నిదురించే తోటలోకి..

-బలభద్రపాత్రుని రమణి

          ఆ వృద్ధ జంట చాలా కష్టపడి ఊళ్ళోకి నడుస్తున్నారు. మంచి  వేసవికాలం, సూర్యుడు నడినెత్తిన ఎక్కినట్లు వున్నాడు. ముసలాయన పేరు పెరుమాళ్ళు ఆగి తన కన్నా చాలా వెనకబడి నడుస్తున్న ముసలామెని చూసి..

          “అమ్మీ నువ్వు..నా కన్నా చాలా వెనకే “అని నవ్వాడు.

          ఆమె ఉడుక్కుంటూ “మరే..నువ్వు వయసులో వున్నావాయె స్వామీ “అంది.

          అతను ఇంకా నవ్వుతూ అమ్మీ “నీ బుగ్గలు కోపం వస్తే భలే ఎర్రబడతాయి” అన్నాడు.

          “కోపం కాదయ్యో తాపం..ఎండ చూడు ఎట్లా పేలుస్తుందో”..అని ఆమె ఆగి, పైట కొంగుతో మొహాన పట్టిన చెమట తుడుచుకుంటూ చుట్టూ చూసింది. దూరంగా నీటి చెలమ మెరుస్తూ కనపడింది.

          “అయ్యో..నీళ్ళు అగుపడ్తున్నాయా..”అంది.

          “అవి నీళ్ళుకావే బంకమట్టి బుర్రా..ఎండమావులు..దగ్గరకెళ్తే నీళ్లుండవు మన కళ్ల ల్లో లాగే.”.అన్నాడు.

          “దాహంగా వుందయ్యా”..ఆమె రోడ్డు పక్కనున్న రాయి మీద కూలబడుతూ అంది.

          “కొన్ని చుక్కలు మిగిలాయేమో చూద్దాం”..ముసలయ్య సంచిలోంచి సీసా తీసాడు.. ఖాళీగా వుంది.

          “ఇంకొంచెం ముందు కెళితే ఏ బడ్డీ కొట్టో తగలకపోదు..లే లే నడు “అన్నాడు.

          ఆమె కష్టంగా లేస్తూ “చెయ్యి అయినా అందించడమ్మా ఈ మయదారి మొగుడు” అంది.

          “చెయ్యేం ఖర్మే..ఎత్తుకోమంటావా?”..మేలమాడాడు ముసలయ్య.

          “చస్తావు..ఆ పని చెయ్యబోకు “అంది.

          “అంత సులభంటే చావు..నీ పిచ్చి కానీ” అన్నాడు..ఇద్దరూ ముందుకినడుస్తు న్నారు. ఎండ కుడా వారి పై నీడ లా సాగింది. నిజంగానే ఓ బడ్డీ కొట్టు వచ్చింది పావుగంట నడిచాకా. ముసలయ్య వెళ్ళి మంచినీళ్ళ సీసా కొని చాయ్ కుడా చెప్పాడు ఇద్దరకీ.

          “ఏం తాతా మంచి ఎన్నెల్లో బయల్దేరారే హనీమూన్ కి”..అని సోడా కొట్టినట్లు కిసుక్కున నవ్వాడు బడ్డీ కొట్టు ఏసోబు.

          “పెందరాళే బయల్దేరమంటే ఈ ముసల్ది వింది కాదు..ఎప్పుడూ ఏవో తడుము లాట.. ముందుకీ వెనక్కీ ఊగులాట”..అన్నాడు బెంచీ మిద కూర్చుంటూ ముసలయ్య.

          “ఏ ఊరుకో “అన్నాడు ఏసోబు టీ చల్లారబోస్తూ.

          ” కాటూరు” చెప్పాడు ముసలయ్య.

          ” అది మా ఊరే..ఎవరింటికో?” టీ ఇస్తూ అడిగాడు ఏసోబు.

          “మా ఇంటికే “మునెమ్మ జవాబిచ్చింది .

