పిల్ల దోమలు

-కందేపి రాణి ప్రసాద్

          అక్కడొక పెద్ద మురుగు నీటి గుంట ఉన్నది. దాంట్లో పెద్ద దోమల కుటుంబం ఉంటోంది. తాతలు, తండ్రులు, అత్తలు, మామలు అందరూ కలిసి ఉండే పెద్ద ఉమ్మడి కుటుంబం. ఈ గుంట పక్కనే పెద్ద నేషనల్ హైవే. ఆ హైవేలో ఒక డాబా హెూటల్ ఉన్నది. ఆ హైవేలో ప్రయాణించే వాళ్ళందరూ దాదాపుగా ఆ హెూటల్ దగ్గర ఆగి తింటుంటారు. అలా కార్లు ఆగినప్పుడు ఈ దోమల కాలనీలోని పిల్లలు ఆ కార్లు ఎక్కి ఆడుకుంటూ ఉండేవి. పిల్ల దోమలు కారెక్కి సీట్ల కిందా, ఎ.సి. కన్నాలలోనూ దాక్కొని దాగుడుమూతలు ఆడుకుంటాయి. ఇంకా స్టీరింగ్ చుట్టూ తిరుగుతూ పరుగు పందేలు పెట్టుకుంటాయి. ఆయా కారుల్లోని సీట్ల మెత్తదనాన్ని, కొత్త రకాల మోడల్నూ చూస్తుం టాయి. ఇలా కారెక్కి ఆడుకోవడం వాటికి సరదాగా ఉండేది. కారు యజమానులు హెూటల్ నుంచి వస్తుండగానే ఈ పిల్ల దోమలన్నీ కారు దిగేసేవి.

          పిల్లదోమల ఆటలు చూసినప్పుడల్లా వాళ్ళ పెద్దవాళ్ళు కోప్పడేవాళ్ళు.

          “జాగ్రత్త! ఎప్పుడైనా వాళ్ళు వచ్చేదాకా ఉండవద్దు. తలుపులన్నీ మూసేసుకుంటే మీరు బయటకు రాలేరు” అంటూ హెచ్చరించారు.

          “సరే సరే ఎప్పుడూ చెప్పే విషయాలే కదా!” అంటూ పిల్లదోమలు పెడచెవిన పెట్టాయి. “ఒకవేళ కారు కదిలినా మనం కిటికీలోంచి బయటకు వచ్చి దారి చూసుకుని ఇంటికి రాలేమా? ఏంటో వీళ్ళ భయం” అని పిల్లదోమలు నవ్వుకున్నాయి.

          ఎప్పటిలాగానే ఓ కారొచ్చి ఆగగానే పిల్లదోమలన్నీ యధాప్రకారం కారెక్కి ఆటలు మొదలెట్టాయి. పరుగుపందేలు, దాగుడుమూతలు ఆడుతూ కారు యజమానులు వచ్చి తలుపులు వేసుకోవటం గమనించలేదు. కారు రయ్యిమని దూసుకుపోతున్నపుడు కానీ అర్ధం కాలేదు. గబగబా విండో గ్లాసెస్ దగ్గరకెళ్ళాయి. కానీ అప్పటికే వారు విండో గ్లాసెస్ ఎక్కించేశారు. కారులో చుట్టూ తిరిగాయి. గోలగోలగా అరిచాయి. ముందు సీట్లోని గ్లాసెస్ దగ్గరకూ, వెనక సీట్లోని గ్లాసెస్ దగ్గరకూ, అటూ ఇటూ కంగారుపడి పరిగెత్తాయి. కానీ తలుపులు తెరుచుకోలేదు. కారేమో ముందుకు పోతూనే ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక ఒకరి మొహం మరొకటి చూసుకుంటున్నాయి. బిక్కమొహం వేసుకొని ఏం చేద్దామని ఒకదాన్నొకటి అడిగాయి. అవన్నీ అయోమయ స్థితిలో ఉన్నాయి. వీటి గోలతో సంబంధం లేకుండా కారు పోతూనే ఉన్నది. కారులో వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వు కుంటూ ఉన్నారు. కానీ దోమలకేమో ఏడుపు తన్నుకొస్తోంది.

          పిల్లదోమలకు ఒక్కసారిగా తమ అమ్మానాన్నలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తలుపులు వేసుకుంటే మాత్రమేమిటి? విండో గ్లాసెస్ లో నుంచి బయటకు రావచ్చుగా అనుకున్న దోమలకు ఇలా విండో గ్లాసెస్ కూడా మూసేసి ఎ.సి. వేసుకుంటారని ఊహించలేదు. “అమ్మా నాన్నలు చెప్పిన మాటలు వింటే ఎంత బాగుండేది” అని ఎంతగానో బాధపడ్డాయి. కానీ ఇప్పుడేమి లాభం ఇప్పుడేమి చేయటం” అనుకుంటూ పిల్లదోమలన్నీ ఏడవటం మొదలుపెట్టాయి. ఇంకోసారి ఎప్పుడూ పెద్దవాళ్ళ మాట పెడచెవిన పెట్టగూడదు. కానీ ఇప్పుడెలా బయటపడటం అర్ధంకాక ఏడుపు మొహాలతో కూర్చున్నాయి.

          అంతలో ఆ కారులోని పిల్లవాడు దారి పక్కనున్న మొక్కజొన్న కంకిని కావాలని అడిగాడు. పిల్లదోమలు రోడ్డువైపు చూశాయి. రోడ్డుపక్కన నిప్పుల మీద కంకులు కాలుస్తూ కొంత మంది ఆడవాళ్ళు కూర్చున్నారు. కారులోని వారు దిగి కంకిని కొంటున్నారు.

          వీళ్ళని ఎప్పుడూ చూడలేదే? కారు ఎంతదూరం వచ్చిందో’ అని ఆలోచిస్తున్నారు కానీ తలుపులు తీసి ఉన్నాయి. పారిపోవచ్చు కదా అని మర్చిపోయాయి. చల్లని బయటి గాలి తగిలే సరికి స్పృహలోకి వచ్చి గబగబా ఒకదాని చేయి మరొకటి పట్టుకొని బయట పడ్డాయి. అన్నీ వచ్చాయో లేదో లెక్క చూసుకున్నాయి. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చు కున్నాయి. హమ్మయ్య! బయటికొచ్చేశాం! అని ఆనందపడ్డాయి. కానీ ఇక్కడి నుంచి  మనింటికి దారి తెలీదే ఎలా అనుకుంటున్నాయి.

          అంతలో తమ తల్లిదండ్రులు అటుగా రావడం గమనించాయి. “అమ్మా! నాన్నా!” అంటూ ఆనందంతో ఎదురు వెళ్ళాయి. పిల్లలు కనపడలేదని వాళ్ళని వెతుక్కుంటూ కారు వెళ్ళిన వైపే వచ్చాయట తల్లిదండ్రుల దోమలు.

          “చూశారా! ఎంత ఆపద తప్పిందో. మేమెన్నిసార్లు చెప్పాము మీకు ఇలాంటి ఆటలు ఆడవద్దని!” అన్నాయి తల్లిదండ్రుల దోమలు. పిల్లలందరూ ఒక్కసారిగా అరిచి చెప్పాయి –

          ‘ఇంకెప్పుడూ మీ మాటను పెడచెవిన పెట్టం. మీరు చెప్పిన మాటను చక్కగా పాటిస్తాం” తల్లిదండ్రులు ఆనందంతో పిల్లల్ని హత్తుకొని అందరూ కలిసి ఇంటివైపు సాగాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.