మాతృదేవత?

-ప్రమీల సూర్యదేవర

          నందివర్ధనం, మందార, కనకాంబరాలతో పూలబుట్ట నింపుకుని, ఆ మొక్కలకు నీరుపోసి, పసిపాపల లేత బుగ్గలు నిమిరినట్లు ఆ మొక్కలను ప్రేమతో తాకి,
ఆనందంగా వరండా మెట్లు ఎక్కబోతూ, వరండా వైపు వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపో యింది సుమతి.

          ముగ్గుబుట్టలా నెరసిపోయిన నొక్కులజుట్టు వ్రేలుముడి వేసుకుని, నుదుట కనుపించీ కనుపించకుండా కుంకుమ బొట్టు పెట్టుకుని, ముఖానికి మించిపోయి ఉన్న ట్లున్న కళ్ళద్దాలు, ముదురాకుపచ్చని అంచువున్న కోరారంగు చీరె, మెడలో బంగారు గొలుసు … బహుశః మంగళసూత్రాల గొలుసేమో … వేసుకుని, చేతులకు ఎర్రని మట్టి గాజులు, కాళ్ళకు కిర్రు, కిర్రు మంటున్న చెప్పులతో షుమారు 50-55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతిని చూసి మెట్ల మీద ఆగిపోయి, ఆమెవైపు నిశితంగా చూసి, పూల బుట్ట తీసుకుని లోపలకు వెళ్ళింది సుమతి. లోపలి నుండి బకెట్ నీళ్ళతో బయటకు వచ్చి, మెట్లక్రింద నిల్చున్న ఆమె చేతికి చెంబు ఇస్తూ, “కాళ్ళు కడుక్కోండి” అని చెప్పి, చేతిలో వున్న ఖాదీ టవల్ వరండా పిట్ట గోడ పై వేసింది.

          ఆమె ఆ నీళ్ళతో ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని, పిట్టగోడపై నున్న టవల్తో తుడుచుకుంటూ చుట్టూ చూసింది. చల్లని నీడనిచ్చే వృక్షాలూ, సువాసనలు వెదజల్లే పూలమొక్కలతో ప్రశాంతంగా ఉన్న ఆవరణ చూసి, తనలో నుండి వస్తున్న నిట్టూర్పుని బలవంతంగా అణచుకుని, టవల్ సుమతి చేతికందించాలా … వద్దా … అన్నట్లు పట్టు కుని నిల్చుంది. ఆమె ఆలోచన గ్రహించిన దానిలా సుమతి ఆమె చేతిలో టవల్ అందు కుని, లోపలి నుండి చెక్కకుర్చీ ఒకటి తీసుకుని వచ్చి వరండాలో వేసి, “కూర్చోండి”అని చెప్పి, తాను అక్కడే ఉన్న బల్ల పై కూర్చుని, తాను కాక వేరే వ్యక్తి ఉన్నదనే విషయం మరచిపోయినట్లు చకచకా పూలు మాల కట్టసాగింది. మాలపూర్తిచేసి తలపైకెత్తిన తులసి కుర్చీలో కూర్చున్నావిడ తదేకంగా తననే చూస్తుండటంతో కలిగిన తొట్రుపాటుని అణుచుకుంటూ పూలమాల దేవుని పటానికి అలంకరించి, పెరటి వైపు నడిచింది. పెరట్లో నుండి అరిటాకు కోసుకునివచ్చి, పీటవేసి మంచినీళ్ళ గ్లాసు, చెంబు, ప్రక్కనే పెట్టి , “భోజనానికి లేవండి,” అని పిలిచింది.

          ఆమెకు సుమతి మాట వినిపించిందో లేదో తెలియదు. కదలకుండా అలాగే
కూర్చుని, “నేనెవరో నీకు తెలుసామ్మా?” అడిగింది. ఆ మాట పెగిలి పైకి రావటానికి ఆమె రెండు మూడు పర్యాయాలు గొంతు సరిచేసుకోవలసి వచ్చింది.

          “తెలుసు” నన్నట్లు తల ఊపి ఆమె లేచివస్తేనే గాని కదలనన్నట్లు అలాగే
నిల్చుండిపోయింది.

          “తెలిసే నాకు ఇంత మర్యాద చేస్తున్నావా?” మళ్ళీ ఆమె అడిగింది.

