ఈ తరం నడక – 5

రూపం మార్చుకున్న నిరీక్షణ – గీతా వెల్లంకి

-రూపరుక్మిణి. కె

          ఒక్కోసారి కొందరిని చదువుతూ ఉంటే, 
          మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.
          పుస్తకం చిన్నదే కదా,  ఎందుకు ఇంత సేపు?
          అవుతుంది తిరగేసిన పేజీలే మళ్ళీ ఎందుకు తిరగబడుతున్నాయి ??
          మనసుని ఎందుకు ఎక్కడో చిక్కుబడవేసి లాగేస్తున్నాయి?
 
          అంతరాంతరాల్లో వేదన ఏదో గూడు కట్టుకుని ఉందా..!  కలువ పువ్వు  వెన్నెలకి విచ్చుకున్నట్టు కొన్ని పదాలకి మనసు వలలో చిక్కుకుంటుందేమో…. 
 
          అవునేమో….
 
          అంతేనా **ఏ స్వరం వెనక ఏ కఠిన పాషాణ హృదయం దాగి ఉందో… నువ్వే నేను అయినా కనిపెట్టగలమా…!!**
 
          ఒకానొక నాటికైనా రాతి గుండెల్లో గూడు కట్టుకున్న తడియారని గొంతు ఒకటి ఆప్యాయంగా పిలుస్తుందేమో..!!
 
          ” కాలాలు ఋతువులు ఎన్ని మారినా మారనిది ప్రేమ రంగు ఒక్కటే ” అయినా ఇంద్రధనస్సులోని భావాలు ఉంటాయి. ఆ భావాలే  మనిషిని ఊపిరాడకుండా చేయ గలిగేది. 
 
          స్వేచ్ఛాకాశంలో రెక్కలు ఇచ్చి ఎగరవేసేది., తెగిపోయిన గాలిపటాన్ని చేసేది 
 
          ఈ మానస సంద్రంలో ఎవరికి ఎవరూ ఏమీ కారు
          ఒకరికి ఒకరు సొంతమై పోతారు  
          ప్రేమ మైదానంలో ఆట ఎవరు ఆడినా గెలుపోటములు మాత్రం ఇద్దరివి 
 
           అందుకేనేమో ఈ పుస్తకం 50% లవ్ అయ్యింది.
 
          అవును నేను మాట్లాడుతున్నది గీత వెల్లంకి రాసిన ప్రేమ కవితల నిరీక్షణల మాల…
 
          కలనేత కలతల్లో ఎక్కువ దూరాలు కలిసి పయనించాలని ప్రేమ ఎప్పుడూ అనుకోలేదు అంటూనే కలిసి ఉండాలనుకునే హృదయం కలయికల్లో  ఓ అనంత సాగరం అని చెప్తూ ఉంటుంది.
 
          నీతో లేని క్షణాలన్నీ ఖాళీ  పాత్రల్లా చేజారి పోతూ ఉంటాయని చెప్తుంది.
 
          నీవు మాట్లాడని క్షణాల్లో సముద్రం ముక్కలవుతుంది ఇంకొంచెం ప్రేమ పెరుగు తుంది.
 
          అవును కదా ఇలాంటి ఓ వాక్యం చదివాక కంటికి కునుకు ఎక్కడ పడుతుంది.
 
          ఎంత ప్రేమ ఈమెది… నది ప్రవహించిన మేర ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా సముద్రాన్ని చేరినట్లు… ఈ అంతులేని ప్రేమ సాగరాన్ని చేరడానికై చేసే నిరీక్షణల్లో… మన హృదయాంతరంగాలని  బద్దలు కొడుతుంది.
 
          ఒక్కో  వాక్యం ఎంతో నేర్పుగా, ఏర్చి  కూర్చి  కవితని నావని చేసి అందులో మనల్ని కూర్చోబెట్టి ప్రేమనదిలో ఈదమని వదిలేస్తుంది.
 
