ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 1
(ఒరియా నవలిక )
మూలం – హృసికేశ్ పాండా
తెనుగు సేత – స్వాతీ శ్రీపాద
లేళ్ళు అడవుల్లో, వనాల్లో ఉంటాయి. అడవిలో గడ్డి మేసి, ప్రవాహాల నీళ్ళు తాగి బతుకుతాయి. అవి ఏ రకంగానూ మనిషికి బాకీపడి లేవు. అయినా మనుషులు వాటిని వేటాడుతారు. మనిషి దురాశకు అంతం ఉందా?
***
డిసెంబర్ 2000 రెండో తేదీన భువనేశ్వర్ నుండి వచ్చే న్యూస్ పేపర్లలో మొదటి పేజీ హెడ్ లైన్స్ లో ఒక వార్త పెద్ద పెద్ద అక్షరాల్లో తళుక్కుమంది.
” రాష్ట్ర ప్రజలకు కొత్త శతాబ్దంలో ప్రభుత్వ కానుక. గిరిజన యువతి ఆకలితో దుర్మరణం. “
ఎన్నో న్యూస్ పేపర్లు కొంచం అటూ ఇటూగా ఇదే ముఖ్య సమాచారంగా ప్రచురిం చాయి. ఆ వార్త సారాంశం :
ప్రేమశిలా బాయి అనే స్త్రీ గమడా గ్రామస్తురాలు, ఒక నెల తినడానికి ఏమీ లేక ఆకలితో, 2000 డిసెంబర్ 1న మరణించింది. ఒకనెల ఆకలితో ప్రేమశిల యుద్ధం చేశాక కూడా ఎవరూ ఆమెకు పిడికెడు బియ్యం గాని నూకలు గాని ఇవ్వలేదు. ఆమె మరణ వార్త ప్రభుత్వానికి చేరలేదు. శవాన్ని ఎలాటి పోస్ట్ మార్టమ్ చెయ్యకుండా హడావిడిగా దహనం చేసారు. శవపరీక్ష జరిపితే ఆమె ఆకలితో మరణించిందని నిర్దారణ అయ్యేది.
గౌరవప్రదమైన లీగల్ కౌన్సిల్ డిసెంబర్ 2 న నిర్వహించిన సభ మిగతా కార్య కలాపాలను వాయిదా వేసి ఈ విషయమే సమగ్రంగా పరిశోధించమని అడిగింది. చర్చలు జరిగాక స్టార్వేషన్ ఇంచార్జ్ కమీషనర్ తీర్మానించినది ఈ విషయంలో ఎలాటి పక్షపాత ధోరణి లేకుండా విచారణ జరపాలని, దర్యాప్తు పూర్తయ్యాక సమగ్ర నివేదిక అందిం చాలని. ఈ మొత్తం తతంగానికి కమీషనర్ కు మూడు నెలల సమయం ఇచ్చారు.
అందిన సూచనల ప్రకారం ఈ కింది నివేదికను సమర్పిస్తున్నాను, ఇచ్చిన మూడు నెలలకన్న ముందే , 17 జనవరి 2001 న , నెలన్నర సమయం లోనే అందిస్తున్నాను.
నేను ఈ దర్యాప్తు జనవరి 11-జనవరి 14, 2001 మధ్యన నిర్వహించాను. ఈ దర్యాప్తు కు ముందుగానే నోటీసులు జారీచేసాము.
చుట్టుపక్కల పదినుండి పదిహేను గ్రామాల్లో దాదాపు వంద మంది స్త్రీలు, పురుషు లను గమడా గ్రామానికి తీసుకు వచ్చాము. దానితో పాటు ఎందరో రాజకీయనాయకులు ఇక్కడికి విచ్చేసారు. దానివల్ల సాక్ష్యుల నుండి యోగ్యతా పత్రాల సేకరణ కొంచం కష్ట మయింది.
జనవరి 14 జనాల విచారణ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్ణయించి ఆ మేరకు నోటీస్ విస్తృతంగా ప్రకటించాము. కాని, ఆ రోజున ఒక్క సాక్షి కూడా రాలేదు.
***
ప్రేమశిల దారుణమైన ఆకలితో మాడిపోడం గురించిన నివేదిక అందించే ముందు, నేను కొంతమంది మగవారి కథనాలు వివరించాలి. బహుశా ఈ సంఘటనకు సంబంధిం చినవి కాకపోవచ్చును. కాని నిజానికి దీనితో దగ్గర అనుబంధం ఉన్నవి. దానికి మనం దాదాపు నలభై యేళ్ళు వెనక్కు వెళ్ళాలి.