          “ఇంటికి వచ్చిన బంధువులకు మర్యాద చేయాలని మా నాన్న చెప్తారు.”

          ఆమె భోజనం చేస్తుండగా గేటు తీసుకుని పది పన్నెండేళ్ళ వయసు ఉన్న కుర్రవాడు పరుగు పరుగున వచ్చి, రొప్పుతూ సుమతి చేతిలో ఒక పళ్ళెం పెట్టి,” అక్కా ఇదిగో తిరుపతి ప్రసాదం. అమ్మ ఇచ్చి రమ్మన్నది,” అని వచ్చినంత వేగంగా వెళ్ళబోయే వాడు ఆగంతకురాలిని చూసి, వెనక్కు తిరిగి వచ్చి, “ఎవరక్కా ఆవిడ?” గుండు సవరించుకుంటూ గుసగుసగా అడిగాడు.

          సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఇరువురినీ నిరుత్సాహ పరుస్తూ
సుమతి, ప్రసాదం పళ్ళెం తీసుకుని లోపల పెట్టి, తను మాలకట్టగా బుట్టలో మిగిలిన పూలు ఆ కుర్రవాడి చేతికిచ్చి, “అమ్మకు ఇవ్వు” అని చెప్పి అతడిని పంపి వేసింది.

          భోజనం పూర్తిచేసి చేయి కడుక్కుంటూ సుమతివైపు తిరిగి, “కమ్మని భోజనం
పెట్టావు బంగారుతల్లీ” అన్నది.

          సుమతి చివ్వున తలెత్తి ఆమెవైపు తీక్షణంగా చూస్తూ , “నన్నలా పిలవకండి. మా అమ్మ మాత్రమే అలా పిలిచేది.” అన్నది.

          సుమతి అన్న మాటతో ఆమె, కత్తివేటుకి దెబ్బతిన్న బలిపశువులా గిలగిల్లాడి పోయింది. కొద్దిసేపటికి తమాయించుకుని, తన చేతి సంచిలో నుండి ఏదో పొట్లం తీసి సుమతి దగ్గరకు వచ్చి, “ఇది నీకూ తమ్ముడికీ” అని ప్రక్కనే వున్న చిన్న బల్ల పై పెట్టింది.

          “అపరిచితుల వద్దనుండి ఏమీ స్వీకరించ వద్దని మా నాన్న చెప్తారు.” సుమతి
మర్యాదగానే ఆ పొట్లం ఆమె చేతిలో పెట్టింది. ఆమె మారు మాట్లాడకుండా ఆ పొట్లం తనచేతి సంచిలో పెట్టుకుని నెమ్మదిగా వెనుదిరిగింది. అడుగుతీసి అడుగు వేయలేనట్లు అతి ప్రయాసతో కదులుతున్న ఆమె ఆకారం చూసి సుమతికి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. మరచి పోదామని ఎంత ప్రయత్నించినా మరువలేని గతం ఆమె కన్నుల ముందు కదిలింది……………..

          ఆ రోజంతా ఉరుములు మెరుపులతో వర్షం. నాన్న ఊళ్ళో లేరు. నాయనమ్మకు
కీళ్ళనొప్పులు ఎక్కువయ్యాయని మంచం దిగలేదు. వర్షం తగ్గలేదని తమ దినచర్యలకు ఆటంకం కలుగుతుందని విసుక్కుంటూ, గొడుగులు చేతబట్టి కొందరూ, గోనెసంచులు కప్పుకుని కొందరూ, ప్లాస్టిక్ పట్టాలు కప్పుకుని కొందరూ వీలైనంత వరకూ తడవకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ నడుస్తున్నారు. సుమతి మాత్రం అమ్మ తనకు రంగు రంగుల గొడుగు కొన్నప్పట్నుండీ వర్షం కోసం ఎదురు చూస్తుంది. వర్షం ఎక్కువగా వున్నది, ఈ రోజు బడికి వెళ్ళొద్దని తల్లి , లక్ష్మి, అంటున్నా వినిపించుకోకుండా గొడుగు తీసుకుని, తన స్నేహితులకు చూపించాలనే ఆనందంతో రోజూకన్నా ముందుగానే బయలుదేరింది. సుమతి గొడుగు బయటకు తీయగానే తమ్ముడు, జస్సూ … వాడి అసలు పేరు జస్వంత్ . కాని అందరూ ముద్దుగా జస్సూ అని పిలుస్తారు … గొడుగు కావాలని ఏడుపు లంకించుకున్నాడు. వాడికి ఏవో మాయమాటలు చెప్పి, నాన్న ఇచ్చిన చాక్లెట్లు తను తినగా మిగిలినవి వాడికిచ్చి వాడిని విడిపించుకుని ఒయ్యారంగా గొడుగు తిప్పు కుంటూ, గాలి వాటుకి ప్రక్కల నుంచి కొట్టే జల్లువల్ల తడిచిపోతున్నా లెక్కచేయకుండా తన స్నేహితుల కోసం చూసుకుంటూ నడుస్తుంది.

