వ్యాధితో పోరాటం
(నోట్ టు రీడర్స్)
–కనకదుర్గ
ప్రియమైన పాఠకుల్లారా,
ఈ ఏడాది జనవరి 8న నా జీవిత సహచరుడు శ్రీనివాస్ ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. క్రానిక్ పాన్ క్రియాటైటిస్ జబ్బుతో బాధ పడుతున్న నన్ను, నేను నెలలు నెలలు ఆసుపత్రులల్లో వుంటే చంటిపాపను స్ఫూర్తిని, పదేళ్ళ చైతన్యను కంటికి రెప్పలా కాపాడుకున్న నా భర్త, నేనే పని చేస్తానన్నా తనకి వీలైనంత సాయం సంతోషంగా చేసే వాడు. నేను ఆసుపత్రిలో వుంటే పిల్లల్ని రోజూ సాయంత్రం తీసుకుని వచ్చి చూపించే వారు. స్ఫూర్తిని ఆఫీస్ కి తీసుకెళ్ళేవాడు. కార్ సీట్లో పడుకో పెట్టుకుని పని చేసేవాడు, ఆకలేస్తే పాలు తాగించేవాడు, ఫ్లో అని సెక్రటరీ వుండేది, తను స్ఫూర్తిని తన మనమ రాలిలా చూసుకునేది. నేను సరదాగా అనేదాన్ని అదేదో సినిమాలో నాగభూషణం బుట్ట లో కొడుకుని పెట్టుకుని వెళతాడు కదా! అలా తీసుకెళ్తున్నావు నువ్వు అని. కానీ అంత ఓపికతో పాపని చూసుకుంటుంటే నాకు చేతులెత్తి దండం పెట్టాలని అనిపించేది. నాకు చాలా నొప్పి ఎక్కువయినపుడు నేను పాపని పెంచడానికి వుంటానో లేదో అని బాధ పడితే, “నువ్వు లేకపోతే ఎలా? అసలు ఆ ఆలోచన కూడా రాకూడదు నీకు. పాప అని తెల్సినపుడు ఎంత ఆనంద పడ్డావు. నా ఒక్కడి వల్ల కాదు, నువ్వుండాలి అంతే!” అనే తను పాప పెద్దయిపోయింది, బాబు పెళ్ళి అయిపోయింది కదా, అని నన్ను వదిలి వెళ్ళి పోయాడా నా శ్రీనివాస్?
ఇపుడు నేనేం చేయాలి? నాకు, నువ్వు లేకపోతే నేనుండలేను అని కూడా చెప్పే అవకాశం ఇవ్వకుండా చెప్పా పెట్టాకుండా అలా ఎవరైనా వెళ్ళిపోతారా? గుండె పగిలి పోయింది. జనవరి 9న ఇంటికి వస్తాడు, ఇంటి నుండి వెళ్ళి కీమోధెరపీ చేయించుకో వచ్చు అన్నారు డాక్టర్లు. నేను 7న ఇంట్లో వుండి క్లీనర్స్ ని పిలిపించి దగ్గరుండి ఇల్లంతా సానిటైజింగ్ చేయించాను. తను ఇంటికి వస్తే జాగ్రత్తగా ఏ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి కదా! సాయంత్రం నాన్న దగ్గరున్న స్ఫూర్తి ఫోన్ చేసింది, “నాన్నని ఐ.సి.యూకి తీసుకెళ్ళారు, నాకు భయమేస్తుంది మీరు త్వరగా రండి.” చైతన్య దోస, కుక్కని వాక్ కి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అది అయ్యాక వెళ్దామనుకున్నాము. నేను బట్టలు మార్చుకునే లోపల్ చిన్న వాక్ కి తీసుకెళ్ళి వచ్చాడు, వెంటనే పరిగెత్తాము. మేము వెళ్ళే వరకు స్ఫూర్తి కామ్ డౌన్ అయ్యింది.
