కాదేదీ కథకనర్హం-5

అరటి తొక్క

-డి.కామేశ్వరి 

          నాలుగురోడ్ల జంక్షన్ దగ్గిర — బిజీ బజారు సెంటర్లో కోటమ్మ కిళ్ళీ కొట్టు ముందు కోటమ్మ — వీర్రాజు ఘోరాతి ఘోరంగా బూతులు తిట్టుకుంటూ జుత్తులు పట్టుకుని కొట్టు కుంటున్నారు. చుట్టూ చేరిన జనం ఏ గారడీనో, సర్కసో చూస్తున్నంత కుతూహలంగా , ఆనందంగా తిలకిస్తున్నారు ఆ పోట్లాట —

          “దొంగసచ్చినోడా– ఆడకూతుర్ని , దిక్కుదివాలం లేనిదాన్ని కిళ్ళీ బడ్డీ ఎట్టుకుని నాలుగు రాళ్ళు తెచ్చుకు గంజినీళ్ళు తాగుతంటే కల్లల్లో నిప్పులేసుకుంటావా దుప్పనాతి నంజకొడకా . ఆడకూతురితో తగులడ్డానికి సిగ్గు నేదురా – ఆడకూతురి మీద నట్రా నీ ప్రతాపం ఆ మూతి మీద మీసం తీసేసి చేతికి గాజులు ఏనుకోరా ఎదవా –‘ అంటూ తుపుక్కున ఊసింది.

          “నీవాడకూతురివా , ఆడకూతురివైతే యింటికాడ కూకుని బుద్ధిగా వన్నం వండు కోవాలి , పిల్లల్ని సాక్కోవాలి – యిలా నడిరోడ్డు ఎక్కి కిళ్ళీ బడ్డి ఎక్కి కూకుని దారంటే పోయే మగాల్ల అందరితో కులుకులాడతవే గుడిసేటి నంజా -” వీర్రాజు తక్కువ తినలే దన్నట్టు కాండ్రించి ఉమ్మేసాడు.

          ‘ఏట్రా….ఏట్రా పెలతన్నావు నీ జిమ్మడ – గుడిసేటినంజనా….’ రొప్పుతూ విడిన జుట్టు ముడివేసుకుని అమ్మవారిలా, అపరకాళిలా అవతారం ఎత్తింది కోటమ్మ.

          ‘నీ పెళ్ళం నంజ – నీ అమ్మ గుడిసేటి నంజ – నీ అప్ప చెల్లెళ్ళు నంజలు ….కోటమ్మ నోరిప్పితే మరి మూతపడదు- వీర్రాజు మూడుతరాల ఆడవాళ్ళందరిని లంజలు, ముండ లు చేశాక – చుట్టూ జనం వంక తిరిగింది — ‘అయ్యలు, బాబులు – చూశారా ఆడకూతు ర్నట్టుకు ఎంతెంత మాటలంటున్నాడు. మొగుడు సచ్చినోడు వోగ్గేసి పొతే ఆడకూతుర్ని ఏ బతుకు తెరువునేక ఈ కిళ్ళీ కొట్టేట్టుకు గంజినీళ్ళు తాగతంటే సూడలేక కళ్ళు కుట్టు కుని కాట్లకుక్కలా కలియబడతన్నాడు వీడి జిమ్మడ ‘- మెటికలు విరిచింది.

          ‘ఓయమ్మా – నీ నంగనాచి కబుర్లు నాకాడ సెప్పకు – గంజినీళ్ళు ఖర్మ నీకేటి – సాని పాపలా సింగారించుకుని , కొట్టేక్కి కూకుని దారిన పోయే మగాల్లందరికి వగలు చూపి యాపారం చేసే నీకు గంజినీళ్ళెం ఖర్మ – యీ సీరలు, జాకెట్లు ఆ కంపెనీ బాడీలు , ఆ గాజులు, పూసలు, ఆ సింగారం సూడండి బాబూ గంజినీళ్ళు తాగతందట – తాగే, ఆ గంజినీళ్ళు కూడా నేకుండా మా నోట్లో దుమ్ము కొట్టి …..కోపంతో ఉడికిపోతూ వీర్రాజు.

