ఎలా తెలుపను

(నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

-వై. జ్యోతిర్మయి

          “ఎప్పటి నుంచి ఇలా అవుతోంది అత్తయ్యా?” అడిగింది మేఘన.

          “వారం రోజులుగా. అసలు ఎలాంటి ఇబ్బందీ కలగడం లేదు. కానీ…”నసుగుతూ ఆగింది శారదమ్మ.

          “కానీ!?”

          “ఈ వయసులో ఇలా అవుతుందా? నా వయసువారు ఇలాంటి విషయాల గురించి చెప్పగా వినలేదు కనలేదు”అందామె దిగులుగా.

          “నేను కూడా అత్తయ్యా… అసలు వినలేదు. ఋతుస్రావం ఆగిపోయి 20 ఏళ్ళ పైనే అయ్యిందన్నారు. మరిప్పుడు ఇలా ఇన్నాళ్ళకి డిస్చార్జ్ అవ్వడమేంటి?” ఆలోచిస్తూ అంది మేఘన.

          “అదే తెలీడంలేదు అమ్మాయ్. ఎవరిని అడగాలో తెలీడంలేదు. సుప్రీత్‌కు చెబుదాం అంటే సిగ్గుగా ఉంది. నువ్వే ఎలాగైనా వాడితో చెప్పి… ఆసుపత్రికి తీసుకెళ్ళు”

          “ఆయనకా!?” వెంటనే అందామె.

          “ఆ!”

          “ఛీ! మగవాళ్ళతో ఇలాంటి విషయాల గురించి ఎలా చెప్పాలత్తయ్యా? మీకే కాదు నాకూ సిగ్గుగానే ఉంది”అందామె ఇబ్బందిగా నవ్వుతూ.

          “నిజమే! నేను కూడా మీ మామగారికి చెప్పలేకపోయాను”అందామె సిగ్గుపడుతూ.

          కాసేపు ఆలోచించిన తర్వాత “ఒకపని చేద్దాం”అంది మేఘన.

          ఏంటన్నట్టుగా చూసింది శారదమ్మ.

          “రేపు టౌనులో సంత జరుగుతుంది కదా. ఆయనేదో పనుందని చెప్పారు. పనిలో పనిగా మనల్ని కూడా తీసుకెళ్ళమని చెబుదాం. ఆయన పని ముగించుకుని వచ్చేసరికి… మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళి వద్దాం”

          “ఊ! కానీ… ఎప్పుడూ లేనిది మీరెందుకు రావడమని వాడడిగితే?”

          “అవును మీ అబ్బాయి అలానే అడుగుతాడు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది”

          “ఏంటది?” ఆశగా అడిగిందామె.

          ఇంతలో “మేఘా! తలనొప్పిగా ఉంది. కాస్త స్ట్రాంగ్ కాఫీ పెట్టు” అంటూ సుప్రీత్ రావడంతో వారి మాటలకు తాళాలు పడ్డాయి.

          సరేనంటూ వంటింటిపైవు వెళ్ళిందామె.

          “అలసిపోయినట్టు ఉన్నావు?” అడిగింది శారదమ్మ కొడుకునే గమనిస్తూ.

          “ఊ! అనుకున్న టైమ్‌కి లోన్ రావడంలేదు. ఈ సర్కార్ పనుల గురించి తెలిసిందే కదమ్మా” అన్నాడతను పక్కనే కుర్చీలో కూర్చుంటూ.

          ఈ మధ్యనే పట్టుపురుగుల బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన రావడంతో, దానికి సంబంధించిన బిల్డింగ్ కట్టడం కోసం లోన్‌కి అప్లై చేసాడు సుప్రీత్.

          ఆ వ్యవహారాల కోసమే పది రోజులకోసారి, పట్నం నుంచి పల్లెటూరుకు రావాల్సిన అవసరం పడుతోంది అతడికి. అలా వచ్చినప్పుడే కోడలికి తన సమస్యను తెలియ జేసింది శారద. ఇంట్లో భర్త ఉన్నా అతడితో చెప్పలేకపోయిందామె.

          “రేపు సంతకి వెళుతున్నారుగా. మీతో పాటు… నేనూ, అత్తయ్య ఇద్దరం రావాలను కుంటున్నాం” కాఫీ గ్లాసును అందిస్తూ నెమ్మదిగా చెప్పింది మేఘన.

          “ఎందుకు?” అర్థంకాక అడిగాడతను.

          “పనుంది”

          “ఏం పని!?”