“సడన్ గా బ్లడ్ ప్రెషర్ పడిపోయింది, మందు ఇవ్వడానికి ఇక్కడికి తెచ్చారట.” అని చెప్పింది. నాకు గుండెల్లో దడ మొదలయ్యి చాల సేపయింది. ఐ.సి.యూ అంటే భయం నాకు. త్వరగా తనని చూడాలని వుంది, కానీ ఎవ్వరూ పిలవలేదు. మేమే డోర్ దగ్గరికి వెళ్ళి బెల్ కొట్టాం. ఒక నర్స్ వచ్చి ఏంటీ? అన్నది. మేము చెప్పాము శ్రీనివాస్ ని చూడడానికి వచ్చామని. ఒక ఐదు నిమిషాల తర్వాత పిలిచారు. పరిగెత్తుకెళ్ళాము. చూడగానే నాకు బాధేసింది. ఎంత బాధగా వున్నా 3 వారాలుగా ఏం పర్వాలేదు నాకు కాలు నొప్పి తప్ప నాకేమి లేదు అనేవాడు. కాసేపయ్యాక డాక్టర్ వచ్చి బీ.పి పెరగడానికి మందు ఇస్తున్నామని, మందు స్టార్ట్ చేసేదాక బయటే వుండమన్నారు మమ్మల్ని.
డిసెంబర్ 15న ఎమర్జెన్సీకి వెళితే కాళ్ళు వాచి వున్నాయి, ఎడమ కాల్లో నొప్పిగా వుందని చెప్పాము.
ఆగస్ట్ లో శ్రీనివాస్ 60వ బర్త్ డేకి కాలిఫోర్నియాకి వెళ్ళాము. తనకి సెకోయా నేషనల్ పార్క్ కి వెళ్ళి అక్కడ వున్న 2000ఏళ్ళ చెట్టు జనరల్ షర్మన్ ని చూడాలని కోరిక. పిల్లలు అలాగే ప్లాన్ చేసారు. కొంత మంది ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాము, వాళ్ళు, మా మేనకోడలు ప్రజ్నఅందరూ బర్త్ డే చేసారు. ఎపుడు ఒక బర్త్ డే వద్దు వద్దు అంటూనే చేసుకునేవాడు. బర్త్ డే రోజు ప్రొద్దున నేషనల్ పార్క్ కి వెళ్ళి, జనరల్ షర్మన్ చెట్టు చూసి చాలా ఫోటోలు తీసుకున్నాము. అక్కడే సాయంత్రం దాకా వున్నాము. చాలా సంతోషంగా వున్నాము. ఏర్ బి అండ్ బి కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని శ్రీనివాస్ సోఫాలో పడుకుని రెస్ట్ తీసుకుంటుం డగా మేము ఇండియన్ బట్టలు వేసుకుని మెల్లిగా రూంలో నుండి బయటకు వచ్చాము. నా చేతిలో శ్రీనివాస్ కోసం తెచ్చిన బట్టలున్నాయి. మమ్మల్ని అలా చూసి “ఇదేమిటి? పొద్దున కేక్ కట్ చేసాము కదా! ఇపుడు మళ్ళీ ఇదేమిటి?” అని అంటుంటే నేను బట్టలు చేతికిచ్చి పిల్లలు ఏదో సరదా పడుతున్నారు, ఇక ఏం మాట్లాడకు,” అని రూమ్ లోకి పంపించాను. ఎంత సంతోషంగా చేసుకున్నాము, షష్టిపూర్తి! పిల్లల నవ్వులతో, ఆడుతూ, పాడుతూ ఎంత ఆనందంగా గడిపాము.
మర్నాడు హాలీవుడ్ సైన్ ని చూసాము, వాక్ ఆఫ్ ఫేమ్ లో మాకిష్టమైన యాక్టర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఫోటోలు తీసుకున్నాము.
