యోధ..!

(నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)

-బి.కళాగోపాల్

విట్రియోల్ 
నా ముఖాన్ని కాల్చేస్తూ చర్మాన్ని మండిస్తూ /
శిరోజాలు అంటుకు పోయి 
కనుగుడ్లు చితికిపోయి /
ముక్కురంధ్రాలు మూసుకుపోయి 
చెవులు తెగిపడి /
చెంపలు కరిగి బొమికెలు తేలి నన్నో వికృతశిలగా మారుస్తున్న/
 ఆ విషపు ద్రావణ బుడ్డి మురుగునీటి పక్కన/
 విసిరిన వాడి అహాన్ని సంతృప్తి పరుస్తూ వికటాట్టహాసం చేయసాగింది../
మెడ దిగువన పాలిండ్లు ఉడికిపోతూ తోలుత్తిత్తిలా దేహం ఊగిసలాడుతుంటే/
 మంట గాయం బాధ నొప్పి ఆవేశం ఆక్రోశం దుఃఖంతో నా కంఠనాళాలు చిట్లిపోతున్నా/
 ఈ లోకం తలుపులు తెరువదు /
అవయవాలు తెగిపడుతున్నా ఏ నాలుగు గోడలు "అయ్యో..!" అంటూ ఆసరా ఇవ్వవు /
శరీరంతో పాటు కాలిపోతున్న మనసు /
శిథిలమవుతున్న ఎముకల నడుమ నా దేహం అస్థిత్వం కొరకు వెతుక్కుంటున్న ప్రాణం/ గంధకపు నత్రజని
గాలుల్లో కొట్టుకుపోతున్న నా మనో స్వప్నాలు/
ఈ మహా బీభత్సం ఈ యుద్ధాలిక చాలునని చెప్పేవారు/
 క్షమ, సత్యం, దయ గురించి బోధించే తల్లితండ్రులు తటస్థమై /
అడవుల్లో గుహల్లో. మౌనంగా ఉంటే..
ఓటిటి పోర్న్  విషవలయాల నరాలతీపు తిమ్మిరి /
సైకో గబ్బిలాలు గడగడపనా రక్త బీజులై పేట్రేగుతుంటే/
 ఉద్యోగిని ఐనా, పంటచేలకూలీ ఐనా, పాలిచ్చే తల్లి ఐనా /
దేహాలపై గాయాలు నిరంతర జ్వలనం../
లక్ష్మి, ఫాతిమా, ప్రీతి కాలిన మాంసపు ముద్దల ముఖాల పేర్లు అనంతం ../
ద్వేషం పగల మాటున బుసకొట్టే అహం ఒక్కటే శతాబ్దాలుగా విర్రవీగుతున్నది /
 అనాగరికత కసాయితనంతో వీరతిలకాలు దిద్ది/ ఉన్మాదులతో ద్రవహింస నెత్తుటివాగును పారిస్తుంది/
దేవుడా !నిజంగా నేను నీ బిడ్డనేనా?/
ఐతే నన్నెందుకిలా ఒజ్మాండియస్ ఖండిత దేహాల ఎడారిలో  విసిరేశావ్?/
జీవితాన్ని పండించుకోవాల్సిన నా కలలు బూడిదవుతున్నాయి/
ప్రేమలు చనిపోతున్నాయి/