          క్షణకాలం మౌనం తర్వాత “అత్తయ్య చాలాకాలంగా కాళ్ళ నెప్పని చెబుతున్నారు కదా. పనుల వత్తిడిలో పడి వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడైనా ఆవిడను మంచి డాక్టర్‌కు చూపిద్దాం అని” చెప్పిందామె.

          “నిజమే! ఎన్నో వత్తిడులు. అసలు వాటి వల్లే… నిద్రలేకుండా పోయింది నాకు” అన్నాడతను కాఫీ తాగుతూ.

          “అయ్యో! నిద్ర పట్టడంలేదా నీకూ” వెంటనే అడిగింది శారదమ్మ ఆదుర్దాగా.

          “ఎక్కడమ్మా! నేనున్న ఫీల్డ్‌ గురించి తెలిసిందే కదా. విపరీతమైన కాంపిటీషన్. క్రిందటి ఏడాది మా షాప్ ముందే పోటీగా మరో షాప్ పెట్టారు. అప్పటి నుంచి సరిగ్గా వ్యాపారం జరగడంలేదు” అన్నాడతను విచారంగా.

          “అయ్యో! మరి చెప్పలేదేంట్రా నాకు” అందామె కంగారుగా.

          “ఇదో… ఇలా కంగారుపడతావనే చెప్పలేదు”

          “ఎంత కష్టమొచ్చింద్రా నీకు”

          “అందుకే మొన్న తిరుపతెళ్ళి వచ్చాం”

          “అమ్మయ్యా! ఇక అంతా ఆ వెంకన్న చూసుకుంటాడులే. భారమంతా ఆయనకు వదిలేయి” ఓదార్పుగా అతడి భుజం తడుతూ అందామె.

          ఖాళీ గ్లాసును అతడి చేతుల్లోంచి అందుకుంటూ ” మరో విషయం. ఎవరైనా లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకెళితే మంచిది” నెమ్మదిగా చెప్పింది మేఘన.

          “ఏం! లేడీ డాక్టరైతేనే నయమౌతుందా?” విసుగ్గా చూస్తూ అన్నాడతను.

          “అలా అని కాదూ…” ఏం చెప్పాలో తెలియక నీళ్ళు నములుతూ చూసిందామె.

          “ఈ మధ్య నీకు చాదస్తాలెక్కువయ్యాయ్!” అని మరోమాటకు తావివ్వకుండా బయటకు వెళ్ళిపోయాడతను.

***

          మరుసటిరోజు ఒక RMP క్లినిక్ దగ్గర ఇద్దరినీ దింపి, ఏదో ముఖ్యమైన పనుందంటూ వెళ్ళిపోయాడు సుప్రీత్.

          ఓ రెండు గదుల ఆసుపత్రది. పేషెంట్లతో రద్దీగా ఉందక్కడంతా. దారి చేసు కుంటూ లోపలికెళ్ళారు మేఘన, శారదమ్మలు.

          ముందు గదిలో స్థలం లేకపోవడంతో, టోకెన్ తీసుకుని బయటకొచ్చి, చెట్టుకింద కూర్చున్నారిద్దరు.

          “అమ్మాయ్! నువ్వు కూడా నాతో పాటు లోపలికి రా” నెమ్మదిగా అందామె.

          “నేనా!?”

          “అవును నువ్వే! ఎలా చెప్పాలి ఈ సమస్య గురించి? నాకు సిగ్గుగానూ, బెరుగ్గానూ ఉంది”

          ఆమె మొహం చూసి “సరేనత్తయ్యా! వస్తాలేండి… మీరు కంగారు పడకండి” భరోసాగా అంది మేఘన.

          అప్పటికి కానీ ఆమె ప్రాణం కుదుటపడలేదు. నిశ్చింతగా ఊపిరి తీసుకుంటూ చూసింది.

          కాసేపటికి తమ టోకెన్ నెంబర్ పిలవడంతో, ఇద్దరూ లేచి లోపలికెళ్ళారు.

          “తొందరగా వచ్చి కూర్చోండమ్మా. ఎంతసేపు వెయిట్ చేయాలీ?” విసుగ్గా చూస్తూ అన్నాడు డాక్టర్.

          అతడి మాటలకు తలెత్తి చూసింది మేఘన. డాక్టర్ అనగానే చాలా పెద్ద వయస్థుడు అనుకుందామె. తీరా చూస్తే ఈ మధ్యే చదువు ముగించుకుని వచ్చిన వ్యక్తిలా ఉన్నాడ తను.

