పేషంట్ చెప్పే కథలు – 29

నేనెవర్ని?

ఆలూరి విజయలక్ష్మి

 

          “నేనెవర్ని?” … ఇది ఒక తత్వవేత్త ఆత్మ జిజ్ఞాసతో వేసుకుంటున్న ప్రశ్న కాదు. ఒక ఋషి సత్తముడు జీవాత్మ, పరమాత్మల అన్వేషణలో వేసుకుంటున్న ప్రశ్న కూడా కాదు. ఒక సామాన్య యువతి తన జీవితాన్ని తరచి చూసుకుంటూ అంతులేని విషాదంతో వేసుకుంటున్న ప్రశ్న. ఒక స్త్రీ సమాజంలో, కుటుంబంలో తన ప్రతిపత్తి ఏమిటి? అని తర్కించుకుంటూ వేసుకుంటున్న ప్రశ్న. 

          శాంతి మనసులో ఎనిమిదేళ్ళుగా అనుక్షణం ఈ ప్రశ్న సుళ్ళు తిరుగుతూనే ఉంది. ఇప్పుడామె టీనేజ్ కూతురు సంచిత దుఃఖంతో, ఆగ్రహంతో, అవమానంతో జ్వలిస్తూ సంధిస్తున్న ప్రశ్న పరంపరలో ఈ ప్రశ్న విశ్వరూపం దాల్చి ఆమె కళ్ళముందు నిలిచింది. 

          “మమ్మీ!” మత్తుగా పడుకున్న సంచిత కొద్దిగా కదిలి కళ్ళను బలవంతాన విప్పడానికి ప్రయత్నిస్తూ అమ్మ చేతినందుకుని గట్టిగా పట్టుకుని గుండె కానించుకుంది. ఆ పిలుపులో ఆర్తి, అభద్రతా భావంతో, అమ్మ దూరమైపోయి తాను ఒంటరి పక్షినైపోతానేమోనన్న భయంతో పిలిచినా ఆ పిలుపులో ఆక్రందన శాంతిని ఒణికింప జేసింది. ఒంగి కూతురు తలను తన బాహువుల మధ్య పొదవుకుని ఓదార్పుగా నిమురుతూంది. అంతలో లోపలికి  వచ్చిన ఆమె భర్త శ్రీనివాస్ ని చూసి సంచిత తలను బెడ్ పై ఆంచి లేచి నుంచుంది. 

          కూతురి ప్రక్కన కూర్చున్న అతని ముఖంలోని ఆదుర్దాను, వడిలిన పువ్వులా మంచం మీద అస్తవ్యస్తంగా పడివున్న కూతుర్ని చూసి ఆతను పడుతున్న వేదనను మౌనంగా గమనిస్తూంది. ఎన్నడూ నాలతపడని సంచిత ఒక్క రోజులో ఇంత నీరసంగా ఏందుకయిందో శ్రీనివాస్ కి అర్థం కావడం లేదు. అసలేం జరిగిందో భార్యను అడిగి తెలుసుకోవాలని వుంది శ్రీనివాస్ కి. కానీ శూలాల వంటి ఆమె చూపుల్ని ఎదుర్కోవడం అతనికి సాధ్యం కాదు. అందుకే డాక్టర్ శృతిని అడిగి తెలుసుకుందామని ఆమె దగ్గరకు వెళ్ళాడు. 

          “సంచిత మానసికంగా బాగా దెబ్బతింది. కారణమేమిటో తెలియదు గాని నిన్న కాలేజీ నుండి మధ్యలోనే వచ్చేసిందట. వచ్చిన దగ్గర్నుండి పెద్ద పెద్ద అరుపులు, చేతికందినవి విసిరెయ్యడం, పెద్దపెట్టున వెక్కి వెక్కి ఏడుపు. ముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టాము.” తండ్రిని విమర్శిస్తూ విస్ఫులింగాలు చిమ్ముతున్న సంచిత కళ్ళు గుర్తుకొచ్చాయి శృతికి. సంచిత కొంచెం కుదుటపడేవరకు అతనామెకంట పడడం మంచిది కాదని, అతనిని చూస్తే ఆమె మరీ రెచ్చిపోవచ్చునని చెప్పింది శృతి. 