ఇంటికి తిరిగి వచ్చాము. నా ఫీడింగ్ ట్యూబ్ వచ్చేస్తే నన్ను హాస్పిటల్ కి ట్యూబ్ చేంజ్ కి తీసుకెళ్ళాడు. అక్టోబర్ మొదటి వారం వరకు బాగానే వున్నారు. సడన్ గా జ్వరం వచ్చింది రోజు 100, 101,102 వరకు వెళ్తుండేది. నాకు 10 రోజులయినప్పట్నుండి భయం మొదలైంది. మా ఫ్రెండ్ జూలియా చూడడానికి వచ్చింది. డాక్టర్స్ ఏమంటున్నారని అడిగింది. ఎనీమియా, హెమోగ్లోబిన్ లెవెల్స్ బాగా తగ్గాయని అన్నారని చెప్పాము. ఒక రోజు లెవెల్స్ చాలా పడిపోతే డాక్టర్ ఫోన్ చేసి ఎమర్జెన్సీకి వెళ్ళమన్నారు. అక్కడ కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. మధ్య మధ్య చెక్ చేయించుకుంటున్నారు కానీ నెగెటివ్ అనే వచ్చింది. కోవిడ్ పాజిటివ్ రాగానే కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపించేసారు ఇంటికి. ఒక్క సి.టీ స్కాన్ చేసినా మాకు తెలిసేది. ఇంటికి వచ్చాక కాళ్ళు విపరీతంగా వాచాయి. ఎడమ కాలు అస్సలు కదలనివ్వడం లేదు. మా ఫ్రెండ్ జూలియాకి ఇలాగే జ్వరం వచ్చి ఆ తర్వాత లంగ్ క్యాన్సర్ అని తేలి ట్రీట్మెంట్ మొదలు పెట్టారని చెప్పింది. నాకప్పటి నుండే చాలా భయం మొదలయ్యింది. ప్రతి రోజు సి.టీ స్కాన్ కానీ పెట్ స్కాన్ చేయించు కోమని బ్రతిమిలాడడం మొదలు పెట్టాను. తనేమో అవసరమయితే వాళ్ళే చెబుతారు కదా అనేవాడు. అయినా నేను చెప్పడం మానలేదు, నా భయం రోజు రోజుకి ఎక్కువవ్వ సాగింది. తనని ఎపుడు అలా చూడలేదు. ఇదెక్కడికి దారి తీస్తుందో అని గుబులుగా ఉండేది.
కాలు నొప్పి తట్టుకోలేక వేరే ఎమర్జెన్సీకి వెళ్దామని అంటే చైతన్య న్యూయార్క్ నుండి వచ్చాడు. డిసెంబర్ 15 న తీసుకెళ్ళాము, కాలులో బ్లడ్ క్లాట్ ఉంది, అది క్యాన్సర్ వుంటేనే వస్తుంది అన్నది డాక్టర్. శ్రీనివాస్ కి, మాకు కోపం వచ్చింది. ఏం టెస్ట్ చేయ కుండా క్యాన్సర్ అంటుందేమిటి అని. కానీ సి.టీ. స్కాన్ లో బ్లడ్ క్లాట్ లంగ్స్ దాకా వుందని దాంతో పాటు పెద్ద మాస్ కనిపిస్తుందని అది క్యాన్సర్ లా వుందని చెప్పింది. నేను, చైతన్య ఏడిచాము, “నాకు భయం లేదు, కానీ మీరు నా కోసం బాధ పడితే నాకు చాలా బాధవుతుంది,” అని ఏడ్చాడు. ఆ నిమిషమే మేము ఆపేసాము, “నువ్వు ఫైట్ చేయి నాన్న, మేము నీ వెనక వున్నాము, ఇది తగ్గిపోతుంది. ఇపుడు చాలా మంచి ట్రీట్మంట్స్ వున్నాయి.” అని ధైర్యం చెప్పాము.
