కంటి నీరు

(నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

-డా. లక్ష్మీ రాఘవ

          “అక్కా, నీవిలా ఏడ్చకుండా పడుకుండి పోతే బావను చూడటానికి వచ్చిన వాళ్ళు ఏమను కుంటారు?” మెల్లిగా చెవిదగ్గర చెప్పింది కామాక్షి.

          కళ్ళు తెరవకపోయినా నవ్వు వచ్చింది మాలతికి. ఏడిస్తేనే బాధ ఉన్నట్టా? తను ఇన్ని నెలలూ ఎంత బాధపడింది వీరికి ఎవరికైనా తెలుస్తుందా? బలవంతాన కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. వచ్చిన వారు శంకరంతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు. అతనితో తన అనుబంధానికి తానెంత ఏడవాలి?

          ఎన్నేళ్ళ కాపురం..పిల్లలు లేరన్న బాధ పైకి కనబడకుండా ‘నీకు నేనూ, నాకు నీవు’ అంటూ ప్రతి విషయానికీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న రూపం.. ఒక్క క్రీగంటి చూపుతో మృత్యువు సొంతం చేసుకుని ఎగిరి పోతే.. ఈనాడుఎదురుగా నిర్జీవంగా ఉన్నమనిషి

          ”ఇది నిజం” అంటూన్నట్టే ఉంది.

          కానీ ఏడుపు రావటం లేదు..అలసిపోయిన ఆమెకు మళ్ళీ కళ్ళు మూసుకుపోతు న్నాయి. గడచిన రోజులు సినిమాలా కనిపిస్తూంటే మాలతికి మనసు అలసింది. ముందురోజు  రాత్రంతా ప్రయాణంతో శరీరమూ అలిసింది. అందరికోసమైనా కూర్చోక తప్పదు.

          తన పరిస్థితిని అర్థం చేసుకునేవారు ఎవరు?

          ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు నెలలు ఆస్పత్రి జీవితం…

          అప్పుడప్పుడూ అనారోగ్యం. హెచ్చు తగ్గులవుతున్న చక్కెర వ్యాధి. క్యాంప్ లంటూ ఆఫీసు పనిమీద వెళ్ళాల్సిరావటం,

          సరిగ్గా పాటించని ఆహార నియమాలు, పని ఒత్తిడితో ఎక్కువైన సిగరెట్లు. చెప్పు కుంటే కారణాలు ఎన్నో.. తను హెచ్చరిస్తూనే ఉంది.

          “నాకేమీ కాదులే మాలా..అయితేగియితే బాధ పడేవాళ్ళూ ఉండరు. మనయిద్దరిలో ఒకరు తప్ప ..”అనే అతని మాటతో మనస్సు చివుక్కుమనేది.

          ఒక రోజు మాలతి భయపడ్డట్టే మొదలయ్యింది అనారోగ్యం విపరీతమైన ఆయాసం తో .. ఊపిరి పీల్చుకోవడానికి కాదేమో అన్నంతగా…వెంటనే చుట్టూ ఉన్న దగ్గరి వారం దరూ పలికారు. సొంతవూళ్ళో ఉన్న హాస్పిటల్ లో ఎమర్జెన్సీ అని..వెంటనే ఆక్సిజన్ పెట్టి, రక్తపు పరీక్షలూ, ఈ.సి.జీ లు అయ్యాక వెంటనే ‘సిటీకి తరలించండి’ అనడంతో ఆంబులెన్స్ లో పరుగు.. సిటీలో మళ్ళీ పరీక్షలు..

          హార్టులో మూడు బ్లాకులు అని వెంటనే షుగర్ కంట్రోల్ చేసి స్టంట్ లు వేయడంతో అందరూ ‘ఇక పరవాలేదు’ అనుకుని వెళ్ళిపోయారు.

          ఆస్పత్రిలో మాలతి ఒక్కతే ఉంది వారం రోజులూ… మళ్ళీ వచ్చింది ఆయాసం.. అబసర్వేషన్ అన్నారు..