          తనంటే ప్రాణం పెట్టె సంచిత తనను అసహ్యించుకుంటూందనే ఊహనే భరించలేక పోతున్నాడు శ్రీనివాస్. కానీ తమ శ్రేయోభిలాషి అయిన శృతి సూచన మేరకు కొంత సమయం దూరంగా ఉండడానికే నిశ్చయించుకుని సంచిత అలజడికి కారణమేమిటో తెలుసుకోమని అభ్యర్థించి వెళ్ళిపోయాడు. 

          తన పని అయ్యాక శాంతిని తన రూమ్ లోకి పిలిచి సంచిత అలా అవడానికి కారణమేమిటని అడిగింది శృతి. ఒక నిమిషం సేపు అవమానంతో, దుఃఖంతో తలదించు కుని కూర్చున్న శాంతి తనను తానూ కూడదీసుకుని కళ్ళెత్తింది. 

          “సంచిత ఇలా ఎందుకయిందో చెప్పేముందు కొన్ని విషయాల మీద మీ అభిప్రాయం చెబుతారా మేడం?” శాంతి అడిగింది. అంగీకారంగా తలూపి కుతూహలంగా ఆమె వంక చూస్తూంది శృతి. 

          “పెళ్ళయి పిల్లలున్న పురుషుడు మరొక పెళ్ళి చేసుకుంటే రెండో ఆమెకు చట్టపరంగా ‘భార్య’ స్థానం ఉంటుందా?”

          “ఉండదు”

          “ఉండదు కదా! రెండో ఆమెకు ‘మిస్ట్రస్’ స్థానమే తప్ప ‘మిసెస్’ స్థానం ఉండదు. మరొక్క విషయం. బంధు మిత్రుల సమక్షంలో అట్టహాసంగా చేసుకుంటేనే పెళ్ళి  అవుతుందా, ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు నలుగురు స్నేహితులు శుభాకాంక్షలు చెప్తూ ఉండగా పెళ్ళి చేసుకుంటే అది పెళ్ళి అవదా?”

           “ఎంతమంది సమక్షంలో చేసుకున్నా పెళ్ళే. సాక్షుల సంఖ్యను బట్టి పెళ్ళి అయిందా లేదా అనేది నిర్ధారణ చెయ్యముకదా!” శాంతి ఈ ప్రశ్నల్ని ఎందుకడుగుతూందో తెలియక తనకు తోచింది శృతి చెప్పింది. 

          శృతి చెప్పింది వింటూనే ఆలోచనలో పడిన శాంతి కళ్ళముందు నిన్న ఎర్రబడిన ముఖంతో నిప్పులు కక్కుతూ వచ్చిన సంచిత రూపం నిలిచింది. సీనియర్ ఇంటర్ చదువుతున్న సంచితతో ఫ్రెండ్స్ జూనియర్స్ లో క్రొత్తగా జాయినయినా ఒకమ్మాయి సంచితాను పోలి ఉందని చెప్పేసరికి కుతూహలంతో ఫ్రెండ్స్ ని వెంటబెట్టుకుని ఆమె ను కలిసింది సంచిత. పర్పర పరిచయాలయ్యేసరికి అందరినీ విభ్రాంతిలో ముంచిన విషయం ఒకటి బయటపడింది. తామిద్దరి తండ్రి ఒక్కరేనని తెలిసి షాక్ తింది సంచిత. “శాంతి పాలిమర్స్ అధినేత శ్రీనివాసరావుగారు మా నాన్నగారు, మీ నాన్నగారేలా అవుతారు?” అంటూ ఆ అమ్మాయి పై నిప్పులు చెరిగింది సంచిత. కానీ శ్రీనివాస్ గురించి ఆ అమ్మాయి చెప్పిన వివరాలు విన్నాక ఆ చేదు నిజాన్ని నమ్మక తప్పలేదు. 

          తన తండ్రి ప్రేమ తానొక్కదానికే స్వంతం అని గర్విస్తున్న సంచిత తన ఈడుపిల్లే మరొక వాటాదారు ఉందని తెలిసే సరికి తట్టుకోలేక పోయింది. దానికి తోడు పుండుమీద కారం చల్లినట్లుగా ఫ్రెండ్స్ వెటకారపు నవ్వులు, వ్యంగ్య బాణాలు తన తల్లిని, తమను మోసంచేసినా తండ్రి మీద ఉవ్వెత్తున లేచిన కోపంతో జ్వలిస్తూ ఇంటికి వచ్చింది. ఎనిమిదేళ్ళుగా పిల్లలకీ విషయం తెలియకుండా మభ్యపెడుతూ శాంతి రహస్యంగా మోస్తున్న నిప్పుల కుంపటిని ఒక్క తోపు తోసింది సంచిత. తండ్రి ఇంట్లో లేనప్పుడల్లా ఊరికెళ్ళారని తమకు అబద్ధం చెబుతూ తండ్రి చేస్తున్న నిర్వాకాన్ని దాచినందుకు, అంత  అవమానకరమైన స్థితిలో తల్లి జీవిస్తున్నందుకు మండిపడింది సంచిత. 