          సుమతి స్నేహితురాలు, రాణీ కూడ రంగు రంగుల గొడుగుతో వచ్చింది. ఇద్దరూ
కలిసి ఒకరి గొడుగుని మరొకరి గొడుగుకు ఆనించుకుంటూ ఆ గొడుగులను గిరగిరా
త్రిప్పుకుంటూ బడికి వచ్చేశారు. వర్షం వల్ల చాలా మంది పిల్లలు రాలేదు, తన గొడుగుని అందరికీ చూపించలేకపోయానే అని సుమతి నిరుత్సాహపడి పోయింది. గంట గంటకూ వర్షం ఎక్కువౌతుందని బడి ముందుగానే వదిలేశారు. వర్షంతోపాటు గాలికూడా విసురుగా వచ్చేస్తుంది. గొడుగు ఎక్కడ ఎగిరిపోతుందోనని పుస్తకాలసంచీ భుజానికి తగిలించుకుని, గొడుగుని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, తడిచిపోతూ ఇల్లు చేరింది.

          “వద్దంటే వినిపించుకోకుండా వెళ్ళావు. ఎలా తడిచిపోయావో చూడు.” సుమతి
జడలు విప్పి తల టవల్తో తుడుస్తూ లక్ష్మి కోప్పడింది. జస్సూ గొడుగు పట్టుకుని ఇల్లంతా తిరిగాడు.

          ఎదురింటి సుభద్ర వర్షం కొంచెం తగ్గుముఖం పట్టగానే పరుగులు పెడుతూ
వచ్చింది. ఆమె ప్రతిరోజూ సుమతి నాయనమ్మకు రామాయణం చదివి వినిపిస్తుంది.

          “ఏం వాన! ఏం వాన! ఈ రాత్రి అంతా ఇలాగే కురిసేలా వున్నది. “ ఆమె తల తుడుచుకుంటూ అన్నది.

          “ఈ వానలో రాకపోతే ఏమయిందే తడిచి ముద్దయిపోయి వచ్చావు.” నాయనమ్మ కోప్పడింది. “గొడుగైనా తెచ్చుకోకపోతివి.”

          సాయంత్రం పాలు పోసే మనిషి రాలేదు. కాఫీ పెట్టుకోవటానికి ప్రొద్దున పాలు ఏమీ మిగల్లేదు. అమ్మ పాలమనిషి కోసం ఇంట్లోకి, బయట వాకిట్లోకి అసహనంగా తిరుగు తుంది. అలవాటైన కాఫీ త్రాగందే నాయనమ్మకు భరించలేని తలనొప్పి వచ్చేస్తుంది. సుభద్ర , రామాయణంలోని అరణ్యకాండ చదువుతున్నా, నాయనమ్మ ధ్యాస అంతా వాకిలి వైపే వున్నది.

          “లక్ష్మీ, కొంచె పాలపొడైనా వేసి కాఫీ కలుపు, తల పగిలి పోతుంది.” కోడల్ని
కేక వేసింది.

          “పాలపొడి నిండుకున్నది.” లక్ష్మి పొడిపొడిగా సమాధానం చెప్పింది. సుమతి
తండ్రి ఊరెళ్ళినప్పట్నుండీ లక్ష్మి ఎందుకో ముభావంగా ఉండ సాగింది. రోజూ పిల్లలకు కధలు చెప్తూ భోజనం పెట్టటం, పడుకో బెట్టటం కూడా మానివేసింది. ముద్దుగా చూసుకు నే జస్సూని కూడా కోప్పడుతుంది. ఏదో పనిచేయబోయి ఏదో చేసేస్తుంది. ముఖం మీద నవ్వు అనేది లేదు. అమ్మ అలా ఉండటం చూసి పిల్లలకు దిగులు వేసింది.

