ప్రమద

ఆత్మీయ రచయిత్రి జలంధర…!

-పద్మశ్రీ

          వృత్తి రీత్యా..  జర్నలిస్టులకు పలు రంగాలకు చెందిన ప్రముఖులెందరో పరిచయం అవుతారు. సహజంగానే పని అయిపోయాక ఆ పరిచయాలు అక్కడితో ఆగిపోతాయి. అరుదుగా కొన్ని మాత్రం స్నేహానికి దారితీస్తాయి. నాకు అలాంటి కొన్ని అద్భుతమైన పరిచయాలు దొరికాయి. అలాగని నేను తరచూ వారిని కలిసేది లేదు, ఫోనులో మాట్లాడేది లేదు. కానీ జీవితకాలం నన్ను వెన్నంటి ఉండే మంచి జ్ఞాపకాలుగా మిగిలాయవి. వారు నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు-  అన్న భావన ఇచ్చే అనుభూతి ని మాటల్లో పెట్టలేను. అలాంటి ఓ ఆత్మీయ స్నేహం… జలంధర గారిది.

          తొలిసారి చెన్నైలో వాళ్ళింటికి వెళ్ళినప్పటి దృశ్యం నాకిప్పటికీ గుర్తు. ఉద్యోగంలో చేరి రెండేళ్ళే అయింది. ఇప్పటిలాగా టీవీ ఛానళ్ళు, సోషల్‌ మీడియా లేవు. ఎవరి గురించి తెలుసుకోవాలన్నా లైబ్రరీకి వెళ్ళి వివిధ పుస్తకాలనూ ఫైళ్ళనూ తిరగేసి, ఆయా రంగాల్లోని పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఎవరిని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినా నేను అలాగే చేసేదాన్ని. ఓసారి మద్రాసు వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండటం ఎందుకని ఎవరైనా ప్రముఖులు దగ్గరలో ఉంటే చెప్పమంటే మా బాబాయి చెప్పిన పేర్లలో ‘జలంధర’ ఒకటి. వనితలో సీరియల్‌ రచయిత్రిగా ఆ పేరు చూసిన గుర్తు. ప్రత్యేకమైన పేరు కావడంతో బాగా గుర్తుండిపోయింది. అంతకు మించి ఏమీ తెలియదు. బాబాయి సినిమా దర్శకులు, పిన్ని మంచి చదువరి. వాళ్ళిద్దరినీ అడిగి కాసిన్ని వివరాలు సేకరించాక జలంధర గారి ఇంటికి ఫోను చేసి అప్పాయింట్‌మెంట్‌ తీసుకున్నా. నన్ను వాళ్ళ గేటు ముందు దించి మా బాబాయి వెళ్ళిపోయారు. అప్పుడే గేటులో నుంచి ఓ రిక్షా లోపలికి వెళ్తోంది. అందులో సిమెంటు సంచులున్నాయి. గేటు దగ్గర నేల ఏటవాలుగా ఉండడంతో రిక్షా అతను దిగి కష్టపడి లాగుతున్నాడు. ఇంతలో లుంగీ, బనీనులో ఉన్న వ్యక్తి వచ్చి వెనకాల నుంచి తోస్తూ అతనికి సాయం చేశారు. వాళ్ళ వెనకాలే నేనూ లోనికి వెళ్ళాను. జలంధర ఆంటీ వరండాలో నా కోసం చూస్తున్నారు. పరిచయం చేసుకుని రాతపనిలోకి దిగాను.. ఇంతలో అంతకు ముందు రిక్షా తోసిన వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి చొక్కా వేసుకుని వచ్చారు. ఆయన చంద్రమోహన్ గారు. ఆంటీ నన్ను పరిచయం చేసారు. నేను ఆయన్ని ముందే గుర్తు పట్టకపోవడానికి కారణాలు- నేను సినిమాలు అరుదుగా చూడడం ఒకటైతే అంతప్రముఖ నటుడు అలా మామూలుగా వచ్చి రిక్షా అతనికి సాయం చేస్తారని ఊహించకపోవడం. ఆ దంపతుల నిరాడంబరత… నాకు తొలి పాఠం. ఆ తర్వాత ప్రతి ఇంటర్వ్యూలోనూ జీవితా నికి సంబంధించీ వృత్తికి సంబంధించీ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను.

