యాదోంకి బారాత్-20

-వారాల ఆనంద్

ముగింపులేని ముసురుండదు-తెరిపి దొరకని కష్టముండదు

“అలలు అలలుగా
దశలు దశలుగా
సాగుతున్న బతుకులో
ఏ కాలపు సౌందర్యం ఆ కాలానిదే
ఎప్పటి అవసరం అప్పటిదే..”

          అందుకే బతుకులో ఒక కాలం మంచిది మరొకటి చెడ్డది అంటూ వుండదు. కాలం
ప్రవాహంలా సాగుతూనే వుంటుంది. మనమే ఓ క్షణం నిలబడతాం, మరో క్షణం
పరుగెడుతాం.. ఇంకోసారి కూలబడతాం. తిరిగి లేస్తాం. జీవితమంటే ఇంతే మరి. ఆ
దిశలో 1986 సంవత్సరం నాకు సంతోషాన్నీ వేదననీ కలగలిపి ఇచ్చింది. రోజూ
గోదావరిఖనికి కాలేజీకి వెళ్ళి వస్తూ వుండేవాన్ని. అక్కడి స్నేహాలు సహోద్యోగులూ ఒక భాగం. ఇటు కరీంనగర్ లో కరీంనగర్ ఫిలిం సొసైటీ సినిమాలూ కార్యక్రమాలూ. ఇంట్లో చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ, అమ్మ అనారోగ్యం అన్నీ అంతా వొత్తిడిగా తీరిక లేకుండావుండేది.

          కఫిసోలో ఆ సంవత్సరం చాలా సినిమాలే చూసాను. ముఖ్యంగా ఉమ్రావో జాన్,
ప్యాసా, నవరంగ్ లాంటి క్లాసిక్స్ చూసాం. ఇంకా గోధూళి, సామ్నా, అందీగలీ లాంటి అనేక సినిమాల్నీ చూసాం. ఒక రకంగా గురుదత్ బాగా పట్టేసాడు. దామోదర్, నేనూ శ్రీనివాస్, సంతోష్, నారదాసు లాంటి మిత్రులం గురుదత్ తీసుకున్న కథాంశాలూ, చిత్రీకరణ పద్దతుల పై ఎన్నో సార్లు ఎంతో మాట్లాడుకున్నాం. ‘అందీగలీ’ మాకో పెద్ద చర్చనీయాంశ మయిన సినిమా అయిపొయింది. అప్పుడు ఎవరి వాదన ఎట్లా సాగిందో ఇప్పుడు చెప్ప లేను కానీ ఆ సినిమాలు గొప్ప మేలుకొలుపు. అదే సంవత్సరం చాప్లిన్ ద గ్రేట్ డిక్టేటర్,
సిటీ లైట్స్ కూడా చూసాం. లాంగ్ షాట్ లో హాస్యం- క్లోసప్ లో అంతులేని దుఖం. చాప్లిన్ లోని ఆత్మను ఆర్థం చేసుకున్న సందర్భం.

          వార్షికోత్సవాల్లో ప్రఖ్యాత రచయిత రావూరి భరద్వాజ చేసిన భావోద్వేగ ప్రసంగం చాలా కాలం పాటు చెవుల్లో గింగురు మంటూనే వుంది. ఆయన గంభీర స్వరం అనితర సాద్యం. అప్పటికే నేను ‘పాకుడు రాళ్ళు’ చదివి వున్నాను. తర్వాతి కాలంలో ఆయన ‘నాలోని నీవు’ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. 

          సినిమాలు చూడడం కొనసాగుతూ ఉండగానే కవిత్వం కథలూ నవలలూ చదవడం కూడా జీవన గమనంలో భాగమయి పోయాయి. ఎందుకంటే సినిమాలూ సాహిత్యమూ
వేర్వేరు కాదన్నది నాకు అప్పటికీ ఇప్పటికీ వున్న ధృడమయిన అభిప్రాయం.సీరియస్ సినిమాతో పాటు సీరియస్ సాహిత్యమూ అత్యంత ప్రభావవంతమయినదన్నది కూడా నాకున్న విశ్వాసం. సాహిత్యం రాయడం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా మంది చేస్తున్నారు, ఇక మంచి సమాంతర సినిమాల్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాల్సిన అవసరం వుందని అనుకున్నాను. ఆ బాధ్యతను తీసుకోవాలని కూడా అప్పుడే నిర్ణయించుకు న్నాను. ఫలితంగానే ఫిలిం సొసైటీ ఉద్యమంలో పనిచేయాలని ముందుకు సాగాను.

          గొప్ప అర్థవంత మయిన సినిమాల్ని మనం చూడడమే కాకుండా ఎక్కువ మంది చూసి ఆలోచించే పని చేయాలన్నదే తపన. అంతే కాకుండా ముఖ్యంగా బాలలను చెత్త సినిమాల నుండి దూరం చేయాలని కూడా అనుకున్నాను. నాతో పాటు మిత్రులు కూడా. ‘బాలల చలన చిత్రోత్సవాలు’ నిర్వహించడం కూడా ఫిలిం సొసైటీ ఆక్టివిటీ లో ముఖ్యాంశంగా చేసుకున్నాం. ప్రతి నవంబర్ నెలలో కరీంనగర్ పట్టణంలోనే కాకుండా
జిల్లాలోని పలు గ్రామాల్లో పిల్లల కోసం సినిమాలు వేశాము.

          అదట్లా వుంటే సాహిత్యాధ్యయనంలో భాగంగా ‘స్వాతి’ మాస పత్రికలో నెల నెలా అనుబంధంగా వెలువడ్డ అనేక నవలల్ని చదవేవాణ్ని. ఆంపశయ్య నవీన్ రాసిన అనేక నవలలు స్వాతిలోనే చదివాం. ఇక 1986 మే నెలలో వెలువడ్డ ‘మరపురాని పాప’ నవల నా పైనా మా మిత్రుల పైనా గొప్ప ప్రభావాన్ని చూపించింది. సుజాత-నటరాజ్ లు రాసిన ఈ నవల వారి పాప సృజన వాహిని నైటింగేల్ జీవిత కథ. మృత్యువు చాలా క్రూరంగా ఆ పాప పసిడి మొగ్గలా ఉన్నప్పుడే కాటేసింది. విరిసీ విరియక ముందే ఆ పాపను నలిపెసిం ది. ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరించిన ఆ పాప అకాల మృత్యువు  పాలవడంతో ఆ తల్లి దండ్రులు తల్లడిల్లి పోయారు. జీవితం శూన్యమయినంతగా దుఃఖ పడ్డారు. కానీ అంతటితో ఆగకుండా ఆ పాప గురించి ఎలాంటి అతిశయోక్తులూ లేకుండా ఆర్ద్రంగా రాసిన నవల ఇది. ఆ నవల చదివి మేమంతా కదిలిపోయాం. కరిగిపోయాం. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో స్టేనోగ్రాఫ్రర్ గా పని చేసిన నటరాజ్, సుజాతలు తర్వాత ఏమయినా రాసారో లేదో తెలీదు. కానీ ‘మరపురాని పాప’ గొప్ప నవలగా మిగిలి పోయింది. ఇప్పటికీ ఆ నవల నా మదిలో స్థిరంగా ఉండిపోయింది.

