సాండ్ విచ్ జనరేషన్

-శాంతి ప్రబోధ

          రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు ఉంది నా పని. లేకపోతే వెంకటలక్ష్మి గోడు నాతో వెళ్ళబోసుకోవడం ఏంటి? 

          విచిత్రంగా లేదూ! 
 
          మూడ్నెల్ల క్రితం అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తున్నానని భూమిపై కాళ్ళు  నిలిస్తేగా.. అటువంటి వెంకటలక్ష్మి ఇప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చి తన గూట్లో వాలదామా అని తొందర పడుతున్నది అని లోలోన చిన్నగా నవ్వుకుంది సుజాత. 
 
          ఆ వెంటనే, పాపం వెంకటలక్ష్మి. మనసు లోతుల్లో గూడుకట్టుకున్న బాధలు చెప్పు కోవడానికి దానికి మాత్రం ఎవరున్నారు. ఏకైక నేస్తం నేనేగా అనుకుంది. ఆడపిల్లలుంటే అదో దారి. మంచో చెడో పంచుకోడానికి ఒక్క ఆడపిల్లైనా ఉండాలి. నువ్వు అదృష్టవంతు రాలివి సుజా అంటుంది. 
 
          ఇద్దరూ ఒకే ఊరి వాళ్ళు. చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ హైదరాబాద్ మహా నగరంలో స్థిరపడ్డారు. దీంతో ఆ స్నేహం మరింత గట్టిపడింది.  సంసార సాగరంలో మునిగి తేలుతూ అందులోని కష్టాలు, కన్నీళ్ళు కలబోసుకుని ఓదార్పు పొందుతారు. 
 
          వెంకటలక్ష్మి అమెరికా ప్రయాణం అవుతున్నప్పుడు సుజాతకి లోలోన చెప్పలేని బెంగ. అట్లాగని ఇద్దరు ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తారని కాదు. ఒక్కోసారి ఏడాది రెండేళ్ళు అయినా కలవరు. అప్పుడప్పుడు ఫోన్ పలకరింపులు తప్ప. 
 
          సుజాత పరిస్థితి బాగా తెలిసిన వెంకటలక్ష్మి అమెరికా వెళ్తూ అత్తగారింటికి వెళ్ళే  బిడ్డకు అప్పగింతలు చెప్పినట్టు చెప్పింది. ఇక్కడున్నా ఎక్కడున్నా మన మధ్య దూరం తెంచేది ఈ సెల్ ఫోన్ కదా అంటూ..  ఆప్తమిత్రురాలిని పంపి మూడు నెలలు కాలేదు.  
ఏ రోజుకారోజు తన పరిస్థితి చెప్పుకుని స్వాంతన పొందుదామని సుజాత ఎదురు చూస్తున్న సమయంలో వచ్చింది వెంకటలక్ష్మి ఫోన్ ఆమె బాధ సుజాతకు అర్థమవు తున్నది. ఏ దేశంలో ఉన్నా అమ్మ పరిస్థితి ఒకటేనని. కాఫీ డికాషన్ ఫిల్టర్ లో వేసి, పాలు పొయ్యి మీద పెడుతూ ఆలోచిస్తున్నది. 
 
          అంతలో “అమ్మా..సుమకి అసలు నిద్ర లేదు. కాసేపు పడుకుంటుంది. స్వీటీని  తీసుకో” అంటూ కొడుకు పురమాయింపు. 
 
          మౌనంగా వెళ్ళి  ‘నామా ” అని కేరింతలు కొట్టే మనవరాలితో బయటికొచ్చింది సుజాత.    
 
          ‘నామా… నామా ‘అంటూ ముద్దులొలకబోసే పసిదాన్ని చూసి మురిసిపోయింది ఆమె మనసు. ఈ రోజని కాదు, ఎప్పుడూ ఇంతే. పిల్ల ఏడుస్తుంటే భార్య భర్త నిద్ర లేవరు. మంచం దింపుతారు. అది బుడిబుడి అడుగులతో తలుపు దగ్గరకు వస్తుంది. అంతలో కొడుకు అమ్మా అని గట్టిగా పిలుస్తాడు. ఈ తల్లికి అర్థమైపోతుంది.  
 
          ఉద్యోగం చేసే భార్యకి నిద్ర తగ్గిందనో, నీరసంగా ఉందనో పెళ్ళాం గురించి ఆలోచించే కొడుకు తల్లి గురించి ఆలోచించడెందుకో.. ఆ తల్లి మనసులో ఓ మూలన ముల్లు గుచ్చుతున్నట్లుగా నవ్వుతూ ఎప్పుడో ఓ సారి ఆ మాట అంటే నువ్వు ఇంట్లో ఉంటావుగా..తేలిగ్గా అనేశాడు. తండ్రి తలలోంచి ఊడిపడినట్లున్నాడు. అదే తీరు. 
 