          ‘సాతకాని సన్నాసి — నా మీద పడి ఏడవకపోతే కొట్టు మీద నీ పెళ్ళాన్ని కూకో పెడతానంటే నా నొద్దన్నానా…..సుప్పనాతి నంజాకొడుకులు – ‘ మరోసారి ఉమ్మేసింది.

          ‘మాటలు తిన్నగా రానీ నేదంటే మక్కెలిరగ దన్నగలను- నంజ కొడుకులు యిక్కడెవరూ లేరు – నంజికూతురు తక్క, మా ఆడోళ్ళు పరువు మర్యాద గలవోరు – నీలా బరితెగించిన బజారు రకాలు గాదు….’

          ‘ఓ యబ్బ పతివతలన్నమాట. మరింకేం ఆ పతివత పెళ్ళాం వుండగా నీకు గంజెం ఖర్మ – వండకుండానే చేతులాడించి పంచభత్య పరమాన్నాలు వడ్డీస్తది మరేడుపెందు కురా సన్నాసి-‘ చూసిన పతివతల సినిమా నాలెడ్జిత హేళనగా ఎత్తి పొడిచి జోకు ఎలా ఉందన్నట్టు చుట్టూ చూసింది కోటమ్మ – భళ్ళున నవ్వారు అందరూ — వీర్రాజు అవమానంతో వీరావేశం వచ్చి ముందు కరికాడు. కోటమ్మ మీదకి. అంతదాకా వినోది స్తున్న జనం వ్యవహారం ముదిరి పాకాన పడిందని గ్రహించారు. నలుగరైదుగురు మగాళ్ళు వీర్రాజుని వెనక్కి లాగారు -‘ ఆడకూతురుతో నీకేటి అసలేటయింది?- ఎటాసలు గొడవ …..’ అంటూ వీర్రాజుని అడిగారు. వీర్రాజు ఆవేశంగా రొప్పుతూ – ‘ అసలేటయిందా, దాన్నే అడగండి – బాబూ….అరటి తొక్క….అరటి తొక్క బాబూ….దాని గురించి తగూ బాబూ ….’ అంతకంటే చెప్పలేకపోయాడు ఆవేశంతో.

          ‘అరటి తొక్క!’ జనం ఆశ్చర్యంగా ‘అరటి తొక్కేమిటి ?’ అని తెల్లబోయారు. అవును, అరటి తొక్క – ఎందుకూ పనికిరాని అరటి తొక్కే యీ తగవుకి కారణం అదెలా? ఆ కధ ఏమిటయ్యా అంటే….

***

          మూడు నెలలక్రితం — నాలుగు రోడ్ల కూడలిలో బజారు సెంటర్లో కాకుల మధ్య హంసలా …..కిళ్ళి కోట్ల మధ్య కోటమ్మ కిళ్ళీ కొట్టు వెలసింది – వున్న అరడజను కిళ్ళీ షాపులకి గిరాకి పడిపోయింది. పువ్వు మీద వాలే తుమ్మెదలా ప్రతివాడు కోటమ్మ కిళ్ళీ షాపుకే రావడం ఆరంభించాడు — అంత మంది మగవాళ్ళ మధ్య ఆడది కోటమ్మ అప్సరస కాకపోవచ్చు — కాని కోటమ్మ నలుపులో మెరుపుంది – ఎత్తుగ బలంగా పుష్టిగా పోత పోసిన యినప విగ్రహంలా నిగనిగలాడుతుంటుంది. టెరికాటన్ , పుల్ వాయిల్ నైలాను చీరలు కట్టి కంపెనీ బాడీ , మాచింగ్ జాకెట్టు తొడిగి , రంగు రంగుల బొట్లు, గోళ్ళకి పాలిష్ – తలలో పూలు- నీటుగా తయారై కొట్టెక్కి కూర్చుంటే చూడని మగాడిది తప్పు – వేషమే కాదు నడకలో , మాటలో, నవ్వులో ప్రత్యేకతతుంది – మాటలో గడుసుతనం వుంది- నవ్వులో కొంటెతనం వుంది – చూపుల్లో కవ్వింపుంది.

