బొమ్మల్కతలు-22

-గిరిధర్ పొట్టేపాళెం

 
          చూట్టానికి పూర్తయినట్టే కనిపిస్తున్నా నేను కింద సంతకం పెట్టి, డేట్ వెయ్యలేదు అంటే ఆ బొమ్మ ఇంకా పూర్తి కాలేదనే. అలాంటి సంతకం చెయ్యని అరుదైన ఒకటి రెండు బొమ్మల్లో ఇది ఒకటి. ఈ బొమ్మ వేసినపుడు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఉన్నాను. కానీ కాలేజి హాస్టల్లో వేసింది కాదు. నా చిన్ననాటి మా ఊరు “దామరమడుగు” లో శలవులకి “బామ్మ” దగ్గరికి వెళ్ళి ఉన్నపుడు వేసింది. నాన్న పుట్టి పెరిగిన ఊరు “దామరమడుగు”.
         
          అప్పటికి పదేళ్ళు వెనక్కి వెళ్తే అక్కడే స్థిరపడాలని నాన్న ఇష్టంగా కష్టపడి కట్టుకున్న మా కొత్త ఇంట్లో నాన్న, అమ్మ, బామ్మ, అన్న, చెల్లి, నేను అందరం కలిసి ఉన్నాము. అందమైన అసలు సిసలు తెలుగు పల్లె వాతావరణం సంతరించుకున్న ఊరు. చుట్టూ ఎటు వెళ్ళినా, ఎటు చూసినా పచ్చని పైరుపొలాలు, చల్లని పైరగాలులు. ఊరికి ఒక చివర శివాలయం, చాలా పెద్ద గాలిగోపురం, విశాలమైన మండపాలతో  తమిళనాడు దేవాలయ కట్టడాల మాదిరిగానే ఉండేది. ఎదురుగా మూడు రోడ్ల కూడలి, మధ్యలో పాతిన ఆంజనేయస్వామిని చెక్కిన రాయి, ఎప్పుడూ పసుపు పూసి కుంకుమ బొట్లుతో ఉండేది. ఊరి మొదట్లో కూడా అచ్చం ఇలాంటిదే ఇంకొక రాయి ఉండేది. అప్పట్లో గ్రామ దేవతగా ఆ ఊరికి ఆంజనేయస్వామిని పెట్టుకుని ఉంటారు. శివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుకి ఒక పక్కన మా ఇల్లు. మిద్దె మీదకెక్కితే ఇంటికెదురుగా పక్కనే ఉన్న మూడంతస్తుల మిద్దెకన్నా ఎత్తైన కొబ్బరి చెట్లు, ఆ చెట్ల పైన గుంపులు గుంపులుగా తెల్లటి కొంగలు, కుడిపక్కన గాలిగోపురం, దూరంగా పచ్చని వరిపొలాలు, ఇంకా దూరంగా “కోవూరు థర్మల్ పవర్ స్టేషన్” లోని చాలా వెడలు, ఎత్తైన పేద్ద  సిమెంట్ గొట్టం, అందు లోంచి లేచి మేఘాల్లో కలసిపోతున్న సన్నని పొగ, ఎంతో ఆహ్లాదంగా ఉండేది.
 