ప్రేమించావా? లేదంటే టాయిలెట్ క్లీనర్లూ
 కిరాయి కోట్లో చౌకగా దొరికే/
 విషద్రావణాలు గాఢమైనా సజలమైనా అమాయక లేతముఖాలపై విసిరికొట్టి/ సందుగొందుల్లో చీకటినీడన నక్కే
ఉన్మాద రక్కసుడా!/
ఏమి పాపం చేశానని నా దేహానికి శిక్ష?
నా మాటను శ్వాసను ఙ్ఞానాన్ని సకల భావోద్వేగాలను/ 
మెదడును బుద్ధిని అణగదొక్కి మదిగదిలో పెంచుకున్న చిగురుకలలను చిదిమి/
 నన్నో అవిటిదేహంగా నేల జారిన పగుళ్ళ గాజు బొమ్మగా చేసి /
పైశాచిక ఆనందం పొందే మనో దౌర్భాగ్యుడా!/
నా కాన్ఫిడెంట్ నో అన్న పదమే నీకు కంటగింపైది /
విట్రియోల్ దాడి నీ దగ్గరో చౌకబారు రసాయన ఆయుధమైంది/
 ప్రాణం కన్నా పవిత్రమైనది ఏదీలేదని తెల్సుకోవడానికి/
 ఇలా ఎన్ని ముఖాలు విషద్రావణాలలో ఉడికి ఉడికి కాలిపోవాలి?/
నా ముఖాన్ని వికృతపర్చినా/ 
అంటుకుపోయిన నా చర్మం మీద నీ అహాన్ని పరిచి/
 అదే విజయమని విర్రవీగే మనో దౌర్చాగ్యుడా ! కళ్ళు విప్పి చూడరా/
 నేనిప్పుడు కాలిముద్ద ఐన చర్మానికి లెక్కలేని శస్త్రచికిత్సల సూదిపోట్లు/
 ప్లాస్టిక్ సర్జరీల మార్పులతో రూపాంతరం చెందిన గోల్డెన్ జాయినరీ *కిన్ సుగీ దేహాన్ని/
 తుఫానులు ఎదురైనా ముఖం చూపించలేక అద్దం భోరున విలపిస్తున్నా /
లోపాలే వరమై ఫీనిక్స్ లా పైకెగసి /
నా మైనస్ దేహాన్ని మెదడు అట్టడుగు పొరల్లో నెట్టేసి/ 
వైఫల్యంతో సఫలమైన ఫైటర్ ని/
 గాయాలు మచ్చలు కుట్లు గాట్ల కొత్త దేహాన్ని  అంగీకరించి/
అభేద్యమైన ఆత్మశక్తితో అడ్డంకులను అవకాశాలుగా మార్చుకున్న రియల్ షీరోని../
అగ్ని సరస్సున విరిసిన వజ్రపు తునకలా నన్నునేను సాన బెట్టుకొని/
 కాలిన దేహపు తొలగిన అవయవాలతో కరెక్షన్స్ మేకప్ లేవీ లేని పెదవులపై విరిసే చిర్నవ్వుతో/
నా మనోదర్పణంలో ప్రతిబింబించే నయీ ఉమ్మీద్ ని/
యోధనై.. ప్రపంచ పటం మీద నా ప్రత్యేక వ్యక్తిత్వపు వన్నెలద్దుకొని ఫ్యాషన్ ర్యాంపులపై ఠీవి నొలికిస్తూ /
ఇంపర్ ఫెక్షన్ మేక్ మి  మోస్ట్ బ్యూటిఫుల్ అంటున్న  నయీ పెహచాన్ ని/
నేను నాలాగే ఉండి మీతో సమానంగా నిలబటమేనంటున్న నయా జిందగీని..!!/

***

*కిన్ సుగీ=పగిలిపోయిన పింగాణీ పాత్రలను బంగారు లేదా వెండి వర్ణంతో అతికించే జపాన్ వారి అద్దకం కళ.

*****

Please follow and like us:

3 thoughts on “యోధ..! (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)”

  1. కొందరి పాశవిక మానసిక స్థితి పడతుల జీవితాల పై ఎలా ప్రభావం చూపుతుందో ఏమైనా సరే జీవితాన్ని వదిలేదే లేదన్న వారి పట్టుదలను చక్కటి చిక్కటి పదాలతో చాలా బాగా రాశారు. అభినందనలు

  2. Congratulations madam for winning first prize for the poem on contemporary burning issue

  3. ప్రతి పదంలో ఉద్వేగం, బాధ, అక్షరాలతోనే సన్నివేశ స్పష్టీకరణ. ఒక్క అక్షరం కూడ అనవసరంగా వాడలేదు రచయిత్రి కవితలో. ప్రథమ బహుమతికి అర్హమైన కవిత. కళాగోపాల్ గారి కవనప్రవహం తెలిసినదే అయినా, ఈ కవిత మాత్రం హృదయాంతరాళాలను తట్టి లేపింది. రచయిత్రి గారికి అభినందనలు. సంపాదకవర్ఖానికి నమస్సులు…

Leave a Reply to Basaveshwar Penugonda Cancel reply

Your email address will not be published.