నా జీవన యానంలో- రెండవభాగం- 43

-కె.వరలక్ష్మి

          2008 జనవరి 18 నుంచి 24 వరకూ నంది నాటకోత్సవాలు రాజమండ్రి ఆనెం కళాకేంద్రంలో జరిగాయి. ఇన్విటేషన్ వచ్చింది. నేను రాజమండ్రిలో ఉన్న మా చిన్న చెల్లెలు సూర్యకుమారి ఇంటికెళ్ళి అక్కడ నుంచి రోజూ ఇద్దరం కలిసి నాటకాలు చూడడానికి వెళ్ళేవాళ్ళం. చాలా మంది నటులు, రచయితలు తెలిసినవాళ్ళు కావడం వలన పలకరించేవాళ్ళు. లీజర్ టైంలో కలిసి టీ తాగేవాళ్ళం. ముఖ్యంగా జవ్వాది రామారావుగారి సోదరప్రేమ మరచిపోలేనిది.

          అనుకోకుండా ఆ జనవరిలో ఒంగోలు నుంచి ఓ ఉత్తరం వచ్చింది. నా కొత్త పుస్తకం ‘అతడు – నేను’ కి హసన్ ఫాతిమా పురస్కారం ఇవ్వాలనుకొంటున్నామని, ఫిబ్రవరి 21న జరగబోయే ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలని, బుక్స్ పంపమని అడగకుండా వాళ్ళకి వాళ్ళే సెలక్ట్ చేస్తారట, రైలు ప్రయాణాలు మీద సరైన అవగాహన లేక 20న సామర్లకోట లో జన్మభూమి ఎక్కి విజయవాడలో దిగి మరో గంటలో దాని కనక్షన్ ట్రెయిన్ పినాకిని ఎక్కి సాయంకాలం 3.30 కి ఒంగోలులో దిగేను. స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే షేక్ మహబూబ్ జాన్ మాస్టారు, వాళ్ళబ్బాయి హుమాయూన్ వచ్చి వాళ్ళింటికి తీసుకెళ్ళేరు, మాస్టారి భార్య అజూమాబేగం, కోడలు రిజ్వానా ఆప్యాయంగా ఆహ్వానించేరు. మహబూబ్ జాన్ గారి తల్లిగారి పేరుతో ప్రతీ సంవత్సరం మంచి కథల పుస్తకానికి ఆ అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ‘‘ఇలా 3.30 కే చేరుకుంటానని తెలిస్తే రేపే వచ్చేదాన్ని కదా’’ అంటే ‘‘ట్రెయిన్స్ టైమింగ్స్ ని నమ్మలేంకదండీ. అందుకే ముందురోజే రమ్మన్నాం’’ అన్నారు. ఆ రాత్రీ, మర్నాడూ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు వారింట్లో. ఆయన పనిచేస్తున్న స్కూల్ గ్రౌండ్స్ లో స్టేజి మీద ఘనంగా సన్మానించి అవార్డు ఇచ్చారు. చాలా మంది వచ్చారు. ఆ రాత్రి 11.30 కి అక్కడ సర్కారు ఎక్కించారు. మర్నాడు ఉదయం 10.30 కి సామర్లకోటలో దిగి ఇంటికి చేరుకున్నాను.

          మార్చి 12న పిఠాపురంలో మా అత్తింటి తరఫు బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్ళేం నేనూ, మా ఆడపడుచులు కలిసి. రాజమండ్రి నుంచి వచ్చిన అందరితో కలిసి ఉప్పాడ సముద్ర తీరానికి వెళ్ళేం. కెరటాల్లో కాస్సేపు గడిపేక నేను వొడ్డున ఆగి ఉన్న పడవెక్కి కూర్చుని ఎంతసేపు చూసినా తనివి తీరని సముద్రపు అందాన్ని చూస్తూ ఉండి పోయాను. అంతలో సముద్రంలోంచి చేపల పడవలు వొడ్డుకు రావడం మొదలైంది. పడవలలో జాలర్లు తెల్లవారకముందే చద్దన్నాలు కట్టుకొని బయలుదేరి సముద్రంలో కెళ్ళి సాయంకాలం 3.30 నుంచి ఒడ్డుకు రావడం ప్రారంభిస్తారట. అదృష్టంబావుంటే చేపలు, రొయ్యలు బాగా పడతాయట. లేకుంటే లేదు. మా వాళ్ళంతా బిలబిల మని పడవల దగ్గరకి చేరుకున్నారు. చేపలు బాగానే పడినట్టున్నాయి. నేను కూడా అటు నడిచాను. అన్నేసి చేపల్ని గుట్టలుగా చూడడం అదో కొత్త అనుభూతి. ఆ గుట్టల నుంచి విడివడి పీతలు తొందరతొందరగా అటూ ఇటూ పరుగులు పెడుతున్నాయి. బైట బజార్లలో అంతంత రేటుకి అమ్మే పీతలకి అక్కడ పెద్దగా విలువలేదు. మావాళ్ళంతా చేపలు, రొయ్యలు కొన్నారు, కొసరుగా బోలెడన్ని పీతల్ని కూడా సంచుల్లో నింపుకొన్నా రు, సముద్రపు ఒడ్డున అన్నన్ని గంటలు ఉండి వెనక్కి మరలితే మరో ప్రపంచంలోకి వెళ్ళోచ్చినట్టుంటుంది.