          “ఏంటి సమస్య?”అడిగాడతను.

          “మా అత్తగారికి కాళ్ళు నెప్పట” చెప్పింది మేఘన.

          “మీ వయసెంత?” అడిగాడతను శారదమ్మనే చూస్తూ.

          “దగ్గరదగ్గర 70 ఉండచ్చు” చెప్పింది మేఘన.

          “తెలుస్తోంది. వయసవుతోంది కదా… అందుకే బాడీ పెయిన్స్ వచ్చాయి” కాగితం పై మందుల పేర్లు రాస్తూ అన్నాడతను.

          చాలా ఇబ్బందిగా చూస్తూ “ఇంకో సమస్య కూడా ఉందీ” చెప్పాలా వద్దా అన్నట్టుగా చెప్పిందామె.

          “తొందరగా చెప్పండి. అవతల పేషెంట్స్ వెయిటింగ్…” విసుగ్గా అన్నాడతను.

          “ఆడవారికి సంబంధించిన సమస్య”అందామె మరికాస్త ఇబ్బంది పడుతూ.

          “…..”

          “అదే! డిశ్చార్జ్ లాగా…” ఇంకా ఏదో చెప్పబోతున్న మేఘన మాటలకు అడ్డొస్తూ..

          “ఏమ్మా! అలాంటివి ఇక్కడ చూడరు. లేవండి లేవండి… ఎవరైనా లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళండీ…” కసిరినట్టుగా అన్నాడతను కూడా ఇబ్బందిపడిపోతూ.

          వెంటనే లేచి నిలబడింది శారదమ్మ. మేఘనా కూడా నిలబడుతూ అతడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ని అందుకుంది.

          ఆ మందులు రాసిచ్చినందుకు డబ్బులు చెల్లించి బయటకు వచ్చి, పక్కనే ఉన్న మెడికల్ షాప్లో మందులు తీసుకున్నారిద్దరు.

          “అన్నా ఈ చుట్టుపక్కల లేడీ డాక్టర్లు ఉన్నారా?” మందులకు డబ్బులు చెల్లిస్తూ, అడిగింది మేఘన షాప్ అతడిని.

          “ఆ! ఉన్నారు” అంటూ అడ్రస్ చెప్పాడతను.

          ఆ చోటు దగ్గర్లోనే ఉండటంతో వెళ్ళాలనుకున్నారు వాళ్ళు. ఇంతలో పికప్ చేసుకోవటానికి సుప్రీత్ రావడంతో, వారి ఆలోచనను విరమించుకుని, అతడి వెంట ఇంటికి బయలుదేరారు ఇద్దరు.

***

          “కంగారేమీ వద్దత్తయ్యా. ఎండాకాలం కదా… వయసవుతోంది. బహుశా వేడిచేసుం టుంది. ఇబ్బంది ఏమీ లేదన్నారు కదా… అదే తగ్గిపోతుంది లేండి” పట్నం వెళ్ళే ముందు చెప్పింది మేఘన.

          “అంతే అంటావా?” అడిగింది శారదమ్మ.

          “తేనెరంగులో చాలా స్వల్పంగా డిశ్చార్జ్ లాగా అవుతుందన్నారు. కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు అన్నారు…”

          “…అసలు అయినట్టే తెలీదు. ఎప్పుడో నిద్రలో అయ్యిందలా”

          “అదే అదే… వేడిచేసుంటుంది అందుకే అలా అయ్యింది” చెప్పిందామె.

          మనసులో ఆందోళనున్నా పైకి మాత్రం నిశ్చింతను ప్రదర్శించటానికి ప్రయత్నించసాగింది శారదమ్మ. వీడుకోలు చెప్పి పట్నంవెళ్ళిపోయారు సుప్రీత్, మేఘనలు.

          వారటు వెళ్ళగానే… ఎలాగైనా ఆ మెడికల్ షాపతను చెప్పిన లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. ఈయనకు విషయం ఎలా చెప్పాలి. చెప్తే అర్థం చేసుకుంటాడా? ఏంటో ఈ మనిషి. అని ఆలోచనల్లో కూరుకుపోయిందామె. ఎంతసేపలా ఉందో తెలీదు.

          “టీ ఏమైనా పెట్టేదుందా లేదా?” అన్న భర్తపిలుపుతో ఆలోచనల్లో నుండి తేరుకుంటూ చూసిందతడిని.