          రవ్వంత కష్టంకూడా తెలియకుండా పెరిగిన సంచిత, జీవితమంతా అనురాగాలు, ఆప్యాయతలతో గడిచిపోతుందని ఆశిస్తున్నా సంచిత, జీవితపు మరోకోణాన్ని దర్శించ డంతో ఆమె రంగుల స్వప్నం చెల్లాచెదురైంది. భగ్నమైన కళలు ఆమెను ఉన్మత్తురాలిని చేశాయి. “పాపం అందుకే అంతగా అప్సెట్ అయింది” శాంతి చెప్పింది విని జాలిపడింది శృతి. 

          “ ఎనిమిదేళ్ళక్రితం మొదటిసారి నాకీ విషయం తెలిసినప్పుడు నేనూ అంతకంటే ఎక్కువగా అప్సెట్ అయ్యాను డాక్టర్ గారూ! నన్ను పెళ్ళి చేసుకోవడానికి రెండేళ్ళ ముందే ఆయనకు పెళ్ళయిందని, ఒక బిడ్డ కూడా ఉందని, మా పెళ్ళాయ్యాక ఆమెకు మరో ఇద్దరు పిల్లలు పుట్టారని తెలిసిన రోజున నేను ప్రేమ మీద, పరస్పర విశ్వాసం మీద, వివాహ వ్యవస్థమీద పెట్టుకున్న నమ్మకాలు కుప్పకూలిపోయాయి. నా కలలు, ఆశలు, ఇష్టాలు, అన్నిటినీ నా భర్తతో  ,పిల్లలు తప్ప మరో ప్రపంచం యెరుగకుండా బ్రతుకు తున్న నేను కళ్ళు తెరచి చూసేసరికి కనిపించింది పునాదేలేని మా వివాహ బంధం, త్రిశంకుస్వర్గంలా ఉన్న నా బ్రతుకు” యెంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా శాంతి కంఠం గద్గదమైంది. 

          “ఇది నీ ఇల్లు. నువ్వితని భార్యవు. ఈ స్థానం నీదే. మగవాడు బయట సవాలక్ష సంబంధాలు పెట్టుకుంటాడు. ఇంటి ఇల్లాలు యాగీచేసి కుటుంబం పరువును బజారున పెట్టకూడదు”. అత్తగారు చెప్పిన హితువు విని నేను కోపంతో దహించుకుపోయాను. వివాహ బంధంలో భార్యకు పాతివ్రత్యపు కట్టడి పెడుతూ భర్తను బయట సవాలక్ష సంబంధాలు పెట్టుకోవడానికి అనుమతించే సంప్రదాయాన్ని గౌరవించదలచలేదు నేను. నేను తెచ్చే కట్నకానుకల కోసం మోసంతో నా గొంతుకోసిన నా భర్త, అత్తమామల్ని ఖండ ఖండాలుగా నారకాలన్నంతగా ఉబికిన ఉద్రేకాన్ని అణచుకున్నాను.

          ఆవేశం చల్లబడ్డాక, నింపాదిగా ఆలోచించాను. నేను తెచ్చిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టె ఈ సంపాదనంతా ఈయన సంపాదించింది. నేను కోరుకున్న మరుక్షణాన నా పేర నున్న ఆస్తులన్నిటినీ నేను వసం చేసుకోగలను. వాటిని నిర్వహించుకోగలిగే ఆత్మ స్థైర్యం కూడా నాకుంది. కావాలనుకుంటే, భ్రమగా మిగిలిపోయిన కాపురాన్ని కాలదన్ని నా పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళిపోగలను అనుకున్నాను. కానీ ఆచరణలో అది సాధ్యం చేసుకోలేకపోయాను.