          ముంబై ఆంధ్రమహాసభ వార్షికోత్సవాలకు రమ్మని ఇన్విటేషన్ వచ్చింది. మార్చి 22న ఆ ఫంక్షన్.

          19న నేను హైదరాబాద్ చేరుకున్నాను. 20న సినీనటుడు శోభన్ బాబు కాలం చేసినట్లు టి.విలో వార్త. 21న మా ఆడపడుచుతో కలిసి నాంపల్లి స్టేషన్ లో మధ్యాహ్నం 3.30 కి హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ ఎక్కి 22 తెల్లవారు ఝామున 3 కి ముంబై సెంట్రల్ లో దిగేసరికి అక్కడ మా కోసం సంగినేని రవీంద్ర కారుతో ఎదురు చూస్తున్నాడు. మమ్మల్ని తీసుకెళ్ళి జింఖానా గెస్ట్ హౌస్ లో రూమ్ లో దించి వెళ్ళిపోయాడు. హాయిగా నిద్రపోయి ఉదయం లేచేసరికి కాఫీలు రెడీ. 9.30 కి కేంటీన్ నుంచి లక్ష్మణ్ అనే 12 ఏళ్ళ అబ్బాయి టిఫిన్స్, టీ తెచ్చాడు. తెలంగాణా నుంచి ఒక రచయితని కూడా పిలిచారట. ఆంధ్ర మహాసభ మెంబర్స్ అందరూ ఫోన్లు చేసి భార్యల్తో సహా పలకరించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత మల్లికార్జునరెడ్డి అనే ఇన్ కంటేక్స్ ఆఫీసర్ వచ్చి తన కారులో మమ్మల్ని సిద్ధి గణపతి ఆలయానికీ, మహాలక్ష్మీ ఆలయానికీ తీసుకెళ్తూ దారిలో సీషోర్స్ వగైరాలు చూపించాడు. నన్ను ‘అక్కయ్యగారూ’ అంటూ ఆత్మీయంగా చూసాడు. సాయం కాలం రూమ్ కి వచ్చి రిఫ్రెష్సై 6 గంటలకి కింద హాల్లో జరిగిన సభకు అటెండయ్యాం. నేను క్లుప్తంగానూ, ఆ రచయిత చాలా దీర్ఘంగానూ ప్రసంగించాం. కొందరికి స్వోత్కర్ష ఎక్కువ. అతనికి తన గురించి గొప్పలు చెప్పుకొనే అభిరుచి చాలా ఎక్కువ అని అర్థ మైంది. అన్నిట్లోనూ కొంత అతి కూడా.

          మర్నాడు ఉదయం 8.30 కి తిరుపతి అనే అబ్బాయి టేక్సీలో వచ్చి మమ్మల్ని గేట్ వే ఆఫ్ ఇండియాకి తీసుకెళ్ళేడు. అక్కడి నుంచి మోటార్ బోట్లో ఎలిఫెంటా కేవ్స్ కి వెళ్ళేం. అంతకు ముందొకసారి మా గీత నన్ను ఆ బోట్లో ప్రయాణం చేయించాలని చూసి నేను ఎక్కలేదని చిన్న బుచ్చుకోవడం గుర్తుకొచ్చింది. సాధారణంగా నాకు నీళ్ళ మీద ప్రయాణాలంటే భయం, ఎలిఫెంటాకేవ్స్ దగ్గర అప్ ఎక్కలేక, ఎండలో నడవలేక చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ చిన్న చిన్న దొన్నెల్లో పోసి అమ్ముతన్న రేగుపళ్ళు తిని కాస్త సేద తీరేం. అలసి సొలసి మధ్యాహ్నం 2 గంటలకి రూమ్ కి తిరిగొచ్చాం. రాత్రి 9.30 కి తిరిగి ట్రెయిన్, ఆ రెండు రోజుల్లోనూ చిన్నపిల్లవాడు లక్ష్మణ్ నా మీద అంతులేని ఆపేక్ష చూపించాడు. వచ్చేస్తూంటే మెట్ల దగ్గరకి ఎదురొచ్చి ‘ఫిర్ కబ్ ఆయేంగీ అన్నాడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా, ఆ మాటకు నాకూ ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన మల్లికార్జున్ ఆశ్చర్యపోతూ ‘‘ఎందరో రచయితలు, కవులు వచ్చి వెళ్ళారు. ఈ లక్ష్మణ్ ఇలా అడగడం నేను మొదటిసారి చూస్తున్నాను’’ అన్నాడు. ఏనాటి బంధాలో ఇవన్నీ అన్పించింది.