          భుజం పై ఉన్న తువ్వాలుని ఒక కుర్చీ మీద వేసి, మరో కుర్చీలో కూర్చుంటున్నా డతను.

          “ఈ వయసులో టీలూ, కాఫీలు తాగొద్దని అబ్బాయి చెప్పలేదా? వాడుంటే మాట పెగలదు గానీ…” అర్థోక్తిగా ఆగిందామె.

          “ఆ చెప్తాడు వాడు… ఎన్నైనా చెప్తాడు. వయసైన తల్లిదండ్రులను దూరంగా ఇలా పల్లెటూరులో వదిలేసి…” చిన్నగా గొణిగాడతను.

          “ఏమన్నారూ?”

          “ఆ! టీ పెడితే… తాగి అలా పొలం దాకా వెళ్ళొస్తా అంటున్నా” అన్నాడతను విసుగ్గా.

          అతడితో వాదించడం నచ్చక, వెళ్ళి టీ చేసుకొచ్చి ఇచ్చిందామె.

          గ్లాసు అందుకుంటూ “అదేం! నీ గ్లాసు తెచ్చుకోలేదే? నువ్వు తాగవా?”అడిగాడతను.

          కాస్త దూరంలో కూర్చుంటూ “ఊహూ! ఈ మధ్య టీ, కాఫీలు తాగిన వెంటనే కడుపులో మండుతోంది” అందామె.

          “డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు కదా నీ కొడుకు. చూపించుకున్నావా?” టీ తాగుతూ అడిగాడతను.

          “లేదు”

          “అదేం!?”

          “ఆ డాక్టరు కేవలం… ఒళ్ళు నెప్పులకే వైద్యం చేస్తాడట”

          “ఓహో!”

          “ఆడవారి కోసం మరో డాక్టరమ్మ ఉందట. అక్కడికి తీసుకెళతారా?” నెమ్మదిగా అడిగిందామె.

          “చూద్దాంలే… ఇప్పుడేమంత మునిగిపోయిందని. కాఫీ, టీలు మానేయమని నీ కొడుకెలాగూ చెప్పాడుగా. మానేయ్… అదే నయమైపోతుంది “ఖాళీ గ్లాసును పక్కన పెడుతూ చెప్పాడతను.

          “…..”

          “పొలానికి వెళ్ళొస్తా. నీ కొడుకు నాకో పనప్పగించి వెళ్ళాడుగా” అని స్కూటర్ మీద వెళ్ళిపోయాడతను.

***

          దాదాపు నెలరోజులు భర్తను పోరగా పోరగా, ఇక భరించలేక శారదమ్మను లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చాడతను.

          తన సమస్యను మొత్తం ఓపిగ్గా విన్నాక “ఐసీ! మీరు పట్నం వెళ్ళి… కొన్ని చెకప్స్ చేయించుకోవాలి” నెమ్మదిగా అంది డాక్టరమ్మ.

          భయంగా చూసిందామె.

          “ఇందులో భయపడాల్సిన పనిలేదు. కానీ ఇలాంటి విషయాల్లో జాప్యం చాలా ప్రమాదకరం”

          “నాకెలాంటి ఇబ్బందులు లేవుకదా… మరెందుకు చెకప్స్? మీరే ఏదైనా మందివ్వండి” అందామె అమాయకంగా చూస్తూ

          “అలా ఇవ్వకూడదమ్మా! ఆగండి మీకర్థమయ్యేలా చెప్తా”

          ఆత్రంగా చూసింది శా‌రదమ్మ.

          “ఈ వయసులో… మీరు చెప్పిన రంగులో డిశ్చార్జ్ అవుతోందంటే… దాన్ని అశ్రద్ధ చేయకూడదు. చాలా సీరియస్గా తీసుకోవాలి. అసలు ఆలస్యం చేయకూడదు. ఎందు కంటే… అది… అది కేన్సర్‌కి సంబంధించిన సమస్య అయ్యుండచ్చు” వివరంగా చెప్పిందామె.

          ఆమె నోటివెంట కేన్సరన్న పదం వినబడగానే దిగ్భ్రాంతిగా చూసింది శారదమ్మ.

          “అదో మీరు భయపడాల్సిన పనిలేదని చెప్పానుకదా. ఈ కాలంలో అన్నిటినీ సులభంగా నయం చేసేయచ్చు. సో…ఆందోళన చెందకండి” అంటూ ఇంకా ఏవేవో చెప్తూ ఆమెలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయసాగింది డాక్టరమ్మ. కానీ ఆ మాటలేవీ శారదమ్మ చెవులకు చేరలేదు. ఆమె ఆలోచనలన్నీ కేన్సర్ అన్న పదం దగ్గరే ఆగి పోయాయి.