అలాగే ఆయన పక్కన ఎవరో ఒక్కరు ప్రొద్దున, రాత్రి, సాయంత్రం అందరం కలిసి ఆయన దగ్గరే కలిసే వాళ్ళము. ఆయనని చియర్ అప్ చేయడానికి ఫ్రెండ్స్, కొలీగ్స్ ని రమ్మని రిక్వెస్ట్ చేసాను. వచ్చారు అలాగే, స్టెరాయిడ్స్ మొదలు పెట్టినపుడు కొన్ని రోజులు బాగానే వున్నాడు, తర్వాత సడన్ గా ఢల్ గా అయిపోయాడు, టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక చాలా డీలా పడిపోయాడు. నర్సులు, మేము ధైర్యం చెబుతూనే వున్నాం. మొత్తానికి ఒక కీమో ఇచ్చారు, మొదటి రోజు బాగానే వున్నాడు కానీ మర్నాడు అన్నీ మరచిపోయాడు, నేను చూసి బాగా కంగారు పడ్డాను, ఏడ్చేసాను. ఒక్కరోజు ఇంట్లో పడుకు న్నది లేదు, ఎపుడు హుషారుగా తిరిగేవాడిని అలా చూసేవరకు నేను బెంబేలెత్తి పోయాను. ఇదేమిటి? కీమో మొదలైతే తగ్గిపోతుంది అనుకున్నాము, కానీ అది చాలా కష్టంగా వుంటుందని కూడా తెలుసు. రెండు రోజులయ్యాక మెమరీ వచ్చింది. హమ్మయ్య అనుకున్నాము. ఒకరోజు బాగున్నాడు, తర్వాత ఐ.సి.యూకి వచ్చాడు.
బీ.పి మందు మొదలు పెట్టాక మేము అక్కడే వుందామనుకున్నాము, కానీ డాక్టర్, “మీరు ఇక్కడ వుండి ఏం చేయలేరు. ఇంటికి వెళ్ళి రేపు 9 గంటలకు రండి,” అని చెప్పేది. శ్రీనివాస్ అంతకు ముందే, “లేట్ అవుతుంది వెళ్ళండి,” అనడం మొదలు పెట్టాడు.
వెళ్ళలేక వెళ్ళాము. నాకు నిద్ర పట్టలేదు. 5 గంటలకు ఫోన్ మ్రోగగానే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
” వియ్ ఆర్ డూయింగ్ ఎవ్విరిథింగ్ వియ్ క్యాన్, బట్ ఇట్స్ బెటర్ దట్ హిజ్ ఫ్యామిలి షుడ్ బి హియర్.” నేనేడ్చేసాను, “ఐ నో, ఇట్స్ హార్డ్! ప్లీజ్ కమ్ సూన్.” అని పెట్టేసింది.
నేను పిల్లలను లేపి త్వరగ బట్టలు మార్చుకుని బయల్దేరాము. మా క్లోజ్ ఫ్రెండ్ మాధవికి ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మన్నాను. చైతన్య మీనా (కోడలు) కి ఫోన్ చేసి చెప్పాడు. ఆ రాత్రే న్యూయార్క్ వెళ్ళింది, తను బయల్దేరి వచ్చేసింది. వాళ్ళ అమ్మా, నాన్నలు కూడా వచ్చారు. మమ్మల్ని చూడగానే తనదైన అందమైన చిరునవ్వుతో, “అదేమిటి ఇపుడే వచ్చారని,” అడిగాడు. “వూరికే నీ దగ్గర వుండాలనిపించి వచ్చాము.” అన్నాము. ఇక అక్కడి నుండి మొదలైంది పోరాటం. నేను శ్రీనివాస్ కి దగ్గరకు వెళ్ళి, “వాళ్ళు ఏదన్నా సరే నువ్వు మాత్రం గివప్ చేయద్దు,” అన్నా. “మీ గివప్, నెవ్వర్,” అన్నాడు చిరునవ్వుతో.