          గట్టిగా మూడేళ్ళున్నామేమో ఆ ఊర్లో. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెంకి మధ్యలో ఉంటుంది. మహాభారతంని తెలుగులోకి అనువదించిన ముగ్గురు దిగ్గజ కవుల్లో ఒకరైన “తిక్కన సోమయాజి” పుట్టిన ఊరు “పాటూరు” కి వెళ్ళాలంటే మా ఊరు దగ్గర బస్సు దిగి రెండు మైళ్ళు మా ఇంటిమీదుగానే పచ్చని పొలాల మధ్య మట్టి రోడ్డులో నడచి వెళ్ళాలి. సారవంతమైన వ్యవసాయ భూమితో “మొలగొలుకులు” అనే ఒక ప్రత్యేకమైన వరి వంగడం పైరుకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అక్కడ ఎక్కువమంది ప్రధాన వృత్తి వ్యవసాయమే. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కలిసి మెలిసి జీవించే చిన్న ఊరు, అందరికీ అందరూ తెలుసు. ఊరిలో ఎక్కువగా కమ్యునిస్ట్ భావజాలం నిండి ఉండేది. ప్రాచీన కులాల ప్రాతిపదికగా హెచ్చుతగ్గులు ఇప్పటికీ ఉగ్గుపాలతో నూరిపోస్తున్న (అ)నాగరిక సమాజంలో అప్పుడే అవి లేకుండా రూపు మాపారు. బడుగు బలహీనవర్గా లనీ, చదువునీ, చదువుకున్న వాళ్ళనీ గౌరవంగా చూసేవాళ్ళు. భూస్వాముల, సంపన్ను ల ఆధిపత్యం అస్సలంటే అస్సలుండేది కాదు. ఒకరకంగా పేదవాడి మాటే ఎక్కువగా చెల్లుబాటయ్యేది. ఊరి కట్టుబాట్లు అలానే పెట్టుకున్నారు. ఎవరి మధ్యనయినా వివాదాలు తలెత్తితే పోలీసులకి ఊర్లో ప్రవేశం లేదు, ఊర్లో పెద్దమనుషులే కలిసి పరిష్కరించేవాళ్ళు. ఒకరకంగా అప్పటి సమాజంలో ఆ ఊరొక “ఆధునిక మైన పల్లె”. అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ “సుజాతా రావు” గారికి అందుకనే ఆ ఊరంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది.
 
          నా చదువు రెండవ తరగతి నుంచి నాలుగవ తరగతి దాకా ఆ ఊరి బళ్ళోనేసాగింది. మా ఊరు నుంచి మూడు మైళ్ళు దూరం “బుచ్చిరెడ్డిపాళెం”. అక్కడి హైస్కూలులో నాన్న టీచర్. రోజూ సైకిల్ మీద స్కూలుకి వెళ్ళి వస్తుండేవాడు. “జక్కా వెంకయ్య” అని అప్పట్లో కమ్యూనిస్ట్ నాయకుడు, మా ఊరే, నాన్నకి చిన్నప్పటి ఫ్రెండ్ కూడా. ఆయన కుటుంబం వాళ్ళు కట్టించిన బడి అప్పుడు ఆ ఊర్లో ఉన్న “ప్రాధమిక పాఠశాల”. ఒకటి నుంచి ఏడు తరగతుల దాకా ఉండేది. వరుసగా ఏడు రూములు, పొడుగ్గా వరండా, ప్రతి రూముకీ తలుపు, రెండు కిటికీలు, ప్రతి రెండు రూములకీ మధ్యన తలుపులేని ద్వారం. అది బడికోసమని కట్టినది కాదు, వడ్లు నిల్వచేసేందుకు కట్టిన రూములు కానీ బడికోసం ఇచ్చేశారు అనేవారు. బడి ఎదురుగా వడ్లుని బియ్యంగా ఆడించే మిషన్. మిషన్ అంటే చిన్నది కాదు మూడంతస్తుల ఎత్తులో ఒక ఫ్యాక్టరీ అంతుండేది. ఊర్లో ఉన్న రెండు వడ్ల మిషన్లలో ఇది చాలా పెద్దది. చుట్టూ ప్రహరీ గోడ, ఆనుకునే పచ్చని పొలాలు. బడి వెనకనే మల్లెపూల తోట, స్కూల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సపోటా చెట్టు, ఆ పక్కనే ఇటుక రాళ్ళ బట్టీలు. ఇవన్నీ ఇప్పుడు తల్చుకుంటే అచ్చం చందమామ పుస్తకంలోని గ్రామాల బొమ్మాల్లోలా ఉండేవి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ.
 