          తాను ఇంట్లో ఉంటే మటుకు క్షణం కాళీ ఉంటేగా.. 
 
          బయటకిపోయి ఎనిమిది గంటలో తొమ్మిది గంటలో పనిచేసి వస్తే డబ్బులువస్తాయి కాబట్టి ఆ పనికి విలువ. రోజంతా ఒళ్ళు గుల్ల చేసుకుని చేసే ఈ తల్లి శ్రమకి గుర్తింపులేదు. వీసమెత్తు విలువ లేదు ప్చ్ .. బాధగా మూలిగింది సుజాత మనసు. 
 
          మనసులో కాగుతున్న ఆలోచనలతో మనవరాలి డైపర్ మార్చి పాలు కలిపి పాల బాటిల్ అందిస్తుండగా సైరన్ మోగినట్టు అత్తగారి పొలికేక. 
 
          “ఒసే సుజాతా .. ఎక్కడ చచ్చావే .. 
 
          పొద్దు పొద్దున్నే ముదనష్టపు  ఫోన్ పట్టుకుచ్చున్నావా.. . మంచం మీద నుంచి లేవ లేని ముసల్దానితో నాకేంటి అని ముచ్చట్లాడుకుంటున్నావా.. దాన్నక్కడ పడేసి ముందు ఈ దరిద్రాన్ని మార్చు ..” హుకుం జారీ చేసింది అత్తగారు.  
 
          ఆవిడ గావు కేకలకి కొత్తలో సుజాత చాలా ఇబ్బంది పడేది. ఇరుగుపొరుగు ఏమనుకుంటారోనని బెంగ పడేది. ఇప్పుడు అలవాటయిపోయింది. ఆవిడ మొదటి కేకకు వెళ్ళకపోతే ఆ నోరు మరింత పెరుగుతుంది. భాష మారుతుంది. ఇరుగు పొరుగు దృష్టిలో ఇంట్లో వాళ్ళ దృష్టిలో సుజాతను నేరస్థురాలు చేసి చూపడమే ఆమె ధ్యేయం అని అర్థం చేసుకున్న సుజాత ఆవిడకు ఆ అవకాశం సాధారణంగా ఇవ్వదు. అందుకే పాలు తాగు తున్న మనవరాలి ముందు బొమ్మలు వేసి అత్తగారి గది వైపు వడివడిగా నడిచింది. 
 
          ఎంత చేసినా ఈవిడ ఇంతే. ఆవిడని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నట్లు  ఈటెల్లాంటి మాటలు వదులుతుంది. వాటిని మనసుకు తీసుకోవద్దని ఎంత ప్రయత్నిం చినా గుండెల్లో గుచ్చుకుని బాధిస్తూనే ఉంటాయి. 
 
          కొద్దిగా ముందు వెనక అంతే. ఆవిడ డైపర్ మార్చక నాకు తప్పుతుందా… అనుకుం టూ డైపర్ తీస్తుంటే గుప్పు మన్న వాసనకి లోపలంతా తెమిలింది.   
 
          ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం ఆ అత్తగారి డిక్షనరీలోనే లేదు. అసహనం ప్రదర్శించడం, ఆగ్రహం వెల్లగక్కడం ఆవిడ ఆస్తులు. ఆవిడకు అనారోగ్యంతో, లేవలేని తనంతో వచ్చిన అసహనం కాదు. అత్తగారిగా అధికారం చెలాయించాలని, ఆధిపత్యం ప్రదర్శించాలని అహర్నిశలూ ఆలోచించే తత్త్వం సుజాత బాగా అర్థం చేసుకుంది. 
 
          ఎంత కోడలు అయితే మాత్రం .. ఎంత కాలమని ఆవిడను సహించాలి?  సుజాత కూడా అత్తగారై నాలుగేళ్ళయింది. ఏనాడైనా అట్లా కోడలితో మాట్లాడిందా? ఉహు .. 
ఇక్కడ కూడా ఆమెనే ఒదిగి ఒదిగి ఉండాల్సిన స్థితి. అట్లాగని కోడల్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. కూతురులాగానే చూసుకుంటున్నది. కాకపోతే, కోడలు తన పిల్ల పనులు తాను చేసుకుని, వంట పనిలో కొద్దిగా సాయపడుతూ ఉండాలని సుజాత కోరుకుంటుంది. అలాగైతే తనకు కొద్దిగా అలసట తప్పుతుందని ఆశ పడుతుం ది. కానీ నోరు తెరిచి ఆ మాట కోడలితో ఎన్నడూ చెప్పలేదు.  
 
