గంజాయి వనం

(నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

-నెల్లుట్ల రమాదేవి

          అయిదు చుక్కల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెమినార్ హాల్ విలేఖరులతో కిక్కిరిసిపోయి ఉంది . డిశ్చార్జ్ అయిన వెంటనే అక్కడికి వచ్చింది అనన్య .  చుట్టు ముట్టిన కెమెరాల ఫ్లాష్ లు తళుక్కుమన్నాయి. వెంటనే ప్రశ్నల బాణాలు  దూసుకొ చ్చాయి .

          “మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలిస్తాను. నేను మాట్లాడాక అడగండి, సరేనా?” అంది.

          రిపోర్టర్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

          “దయచేసి… ఎలా ఫీల్ అవుతున్నారు, అప్పుడెలా భరించారు, పారిపోవాలని ఐడియా ఎలా వచ్చింది, దుండగులను మీరెలా గుర్తుపట్టగలిగారు, అంత రాత్రి పూట తిరగడం అవసరమాలాంటి ప్రశ్నలడక్కండి!” అంది .

          విలేఖరులు అర్ధం కానట్టు చూశారు .

          “అదే ! ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా బాధితురాలిని చుట్టుముట్టి అలాంటి ప్రశ్నలన్నీ వేస్తుంటారు కదా , అవన్నీ అడగవద్దు. నేనే చెబుతాను.” అంటూ మొదలు పెట్టింది.

          “ఆ రోజు ముగ్గురు స్నేహితుల్తో కలిసి నా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లి క్యాబ్ లో ఒక్కొక్కళ్ళనీ డ్రాప్ చేస్తూ వస్తున్నాను. అప్పుడప్పుడూ అలా రావడం మాకు అలవాటే. సడన్ గా కార్ ఫెయిల్ అయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవలేదు . అక్కడ్నించి పది నిమిషాలు నడిస్తే మా ఇల్లొస్తుంది. వేరే వెహికల్స్ కూడా దొరికేలా లేవు.
కొంచెం దూరంగా ఉండే కాలనీ మాది. అప్పుడప్పుడే అందరూ ఇళ్ళు కడుతున్నారు . దారంతా చెట్లూ, చీకటిగా ఉండి భయంవేసినా తెలిసినదారే కదాని నడుస్తున్నా. సడన్ గా ఓ కారు నా పక్కన ఆగి ఎవరో నన్ను అందులోకి గట్టిగా లాగారు. నేను  పెనుగులాడు తుండగానే స్పీడ్ గా కారు పరిగెత్తింది. నా నోట్లో గుడ్డలు కుక్కి, కళ్ళకు గంతలు  కట్టారు. మొబైల్ విసిరి పారేశారు. సిటీకి దూరంగా ఏదో పైపుల ఫ్యాక్టరీకి తీసుకెళ్ళారు. నేనెంత పెనుగులాడినా, తప్పించుకుందామని ప్రయత్నించినా లాభం లేకపోయింది. వాళ్ళు బాగా తాగి ఉన్నారు. నా విన్నపాలు , కన్నీళ్ళు వాళ్ళను ఏ మాత్రం ఆపలేకపోయాయి. వాళ్ళ పశుబలం ముందు నేను ఓడిపోయాను. క్రూరాతి క్రూరంగా, ఘోరంగా.. నలుగురు నా పై అత్యాచారం చేశారు.”