          సాయంత్రం బడి అయ్యాక మా ఇంటి ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు, ఆ చుట్టు పక్కలున్న అన్ని రోడ్లూ మా పిలకాయలవే. శిరి, గిరి (అంటే శ్రీధర్, గిరిధర్…అన్న, నేను), శీనయ్య, శివకుమార్ (వీళ్ళిద్దరూ అన్నదమ్ములు మా ఇంటి వెనకే ఇల్లు), మల్లిఖార్జున్ (ఈ మధ్యనే చనిపోయాడు), శీనడు, ప్రభాకర్ (మా చిన్నాన్న కొడుకు) మేము ఏడుగురం కలిసి ఆడని ఆట లేదు, పాడని పాటా లేదు. తెగ ఆడేవాళ్ళం. గోళీలు, బొంగరాలు, బిళ్ళంగోడు, గాలిపటాలు, తొక్కుడు బిళ్ళలు, దొంగా పోలీస్, డిమిండాల్, గాన్లు, టైర్లు, తాటి బుర్రలు కి పుల్ల గుచ్చి పంగాలు కర్రతో తిప్పే బళ్ళు, సబ్బు పెట్టెకి దారం కట్టి లాగే బళ్ళు, చివరికి ఇళ్ళు కట్టేందుకు తోలి పెట్టిన ఇసుక కుప్పలు తిరుపతి కొండలుగా, ఇటుక రాళ్ళని ఎక్కుతున్న బస్సులుగా వాటి పైన తిప్పేవాళ్ళం. దారిలో వస్తూ పోయే ఎద్దుల బండి వెనక పట్టుకుని కాళ్ళు పైకెత్తి కోతిలా వేళ్ళాడుతూ ఆ బండాయన వెనక్కి చూసి అరిచేదాకా చాలా దూరం పోయేవాళ్ళం. వర్షాకాలంలో పెద్ద వర్షం వస్తే మా ఇంటి ఎదురుగా పొంగి పొర్లే కాలువ ఊరి చివరిదాకా పారి అక్కడి పొలాల మధ్య పారే “కోవూరు కాలువ” లో కలిసేది. ఆ కాలువల వెంట కాగితం పడవలు చేసి వాటితో పరుగులు తీసేవాళ్ళం. ఇక మా ఇంటి దగ్గరున్న దేవాలయంలో అయితే చెట్లూ, మండపాలూ, గోపురాలూ, గోడలూ అన్నీ మావే. అయితే ఆ దేవాలయం గోడలు ఎక్కి ఆడే ఆటల్లో మాత్రం నాకూ అన్నకీ మిగతా పిల్లలకన్నా కొంచెం స్వేచ్ఛ తక్కువ. ఎవరైనా చూస్తే నాన్నకి చెప్తారనే భయం. కొంచెం చీకటి పడబోయే దాకా చూసి మేము ఇంటికి రాకుంటే మెల్లిగా బామ్మ బయల్దేరేది నన్నూ అన్నని వెతుక్కుంటూ, “నాయనా శిరీ, గిరీ” అని పెద్దగా పిలుస్తూ. ఆ పిలుపు వినబడితే ఇంక ఎక్కడి ఆటలు అక్కడ కట్టు, ఎక్కడి వాళ్ళం అక్కడ ఆగి ఇళ్ళకి బయల్దేరేవాళ్ళం. సాయంత్రం అయితే ప్రతి ఇంట్లోనూ “దాలి” అని వేసే వాళ్ళు. దాలి అంటే ఇంటి వెనక ఒక మూల చిన్న గుంట, అందులో ఒక పెద్ద కుండ ఎప్పుడూ పెట్టే ఉండేది. సాయంత్రం అయితే చుట్టూ గడ్డి పెట్టి మంట పెడితే నీళ్ళు కాగుతూ ఉండేవి. ఊర్లో సాయంత్రం అయితే దాదాపు ప్రతి ఇంటి వెనక నుంచీ పొగ పైకి లేస్తూ ఉండేది. వేడినీళ్ళ స్నానం చేసి, ఇంట్లో వోల్టేజి తక్కువగా ఉన్న లైట్ల వెలుగులో కాసేపు చదివి, భోజనం చేసి నిద్రపోయేవాళ్ళం. ఎండా కాలం అయితే మిద్దెమీద పరుపుల పక్కలు, చుక్కలు చూస్తూ బామ్మ కథలు వింటూ నిద్ర పోయేవాళ్ళం. చలికాలం అయినా, లేదా వర్షం వచ్చినా వరండాలో దోమతెర కట్టిన మంచాల మీద పక్కలు.
 
