యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-18

మెల్ బోర్న్ – రోజు 2- క్వీన్ విక్టోరియా మార్కెట్- ఫిలిప్ ఐలాండ్ – పెంగ్విన్ పెరేడ్ టూరు తరువాయి భాగం 

బ్రైటన్ నించి మరోగంట పాటు ప్రయాణించి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతానికి మూన్లిట్ జంతు సంరక్షణాలయానికి (Moonlit Sanctuary Wildlife Conservation Park) చేరుకున్నాం. ఈ పార్కుకి పెద్దవాళ్ళకి 26 డాలర్లు, నాలుగేళ్ళ నించి 17 సం.రాల  పిల్లలకి 13 డాలర్లు టిక్కెట్టు. మా టిక్కెట్లు మా టూరులోనే భాగం కాబట్టి వెళ్ళగానే మాకు టిక్కెట్లు కొనుక్కోనవసరం పడలేదు. కానీ కొండచిలువ, డింగోలనబడే అడవికుక్కలతో ఫోటోలకి మాత్రం టిక్కెట్లు విడిగా కొనుక్కున్నారు సత్య, వరు. 

          రెండున్నరకొకటి, మూడు గంటలకొకటి సెషన్లు అవి. అలాగే కంగారూలకి తినిపించడానికి అంటూ రెండు, మూడు గ్లాసుల మేత కొన్నారు. 

          అప్పటికే అందరికీ కరకరా ఆకలేస్తూ ఉంది. సిరి నడవనని పేచీ పెట్టసాగింది. ఆ హడావిడిలో సిరి చేతిలో ఉన్న ఐ- ప్యాడ్ కాస్తా కిందపడి స్క్రీన్ పగిలిపోయింది. ఇక తన పేచీ తారాస్థాయినందుకుంది. ఆ పిల్లని ఊరుకోబెట్టడానికి నానాపాట్లు పడ్డాం. అయితే గట్టిగా ఏడవడం వంటివి చెయ్యదు కనుక ఏదో రకంగా నచ్చచెప్పాం. 

          ఎంట్రన్స్ నించి పార్కు మధ్యగా నడిస్తే ఉన్న చిన్నసరస్సుకి ఓ పక్కగా ఉన్న  కేఫే, గిఫ్ట్ సెంటర్లో లంచ్ గా దొరికిన బర్గర్లు, కేకులు, చిప్సు ప్యాకెట్ల వంటివన్నీ కొనుక్కుని ఆదరాబాదరా తిన్నాం. 

          అక్కడ సరిగా సమాచారం అందించనందువల్ల, మాకు తినడానికి సమయం సరిపోకపోవడం వల్ల నిజానికి రెండు గంటలకి జంతువుల షో మిస్ అయ్యాము. 

          రెండున్నరకి కొండచిలువతో ఫోటో అంటే మేం సరిగా చూసుకోకుండా డింగోలతో ఫోటో అనుకుని అటు నడిచాం. సరస్సు చుట్టూ ఉన్న ప్రధానమైన పార్కు ఏరియాలో ఒక వైపు కొండచిలువ ఉంటే, పూర్తిగా రెండో వైపు ఈ డింగోలుంటాయి. అలా వెనక్కి, ముందుకీ వెళ్ళడం వల్ల మిగతావేవీ చూడడానికి లేకుండా సమయం వృథా అయ్యింది మాకు. మొత్తానికి కొండచిలువతో ఫోటోకి పెద్ద లైనులో చివర్న నిలబడ్డారు. రెండు టిక్కెట్లకి ఇద్దరే వెళ్ళాల్సి ఉంది. అయితే ఆ లైను, ఈ ఫోటో సెషను చెట్టుకిందే కావడం వల్ల తమ వంతు వచ్చేసరికి అందరూ నచ్చినంత మంది వెళ్ళి ఫోటో తీసుకోసాగేరు. ఇక్కడ మన ఫోన్లతో మనమే ఫోటో తీసుకోవాలి. కొండచిలువ ట్రైనర్ దాన్ని ఫోటో తీసుకునేవారి మెడలో వేస్తూ, తీస్తూ ఉంటాడు. లెక్కగా రెండు టిక్కెట్లు అయితే ఇద్దరికే మెడల్లో వేస్తాడు. మా వంతు రాగానే వరు, సత్య వెళ్ళే సరికి సిరి కూడా చివరలో పరుగెత్తి పాము తోక పుచ్చుకుని ఫోటోకి ఫోజు యిచ్చింది. ఇక నేను ఫోటోకి ఏదో రకంగా చెయ్యివేసి నిలబడ్డాను కానీ పాముని మెళ్ళో వేసుకునే సాహసం చెయ్యలేకపోయాను. 