          పిల్లల డైపర్ మార్చడం పెద్ద ఇబ్బందిగా ఉండదు కానీ అడల్ట్ డైపర్స్ మార్చి శుభ్రం చేయడం మాత్రం నరకమే. ఆ వాసనతో లోపలంతా తెములుతుంది. వాంతి వచ్చినట్లుగా ఉంటుంది. అయినా తప్పదు. ఒకటి కాదు రెండు కాదు, ఏడేళ్ళుగా నిర్విరామంగా ఆ పని చేస్తూనే ఉంది సుజాత. అయినా చిన్న మెచ్చుకోలు ఉండదు. 
 
          నీకున్నంత ఓపిక నాకు లేదు వదిన. నా కన్నతల్లి అయినా సరే..  నాతో కాని పని. పోతే పోయింది ఒక మనిషిని పెట్టుకుంటే పోలా అని ఉచిత సలహా పడేసే ఆడపడుచు మైత్రి మాటల్లో వదిన మీద ప్రేమ కన్నా ఆ పని బరువు తన మీద పడకుండా ముందు జాగ్రత్త అని అర్థం చేసుకోలేనంత పసిది కాదు సుజాత.   
 
          ఒసే.. నీకేం నువ్వు బాగానే చెబుతావ్. పాతికవేలు పోసి, తిండి పెట్టి ఇంట్లో ఉంచు కోవడం అంటే మాటలా? నా కొడుకు తెచ్చిపడేస్తుంటే మీకెక్కడా తెలియట్లేదు. కయ్ మన్నది అత్తగారు. 
 
          అంతటితో ఆ మాటలు అక్కడికి ఆగిపోయాయి. కానీ సందర్భం చూసుకుని భర్తతో ఆడపడచు అన్న మాటలు చెప్పింది. అతను అంత ఎత్తున లేచాడు. ఇంటికాడ కూర్చుని తమరు చేసే పాటు ఏంటో .. 
 
          కష్టపడి సంపాదించే వాడికి తెలుస్తుంది నొప్పి. నీకేం తెలుసు అన్నప్పుడు ఆమె రాత్రింబగళ్ళు ఇంటిల్లిపాది కోసం చేసే గాడిద చాకిరీకి వీసమంత విలువ లేదనిమరింత కుంగిపోయింది.  
 
          నా కుటుంబం నా వాళ్ళు అని చేస్తున్న ఉద్యోగం వదిలి తప్పు చేసిందని మరోసారి రుజువైందని తనలో తానే వేదన చెందింది సుజాత. 
 
          ఒకసారి ఎప్పుడో మా అమ్మాయికి చిన్నప్పటి నుండి బెరుకు ఎక్కువ. చీదరఎక్కువ అని సుజాత తల్లి అన్నదని అత్తగారు చేసిన రాద్ధాంతం ఆమె మరుపు మడతల్లోకి పోలేదు. 
 
          చిన్న చితక వచ్చే అనారోగ్యాలు అస్సలు లెక్క చేయని సుజాత మెడలు వంచి మంచం మీద పడేసింది తీవ్రమైన జ్వరం. అటువంటి లేవలేని స్థితిలో కూడా అడల్ట్ డైపర్ మార్చక తప్పలేదు. ఆ పరిస్థితి గమనించి మామగారు అతని భార్య పనులు చేయబోతే అత్తగారు ససేమిరా ఒప్పుకోలేదు. 
 
          ఛి ఛి .. ఇంత బతుకు బతికి మీరీ పనులు చేయడం ఏంటని అతన్ని దగ్గరకు రానీయలేదు.
 
          జ్వరం పేరుతో నాటకం ఆడి తనను ఇబ్బంది పెడుతున్నదని కూతురికి, టూర్ లో ఉన్న కొడుక్కి ఫోన్ చేసి మరీ చెప్పింది. ఆవిడ నోరు ఎలా ఉన్నా సరే ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలిగితే సుజాత ప్రాణానికి కొంత ఊరట. కానీ అది జరిగే అవకాశమే లేదు. 
మహారాణిలా అన్నీ మంచం దగ్గరకే రప్పించుకుంటూ సాగించుకునే ఆవిడ మిగతా ఆరోగ్యానికి ఢోకా లేదు. తిండి పుష్టి ఉన్న మనిషి. కావాల్సినవి చేయించుకుని తింటుంది. ఆడపాదడపా భర్తతో బయటి నుండి రహస్యంగా తెప్పించుకు తింటుంది. 
 