          పండగలప్పుడైతే వాతావరణం భలే ఉండేది. వినాయక చవితి అయితే పొద్దున్నే లేచి పిలకాయలం ఊరి పొలాల గట్ల వెంట వెళ్ళి తిరిగి పత్రి, గరికె, పూలూ కోసుకుని వచ్చే వాళ్ళం. అందరివీ వరి పొలాలు కావడంతో ముఖ్యంగా “సంక్రాంతి పండగ” బాగా జరుపుకునే వాళ్ళు. పొద్దున్నే నెత్తిన రాగి గిన్నె, కాషాయం బట్టలతో, విభూది, నామం దిద్దుకుని, పూల దండ వేసుకుని నారదుడి అలంకరణతో భజన చేస్తూ బియ్యం కోసం వచ్చే హరిదాసులు. బియ్యం దోసిట్లో తీసుకెళ్ళి వేసేటపుడు కిందికి వంగి కూర్చుంటే ఆ గిన్నెలో బియ్యం వెయ్యటం భలే తమాషాగా ఉండేది. ఇంకా బుట్టలు పట్టుకుని గుంపులు గుంపులుగా ఎక్కడి నుండి వచ్చే వాళ్ళో చాలా మంది వచ్చేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కూడా. అందరికీ ఒక బుట్టలో రెడీగా పెట్టుకున్న వడ్లు వేసే వాళ్ళం. సాయంత్రం అయితే వేషాలు వేసుకుని పాటలు, డ్యాన్సులు వేస్తూ ఇంటింటికీ వేషగాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళకి మాత్రం నిప్పట్లు (అంటే అరిసెలు), ఉప్పు చెక్కలు, బెల్లం చెక్కలు ఇవి మాత్రమే ఇవ్వాలి, ఇంకేం తీసుకోరు. రాత్రి కొంచెం పొద్దుబోయాక పెట్రొమాక్స్ లైట్స్ వెలుగులో “కీలు గుర్రాల” ఆటలు, మా ఇల్లు దేవాలయం దగ్గర ఉండడంతో ఆ కూడలిలో వచ్చి చాలా సేపు ఆడేవాళ్ళు. వీళ్ళు ఏమీ ఆశించరు, కేవలం ప్రజలకి ఎంటర్టెయిన్మెంట్ కోసం అంతే. ఆ మూడు పండుగ రోజుల్లో ఒకరోజు మాత్రం పొద్దు పోయాక దేవాలయం బయట స్టేజీ కట్టి డ్రామా వేసేవాళ్ళు. బాల నాగమ్మ, దుర్యోధన ఏకపాత్రాభినయం, గయోపాఖ్యా నం ఇలాంటి నాటకాలు ప్రసిద్ధి. అప్పుడు మా ఇంటి ప్రహరీ గోడమీద,  మిద్దెపైనా కొంత మంది చేరేవాళ్ళు చూట్టానికి. ఎవర్నంటే వాళ్ళని బామ్మ చేరనిచ్చేది కాదు.
 
          “బామ్మ” – దామరమడుగు అంటే గుర్తుకొచ్చే మొట్ట మొదటి వ్యక్తి బామ్మ. బామ్మ లేని మా జీవితం లేదు. మా జీవితాల్లో, ఆ ఊరితో, ఆ ఇల్లుతో అంతగా పెనవేసుకు పోయింది బామ్మ. మాకే కాదు ఊర్లో అందరికీ ఆమె బామ్మే. చిన్నా, చితకా, పిల్లా, పెద్దా అంతా “బామ్మా” అనే పిలిచేవాళ్ళు. సాయంత్రం అయితే మా ఇంటి వాకిట మెట్లమీద చేరేది. వచ్చే పోయే పిల్లా జెల్లా ఒక్కరినీ వదలకుండా, ప్రతి ఒక్కరినీ పలకరించాల్సిందే, అందర్నీ విచారించాల్సిందే. బామ్మకి గిట్టని వాళ్ళని మాత్రం పలకరించకుండా అట్టే తేరపారి చూసేది. ఎవర్నైనా పలకరిస్తే పలక్కుంటే మాత్రం విసిరే మాటల చురకలూ, ఛలోక్తులూ వాళ్ళకి సూటిగా తగలాల్సిందే. ఎవరైనా పలక్కుండా గమ్ముగా దగ్గరికొస్తే మాత్రం, “ఎవురయ్యా నువ్వా” అంటా తెలిసినా తెలియనట్టే పలకరించేది. అలా ఆ ఊర్లో అందరూ బామ్మకి పరిచయస్తులే.
 