          మొదటిసారి వాళ్ళింట్లో గడిపిన రెండు గంటల్లో బోలెడన్ని కబుర్లు. ఆంటీ కాస్తా అమ్మ అయిపోయారు.. అమ్మ లేని నాకు తానున్నానన్నారు. ఆ తర్వాత పండుగ లప్పుడు గ్రీటింగ్‌ కార్డులు, మంచి వ్యాసమో ఇంటర్య్వూనో రాసినప్పుడల్లా ప్రశంసిస్తూ ఓ ఉత్తరం వచ్చేవి. వాటిని కొన్ని నెలల పాటు చదువుకునేదాన్ని. ఇప్పటికీ ఆ ఉత్తరాలు నా దగ్గర పదిలంగా ఉన్నాయి. పెళ్ళి చేసుకుంటున్నానని చెబితే… వివరాలన్నీ అడిగారు. అమ్మాయికి అమ్మ చెప్పాల్సిన మంచి మాటలన్నీ ఆంటీ చెప్పారు. అప్పుడు ఒక్కదాన్ని.. ఇప్పుడు ముగ్గురమయ్యాం… ఆ మంచి మనసుల ఆశీస్సులే బతుకుబాటలో ముందుకు నడిపిస్తున్నాయి. ఎప్పుడు కలిసినా ఆమె దగ్గర ఎంతో కొంత నేర్చుకోవడం, నేర్చుకున్నదాన్ని పది మందికి చెప్పాలి కాబట్టి రాయడం.. నాకు అలవాటు అయింది.

          రచయిత్రిగా సమాజానికి ఆమె ఎంత కావలసినవారో వ్యక్తిగా నాకు అంత ఆత్మీయు లు. వాళ్ళ కుటుంబమంతా నాకు తెలుసు. ఆమెను రచయిత్రిగా, చంద్రమోహన్‌ గారితో కలిసి ఆదర్శ దంపతులుగా, వాళ్ళ పెద్దమ్మాయిని మానసికవైద్య నిపుణురాలిగా… ఇలా విభిన్నమైన ఇంటర్వ్యూలు చేశాను. చిన్నమ్మాయి మాధవి నృత్యప్రదర్శన చూశాను. పెళ్ళికి వెళ్ళాను.

నాన్న కూతురు

జలంధర గారు నాకు ఒకరకంగా ఫ్రెండ్‌ ఫిలాసఫర్‌ గైడ్‌. మరి తనకీ..? వాళ్ళ నాన్నగారు డాక్టర్‌ గాలి బాలసుందరరావు గారు. ఆ దంపతులకు లేక లేక పుట్టిన ఏకైక కుమార్తె ఆమె. లక్ష్మీకామేశ్వరి అని పేరు పెట్టుకున్నారు. దురదృష్టవశాత్తు మూడున్నరేళ్ళవయసు లోనే చిన్నారి లక్ష్మీకామేశ్వరి తల్లిని కోల్పోయింది. బామ్మలిద్దరు కలిసి పెంచుతున్నా తండ్రి మరో పెళ్ళి చేసుకోకుండా కూతురి పెంపకం పైనే శ్రద్ధ పెట్టారు. పెద్దల సూచనతో ఆమె పేరును ‘జలంధర’గా మార్చారు. బాలసుందర రావుగారి సోదరి తెన్నేటిహేమలత… అప్పటి వరకు అన్నావదినలకు గారాబు బిడ్డగా ఉండేది. డాక్టరు గారికి చెల్లెలంటే అనురాగంతో పాటు ఆలోచనాపరురాలన్న ఆరాధన కూడా. మంచి చదువరిగా, తర్వాత రచయిత్రిగా ఎదిగిన ఆమెను చూసి గర్వించేవారు. ప్రతిదాన్నీ ఆమె ప్రశ్నించడమూ, ఆ ప్రశ్నలకు ఎవరి దగ్గరా జవాబులు లేకపోవడమూ… చూస్తూ పెరిగిన జలంధరగారికీ మేనత్త పట్ల అభిమానమూ ఆరాధనా పెరిగాయి. దానికి తోడు బాలసుందరరావుగారు ఫీజు తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేసేవారు. ఎవరికైనా సాయం చేయాలంటే ముందుం డేవారు. ఇలా తండ్రిని చూస్తూ పెరగడం వల్ల ఆమెకు చిన్న వయసులోనే సామాజిక పరిస్థితుల పట్ల అవగాహనా మానసిక పరిణతీ అలవడ్డాయి. సైన్సుని నమ్మే తండ్రీ ఆధ్యాత్మికులైన బామ్మల పెంపకం… ఆమెను చక్కని ఆలోచనాపరురాలిగా మార్చాయి.

