వెనుతిరగని వెన్నెల(భాగం-60)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా ఎదురయ్యి పెళ్ళి చేసుకుంటాడు.

***

          అప్పటికప్పుడు వనజకి ఉత్తరం రాయాలనిపించింది తన్మయికి.

“వనా!

          ఎలా ఉన్నావు? మనం ఉత్తరాలు రాసుకుని ఎన్నాళ్ళయింది! కాదు కాదు ఎన్నేళ్ళయ్యింది!!…”

          గుమ్మం ముందు అలికిడి కావడంతో రాస్తున్నదల్లా పక్కకి చూసింది.  

          ప్రభు అక్క కూతురు, పాపని ఎత్తుకుని నిలబడి సంశయిస్తూ “యాండీ, నేను లోపలికి రావొచ్చా” అంది.

          తన్మయి చిర్నవ్వుతో గుమ్మం దగ్గిరికి వెళ్ళి ముద్దులొలుకుతున్న పాప వైపు చెయ్యి చాస్తూ, పాప తల్లి వైపు తిరిగి “రామ్మా” అంది.

          గదిలోకి బిడియంగా వచ్చి పరీక్షగా చుట్టూ చూడసాగింది ఆ అమ్మాయి.

          తన్మయి డబ్బాలో నుంచి బిస్కెట్టు తీసి పాపకిస్తూ “నన్ను అత్తా అని పిలొవొచ్చు నువ్వు. మీ మావయ్య భార్యనేగా” అని చిర్నవ్వు నవ్వింది.

          ఆ అమ్మాయి “అక్కా” అని పిలవొచ్చా అంది సమాధానంగా.

          “నీకెలా నచ్చితే అలా పిలువు రాణీ” అంది తన్మయి.

          ఆ అమ్మాయి గబగబా “మా యమ్మమ్మ మాటలు పట్టించుకోకు అక్కా! ఆవిడ నోరు చెడ్డదే గానీ మనసు మంచిదే. ఆళ్ళకి మాటైనా సెప్పకుండా మావయ్య పెళ్ళి సేసుకు న్నాడని కోపం. కొన్నాళ్ళకి శాంతిస్తాదిలే. కుసింత ఓపిక పట్టు. అయినా ఆవిడి నిన్ననే గాదు మా యమ్మనీ, నన్నూ అలాగే తిడతాది.” అంది గుమ్మం దగ్గిర్నించి మెట్ల మీంచి కిందికి చూస్తూ.

          “ఏవిటి, ఇంట్లో ఎవరూ లేరా?” అంది తన్మయి, తనూ కిందికి చూస్తూ.

          “మరే, పండగొస్తంది కదా ముగ్గులకి రంగులు కొనడానికి రోడ్డు దాకా యెళ్ళేరు. దార్లోనే కూరగాయలు కూడా కొనుక్కుని వొత్తామన్నారు” అంటూ…

          ఏం లేదక్కా, నువ్వు బాగా పెద్ద సదువు సదివేవంట కదా, బాబుతో పాటూ మా బుజ్జిక్కూడా నాలుగు అచ్చరమ్ముక్కలు నేర్పించవా? వొచ్చీ ఏడాది బళ్ళో ఎయ్యాలంటే ఏయో ఇంగ్లోసు అచ్చరాలు ముందే రావాలంట కదా” అంది.

          తన్మయి చిరునవ్వుతో అలాగే, రోజూ సాయంత్రం నేను రాగానే కాసేపు కూచోబెట్టు కుంటాలే. అంటూ “వస్తావా” అంది పాపతో.

          తల్లి చాటుకి వెళ్ళి దాక్కుని కొంటెగా తొంగి చూడసాగింది బుజ్జి.  

          తన్మయికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం.

          చక్కగా రెండు జళ్లు వేసి, రకరకాల పరికిణీలు కుట్టించి, అందంగా బొట్లూ, కాటుకలూ పెట్టి బొమ్మల్ని తయారుచేసినట్లు తయారు చెయ్యడమంటే మరీ ఇష్టం.

          అదే చెప్పింది.

          “అటైతే నీకు ఈ చూలి అమ్మాయే పుడతాదిలే” అంది నవ్వుతూ రాణి.