          ఆ ఊరు వచ్చిన రెండు మూడేళ్ళకే నాన్నకి “కావలి” ట్రాన్స్ఫర్ కావటంతో ఇల్లు, పొలం చూసుకునే పన్లు బామ్మకి అప్పగించి మేమంతా “కావలి” కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కావలికెళ్ళిన రెండేళ్ళకే అనూహ్యమైన మార్పులు జరిగి, పరీక్షలు రాసి సెలెక్ట్ అయి తొమ్మిదేళ్ళకే “ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్, కొడిగెనహళ్ళి” లో నన్ను చేర్పించటం, ఎలాంటి దురలవాట్లూ లేని నాన్నకి గొంతు క్యాన్సర్ వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళి పోవటంతో, అందరూ ఉన్నా మాకే అండా లేని ఆ ఊర్లో, బామ్మ మా ఇల్లూ, పొలం చూసుకుంటూ వాటిని మా కోసం మా భవిష్యత్తు కోసం కాపాడుకుంటూ, చాలా ఏళ్ళు పాతబడే దాకా మా కొత్త ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోవలసి వచ్చింది. అందుకనే మేము ప్రతి శలవులకీ “దామరమడుగు” వచ్చి కొద్ది రోజులు బామ్మ దగ్గరుండి వెళ్ళే వాళ్ళం. అప్పుడప్పుడూ బామ్మ “కావలి” వచ్చి మాతో కొద్ది రోజులు గడిపి వెళ్ళేది. 
 
          అలా ఇంజనీరింగ్ చేస్తున్నపుడూ శలవుల్లో బామ్మ దగ్గరికి  వెళ్ళేవాడిని. అప్పటి చిన్ననాటి స్నేహితులంతా చదువుల్లోనో, ఊర్లల్లో వ్యవసాయాల్లోనో చేరి దూరమయి పోయారు. వెళ్తే ఒకరో ఇద్దరో ఇంటికొచ్చి పలకరించేవాళ్ళు. మిగిలిన రోజంతా నేనూ, అన్నా, బామ్మ, అమ్మా, సమయం ఒక మాత్రాన ముందుకి సాగేదే కాదు. రోజులు చాలా పెద్దవిగా అనిపించేవి. నేనూ అన్నా “క్యారమ్స్” ఆడే వాళ్ళం, పొలాల్లోకి వెళ్ళి వచ్చే వాళ్ళం, రేడియోలో పాటలు వినేవాళ్ళం, బీరువా తెరిచి మా చిన్నప్పటి నాన్న గురుతు లు చూసుకునే వాళ్ళం. ఎంత చేసినా ఏం చేసినా రోజు మాత్రం ముందుకి కదిలేది కాదు. అలాంటప్పుడు ఒక్కోసారి కాగితం పెన్నూ తీసుకుని బొమ్మలు మొదలుపెట్టేవాడిని. అన్న ఆ ఊరికి వచ్చే ప్రతిసారీ నెల్లూరు బస్టాండులో “సితార” లేదా “జ్యోతిచిత్ర” సినీ వారపత్రిక కొనేవాడు. దాన్నే రోజూ అటూ ఇటూ తిరగేసే వాడు. అలా అప్పటి ఒక “సితార” పత్రిక ముఖచిత్రం మీద అచ్చయిన ఇంకో సితార “భానుప్రియ” నాట్యభంగిమ ని చూసి వేసిన బొమ్మ ఇది. నేను బొమ్మలు వేస్తానని తెలిసి ఆ ఊర్లో ఒక పిండి మిషన్ ద్వారం గడపకీ నన్ను అడిగి ఎర్రని బొట్లు, పువ్వులు పెయింట్ వేయించుకున్నారు. మా చిన్నాన్న ఇంటి సింహద్వారానికి పసుపు రంగు మీద నాన్న వేసిన ఎర్రని తామర పువ్వులు రంగు వెలిస్తే వాటిపైన నాతో మళ్ళీ అలాగే రంగులు వేయించుకున్నారు. అప్పటికి మనం బొమ్మలు బాగా వేస్తాం అని ఊర్లో ఫ్రెండ్స్ కి, కొంత మంది బంధువులకీ తెలుసు. వాళ్ళెవరైనా వస్తే నేను వేసిన బొమ్మలు చూసేవాళ్ళు, లేదంటే మనకి మనమే ప్రేక్షకులం, అంతే.
 