          బాలసుందరరావుగారికి సాహిత్యం అంటే ఎంతో ఆసక్తి. నాటకాలూ సినిమాలకు సంభాషణలు రాసేవారు. దాంతో విద్వాన్‌ విశ్వం, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, శివలెంక శంభుప్రసాద్‌లాంటి ఎందరో సాహితీవేత్తలు వీరి ఇంటికి వస్తూ ఉండేవారు.

          ఓ పక్క అన్నాచెల్లెళ్ళ సంభాషణలు… మరో పక్క ఈ సాహితీవేత్తల చర్చలు. చిన్నప్పటి నుంచీ అవన్నీ వింటూ పెరిగిన జలంధర వారి నుంచీ ఎంతో నేర్చుకు న్నారు. పత్రికల్లో వచ్చిన కథలను వాళ్ళు ఏకీలుకాకీలు విడదీస్తూ విమర్శించడం చూశాక అసలెప్పటికీ కథలు రాయకూడదనుకునేవారట ఆమె. అలాంటిది ఆమె రచయిత్రి ఎలా అయ్యారూ అంటే…

అనుకోకుండా తొలి కథ

జలంధర గారు పుట్టిపెరిగిందీ చదువుకున్నదీ మద్రాసులోనే. ఒకసారి కాలేజీ మ్యాగజైన్‌కి కథ రాయమని అడిగారట లెక్చరర్. అది రాసి, ఇవ్వడానికి వీలుకాక ఇంట్లోనే పెట్టేశారు. ఆమె లేనప్పుడు ఇంటికి వచ్చిన విద్వాన్‌ విశ్వం గారి కంట పడింది అది. దాన్ని చదివిన ఆయన తీసుకెళ్ళి ప్రచురించేశారు. అలా అనుకోకుండా తన తొలి కథ ‘నా కథ’ని  అచ్చు లో చూసుకుని  ఆశ్చర్యపోయారట జలంధర. కథ అచ్చయినందుకు ఆనందం ఒక పక్క, తండ్రీ మేనత్తా దాన్ని చదివి ఏమని విమర్శిస్తారో అన్న భయం ఒక పక్క.. అప్పుడు తనని ముప్పిరిగొన్నాయని చెప్పారు.

          జలంధర గారికి రాయడం కన్నా చదవడం ఇష్టం. విశ్వసాహిత్యం పండువెన్నెల్లా వ్యాపించి ఉంది, దాన్ని ఆస్వాదించక, మనం కూడా రాసి దాన్ని చెడగొట్టడం అవసరమా అనుకునేవారట. ఇంటికి వచ్చే మహారచయితల విమర్శలూ  అందుకు కారణం. అయితే మళ్ళీ వారే ఆమెను రచయిత్రిని చేశారు. విద్వాన్‌ విశ్వంగారే అడిగి మరో కథ రాయించుకున్నారు. అలా ఆంధ్రప్రభ, ఆ తర్వాత వనిత పత్రికల్లో ఆమె రచనలు ఎక్కువగా వచ్చాయి. అదీ వాళ్ళు అడిగి బలవంతపెట్టి రాయించుకోవడం వల్ల. అడగందే రాయొద్దని ఒక నియమం పెట్టుకున్నారామె. అందుకు కారణం లేకపోలేదు. పత్రికా కార్యాలయాలకు వెళ్ళినపుడు అక్కడ గుట్టలుగా పడివున్న కథలను చూశారు. మనంతట మనం రాసి పంపిస్తే, అది నచ్చక ఎడిటర్లు చించి అవతల పడేస్తే… ఇద్దరికీ అనవసర శ్రమా టైమ్‌ వేస్టూ ఎందుకని… అనుకునేవారట. సంపాదకులంటే విపరీత మైన గౌరవం జలంధర గారికి. తన కథల పుస్తకాన్ని సంపాదకులకు అంకితమిచ్చిన తొలి రచయిత్రి బహుశా ఆమెనే కావచ్చు. సంపాదకులే  లేకపోతే రచయితలూ ఉండరు- అంటారామె. అలా ఎవరైనా అడిగినప్పుడే రాయడం వల్ల రాశిపరంగా ఆమె రచనలు తక్కువే.