          ఆ ప్రయాణం, ఆంధ్ర మహాసభవారి గౌరవ మర్యాదలు, ఆదరం అన్నీ ఎప్పటికీ మరచిపోలేనివి.

          30న వరంగ్ లో కవితా వార్షిక – 2007 ఆవిష్కరణకి వెళ్ళవలసి ఉంది. అందుకని మా అబ్బాయి ఇంట్లో ఉండిపోయాను. ఒక రోజు మా అభ్బాయి ఇంటికొచ్చిన స్క్రిప్ట్ రైటర్ రాజు అనే అబ్బాయి నన్ను ఆరాధనగా చూస్తూ కూర్చున్నాడు. నా రచనల గురించి, మా గీత పొయెట్రీ గురించి చక్కని అవగాహనతో మాట్లాడేడు. వెళ్ళేక ‘‘మీ మదర్ ని చూడడం ఒక ప్రత్యేకమైన అనుభూతి’’ అని మా అబ్బాయికి మెసేజ్ చేసాడట. నా రచనల వల్ల నన్ను అందరూ అలా అభిమానించడం నా జన్మధన్యం అన్పించింది.

          కవి కోడూరి విజయకుమార్ 30న తను కవితావార్షిక ఆవిష్కరణ సభకి వెళ్తున్నానని, ద్వారకా హోటల్ దగ్గరకి రాగలిగితే నన్నూ వరంగల్ తీసుకెళ్తానని ఫోన్ చేసాడు. 7.30 కల్లా బస్సులో అక్కడికి చేరుకున్నాను. విజయకుమార్ తన కారులో కత్తి పద్మారావుని, వాళ్ళబ్బాయిని ఎక్కించుకుని వచ్చాడు. మధ్యాహ్నం 12 కి గరంగల్ కాలేజ్ లోని సభకు చేరుకున్నాం. శివారెడ్డి, అంపశయ్య నవీన్, నేరెళ్ళ వేణుమాధవ్, కోవెల సుప్రసన్నా చార్య, కె. శ్రీనివాస్ వేదిక పైనా, కొండేపూడి నిర్మల, నాగేశ్వరం శంకరం, గుడిహాళం రఘు నాధం, అరసవిల్లి కృష్ణ, నెల్లుట్ల రమాదేవి మొదలైనవారు సభలోనూ ఉన్నారు. సభ ముగిసేక అక్కడే భోజనాలు పెట్టేరు. తర్వాత కత్తి పద్మారావు గారికి తెలిసిన నాస్తికవాదు లెవరింటికో వెళ్ళేం. సాయంకాలం వరకూ తెలిసిన వాళ్ళేవరెవరో రావడం, పలకరిం పులు, తిరిగి వచ్చి రాత్రి 9 కి విద్యుత్ సౌధ దగ్గర దించాడు విజయకుమార్. 225 బస్సు ఎక్కమని చెప్పేడు మా రవి. ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క బస్సూ రాలేదు. చుట్టూ లైట్లతో పట్టపగలులా ఉన్నా నాలో కంగారు మొదలైంది. ఏం చెయ్యాలో తోచక చైతన్యకి ఫోన్ చేసాను. వెంటనే తన బైక్ మీద వచ్చాడు. అక్కడికి దగ్గర్లోనే రూంలో ఉంటున్నాడ ట. బాగా ఆకలేస్తోంది. ఆ టైంలో ఇంటికెళ్ళినా తినడానికి ఏం ఉండదని తెలుసు. అక్కడికి దగ్గర్లో ఉన్న కేంటీన్లో రోటీలు, జూస్ ఇప్పించాడు. పాపం తన బండి మీద ప్రగతినగర్ తీసుకొచ్చి దిగబెట్టి వెళ్ళేడు.