          అంతలోనే తన్మయికి కడుపులో తిప్పుతూండడంతో బాత్రూములోకి పరుగెత్తింది.

          తిరిగి నిస్త్రాణగా వచ్చి మంచమ్మీద వాలిపోయిన తన్మయికి కిందికి పరుగెత్తుకెళ్ళి  గ్లాసునీళ్ళలో పంచదార కలుపుకొచ్చి ఇచ్చింది రాణి.

          తన్మయి కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ “థాంక్స్ రాణీ” అంది.

          “అయ్యో మనలో మనకు టాంక్సెందుకక్కా, నీకేం కావాలన్నా నన్ను పిలు” అంది.

          ఆ అమ్మాయి అలా పరిచయంగా వచ్చి మాట్లాడుతూ సహృదయంతో ఏవో చెప్తున్నా తన్మయికి లోపల్లోపల భయంగానే ఉంది.

          రాణి వెళ్ళగానే వనజకు రాస్తున్న ఉత్తరాన్ని కొనసాగించింది.

వనా!  

          జీవితం ఎంతో చిత్రవిచిత్రమైంది! 

          ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎటు తీసుకు వెళ్తుందో ఎవరికీ తెలియదు. 

          తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని అంటారు కదా! 

          కానీ నిర్ణయాలు తీసుకోవడానికి సంవత్సరాల సమయం తీసుకున్నా కొన్నిసార్లు తప్పు నిర్ణయమే తీసుకుంటాం. 

          అలాగని ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండిపోవడం వల్ల, జీవితంలో మార్పు లేకపోవడం వల్ల కదలని మడుగులా నాచుపట్టిపోతాం.

          జీవితంలోకి మార్పుని ఆహ్వానించడమంటే ప్రవాహంలా జీవితాన్ని చైతన్యవంతం చేసుకోవడమే కదూ!

          అందుకే ఏ మార్పునయినా ధీమాగా ఎదుర్కొవాలి కదూ! అదే జీవితం కదూ!!

          సంధ్య వేళ కావస్తోంది. ఆకాశం నారింజ రంగు దాలుస్తూ ఉంది. ఎన్నో సాయం సంధ్యల్ని మనం కలిసి చూస్తూ కబుర్లు కలబోసుకున్న మా ఇంటి డాబా జ్ఞాపకం వస్తూంది వనా.

          నువ్వక్కడ పిల్లలతో సతమతమవుతూ ఉన్నా సంధ్య వేళ ఆకాశం కేసి చూస్తావని నాకు తెలుసు.

          అందుకే నీకు ఉత్తరం రాస్తుంటే నువ్వు నేను చెప్తున్న కబుర్లన్నీ పక్కనే కూచుని వింటున్న భావన!

          జీవితం తిప్పిన మలుపుల్లో ఎట్నుంచి ఎటో  సాగుతున్న నా జీవితం మాటికేం గానీ నీ గురించి చెప్పు.

          నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

నీ

తను 

***

          మరుసటి వారంలో ప్రభు అక్క మంగ బట్టలారవేయడానికి  డాబా మెట్లు దిగబోతూ పై అంతస్తులో చివరి మెట్టు మీద  కాలు మెలిక పడి “ఓర్నాయనో” అని గావుకేక పెట్టింది.

          సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి, ముఖం కడుక్కుని, బొట్టు పెట్టుకుంటున్న తన్మయి కేక వినబడగానే చప్పున బయటికి పరుగెత్తుకు వచ్చింది.

          పడడమే పాదం పెద్దగా వాచిపోయి లేవలేకపోతున్న ఆవిడకి చెయ్యి సాయం అందించి కుర్చీలో కూచోబెట్టింది.

          సమయానికి ప్రభు అమ్మానాన్నా కూడా లేరు.

          మెట్ల మీంచి కిందికి చూస్తూ “రాణీ” అని పిలిచింది తన్మయి.

          తన్మయి పిలుపు విని రాణి, ఆ అమ్మాయి తమ్ముడు దాసు పరుగెత్తుకొచ్చేరు “ఏటయ్యిందే అమ్మా” అంటూ.   