అసాధారణ ప్రేమకథ

చతుర కథ వెనుక కథ శీర్షిక కోసం తన రచనల్లో తనకు బాగా నచ్చిన నవలగా ‘తమసోమా జ్యోతిర్గమయ’ గురించి చెప్పారు జలంధర. వనిత పత్రికాధిపతే స్వయంగా ముక్కోణపు ప్రేమ కథ అనే సబ్జెక్టు ఇచ్చి కోరి రాయించుకున్న సీరియల్‌ అది.. సాధారణమైన ఆ సబ్జెక్టును  అసాధారణంగా అద్భుతమైన ముగింపుతో మీరే రాయగలరు అని చెబితే సవాలుగా తీసుకుని రాసి ఆయనను మెప్పించారామె. ఇందులో కథానాయికలిద్దరూ వరసకు అక్కచెల్లెళ్ళు. పరిస్థితుల కారణంగా చెల్లెలు బామ్మ దగ్గర పల్లెటూళ్ళో  ప్రపంచ జ్ఞానం లేకుండా పెరిగితే అక్క పరిపూర్ణ పేరుకి తగ్గట్టే పరిణిత వ్యక్తిత్వంతో పెరుగు తుంది. భర్త మరో మహిళతో వెళ్ళిపోతే ఒంటరిగా ఉంటూ లెక్చరరుగా ఉద్యోగం చేస్తుం టుంది. చెల్లెలి పెళ్ళి మేనబావతో అవుతుంది. కానీ అతడేమో భావుకుడు. భార్య మూర్ఖత్వాన్నీ ఆమె సోదరి ఉన్నత వ్యక్తిత్వాన్నీ పోల్చి చూస్తూ వదినగార్ని ఆరాధించడం మొదలెడతాడు. ఆమెను తనదాన్ని చేసుకోవాలనుకుంటాడు. ఆ పరిస్థితుల్లో అక్క పూనుకుని చెల్లెలి కాపురాన్ని నిలబెట్టడానికి ఏం చేసిందన్నదే ముగింపు. ఈ కథకు తొలి రెండు వారాలు అయ్యేసరికే పాఠకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఒక దశలో ‘కొన్ని విషయాలు హైలీ ఇంటలెక్చువల్‌గా ఉన్నాయి, కొంచెం స్థాయి తగ్గించుకో ‘మన్న సూచనలూ అందాయట. ఒకసారి ఒక సమావేశానికి వెళ్తే – అభిమానులంతా ఆమెను చుట్టుముట్టి ‘మా వూళ్ళో ఉండే తేజ మీకు ఎలా తెలుసు’ అని ప్రశ్నించారట. అలా ఒక్క ఊరు కాదు… ఏ ఊరెళ్ళినా ఆదే ప్రశ్న. ఎవరికి వారు తమకు తెలిసిన వ్యక్తుల్లో ఒకరిని కథానాయకుడిలో చూసుకున్నారు. అదే ఆ నవల విజయానికి కారణం అన్నారు జలంధర. పాఠకుల జీవితంతో ఐడెంటిఫై అవనిదే ఏ పాత్రా సక్సెస్‌ కాదని అప్పుడే తనకు తెలిసిందన్నారు. ఇందులో ‘పరిపూర్ణ’ తనకు బాగా నచ్చిన పాత్ర అనీ కథానా యిక అయివుండీ ప్రేక్షకపాత్ర వహిస్తూ కథ నడిపిస్తుందనీ చెప్పారు.