***

          ఇక ఇంట్లో ఇందిరతో పెళ్ళి ఏర్పాట్లు మొదలయ్యాయి. 10 డిసెంబర్ న వరంగల్ లో పెళ్ళి. మా అమ్మా నాన్నల కోరిక మేరకు సంప్రదాయకమయిన పెళ్ళి. పెళ్ళి పత్రిక లూ అవీ ముద్రించడానికి నేనే చొరవ తీసుకున్నాను. 

          అప్పటికే హైదరాబాద్ చేరుకున్న అలిశెట్టి ప్రభాకర్ చిక్కడపల్లిలో ఉండేవాడు. ఆయన్ని కలిసాను. ప్రముఖ ఆర్టిస్ట్ గోపితో పెళ్ళి పత్రిక రాయించి ప్రింటింగ్ బ్లాక్ చేయించాను. కరీంనగర్ లో అప్పటికి ఆ వసతి లేదు. హాండ్ మెడ్ పేపర్ మీద ముద్రిం చడం కూడా గుర్తు. కొందరు మిత్రులు బాగుందన్నారు. మరికొందరు మౌనంగా వున్నారు.

వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రికి దగ్గరలో జరిగిన పెళ్ళికి అనేక మంది బంధు మిత్రులు హాజరయ్యారు. 

ఫిలింసొసైటీ నుంచి దాదాపు అంతా పాల్గొన్నారు. వరంగల్ లో వున్న సాహితీ మిత్రులు, లైబ్రరీ సైన్స్ మిత్రులు సంపత్ కుమార్, ఉమాశంకర్ లతో పాటు పీడీ మధు తదితరులు అనేక మంది సహోద్యోగులూ హాజరయ్యారు. ముఖ్యంగా వరంగల్ ఫిలిం సొసైటీ అధ్యక్షు డిగా వున్న అంపశయ్య నవీన్, కఫిసో అధ్యక్షుడు డీ. నరసింహా రావులు హాజరయ్యారు. వాళ్ళు మాకు కాలేజీలో అధ్యాపకులు కూడా. తర్వాత డీ.నరసింహా రావు గురించి మాట్లాడుతూ ఒకసారి నవీన్ చెప్పారు. తను నా పెళ్ళికి వచ్చినప్పుడు ‘కరీంనగర్ లో ఇదే సమయానికి ఒక ప్రముఖుడి ఇంట్లో పెళ్ళి వుంది కదా అక్కడే ఉండకుండా వరంగల్ వచ్చావెం అని అడిగితే గొప్పవాళ్ళు పెద్ద వాళ్ళు అని కాదు మనలను కావాలనుకునే వాళ్ళ దగ్గరికి రావడం నాకిష్టం అన్నాడని. అదీ సార్ పెద్ద మనసు.

          పెళ్ళి విందు, అప్పగింతలూ అన్నీ ముగించుకున్నాక కరీంనగర్ కు వచ్చేసాం.
తర్వాతి రోజు పెళ్ళి రిసెప్షన్. మంకమ్మతోట ఇంట్లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయమే నేను లేచి టీ తాగుతున్నాను. దామోదర్ వచ్చాడు. రా చాయ్ తాగుదాం అని పిలిచాను. లేదు నువ్వే బయటకురా అని పిలిచాడు. నా కర్థంకాలేదు. ఓ పక్కకు తీసుకెళ్ళాడు. మెల్లిగా గుస గుసగా చెప్పాడు. ‘రాత్రి నరసింహా రావు సార్ చనిపోయాడు’ అన్నాడు. నాకు పెద్ద షాక్.. నేనేమీ అడక్కుండానే రాత్రి సెయింట్ జాన్ స్కూలు వద్ద స్కూటర్  ప్రమాదంలో అక్కడికక్కడే పోయాడు. అందరమూ అక్కడికి వెళ్తున్నాం. అన్నాడు. నేనూ
వస్తానన్నాను. నువ్వెట్లా వస్తావు. పెళ్ళి బట్టలే ఇంకా తీయలేదు అన్నాడు. ఇంతలో నాన్నవచ్చి ఏమి జరిగింది అన్నాడు. దామోదర్ విషయం చెప్పి ఆనంద్ వస్తానంటు న్నాడు నేను వద్దంటున్నాను అన్నాడు. ఇంట్లో అంతా కూడదన్నారు. ఏమీ చేయలేక కుమిలిపోయాను.

          ఆ సాయంత్రం రిసెప్షన్ లో దాదాపు మామూలుగానే వుండే ప్రయత్నం చేసాను.
కష్టంగా నవ్వుతూనే గడిపాను. పెళ్ళికి వచ్చిన వాళ్ళు రాలేక పోయిన వాళ్ళూ చాలా మంది వచ్చారు. సిరిసిల్ల నుండి రుద్ర రవి, ఫసి తదితర మిత్రులు, ఎం.లక్ష్మన్ రావు, నర్సయ్య బి.నారాయనరెడ్డి తదితరులు, గోదావరిఖని నుండి తిరుమంగల రావు లాంటి అనేక మంది హాజరయ్యారు. కఫిసో సభ్య్లులు చిన్ననాటి మిత్రులు అనేక మంది వచ్చారు. జీవగడ్డ విజయ కుమార్ వచ్చి అన్నా ఎవరికీ పూర్తి మూడ్ లేదన్నాఅందరమూ అక్కడికి పోయి వస్తున్నాం అన్నాడు. ఒక్కసారిగా దుఖం పెల్లుబికింది. పక్కనే వున్న ఇందిరకు కూడా తెలీకుండా జాగ్రత్త పడ్డాను. బంధు మిత్రుల మధ్య మా పెళ్ళి రిసెప్షన్ బాగానే జరిగింది. ఆ పెళ్ళికి మా మిత్రబృందం దామోదర్, నారదాసు, పెండ్యాల
సంతోష్, జే.మనోహర్ రావు తదితరులు కలిసి నాకో గోడ గడియారం బహుమతిగా ఇచ్చారు. మనోహర్ దాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్లో కొనుక్కుచ్చాడు. 35 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ కూడా మా ఇంటి హాల్లో గోడకు వేలాడుతూ నాకు సమయాన్ని సూచిస్తూనే వుంది.

