పుట్టింటి నేల మట్టి ( కవిత)

-పరిమి వెంకట సత్యమూర్తి

మెట్టింట అడుగిడినా వెంటాడుతూనే ఉండే పుట్టింటి మట్టివాసన!!
 
మూడు ముళ్ళు ఏడడుగులు
కొత్త బంధాలు ఏర్పడినా
బుడి బుడి నడకలతో బుజ్జాయి మెట్టినింటిలో నడయాడినా
పుట్టింటి నేలమట్టి అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది!!
 
కన్నప్రేగు తెంచుకుని
పుట్టింటి నేల మీద
వాలినప్పటి నుంచి
కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులు!!
 
రక్తం పంచుకుని తనతో పుట్టి పెరిగిన తోబుట్టువులతో
ఆడుకున్న మధుర బాల్య స్మృతులు!!
 
వారి తీయని జ్ఞాపకాలు
మదిలో పది కాలాలు పచ్చగానే ఉంటాయి!!
 
పుట్టినప్పుడే “ఆడ” పిల్ల అని ఈడ పిల్ల కాదు అని గుర్తు చేస్తూ
గుడ్లనీరు కుక్కుకుని
ఒక అయ్య చేతిలో పెట్టే అమ్మానాన్నలు!!
 
మెట్టినింటికి వచ్చినా 
కడ వరకూ ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి!!
 
అన్నాచెల్లెళ్ళ బంధానికి
నిలువెత్తు సంతకంగా నిలిచే “శ్రావణపూర్ణిమ”
ఇదే అదనుగా పుట్టింటికి పరుగెత్తే సోదరీమణులు వారి
జీవితాలలో ఆ రోజు రాఖీ పండుగ ఒక మెరుపు!!
 
భగినీ హస్తభోజనంకు
తన అన్న వస్తాడనీ
తన చేతి వంట తిని
తనను దీవిస్తాడనీ ఒక సోదరి ఎదురుచూపులు
యమ ధర్మరాజు చెల్లెమ్మ
యమున సోదరబంధానికి ప్రతీక!!
 
తన కన్నబిడ్డ మూడు ముళ్ళ బంధానికి తీపి గుర్తుగా 
కడుపులో బిడ్డ కదలాడిననాడు వేలు పట్టి నడిపించిన తన బిడ్డ ఇంకో బిడ్డకు జన్మనిస్తోందని కాబోయే ఆ తాత కళ్ళల్లో ఎన్ని సంతోష సముద్రాలో!!
 
వీడని వాడని పుట్టింటి మట్టి వాసనలు వెంటాడే
భవబంధాలు!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.