          ఈ మనసొకటి ఉన్నచోట ఉండదు. ఏదో ఒకటి తొలుస్తూనే ఉంటుంది. నిన్నటి వో , మొన్నటివో కళ్ళ ముందుకు తెస్తుంది . లేదంటే రేపటి గురించి అడుగుతుంది. దీన్ని ఎంత కట్టడి చేసినా రెక్కలు తెంచుకుని కందిరీగలా రొద చేస్తూనే ఉంటుంది అను కుంటూ ఆ ఆలోచనల పీక నొక్కి ఆవిడ పనులు ముగించి ఇవతలికి వచ్చింది సుజాత. 
 
          అంతలో వాకింగ్ ముగించుకొచ్చిన మామగారి చేతిలో కాఫీ కప్పు పెట్టి, స్వీటీని కనిపెట్టుకు ఉండమని చెప్పి హడావిడిగా స్నానం ముగించింది. టిఫిన్, వంట పనిలో పడింది.  
 
          ఇది ప్రతి రోజూ క్రమం తప్పకుండా జరుగుతూన్నదే.  
 
          అంతలో కాలింగ్ బెల్  అదేపనిగా మోగడంతో ఇంత పొద్దున్నే ఎవరొచ్చారు అను కుంటూ వెళ్ళి తలుపు తీసింది.  ఎదురుగా చుడిదార్ లో స్త్రీ. ఎవరో అర్ధంగాక నిశితంగా చూసింది. వయసుని దాటేస్తూ జుట్టుకు రంగు, ఆధునిక వస్త్రధారణలో ఉన్న ఆ మహిళను ఎక్కడో, ఎప్పుడో చూసినట్టు ఉన్నది. కానీ ఎవరో పోల్చుకోలేక పోతూ “ఎవరు కావాలండీ” మర్యాదగా పలకరించింది. 
 
          “సుజాత.. సుజాత .. ” 
 
          “హా .. నేనే సుజాత. “
 
          ఎదుటి వ్యక్తి మోహంలో ఆనందం పరుచుకుంది. 
 
          “నువ్వు సుజాత.. ” ఆశ్చర్యంగా 
 
          “ఆ.. అవును నేనే.. ?
 
          “సుజాతా.. నేను అరుణని.. బుద్దిపల్లి అరుణని ..” అంటూ హగ్ చేసుకోబోయి ఆగింది. 
 
          “బుద్దిపల్లి అరుణ .. “నొక్కి పలికి ఓ క్షణమాగి,” ఆ అరుణా నువ్వా … అస్సలు గుర్తు పట్టలేక పోయాను”. పట్టలేని సంతోషంతో మొహం విప్పారుతుండగా సుజాత “ఎలా గుర్తు పడతావ్.. టీనేజ్ లో చూసుకున్న మనం ఆ తర్వాత ఒక్కసారైనా కలిసామా.. లేదుగా మరి! ” అంటున్న అరుణని సాదరంగా లోనికి ఆహ్వానించింది. 
 
          “కూర్చోవే ..” అంటూ మిత్రురాల్ని హాల్ లో కూర్చోబెట్టి, మధ్య మధ్యలో మాటలు కలుపుతూనే ఇడ్లీ పొయ్యి మీద పెట్టి పసిబిడ్డకు గ్రైప్ వాటర్ పట్టించి కోడలికి అందిం చింది. మామకు ఇన్సులిన్ ఇచ్చి వచ్చింది, చట్నీ సిద్ధం చేసింది. ఓ పక్క రైస్ కుక్కర్ లో రైస్ పెట్టింది. ప్రెషర్ కుక్కర్ లో పప్పు పెట్టింది. మరో వైపు కూరకు బెండకాయ ముక్కలు తరుగుతున్నది.  వేడివేడి ఇడ్లిలు మామకు టేబుల్ పై పెట్టి, పక్షవాతం అత్తకు, ఏ క్షణమైనా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకు మామ తల్లికి తినిపించింది. 
 
          అంతలో కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్ళడానికి సిద్దమై వచ్చారు. హాల్ లోకూర్చున్న అరుణని చూసి ఎవరో అర్ధం కాక అత్తగారి దగ్గరకెళ్ళి గుసగుసలాడింది కోడలు సుమ. 
ఆ తర్వాత నమస్తే ఆంటీ  అంటూ అరుణను పలుకరించింది. కొద్ది సేపయితే అత్తయ్య కాస్త ఫ్రీ అవుతారు. ఇది హై డిమాండ్ టైం అంటూ నవ్వేసింది. 
 
          అష్టావధానం చేస్తున్న సుజాత స్థితి అర్థం చేసుకున్న అరుణ తానే చనువుగా వంట గదిలోకి వెళ్ళింది. 
 
          “అయ్యో అరుణా .. కూర్చో .. వచ్చేస్తున్నా” అన్నది సుజాత. 
 