          పెరుమాళ్ళుకి పాతికేళ్ళున్నప్పుడు ఆ ఊరు విడిచి పెట్టాడు. మిలట్రీలో కెళ్తున్నా నని తండ్రికో ఉత్తరం రాసి పెట్టి వెళ్ళాడు. ఆ తండ్రి ఏడిచాడో గుండెలు బాదుకున్నాడో తెలీదు. మిలట్రీలో పనిచేస్తూ స్నేహితుడి ఇంటికెళ్ళి అక్కడ అతని చెల్లెలు మునెమ్మని చూసి పెళ్ళాడబుద్ధయి తండ్రికి ఆ సంగతి ఉత్తరం రాసాడు. జవాబు రాలేదు.పెళ్ళయిన ఏడాదికి బిడ్డ పుడితే తండ్రి పేరే రమేష్ అని పెట్టి రామయ్యకి చూపిద్దాం పెళ్ళాంబిడ్డల్ని అని ఊరుకి వెళ్ళాడు. ఊరు చాలా మారిపోయింది. తెలిసిన వాళ్ళు పెద్దగా లేరు. తన ఇంటి పక్కనుండే మావుళ్ళయ్య చూసి గుర్తుపట్టి..

          “ఓరోరి నువ్వు పెరుమాళ్ళు కదూ! మిలట్రీలో కెళ్ళావంటగా.. మీ అయ్య నీ పేరే కలవరించి కలవరించి పోయాడ్రా పాపం!” అన్నాడు.

          “అయ్య పోయాడా..అయ్యో ! నీ మనవడిని ఒక్క మారైనా చూసుకోలేక పోయావా అయ్యా”.. అని గుండెలు బాదుకుని ఏడ్చాడు పెరుమాళ్ళు.

          “ఊరుకో, బిడ్డ బెదిరిపోగలడు..మనదే తప్పు అప్పుడే రావలసింది” అంది మునెమ్మ.

          తండ్రి పేరు మీద అయ్యోరు చెప్పినట్లు దానాలూ పూజలూ చేసి, ఇంటిని తెలిసిన దూరపు చుట్టానికి అప్పజెప్పి శలవై పోతోందని మళ్ళీ డ్యూటీ ఎక్కడానికి వచ్చేసాడు పెరుమాళ్ళు భార్యా బిడ్డడితో.

          మళ్ళీ ఆ ఊరు రావలసి వస్తుందని అప్పుడు అనుకోలేదు. కానీ ఊరు పిలిచింది. ఊరికో గొంతుంటుంది.. ప్రతి ఇంటికీ ఓ ఆత్మ వుంటుంది. నలభై ఏళ్ళు ఉద్యోగాలూ నగర జీవితాలూ గడిపాకా..మునెమ్మకీ పెరుమాళ్ళుకీ పుట్టిన ఇద్దరు బిడ్డలూ మిలటరీలోకెళ్ళి, వాళ్ళ కన్నా ముందుగానే దేశం కోసం ప్రాణాలిచ్చాకా ఓ రోజున ఊరు అవసరం పడింది.. ముఖ్యమైన పని మీద ఊరుకి రావలసొచ్చింది.

* * *

          తాత ఇన్నాళ్ళూ ఇల్లు చూసుకుంటూ ఇంటి చుట్టూ మొక్కలేసి కొంత తోట పెంచాడు.. జామా, పనసా, మావిడీ, సపోటా లాంటి పెద్ద చెట్లూ పూల మొక్కలూ కొన్ని కూరగాయ మడిలూ వున్నాయి.

          మునెమ్మ ఇత్తడి గిన్నెకి పసుపు రాసి కుంకుమ పెట్టి పాలు పొంగించి  సూర్య నారాయణుడికి పొంగలి పెట్టాకా, తాత “నా పెళ్ళాం పోయాకా తన దగ్గరకి రమ్మని నా కూతురు పిలుస్తున్నా పోకుండా వున్నా.. తొంబై ఏళ్ళు వస్తున్నాయి..ఇంక దాని దగ్గర మట్టి అవుతారా “అన్నాడు చుట్ట కాలుస్తూ.