చాలాసేపటికి అన్ కాలజిస్ట్ వచ్చి, ” ఈ ఇన్ఫెక్షన్ తగ్గే దాక వేయిట్ చేయాలి, చేద్దాం!” అంది. మా మీనా అడిగింది, ” మరి అప్పటిదాక కీమో ఇవ్వడానికి వుండదు, లోపల క్యాన్సర్ పెరుగుతూనే వుంటుందా?”
“అవును, ఆ అవకాశం కూడా వుంది,” అని అంటుండగానే ఐ.సి.యూ నర్స్, డాక్టర్ వచ్చి, “మేం ఏమేం చేయాలో అన్నిచేసాము. ఇక మా దగ్గర ఏ చాయిస్ లేదు,” అని డాక్టర్ కి చెబుతూ, శ్రీనివాస్ ని కూడా అడిగారు, “డూ యూ అండర్ స్టాండ్ వాట్ వియ్ ఆర్ సేయింగ్?” అని ఆయనని అడగగానే నేను షాకయ్యాను. ఆయన, ” ఐ అండర్ స్టుడ్,” అనగానే నా కళ్ళు నయాగరాలే అయ్యాయి. నా దు:ఖం ఆగలేదు.
డాక్టర్ “ఆర్ యూ ఓకే, యూ కాన్ట్ గెట్ అప్ సెట్ ఇన్ ది రూం, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది పేషంట్.” అన్నాడు. “మేమేం చేయలేము నీకర్ధం అవుతుందా?” అని డైరెక్ట్ గా పేషంట్ ని అడిగిన డాక్టర్.
ఆయనకు చేంజ్ చేయాలని మమ్మల్ని బయటకు తోసారు. అన్ కాలజిస్ట్ ని అడిగాను నేను, ” నిన్నటి వరకు ఏం కాదు, తగ్గిపోతుంది అని చెప్పిన నువ్వు ఏం మాట్లాడవేమిటి?” అని అరిచేసాను. ” వియ్ డింట్ ఎక్స్ పెక్ట్ ధిస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్.”
“హౌ? యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్, రైట్?”
“బట్ ధిస్ ఈజ్ ఏ రేర్ కాంప్లికేషన్, వియ్ డిడ్ నాట్ ఎక్స్ పెక్ట్ ధిస్,” అంది. నేను అరవసాగాను, ” ఆయనకి ఏమైనా అయితే నేనుండను తెలిసిందా?’’ అని.
శ్రీనివాస్ రూమ్ కి దగ్గర వున్నామని నన్ను వేయిటింగ్ హాల్ లోకి తీసుకెళ్ళారు.నాకు పానిక్ అటాక్ వచ్చింది. నర్స్ వచ్చి హెల్ప్ చేసింది.
35 ఏళ్ళ బంధం ఇంకొద్ది సేపట్లో విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోతున్నాడని తెలిస్తే ఎలా వుంటుంది? గుండె పగిలిపోయింది.
నేనొప్పుకోను అన్నాను, అపుడు అదే నర్స్ వచ్చి, “నేను ఇపుడే గివప్ చేయటం లేదు, నువ్వు కూడా ఇపుడే ఆశ వదులుకోవాల్సిన అవసరం లేదు,” అని తీయటి మాటలు చెబితే నేను పిచ్చిదానిలా నమ్మి రూమ్ లోకి వచ్చాము.
వూపిరి సరిగ్గా అందడం లేదు, ఆక్సిజన్ పెట్టినా ఇబ్బంది పడుతున్నాడు.
మాస్క్ ఆక్సిజన్ కూడా పెట్టడం రాదన్నారు, ఆయన ఇబ్బంది చూసి పెట్టారు.
నేను మళ్ళీ అదే మాట చెప్పడానికి ప్రయత్నించాను, ” మనకి ఎంతో కష్టం వచ్చినపుడు నువ్వు నీ ధైర్యం వీడకుండా ఒక్కడివే ఎలా చూసుకున్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో…” “నేనొక్కడ్నే ఏం చేసా..ను, మనం అంద..రం కల..సి చేసాం,” అన్నాడు.