కథలంటేనే ఇష్టం

దాదాపు వంద కథలూ నాలుగు నవలలూ రాశారు జలంధర. నవల కన్నా కథలు రాయడం అంటేనే ఇష్టం అంటారు. కథ జీవితానికి క్రాస్‌ సెక్షన్‌ లాంటిదనీ, వంద కథలు రాశాకే నవల రాయమనీ కొడవటిగంటి కుటుంబరావుగారు సూచించారట.

          రచన విషయంలో తండ్రి చెప్పిన ఒక మాటని ఆమె ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు.

          ఒకసారి ఆమె ఏదో రాసుకుంటున్నారు. తండ్రి వచ్చి లైటు ఆర్పేశారట. అదేంటి నేను రాసుకుంటుంటే లైటు ఆర్పేస్తారూ అని అడిగారు తండ్రిని. ‘నీకేం తెలుసని రాస్తున్నావూ’ అన్న ఆయన మాటకి పందొమ్మిదేళ్ళ జలంధర అహం కాస్త దెబ్బతింది. చిన్నబుచ్చుకున్న తనకు తండ్రి చెప్పిన మాటల్ని ఇప్పటికీ ప్రతి ఇంటర్వ్యూలోనూ గుర్తు చేసుకుంటారామె. అంతగా ఆ మాటల అర్థాన్ని ఆవాహన చేసుకున్నారు జలంధర. ఆ రోజు తండ్రి ఆమెకేం చెప్పారంటే- ‘నువ్వు వంద విషయాలు చదివితే అందులో యాభై మాత్రమే నీకు గుర్తుంటాయి. పాతిక శాతమే రాయగలవు. అందులో జనానికి అర్థ మయ్యేది పదిహేను శాతం అనుకుంటే ఆచరణ యోగ్యంగా ఉండేది ఏడున్నర. ఆచరిస్తే వచ్చే ఫలితం మూడున్నర. వ్యక్తిగతంగా ఎవరికైనా దాన్ని ఉపయోగించాలంటే పనికొ చ్చేది ఒకటిన్నర శాతమే. కాబట్టి నువ్వు ఎంత చదివితే ప్రజలకు చేరేది ఎంతో ఆలోచించు’.

          ఈ మాటల్ని అక్షరాలా ఆచరిస్తారామె. ఒక కథ రాయాలన్నా ఒక నవల రాయాల న్నా విపరీతమైన హోమ్‌ వర్క్‌ చేస్తారు. విస్తృతంగా చదువుతారు, నిపుణులతో చర్చి స్తారు. నోట్సు రాసుకుంటారు. ఎంత రాశావన్నది కాదు, ఆ రాతల వల్ల ఎవరి జీవితాల్లో అయినా మార్పు వచ్చిందా అన్నది ముఖ్యం. ఫలానా రచన చదివినందుకు వారి ఆలోచనల్లో మార్పో, మానసిక ప్రశాంతతో రావాలి. రచనలోని ఆదర్శాన్ని గుర్తించ గలగాలి. ఉప్పు సముద్రంలో తయారైతే, ఉసిరికాయ అడవిలో ఎక్కడో కాస్తుంది. పూర్తిగా భిన్నమైన రుచులు కల ఈ రెండూ కలిసినప్పుడు కొత్త రుచి ఏర్పడుతుంది. రచయిత, పాఠకుల మధ్య కూడా అలాంటి సంయోగమో, సంశ్లేషణో జరగాలి. మార్పు రావాలి. అప్పుడే రచయితకు తృప్తి… అంటారామె.