          పెరుమాళ్ళు నవ్వి “తొంబయ్యేగా బాబాయ్!..తొందరేం లే..ముందు ఈ మట్టి గురించి నాకు నేర్పు..మొక్కలకి బోదెలు చెయ్యడం పెంచడం అన్నీ” అన్నాడు. తాత ఓ అరటి పిలక నాటించాడు మునెమ్మ చేత.. ఆమె వారానికే అది మారాకు వెయ్యడం చూసి మురిసిపోతూ మొగుడిని పిలిచి చూపించింది..

          పెరుమాళ్ళు నవ్వి “అది గెలేస్తే తిందామనే ఆశ”..అని ఆట పట్టించాడు. మునెమ్మ కుడా నవ్వింది.

          “వచ్చిన పని మరిచిపోమాకు” అని నిద్రపోయాడు పెరుమాళ్ళు. ఆమె అతనికి విసురుతూ కూర్చుంది.

          పెరుమాళ్ళు నుదుటి మీద ముడతలు అతను ఎన్ని కష్టాలు పడ్డాడో..హాయిగా పోయి బిడ్డల దగ్గర వుందాం అనుకున్నప్పుడు..వాళ్ళు దూరం అయి ఎంత వేదన పడ్డాడో.. చెప్తున్నట్లు వున్నాయి..మునెమ్మ రెండో వాడి మరణ వార్త విన్నాకా ఏడుపంతా అయిపోయేట్లు ఏడ్చింది. ఇంక కన్నీళ్ళు మిగలలేదు అనుకున్నప్పుడు లేచి అన్నానికి ఎసరు పెట్టింది..మొగుడికి ఎప్పుడు ఆకలేస్తుందో ఆమెకి తెలుసు. ఆకలికి ఆగలేడనీ తెలుసు. వాళ్ళమ్మని పెరుమాళ్ళు చూసాడో లేదో గుర్తు లేదు కానీ అన్నం పెట్టేటప్పుడు మునెమ్మలో అమ్మని చూస్తాడు. కలీ అంబలీ లాగే కష్టాలూ సుఖాలూ కుడా పంచుకునే ఇన్నేళ్ళు సంసారం ఈడ్చారు..ఓపిక సన్నగిల్లి వృద్ధుడయినాడని పెరుమాళ్ళు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కుడా తీసేసాకా..ఒకనాడు మునెమ్మతో “టైం అయిందే మన ఊరికి పోదాం..మట్టి పిలుస్తోంది “అన్నాడు. ఆమె తెల్లబోయింది..” మిలటరీ ఆసుపత్రి నీ సౌకర్యంగా వున్న నగర జీవితాన్నీ వదిలి ఈ ముసలి వయసులో ఆ పల్లెలో ఎలా బతుకుతాం?” అంది ..పెరుమాళ్ళు పెద్దగా నవ్వి సమాధానం చెప్పాడు.. ఆమె సమాధాన పడి మారు మాట్లాడకుండా ప్రయాణం అయింది.

          అట్లా పుట్టి పెరిగిన ఊరుకొచ్చాడు పెరుమాళ్ళు..ఊళ్లో అందరూ పరిచయం అయ్యారు.. ఒకనాడు చిన్నప్పటి స్నేహితుడు ఆదినారాయణ కలిసాడు సంతలో.. పెరుమాళ్ళు గుర్తుపట్టి పలకరిస్తే పొంగిపోయి కూడా ఇంటికొచ్చాడు. చిన్నప్పుడు కలిసి కాలవలో ఈతలు కొట్టిన జంగయ్యా, కోటీ, పిచ్చేశ్వరరావులు వాళ్ళ కొడుకుల దగ్గరకి పోయారనీ, కదలలేని పరిస్థితి అనీ చెప్పుకొచ్చాడు.

          “అన్నా అన్నం పెట్టా కాళ్ళు కడుక్కో” అంది మునెమ్మ.

          కంచంలో పెట్టిన మావిడికాయ పచ్చడీ, ముద్ద పప్పూ, బెండకాయ వేపుడూ చూసి.. ఆనందంగా ఆత్రంగా తిన్నాడు ఆదినారాయణ. కమ్మని పులుసులో అమ్మతనం కనపడింది..