రాయ్ పూర్ ను టిట్లాఘర్ ను అనుసంధానిస్తూ గమడా రోడ్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉండేది. ఇప్పుడు గమడా రోడ్ ఒక పెద్ద బస్తీ, వ్యాపారానికి కేంద్రం. అక్కడ ఒక మున్సిపాలిటీ, తాసీలు ఆఫీస్ ఉన్నాయి.
1960 దరిదాపుల్లో గమడా రోడ్ ఒక చిన్న రైల్వే స్టేషన్. అక్కడ గోపాల భగర్తి అనే బండి వాడు ఒక చిన్న టీ కొట్టు నడిపేవాడు. రోజంతటికీ ఒకే ఒక్క పాసెంజర్ ట్రైయిన్ అక్కడ ఆగేది. ఏ ఎక్స్ ప్రెస్ లేదా గూడ్స్ బళ్ళు ఆగేవి కాదు. గమడా గ్రామం స్టేషన్ కి పదిహేడు కిలోమీటర్లు. గమడా అంటే ఒక చిన్న గుట్ట. గ్రామం ఒక కొండ మీద ఉండటం వల్ల దానికా పేరు వచ్చింది. వెనకాల దాన్ని కప్పేస్తూ అనంతమైన, దట్టమైన అడవి. అడవి నిండా వందేళ్ళు పైబడిన కలప చెట్లు – సాల వృక్షాలు, మలబార్ , అసన్, టెండూ, రోస్ ఉడ్, కరంజి చెట్లు. రాత్రిళ్ళు పులులు నివాసాల దగ్గర తిరిగేవి. ప్రతి ఏడాదీ ఒకరో, ఇద్దరో నరభక్షకిగా మారిన పులిబారిన పడటం ప్రభుత్వ రికార్డ్ లలో ఉంది. ఎవరైనా ప్రయాణీకుడో, వ్యాపారో రాత్రి పూట గమడా రోడ్ చేరితే స్టేషన్ లో ఉన్న ఒకే ఒక బెంచీ మీద పడుకునే వారు. భగర్తి వారికి పప్పూ , అన్నం వండి వడ్డించేవాడు.
గోవింద భులియా పద్మశాలీ కులస్తుడు. అతని తలిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు నేతపని తెలుసు. మగ్గాల మీద బట్టలు నేసేవారు. గోవింద భులియా ఈ చేనేత బట్టలు ట్రెయిన్ లో ప్రయాణీకులకు అమ్మేవాడు. కొంచం డబ్బు సంపాదిం చగానే ఒక చిన్న ఇల్లు గమడా రోడ్ స్టేషన్ దగ్గరలో భగర్తి షాప్ ఎదురుగా -కొమ్మలు తీగలతో అల్లి మట్టి పూసిన గోడలతో పైకప్పు పెంకులతో -కట్టుకున్నాడు. అక్కడే తన బట్టల దుకాణం పెట్టుకున్నాడు. అమ్మకాలు పెద్ద గొప్పగా ఉండేవి కాదు. అందుకే తన షాప్ లో పప్పులు, ఉప్పు, నూనెలు, బియ్యం వంటి నిత్యావసరాలు, అప్పుడప్పుడు పండిన అరటి గెల, గుమ్మడి కాయలు కూడా ఉంచేవాడు. 1960 కల్లా గమడాలో గోపాల భగర్తి, గోవింద భులియా ఇద్దరు శాశ్వత స్థానిక నివాసులు.
అదే సమయంలో అక్కడికి మరో రెండు కుటుంబాలు వచ్చాయి, మొదటి కుటుంబం జలంధర్ సింగ్. అతని తండ్రి పెషావర్ సింగ్ మధ్య భారతదేశం రాయ్ పూర్ లో ఒక అడవి కాంట్రాక్టర్ దగ్గర డ్రైవర్. కంట్రాక్టర్ కోసం కలప దొంగ రవాణా చేసేవాడు. అతను తరచు దొంగతనం చేసి దొంగ రవాణా చేసిన కలప తన కోసం అమ్ముకునేవాడు. దొంగ చాటుగా సంపాదించిన డబ్బుతో ఒక ట్రక్ స్వంతగా కొనుక్కున్నాడు. ఒక రోజున ఛత్తీస్ గడ్ ప్రాంతంలో కలప అక్రమ రవాణాలో పట్టుబడ్డాడు. ఇదివరలో ఇతర కలప కాంట్రాక్టర్ లు అతనికి సాయం చేసే వారు. కాని ఇప్పుడు పెషావర్ సింగ్ ఒక ట్రక్ యజమాని. కంట్రాక్టర్లు అతన్ని విడిపించలేదు. అతను జైల్ కి వెళ్ళాడు.
