నీ కలని సాగు చేయడానికి

  -వసీరా

చల్లగా వచ్చిన వరద నీరు
వీడని నీడలా….లోపలి నుండి తొలుచుకొచ్చే నీడలా
ఇక జీవితకాలపు సహచరిలా స్థిరపడిపోతోందా?

నువ్వయితే ఇన్ని సూర్యకిరణాలనీ
వాసంత సమీరాల్ని, యేటి ఒడ్డు ఇసుక మీద ఆటల్నీ వదలి
చప్పుడు లేకుండా వెళ్ళిపోయావు

అప్పుడు తెలియలేదు శూన్యం ఎంత పెద్దదో
బహుశా నువ్వు రాలిన ఆకుల మీది రంగుల రెక్కల్ని తీసుకుని
జ్వాలలోంచి జ్వాలలోకి ,
కలని ఖాళీచేసి శూన్యంలోకి
వెళ్ళావనుకున్నాను

లేదు, నువ్వు శూన్యాన్ని వదిలి మట్టిలోకి గాలిలోకి
నీటిలోకి… ఆకాశం ఆవలికి ..
దృశ్యాన్ని వదిలి అదృశ్యానికి వెళ్ళినట్లున్నావు

నీ చేతివేళ్ళ కాంతి నుంచి
నాలోపలా బయటా చేరుతున్న శూన్యం
అంతులేక విస్తరిస్తుండగా నేనందులో ఒక్కణ్ణీ
నా మోకాళ్ళ మీద తల పెట్టుక్కూర్చుని మిగిలాను

నువ్వొదిలిన మహాశూన్యాన్ని దేనితో నింపగలను
గాయపడ్డ పక్షి పెట్టే కీచుకేకల హోరుతోనా?
నిప్పుల్లోకి దూకే ఒంటరి క్రౌంచ పక్షి
వాల్మీకి హ్రుదయంలో రేపిన ఆర్తనాదాలతోనా?
ఒక్కోసారి వరద హోరు ..ఒక్కోసారి భయానక నిశ్శబ్దం
ఏది ఎప్పుడు వచ్చిందో తెలియకుండా
నాలోకి చేరి ఆడుకుంటాయి ….కుస్తీకి దిగుతాయి

నానిపోయిన మట్టి పెళ్ళ కరిగి నీటిచెలమలోకి పడుతున్న చప్పుడు
దుడుక్కున అప్పుడప్పుడూ నా గుండెల్లోంచే విన్పిస్తుంది.
నా గోడలు నిశ్శబ్దంగా ఊరికే నీటిని చెమర్చుతుంటాయి
నాచుపట్టి రంగుమారి ఆకారాల్లేని బొమ్మలతో గోడలు
కొద్ది కొద్దిగా ఊడుతూ నీటిలో పడుతున్న గోడలు
నూతి ఒరల్లా నీటిని చెమర్చుతూ….నా గుండె గోడలు

ఇంట్లో వరద నీటిలో మసలు కోవడం అలవాటైంది
అయినా కలని పదిలంగా పట్టుకున్నాను
నువ్వొదిలిన శూన్యంలో నీ కలని సాగు చేయడానికి
భుజానికి విత్తనాల సంచీతో
నేను ఇంట్లోంచి బయటికి అడుగులు వేస్తున్నాను
వరద నీరు తీసేశాకా మిగిలిన ఒండ్రు మట్టిలో
నీ స్మ్రుతి వనాన్ని ఎన్ని అందమైన పూలచెట్లతో పెంచుతానో నువ్వే చూస్తావుగా
బహుశ వనంలోని చెట్ల తలల మీద మంచులో తేలే తెల్లమబ్బు మీంచి
బహుశ వనంలో పక్షుల పాటల్లోంచి
నువ్వు గలగలా నవ్వుతూ చప్పట్లు కొట్టడం నాకు ఎప్పటికీ తెలుస్తుంది

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.