          తర్వాత 13 డిసెంబర్ రోజనుకుంటాను నాకు అంత్యంత ఇష్టమయిన సినీ నటి
స్మితా పాటిల్ మరణించారు. భారతీయ నవ్య సినిమా ’భూమిక’గా నిలిచిన ఆమె
మరణం నాకు వ్యక్తిగతంగా ఎదో కోల్పోయిన బావం మిగిల్చింది. వార్త విన్న
ఇందిర చాలా బాధ పడింది. పెళ్ళి అవగానే సార్ పోయారు ఇప్పుడు మీకిష్టమయిన
స్మితాపాటిల్.. అంటూ తను బాధ పడుతూ వుంటే జీవితం అంటే ఇదే అన్నాను.
‘సహచరులు కొందరు ఇష్టమయిన వారు తొందరపడి సెలవు తీసుకుంటారు’ తప్పదు మరి అన్నాను. 

          స్మితాపాటిల్ భారతీయ నవ్య సినిమాకు పర్యాయపదంలా కనిపిస్తుంది. తనపాత్ర పోషణలో అండర్ ప్లే కానీ ఓవర్ ప్లే కానీ చేయలేదామె. ఆమె మృతి సమాంతర సినిమా కు ఆ సిన్మాల అభిమానులకూ తీరని లోటుగానే మిగిలిపోయింది.

          ఇక డీ. నరసింహా రావు గారి దశ దిన కర్మ రోజు నాటికి ‘జీవగడ్డ’ దిన పత్రికలో “
మమ్మల్ని క్షమించు డీ ఎన్” అని ఒక నివాళి వ్యాసం రాసాను. పెళ్ళి బట్టలతో వుండి నేనూ గుజరాత్ లో వుంది ఎన్.శ్రీనివాస్, వూర్లో లేని గోపు లింగారెడ్డిలము మీ చివరి చూపునకూ నోచుకోలేదని రాసాను. చాలా వివరంగా రాసాను ఆ వ్యాసం. కానీ జీవగడ్డ విజయ్ కుమార్ పేరు మిస్ అయింది. తనకు బాగా కోపం వచ్చింది. ఇదేమిటి ఇట్లా చేసావు అని నిలదీశాడు. నేను నిన్న పత్రిక అచ్చయ్యే సమయానికి లేను లేకుంటే వ్యాసం ఆపే వాడిని అని చిరు కోపంగానూ నవ్వుతూనే అన్నాడు. సారీ చెబితే పోనీలే అన్నాడు.

***

          అట్లా నా పెళ్ళితో కలిగిన సంతోషం ఒక వైపు, దగ్గరి వాళ్ళను కోల్పోయిన బాధ మరో వైపు వుండగా వైవాహిక జీవితం మొదలయింది. మధ్యతరగతి కుటుంబం. కొత్తగా పెళ్ళయి వచ్చిన అమ్మాయి. అప్పటికే ఇంటి పరిస్థితులకు అలవాటు పడ్డ తమ్ముళ్ళు చెల్లెళ్ళు. మరో వైపు అమ్మ అనారోగ్యం. చిత్ర విచిత్రంగా జీవితం శురూ అయింది.

“ఎప్పటికయినా
బయలు బయలుగాని మబ్బులుండవు
ముగింపులేని ముసురుండదు
తెరిపి దొరకని కష్టముండదు”
జీవితమంటే అంతే కదా.. కానీ అనేక సంఘటనలు.. సందర్భాలు కమ్ము కొచ్చాయి

“గాయాలూ జ్ఞాపకాలూ తడి తడి గానే వుంటాయి,
ఎప్పటికయినా గాయాలు మానిపోతాయి,
జ్ఞాపకాలే మిగిలిపోతాయి”

          కానీ జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచడం ఎంత కష్టం, అందునా గతం లేని భవిష్యత్తు
లేదన్నది నిజం కదా. అందుకే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఓ క్షణం ఆగి వెనక్కి
చూసుకుంటే చాలు చీకటి దారులూ, వెన్నెల రాత్రులూ కనిపిస్తాయి.

‘గడిచిన ఈ చిన్ని జీవితంలో అనేక ఖాళీలు
వాటిని ఇప్పుడు పూడ్చే సమయం లేదు, శక్తీ చాలదు’

          కానీ మనసుంది, మమతుంది, దీక్షా వుంది. ఖాళీలని పూరించలేకున్నా ఇన్నేళ్ళూ
కనిపించని ఖాళీలని స్పృశించవచ్చు. ఖాళీలున్న విషయాన్ని అంగీకరించవచ్చు. ఇది
బహుశా నేనే కాదు అందరూ చేయాలేమో.

* * *

          ఒక మనిషి జీవితంలో పెళ్ళి ఓ ప్రధాన ఘట్టం. అది అనేక మార్పులకు, సంతోషా లకు, కొండొకచో కష్టాలకూ దారి తీస్తుంది. అదీ మూడున్నర దశాబ్దాల క్రితం మరీ ఎక్కువ. అప్పటి సామాజిక ఆర్ధిక కుటుంబ పరిస్థితుల్లో పలుమలుపులకు దారితీసేది. అదే మా జీవితాల్లో కూడా జరిగింది. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న హై స్కూల్ అధ్యాపకుడు. చాలా గొప్ప టీచర్. ఏనాడు స్కూలుకు ఆలస్యంగా వెళ్ళడం ఎరగని వాడు. అంజయ్య సార్ ఇంట్లోంచి సైకిల్ బయటకు తీసాడు అంటే వాచ్ 9.30 కి సరిచేసుకోవాలి అనేవాల్లంతా.

          విద్య, క్రమశిక్షణలని తన ఉచ్వాస నిస్వాసాలుగా చేసుకున్నవాడు. ఏనాడు ఇంట్లో గానీ ప్రైవేట్ గా ట్యూషన్లు చెప్పి ఎరుగడు. ఖార్ఖానగడ్డ,ధనగర్ వాడీ, ఆర్ట్స్ కాలేజీలలో వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచాడు. ఇక నా పెళ్ళి నాటికి ఒక చెల్లె పెళ్ళి అయింది. ఇంట్లో మరో చెల్లి, ఇద్దరు తమ్ముళ్ళు, నానమ్మ. అమ్మేమో తీవ్రమయిన అనారోగ్యంతో బాధపడుతూ వుండేది. డాక్టర్లూ మందులూ. నాన్న దృష్టి అంతా అమ్మ
ఆరోగ్య స్థితి పైననే వుండేది. నేనేమో ఉద్యోగరీత్యా గోదావరిఖనికి వెళ్ళి రావడం, బయట ఫిలిం సొసైటీ కార్యక్రమాలూ మిత్రులు అదో లోకంలా వుండేది. ఇంట్లో పిల్లల పైన ఎలాంటి నియంత్రణ లేని స్వేఛ్చ వుండేది.