          ఆ సంఘటన గుర్తొచ్చి అనన్య గొంతు గద్గదమైంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. విలేఖరి ఏదో అడగబోయాడు. కొంచెం ఆగమని సైగ చేసి కొనసాగించింది అనన్య.
“నాకు స్పృహ వచ్చేసరికి వాళ్ళు కొద్దిదూరంలో లిక్కర్ తాగుతూ, తింటూ, బూతులు మాట్లాడుతూ ఈ. ధ్యాసలో లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరూ యువకులే. ఒకడు మరీ కుర్రాడు. పదహారేళ్లుంటాయేమో! వాళ్ళు నన్ను తగులబెడదామని
మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ప్రాణాలకు తెగించి నెత్తురోడుతున్న శరీరంతో కనబడ్డ దారిలో దేక్కుంటూ వెళ్ళాను. వెనకాల ఓ చోట కూలిపోయిన కాంపౌండ్ వాల్ గుండా పక్కనున్న ఫామ్ హౌస్ కనిపించింది. ప్రాణం పోతున్నంత బాధ ! అయినా ఎలాగో ఆ గోడకు చేరుకొని మళ్ళీ స్పృహతప్పి పడిపోయాను. ఇక నేను ప్రాణాలతో ఉండనేమో అనుకున్నాను. తెల్లవారాక ఆ ఫామ్ హౌస్ వాచ్ మాన్ నన్ను చూశాడు. వెంటనే నాకు మంచి నీళ్ళు ఇచ్చి అంబులెన్స్ కి ఫోన్ చేసాడు. మిగతాది మీకు తెలుసు” ఆగిందామె.

          అప్పటిదాకా నిశ్శబ్దంగా వింటున్న రిపోర్టర్స్ తెలుసన్నట్టు తలలూపాయి .

          ‘నగర శివార్లలో ఓ యువతి పై దారుణంగా అత్యాచారం’… ‘కొన వూపిరితో
ఉన్న యువతి హాస్పిటల్ లో చేరిక’ ‘రేప్ కు గురైన యువతి హైటెక్ సిటీలో ఉద్యోగి ‘ ‘నగర శివార్లలో పెచ్చరిల్లుతున్న అత్యాచారాలు’ ‘విఫలమైన పోలీస్ వ్యవస్థ’ ‘రేపిస్టులు
నలుగురేనా ?’ ఇలాంటి హెడ్ లైన్స్ తో వార్తా పత్రికలు , టీవీ ఛానెల్స్ హోరెత్తించాయి ఆ వారం రోజులూ.

          చివరికి నిన్న వాళ్ళను పట్టుకున్నారనేది ఓ సంచలన వార్త అయింది. ఇక అప్పట్నుంచీ పోలీసులు వాళ్ళను కోర్ట్ లో హాజరు పరుస్తారా లేక ఎన్ కౌంటర్ చేసి చంపుతారా అని ప్రజలు చర్చించుకోవడం మొదలైంది . ఈ లోగా దాదాపు అన్ని ఛానల్స్ ఆ విషయం పై వివిధ రంగాల వ్యక్తులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. ఎవరి కోణంలో వాళ్ళు మాట్లాడారు. ఇంకా కొందరు ఆచూకీ తెల్సుకుని వాళ్ళ ఇళ్ళకు
వెళ్ళి ఆయా వ్యక్తుల తల్లిదండ్రుల్నీ, భార్యాపిల్లల్నీ, ఇరుగుపొరుగు వారినీ  ఇంటర్వ్యూ లు చేశారు. రేపిస్టుల్లో ఒకరైన పదహారేళ్ళ కుర్రాడు అప్పటికే ఒకమ్మాయిని వాళ్ళింట్లో నుంచి ఎత్తుకొచ్చి పెళ్ళి చేసుకున్నాడు, ఆ అమ్మాయి గర్భవతి కూడా. అతనికేదైనా జరిగితే ఆ అమ్మాయితోబాటు కడుపులో ఉన్న శిశువు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని కొంతమంది అభిప్రాయాలు వెలిబుచ్చారు. కాలేజీ అమ్మాయిలు వాళ్ళని క్రూరాతిక్రూరంగా చంపాలని కోరారు.

          మొత్తానికి ఈ వారం రోజులూ చాలా మంది ఆ విషయమే చర్చించారు.

          “మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?” అడిగాడో రిపోర్టర్.

          “సిక్ లీవ్ అయిపోగానే నేను పనిచేసే ఫార్మాకంపెనీలో చేరుతాను. నన్ను సపోర్ట్ చేసే అమ్మానాన్నలున్నారు. అర్ధం చేసుకునే స్నేహితులున్నారు. నన్నో వింత జంతువుగా చూసే సమాజం కూడా ఉంది. అయినా దీన్నొక ఆక్సిడెంట్ గా భావించి ముందు జీవితం గడపాలనే ఆత్మవిశ్వాసం నాకుంది” స్థిరంగా జవాబిచ్చింది .