జైల్ లో ఆరేళ్ళున్నాడు. ఆ ఆరేళ్ళలో అతని భార్య ఇద్దరు కొడుకులకు ఒక కూతురి కి జన్మ నిచ్చింది. ఆర్నెలు పూర్తి కాకుండానే ఆడపిల్ల చనిపోయింది. కొందరు తల్లే బిడ్డను గొంతునులిమి చంపిందని అంటారు. తను అలవాటు పడని పరిస్థితుల్లో ఆడపిల్లను పెంచలేక ఆపని చేసింది.
జైల్ నుండి విడుదల అయ్యాక, పెషావర్ ఇంటికి వెళ్ళి తన భార్యా కొడుకులను తమ తమ వస్తువులు సర్దుకోమన్నాడు. వాళ్ళు సర్దుకుంటుంటే పెషావర్ బయటకు వెళ్ళి దొంగతనం చేసిన ట్రక్ ఒకటి తెచ్చి తమ సామాను అందులో సర్దాడు. అతను గొప్ప హడావిడిలో ఉన్నాడు.
” తొందరగా, తొందరగా. సామాను లోపల పెట్టి అతను, భార్యా ముగ్గురు కొడుకులతో కాబిన్ లోకి ఎక్కాడు. పెషావర్ ఎంత భయపడిపోయి, తొందరలో ఉన్నాడంటే అతని భార్య, కొత్తగా పుట్తిన కొడుకుల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు.
పెషావర్ గమడా రోడ్డు చేరుకున్నాడు. తన భార్య చిన్న కొడుకు రాయ్ పూర్ ను భగర్తి షాప్ దగ్గర వదిలేసి మిగతా ఇద్దరు కొడుకులు జలంధర్, సతీందర్, లతో ట్రక్ లో పారిపోయాడు. తన ట్రక్ లైసెన్స్ ప్లేట్, చస్సిస్ నంబర్ మార్చి రాత్రికి తిరిగి వచ్చాడు. అతను వచ్చేసరికి అతని భార్య భగర్తి షాప్ లో వంట చేస్తూ ఉంది. అక్కడున్న రెండు రోజుల్లో భగర్తి వ్యాపారాన్ని పెషావర్ అంచనా వేసాడు. వంద రూపాయలకు ఆ షాప్ కొనేసాడు. భగర్తి ఏళ్ళుగా ఆ షాప్ నడుపుతున్నాడు. కాని ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తాన్ని కళ్ళ చూడలేదు.
పెషావర్ భగర్తిని అనునయిస్తూ, ఇదే కాదు, నిన్ను నా డిపోకి మేనేజర్ చేస్తాను. నువ్వు నా కలప డిపో చూసుకుంటూ మరింత సంపాదిస్తావు” అన్నాడు.
” నాకు కలప వ్యాపారం గురించి ఏమీ తెలియదు.” భగర్తి తన మోటు బోళాతనంతో అన్నాడు, ” కలప వ్యాపారం అంత లాభసాటిదైతే నువ్వు నా చిన్న గుడిసె ఎందుకు కొన్నావు?” అని అడిగాడు.
పెషావర్, భగర్తికి ఇది అర్ధం కాదనీ, అతనికి అర్ధం అయిన పనులకే పరిమితం అవ్వాలనీ అన్నాడు. అంటే భగర్తి పురాతనమైన బలిష్టమైన కలప చెట్లను గుర్తించాలి, కూలి వాళ్ళను ఏర్పాటు చెయ్యాలి. పెషావర్ అటవీశాఖ నుండి కలప తీసుకుని అమ్ము కుందుకు పర్మిట్ సంపాదిస్తాడు.
*****
(సశేషం)
స్వాతీ శ్రీపాద పుట్టి పెరిగినది నిజామాబాద్. కధ, కవిత, నవల ఒకఎత్తైతే , అనువాదం మరొక ఎత్తు. వెరసి మొత్తానికి అక్షరాలే ప్రపంచం. రాసినది చాలానే అయినా ప్రచురించినది 8 కవితా సంపుటాలు, 7 కధా సంపుటాలు, 4 నవలలు మరెన్నో డిజిటల్ పుస్తకాలు. అనువాదాలు 32 తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం , ప్రతిభా పురస్కారం, వంశీ -తెన్నెటి లత కధా పురస్కారం , వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం , రచనకు అనువాదానికి మహాత్మా ఫూలే అవార్డ్ , మొదలైనవి ఎన్నో…