          ముఖ్యంగా వంటా, ఇంటి నిర్వహణలో అంతా ఒక ధోరణికి అలవాటు పడ్డారు. ఆ
నేపధ్యంలో ఇందిర మా ఇంటి కోడలిగా వచ్చింది. ఆమె నేపధ్యం వేరు. వాళ్ళదీ
మధ్య తరగతి కుటుంబమేయినా అయినా ఆహార ఆర్ధిక విషయాల్లో పూర్తిగా వాళ్ళ అమ్మ నియంత్రణలో పెరిగింది. ముఖ్యంగా ఆర్ధిక కుటుంబ నిర్వహణలో కంట్రోల్డ్ వాతావరణం ఆమెది. ఆమె పద్దతులు మా ఇంట్లో అమలు చేద్దామని ఆమె ప్రయత్నం. కానీ మా ఇంట్లో దానికి భిన్నం. ఇంకేముంది కొత్తగా వచ్చిన కోడలుకూ మిగతా వారికీ నడుమ ఒక తెలీని, అర్థం కాని సంఘర్షణ. ఉమ్మడి కుటుంబాల్లో ఇరుపక్షాలకూ సహనం లేనప్పుడు లాంటి
పరిస్థితే వస్తుంది. దానికి తోడు ఇందిరతో నా పెళ్ళి ఇష్టం లేని మా బంధువర్గంలోని కొందరు అగ్నికి ఆజ్యం పోయడం ఆరంభించారు. ఆ ప్రచ్చన్న ఘర్షణ అట్లా జరుగుతూ ఉండగానే అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించ సాగింది. 

          అమ్మని ఇందిర తన స్వంత తల్లి లాగే చూసుకునేది. అమ్మకు తను మా నాన్న
ఎంతోసేవ చేసారు. ఇందిర పట్ల అమ్మ చాలా సంతోషంగా వుండేది. డాక్టర్ లక్ష్మి నారాయణ గారు ఒక సారి హైదరాబాద్కు తెసుకేల్తే మంచిది. ఉస్మానియాలో డాక్టర్ గోపాలకృష్ణ అనే స్పెషలిస్టుకు చూపిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. డాక్టర్ అయిన మా అమ్మ తమ్ముడు కూడా సమర్థించాడు. హైదరాబాద్లో మా బంధువుల్లో ఒకరికి ఆ డాక్టర్ తెలుసని పంపించాడు. ఒకటి రెండు రోజుల్లో వస్తానని చెప్పాడు. ఇంకేముంది 1987 మే మొదటివారంలో అమ్మను తెసుకుని హైదరాబాద్ వెళ్ళాం నేనూ నాన్న ఇందిర.

          ఉస్మానియాలో చేర్చాం. దినమంతా ఆసుపత్రి, రాత్రికి ఖైరతాబాద్ లోని మా అత్త కాశమ్మ ఇంట్లో మకాం. అది మా చెల్లి అత్తగారిల్లు కూడా. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్లో డాక్టర్ల సమ్మె. మేము కలవాలనుకున్న గోపాలకృష్ణ డాక్టర్ల సంఘ నాయకుడు. ఇంకేముంది ఆయన హాస్పిటల్కి రాడు. వచ్చినా రోగులను చూడడు. మీటింగులనీ, ధర్నాలనీ కనీసం వార్డుకు రాలేదు. ఎన్ని రకాలుగా ఎంతగా  ప్రయత్నిం చినా మా అమ్మను ఆయన చూడనే లేదు. మా అమ్మ తమ్ముడు హైదరాబాద్ రానేలేదు. మూడు నాల్గు రోజుల్లో అమ్మ ఆరోగ్యం మరింతగా విషమించింది. శ్వాస తీసుకోవడం కష్టంగా వున్న స్థితిలో మా మిత్రుడు డాక్టర్ నరేందర్ రావు వచ్చాడు. అమ్మ పరిస్థితి చూసి ఇదేమిటి ఈ స్థితి వచ్చేదాకా ఎట్లా చూసావు ఆనంద్ అంటూ అమ్మని ఐసీయూ కి తరలించాడు. అమ్మ అక్కడే ఓ రెండు గంటలు కష్టపడి తనువు చాలించింది. అంతా
శూన్యం ఆవరించింది. అమ్మ ఒక పెద్ద కుటుంబంలో ఆర్థికంగా స్థితిమంతుల కుటుంబం లో పుట్టింది, కరీంనగర్ లో పేరున్న మిఠాయి సత్యమ్మ ఇంట్లో అడుగు పెట్టింది. ఉమ్మడి కుటుంబంలో వుండే అన్ని సంతోషాల్నీ కష్టాలనీ అనుభవించింది. అవమానంతో గడియారం కాడి ఇల్లు వదిలి మంకమ్మ తోటలో అయిదుగురు పిల్లలతో మూడు గదుల ఇంట్లో గడిపింది. వంట గదిలో ఫ్లోరింగ్ లేక పోవడంతో తానే ఎర్ర మట్టితో అలికి, కట్టెల పొయ్యి, ఉనక పొయ్యిల్లో వండి మమ్మల్నిఎంతో ఆప్యాయంగా చూసుకుంది. కానీ పెద్ద
ఇంట్లో నుండి వచ్చి ఈ స్థితి అనుభవిస్తున్నాని ఏనాడూ అనలేదు బాధ పడలేదు.
అలాంటి మా అమ్మ అప్పటికి అర్థం కాని తీవ్రమయిన అనారోగ్యంతో ఉస్మానియా డాక్టర్లు కనీసం చూడకుండానే కన్ను మూసింది. ఇంకేముంది అంబులెన్స్ లో ఆ రాత్రి వరకు కరీంనగర్ తీసుకొచ్చాం. వచ్చేసరికి ఇంటి ముందు ఇతర బంధువులతో పాటు  దామోదర్, పీ.ఎస్. రవీంద్ర, డాక్టర్ సాగర్ రావు లాంటి అనేక మంది ఆత్మీయ మిత్రులు ఎదురు చూస్తున్నారు. సాగర్ ఐస్ తెప్పించమన్నాడు. హాల్లో ఐస్ పై పడుకో బెట్టాము. మర్నాడు మానేటి ఒడ్డున మా చిన్న తమ్ముడు అమర్ చేతుల మీదుగా అమ్మను సాగనంపాము. తర్వేతేముంది వారాల వారి కుటుంబ సాంప్రదాయాల మేరకు దశ దిన కర్మ లాంటివి అన్నీ జరిగాయి. అమ్మ వెళ్ళిపోయి ఇల్లంతా బోసి పోయింది. అప్పటిదాకా
మాతో వున్న అమ్మ ఓ జ్ఞాపకంగా మిగిలి పోయింది. ఉన్నంత కాలం సంతోషంగావున్నారో, కొట్లాడుకున్నారో, అలిగారో కానీ అమ్మ పోయింతర్వాత నాన్న ఒంటరి అయిపోయాడు. దేనిపైనా పెద్ద శ్రద్ధగా ఉండేవాడు కాదు. నాన్న మిత్రులు శంకరయ్య సార్, మల్లారెడ్డి, సదానందం సార్లు తన దగ్గరిక వచ్చేవాళ్ళు. మా పెదనాన్న జగన్నాధం ముందుండి అన్నీ నడిపించాడు. కాలం గడుస్తూనే వుంది. అంతా వెళ్ళిపోయి మేము కుటుంబ సభ్యులం మిగిలాము. ఇంకేముంది. అప్పటిదాకా ఇంట్లో వాళ్ళ నడుమ అస్పష్టంగానూ అంతర్గతంగానూ వున్న ఘర్షణ బయటకు రాసాగింది. ఇంట్లో ఎడమొహం పెడమోహాలు పెరిగాయి. నాన్న పరిస్థితిలో సర్దుబాటు కోసం ఎలాంటి చొరవ తీసుకోలేదు. మిగతా
బంధువులు అంతా ఒక వైపే మాట్లాడసాగారు. నా వైపు అనుమానంగా చూడడం మొదలు
పెట్టారు. నేనేమో బయటి కార్యక్రామలూ, కొత్త బిజినెస్ ల గురించీ తీరిక లేకుండా వున్నాను. అప్పుడే నేనూ దామోదర్ లము కలిసి ఆంధ్రజ్యోతి కరీంనగర్ ఏజెన్సీ తీసు కున్నాం. వినాయక చవితికి ఇందిరను వాళ్ళ అమ్మ వాళ్ళింటికి పంపించారు. నాన్న ఎప్పటిలాగే ముభావం. విషయం నాకు అర్థం అవుతూనే వుంది. మిత్రులతో చర్చిం చాను. నీ కోసం వచ్చిన భార్యను కష్టపెట్టడం కరెక్ట్ కాదన్నారు. కొత్త ఇంటి కోసం వెతకడం మొదలు పెట్టాను. ‘నవత’ చుక్కా రెడ్డి గారి ఇంటిపక్కన ఖాళీగా వున్న ఇల్లుని అద్దెకు తీసుకున్నాను. సామాన్లు సర్దేశాను. ఇందిరను నేరుగా కొత్త ఇంట్లోకి రమ్మన్నాను. ఆ రోజు రాత్రి ఇంట్లో అంతా మౌనం. నాకు మళ్ళీ గడియారం కాడి ఇంటి నుంచి బయటకు వచ్చిన రోజు గుర్తొచ్చింది. దాంతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలయింది. కొత్తగా చేరిన ఇల్లు ఎవరిదో కాదు. మాకు ఇంటర్ లో జంతు శాస్త్రం చెప్పిన శ్రీ రాజేశ్వర్ రెడ్డి సార్ వాళ్ళది. చుక్కారెడ్డి తనకు సడ్డకుడు. ఇంటి ఓనర్ సత్య అంటీ, చుక్కా రెడ్డి
గారి శ్రీమతి అనసూయ, మమున్న ఇంట్లోనే మరో పోర్షన్ లో వున్న శ్రీ బాండు రాజు గారి శ్రీమతి పద్మినిలు ఇందిరను ఎంతో అభిమానంగా చూసుకున్నారు. 

