బాపమ్మ

(నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

– పెనుగొండ బసవేశ్వర్

మా ఇంటి సాయబాన అర్ర తలుపుకు తగిలించిన
పెద్ద తాళంకప్పను సూసినప్పుడల్లా ఇంటి ముంగట
బజారు గల్మల్ల కూసునే మా బాపమ్మే యాదికొస్తది
బొంకలాంటి నోటిని చేతుల కట్టెను ఆడిచ్చుకుంట
వచ్చిపోయే వరసైన వాల్లతోటి వాట్లేసుకుంట
పొద్దంతా దానికి ఏర్పడకుండ ఆడనే పొద్దుపోయేది
అమ్మవచ్చి జర ఇంట్లోకొస్తావా అన్నం తినిపోదువంటే
ఇంత అన్నంకూర నాలుగు సల్లసుక్కలు ఏసియ్యరాదే 
అందరూ తినేది గదేనాయే మనదేమన్నా బంగారమా
జిట్టి తాకనీకి అనుకుంట బజార్లనేతిని మూతికడుక్కునేది
పళ్లెంల నీల్లను ఒంపి ఒట్టిగనే కడిగి పక్కకు పెట్టేది
పోచమ్మగుల్లె పసులకు గడ్డి ఎయ్యడానికి ఎవ్వలచ్చినా
ఓ కొడుకా.. గోడ మీదికెల్లి మా ఇంట్లకూడా జరంత
పారేసిపో… మా మనవలు పల్లికాయ కాల్సుకుంటరట
అంటూ అడుక్కున్న గడ్డితోటి వాకిలి సందంత నింపేది
ఇంటిముంగట సర్కారు బాయికాడ నీళ్ల కోసం
ఆడ పొల్లగాండ్లు వస్తేసాలు ఓ కోడలా.. ఓ మనవరాలా..
జర నాల్గుశాదలు గా బిందెలగూడ పోసిపోబిడ్డ అని
వాల్లటు పోంగనే అమ్మతోటి జల్దిన వాటిని గోలెంల
కుమ్మరించి మల్ల బిందె బాయికాడ పెట్టమని ఉరికిచ్చేది
తాత బసవయ్య పేరుబోయిన ఆయుర్వేద వైద్యుడు
అయ్యేపటికె, అప్పుడో ఇప్పుడో అవసరానికి ఇంత
చేదుమందు ఇచ్చినోడని అందరూ చేది పోసేటోల్లు
అరుగులమీద రంగమ్మ ఉన్నంతసేపు అరుపులతో
వాల్లను వీల్లను వదిరిచ్చే రంగస్థలమే వాకిలి
ఓపొల్లా.. మొగని దగ్గర మొగులు మీద ఉండక
అలిగొచ్చి మీ అవ్వ పక్కల పంటున్నవేందే
మీ అయ్యనడిగి నాలుగు బత్తల వడ్లుపారేసుకొని
బండిగట్టుకొని సప్పుడుజేక అత్తగారింటికి నడువమని
కొత్తగా పెండ్లైన కోడండ్లకు కొర్కాసులెక్క బుద్ధిజెప్పేది

ఇంటెనక చింతచెట్టు కాయ దుల్పడానికి మనుషులస్తే
నులక మంచంల గద్దలెక్క కూసోని గోడౌతల పడ్డ
పది కాయల కోసం, చెట్టు నీ తాత పెట్టిండానే అని
తిట్టుకుంట పక్కింటోళ్లతోటి పంచాయితీపెట్టేది
ఇక పాలు పంచేకాడ కొసిరికొసిరి సంపుకతినేది

నశం పీల్చటానికి ఎన్నడూ నయాపైస పెట్టిందికాదు
పక్కింటి యాదమ్మను పాయిరంగ పలుకరించుకుంట
దాని కర్రెడబ్బి మొత్తం కండ్ల ముంగట్నె ఖాళీ చేసేది
సాటుంగ ఇంత కొంగుల ముడేసుకొని బోడ్లె శెక్కుకునేది
ఆమె నశం ఇచ్చినట్లే ఇచ్చి పుక్యానికి బుట్టెడు
శిక్కుడుకాయ ఇకమతు తోటి మాఇంట్ల తెంపుకపోయేది
దానికి అదేమి ఆనందమో అసలే అర్థంకాకపోయేది
మోదుగాకు గుండ్రంగా సుట్టి పొగాకు మట్రంగ పెట్టి
మగరాయుడి లెక్క గుప్పుగుప్పుమని సుట్ట తాగేది
గొల్లోల్ల కొమరమ్మ వచ్చి ఆకియ్యమని అడిగితే మాత్రం
ఉన్నకాడికి ఇప్పుడే అయిపోయిందని ఉట్టిగనే చెప్పేది
మంచాలవడ్డంక అమ్మ బాపులు ఎంత సేవచేసినా
ఏదో ఎల్తి దానికి, బయటికి పోతే బాగుండునని
శాతకాదాయే సావురాదాయే అనుకుంటనే
ఓరోజు దాని కట్టె శాశ్వతంగా మూలకు పడ్డది
కొన్నేళ్లు బాపమ్మ అంటే దర్వాజా పక్కన
మసిబట్టిన దీపంలేని దిగుడులా అనిపించేది
తన జ్ఞాపకాలు ఇల్లంతా వాకిలంతా వెంటాడేవి
బాపు కూడా పోయినతర్వాత శిథిలమై నేలమట్టమైన
ఇల్లు కూడా పలకరించని జ్ఞాపకంగా పగిలిపోయింది

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.