          ఇక డింగోలతో ఫోటో అంటే దాదాపు 30 ని. ల క్లాసు కూడా ఉంది. అవి అడవి మృగాలు కాబట్టి టిక్కెట్టు కొనుక్కున్న వారిని తప్ప ఎవరినీ లోపలికి రానివ్వలేదు. పెద్దగా లైనేమీ లేదు ఇక్కడ. ఎంట్రన్స్ లో సత్య బదులు సిరి వెళ్తానని పేచీ పెట్టి ధైర్యంగా వాళ్ళక్క చెయ్యి పట్టుకుని వెళ్ళింది. మేం రెయిలింగ్ కి ఇవతల దూరంగా నిలబడి చూడసాగాం. ముందు వెళ్ళిన వాళ్ళకి కాస్సేపు ట్రైనింగు ఇచ్చి మరీ ఫోటోలు తీసుకునే అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా అతి జాగ్రత్తగా, నిశ్శబ్దంగా ఉండాలి వెళ్ళినవారు. అవి వాటంతట అవిగా వచ్చి పక్కన కూచుంటాయి ఫోటోకి. మేం బయటి నించి ఊపిరి బిగబట్టి చూడసాగాం. మా పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటూ అతి లాఘవంగా ఫోటోలు తీసుకున్నారు. ఆ తరవాత వాళ్ళు బయటకి  రావడానికి కూడా కొంచెం సమయం పట్టింది. బయటికిరాగానే సిరి సంతోషం చూడాలి! 

          ఈ పార్కులో కంగారూలు, వాలబీలు వంటి వాటితో బాటూ వామ్ బాట్ లు అనబడే బొచ్చు పిల్లుల వంటివి, టాస్మేనియన్ డెవిల్స్ అనబడే నల్లని నక్కల వంటి జంతువు లని చూసేం. ఈ టాస్మేనియన్ డెవిల్స్ కేవలం టాస్మానియాలో మాత్రమే ఉంటాయట. టాస్మానియా ద్వీపం ఆస్ట్రేలియాలోని రాష్ట్రమే. ఇక్కడ ప్రపంచంలో మరెక్కడా లేని వింత జంతువులు ఉండడం విశేషం. అందులో ఒకటి ఈ టాస్మేనియన్ డెవిల్. 

          ఇక ఆ పార్కులో మామూలుగా ఉండే పక్షులు, బాతులు సరేసరి. విరివిగా ఉన్నాయి. అక్కడున్న కంగారూలు తక్కువ, మేత పెట్టేవారు ఎక్కువ అయిపోవడంతో మేం పట్టుకెళ్ళిన మేత తినడానికి అసలు ఒక్క కంగారూ కూడా దగ్గిరికి  రాలేదు. మొత్తానికి ఎలాగో ఒక కంగారూని పట్టుకున్నాం. 

          అయినా మొత్తానికి బాతులకి మిగిలిన మేత పెట్టి వచ్చారు పిల్లలు. అవి మాత్రం ఆదరాబాదరా తిన్నాయి. 

          అక్కణ్ణించి అయిదు గంటల ప్రాంతంలో గోదారి లంకల మీద ఒక లంక నించి మరో లంకకి వేసినలాంటి చిన్న బ్రిడ్జి మీదుగా ఫిలిప్ ఐలాండ్ కి చేరుకున్నాం. 