          బాండు రాజు గారు ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్లో పనిచేసేవారు. అట్లా కిరాయి ఇల్లు, కొత్త కాపురంలో అవసరాలూ కష్టాలూ అన్నింటి మధ్య చుట్టూ పక్కల వాళ్ళ సహాయ సహకారా లతో పాటు దామోదర్-సుధీన, నారాయణ రెడ్డి-రమ, సంతోష్ కుమార్-మంగళ, గోపు లింగారెడ్డి-అరుణల సప్పోర్ట్ ఎంతగానో తోడ్పడింది. మేము నిలబడడానికి వారందిం చిన నైతిక స్థైర్యం ఎనలేనిది.

***

          ఇదంతా ఇట్లా వుండగా 1987 కరీంనగర్ ఫిలిం సొసైటీ కి దశాబ్ది సంవత్సరం.
కార్యక్రమాలు విలక్షనంగా చేయాలనుకున్నాం. కొత్త కార్యవర్గంలో కార్యదర్శిగా నారదాసు లక్ష్మన్ రావు వుంటే చాలా బాగుంటుందని నేనన్నాను. కాని అందుకు ఆయన ఇష్టపడ లేదు. నేను వర్క్ చేస్తాను కానీ పోస్ట్ లో వుండలేనన్నాను. దాంతో దామోదర్ ని కార్యదర్శిగా ఎన్నుకున్నాం. తనేమో బాద్యత అంతా నీదేనన్నాడు. నేనొక్కడినే కాదు రాములు సార్, రామేశం, లింగా రెడ్డి, సుధాకర్ లాంటి అనేక మందిమి వున్నాం అని భరోసా ఇచ్చాం.

          ఆ ఏడు బాంబే హమారా షహర్,అపరాజితో, సంస్కార, చారులత, విముక్తి కోసం, నిమజ్జనం లాంటి సినిమాల్ని ప్రదర్శించాం. అంతేకాదు సోలారిస్, హామ్లెట్, కింగ్
లియర్ లాంటి సినిమాల్నీ చూసాం. ముఖ్యంగా దివంగత ‘స్మితా పాటిల్ చలన
చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేసాం. అందులో భాగంగా మూడు రోజుల పాటు మహేష్ భట్  ‘అర్త్(ARTH), ఉత్పలేందు చక్రవర్తి ‘దెబ్ శశు’(Debshishu), కుమార్ సహానీ తరంగ్ (TARANG) సినిమాలనే ప్రదర్శించాం. ఆ ఉత్సవాన్ని అప్పుడు కరీంనగర్లో అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్న రామ లక్ష్మి గారితో ప్రారంభింప జేసాం. ప్రారంభ సభలో దామోదర్, రాములు, గోపు లింగా రెడ్డిలు వేదికను పంచుకున్నారు. ఇక అదే సంవత్సరం బాలల చలన చిత్రోత్సవాన్ని అప్పటి కలెక్టర్ టి.ఎస్.అప్పారావు ప్రారంభించారు.ఇక వార్శికోత్సవసభలో ప్రముఖ దర్శకుడు దేవదాస్ కనకాల అతిథిగా హాజరయి సినిమా నిర్మాణానికి సంబంధించి అనేక విషయాల్ని పంచుకున్నారు. అది ఫిలిం మేకింగ్ కు సంబంధించి మంచి విషయాలు చర్చగా జరిగింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక మంచి సావనీర్ ను తెచ్చాం. దాన్ని దర్శకుడు సినిమాటోగ్రాఫర్ నిమాయి ఘోష్ కు అంకితమిచ్చాము. సావనీర్ కమిటీ కన్వీనర్ గా ఆర్.రాములు, సభులుగా నేనూ, వి.రామేశం, నారదాసు లక్ష్మణ రావు, ఎడమ నారాయణ రెడ్డి, బి.వి.రామనర్సయ్య లము
పనిచేసాం.