          ఈ బొమ్మ వేసిన క్షణాలూ గుర్తున్నాయి. ఊరికే సరదాగా టైమ్ పాస్ కోసం బాల్ పాయింట్ పెన్నుతో మొదలు పెట్టిన బొమ్మ. కొంచెం వేశాక బాగా వస్తుంది అనిపించటం తో అలా మొత్తం వేసుకుంటూ వెళ్ళాను, బహుశా రెండురోజులు సమయం తీస్కునుంటా నేమో, కానీ కావలికి వెళ్ళాల్సిన రోజు రావడంతో పూర్తి చెయ్యకుండా నాతో తీసుకుని వెళ్ళిపోయాను. తర్వాత పాదాల కింది భాగం పూర్తి చెయ్యనేలేదు. కొన్నేళ్ళ తర్వాత ఎప్పుడో ఒకసారి కింద పచ్చ గడ్డిలా గీసి అక్కడ మాత్రమే పచ్చని రంగు వేశాను. ఇప్పటికీ సంపూర్ణం అయ్యీ కానీ అసంపూర్ణమయిన బొమ్మ ఇది.
 
          అయితే ఇందులో అప్పటికి కొంత పదునెక్కిన నా పనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమాత్రం పెన్సిల్ వాడకుండా నేరుగా పెన్నుతో సరిదిద్దేందుకు తావు లేకుండా వేసిన బొమ్మ. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండి ఉండాలి. హావభావాలే కాదు, బాడీ ప్రపోర్షన్స్ కొలిచినట్టుండాలి, అందులోనూ నాట్య భంగిమ, ఏ మాత్రం పొల్లు పోయినా విభిన్నంగా అనిపిస్తుంది. అప్పటికే పోస్టర్ కలర్ పెయింటింగ్స్ మొదలు పెట్టి కొంచెం కొంచెం వేస్తూ ఉన్నాను. అందుకనేనేమో ఈ బొమ్మలోనూ ఆ చీరా షేడ్స్ కూడా పెన్నుతోనే అయినా పెయింటింగ్ ఛాయల్లోనే వేశాను.
 
          మామూలుగా నా బొమ్మల్లో హెయిర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని. ఇందులో కూడా పెట్టాను, కానీ ఇంకా పూర్తి కాలా, ఇంకొక రౌండ్ వేస్తే కానీ పూర్తి కాదు. ఇన్నేళ్ళు పూర్తికానిది ఇక ఎప్పటికీ కాదు. ప్రతి ఆర్టిస్ట్ వేసే బొమ్మల్లో కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోతుంటాయి. కారణాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు, కొన్ని పూర్తి కావంతే. ఈ బొమ్మ పూర్తికాక పోవటానికి కారణమేమీ లేకున్నా పూర్తి కాని అసంపూర్ణమైన ఈ బొమ్మ నాకు మాత్రం సంపూర్ణ మైనదే. ఎందుకంటే – నా చిన్ననాటి మా పల్లెటూరి వాతావరణం, మేమందరం కలిసి ఉన్న మా ఇల్లు, ఆ గాలీ, ఆ నేలా, ఆ కాలం, కాలం మోసుకెళ్ళి పోయిన ఆనాటి జ్ఞాపకాలూ, వీటన్నిటినీ ప్రతి గీతలో పదిలంగా పది కాలాలపాటు సంపూర్ణంగా పదిల పరచుకుని, దాచుకుని, చూసిన ప్రతిసారీ కొద్ది క్షణ్ణాలైనా నాకు “పునర్జన్మ” ని ప్రసాదించి కరిగి పోయిన కాలంలో ఘనీభవించి పోయిన అప్పటి తియ్యని జ్ఞాపకాలని మళ్ళీ కదిలిస్తూ, మనసుని తాకి ద్రవిస్తూ…
 
“అసంపూర్ణమైన పనిలోనైనా ఒదిగిన జ్ఞాపకాలు మాత్రం సంపూర్ణమే.” 
 
భానుప్రియ – శ్రావణ మేఘాలు, 1986
Ballpoint Pen on Paper 14″ x 8″
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.