          ఇన్నీ వున్న కోటమ్మని మొగుడెందు కోదిలేశాడన్నది ఎవరికీ తెలియదు — తెల్సిన వాళ్ళు కొందరు మొగుడు దీన్ని వదలలేదు – ఇదే మొగుడ్ని వదిలేసిందంటారు — చవటసన్నాసి దీని జాణతనం ముందు ఆ నోటి ధాటికి తాళలేక పారిపోయాడంటారు-

          సన్నాసి పారిపోగానే కోటమ్మ కిళ్ళీ కొట్టేక్కేసింది – సన్నాసి కూర్చునున్నాళ్ళు సన్నాసి మొగం ఏం చూస్తాం అన్నట్టు కిళ్ళీ కొట్టు దరిదాపులకి వెళ్ళని వాళ్ళందరూ కోటమ్మ కిళ్ళీ కొట్టు ఎక్కగానే బెల్లం చుట్టూ చేరిన చీమల్లా తయారయ్యారు. తక్కిన కిళ్ళీ షాపులకి లేని గిరాకి తన షాపుకి ఎందుకొచ్చిందో  గ్రహించలేని చిన్నదీ కాదు. వెర్రిది కాదు కోటమ్మ- ఆ అవకాశాన్ని జారవిడిచేటంత పతివ్రతా కాదు! పోలీసులని కాకా పట్టింది. కుర్రకారుతో హస్యాలాడింది – లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు , క్లీనర్లతో రిక్షావాళ్ళతో అన్నా, మావా, బావా అంటూ వయసులు చూసి వరసలు కలిపింది – ‘ బాబ్బాబూ , అరు వెట్టకు బాబూ, ఆడకూతుర్ని లెక్క డొక్క రాని దాన్ని పైసలిచ్చే యండి – బాబూ -‘ అంటూ కుర్రకారుని బతిమిలాడి మంచిగా తెలివిగా అరువులు లేకుండా వ్యాపారం చేసుకుంది — మూడ్నేల్లకే వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారగానే పాత వాయిల్ చీర ల్లోంచి ధగధగ లాడే పల్చటి సిల్కు కోకలు , కంపెనీ బాడీలకి దిగింది – రాబడితో పాటు సోకు పెరిగింది – సాకుతో పాటు కులుకులు – కులుకుతో పాటు జాణతనం పెరిగింది’ ఆ సెంటర్లో కోటమ్మ కిళ్ళీ కొట్టు పెద్ద ఎట్రాక్షన్ అయి కూర్చుంది నాలుగు నెలలకే!

          వీర్రాజు  వీరత్వం యింకో దాన్లో వున్నా మానినా పిల్లలని కనడంలో కనపరిచాడు. ఏడుగురు సంతానం – పదిహేనేళ్ళనించి ఏడాది వరకు వున్న వేరుశనగ కాయల్లాంటి పిల్లలు, బాలింత చూలింత తప్ప మాములుగా ఎప్పుడూ కనపడని పెళ్ళాం. ముసలి తల్లి వీళ్ళందరికీ వీర్రాజు కిళ్ళీ కొట్టే ఆధారంగా వుండేది – రోజుకి పదిరూపాయలు కళ్ళ చూసే వాడు – ఖర్చులు పోగా నాలుగో ఐదో మిగిలితే తిని తిననట్టు గుట్టుగా సంసారం లాక్కొచ్చా డు యిన్నాళ్ళు.