          మగపిల్లలిద్దరూ బాగానే వున్నారు కానీ, మా అమ్మగారింట్లో ఒక నెల రోజులు ఉండే సరికి సంచిత తండ్రి మీద బెంగతో వెళ్ళిపోదామని పేచీ పెట్టింది. అది వేసే యక్షప్రశ్న లకు నేను సమాధానం చెప్పలేకపోయేదాన్ని. ఒకవైపు అమ్మానాన్నల హితబోధ. అక్కడ నుండి కూడా వెళ్ళిపోయి విడిగా ఉందామనుకునేంతలో సంచిత జబ్బు పడింది. తండ్రి కోసం కలవరింతలు, ఏడుపు, చివరకు సంచిత కోసం నేను దిగిరాక తప్పలేదు. యెంత అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ఈ కాపురానికి అంటిపెట్టుకుని ఉండక తప్పలేదు. శాంతి చెప్పేది వింటున్న శృతికి ఆశ్చర్యం కలగలేదు.

          “ ఏ మగాడికైనా వివాహేతర అనుబంధాలు లేకపోతె అపురూపంగా అనుకోవాలి గాని ఉంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మగవాడికి సమాజం కట్టబెట్టిన ఈ వెసులుబాటుని ఆకర్షణీయం చేస్తున్న సినిమాలు, టి.వి., సాహిత్యం పురుషుడి ఈ ప్రవర్తన సహజం, ఆమోదయోగ్యమైనది అనే భ్రమల్ని కల్పిస్తున్నాయి” విచారంగా అనుకుంది శృతి. 

          “మరో స్త్రీతో నా భర్తను పంచుకునేందుకు ఎదురు తిరుగుతున్న మనసు ఒక ప్రక్క, అతని నుండి శాశ్వతంగా విడిపోవడానికి ఆటంకంగా ఉన్న నా పిల్లలు మరో ప్రక్క, అనుక్షణం నన్ను చిత్రహింస పెడుతున్న మోసపోయానని భావం వేరొక ప్రక్క నన్ను నలిబలి చేశాయి. కొంచెం తేరుకున్నాక నేను ఈ ఇంట్లో మసిలే పిల్లల తల్లిగానే జీవిస్తు న్నాను తప్ప అతని భార్యగాకాదు, ఇది నా పొగరుబోతుతనంగానో, పిచ్చిగానో కనిపించ వచ్చు. కానీ నా స్థితిలో ఉండే కొంత మంది స్త్రీలలా నేను రాజీపడిపోయి ప్రేమ, నమ్మకం లేని వివాహబంధంలో ఏమీ జరగనట్లు నటిస్తూ ఇమడలేక పోయాను. అతని పాశ్చాత్తా పాలు, వేడుకోలు, వాగ్ధానాలు, బెదిరింపులు, ఏవీ నన్ను కదిలించలేక పోయాయి. మనసు తో ప్రమేయంలేని కేవల దైహికబంధాన్ని కొనసాగించలేకపోయాను”. తన హృదయం లోని వ్యథను అన్ని సంకోచాలని వదిలి వెల్లడిస్తూంది శాంతి. పైకి ఏంతో నిబ్బరంగా, హుందాగా కనిపించే శాంతి గుండెలో దాగివున్న సంఘర్షణను చకితయై వింటూంది శృతి. 

          “తమ అనుమతి, ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్న ఆమెను కొంత డబ్బు పడేసి వదిలించుకోమని కొడుకుకు సలహానిస్తున్న అతని తల్లి దండ్రుల దౌష్ట్యం నన్ను మరింత బాధించింది. తమ కొడుకుతో జీవితం కోసం సర్వస్వం వదిలేసి వచ్చి పెళ్ళి చేసుకుని పిల్లల్ని కన్నా కోడల్ని ఒదిలించుకోమని ఒత్తిడి చేయడం అన్యాయమని వీళ్ళకు అనిపించడం లేదా అని ఆవేశపడ్డాను. వాళ్ళ దుర్మార్గపు ఆలోచనల్ని ప్రతి ఘటించి ఆమెకు అపకారం జరగకుండా చేయగలిగాను. కానీ ఇన్నేళ్ళుగా నన్ను నేను ప్రశ్నించుకుంటూనే వున్నాను నేనెవర్ని? మిస్టర్ శ్రీనివాస్ ‘మిస్సెస్’ నా? ‘మిస్ట్రెస్’ నా?”

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.