          వాళ్ళను చూస్తుండమని చెప్పి బండి తీసి మెయిన్ రోడ్డు వరకూ వెళ్ళి ఆటో పిలుచుకొచ్చింది తన్మయి.

          అప్పటికే ఆవిడ “అమ్మా, అబ్బా” అని మూలగసాగింది.

          ఇంట్లో బాబుని చూస్తుండమని రాణికి అప్పచెప్పి దాసుని, మంగని ఆటోలో ఎక్కమని తను వెనకే బండి నడుపుతూ దగ్గర్లోని స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళి  కావల్సిన ఎక్స్ రేలు తీయించి రిపోర్ట్సు వచ్చే లోగా బయటికొచ్చి ప్రభుకి ఫోను చేసింది.

          “అయ్యో, ఇప్పుడే వస్తున్నా” అంటూ మరో గంటలో ఆఘమేఘాల మీద వచ్చేడు ప్రభు.

          కాలికి సిమ్మెంటు కట్టు వేసేక, దారిలో టాబ్లెట్లు కొని తిరిగొచ్చేరు.

          అప్పటికే గాభరాగా గేటు దగ్గిర నిలబడ్డ బేబమ్మ “అమ్మో నా తల్లీ, ఏటయ్యిందే ” అంటూ శోకాలు పెట్టసాగింది.

          టయానికి కోడలమ్మ “ఆస్పటలకి తీసుకెళ్ళబట్టి బతికేనే అమ్మా” అంటూ నిస్త్రాణగా సోఫాలో  జేరబడింది మంగ.

          కొన్న మందులు ఏవేవి ఏ పూట వేసుకోవాలో డాక్టరు ఇచ్చిన ప్రిస్క్రిషను చూసి చెప్పసాగింది తన్మయి.

          ఇంతలో గ్లాసు నిండా టీ పట్టుకొచ్చి “ఇందమ్మా, ముందిది తాగు” అంటూ తన్మయి చేతికి టీ ఇచ్చింది బేబమ్మ ప్రశంసాపూర్వకంగా చూస్తూ.

          ఆవిడ మొదటి సారి తన్మయితో మాట్లాడుతూంది. తన్మయి తడబడుతూ “ముందు వదినకి ఇవ్వండి అత్తయ్యా” అంది.

          “పర్లేదమ్మా నువ్వు ముందు తాగు. పాపం కాలేజీ నుంచి వస్తానే నేను పరుగులు పెట్టించేను” అంది మంగ.

          రాత్రంతా తన్మయికి ఎదురు గదిలో నుంచి మంగ మూలుగులు వినిపిస్తూనే ఉన్నాయి. 

          అర్థరాత్రి ఆవిడ వేసుకోవలసిన టాబ్లెట్లు వేసుకుందో లేదో అడగడానికి వచ్చింది తన్మయి.

          ప్రతిగా చెయ్యి పట్టుకుని “నా తల్లే, దేవతలా పరిగెట్టుకొచ్చి ఎంటనే కాపాడావు. అది సాలక నా కోసం నిద్రోకుండా కూసున్నావా. ఏసుకొంటాలేమ్మా. నువ్వు పడుకో. పాపం పొద్దున లెగిసింది మొదలు పరుగులెట్టాలి” అంటూ కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడ సాగింది. 

          ఆ మరుసటి రోజు ఉదయాన్నే బేబమ్మ సర్ది పెట్టిన కేరేజీలు  తన్మయికి, ప్రభుకి స్వయంగా చేతికందించింది.

          ఏదో అనబోతున్న ప్రభుతో “దాసుబాబు పన్లో కుదిరేడు కదా. ఆడికీ కేరేజీ ఎట్టాలి. ఎలాగూ అందరికీ వంట ఒకటే పాలి అయిపోతది. మీకూ రోజూ కేరేజీ కట్టిఇచ్చేత్తానులే” అంది.

          వద్దంటే తల్లి ఏవంటుందో అని ప్రభు తన్మయి వైపు ఒప్పుకోమన్నట్టు చూసేడు.

          తన్మయి మారు మాట్లాడకుండా అందుకుంది. 