“నన్ను చెప్పనీ ప్లీజ్.” “ఆ.. చెప్పు చెప్పు,” అన్నాడు.
“ఇపుడు కూడా అదే ధైర్యంతో పోరాడు..”
“ఊ.. సరే,” అన్నాడు.
చైతన్య మేము కాలిఫోర్నియా ట్రిప్ కెళ్ళినప్పటి ఫోటోస్ చూపించడం మొదలు పెట్టాడు. చూస్తున్నాడు.
నేను, “ఒక కవిత చదవనా?” అని అడిగా.
“ఊ..”అని తల ఊపాడు.
మాటలు తగ్గిపోతున్నాయి.
సిరివెన్నెల గారి, “ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి…” కవిత వినిపించాను.
కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతున్నాము. చైతన్య, స్ఫూర్తి మధ్య మధ్యలో నాన్న అని పిలిస్తే ” హా” అంటున్నాడు.
కానీ చూపు గోడ మీద ఆగిపోయింది. మేము ఆ నర్స్ కి చెబితే టార్చ్ తో కళ్ళు చెక్ చేసి నర్సులు వచ్చి “ఇంకెక్కువ సమయం లేదు, మీరందరూ ఆయన దగ్గరే కూర్చొని మీ మనసులో వున్న మాటలన్నీ చెప్పేసుకొండి,” అని గబగబా చెప్పారు. “అదేంటీ? ఇపుడే ఆయన కవిత విన్నాడు, పిల్లలు పిలిస్తే పలికాడు.”
కీమోతో ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి పూర్తిగా పోయింది. నేను పోరాడు, పోరాడు అంటే ఎలా పోరాడుతాడు నా బంగారం? నా గురించే ఎపుడు ఆలోచిం చే మనిషి నన్నూ, తన ప్రాణానికి ప్రాణం అయిన పిల్లల్ని వదిలి పెట్టి వెళ్తున్నానని ఆయనకి తెలిసి పోతే అది ఎంత నరకం.
“నాన్న, వియ్ లవ్ యూ, నువ్వు మాకు అన్నీ నేర్పించావు. నువ్వు దేని గురించి బాధ పడకు. మేము బాగుంటాము. నువు ప్రశాంతంగా నిదురపో,” ఏడుస్తూ చెపుతు న్నారు.
నేను సారీ చెపుతున్నాను, ఆయనకు ఈ మధ్యనే ఆఫీస్ పని తగ్గించుకొని ఫ్యామిలీ తో సమయం గడపాలని నిర్ణయించుకున్నారు. ఏ ఏ ప్రదేశాలు చూడాలో కూడా పిల్లలకు చెప్పాడు. అవన్నీ అవ్వకుండానే జీవితం అయిపోతుంటే చూడలేకపోయాను.
నేను తెలిసో, తెలియకో చేసిన తప్పులకు సారీ చెబుతున్నాను.
కొద్దిగా నొప్పి నాకొస్తేనే తల్లడిల్లిపోయే మనిషి నాకు దూరమవుతుంటే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం ఏంటో శ్రీనివాస్ ని చూసి తెలుసుకోవాలి. ఈ సంగతి అందరికి తెల్సు, ఆఫీసులో కొలీగ్స్ కి, ఫ్రెండ్స్ కి, నువ్వంటే వాడికి ప్రాణం అమ్మా నువ్వు ఇపుడు జాగ్రత్తగా వుండాలి అని చెప్పారు తర్వాత ఆయన ఫ్రెండ్స్.
మేం చూస్తూ వుండగానే వూపిరి తీసుకోలేక అవస్థ పడి మెల్లిగా ఆగిపోయింది. నేను నా జీవితంలో ఎవ్వరి ప్రాణం తన ప్రాణానికి ప్రాణమైన కుటుంబాన్ని వదిలి పెట్టి పోవడం చూడలేదు.