          జలంధరగారు రచయిత్రిగా ఎందరో అభిమాన పాఠకులను సంపాదించు కున్నారంటే కారణం ఆమె రాసేదానికి వందరెట్లు చదువుతారు కాబట్టి. చదివే ప్రతి పుస్తకం నుంచీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. ఆమెకు సోమర్‌సెట్‌ మామ్‌, జార్జ్‌ బెర్నార్డ్‌ షా, ఆస్కార్‌ వైల్డ్‌… లాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. ‘షా తనని తానే విమర్శించు కునేవాడు. రచయితకు అది చాలా ముఖ్యమైన లక్షణం. అలాగే మామ్‌ రచనలు చదువు తుంటే పాత్రచిత్రణ ఆకట్టుకుంటుంది. ఆ పాత్రల్లో మనకు తెలిసినవారే ఎవరో ఒకరు కన్పిస్తారు. అది అద్భుతమైన విషయం…’ ఇలా ఒక్కో రచయితలో ఒక్కో ప్రత్యేకత ఉంటుందని చెబుతారు. అలా నేర్చుకోవడం వల్లే తండ్రి దగ్గరకు వచ్చే పేషెంట్లు, స్నేహితులు, బంధువులు… అందరి నుంచి స్ఫూర్తి పొంది తన రచనల్లో కొన్ని ప్రత్యేక పాత్రల్ని, చిరకాలం గుర్తుండి పోయేలా ఆమె మలచగలిగారు.

          ‘సాహితీవనంలో సజీవ స్త్రీమూర్తులు’ పేరుతో జలంధరగారు నిర్వహించిన శీర్షిక బహుళ పాఠకాదరణ పొందింది. ప్రముఖ రచయితల రచనల్లోని విలక్షణమైన స్త్రీ పాత్రల గురించి ఎంతో లోతుగా విశ్లేషించిన శీర్షిక అది. 

కేంద్రబిందువువివాహ వ్యవస్థ

జలంధర గారి రచనల్లో చాలా వరకూ వివాహ వ్యవస్థ కేంద్రబిందువుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో వివాహంలో, స్త్రీ పురుష సంబంధాల్లో ఏదో కొరవడుతోందన్నది ఆమె ఆరోపణ. దాంపత్యంలో ఉండవలసిన రొమాన్స్‌ని పెళ్ళి సమయంలోనే అగ్నిహోత్రం లో పడేస్తున్నారన్నది ఆమె కంప్లయింటు. దాంతో ఎలాంటి ఇన్‌స్పిరేషనూ లేకుండా జీవితాలను నిస్సారంగా గడుపుతున్నారనీ ఎవరో కొందరు తెలివి గలవాళ్ళు మాత్రం ఇతర అంశాల వైపు మనసు మళ్ళించుకుని మరో రకంగా సంతృప్తిని పొందడానికి ప్రయత్నిస్తున్నారనీ అంటారు.

          పెళ్ళికి కావలసిన పవిత్రత కన్నా ఆర్భాటం ఎక్కువ అవడాన్ని ఆమె ఆక్షేపిస్తారు.  

          అలాగే ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నవాళ్ళు కూడా భార్యాభర్తలు అయ్యాక ఒకరినొకరు విమర్శించుకుంటూ జీవితం గడపడం తాను చూశాననీ, స్నేహితులుగా ఒకరికొకరు స్ఫూర్తిగా నిలిచినవారే భాగస్వాములు కాగానే ఎదుటి వ్యక్తిలోని నెగెటివ్‌ అంశాలను చూసి అసంతృప్తి చెందుతుంటారనీ చెప్పారు. అందుకే ఆమె రచనల్లో ప్రధాన పాత్రలు తమ మానాన తాము వెళ్ళిపోతాయి కానీ పెళ్ళి చేసుకుని పాఠకులకు సుఖాంతమైన ముగింపునివ్వవు.

          దూరపు కొండలు నునుపన్నది అందరికీ తెలిసిందే. దూరంగా ఉండి స్ఫూర్తిని చ్చిన ప్రతి వ్యక్తీ దగ్గరగా వచ్చిన తర్వాత అలాగే ఉంటారని గ్యారంటీ లేదు. ప్రేమ పెళ్ళిళ్ళలో జరుగుతున్నది అదే. ఒకరిలో మరొకరు నిత్యం కొత్తదనాన్ని చూసుకో వాల్సింది పోయి లోపాలను వెతుకుతారు. రంధ్రాన్వేషణ మొదలెడతారు. అందుకని ఇన్‌స్పైర్‌ చేసే వ్యక్తులు దూరంగా ఉంటేనే హాయి…. అని చెబుతారు. అందుకే కథలోని పాత్రల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి వదిలేస్తాననీ, ముగింపు పాఠకులకే విడిచిపెడతాననీ అంటారు. ఎమోషనల్‌ కంపాటిబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటారు.