          తన్మయి చేతికి కేరేజీ కింది గిన్నెలోని వేడన్నం బాక్సు చుర్రుమని అంటుకుంది.

***

          మామూలుగా ప్రభు ఆఫీసు నుంచి వస్తూనే ఒక గంట సేపు కిందన వాళ్ళ వాళ్ళతో కబుర్లు చెప్పి అప్పుడు మేడ మీదికి వస్తాడు.

          ఆ రోజు ప్రభు ఎంతకీ రాకపోవడం చూసి పైన మధ్య హాల్లోకొచ్చి కిందికి చూసింది తన్మయి.

          కింద జరుగుతున్న సంభాషణలో బాబు ప్రస్తావన వినిపిస్తూండడంతో ఒక్క నిమిషం ఆగింది.

          ప్రభు తండ్రి కొడుక్కి ఉద్బోధన చేస్తున్నట్లు ” నువ్వెంత బాగా సూసినా ఏ గూటి సిలక ఆ గూటికే సేరతాది. నువ్వు ఎంత సొయానా అనుకుని పెంచినా ఆ పిల్లోడు రేపొద్దున్న ఆడి బాబు కాడికెల్లిపోతాడు. అంతే  గాకండా నీ ఆస్తీపాస్తీ మూటగట్టి అట్టికెల్లి పోయి ఆడి బాబుకి దొబ్బెట్టేత్తాడు, మరానక నీ ఇస్టం. నిన్ను గన్న తల్లీదండ్రీ మాటిని, ఆణ్ణి ఇప్పుడే అంపేత్తావో, నీ పెల్లాం మాటిని ఆణ్ణి నెత్తి మీద కూకుండబెట్టుకుని నీ కస్టార్జితవంతా ఆడి బాబుకే దారబోత్తావో ఆలోసించుకో” అన్నాడు.

          వింటున్న తన్మయి గుండె దడదడా కొట్టుకోసాగింది. కాళ్ళు వణకసాగేయి. పాదాల్లో నుంచి రక్తం చివ్వున నెత్తికి పాకి కోపం తన్నుకు వచ్చింది.

          ఎంత దారుణంగా ఆలోచిస్తూ నూరి పోస్తున్నారో!

          ఇప్పటికే బాబు పట్ల విద్వేషం పెంచుకుంటున్న ప్రభు మీద ఇలాంటి మాటలు ఇంకాస్త తీవ్రంగా పనిచెయ్యవూ! 

          పసివాడు ఏం పాపం చేసేడని వీళ్ళిలా కక్షగట్టి మాట్లాడుతున్నారు?

          ఇంతలో ప్రభు తల్లి అందుకుంది. 

          “బాబూ మీ నాన్న సెప్పిన మాటిను. పోనీలే పసోడంటే సోల్డు బియ్యమే గందా ఎగస్ట్రా అననుకుంటున్నావేమో. ఆడి సదువులు, సోకులే తిరుత్తావా, లేదా నీకు పుట్ట బోయే బిడ్డల బాగోగులే సూత్తావా?” అని ముక్కు చీదసాగింది.

          ప్రభు మాట మాట్లాడకుండా కూచుని ఉండడం ఇంకాస్త చికాకు పుట్టించసాగింది తన్మయికి. 

          అసలక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండాలని అనిపించక లోపలికి ఒక్క ఉదుటున వచ్చేసింది. 

          నిద్రపోతున్న బాబు తల నిమురుతూ “నాన్నా! నిన్ను ఇలాంటి మనుషుల మధ్యకి తీసుకు వచ్చిన నన్ను క్షమించు. నా ప్రాణమున్నంత వరకు నిన్ను నాకు దూరం కానివ్వను” అంటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలింది.

          వాళ్ళ చెడు మాటలు విని ప్రభు బాబుని తన నించి దూరం చేసే ప్రయత్నం చేస్తాడా? నిజంగా సంస్కారవంతుడయితే అసలు ఇలాంటి మాటలు స్థిమితంగా కూచుని వింటాడా?

          అయినా సిద్దార్థ చెప్పినట్లు “ప్రభు చిన్న పిల్లవాడు కాదు. అతను ఏం నిర్ణయించు కున్నా తనేం చెయ్యాలో తనకి బాగా తెలుసు” దృఢంగా అనుకుంది.