          ఒక పక్క సాయంత్రపు వెలుతురు దేదీప్యమానంగా ఉన్నప్పటికీ చలి బాగా పెరిగింది. దారిపొడవునా మోకాటి ఎత్తు గడ్డి, అందులో నుంచి ప్రశ్నార్థకంగా అక్కడక్కడా మెడలు ఎత్తి చూస్తున్న కంగారూలు!  మొదటిసారి త్రోవ పొడవునా కంగారూల్ని చూడడం భలే అనుభవం! మొదటి స్టాపు పిరమిడ్ రాక్ లుక్ అవుట్ (Pyramid rock look out). వ్యాను దిగేసరికి మనుషులు ఎగిరిపోయేంత విసురుగా చలిగాలి వీచసాగింది. అక్కణ్ణించి కొండవాలు మీదుగా సన్నని రహదారిగుండా కొండ కొనకి నడిచి, అక్కణ్ణించి సముద్రంలో ఒంటరి ద్వీపమై ఎవరికోసమో ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నట్లున్న పిరమిడ్ రాక్ ని దర్శించడం ఆ రోజు ఒక సాహసం అనే చెప్పాలి. 

          వెళ్ళిరావడానికి పదిహేను నిముషాల కంటే ఎక్కువే పడుతుంది. పిల్లలు వ్యానులో ఉండిపోయారు కానీ నేను, సత్య మిగతా అందరితో బాటూ పరుగున వెళ్ళి చూసొచ్చాం. నిజానికి ఆ చలిగాలి లేకుండా, వెచ్చగా ఉండి ఉంటే చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం అయి ఉండేది. జుట్టు పుచ్చుకుని ఎవరో విసురుగా లాక్కెళుతున్నట్లు గాలి భయంకరంగా వీచసాగింది. పైగా విపరీతమైన చలి. అదృష్టం కొద్దీ నేను, వరు చెరో స్వెట్టరు తెచ్చు కున్నాం. అంతేకాకుండా కాలిఫోర్నియాలో అలవాటు చొప్పున లేయర్లుగా వేసుకున్నాం. సత్య, సిరి మాత్రం మాకొద్దంటే మాకొద్దని వదిలేసొచ్చారు. నేను ఎందుకైనా మంచిదని మరొకటి కూడా తెచ్చాను. కానీ నేను ఫుల్ పాంట్ వేసుకోకుండా సముద్రతీరం కదా నీళ్ళలో దిగాల్సి వస్తుందేమోనని మోకాళ్ళ కిందికి వచ్చే పొడవు షార్ట్ వంటిది వేసు కున్నాను. అది ఎంత తప్పో అక్కడ బాగా తెలిసి వచ్చింది. రాత్రి పదిగంటల సమయం లో పెంగ్విన్ సముద్ర తీరంలో కుట్టిన దోమ కాట్లు ఇంటికి వచ్చాకా కూడా చాన్నాళ్ళు బాధ పెట్టేయి. కాబట్టి వేసవి కదా అని నిర్లక్ష్యం చెయ్యకుండా ఇటు వంటి ప్రాంతాలకి వెళ్ళినపుడు ఒంటి నిండా బట్టలు, చలి ఆగడానికి అనువైన స్వెట్టర్లు, కోట్లు వంటివి వేసుకుని వెళ్ళాలి అని పాఠం నేర్చుకున్నాం. 