          మాలతికి తోడుగా ఉండటానికి ఎవరికీ వీలు కాలేదు. ఎవరి పనులు వారివి. ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండమంటే ఎలా వీలవుతుంది? అర్థం అయ్యాక మాలతి ఎవరినీ అడగలేదు. సిటీలో ఉన్నబంధువులు ఒకరో ,ఇద్దరో వచ్చి చూసి ఒక గంటలో మళ్ళీ వెళ్ళి పోతున్నారు. తోడుగా ఉండమని అడిగే అవకాశమే లేదు.

          శంకరం వీక్ గా ఉన్నాడని ముక్కుకు ఆక్సిజన్ ట్యూబు తగిలిచారు. కొద్దిగా కోలుకుంటే రెండురోజుల్లో  రూమ్ కి షిఫ్ట్ చేస్తాం అన్నారు. కానీ ఒక్క రోజులోనే బి. పి లో తేడా అని మళ్ళీ ఐసియూ లోనే ఉండాలి అన్నారు… అక్కడే తోడుగా ఉందామంటే ‘అస్తమానం అక్కడే ఉండకూడదు. బయట కూర్చోవాలి’అన్న నియమంతో తనలాగా హాస్పిటల్ లోవున్న ఎంతో మంది మధ్య.. సోఫాల మీద సర్దుకుని కూర్చోవడమే. పక్క నున్న వారిని పలకరిస్తే ఎన్ని కథలు..కొడుకు అందుబాటులో లేక భర్తను ఆస్పత్రిలో చేర్చిన ముసలావిడ..పదేళ్ళ కొడుకుకి కిడ్నీ ప్రాబ్లెం అని ఒక తల్లి,  భర్తకు బ్రెయిన్ ట్యూమర్ అని ఒక భార్యా.. ఇంకొకరిది కార్డియాక్, జాండీస్, ఇలా సమస్యలు ఎన్నో… చూస్తుంటే అది మృత్యుపోరాట స్థలం అనిపిస్తూంది. ఒక్కరి ముఖంలోనూ సంతోషం లేదు. ఎవరిని కదిపినా ఆవేదనా, ఆక్రోశమే..అందుకే ఎవరినీ పలకరించక పోవడం మంచిదని మౌనంగా ఉండటం నేర్చుకుంది. 

          మాలతికి అప్పుడప్పుడూ లోపలికి వెళ్ళి శంకరం హార్ట్, బి. పి., మానిటర్ లు చెక్ చేయడం ఒక పని. మొదట్లో భార్య కనిపించగానే శంకరం ముఖం వెలిగిపోయేది.

          ”అన్నీ బాగున్నాయని చెప్పు మాలా .. ఇంటికి వెళ్ళిపోదాం” అని బతిమలాడుకునే వాడు. “మనం చెబితే వింటారా?”అని మాలతి అంటే ..

          “ఇక్కడ ఉంటే ఇలాగే రోజుకో టెస్టు….అంటూ చివరికి వెంటిలేటర్ మీద పెట్టి “ఇక లాభం లేదు అంటారు. నా మాట విను..”మొండి చేసేవాడు. అక్కడి నర్సును శంకరం గురించి అడిగింది.”అన్నీ బాగుంటే రూముకు షిఫ్ట్ చేస్తాము..”అంది కానీ అన్నీ బాగుపడేది ఎప్పుడో..