          యిప్పుడు – అంటే నాలుగు నెలల నించి , కోటమ్మకిళ్ళీ కొట్టు ఎక్కాక వీర్రాజు పని డౌన్ అయిపొయింది. బేరాలు లేక , సరుకు చెల్లక రోజుకి రెండు రూపాయలు కూడా కళ్ళ బడకుండా పోయింది. బేరాలు పడిపోవడానికి కారణం కోటమ్మ అన్నది అర్ధం కావడానికి రెండు నెలలు పట్టింది వీర్రాజుకి. అర్ధం చేసుకున్నాక పళ్ళు కొరుక్కుని కోటమ్మని పచ్చి బూతులు మనసులో తిట్టడం మినహా మరేం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు పస్తులుంటున్నారు. అంత మందిని ఏంపెట్టి ఎలా పోషించాలో అర్ధం కాక వీర్రాజు కిందామీదా పడుతున్నాడు. ఇంట్లో అమ్మదగ్గ బిందె, చెంబులు నడిచి వెళ్ళాయి. కొట్లో షోడామిషన్ , నిలువుటద్దం , బెంచీలు , ఒక్కొక్కటే వచ్చిన ధరకి తెగనమ్మడం మినహా మరే దారి లేక పోయింది. వీర్రాజు మొహం చూసి అప్పిచ్చే తల మాసినవాడు ఎవడూ కనపడలేదు. కొట్టు తాకట్టు పెట్టి ఏభై తెచ్చి ఓ నెల తిన్నారు.పిల్లల మొహాలు పీక్కుపోయాయి – ఆకలి చూపులతో ఏం దొరుకుతుందా ఎగరేసుకు పోదామా అని చూడడం తప్ప మరో పని లేకుండా పోయింది వాళ్ళకి — ఆకలితో నీరసంగా నాలుగు బేరాలు రావా అన్నట్టు కొట్టు మీద కూర్చుంటాడు వీర్రాజు — అర్ధశేరు నూకలన్నా కొనడా నికి డబ్బు దొరకదా దాంతో గంజి పోస్తాను అనుకుంటూ ఆశగా గుమ్మంలో కూర్చునేది పెళ్ళాం — ఆశ నిరాశ అయిపోగా , పిల్లలు ఆస్థిపంజరాలుగా తయారవుతుంటే చూడలేక పెళ్ళాం పాచిపనికి కుదిరింది – పెద్దవాడు కాఫీ హోటల్లో కుదిరి వాడి తిండి ఏర్పాటు వాడు చూసుకున్నాడు. చాతకాని వాడిలా చేతులు ముడుచు కూర్చుని పెళ్ళాం యీ యింట ఆ యింట పని చేసి తెచ్చే చల్లి మెతుకులు తినడానికి అభిమానం అడ్డు వచ్చేది వీర్రాజుకి. చాతకాని తనంతో ఉక్రోషం ముంచుకొచ్చి ఎదురుగా కోటమ్మ కులుకులు తళుకులు చూస్తూ ఉడికిపోయేవాడు! కొట్టు మీద నుంచి లాగి నడి రోడ్డు మీద నిలబెట్టి మొహాన పేడనీళ్ళు కొట్టాలన్నంత కసిగా వుంది. కోటమ్మని కిళ్ళీ కొట్టు ఎందుకు పెట్టావు అనడగడానికి హక్కు లేదు కనుక కోపం దిగమింగుకుని కసి పెంచుకుని కనిపించినపుడ ల్లా తుపుక్కున ఉమ్మి – నోట్లో దుమ్ము కొట్టింది దీని సిగతరగ అంటూ మెటికలు విరిచి పిల్లి మీద పెట్టి తిట్టి సంతృప్తి పడేవాడు.

          నాలుగు నెలలు గడుచేసరికి మరి మంచి రోజులు వస్తాయన్న ఆశ నిరాశగా మారి పోయింది వీర్రాజుకి. అతని సంసారం కుక్కలు చింపిన విస్తరి అయింది. అతని పిల్లలు వీధిన పడ్డారు.