          అక్కణ్ణించి సమ్మర్ ల్యాండ్స్ అనే తీరంలో నోబిస్ ఓషన్ డిస్కవరీ సెంటర్ (Nobbies Ocean Discovery Centre) అనే చోట ఆగేం. బయట పార్కింగులోని చిన్న గుట్ట మీద వందలాది సీగల్ పక్షులు కువకువలాడుతూ ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే పెద్ద హాల్లో ఒక పక్కగా అంటార్కిటికా విశేషాలకి సంబంధించిన చిన్న మ్యూజియం, ఒక  పక్క గిఫ్ట్ షాపు, మరో పక్కగా చిన్న కాఫీ, ఐస్ స్క్రీము, చిప్సు వంటివి అమ్మే స్నాక్ షాపు ఉంది.  సముద్ర తీరం కనబడేటట్టు అటు వైపు మొత్తం అద్దాల గోడ, అందులో నుంచి సూటిగా పడుతూ హాలంతా దేదీప్యమానంగా వెలిగిస్తున్న సాయంత్రపు సూర్యకిరణాలు. హాయిగా, వెచ్చగా అనిపించిన ఆ చోట వేడి వేడి కాఫీ తాగుతూ మేమిద్దరం, చలచల్లని ఐస్ స్క్రీము తింటూ పిల్లలు కాస్సేపు సముద్రాన్ని చూస్తూ మైమరిచాం. వస్తూ వస్తూ గిఫ్ట్ షాపులో చిన్న పెంగ్విన్ బొమ్మలు, కీ చెయిన్లు వగైరా కొన్నాం. అక్కడ స్వెట్టర్లు తొడుక్కు న్న పెంగ్విన్ బొమ్మలు అమ్మడం ప్రత్యేకత.  

          మళ్ళీ రాత్రికి ఆ దగ్గర్లోనే పెంగ్విన్లని చూడ్డానికి వస్తామని చెప్పింది మా గైడు. 

          అక్కణ్ణించి రాత్రి భోజనం చెయ్యడానికి ఆరున్నర కల్లా ఫిలిప్ ద్వీపమ్మీదే మరో వైపున ఉన్న కౌవ్స్ (Cowes) అనే ఊరికి చేరుకున్నాం. రెస్టారెంట్లు, గిఫ్ట్ షాపులు ఉన్న రెండు, మూడు వీథులన్నీ రెండేసి సార్లు తిరిగి మొత్తానికి పార్కింగ్ సంపాదించింది మా డ్రైవరు. మా వ్యానులాగే బోల్డు టూరిజం వ్యానులు అక్కడికి వస్తున్నాయి. 

          సాయంత్రపు భోజన సమయం కాకపోయినా అందరితో తినాల్సి రావడంతో పిల్లలు పిజ్జా అనగానే సరేనని అటు దారితీశాం. అక్కడ ఎక్స్ ప్రెస్ గోర్మెట్ పిజ్జా అన్నిటికన్నా గొప్ప పిజ్జా దుకాణం అని డ్రైవరు చెప్పిన చోటికి వెళ్ళి ఆర్డర్ చేసాం. సగం ఇండియన్ దుకాణం లానే ఉంది. పైగా మెనూలో బట్టర్ చికెన్ పిజ్జా అని కనబడడంతో అటు మొగ్గు చూపి సగం వెజ్, సగం నాన్ వెజ్ ఆర్డర్ చేసాం. వెజ్ క్షణంలో ఖాళీ చేసేసి, బట్టర్ చికెన్ మాత్రం అక్కడక్కడా ముక్కలు కొరికి వదిలేసారు పిల్లలు. ఏమన్నా అంటే అదసలు పిజ్జా లాగే లేదని జవాబు! అదన్నమాట సంగతి! 

          ఇంకాస్సేపు సమయం ఉండడంతో  అక్కణ్ణించి సముద్ర తీరం కనిపించే వరకు దుకాణాలన్నీ చూస్తూ నడవసాగేం. మధ్యలో ఇటాలియన్ ఐస్ క్రీము అంటూ అటు పరుగెత్తారు పిల్లలు. చుట్టూ ఏవో దుకాణాలు ఉన్నాయి కానీ అన్నీ మూసేసి ఉన్నాయి. తెరిచి ఉన్న ఒకట్రెండు గిఫ్ట్ షాపుల్లోనే జనం బాగా ఉన్నారు. కానీ ఏవీ నాణ్యత లేక అక్కడేం కొనలేదు. 