          ప్రభు మేడ మీదికి వస్తూనే ఏమైనా మాట్లాడుతాడేమో అని చూసింది.

          ముభావంగా ఉన్నాడే కానీ ఆ విషయాలేవీ కదల్చలేదు.

          అసలు అక్కడ ఏవీ జరగనట్టు అతి మామూలుగా ఉన్నాడు. 

          ప్రభుతో ఇదే వచ్చిన సమస్య. తనంతట తనుగా ఏ విషయమూ మాట్లాడడు. తనలో తను ఏం ఆలోచించుకుంటాడో తెలీనివ్వడు.

          ఎదుటి వాళ్ళు గొడవకు దిగినప్పుడు మాత్రం ఆ వేడిలో మనసులో చెలరేగు తున్నవన్నీ బయట పెట్టేస్తాడు.

          కాస్సేపటిలో కోపం తగ్గగానే తనని క్షమించమని నిస్సంకోచంగా అడుగుతాడు. 

          చాలా సేపటి తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ “దసరా సెలవులు వస్తున్నాయి కదా నీకు మీ ఇంటికి వెళ్ళాలని ఉంటే కొన్నాళ్ళు వెళ్ళిరా” అన్నాడు. 

          నిజానికి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా తనకి మనఃశ్శాంతి లేదు. 

          అయినా తన్మయి తల అడ్డంగా ఊపింది.  

***

          మర్నాడు భానుమూర్తికి ఒంట్లో బాలేదని, తనని చూడాలని అంటున్నాడని జ్యోతి కాలేజీకి ఫోను చేసింది.

          ఆ సాయంత్రమే  బయలుదేరింది తన్మయి.

          ప్రభు తన్మయిని, బాబుని రైలెక్కిస్తూ “త్వరగా వచ్చేయీ” అన్నాడు.

          కిటీకీలో నుంచి బయటికి చెయ్యూపుతున్న బాబుని పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న ప్రభుని చూసి మనసు చివుక్కుమంది తన్మయికి.

          అయినా తమాయించుకుంది. మనసులో ఒత్తిళ్ళు కడుపులోని బిడ్డ మీద తీవ్ర ప్రభావాలు చూపిస్తాయని ఎక్కడో చదివింది. 

          అయిదో నెల మరో వారంలో నిండనుంది. కొంచెం వేవిళ్ళు తగ్గి కాస్త మాములు కాసాగింది ఇప్పుడిప్పుడే.

          నిజానికి ఈ పాప కడుపులో పడ్డ సమయంలోనే  ప్రభు కుటుంబం తమ జీవితాల్లోకి ప్రవేశించడం, ఇల్లు మారాల్సి రావడం, వాళ్ళ సూటిపోటి మాటలు, బాబు పట్ల ప్రభు ప్రవర్తన ఒక్కటేవిటి… అన్నీ బాధాకరాలే. అసలు ఏ రోజూ తను సంతోషంగా లేదు. 

          మొదటిసారి బాబు కడుపులో ఉన్నపుడు ఎన్నెన్ని కబుర్లు చెప్పేది!

          అలాంటిది ఇప్పుడు జీవితం మొత్తం నిస్సారమయిపోయినట్లయ్యి కడుపులోని బిడ్డ మీద కూడా శ్రద్ధ పట్టలేకపోతోంది.

          పక్కనే కూచున్న బాబు అంతలోనే నిద్రకు జోగసాగేడు. తన ఒళ్ళో వాడి తలని ఆన్చుకుని కాళ్ళు పైకి సర్ది, చీర చెంగు తీసి వాడి మీద కప్పింది. 

          ఒక చెయ్యి బాబు తలమీద మరో చేతిని కడుపు మీద వేసి “పాపాయీ! ఎలా ఉన్నావమ్మా” అని మనసులోనే పిలిచింది.