          సందర్భం వచ్చింది కాబట్టి జలంధర గారు నాకు రాసిన లేఖలోని కొన్ని మాటల్ని ఇక్కడ  ఉదహరిస్తాను…

          ‘కీప్‌ అప్‌ యువర్‌ ఐడెంటిటీ… సంసార సాగరంలో పూర్తిగా మునిగిపోవద్దు. కొంచెం తల ఎత్తి చుట్టుపక్కల గమనిస్తూ ఉండండి. ఇద్దరి మధ్యా బ్రీతింగ్‌ స్పేస్‌ ఉంచుకోండి. అప్పుడే అది జీవనబంధం అవుతుంది. ఎవరి ఐడెంటిటీ వాళ్ళు పోగొట్టుకోకుండా కలిసి ఉండడం… ఇట్‌ ఈజ్‌ ద సీక్రెట్‌ ఫర్‌ పీస్‌…

          ప్రేమ అనేది మనని ఆవరించినప్పుడు మెరుపుతీగలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కానీ నిజానికి అది సుకుమారమైన కాశీరత్నం తీగలాంటిది. చిన్న అలజడికే అల్లల్లాడి పోతుంది. ఎంతో సున్నితంగానూ అంతే గౌరవంగానూ చూసుకోవాలి దాన్ని. అప్పుడే జీవితాంతం మనతో ఉంటుంది. ప్రేమ లేని గౌరవాన్ని భరించగలం కానీ గౌరవించని ప్రేమని భరించలేం…’

          ఆంటీ చెప్పిన ఈ మాటల్ని నేనెప్పుడూ మర్చిపోలేదు. నేననే కాదు, మహిళ లెప్పుడూ మగవారి నీడలా మిగిలిపోకూడదనీ ఎవరికి వారు తమదైన ఒక లోకాన్ని సృష్టించుకోవడం ప్రతి మనిషికీ అవసరం అంటారామె. ప్రతి వ్యక్తిలోనూ ఒక టాలెంట్‌ ఉంటుంది. అది రకరకాలుగా బయటకు వస్తుంది. దాన్ని గుర్తించి ఉపయోగించు కోవాలంటారు.

          ఒకసారి సినిమాల్లో అసభ్యత, అశ్లీలాల గురించి ఒక వ్యాసం రాస్తే- అభినందిస్తూ, దీన్ని ప్రింట్లు తీసి దర్శకులందరికీ పంచాలని ఉంది.. అంటూ పరిశ్రమలో వస్తున్న మార్పుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

          సానుకూల దృక్పథంతో సమస్యలను అధిగమించడం ఎలానో చక్కగా కౌన్సెలింగ్‌ ఇస్తారు జలంధర గారు. మైత్రి పేరుతో యూట్యూబ్‌లో పలువురి సందేహాలకు సమాధా నాలు ఇచ్చారు. తనని వారి కుటుంబ సభ్యురాలిగా భావించి ప్రేమించే పాఠకులు ఎందరో ఉన్నారనీ అది తలచుకుంటే తనకు ఎనలేని తృప్తి లభిస్తుందనీ అంటారామె. సత్సంకల్పంతో మనస్ఫూర్తిగా కోరుకున్నది జరుగుతుందని ఆమె విశ్వసిస్తారు. చిన్న ప్పుడు తండ్రి బహుమతిగా ఇచ్చిన – మ్యాగ్నిఫిసెంట్‌ అబ్సెషన్‌ పుస్తకం తననిటు వైపు మళ్ళించిందనీ చెబుతారు.

          అయాన్‌ రాండ్‌ మాటల్ని ఉటంకించకుండా జలంధర గారి ఇంటర్వ్యూ పూర్తయేది కాదు. బి సెల్ఫిష్‌ టు బి సెల్ఫ్‌లెస్‌ అన్నది ఆమెకు చాలా ఇష్టమైన మాట. తాను నమ్మిన పద్ధతులకు కట్టుబడి సాగే నిరాడంబర జీవన విధానం జలంధర గారిది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.