          అక్కణ్ణించి వ్యానెక్కి మొత్తానికి ఎనిమిదిన్నర ప్రాంతంలో పొద్దుట్నించి ఎదురు చూస్తున్న పెంగ్విన్ పెరేడ్ అనే చోటికి వచ్చాము. పార్కింగ్ లాటులోనించి నెంబర్లు వేసి ఉన్న నడకదారులున్నాయి. మాది నెంబరు ఒకటి. ఆ నంబరు గుర్తు పెట్టుకోమని మరీ మరీ చెప్పింది డ్రైవరు. ఎందుకో వచ్చేటపుడు అర్థం అయ్యింది. అన్నీ ఒక్కలాగే ఉన్న దారుల్లో చాలా సులభంగా తప్పిపోతామక్కడ. 

          అక్కణ్ణించి ఐదునిమిషాల నడకలో విశాలమైన ఎంట్రన్సు లాబీ దగ్గిరికి వెళ్ళాం. అక్కడే టిక్కెట్లు వగైరాలన్నీ తీసుకోవాలి. చుట్టూ బోల్డు మంది జనంతో గిఫ్ట్ సెంటరు, ఇన్ఫర్మేషన్ సెంటరు కిటకిటలాడుతున్నాయి. 

          మేం మా గైడుని అనుసరించేం. అక్కడ సాధారణమైన వ్యూపాయింట్లు, పెంగ్విన్ ప్లస్ వ్యూపాయింట్లు ఉంటాయి. మేం పెంగ్విన్ ప్లస్ టిక్కెట్లు ప్యాకేజీ టూరు ద్వారా రిజర్వు చేసుకున్నాం. బీచ్ ఇసుకలో చెక్కతో నిర్మించిన రహదార్లు ఉన్నాయి. సాధారణ టిక్కెట్లు వేరే దారిలో, పెంగ్విన్ ప్లస్ వాళ్ళు వేరే దారిలో వెళ్ళాలి. పెంగ్విన్ ప్లస్ అంటే పెంగ్విన్లని దగ్గరనించి చూడవచ్చన్నమాట.  

          తీరానికి దాదాపు వంద మీటర్ల దూరంలో ఎత్తుగా మెట్లతో ఓపెన్ స్టేజీలాంటిది నిర్మించి ఉంది అక్కడ. అక్కడ సముద్రం వైపు తిరిగి కూర్చోవడానికి మెట్లు ఉన్నాయి. వరుకి, నాకు ముందు రెండో వరుసలో సత్యకి, సిరికి నాలుగో వరసలో సీట్లు దొరికాయి. స్టేజీ కిందన అండర్ గ్రౌండ్ లో నుంచి చూసే అవకాశం కూడా ఉంది. 

          అయితే ఆ దగ్గర్లో ఇసుక మేటలు వేసి ఉండి అక్కడక్కడా పొదలు పెరిగి ఉన్నాయి. అందువల్ల పెద్ద పెద్ద దోమలు ఉన్నాయక్కడ. ఆ హడావిడిలో పట్టించుకోలేదు కానీ నాకు కాళ్ళ మీద పెద్ద నాణెమంత దోమకాట్లు కనిపించాయి బస్సెక్కేసరికి. తగ్గడానికి నెలపైగా పట్టింది. 

          ఇక ఈ స్టేజీకి ఒక పక్కగా చిన్న గడ్డి కొండ ఉండడంతో విసరుగాలి లేదు కానీ చలి మాత్రం అదరగొడుతూ ఉంది. ఉన్న స్వెట్టర్లలో దళసరి స్వెట్టరు సిరికి కప్పేసి, మేం ఉన్నవేవో వేసుకుని సర్దుకున్నాం. రాత్రి తొమ్మిది గంటల సమయంలో చీకటి పడసాగింది. అప్పటి నించి సముద్రంలో నుంచి పెంగ్విన్లు గుంపులుగా గునగునా నడుస్తూ వచ్చి ఆ చుట్టుపక్కల గూళ్ళకి చేరతాయన్నమాట. 

          ఆ స్టేజీ మీద ఉన్న లేత వెలుతురు లేకపోతే వాటిని చూడడం అసాధ్యమే. ఫోటోలు, వీడియోలు తియ్యవద్దని, వాటిని బెదరగొట్టవద్దని, నిశ్శబ్దంగా ఉండమని అక్కడ కాపలా ఉన్న వాళ్ళు హెచ్చరించ సాగారు. అయినా కొందరు ఫోటోలు తీస్తూనే ఉన్నారు. 