          ఆ రోజు ….గత రెండు రోజులుగా పిల్లలకి గంజినీళ్ళు తలా గ్లాసుడు తప్ప ఘణ పదార్ధం కడుపులో పడలేదు. ఆ గంజినీళ్ళు పడి ఇరవై గంటలయింది. బిక్క మొహాలతో , ఆకలి చూపులతో తండ్రి కొట్టు దగ్గిరకొచ్చి నిలబడ్డారు. పిల్లలకి పెట్టేందుకు చివాట్లు తప్ప ఏమి లేవు వీర్రాజు దగ్గిర. తన అశక్తత కళ్ళ ముందు నిలుస్తుంటే చికాకు కోపం ముంచుకు వచ్చి “వెధవల్లారా – ఏడుపు గొట్టు వెధవల్లారా , ఇక్కడ మీకేం పనిరాపొండి….. ఎల్లండి యింటికాడ కెల్లండి — ఎదవ మొగాలు , ఎప్పుడూ సూసినా ఆకలి తప్ప మరేటి నేదు – పాండేహే-” అని తిట్టితరిమాడు, అసలే ఆకలి మీద బక్కచిక్కిన వీర్రాజు కోపంగా, పిల్లలు భయపడి పారిపోయారు. పారిపోయింది ఇంటికి కాదు – తండ్రి కన్ను చాటు చేసి, తమ కడుపు కొట్టిన కోటమ్మ కిళ్ళీ బడ్డి దగ్గర కెళ్ళి నిలబడ్డారు. కోటమ్మని తల్లి తండ్రి తిట్టే తిట్లు పిల్లలకీ తెల్సు – ఆ కోటమ్మని ఎందుకు తండ్రి తిడ్తాడో అదీ తెలుసు – ఆ కోటమ్మ వల్లే గంజి నీళ్ళకయినా గతి లేకుండా వీధిన పడాల్సి వచ్చిందనీ తెల్సు  – తెల్సినా కోటమ్మ కిళ్ళీ బడ్డీ దగ్గిర నిలబాడడానికి కారణం అరటిపండ్లు! కుళ్ళిపోయిన అరటిపండ్లు, పిల్లలు అటుపక్కగా పెడ్తుంటే కోటమ్మ వేలాడదీసిన గెలల్లోంచి తిట్టు కుంటూ మాగిపోయి నల్లబడి అమ్మకానికి పనికి రాణి అరటిపండ్లు తీసి పడేస్తుంది. వచ్చిన నష్టాన్ని తలుచుకుని ఉసూరుమంటూ – పిల్లల ఆకలి కళ్ళకి ఆ కుళ్ళి పోయిన అరటిపళ్ళు పంచభక్ష్య పరమాన్నాలయ్యాయి. నల్గురూ గమ్మునురికి మహాదానదంగా , ఆబగా తొక్కలు వల్చుకుని మాగిపోయిన పళ్ళు తిన్నారు. ఆకలి కడుపులకి కాస్త ఆహారం పడగానే ఆకలి మరింత విజ్రుంభించింది- కుళ్ళిపోయిన అరటిపళ్ళు దగ్గిరే కొట్టుకొచ్చిన వీళ్ళూ వాళ్ళూ తిని పడేసిన అరటిపళ్ళ తొక్కలు – పచ్చగా నిగనిగలాడుతూ కనిపించా యి. ఆ తొక్కలు తీసుకుని ఆబగా అని నాక్కుంటూ గుజ్జు తినసాగారు. తింటున్న వాళ్ళు కోటమ్మ కళ్ళబడ్డారు. ఆ కుచేల సంతానం వీర్రాజుదని తెలుసు. వీర్రాజు తనని ఎలా దుమ్మెత్తి పోస్తున్నదీ తెల్సు – తెల్సినా ఎదురుదెబ్బ కొట్టడానికి సమయం కోసంచూసిం ది. ఆ సమయం దొరికిందిప్పుడు . “ఛీ…..ఛీ వీళ్ళ జిమ్మడ – దిక్కుమాలిన సంత – మేకల్లా అరటి తోక్కలలో ఎగబడ్డారు. గుంటేధవలు – తిండేట్టుకోలేని వాళ్ళు, పందుల్లా యింత మందిని ఎవరు కనమన్నాడు – కని పారేసి రోడ్ల మీదకి తరుముతారు – మాయదారి సంత పాండేహే – మీ బాబుగాడి సొమ్ము  యిక్కడనేదేహే-గుంటేదవలకి సిగ్గు నేకపోతే పెద్దోళ్ళ కుండాలి – కళ్ళల్లో నిప్పు లేసుకునే ఎదవకి నా అరటి తొక్కలే కావాల్సివచ్చినాయి గామోసు – ‘ వ్యంగ్యంగా , హేళనగా, కసిగా, కోపంగా ద్వేషంగా వీర్రాజు వంక హేళనగా చూస్తూ గట్టిగా అరిచింది. కోటమ్మ అరిచాక ఆ తిట్లకి గురి అవుతున్నది తను, తన పిల్లలు అని తెలిశాక చరచర వచ్చి పిల్లల్ని చితక పొడిచాడు. – బూతులు తిట్టాడు. – “సిగ్గు లేని ఏదవల్లారా – ఆ నంజికూతురి అరటి తొక్కలే గతిరా మీకు, ఎల్లండిరా దాని పెరట్లో యింత అశుద్ధం తినండిరా …. సావకూడదట్రా యింతకంటే -‘ కోపం, ఉక్రోషం , అవమానం ముంచెత్తగా పిల్లల్ని, కోటమ్మని కలిపి తిట్టాడు – పిల్లలు బిక్కచచ్చి నిల బడ్డారు. – కోటమ్మ తక్కువ తినలేదు – అన్నాళ్ళ కసీ తీర్చుకుంది – చిలికి చిలికి గాలి వాన అయింది- జనం మూగారు – “అదీ బాబు ….. పిల్లెదవలు ఆకలి గాకనేక కక్కుర్తిపడి ఆ అరటి తొక్కలు తిన్నారు ….. దానికి బాబూ యింత రాద్దాంతం – మా కడుపులు కొట్టింది – యీ మాతల్లి . ధర్మమాని పిల్లలు రోడ్డంట పడ్డారు.” వీర్రాజు బాధగా, ఆవేదనగా చెప్పాడు – అంతా కోటమ్మ వంక చూసారు. అందరి సానుభూతి వీర్రాజు మీదకి తిరిగిందని గ్రహించ లేని వెర్రిది కాదు కోటమ్మ – క్షణంలో ప్లేటు ఫిరాయించింది. “అది కాదు బాబూ – యింటి కాడ మేకల్ని పెంచుతున్నాను – యీ తొక్క లట్టి కెళ్ళి అటికి పడేయాలని…..’