          తీరం లేని ఈ ప్రేమ ఒక్కోసారి అలల లా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అంతలోనే  ఆకాశానికి ఊయల కట్టి కాఫీ నీళ్ళు చేతికిచ్చి తాగమంటుంది. కాదు కాదు అంటూనే రెక్కలు జాచి సీతాకోకచిలుకల రంగు చల్లకుంటుంది.
 
          నిరీక్షణకి మందు ప్రేమే అంటున్నప్పుడు ఆమె గొంతు ఎందుకు అసహనాన్ని వ్యక్తం చేస్తోంది 
 
          ఎప్పటికైనా నువ్వు వస్తావు అన్న ఆశ నుంచి వస్తావో లేదో.. అన్న సంశయంలోకి జారిపోయింది ఈ ప్రేమ పడవ…
 
          ఈ అంతులేని నిరీక్షణ కానరాని సొరంగమై కాలాన్ని కబళిస్తుంది.. అంటూ ఎటూ కదలలేనని, ప్రేమ రెక్కలు కత్తిరించిందని, ఎగరలేని పక్షి నయ్యానని నిరాశని తలకెత్తు కుంటుంది.
 
          నీవు చెప్పిన సమయం నా గడియారం సూచించడం లేదు 
          నువ్వు అనుకుంటున్నా గంట నీ గడియారంలో ఎప్పటికీ రాదు.. అన్నప్పుడు ఆ ప్రేమ ఎంత కృంగిపోతుంది పెంగ్విన్ రెక్క లాంటి కలలు కలత నిద్రలో అల్లార్చు తూంటాయి. అని ఓదార్పు వాక్యం అవుతుంది. 
 
          అయితే గీత వెల్లంకి కి ఇది రెండో పుస్తకం మొదటి పుస్తకం డార్క్ ఫాంటసీ నిజంగానే మనల్ని ఒక డార్క్ ఫాంటసీలోకి తీసుకొని వెళ్ళిపోతుంది… ఆ ఫాంటసీలో నుండి బయటపడడానికి ప్రేమ గురించి తెలిసిన వారు ఎవ్వరు ఇష్టపడరు.. అయితే ఈ నాలుగేళ్ళలో గీత ప్రేమ నిరీక్షణలో వికేంద్రించే తరంగాలు  వచ్చి చేరాయి, 
 
          లోనర్ వో – లూజర్ వో 
          నీకెవరు చెప్పరు 
          భాష కందని దుఃఖం నీది 
          లిపిలేని భాష్యం నీ భావాలది.. అంటూ ఓ వియోగ వేళని  ఓ ఒంటరి నావగా సుదూర ప్రాంతాలకి గమ్యం లేని పయనాన్ని సాగిస్తోంది.. ఈ ప్రేమ  పడవ…
 
          ప్రేమ వ్యక్తిగతమా, ప్రాపంచికమా అంటే స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి అంటుంది గీత… నిరీక్షణ ఎన్ని పగుళ్ళను, గాయాల్ని చేసినా ఒక్క క్షణం ప్రేమ ఊరడింపు  కోసమే తపించే హృదయాన్ని కోరుకుని నిరీక్షణకి పెద్ద పీట వేస్తోంది.. డార్క్ ఫాంటసీలో నిరీక్షణ కి ఈ 50% లవ్ లో నిరీక్షణకి చాలా మార్పువుంది 
 
          తన మొదటి పుస్తకంలోని ప్రేమ ఎవరినీ నిందించదు, కానీ ఈ పుస్తకంలో  ప్రేమే ప్రేమగా తనని తాను నిందించుకున్నట్టుగా అనిపించింది.
 
          మంచి క్రిస్పీ వర్డ్స్ తో, లేటెస్ట్ అప్డేట్ వర్షన్ లో గీత కవిత్వం మనల్ని అందరినీ ముగ్ధ మాయలో పడ వేస్తుంది… తాత్వికత అద్దుకున్న పద సంపద మనల్ని కట్టిపడే స్తుంది.
 
          ఓ కవిత్వానికి ఇంతకంటే ఏం కావాలి…
 
          వండర్ఫుల్ ఎసెన్స్ ఉన్న ప్రేమ ఈ 50% లవ్… అభినందనలు గీత.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.