ఎంత అందమైన వాడు ఈ దరిద్రపు క్యాన్సర్ తో పోరాడి సన్నగా అయిపోయి, చూస్తేనే దు:ఖం వస్తుంది.
చాలాసేపు ఏడుస్తూ అలాగే ఆయన దగ్గరే వుండిపోయాము. మర్నాడు ఇంటికి రావాల్సిన మనిషి, ఇక్కడే వదిలేసి వెళ్ళాలంటే ఎవరో గుండెని కోసేస్తున్నట్టుగా వుంది. ఈ మధ్యే బేస్మెంట్ తనకిష్టం వచ్చినట్టు ఫినిష్ చేయించాడు. పిల్లల్ని అడిగి కలర్స్ సెలెక్ట్ చేసాడు.
ఏ మార్పు చేయాలన్న నాతో, స్ఫూర్తితో, చైతన్యతో మాట్లాడాకే చేయించేవాడు.
నాకు ఇంటికి ఒంటిగా వెళ్ళాలని లేదు. తను లేకుండా ఆ యింట్లో వుండగలనా? ఆయనకిష్టమైన ఇంట్లో కాకుండా ఇంకెక్కడ వుండను?
ఇంటికి కావాల్సినవన్నీ ఇద్దరం కలిసి చేసుకున్నాము, మొక్కలు పెట్టడం వాటిని బాగా చూసుకోవడం, నేను కటింగ్స్ చేయడం క్లీనింగ్ చేయడం చేసేదాన్ని.
బయట పనులన్ని తనే చేసేవాడు. నాకు ఏమి తెలియదు, నాకు చెప్పు, నాకూ తెలిస్తే బాగుంటుంది కదా అంటే, నేనున్నాను కదా! ఇవన్నీ నీకెందుకులే అనేవాడు.
ఎండాకాలం పుచ్చకాయ తెచ్చి జ్యూస్ చేసి ఫ్రిజ్ లో పెట్టి తాగమనేవాడు. ఇలా ఎన్నెన్ని చెప్పను.
నా ప్రాణానికి ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోయింది.
ఇపుడే ఒకరికొకరు తోడుగా వుండి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి ఒకరినొకరు చూసుకో వల్సిన సమయంలో నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు నా శ్రీనివాస్.
భార్యా, భర్తల బంధం కష్టం, సుఖం, అన్నింట ఒకరికొకరు తోడుగా వుండాలి. మేమిద్దరం అలాగే వున్నాము. నాకు దొరికింది కోహినూర్ డైమెండ్ లాంటి భర్త. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాలేదా అంటే వచ్చాయి. వాటిని అధిగమిస్తూ వచ్చాము. నేను అందరిలో వుండాలని కోరుకునేదాన్ని, ఆయన ఇంట్రోవర్ట్, ఇంటి వాళ్ళతో కాదు. తను నాతో ఎక్కువగా ఏం షేర్ చేసుకునేవాడు కాదు, మౌనమే నా సమాధానంలా వుండేవాడు. నేను రాస్తున్న వ్యాధితో పోరాటంలో మీరు మా అనుబంధం గురించి, ఎలా మార్చు కోవాలనుకున్నాము అన్నీ చదువుతారు.
వచ్చే నెల నుండి ఎక్కడ ఆగిందో అక్కడ నుండి పంపిస్తాను.
*****
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.
Kanakadurga garu, missed your write up all these months and worried about your health but never imagined you had to go through such a traumatic experience of losing a loving life partner. My heartfelt condolences to you and your family and pray for strength to move on with his loving memories.
Thanks Subha garu! Yes it’s an unexpected tragic trauma that our family has to go through! We are still dealing with the tough situation.
I’m going to write regularly from next month because this month was busy with visitors from India and some from CA & Texas. It was hectic. But I’ll start, “Vyadhitho poratam,” from next month.
Thanks for your patience , support and understanding!
I appreciate it very much!