          “ఈ వానలో పాల మనిషి ఇక రానట్లే. ఒక సారిడన్ బిళ్ళైనా ఇవ్వు. వేసుకుని
పడుకుంటా.” కోడల్తో అన్నది కణతలు నొక్కుకుంటూ.

          లక్ష్మి రెండు సారిడన్ బిళ్ళలు సుమతి చేతికిచ్చి, :నాయనమ్మకివ్వు” అని
పంపించింది.

          “కాఫీ త్రాగక పోతే తలనొప్పి ఎందుకొస్తుంది?” నాయనమ్మకు మంచినీళ్ళగ్లాస్ ఇస్తూ అడిగింది సుమతి.

          “అసలే తల పగిలి పోతుంది. నీ ప్రశ్నల్తో నన్ను విసిగించకు.” ముసుగు పెట్టేసింది నాయనమ్మ. సుభద్ర నెమ్మదిగా రామాయణం పుస్తకం చేతబట్టుకుని బయటకు వచ్చే సింది.

          రోజూ రామాయణం చదవటం పూర్తవగానే లక్ష్మి దగ్గర చేరి పిచ్చాపాటీ మాట్లాడే సుభద్ర కూడా లక్ష్మి ముభావంగా ఉండటంతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. సుమతికి వానలో చేతులు చాచి, ‘వానా వానా వల్లప్పా’ తిరగాలని ఉన్నది కాని అమ్మ అసలే కోపంగా ఉన్నదని వరండా చూరులో నుంచి కారే నీటిని చూస్తూ కూర్చుంది. కరెంటు పోతుందేమోనని లక్ష్మి త్వరగా వంటచేసి, అత్తగారికి పిల్లలకు పెట్టేసింది. భోజనాల మధ్యలో కరెంటు పోనే పోయింది. నేనంటే నేనని పోటీపడి, సుమతీ, జస్సూ లిద్దరూ చెరొక కొవ్వొత్తి వెలిగించి భోజనాల గదిలోనూ, హాల్ లోనూ పెట్టారు.

          భోజనాలు పూర్తయిన తరువాత లక్ష్మి పిల్లలిద్దరినీ పడుకోమని చెప్పి, కొవ్వొత్తి తీసుకుని గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. నాయనమ్మ సారిడన్ బిళ్ళల్తో పాటు నిద్రమాత్రలు రెండు వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోతుంది. నిద్రపోతున్న కళ్ళల్లోకి కూడా చొచ్చుకుపోయేంత వెలుగుతో మెరసిన మెరుపుకి సుమతి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. వీధి తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ మెరుపు వెలుగులో తాను చూస్తున్నదేమిటో అంతు పట్టక కళ్ళు నులుముకుని మరొక్కసారి చూసింది. అమ్మ, వేరే ఒక వ్యక్తి చేయి పట్టుకుని మరొక చేత్తో గొడుగు పట్టుకుని నడిచి వెళ్తుంది. అతని చేతిలో అమ్మ సూట్ కేస్ ఉన్నది. దిక్కులు దద్దలిల్లేలా ఉరిమిన ఉరుముకి ఉలిక్కిపడి, సుమతి లేచి బయటకు పరుగు పెట్టింది. కాని వాళ్ళు అప్పటికే గేటు దాటి వెళ్ళిపోయారు. చీకటిలో చీకటి  కలిసిపోయి నట్లు ఇద్దరూ వెళ్ళి పోయారు.

          మరునాడు సుమతికి ఒళ్ళు తెలియని జ్వరం. ఆ జ్వరంలో ఏవేవో కలలు. రాక్షసు లూ, దెయ్యాలూ, భూతాలూ తమను తరుముకొస్తున్నట్లూ, నాన్న ఒక చేత్తో జస్సూని, సుమతిని పట్టుకుని, మరోచేత్తో కత్తి పట్టుకుని, తమవెంట పడుతున్న రాక్షసుల్ని తరిమి వేస్తున్నట్లూ, నాన్న కత్తితో యుద్దం చేస్తూనే అమ్మకోసం మనం వెదుకుదామని చెప్తున్నాడు. ఇంతలో అడవిలో ఒక్కసారిగా మంటలు లేచాయి. రాక్షసులందరూ ఆ మంటల్లో పడి మాడి పోయారు. సుమతీ, జస్సూ, నాన్నా, ముగ్గురూ అమ్మయ్య అని ఒక్కసారి ఊపిరి పీల్చుకుని అమ్మ కోసం కేకలు వేస్తూ తిరుగుతున్నారు.