          ఆ సావనీర్ కోసం మా కోరిక మేరకు కాకరాల గారు ‘సినిమా-సంస్కృతి’ అన్న గొప్ప
వ్యాసం రాసారు. అది ఒక సాదికారిక వ్యాసం. ఇంకా ఫిలిం సొసైటీలు ఫిలిం ఎడ్యుకేషన్ పై నరేడ్ల శ్రీనివాస్, ఫిలిం సొసైటీల భవిష్యత్తు అన్న అంశం పైన గోపు లింగా రెడ్డి, బాలలకోసం చిత్రాలు అనే అంశం పైన నేనూ వ్యాసాలూ రాశాం. అట్లా కఫిసో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం

***

“జీవనరాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం”

“బిందువు లాంటి ఈ ప్రపంచం
నిజానికి ఓ కన్నీటి బిందువు
నేనేమో సముద్రాన్ని కలగంటున్నాను” ఇదీ 1988 నాటి నా పరిస్థితి. అప్పటిదే కాదు ఇప్పటిదీ అదే పరిస్థితి. బహుశా నా వొక్కడిదే కాదు చాలా మందిదీ అంతే అనుకుంటా ను.

అంతే కాదు ఇవాళ
“చల్ల చిలికినట్టు బతుకును చిలుకుతూ వుంటే
శకలాలు శకలాలుగా అనుభవాలు తేలుతున్నాయి
ఘనీభవిస్తున్న ‘వెన్న’ గొప్ప తాత్వికతను సూచిస్తున్నది”

***

          అదంతా అట్లా ఉంచితే ఆ రోజులు నా జీవితంలో చిత్రమయిన దినాలు. ఒక వైపు
స్వంత ఇల్లు వదిలి వావిలాలపల్లిలో కిరాయి ఇంట్లోకి మారాను. అదొక తీవ్రమయిన వేదన. కొత్త కాపురం. నిలదొక్కుకోవాలి. చుట్టాలెవరూ కన్నెత్తి చూసే స్థితి లేదు. నాన్నను దత్త తీసుకున్న నానమ్మ లక్ష్మమ్మ మాత్రం వచ్చి చూసి వెళ్ళింది. ఇక అంతా మిత్ర బృందమే. సరిగ్గా అప్పుడే కరీంనగర్ ఫిలిం సొసైటీ సెక్రెటరీగా బాధ్యతలు తీసుకున్నా ను. మంచి సినిమాలు చూడడం, చూపించడంతో పాటు మరోవైపు నిరంతర సాహిత్య అధ్యయనం. అప్పటికే కొంత మంది మిత్రులం కలిసి ఏదయినా మంచి స్కూలు పెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టాం. అంతకు ముందు కరీంనగర్ మంకమ్మతోటలో
నవోదయ పేర ఒక స్కూలును గోపు లింగారెడ్డి తదితరులు నిర్వహిస్తున్నారు. దానికంటే ఇంకా విస్త్రుత స్థాయిలో ఏదయినా మంచి విలువలతో కూడిన స్కూలు పెట్టాలని ఆలోచన. దానికి గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ అని పేరు పెట్టాం. 

          డాక్టర్ కే.సత్యసాగర్ రావు (MBBS) ని అధ్యక్షుడిగా, నారదాసు లక్ష్మణ
రావు (MA,LLB)ను కార్యదర్శిగా, కోమటిరెడ్డి దామోదర్ రెడ్డి (BA)ని కొశాధికారిగానూ ఎన్నుకున్నాం, గోపు లింగా రెడ్డి (MA, M.Phil, Ph.D), డాక్టర్ పి.రాజన్న (B.V.Sc), ఉప్పల రామేశం (B.Com), ఎన్.అనూప్ రెడ్డి (B.Sc.,LLB), నేనూ సభ్యులుగా వున్నాం. కరీంనగర్ రెసిడెన్షియల్ స్కూల్ అని పేరు పెట్టాం. 

          స్కూలు అనుకున్నప్పుడు నేను రాసిన వాక్యం “జీవనరాగంలో మధురమయిన
ఆలాపనే బాల్యం”. అందుకే పిల్లలకు బాల్యంలోనే విద్యతో పాటు వారిలో కళాత్మక దృష్టి అలవర్చాలని, వారిలోని సృజనాత్మక ప్రతిభను వెలికి తీయాలని అన్నాను. నేనే కాదు అందరమూ అనుకున్నాం. ఆదే దిశలో స్కూలు నడపాలనీ తీర్మానించుకున్నాం. అదే దిశలో కొంత కాలం కొనసాగించాము కూడా. మా అందరికీ ‘బాల్యమే మనిషికి తండ్రి లాంటిది అనే విశ్వాసం’ కూడా ఉండింది. 

          గోదావరిఖని జూనియర్ కాలేజీలో పని చేస్తున్న నేను అదే జీతం ఇక్కడ ఇస్తే
బాధ్యతల్ని నిర్వహిస్తానని అన్నాను. అంతా సరే నన్నారు. నేను సెలవు పెట్టేసాను. పిల్లలు, విద్య సృజనాత్మకత విషయాల్లో అప్పుడు నన్ను మూడు పుస్తకాలు తీవ్రంగా ప్రభావితం చేసాయి.

          ముఖ్యమయినది మొదటిది గిజుభాయ్ రాసిన ‘పగటి కల’. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమె. దానివల్ల తమకి జీతం వస్తుంది అనే పరిమిత స్థాయిలో ఆలోచించే ఉపాధ్యాయుల కళ్ళు తెరిపించే పుస్తకమది. ఎంతో ఆదర్శంగా, గొప్ప ప్రేరణనిచ్చే పుస్తకమది. టీచర్ అనేవాడు సంపూర్ణ వ్యక్తిత్వంతో దైర్యంతో, ఒక ప్రధాన ఆశయం కోసం జీవించాలనే తపనను పెంచే పుస్తకం ఈ ‘పగటి కల’. అంతేకాదు భవిషత్తు తరాలయిన బాలబాలికల్లో మనో వికాసాన్ని సృజనాత్మకతని ఎట్లా ప్రోది చేయవచ్చో చెప్పే పుస్తకమిది. దాన్ని నేను చదవడమే కాకుండా దామోదర్, గోపు లింగారెడ్డి లాంటి అందరు మిత్రుల చేతా చదివించాను అందరూ అంతే ప్రభావితం
అయ్యారు.