          “పెళ్ళి గురించి ఎలా మరి ?” మరో విలేఖరి ప్రశ్న !

          “పెళ్ళి …దాని గురించి ఇప్పుడే ఆలోచించలేదు. ఈ విషయం తెలిసి …నన్నర్థం చేసుకునే వ్యక్తి దొరికితే…. ఏమో!” అంది అనన్య.

          “వాళ్ళకు ఎలాంటి శిక్ష పడాలని మీరనుకుంటున్నారు?”

          “ఈ వారం రోజులుగా మీడియా వార్తా కథనాలన్నీ చూస్తూనే ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్ పేరుతో, చర్చల పేరుతో… ఎవరికి తోచిన మాటలు వాళ్ళు చెబుతున్నారు. ఇక కొందరయితే బాధితురాలు బతికే ఉందట అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు . బహుశా ఇలాంటి కేసుల్లో చచ్చిపోతేనే సింపతీ వస్తుందేమో ! వాళ్ళను పట్టుకున్నారు గానీ చంపేస్తారేమో, చంపితే ఇలాంటివి మళ్ళీ జరక్కుండా ఉంటాయా, వాళ్ళ పెళ్ళాం పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు కదా, వాళ్ళేం తప్పు చేశారు పాపం, తప్పంతా
సమాజానిదే.. అంటూ మానవహక్కుల వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజమే, మరి సమాజా న్ని ఎలా శిక్షించాలో, ఆ మానవహక్కులు మాలాంటి వాళ్ళకు ఉండక్కర్లేదా చెప్పరు. పోనీ ఆ నిందితుల్ని వీళ్ళకు అప్పజెబితే ఓ నాలుగయిదేళ్ళ శిక్షాసమయంలో వాళ్ళలో పరివర్తన తీసుకువచ్చి మంచివాళ్ళుగా మార్చే గొప్ప పథకం ఏదైనా వాళ్ళ దగ్గర ఉందా?! అలా మారుస్తామని గ్యారంటీ ఇవ్వగలరా?

          ‘అంత రాత్రిపూట తిరిగితే అలానే అవుతుంది, ఇలాంటివి నాలుగు జరిగితే
ఆడవాళ్ళు కంట్రోల్ అవుతారు. ఆ బట్టలేమిటి, ఆ షోకులేమిటి … మితిమీరిన స్వేచ్ఛ ఫలితం ఇది. అసలు ఆడపిల్లలు ఎవరైనా మగవాళ్ళు తోడు లేకుండా తిరగడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి’ అని చాందసవాదులు అంటున్నారు. ఎటూ తిరగక ఇంట్లో ఉన్న పసిపిల్లల్ని, నిండా బట్టలేసుకున్న అమ్మాయిల్నీ రేప్  చేసి  చంపేవాళ్ళనే మంటారో వీళ్ళు? వేటగాళ్ళకు కాక వాళ్ళకు కనపడేలా తిరిగే జింకపిల్లలకు శిక్ష వేయ మంటారనుకుంటా!

          మద్యం వల్లనే ఈ ఘోరాలు పెరిగాయని కొందరంటున్నారు. మరి మద్యం షాపుల వాళ్ళనో, అనుమతించే ప్రభుత్వాన్నో శిక్షించే అధికారం మనకుందా?! క్రూరమృగాలు జనంలో ఉండకూడదు, బోనులోనే ఉండాలి. వాటి స్థావరమైన అడవిలోకి వెళ్ళి మనం వేటాడితే నేరం గానీ , మృగం జనంలోకి వచ్చి మనుషుల్ని చంపుతుంటే చూస్తూ ఊరుకుంటామా?”

          ఓ క్షణం ఆగింది అనన్య.

          “ఇంతకీ మీరేమంటారు?” ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.

          “ఆ రేపిస్టులతో బాటు వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా శిక్షించాలి.”