          “అమ్మ ఇక కనుపించదా నాన్నా?” సుమతి కళ్ళు తెరిచి అడిగింది.

          “లేదు తల్లీ అమ్మ వచ్చేస్తుంది. నీకు జ్వరం వచ్చిందని అమ్మకు తెలియదు. కబురు వెళ్ళగానే అమ్మ వచ్చేస్తుంది.“ నాన్న కిటికీలో నుంచి బయటకు చూస్తూ అన్నాడు.

          నాన్న చెప్పిన మాటల్లో నమ్మకం కుదరలేదు. సుమతికి తెలుసు అమ్మ రాదని. నాయనమ్మ జస్సూని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, మంచం ప్రక్కనే కూర్చున్నది కాని ఆమె చూపులక్కడ లేవు. సుమతి కళ్ళు తెరవగానే, నాయనమ్మ ఏదో మెల్లిగా గొణిగింది. సుమతి ఒళ్ళు తెలియని స్థితిలో ఎన్ని రోజులున్నదో కాని నాయనమ్మ మాత్రం బుగ్గలూ, కళ్ళూ లోతుకు పీక్కుపోయి, ఆమే ఎన్నో రోజులు జ్వరం నుండి కోలుకోలేని దానిలా వున్నది.
సుమతి తండ్రి , పురుషోత్తం సుమతి చేత సగ్గుబియ్యం జావ త్రాగించి, ఆమెను నెమ్మదిగా ప్రక్కమీద నుండి రెండు చేతుల్తో లేపి, ప్రక్కనే వున్న కుర్చీలో కూర్చోబెట్టి , ప్రక్కమీద దుప్పటి మార్చి వేశాడు. జస్సూ దిగులుగా చూస్తూ , మౌనంగా కన్నీళ్ళు కారుస్తూ తండ్రి దగ్గరకు వచ్చి, మెడచుట్టూ చేతులు వేసి, ఆయన భుజం మీద తల వాల్చాడు.

          మరో వారం రోజులకు గాని సుమతి పూర్తిగా కోలుకుని తిరగలేక పోయింది. ఈ
వారం రోజులూ పురుషోత్తం పిల్లలిద్దరినీ కనురెప్పల్లా చూసుకున్నాడు. సుమతి బడికి వెళ్ళే త్రోవలో అందరూ ఎవరో క్రొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూడసాగారు. బళ్ళో అడుగు పెట్టగానే ఆమె స్నేహితులు, కుముద, నీరజ, చందన అందరూ ఏదో గుసగుసగ చెప్పు కోవటం మొదలు పెట్టారు. బళ్ళో తన ప్రక్క బల్లమీద కూర్చున్నే నీరజ తనకు దూరంగా జరిగి, ఒదిగిఒదిగి కూర్చున్నది. అందరి ప్రవర్తనా ఏమిటో వింతగా తోచింది. ఆటల్లో కూడా తనని ఎవరి జట్టులోనూ కలుపుకోలేదు. సుమతితో అస్తమానం దెబ్బలాడే హైమావతి తప్ప మిగిలిన స్నేహితులెవరూ ఆమెతో మాట్లాడలేదు. ఇంటికి రాగానే
పుస్తకాల సంచి గిరవాటువేసి, నాయనమ్మను కౌగలించుకుని భోరుమని ఏడ్చి,మరునాటి నుండి బడికెళ్ళనని మొండి కేసిన కూతురివైపు నిస్సహాయంగా చూడటం మినహా ఏం చేయలేక పోయాడు పురుషోత్తం. బయటకు వెళ్ళగానే ఎవరో ఒకరు, “మీ అమ్మ మిమ్మల్ని వదిలి ఎవర్తోనో వెళ్ళిపోయింది,” అని గేళి చేసేవారు. పెద్దలు మొదలు పిల్లల వరకూ ఏదో ఒకరకంగా ఎద్దేవా చేసేవారు.

