి వచ్చా. ఇక వెళ్తా.” మాట అని ప్రఫుల్ల తల్లి వెళ్ళిపోయింది. ప్రఫుల్ల తలపైని ఘూంఘట్‌ని కొంచెంగా సవరించుకుని అక్కడే నిలబడింది

          “మీ అమ్మ పోయిందిగా, నువ్వు కూడా ఫోఅన్నది అత్తగారు.

          ప్రఫుల్ల కదలలేదు, ఒక శిలామూర్తిలాగా అలా నిలబడే వున్నది.

          “ఒసే నువ్వు పోవంటే? అలాగే నిలబడ్డావ్? ఓరి దేముడా, ఎంత కష్టం వచ్చి పడిందీ!? మళ్ళీ దీన్ని పంపించటానికి రేపు ఒక మనిషినిచ్చి పంపించాలి. మీ అమ్మతోనే కలసి పోరాదంటే?”

          అప్పుడు ప్రఫుల్ల ముఖమంతా కప్పి వుంచిన ఘుంఘట్‌ని తల వెనుకకు నెమ్మదిగా లాగింది. మబ్బు చాటు తొలగుతూ వికసిస్తున్న పున్నమి చంద్రుడులాగా ప్రస్ఫుట మయ్యింది ప్రఫుల్ల ముఖం. ఆమె కనుల నుండి జారువాలుతున్న అశ్రుధారలు కూడా ప్రస్ఫుటమయ్యాయి.

          ఇంత అందమైన కోడలు వున్నది, ఈ ఇంటికి ఒక గృహలక్ష్మి కరువయ్యింది’ అని మనసులోనే అనుకున్నది అత్తగారు. ఆవిడ మనసు కొంత మెత్తబడింది.

          “నేను వెళ్ళటానికి రాలేదమ్మాలోగొంతుతో, మృదువుగా చెప్పింది ప్రఫుల్ల.

          “నన్నేమి చెయ్యమంటావమ్మా? ఏం, నాకు మాత్రం లేదా నిన్ను ఇంటికోడలుగా చూసుకోవాలని? లోకం రకరకాలుగా ఆడిపోసుకుంటున్నది. నువ్వు జాతిభ్రష్టురాలవనే భయంతో నిన్ను వదిలెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు నిన్ను ఇంట్లోకి రానిస్తే, మమ్మల్ని కూడా వెలి వేస్తారు.”

          “అమ్మా, లోకం భయంతో బిడ్డలను వదిలేస్తారా? నేను మాత్రం మీ బిడ్డను కాదా?”

          కోడలి మాట విని అత్తగారి మనసు ఇంకా మెత్తబడింది. మాట మృదువుగా వున్నది, చక్కని ముఖం. ఏం మాట్లాడాలో ఆవిడకేమీ తోచలేదు. “నన్ను మాత్రం ఏం చెయ్యమం టావు, చెప్పు?అన్నది.

          “ఏది చేసినా సరేనమ్మ. మీ ఇంటిలో ఎంత మంది దాసీలు లేరు? అలాగే మీ ఇంటి లో ఒక దాసిగా ఉండటానికి చోటివ్వండిఅన్నది ప్రఫుల్ల.

          అత్తగారికి నోట మాట రాలేదు. రూపురేఖలే కాదు మాట వరస కూడా చక్కగా వుంది. సరే ఇంటాయనని అడిగి చూద్దాం అనుకున్నది. “నువ్వు ఇక్కడే కూర్చో అమ్మాయిఅని లోపలకు వెళ్ళింది. ప్రఫుల్ల కూర్చుంది

          ఇదంతా ఒక తలుపు చాటు నుంచి గమనిస్తున్నది పదునాళ్లుగేళ్ళ చక్కని చుక్క. ఇంటావిడి లోపలికి వెళ్ళగానే, ప్రఫుల్లని లోగొంతుతో పిలిచింది. ‘ అమ్మాయి ఎవరు?’ అనుకుంటూ దగ్గరకు వెళ్ళింది ప్రఫుల్ల.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.