          వింటున్న విలేఖరులు ఉలిక్కిపడి “అదేంటీ?” అన్నారు ఒక్కసారిగా.

          “అవును, ఐ మీనిట్! పిల్లలు గొప్ప పనులు చేసినపుడు, మెడల్స్ సాధించినప్పుడు ఆ పిల్లల్నలా పెంచినందుకు ఆ విజయంలో తల్లిదండ్రుల పాత్ర ఉందని అందరి ముందూ గొప్పగా చెప్పుకుని ఫోటోలు దిగుతారుగా! మనం వాళ్ళకీ దండలేస్తాం, అభినం దిస్తాం. మరి వీళ్ళ తప్పులకి తల్లిదండ్రులు కొంతైనా బాధ్యులు కారా? తమ పిల్లల స్వభావమేంటో, వాళ్ళేలా పెరుగుతున్నారో, వాళ్ళ అలవాట్లెంటో నిజంగానే పేరెంట్స్ కి తెలీకుండా ఉంటుందా?

          ఒకప్పుడంటే చదువు లేక, అవకాశాల్లేక అలా అడవి మృగాల్లా పెరిగారనుకునే వాళ్ళం. ఇప్పుడు ఓ స్థాయి దాకా ఉచితవిద్యే కదా! ఇక మంచీ చెడ్డా నేర్పే అవకాశం గురువులకి ఇవ్వట్లేదు ఇప్పటి పేరెంట్స్. మందలిస్తేనే దండెత్తుతున్నారు. మరి సంస్కారం నేర్పకపోవడం ఎవరి తప్పు? తిండి పెడితేనో, బట్టలు కొనిస్తేనో, బడికి పంపితేనో, గారాబం చేస్తేనో సరిపోతుందా ?! పెంపుడు జంతువులకు లాంటిది తిండి పెట్టి, ప్రేమగా చూసినా డిసిప్లిన్ నేర్పుతాం. మనం పెంచిన మొక్కలైనా అడ్డదిడ్డంగా పెరిగితే కొమ్మలు నరికేస్తాం. మనం కొనుక్కున్న వెహికల్ అయినా రోడ్డు రూల్స్ అతి క్రమిస్తే ఫైన్ కడతాం, ఆక్సిడెంట్ చేస్తే శిక్ష భరిస్తాం. భూమిలో గంజాయి మొక్కల సాగు చేస్తే వాటిని పెంచిన వారిని వదలకుండా అరెస్ట్ చేసి శిక్షిస్తారు కదా! మరి సమాజానికి హాని చేసే గంజాయి మొక్కల్లాంటి పిల్లల్ని పెంచినందుకు ఆ తల్లిదండ్రులకు శిక్ష ఉండొద్దా చెప్పండి?” అనన్య ప్రశ్నలో ఆక్రోశం అక్కడున్నవారి హృదయాల్ని తాకింది.

          చివరగా ఒక విలేఖరి అడిగాడు. ‘దీన్ని మీరెలా భావిస్తున్నారు?’

          ‘ఆక్సిడెంట్ !’ అన్న ఒకే మాట చెప్పింది అనన్య దృఢంగా. ఆమె కళ్ళల్లో అంతు లేని ఆత్మవిశ్వాసం!

*****

Please follow and like us:

4 thoughts on “గంజాయి వనం (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)”

  1. నేరానికి శిక్ష అయినా పరిష్కారం అయినా మూలాల నుండే మొదలవ్వాలి అంటూ సాగిన కథ ఇది. నిజంగా నేరం చేసిన వాళ్ళకు శిక్ష పడితే భార్యా పిల్లలు ఏమవుతారు అని అంటే భవిష్యత్తులో వాళ్లకూ ప్రమాదం ఉంటుంది కదా?.. వాళ్ళను మార్చడం ఉన్న పరిష్కారాలలో ఇంకో మార్గం. బాగుందండీ. శుభాకాంక్షలు.

  2. ‘గంజాయి వనం’ చాలా బాగుంది అనడం కన్నా సందేశాత్మకంగా ఉందనడం సబబు. రచయిత్రి గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.