          “నేనే.. రాంగ్ టైం లో వచ్చా. నిన్ను కలవాలని ఆత్రుతలో సమయా సమయాలు పట్టించుకోకుండా వచ్చేసా.. సారీ నే..” నొచ్చుకుంటూ అరుణ.
 
          “ననెతుక్కుంటూ వచ్చిన మొదటి మనిషివి నువ్వే. నిన్ను చూసిన సంతోషం నన్ను నిలువనీయడం లేదు” అంటూ ఆ చిన్న వంట గదిలో ఎక్కడ కుర్చోపెట్టాలా అని పరికించి చూస్తూ “ఐదు నిముషాలు కూర్చో .” అని చెప్పింది.  
 
          ఇంట్లో వాళ్ళందరి అవసరాలు తీరుస్తూ మధ్య మధ్యలో స్నేహితురాల్ని పలకరిస్తూ హడావిడిపడుతున్నది సుజాత. అరుణ పక్కనే కూర్చుని తనివితీరా కబుర్లు చెప్పుకోవా లని ఆమె మనసు తహతహ లాడుతున్నది. కానీ వీలుకాని స్థితి.  
 
          అరుణకు కూడా టిఫిన్ ప్లేట్ అందించింది. కానీ మన ఇద్దరం కలిసి కబుర్లు చెప్పు కుంటూ చేద్దాం అన్నది అరుణ. 
 
          సుజాత వీపు పై అత్తమామలు, భర్త నాయనమ్మ, ఒక చేతులో భర్త, మరో చేతిలో పిల్లలు , ఒళ్ళో మనవలు .., ఆ కింద ఆమె తల్లిదండ్రులు ఉన్నారని అరుణకు ఆ కాసేపట్లోనే అర్థమైంది. 
 
          మాట్లాడుతూనే కొడుకు, కోడలికి లంచ్ బాక్స్ సర్దింది. 
 
          అత్తయ్యా ..స్వీటీ తినకుండానే నిద్రపోయింది. అది లేవగానే ఫుడ్ పెట్టండి అంటూ హ్యాండ్ బాగ్ తో బయటికొచ్చి చెప్పులేసుకుంది సుమ. బైక్ స్టార్ట్ చేస్తున్న కొడుకును చూసి ఒక్క నిమిషం నాన్నా అంటూ పరుగుపరుగున కారేజ్ తెచ్చి అతని చేతిలో పెట్టింది సుజాత.  
 
          వెళ్తూ వెళ్తూ అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చి వెళ్ళు. వీలు చూసుకుని నేను వస్తానని చెప్పు అంటూ అనారోగ్యంతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు పంపింది. 
 
          మిత్రుడి కొడుకు పెళ్ళికి వెళ్ళడం వల్ల సుజాత భర్త ఇంట్లో లేడు. ఉండి ఉంటే అతనికి కూడా అన్నీ అమర్చి పెట్టాలి. ఒక్క క్షణం ఆలస్యమైనా చిందులు తొక్కుతుంటా డతను.
 
          “అరుణా నీ గురించి చెప్పు. ఎక్కడ ఉన్నావ్ , ఏం చేస్తున్నావ్ , అసలు నా గురించి ఎలా తెలుసుకున్నావ్ ” అంటూ ప్రశ్నల వర్షంతో కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చి కూర్చుంది సుజాత. 
 
          ఈ మధ్య అక్బర్ నగర్  ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మన చిన్ననాటి నేస్తం విజయశ్రీ కనిపించింది. తనే నీ అడ్రస్ వెంకటలక్ష్మికి తెలుసని చెప్పింది . అమెరికాలో ఉన్న వెంకటలక్ష్మి నీ అడ్రస్ ఇచ్చింది. ఎలాగూ హైదరాబాద్ వస్తున్నాను కాబట్టి వచ్చి నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇలా వచ్చేసాను. నా గురించి చెప్పొద్దని  వెంకట లక్ష్మికి చెప్పా”  చెప్పింది అరుణ. 
 
          “అదా సంగతి , వెంకటలక్ష్మి కొద్దిసేపటి క్రితమే నాతో మాట్లాడింది. నీ విషయం అందుకే చెప్పి ఉండదు’ మిత్రురాలి ప్లేట్ లో వేడి వేడి ఇడ్లీలు, కారప్పొడి, అల్లం చెట్నీ పెట్టి నెయ్యి వేస్తూ అన్నది సుజాత.
 
          ఇద్దరు ఇడ్లీతో పాటు కబుర్లతో కడుపు నింపుకుంటూ…
 
          సుజాతకి అరుణతో మాట్లాడుతుంటే మనసు తేలిక అవుతున్నట్లుంది. ఇలా మనసారా మాట్లాడుకుని ఎన్నాళ్ళయిందని మనసులోనే అనుకుంది. 
 