          బయటికొచ్చాక భర్తతో ఏమీ చెప్పలేదామె. అతడితో పాటు ఎలా ఇంటికొచ్చిందో కూడా తెలియలేదామెకు.

          భర్త ఎంత పలుకరించినా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక మరబొమ్మలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.

          ఆమె ప్రవర్తనకు కంగారు పుట్టిందతడిలో. వెంటనే కొడుకుకు ఫోన్ చేసి, ఆమె ప్రవర్తన గురించి చెప్పాడు.

***

          హుటాహుటిన భార్యతో సహా ఇంటికొచ్చేసాడు సుప్రీత్. అతడిని చూడగానే ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చింది శారదమ్మకు. అతడి చేతిని పట్టుకుని, పసిపాపలా గట్టిగా ఏడ్చేసింది.

          ఎంతసేపలా ఏడ్చిందో తెలీదు. ఎక్కిళ్ళ మధ్యలో డాక్టరమ్మ చెప్పిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది.

          ఆమె చెప్పింది మొత్తం విన్నాక, అందరి గుండెలు జారిపోయాయి. తేరుకోవటానికి చాలా సమయం పట్టింది వారికి.

          చాలాసేపటి మౌనం తర్వాత, తల్లినే చూస్తూ “ఒక్కసారి! సమస్య ఇదీ అని… నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే ముందే జాగ్రత్తలు తీసుకుని ఉండేవాళ్ళం కదా” నిలదీసినట్టుగా అడిగాడు సుప్రీత్.

          ఆ మాటలకు మేఘనాని చూసిందామె.

          వెంటనే తలతిప్పి మేఘనాని చూస్తూ “నీకు ముందే తెలుసా!?” అడిగాడతను.

తలదించుకుందామె.

          “మరి నాకెందుకు చెప్పలేదు?” కోపంగా, అరిచినట్టుగా అడిగాడతను.

          “ఎలా చెప్పాలో తెలియలేదు” చాలా నెమ్మదిగా బదులిచ్చిందామె.

          “అందులో తెలియకపోవటానికి ఏముంది!?”

          “అక్కడికీ ఆ రోజు… లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని చెప్పాను కదా. ఆడవాళ్ళు ఇంతకంటే ఇంకెలా చెప్తారు?” ఈ విషయంలో తన తప్పేమీ లేదన్నట్టుగా చెప్పిందామె.

          “చెప్పాలి… మగవారికి ఎన్నో ఆలోచనలుంటాయి. వాటి మధ్యలో అనుక్షణం సతమతమౌతూ ఉంటాం. అలాంటప్పుడు మీ మాటలెలా అర్థమౌతాయి? అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మీదే”

          “అదెలా మాదౌతుంది!? భార్య ఇలాంటి విషయాల గురించి నిర్మొహమాటంగా చెప్ప లేకపోతోంది అంటే… దానికి కారణం మీరు” సూటిగా అందామె.

          “ఏమన్నావ్!?”

          “అవును మీరే. అన్ని విషయాలను పంచుకునేంత స్వేచ్ఛను మీరిచ్చారా?” నిలదీసిందామె.

          “ఏం మాట్లాడుతూ ఉన్నావో నీకైనా అర్థమౌతోందా!?”

          “ఆ! చాలా బాగా. నా మాటలు భేషుగ్గా మీకు అర్థమయ్యాయని కూడా తెలుసు. తెలిసీ బుకాయిస్తున్నారనీ తెలుసు”

          కళ్ళని పెద్దవి చేసి చూస్తూ “నేను బుకాయిస్తున్నానా!?” అన్నాడతను.

          “మరి కాదా? ఏనాడైనా మన మధ్య… ఆడవారికి సంబంధించిన సమస్యల గురించి మాటలు జరిగాయా? చెప్పండీ జరిగాయా?”

          “…..”

          “ఎన్నోసార్లు మీతో అన్ని విషయాలను పంచుకోవాలని చూసాను. కానీ… ఎలా చెప్పాలో తెలీదు. చెప్పేంత సఖ్యతను మీరు కలిగించలేదు”

          “కానీ…”

          “…దయచేసి ఇప్పుడైనా నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఒకరోజు శానిటరీ ప్యాడ్ తీసుకురమ్మంటేనే… ‘అలాంటివన్నీ నాకు చెప్పకు. నువ్వే వెళ్ళి తెచ్చుకో’ అని కసురుకున్నారు” గుర్తు చేస్తున్నట్టుగా అందామె.