          ఆ రోజు రెండు ఎమర్జెన్సీ కేసులతో అక్కడ ఉన్న సోఫాలో కూర్చోవడానికి కూడా చోటు దొరకలేదు. ఒక మూలగా గోడనానుకుని నిలబడి ఉన్న మాలతిని అటెండర్ “అక్కా.. రెండు వందలు కడితే హాలులో బెడ్ ఇస్తారు. వెళ్ళి పడుకోండి” అన్నాడు. ఈ సౌకర్యం గురించి ఎవరూ చెప్పలేదే అనుకుంటూ వెళ్ళి రెండు వందలు కట్టింది. వారు చెప్పిన హాలుకు వేడితే అక్కడ ముప్పయ్ మంచాలు ఉన్నా ఒక్క మనిషీ లేరు. అక్కడ పడుకుంటే ఏమి చేసినా దిక్కుండదు అని భయం వేసింది. అయినా అక్కడ తనవారికి ఏక్షణాన ఏమవుతుందో అన్న భయంతో ఉన్నవారు ఇక్కడ పడుకోవడానికి అవుతుందా? అనకుంటూ వెంటనే హాలులోకే వచ్చింది. అక్కడ సోఫాలో కొంచెం ఖాళీ కనిపిస్తే ఒదిగి కూర్చుంది…కళ్ళ మీద రెప్ప పడలేదు..”ఎన్నాళ్లీలా? ప్రతివారమూ ఏదో ఒక ప్రాబ్లెం చెబుతారు.” కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంతే అన్నదే నిజమా?? ఆరోగ్య సమస్యలు తీరతాయనే కదా డాక్టర్లను చూసేది…పేషంట్ కంటే తోడు ఉన్నవారికి ఎంత నరకమో అక్కడ ఉన్నవారికే అర్థం అవుతుంది.

          మొదటి నుండీ డయాబీటీస్ కు రెగ్యులర్ మందులు వేసుకుంటూ ఉండాలి. సిగరెట్లు ఎక్కువవుతున్నాయని మానేయమని  మొత్తుకున్నా అంటే ‘సిగరేట్లు తాగి ఎంత మందో తొంబై ఏళ్ళు బతికారని’ జవాబు వచ్చేది శంకరం నుండీ.

          ఇప్పుడు ఇలా హాస్పిటల్ లో ఉంటే బాధ పడుతున్నది ఎవరు.. తనే కదా..నెలల కొద్దీ ఆస్పత్రిలో ఉంటే ఎంత మంది దగ్గరవాళ్ళు పలకరిస్తున్నారు? కష్ట సమయంలోనే మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయేమో.. వూరికే కూర్చుంటే ఇలా పిచ్చి ఆలోచనలు ఎన్నో…

          ఒక రోజు అకస్మాత్తుగా శంకరానికి మాసివ్ హార్ట్ అటాక్ అన్నారు…ప్రతి అరగంటా మానిటర్ చేస్తూ వెంటీలేటర్ మీద ఉంచారు. నెమ్మదిగా బి. పి తగ్గిపోతూంది అనీ, కిడ్నీ లు స్లో అవుతున్నాయనీ ఇక కొన్ని గంటలు మాత్రమే అనగానే ఆ క్షణం పూర్తిగా ఒంటరి అయ్యింది మాలతి. గొంతులో తడి ఆరిపోతూ ఉంది. అలాగే ఫోనులో భర్త ఇలాఉన్నాడని కొంత మందికి తెలిపింది. చివరి క్షణాలని తెలిపాక అందరూ

          ‘ఏమైనా అయితే ఆంబులెన్స్ అక్కడే ఇస్తారు కాబట్టి ఊరికి తీసుకు వచ్చేయమ’నే సలహా ఇస్తుంటేవారి జవాబుకు నిర్ఘాంతపోయింది..

          ఇంతలో చావు కబురు చల్లగా చెప్పారు ఆస్పత్రి వారు.

          వెంటనే తేరుకుంది మాలతి. ఇప్పుడు ఏడ్చే అవకాశం లేదు ‘కర్తవ్యం ముఖ్యం’ అని వివరాలను అడిగింది  ఆస్పత్రి వాళ్ళను అడిగితే ముందు బిల్లు కట్టండి ఆ తరువాత ఆంబులెన్స్ ఇస్తాము అన్నారు. బిల్ చూడగానే మతి పోయింది. అంత అమౌంట్ ఉంటుందని అనుకోలేదు.. ఒకరిద్దరిని ఆన్ లైన్ పంపమని అడిగి లేదనిపిం చుకున్నాక శంకరం ఫ్రెండ్ హరి గుర్తుకు వస్తే చెన్నైకి ఫోను చేసి పరిస్థితి చెప్పి డబ్బు అడిగింది. ఒక్క పది నిముషాల్లో ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు. బిల్లులు కట్టి ఆంబులెన్స్ మాట్లాడుకుంది. సాయపడినవాళ్ళకి టిప్స్ ఇచ్చి శంకరం శవంతో బాటు ఒంటరిగా ఊరికి బయలుదేరి అర్ధరాత్రి ఇల్లు చేరింది. ఎదురు చూస్తున్న బంధుజనంను చూడగానే నిట్టూర్పు వదిలింది.