          ఇక రెండో పుస్తకం “రైలుబడి” టెట్సుకో కురొయనాగి రాసారు. రైలు బడి ప్రపంచం లోని ప్రముఖ భాషలన్నింటిలోకి అనువదించబడిన టెట్సుకొ కురొయనాగి అద్భుత రచన. దాన్ని తెలుగులోకి ఈశ్వరి, ఎన్.వేణుగోపాల్ చేసారు. టోమో అనే బడి గురించి, దాన్ని స్థాపించి, నడిపిన సొసాకు కొబయాషి అనే వ్యక్తి గురించి ఈ పుస్తకం చెబుతుంది. రచయిత చిన్నప్పుడు అదే బడిలో చదువుకున్నాడు. ఎలాంటి కల్పిత సంఘటనలు లేకుండా నిజంగా జరిగిన వాటినే క్రోడీకరించి రాసారు. ఎంతో ప్రేరణాత్మకమయిన పుస్తకమిది.

          నన్ను ప్రభావితం చేసిన మూడవ పుస్తకం వి. సుహోమ్మీన్స్  స్కీ రాసిన “ పిల్లలకే
నా హృదయం అంకితం”. అందులోని వాక్యాలు కొన్ని ఇప్పటికీ నా మదిలో నిలిచి
పోయాయి. సరిగ్గా ఇవే వాక్యాలు కావు కానీ భావం ఇదే, “స్కూలు, ముఖ్యంగా ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడి సృజనాత్మక ప్రతిభకు, కృషికి దాఖలా”. విద్యార్థి భావి అభివృద్ధికి ప్రాథమిక స్కూలే ఆధారమనీ అని చెప్పిన పుస్తకమిది.

          ఈ విషయాలన్నింటిని నమ్మి మేము స్కూలును తెలుగు మీడియంలో ఆరంభిం చాం.

          పూజ్యులు శ్రీ గార్లపాటి తిరుపతి రెడ్డి గారు ఉపాధ్యాయుల ఎంపికలో వారిని చైతన్య పరచడంలో మాకు అండగా వున్నారు. ఇక స్కూలు ఆరంభానికి ముందే మేమంతా గుంటూరు విజయవాడల్లోని కొన్ని స్కూళ్ళు చూడాలనుకున్నాం. బయలుదేరి వెళ్ళాం. మా స్కూలును ప్రారంభించడానికి ‘రవి కళాశాల’ సి.వి.ఎన్.ధన్ గారిని ఆహ్వానించాము. ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పేరెంట్స్ బాగానే స్పందించారు. కానీ తెలుగు మీడియం అనేసరికి కొంత వెనుకంజ. అడ్మిషన్లను ఫరవాలేదు అనిపించాయి. నేను విద్యావిషయాలు, సృజనాత్మక విషయాలు చూస్తే దామోదర్, లక్ష్మన్ రావు లు ఆర్థిక అంశాలు, బయటి కొనుగోళ్ళు పర్యవేక్షించారు. రామారావు అనే టీచర్ అధికారిక ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. దానికి కొంత ముందు మిత్రుడు జూకంటి జగన్నాథం కథ ‘వలస” కు ఆంద్రజ్యోతి వార పత్రికలో బహుమతి వచ్చింది. చాలా గొప్ప కథ. సిరిసిల్లా నుంచి భీవండి తదితర ప్రాంతాలకు వలస వెళ్ళే చేనేత కార్మికుల జీవితాలను
ఆధారం చేసుకుని మొత్తం ప్రపంచీకరణ ప్రభావాల్ని ఆవిష్కరించిన కథ. ఆ కథ
చదివి కరీంనగర్ నుండి బి.పద్మజ జూకంటికి ఉత్తరం రాసింది. జూకంటి ఆ విషయం
నాకు చెప్పి వీలయితే ఒకసారి కలవాలి అన్నాడు. జ్యోతినగర్ లో వున్న వాళ్ళింటికి వెళ్ళాం. పద్మజ విద్యాసాగర్ లు ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. అట్లా నాకు ఆ కుటుంబంతో స్నేహం కుదిరింది. స్కూలు ఆరంభించాక పద్మజ క్లాస్ మెట్ అయిన ఎం.సరస్వతిని టీచర్ ఉద్యోగానికి ఇంటర్వ్యుకి తీసుకొచ్చింది. ప్రతిభావంతురాలయిన సరస్వతి ఎంపికయి చేరింది.

          మొదట్లో మా స్కూలులో పి.ఎస్.కిషన్, చంద్రశేఖర్లు పని చేసారు. తర్వాతి బాచ్ లో వొడ్నాల చంద్రమౌళి, పుల్లూరి జగదీశ్వర్ రావు, బెజ్జారపు రవీందర్, బెజ్జారపు వినోద్ కుమార్, ఆర్టిస్ట్ చారి, లేడీ ఉపాధ్యాయుల్లో నాకు గుర్తున్నంత వరకు అరుణ, జలజ, సునీత, ఇట్లా చాలానే వర్క్ చేసారు. ఎంతో బాధ్యతతో పనిచేసారు. కరీంనగర్ రెసిడెన్షి యల్ స్కూల్ లో విద్యా విషయక సిలబస్ కు అదనంగా పిల్లలు రచనలు చేయడం పెయింటింగ్లు వేయడం, వేదికనెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం లాంటి వాటి పైన ఎక్కువ దృష్టి పెట్టాం. అందుకోసం ‘బాలసభ’ పేర ప్రతి వారం పిల్లల కోసం ఒక సభ నిర్వహిం చాం. దానికి అనేక మంది కవులు సాహితీవేత్తల్ని అతిథులుగా ఆహ్వానించాం. వారి సమక్షంలో పిల్లలు తమ రచనలు చదవడం ఉపన్యాసాలివ్వడం జరిగేది. అతిథులు ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇచ్చారు. కథలు కవిత్వం సృజనాత్మకథ పట్ల ఆసక్తి వున్న టీచర్ సరస్వతి మరియు వోడ్నాల చంద్రమౌళి ‘బాలసభ’ బాధ్యతల్ని నిర్వహించారు.

ఇక పిల్లలు రాసిన రచనల్ని, వేసిన బొమ్మల్ని కలిపి ఒక గోడ పత్రిక నిర్వహిం చాలనుకున్నాను. ప్రముఖ కవి మిత్రుడు శ్రీ వఝల శివకుమార్ ఆ గోడ పత్రికకు “తొలకరి” అని పేరు పెట్టమని సూచించాడు. గొప్పగా అనిపించింది. 