          ఇక పెంగ్విన్లు వందలాదిగా గుంపులుగా వస్తాయనుకున్న మాకు అడియాసే అయ్యింది. ఒక్కోసారి ఓ పది, పదిహేను కలిసి పేరంటానికి వస్తున్నట్టు రాసాగేయి. మహా అయితే మొత్తం కలిపి ఓ వందా, రెండు వందలు వచ్చి ఉంటాయి ఆ రోజు. ఇంతకంటే జూలలోనే పెంగ్విన్లని బాగా చూడొచ్చు. పెంగ్విన్ పెరేడ్ అంటూ బాగా డబ్బు గుంజుతు న్నారని అనిపించింది. కావడానికి వేసవి అయినా ఒక పక్క విపరీతమైన చలి. సరిగ్గా పదిహేను నిమిషాలలో జనం ఓపిక లేక వెళ్ళిపోసాగేరు. మేం మహా అయితే అరగంట పాటు ఉండగలిగాం ఆ చలిలో. సిరి మాత్రం చలైనా పెంగ్విన్లని ఆసక్తిగా చూసింది. అక్కడ ఫోటోలు తీసే వీలు లేదని మొదట అంతా బెదిరించిన పార్కు సిబ్బంది జనం లేచి వెళ్ళిపోతుండేసరికి మారుమాట్లాడకుండా ఊరుకున్నారు. చివర్లోనూ, దారి పొడుగునా కనబడ్డ పెంగ్విన్లని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు మిగిలిన వాళ్ళు. మాకు ఆ మాత్రమైనా కనిపించాయి, సాధారణ టిక్కెట్టుకి అవీ కనబడలేదని వాపోయారు మాతో వచ్చిన కొందరు. 

          పది గంటలకల్లా వ్యాను బయలుదేరింది. తిరిగి అర్థరాత్రి పన్నెండు ప్రాంతంలో మెల్ బోర్న్ సిటీకి తిరిగి వచ్చాము. అందరికీ ఇచ్చినట్లే భారీ టిప్పు ఇచ్చినా ఈ వ్యాను డ్రైవరు మా హోటలు ఉన్నది డాక్ ల్యాండ్స్ లో కాబట్టి దూరం, అని చెప్పి పొద్దున్న మమ్మల్ని ఎక్కించుకున్న చోటే అంటే దాదాపుగా మా హోటలుకి మూడు మైళ్ళ దూరంలో జంక్షనులో వదిలేసింది. నిజానికి అందరినీ దించి మమ్మల్ని చివరన వదిలినా ‘సరే’ అని సరిపెట్టుకుని వాళ్ళం. బతిమాలాడినా లాభం లేకపోయింది.  

          అర్థరాత్రి పూట అక్కణ్ణించి ఊబర్ దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఊరుగాని ఊళ్ళో మా పరిస్థితి ఏవిటి? సిరి నిద్రలో జోగుతూ ఉన్నా పాపం పేచీ పెట్ట కుండా మాకు జేరబడి నిల్చుంది. మొత్తానికి హోటలుకి చేరేసరికి ఒంటి గంట అయ్యింది. ఆ ప్రయాణంలో అది మాత్రం మాకు గొప్ప చేదు అనుభవం. ప్యాకేజీ టూరు వాళ్ళు లోకల్ టూరు వాళ్ళకెవరికో అప్పగిస్తారు. ఆ లోకల్ టూరు వాళ్ళు చేసే నిర్వాకం ఇదీ! ఆ లోకల్ టూరు కంపెనీ పేరు గో వెస్ట్ టూర్స్. ఇకమీదట ఇలాంటి టూర్లలో పికప్, డ్రాప్ ఆఫ్ పాయింట్లు ముందే వివరంగా తెలుసుకునే బుక్ చేసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాం.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.