          ఐస్ బాక్స్ ఏర్పాట్లూఅయ్యాక పక్కనే చిన్న మంచం మీద కూర్చుని నిర్జీవంగా ఉన్న శంకరాన్ని చూస్తూ పక్కకు వాలింది. అంతే ఒక్కటే అలసట…బహుశా శంకరం కోసం ఆరాటం అక్కర్లేదనేమో కళ్ళు మూతలు పడ్డాయి.

          నిద్రలో ఇంట్లో తిరుగుతున్న భర్త.. ఆప్యాయంగా పిలుస్తున్నరీతిలో, అన్ని వస్తువు ల పైన అతని వేలిముద్రలూ కనిపిస్తూ మరి తన హృదయంలో అతని ముద్రలూ… చెరిగిపోయేవా??

          చివరి చూపులకు వచ్చిన వారంతా కంట తడి పెట్టిన వారే.

          “ఇంకా కొన్ని రోజులు బతకాల్సిన వాడు..” అంటూంటే ఉలిక్కి పడింది.

          వీరికేమి తెలుసు శంకరం లేచి తిరిగే పరిస్థితి లేదని, బతికివుండాలంటే బెడ్ మీద ఉండేవాడనీ

          అప్పుడు బాధ పడేది ఎవరు? చేయడానికి తను ఉండవచ్చు కానీ చేయించుకునేది ఎంత కష్టమో పేషంటుకు తెలుస్తుంది.

          చివరి రోజుల్లో ఐ.సి.యూలో ఉండగా అన్నాడు “నేనిలా ఉండలేను మాలా. పోతేనే మేలు.”

          “నేనున్నాను గదా “అనగానే “నీకు భారం కావడం నాకిష్టం లేదు. కానీ నీవే ఒంటరి అయిపోతావాని నా బాధ” అన్నాడు కంటినీరుతో. ఆలుమగల బంధం ఇంతేనా అన్నట్టే .. 

          ఋణం  ఎంత ఉందో అంతే కలిసి జీవితం.

          అందుకే ‘తనకు కంట్లో నీరు రాదేం?’ అని ప్రశ్నించుకోదల్చుకోలేదు. ఉద్వేగ స్థితి లో ఉన్నప్పుడు తన మనసులో భావాలను చూపించలేకపోవడం సహజం అన్నది ఎంత మంది అర్థం చేసుకోగలరు?

          నిశ్శబ్దం మనసును ఆవహించింది. యాంత్రికంగా జరుగుతున్న కార్యక్రమాలను చూస్తూంది.

          మహా ప్రస్థానం బండి ఎక్కేదాకా..

          కనుమరుగవుతున్నశంకరాన్ని చూస్తూ సంసారం చివరి అంకంలో తన ఒంటరి తనం, దు:ఖం, అసహాయత బలమవుతుంటే అప్పుడు తన్నుకొచ్చింది కన్నీటి ఒరవడి..

          చీరకొంగు తడిసింది. నేనూ నీకు తోడంటూ ముక్కు ధార కట్టింది..

          ఎవ్వరూ ఆపలేదు..

          కామాక్షి మాత్రం అక్క భుజం పట్టుకుంది..

          మాలతి ఏడవటం అందరికీ సహజం అనిపించింది…

*****

Please follow and like us:

5 thoughts on “కంటి నీరు (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)”

Leave a Reply

Your email address will not be published.