          “నువ్వు నువ్వేనా ..సుజాతా! చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్నిలా… “అంటున్న అరుణను చూస్తూ..  
 
          “యవ్వనపు తొలి రోజుల్లో ఏవేవో కలలు కంటాం. ఊహల్లో తేలిపోతుంటాం. ఆ వయసు అలాంటిది. వాస్తవంలో అదంతా సాధ్యమా అని ఆలోచించం. సాధ్యం చేసు కోవాలని మనసు పడుతున్న యాతనను కుటుంబం డామినేట్ చేసి తలవంచేలా చేస్తుంది. నోరు పెగలదు” అంటూ నిట్టూర్చింది సుజాత. 
 
          ‘జీవితం బాగుండడం అంటే అందులో జీవం ఉండాలి. గానుగెద్దులా పనిచేసుకు పోవడం కాదు. జీవితం పట్ల ప్రేమ ఆసక్తి కుతూహలం ఉండాలి’ అని మాట్లాడిన సుజాతేనా .. అని ఆశ్చర్యపోతున్నది అరుణ.
 
          అంతలో “సుజాతా.. ఎక్కడ చచ్చావే..  మంచినీళ్ళు ..” గట్టిగా అరిచింది అత్తగారు. 
వస్తున్నానత్తయ్య అంటూ పరుగుపరుగున వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ ఆవిడ పక్కన పెట్టి వచ్చింది. 
 
          “పెద్ద చదువు చదివి గొప్ప ఉద్యోగంలో బిజీగా అంత ఎత్తున ఊహించుకున్నా..  చురుకైన నీ తెలివితేటలు ఇంటికి పరిమితమయ్యాయంటే నమ్మలేక పోతున్నా ..” అన్నది అరుణ 
 
          “ఆడదాని బతుకు గురించి కొత్తగా చెప్పాల్సిందేముంది? ఎవ్వరిపై ఆధారపడ కుండా బతకాలని నా తాపత్రయం. స్వయం సంపాదన కోరుకునే నా వ్యక్తిత్వం బంధాలు బాధ్యతల ముందు తలవాల్చింది” నవ్వేసింది సుజాత. 
 
          “నిజమే సుజాతా .. కానీ మన ఆశలు, ఆశయాలు చంపుకుని కుటుంబం కోసం చేసే త్యాగాన్ని ఎవరైనా గుర్తించారా.. గుర్తిస్తారా.. ? గౌరవిస్తారా? 
 
          లేదు. చివరికి అన్ని విధాలా నష్టపోయేది మనమేనని ఈ మధ్యే నా కళ్ళు తెరుచు కున్నాయి. ఇక నుంచి నా వాళ్ళ కోసమే కాదు నా కోసం కూడా నేను బతకాలనుకుంటు న్నాను. మనిషిగా బతకాలనుకుంటున్నాను. నిన్నటి వరకు పనికిమాలిన దానివి అంటే అవునేమో అనుకున్నాను. మానాభిమానాలు లేకుండా బతికాను. ఇప్పుడిప్పుడే తలెత్తు కోవడం నేర్చుకుంటున్నాను… ”  చెప్పుకుపోతున్నది అరుణ . 
 
          పక్షవాతం వచ్చిన అత్త, షుగర్, హార్ట్ పేషెంట్ మామ, వయసుడిగిన మామ తల్లి సుజాత దగ్గరకు చేరినప్పటి నుండి వాళ్ళకు చాకిరీ చేస్తూనే ఉంది. వాళ్ళకు చేయడం కోసం చేస్తున్న ఉద్యోగానికి మొదట సెలవు పెట్టింది. ఆ తర్వాత రాజీనామా చేసింది.  అందరికీ ఏళ్ళ తరబడి సేవ చేస్తూనే ఉంది. అయినా ఎవరికీ తృప్తి లేదు. కంప్లైంట్స్ తప్ప. 
 
          వాళ్ళకు తోడు ఈ మధ్య సుజాత తల్లిదండ్రులు కూడా అనారోగ్యానికి గురయ్యారు.  వారి ఏకైక సంతానం సుజాతపైనే వారి బాధ్యతా భారం.  
 
          అటు తల్లి దండ్రులకు, ఇటు ఇంట్లో వారికి తన శక్తికి మించి సేవలు అందిస్తూనే ఉన్నది. 
 
          ఇప్పుడనే కాదు పిల్లల పెళ్ళిళ్ళు కాకముందు కూడా ఎంతో ఘర్షణ.. సంఘర్షణ. 
ఇంట్లో ఉన్న పెద్దల వల్ల సుజాతతో పాటు పిల్లలు కూడా అనేక ఇబ్బందులు..ఘర్షణలు.  వారిద్దరి మధ్య నలిగిపోయే సుజాత. 
 