          ఏప్రెల్ 7న ఉగాది, పాలకొల్లు, భీమవరాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొనాల్సి ఉంది. 6న తాడేపల్లి గూడెంలోని మా పెద్దచెల్లి క్రిష్ణవేణి ఇంటికి వెళ్ళేను హైదరాబాద్ నుంచి. ఉగాది ఉదయాన్నే మా చెల్లి చేసిన ఉగాది పచ్చడి తిని, భీమవరం సాహితీ సమితివారు పంపిన కారులో పాలకొల్లు వెళ్ళేను. అక్కడి వర్తక సంఘ గుమాస్తాల కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్న కవి సమ్మేళనంలో పాల్గొన్నాను. ఆ సభను జరిపిన చౌదరి గారికి మంచి హోటల్ ఉంది ఆ ఊళ్ళో. సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ ఆ హోటల్లో భోజనాలు ఏర్పాటు చేసారు. నాకు మాత్రం మధ్యాహ్నం చౌదరి గారింట్లో రెస్ట్. సాయంకాలం మళ్ళీ  వాళ్ళ కారులో భీమవరం వెళ్ళే ముందు పాలకొల్లులో క్షీరా రామలింగేశ్వర ఆలయాన్ని చూపించారు. భీమవరం భీమేశ్వరాలయంలో సాయంత్రం మరో కవి సమ్మేళనం. నేను చదివన ‘పల్లె బంధం’ ‘యుగసంధి’ పోయెమ్స్ కి అందరూ బాగా క్లేప్స్ కొట్టేరు. రెండు చోట్లా ఘనంగా సన్మానించేరు. చీరలు కూడా ఇచ్చేరు. రాత్రి 11 కి తిరిగి పాలకొల్లు వచ్చాం. చౌదరిగారింట్లో ఒక రూమ్ ఇచ్చారు. ముందురోజంతా నన్ను తిప్పిన అబ్బాయి డ్రైవర్ రాజు పాలకొల్లులో బస్సెక్కించడానికొచ్చి ‘‘చాలా బాగా రాసేరండి మీరు కవిత్వం’’ అన్నాడు.

          నాకు అర్థమౌతోంది ఇది వరకు ఎప్పుడూ లేనంతగా ప్రయాణాలు చేస్తున్నానని. మే నెలలో మా చిన్న తమ్ముడి గృహప్రవేశానికి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అంతకు ముందు మార్చిలో మా గీత అమెరికా వెళ్ళింది. అందుకని హైదరాబాద్ వెళ్ళినా గీతను కలవడానికి వీలు పడడం లేదు. మే 16న మా అబ్బాయి వాళ్ళతో శ్రీ శైలం తీసు కెళ్ళేరు. అద్భుతమైన అడవిదారి. కొండల మధ్య ఘాట్ రోడ్. కింద ప్రోజెక్ట్. చాలా బావుంది. ఆలయం చాలా చోట్ల శివాలయాల లాగే చాలా పెద్ద ప్రాకారం లోపల ఉంది. గర్భాలయాలు మాత్రం దూరం నుంచి చూడాల్సి వచ్చింది. మల్లికార్జునలింగం సరిగా కన్పించనే లేదు. భ్రమరాంబ ఆలయం వేరుగా ఉంది. అక్కడా అంతే. దూరం నుంచి విగ్రహం మీది నగల అలంకరణ మెరిసిపోతూ ఉంది. భ్రమరాంబ ఆలయ శిల్పం బావుంది. మల్లికార్జునాలయ మంటపం పైన ఒక వృక్షం కింద మునిగణ పరివేష్ఠితుడై ఉన్న శివమూర్తి విగ్రహం అందమైన రూపంతో ఆకట్టుకుంది.

          ఆలయం నుంచి శివాజీ స్ఫూర్తిమందిరం గెస్ట్ హౌస్ కి వచ్చి, కాస్సేపు రెస్ట్ తీసు కుని, ఆ మందిరం అంతా చూసి తిరుగు ప్రయాణమయ్యాం. మాతో మా చిన్న చెల్లిని తీసుకెళ్ళాం. అక్కడ పవర్ స్టేషన్లో వాళ్ళ రెండో అల్లుడు పనిచేస్తున్నాడు. కుటుంబంతో అక్కడి క్వార్టర్స్ లో ఉంటున్నాడు. ఫోన్ ద్వారా తెలుసుకుని దారిలో కలిసి స్కూటర్ మీద వాళ్ళ అత్తగారిని వాళ్ళింటికి తీసుకెళ్ళేడు, మాట వరసకైనా మమ్మల్ని రమ్మని పిలవలేదు. రాత్రి 12కి ఇంటికి చేరుకున్నాం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.