          భౌతిక ప్రపంచానికి వినిపించని ఆత్మీయమైన స్వరమేదో తనని తాకినట్టు ఒక్క సారి బుడుంగున కదిలింది. ఇదే మొదటిసారి కదలిక కావడంతో తన్మయి చటుక్కున కదిలిన చోటే చేత్తో రాస్తూ లాలనగా మరిన్ని కబుర్లు చెప్పసాగింది.

          “ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురయినా నా రెండు రెక్కల చాటునా మిమ్మల్ని ద్దరినీ కాచి కాపాడుతాను. అమ్మ ఉంది మీకు ధైర్యంగా ఉండండి” అంది చీకటిని చీల్చుకెళుతున్న రైలు కిటికీలో నుంచి దూరాన మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాల్ని చూస్తూ . 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

2 thoughts on “వెనుతిరగని వెన్నెల (భాగం-60)”

  1. ‘విధి చేయు వింతలన్నీ నిజంగా మతిలేని చేతలే’నని వర్తమానంలో ఉండగలిగే ఎవరికైనా అనుభవమే!! నవల ప్రారంభ వాక్యమే ‘యు హావ్ అరేవుడ్ యువర్ డెస్టినేషన్’ అనేది చాలా కుతూహలని కలిగించింది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆలోచన కూడా లేకుండా, మొదలు పెట్టడం లేట్ అయిందేమో కానీ చదవడం మొదలుపెట్టిన తర్వాత అలా ఆ నవల ఆసాంతం కట్టిపడేసింది. మధ్యలో వచ్చే వ్యవహారిక విరామాలతో కూడా ఎప్పుడెప్పుడు మరలా నవల చదువుతానా అనే ఆలోచనతోనూ, ముందు భాగపు విశ్లేషణలతో బుర్ర పనిలో ఉండేది/పడింది.
    గతాన్ని మాటిమాటికి గుర్తు చేసుకోకుండా అనుభవాల మెట్ల మీద నడిచే అలుపెరగని పోరాటమే జీవితం!! మరిచిపోతూ ముందుకు సాగితే; అద్భుతమైన జీవితం మలుచుకునేందుకు దేవుడు రూపంలో ఎవరో అజ్ఞాత వ్యక్తి సహకరిస్తారని నమ్మకం., దాన్నుంచి అలవాటయ్యే ఓర్పు ఎంత గొప్పదో కదా!!
    కథానాయక పాత్రలో పోల్చుకొని అమ్మాయిలు ఉండరేమో!! ఆగక నడిచే కాలమే ఆదర్శంగా సాగితే తనది అనే సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం అసాధ్యం కాదని నిరూపించిన ఉదయని ఉరప్ తన్మయి అద్భుతం. *వెనుతిరగని వెన్నెల.. రేయి అంతా నీ తలుపుల జల్లేగా!!*

    ఒకరిని నమ్మే ముందు ఎంత సమయం తీసుకున్న పర్వాలేదు కానీ జీవిత సహచరుడిగా చేసుకున్నాక తన మునుపు అనుభవాలతో, తాటాకు చప్పుళ్ళకు భయపడక అలుపెరగని నడకలా సాగిన తన్మయి జీవితం నేడు ఎందరికో ఆదర్శం!! అజ్ఞాత స్నేహితుడుతో తన స్వగతాన్ని పంచుకుంటూ, జీవితాన్ని మార్చుకోవడం; తనదైన జీవితం కోసం తను కోరుకున్నట్లుగా సాగిపోవడం నిజంగా నవలను మరింత ఆశావాహంగా నడిపించింది. చాలా చక్కటి నవలారత్నాన్ని అందించిన రచయిత్రి డాక్టర్ కే. గీత గారు నిజంగా అభినందనీయురాలు. ఈ నవల ద్వారా అలుపెరగని నిత్య చైతన్యమే జీవితం అని జీవితం పట్ల ఆశను కలిగించడంలో రచయిత్రి సఫలీకృతులు అయ్యారు. మరెన్నో మంచి మంచి నవలలు ఆమె కలం నుండి ‘రేపటి కోసం’ జాలువారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    -అవసరాల పద్మజారాణి,
    విజయనగరం

    1. మీ ఆత్మీయ స్పందనకు అనేక ధన్యవాదాలు పద్మజారాణిగారూ!

Leave a Reply

Your email address will not be published.