          పిల్లలను అదుపాజ్ఞలలో పెట్టని సుజాత పెంపకాన్ని ఆడిపోసే అత్తగారు , కనీసం పక్క వేయడం రాదని, కుంకుళ్ళతో తల స్నానం చేయరని , తలకు నూనె రాసుకోదని,  కషాయాలు తాగరని , కళ్ళకు కాటుక పెట్టదని , పౌడరు రాసుకోదని ఆడపిల్లవు కావూ .. మనుమరాల్ని తీసిపడేసి అత్తగారి సాధింపులు మగపిల్లవాడు అని మనవడిని గారం చేయడం , కూర్చోబెట్టి అన్నీ అందించని కోడల్ని , మనవరాలిని తిట్టడం అన్నీరీలులా కదిలిపోతున్నాయి సుజాతకు. 
 
          అటు అమ్మ , అత్తల తరం చెప్పే మాటలకు ఎదురు చెప్పలేదు. వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేసింది. ఇంటి కోడలు బాధ్యత అని నీతులు చెబుతుంటే ఒక్కోసారి మనసులో విసుక్కున్నా, అరవై దగ్గర పడుతున్నప్పటికీ .. ఎదురు చెప్పే సాహసం ఈనాటికీ చేయదు. 
 
          అమ్మతో పాటు అత్త అన్నా ప్రేమ, భయము , భక్తి .. అందరి మాటలు వినడమే గానీ నోరెత్తి మాట్లాడింది లేదు. ఏ మూలో మాట్లాడాలని ఉన్నా అది గొంతు దాటి రాదు. మాట పెగలదు. మౌనంగా పనులు చేసుకుపోతుంది కానీ మనసు ఊరుకోదు..
 
          “తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు … ” అత్తగారి గొంతు
 
          ఆ మాటలు ఆ మిత్రులకు వినిపించాయో లేదో కానీ తెరిచిన హృదయంలోని మాటల ప్రవాహం సాగిపోతున్నది. 
 
          దుబాయ్ లో స్థిరపడిన అరుణ వృద్ధాప్య సమస్యలతో తల్లడిల్లుతున్న తల్లిని చూడ్డానికి వచ్చానని, పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారని చెప్పింది. 
 
          అత్తగారు మంచాన పడిన ఏడేళ్ళ నుంచి ఒక్క రోజు కూడా గడప దాటి రెండు రోజులు ఉన్నది లేదు. కొడుకు పెళ్ళి, కూతురి పెళ్ళి అన్నీ అలాగే జరిపించేశానని చెప్పింది  సుజాత.    
 
          ‘సమాజం, సంప్రదాయం విధించే పరిమితులతో పాటు మనకు మనం విధించు కునే పరిమితులను కూడా అధిగమిస్తేనే, కొత్తగా ఎదురయ్యే సవాళ్ళను స్వీకరించడానికి సిద్దపడితేనే ముందుకు వెళ్ళగలవు’ అంటున్న అరుణ మాటలు వింటుంటే తన కూతురు మాట్లాడుతున్నట్టే అనిపించింది సుజాతకు.  
 
          వెంటనే నా కూతురు కూడా నీలాగే మాట్లాడుతుంది. ‘ఆడవాళ్ళంటే ఇంట్లో పాత్రల్లాగే చూస్తున్నారు కదమ్మా.. వంట, ఇంటిని చూసుకోవడం, పిల్లల్ని పెంచడం మాత్రమేనా?!  ఇంటిని ఇంత చక్కగా నడిపిన ఆడవాళ్ళు సమాజాన్ని నడపలేరా? ఆడవాళ్ళ పేరున ఇల్లు వాకిలి ఉండవు. డబ్బు దస్కం ఉండదు అంతా వాళ్ళ పేరునే..  
 
          జీవితం కోసం నేర్చుకోవాలనుకునే ఉత్సాహం , ఉత్సుకత ఉండాలమ్మా.. అవి మనని శక్తివంతం చేస్తాయి. అవసరం అయినప్పుడు మనమేంటో, మన నమ్మకాలేంటో స్పష్టంగా చెప్పగలగాలి. అందుకే ఎటువంటి జడ్జిమెంట్ వస్తుందో, ఎవరు ఏమనుకుం టారో అనే భయాలు నాకు ఉండవు. ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ నన్ను నేను ఆవిష్కరిం చుకోవడానికే ప్రయత్నిస్తా ‘ అంటుంది నా చిట్టి తల్లి. 
 
          అత్తగారు ఏమందో కానీ “కాస్త నోరుమూసుకుంటావా .. ” మామగారు కసరడం వినిపించింది వాళ్ళకి. 
 