          సుమతికి తను చేసిన తప్పేమిటో తెలిసేది కాదు. ఆ బాధ పిల్లల వరకే పరిమితం
కాలేదు. కొందరు పనిగట్టుకుని ఇంటికొచ్చి నాయనమ్మని సూటిగా అడిగేవారు లక్ష్మి ఏమైందని? ఎవర్తో వెళ్ళి పోయిందని? కొందరు, పండంటి పిల్లల్నొదిలి ఎలా వెళ్ళి పోయిందో? నని సానుభూతి చూపేవారు. కొందరు లక్ష్మి ఎక్కడెక్కడో ఎవరికో కనుపించిం దని పురుషోత్తంతో చెప్పేవారు. మరి కొందరు ఏమైనా ఆచూకీ తెలిసిందా? అని  అడిగే వారు. తను పనిచేసే ఆఫీస్ లో తోటి వుద్యోగుల వెకిలి మాటలు, సూటిపోటి మాటలు,
భరించలేక ఆ ఊళ్ళో తలెత్తుకు తిరగలేక పోతున్నామని పురుషోత్తం ఉద్యోగానికి రాజీనామ ఇచ్చేసి, పిల్లల్ని తీసుకుని ఊరు వదిలి వచ్చేశాడు. నాయనమ్మ మాత్రం ఇల్లు వదిలి రానన్నది.

          క్రొత్త ఊళ్ళో తమని తల్లిని గురించి అడిగేవారు లేరు కాని, జస్సూ, సుమతీ కనుపించిన ప్రతి స్తీృలోనూ అమ్మ ఎక్కడైనా కనుపిస్తుందేమోనని గుంభనగా తమ తల్లిని వెదుక్కో సాగారు. బళ్ళో పిల్లలు, మా అమ్మ “నాకు ఇష్టమని జిలేబి చేసిందనో”, “నాకు ఈ రంగు అంటే ఇష్టమని ఆ రంగు లంగా కొన్నదనో,” “నా పుస్తకాలకు అట్టలు వేసి పెట్టిందనో” … అమ్మ గురించి మాట్లాడే సమయంలో సుమతి నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయేది.

          “బంగారుతల్లీ , తమ్ముడిని కొంచెం సేపు ఆడించమ్మా.” “బంగారు తల్లీ, బంగాళా దుంపలు ఒలిచి పెట్టామ్మా.” “మా అమ్మవు కదూ! ఈ గిన్నె పట్టుకెళ్ళి సుభద్ర అత్తకి ఇచ్చిరామ్మా.” అమ్మ మాటలు పదే పదే గుర్తు వచ్చేవి. ఎక్కడికెళ్ళావమ్మా ఎందుకెళ్ళా వమ్మా? అని తనలో తనే కుళ్ళికుళ్ళి ఏడ్చేది. జస్సూ ఒక్కొక్కసారి పెద్దపెద్ద కేకలు వేస్తూ
నిద్ర లేచేవాడు. నాన్న వాడిని దగ్గరకు తీసుకుని తన పక్కలో పడుకోబెట్టుకునేవాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇంకా ఎన్ని రోజులకొస్తుంది? అని వాడు నాన్నను అడిగినప్పు డు నాన్న మౌనంగా ఉండిపోయేవాడు. అందరూ అమ్మని అన్ని మాటలు అంటున్నా నాన్న ఒక్కమాట కూడా అమ్మ గురించి మాట్లాడేవాడు కాదు. తనే అమ్మ–నాన్న అయి ఏ లోటూ రానీయకుండా పెంచాడు ఇద్దరినీ.

          పిల్లల కోసమైనా వివాహం చేసుకోమని నాయనమ్మ ఉత్తరాల మీద ఉత్తరాలు
వ్రాస్తుండేది. చదివి చించివేసేవాడు. సుమతికి యుక్త వయసు వచ్చే కొలదీ నాన్న పడే బాధను అర్ధం చేసుకోగలిగేది.

          “ఏమిటమ్మా లైటు కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావు?”

          పురుషోత్తం లైటు వేసి, “జీవితంలో చేయకూడని, సరిదిద్దుకోలేని, తప్పుచేసి, క్షమించమని అడిగే అర్హతను కూడా పోగొట్టుకున్నాను.” సుమతి చదివి బల్ల పై పెట్టిన కాగితం చూసి, ఏం మాట్లాడుకుండా చించి చెత్తబుట్టలో వేశాడు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.