          “ఈసడిస్తూ కోడళ్ళు పెట్టే తిండీ, కొడుకులు పెట్టే చీవాట్లూ తినడం అలవాటయి పోయిన జనమకి ఎంత మంచి తిండి పెట్టావమ్మా “అన్నాడు కన్నీళ్ళతో. ఉన్నదేదో పిల్లలకి ఇచ్చేసాకా చాలా మంది తల్లి తండ్రుల కధే ఆదినారాయణదీనూ.

          “ఇక్కడే మాతో పాటే వుండిపో..మనమ్మ ఈ మునెమ్మే “అన్నాడు పెరుమాళ్ళు.
“అందరికీ అమ్మ ఈ నేల తల్లి” అంది మునెమ్మ.

          ఆదినారాయణ ఆనందంతో మితృడి బుజం మీద వాలి పొగిలి పొగిలి ఏడిచాడు. మునెమ్మకి ఇంకో బిడ్డయ్యాడు..తోటలో కొబ్బరి చెట్లు వచ్చాయి.. “వాడి ఆశ చూడు.. కొబ్బరి చెట్టేసాడు”..అని మునెమ్మతో పెరుమాళ్ళు నవ్వాడు.

          “అయ్యా ఆ పాల పిట్ట చూడు..నిమ్మ చెట్టు మీదే వాల్తుంది..గిజిగాడు మావిడి చెట్టు మీద గూడు అల్లుతున్నాడు..బిడ్డల కోసం” అని రోజూ పక్షులకి గింజలేస్తూ మునెమ్మ చెప్తుంటుంది.”ఎక్కువ చెట్లు పెంచితే ఎక్కువ పిట్టలొస్తాయి కదా!” అంటుంది..పిట్టల్లో మొక్కల్లో ఎగిరిపోయిన బంధాలని పట్టుకోవాలనే ప్రయత్నం.పెరుమాళ్ళకి  తెలుసు.. “వచ్చిన పని మర్చిపోతున్నాం” అంటే సణుగుతూ లేచి వెళ్ళిపోతుంది. ఇంటి నిండా పెళ్ళికి చుట్టాలొచ్చినట్లు, పొద్దుటే హడావిడిగా కూస్తూ నిదర లేపుతాయి పక్షులు..”నీ మొగుడేడీ ఎర్ర తోక గాడూ..నీలం పిట్ట నీళ్ళోసుకున్నట్లుంది గూట్లోనే వుంటోంది”..అని మునెమ్మ మాట్లాడుతూ వుంటుంది. వంశవృక్షం పెరిగినట్లు తోటలో చెట్లూ వాటి మీద వాలే పిట్టలూ పెరుగుతున్నాయి. పెరుమాళ్ళు పకపక నవ్వి “నాకు ముసల్ది పుట్టిన రోజు చేస్తుందిరా చూడండి..వచ్చిన పనే కానియ్యడం లేదు” అన్నాడు. మునెమ్మ కొత్త బట్టలిచ్చి పరమాన్నం పెట్టిందని.

          “ఏందిరా ఆ పని వచ్చిన , పని వచ్చిన పని అంటావ్ వచ్చినప్పటి నుండి చూస్తున్నా..” అన్నాడు చుట్ట కాలుస్తూ తాత.

          “ఔనురా నాకూ అడగాలనే వుంది” అన్నాడు ఆది నారాయణ.

          మునెమ్మ నిటూర్చి “ఏడాది క్రితం మిలటరీ ఆసుపత్రిలో డాక్టర్ నీకు కడుపులో అయిన గడ్డ కాన్సర్..ఎక్కువ కాలం బతకవని చెప్పారట..ఆ పోడం ఏదో స్వంత ఊరు లోనే చెయ్యాలని ప్రయాణం కట్టించాడు దొర..వచ్చిన పని అదే..మట్టి కావడం” అంది.
తింటున్న పరమాన్నం చేదుగా మారింది ఆదినారాయణకి..

          “నేనుండగా నువ్వెట్టా పోతావురా?” అన్నాడు బాధగా తాత.

          మునెమ్మ కిలకిలా తోటలో పువ్వులా దాని మీద వాలే సితాకోక చిలుకలా నవ్వింది..” ఎట్టా పోతాడులే..మొన్న పనస తొనలు తినాలనుందన్నాడని నాలుగు గింజలు నాటా”..అంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.