          ”  నీలోని ఖాళీ తనాన్ని పసిగట్టింది నీ కూతురు. ” నవ్వుతూ అరుణ. 
 
          “అవును,  ఓ రోజు అకస్మాత్తుగా లండన్ నుంచి వచ్చేసింది. గుండె దడ, భయం, మానసికంగా శారీరకంగా బలహీనం అయిపోతున్న నన్ను హాస్పిటల్ కి తీసుకు పోయింది. మందులతో పాటు అమ్మకు నైతిక మద్దతు కావాలి. ప్రేమ, ఆదరణతో జీవితం పట్ల భరోసా కల్పించాలని అన్నతో , తండ్రితో గట్టిగా చెప్పింది” అలా అంటున్నప్పుడు ఆమె మొహంలో తృప్తితో కూడిన సన్నని నవ్వు. 
 
          “నీ సమస్య గురించి నువ్వు చెప్పకపోతే వాళ్ళకు ఎలా తెలుస్తుంది. మొహమాట పడితే ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటూ నన్ను చివాట్లు పెట్టింది. 
 
          అమ్మా.. ఏంటమ్మా ఇది. మీ అమ్మ ఉగ్గుపాలతో కలిపి వినడం తప్ప ప్రశ్నించడం నేర్పలేదేంటి? నాకు మాత్రం మీరు మా లాగే ఎందుకుండాలి ఉండాలి? మీ లాగే మీ పిల్లలు ఎందుకుండాలి ? అని చెప్పావ్. మరి నువ్వెంటమ్మా.. నిన్ను నువ్వు  నిలుపు కోవడానికి ప్రయత్నం చేయడం లేదు ” అని నిలదీసింది అని కూతురి గురించి చెప్పింది సుజాత.  
 
          “నిజమేనే, మన తరం వాళ్ళు పెద్దవాళ్ళకు ఎదురు చెప్పకూడదని , చిన్న పిల్లలని అడ్డు చెప్పకూడదనే సంస్కారంలో పెరిగాం. అందుకే రెండు తరాల మధ్య ఒదిగే ఉన్నాం. నిరాధారంగా బతుకుతున్నాం. రెండు తరాల మధ్య నలిగి పోతున్నాం. ఒక సందిగ్దావస్థలో ఉన్నాం” అన్నది అరుణ.
 
          అవును, అప్పుడు పెద్దలు చెప్పినవి విన్నట్లే ఇప్పుడు పిల్లలు చెప్పినవి వింటు న్నాము. ఈ తరం అలవాట్లకు, వారి ఆలోచనలకు తలొగ్గలేక పోయినా మౌనంగా తలూపుతూ కాలంతో పాటు పరుగులు పెడుతున్నాం. ఈ ఘర్షణ ఇప్పుడు మన తరానికి మాత్రమే ఉందా ..  తరాల అంతరాల ఘర్షణ అన్ని కాలాలలో ఉంటుందేమో.. మారుతున్న కాలంతో పాటు మారే సమాజంలో ఎప్పుడు ఇది తప్పదేమో .. అంటే నా కూతురు ఒప్పుకోదు. 
 
          నిన్ను నాన్న, బంధు మిత్రులు సుజాత తోపు అని ఇచ్చిన గుంపు నినాదాలకు, మెచ్చుకోళ్ళకు మురిసి నీ ఉద్యోగాన్నే కాదు నిన్ను నీవే వదిలేసుకున్నావ్. నీ ఇష్టా యిష్టాలు మరిచిపోయావ్. ఆ మత్తులో పడి నీ శరీరం పై ఆలోచనల పై హక్కుల పై అధికారం వాళ్ళకు కట్టబెట్టేశావ్. ఇప్పుడేమో నీకీ కుటుంబంలో గౌరవం, విలువ లేదని లోలోనే రక్తమోడుతున్నావ్. నీ లోపలి గాయాలకు వారందరికంటే ముందు నూటికి నూరుపాళ్ళు నీవే కారణం అంటుంది నా కూతురు.’ గోడకున్న కూతురి పెళ్ళి ఫొటోకేసి చూస్తూ చెప్పింది సుజాత. 
 
          “మన తరాన్ని చూసి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్చుకున్నారు ఈ తరం ఆడపిల్లలు. తమ శక్తికి మించి ఏదీ నెత్తిమీద వేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఘర్షణ, సంఘర్షణ వాళ్ళకు లేదని కాదు. ఉంది.. అంటున్న అరుణ మాటలకు అడ్డువస్తూ  
“ఏదేమైనా మనది సాండ్ విచ్ జనరేషన్” అంటున్న సుజాతను అల్లుకుపోయింది నిద్రలేచిన రేపటి తరం ప్రతినిధి స్వీటీ.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.