          “అబద్దాలు బాబూ – మేకలేక్కడనించి నొచ్చినాయి – నాకు తెల్దూ ‘ – వీర్రాజు గయ్ మన్నాడు. కోటమ్మ మళ్ళీ అందుకుంది. – యిద్దరి దెబ్బలాటలో సారాంశం వినేశాక చుట్టూ జనానికి కుతూహలం పోయింది. మెల్లగా కదిలారు – “సాల్లెండేహే అరటి తొక్కల కోసం సిగలట్టుకున్నారు యిద్దరూ – ఎల్లండి ….. ఎల్లండి మరి ఊరుకోండి” అని సర్ది చెప్పేశారు నలుగురైదుగురు-

***

          తెల్లారి ఆరు గంటలకి కిళ్ళీ కొట్టు తీయడానికి వచ్చిన కోటమ్మ ముందురోజు కిళ్ళీ బడ్డి ముందు పారేసిన కుళ్ళు అరటి పండు మీద కాలేసి జర్రున జారి డబ్బున పడి నడుం విరగొట్టుకుంది – ఆస్పత్రి పాలయింది.

          అపకారమే కాదు అవసరం అయితే ఉపకారం చేయగలదని ఎందుకు పనికిరాని అరటి తొక్క తనకింత ఉపకారం చేసినందుకు వీర్రాజు సంతోషం చెప్పనలవి కాదు. ‘కనీసం మూడు నెలలు తన బేరాలకి డోకా లేదు -‘ నమ్మకంగా అనుకున్నాడు.

*****

– స్పందన వాణి సౌజన్యంతో

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.