          మేమంతా పిల్లల్లో పిల్లలమయి, ఆట పాటల్లో కలిసి తిరిగాక ఓ రూపానికి వచ్చింది. 2 జనవరి 1988 శ్రీ శ్రీ జయంతి రోజున మొదటి గోడ పత్రికను మా అధ్యక్షుడు డాక్టర్ కే.సత్యసాగర్ రావు ఆవిష్కరించారు. మొదట కవితలు కథలు రాయాలి అనగానే పిల్లలంతా వెర్రి ముఖాలేసారు. చందమామ కథలు చదవడం తెలుసు కానీ రాయడం ఎట్లా అన్నారు పిల్లలు. కానీ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కొద్ది రోజుల్లోనే ఎంకి పాటలు పాడడం, శ్రీ శ్రీ కవితలు చదవడం వేమన పద్యాల్ని ఆలవోకగా అప్పగించడం చేస్తూ తమకు తోచింది రాయడం మొదలు పెట్టారు. వారిని నిరుత్సాహ పరచకుండా ప్రోత్సహి స్తూ వచ్చాం. పిల్లల రచనల్ని వారి దస్తూరి తోనూ, వారు గీసిన బొమ్మల్ని యధాతతం గానూ కలిపి తొలకరి రూపొందించాము. ఈ కృషిలో చారి, చంద్రమౌళి తదితరుల సహకారం మరువలేనిది. తొలకరి మొదటి సంచిక నుంచి బాలల్లో భావావేశాన్ని కలిగిం చామే తప్ప వారి రాతల్లో ఎప్పుడూ చేయి చేసుకోలేదు.“తొలకరి” గోడ పత్రికగా మొత్తం 27 సంచికలు వెలువరించాం. అందులోంచి ఎంపిక చేసిన రచనలతో కరీంనగర్ రెసిడెన్షి యల్ స్కూల్ పక్షాన ‘తొలకరి” సంకలనంగా అచ్చులో తెచ్చాం. దానికి మంచి స్పందన వచ్చింది.

          ఆంద్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ ఎస్.కే.జాకీర్ గొప్ప అభిప్రాయం ఇట్లా రాసారు— అక్కడ బాల్యం చిరుగాలి సితారా సంగీతాన్ని విన్పిస్తోంది. ఏమీ ఎరుగని పూవులు సాహితీ సౌరభాల్ని వెదజల్లుతున్నాయి.అయిదారేడులు అక్షరాల మంటల్ని పుట్టిస్తున్నాయి.. అంటూ రాసాడు. ప్రతి పక్షం కురుస్తున్న ‘తొలకరి’లో చిగురించి పుష్పించిపరిమలిస్తున్న సాహితీ సుమాలివి అని కూడా అభినందనగా రాసారు. అట్లా పిల్లలు రాసిన రచనలతో ‘తొలకరి’ ఎంతో తృప్తిని ఇచ్చింది.

          ఇంకా పిల్లల్ని తీసుకుని డిగ్రీ కాలేజీ ఆవరణలో సృజనాత్మక పిక్ నిక్స్ ఏర్పాటు చేసాం. ఆ సమయంలోనే నేను అయిదారు బాలల కథలు రాసాను.’అనగనగ రాగ
మతిశయిల్లుచుండు’, ‘ఎప్పటి పని అప్పుడే’, ‘కష్టే ఫలి’, ‘మనిషి చేసిన బొమ్మ’
తదితర కథలు ‘ఆంద్ర ప్రభ’ వార పత్రికలో అచ్చయ్యాయి. పిల్లల సృజనతో పాటు
నా రచనలూ సాగాయి.

          ఇదంతా జరుగుతుండగానే నాకు గోదావరిఖని నుండి కరీంనగర్ కు పక్కనే వున్నా
చొప్పదండి కాలేజీకి బదిలీ అయింది. మధ్యాహ్నం కాలేజీ కావడంతో ఉదయం స్కూలు పగలు కాలేజీ చూడసాగాను. ఫిలిం సొసైటీ కార్యక్రమాలూ పెరిగాయి. 

          సరిగ్గా అప్పుడే ఈనాడు వాళ్ళు సాంస్కృతిక అంశాలు రాయమన్నారు. నేను
కొంచెం బిజీ అయ్యాను. ఇంతలో స్కూలు లాభనష్టాల విషయం చర్చకు వచ్చింది.
ఒక ఉదాత్త లక్ష్యంతో నడుపుతున్నప్పుడు లాభాలు అంత త్వరగా రావు. రాలేదు
కూడా. గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీలో బాగా చర్చలు జరిగాయి. స్కూలును బాగా మానేజ్ చేయగలిగాను కానీ సభ్యుల్ని చేయలేక పోయాను. లెక్కలు ఆడిట్ అన్నారు ఏమో అన్నారు ఏమీ కాలేదు. తర్వాత నేను నిర్వహణ నుంచే కాకుండా మొత్తంగా అన్నీ మానేశాను. అట్లా ఆ చాప్టర్ ముగిసింది.

***

          కానీ ఆ స్కూలులో నాతో పనిచేసిన టీచర్లు చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. అది
నాకెంతో ఆనందం. వోడ్నాల చంద్రమౌళి జర్నలిస్టుగా ఈనాడు, టీ.వీ.9 లలో పని చేసిఇప్పుడు v6 లో రాష్ట్ర స్థాయిలో సీనియర్ జర్నలిస్టుగా వున్నాడు. ఇక బెజ్జారపు రవీందర్ రచయితగానూ, జిల్లా స్థాయి అధికారిగావున్నాడు, పుల్లూరి జగదీశ్వర్ రావు పిల్లల కథా రచయితగానూ రెవెన్యు అధికారిగానూ పనిచేస్తున్నారు, ఎం.సరస్వతి మహిలాశిశు సంక్షేమ శాఖలో పీవోగా వున్నారు, పి.ఎస్.కిషన్ తూనికల శాఖ లో జిల్లా స్థాయి అధికారిగానూ చంద్ర శేకర్ ఎక్షైజ్ అధికారిగా పనిచేసారు. ఇక అప్పుడు నా దగ్గర
చదివిన పిల్లలు చాలా మంది విదేశాలకు వెళ్ళారు, ఇంకెంతో మంది మంచి వ్యాపారాల్లో స్థిరపడ్డారు.

***

ఇదంతా ఇట్లా ఉండగానే ఫిలిం సొసైటీ కార్యక్రమాల్లో నా కృషి కొనసాగుతూనే వచ్చింది. అదే సంవత్సరం వారం రోజులు గ్రామీణ బాలల చలన చిత్రోత్సవంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించాం.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.