          తల్లిదండ్రుల ముందు ఆమె అలా అనేసరికి, చాలా ఇబ్బందికి గురయ్యాడతను.

          “ఇది ఆడవారికి సహజం. ఈ విషయం గురించి నోరువిప్పగానే… ఎంత అసౌకర్యానికి గురౌతున్నారో చూసారా! దీనివల్లే… చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయాను”

          “…..”

          “కట్టుకున్న భార్యే మీతో చెప్పటానికి ఇంత ఇబ్బంది పడుతోందే… ఇక మీ అమ్మ గారు ఎలా చెప్పగలరు. ఆవిడ నాకు చెప్పడానికే ఎంతో బిడియపడ్డారు. అలాంటిది చిన్నప్పటి నుండి మీరేంటో, మీ మనస్తత్వం ఏంటో బాగా తెలుసావిడకు. అలాంటప్పు డు ఎలా చెబుతుంది?” అతడినే చూస్తూ ప్రశ్నించిందామె.

          ఆ మాటలకు ఏం చెప్పాలో పాలుపోలేదు సుప్రీత్‌కు. తలతిప్పి తల్లిని చూసాడు. గోడకు తలను ఆనించి, నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ ఉందామె.

          “ఓ పక్క అత్తయ్యకి కేన్సర్. మీరేమో! సమయానికి అనుగుణంగా నడుచుకోకుండా, తప్పంతా మా మీదకు తోసేసి, అపరాధ భావం నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు” నిక్కచ్చిగా అందామె.

          “చాలు! ఇంక భరించలేను” పళ్ళబిగువున బాధను అదిమిపెట్టినట్టుగా వినిపించింది అతడి కంఠం. ఎప్పుడూ లేనిది అపరాధభావం అణువణువునా నిండి పోతోంటే, తల్లికి దగ్గరగా జరిగి, ఆమె ఒడిలో తలదాచుకున్నాడు సుప్రీత్.

          అతడి ప్రవర్తనకు మేఘన ఆశ్చర్యపోయింది. తలతిప్పి మామగారిని చూసింది. అతి కష్టం మీద దుఃఖాన్ని నియంత్రించుకుంటున్నట్టుగా ఉందతడి మొహం.

          “కేన్సర్ అన్న పదం వినగానే భయంవేసిందమ్మా! ఆ భయం వల్ల ఏదేదో వాగేస్తు న్నాను. మేఘనా చెప్పినవన్నీ నిజాలే. అన్ని విషయాలను పంచుకునేంత స్వేచ్ఛను ఇచ్చుంటే… ఇవాళ నువ్వింత బాధ పడుండేదానివి కాదు కదా. ముందే పట్నం తీసుకెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఇప్పించి ఉండేవాణ్ణి” గద్గద స్వరంతో అన్నాడు సుప్రీత్.

          అతడి తలను చిన్నగా తడుముతూ “ఇందులో నీ తప్పు ఎంతుందో… నాది కూడా అంతే ఉంది” అంది శారదమ్మ.

          “నీ తప్పేమీ లేదమ్మా” వెంటనే అన్నాడు సుప్రీత్.

          “ఊహూ! ఉంది. ఆ రోజు నేనే సిగ్గూ, బిడియాలను వదిలేసి చెప్పేసుండాల్సింది. సమస్య తీవ్రత పెరిగాక కానీ తెలిసిరాలేదు నాకీ విషయం” అందామె.

          “…..”

          “నేనే కాదు… ఎందరో ఆడవాళ్ళ పరిస్థితి ఇదే. ఇలాంటి సమస్యల గురించి సరిగ్గా అవగాహన ఉండదు. ఎవరికి చెప్పాలో అర్థంకాక, ఏం చేయాలో తెలీక మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు” చెప్పిందామె.

          తలెత్తి తల్లిని చూసాడతను. ఎప్పటిలానే ప్రేమగా చూసిందామె. “ఇవాళే మనం పట్నం వెళదాం. నీకేమీ కాదు” అన్నాడతను ధైర్యం చెబుతున్నట్టుగా.

          చివర్లో శారదమ్మ చెప్పిన వాక్యాల గురించే ఆలోచిస్తూ, గదిలోకి వెళ్ళి లగేజ్ సర్దసాగింది మేఘన.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.