కనక నారాయణీయం -59

పుట్టపర్తి నాగపద్మిని

          సభాప్రాంగణం చేరుకున్న పుట్టపర్తికి తాంబూల భరిత అరుణారుణిమలు స్వాగతం పలికాయి. యాజులు గారు హడావిడిగా తిరుగుతున్నారు. ఇంతకూ, నీలం సంజీవ రెడ్డి గారు ఏదో రాజకీయ కార్యాల వల్ల రావటం లేదని తెలిసింది. అధ్యక్షులు ఎవరుంటారా అన్న చర్చ జరుగుతున్నది. చపల కాంత భట్టాచార్య గారే సభా సారధ్యానికి  ఒప్పుకున్నా రని తెలిసింది. కాసేపటికే సభ ప్రారంభమైంది.

          క్రిక్కిరిసిన సభా మండపంలో శ్రీమతి మీనాక్షి కుమారి సత్యవతి మధురంగాప్రార్థనా గీతం ఆలపించారు. కార్యదర్శి శ్రీ ముక్కామల వెంకటేశ్వర రావు గారు చక్కటి తెలుగులో స్వాగత వచనాలు పలికారు. గత సంవత్సరం మొత్తం తమ సంస్థ కార్య కలాపాలను ఎంతో పారదర్శక పద్ధతిలో వినయంగా సమర్పించి, శ్రీ ఉపేంద్ర చంద్ర చౌదరి గారిని వేదిక పైకి ఆహ్వానించి సందేశాలను చదివే బాధ్యతను అప్పగించారు. పెద్ద చిట్టానే పట్టుకుని వచ్చిన చౌదరిగారు సర్వశ్రీ డా.సర్వేపల్లి రాధా కృష్ణన్, వి.వి.గిరి, దామోదరం సంజీవయ్య, పి.వి. రాజమన్నార్ వంటి ప్రముఖుల నుంచీ వచ్చిన సందేశాలతో పాటూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ వచ్చిన శుభాకాంక్షలను చదివి వినిపిస్తూ ఉంటే, పుట్టపర్తికి సంస్థ పట్ల గౌరవం రెట్టింపైంది.

          పరిషత్తు అధ్యక్షులు యాజులుగారు సభాధ్యక్షులను, సన్మానితులను ఎంతో ఆత్మీయంగా పరిచయం చేశారు. ఇప్పుడిక సన్మాన కార్యక్రమం. కన్నుల పండువగా, కాళిదాస్ రాయ్ గారినీ, పుట్టపర్తి వారినీ పుష్ప మాలాలంకృతులను చేశారు. హారతు లెత్తారు. చందన తాంబూలాలతో సత్కరించారు. శ్రీ భట్టాచార్య గారు, తాను స్వయంగా తెచ్చిన కాశ్మీరు శాలువాలతో కాళిదాస్ రాయ్ గారినీ పుట్టపర్తినీ సన్మానించి హృదయా లింగనం చేసుకున్నారు.

          కాళిదాస్ రాయ్ గారు, బెంగాలీ భాషా సోయగాలతో మొదలెట్టి ఆంగ్లంలో కొనసాగు తూ, పరిషత్తువారికి తన కృతజ్ఞతలను తెలిపారు. 

          ఇప్పుడు పుట్టపర్తి వంతు. మైకు ముందు నిల్చుని గొంతు సవరించుకున్నారు పుట్టపర్తి.

‘నమోష్కార్. శుభేచ్చా.’

          ఈ మాటలతో సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగి పోయింది.
పుట్టపర్తి ముఖంలో చిరునవ్వు. ఆ ధ్వనులు ఆగిన తరువాత మొదలుపెట్టారు. ముందుగా ఆంగ్లంలో తాను కూడ నిర్వాహకులకూ, సభాధ్యక్షులవారికీ, సభికులకూ ధన్యవాదాలు చెప్పి సభాధ్యక్షుల అనుమతితో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘పరిషత్తు వారికి అనేక కృతజ్ఞతలతో ఒక విన్నపం. కలకత్తాలో తెలుగు వారి ఇంకా తెలుగు సాహిత్య వైభవాన్ని చూస్తుంటే, తెలుగువాడి వాడి అర్థమవుతున్నది. చాలా గర్వంగా ఉంది కూడా!! ఇంతకూ నన్నిప్పుడు తెలుగులోనే మాట్లాడమంటారా, లేదా ఆంగ్లంలోనా?’ మళ్ళీ  కరతాళ ధ్వనులు. నలు మూలల నుంచీ వినిపించింది, ‘తెలుగు తెలుగు తెలుగు!’ అని! సభాధ్య క్షులవారిని అనుమతినివ్వమని ఆంగ్లంలోనే ప్రార్థిం చి, వారు ఆమోదిస్తున్నట్టు తల పంకించగానే తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు పుట్టపర్తి. 

          ‘వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు, విశ్వనాథులవారు. అటువంటి అద్భుత వాక్య సముదాయం కావ్యం. కావ్యం రసాత్మకమైనట్టే ఉపన్యాసం కూడా రసాత్మకమే! సాహిత్యో పాసం ఇంకా ఎక్కువ రసాత్మకంగా ఉండవలె! అందుకే నేనెప్పుడూ నా కావ్యాన్నీ నా ప్రసంగాన్నీ కూడ రసవత్తరంగా ప్రకటించే ప్రయత్నం చేస్తాను. నా మాతృభాష తెలుగు. అనంతపురం చియ్యేడులో పుట్టినవాణ్ణి కాబట్టి ఒక రకంగా కన్నడం కూడా నాకు మాతృ భాష వంటిదే! ఈ విధంగా పుట్టుకతోనే యీ రెండు భాషా సరస్వతుల ఒడిలో మాతృస్త న్యాన్ని పొందే భాగ్యాన్ని పొందాను. ఇది నాకు కలిసి వచ్చిన అదృష్టం. పుట్టినప్పటి నుండీ యీ విధంగా రెండు భాషల లోగిళ్ళలో పెరగటం వల్లేనేమో, నాకు యీ రెండూ రెండు కళ్ళలాగే అనిపించినాయి. ఇప్పటికీ అదే నా స్థితి! ఈ విధంగా ఇతర భాషల పట్ల ఆరాధన, అధ్యయనం చేయాలన్న ఆసక్తీ కూడా పెరిగిపోతూ వచ్చాయి.ఇంటి విద్య కావటం వల్ల మా తండ్రిగారి ద్వారా సంస్కృత ప్రవేశం సునాయాసంగా జరిగిపోయింది. నా ఆసక్తిని బట్టి ఇతర భాషలు నేర్చుకునే అవకాశాలు కూడ అదే విధంగా నన్ను వెదు క్కుంటూ రావటం జరిగింది. నాకు అందివచ్చిన అన్ని అవకాశాలనూ వినియోగించు కుంటూ ప్రయాణం సాగించాను. క్రమ క్రమంగా తమిళము, సంస్క్ర్త భాషా ప్రభావం వల్ల ప్రాకృత భాషలైన పాళీ, మాగధీ, అర్ధ మాగధీ, పైశాచీ వంటి భాషలతో బహు చక్కటి దోస్తీ ఏర్పడిపోయింది. కేరళలో ఉద్యోగ జీవితం వల్లా, మళయాళం సంస్కృత శబ్ద భరితం కావటం వల్లా ఆ భాష కూడ నన్ను వరించింది. స్వతహాగా భక్తి సంప్రదాయానికి చెందిన పిచ్చివాణ్ణి కాబట్టి మహారాష్ట్రీ అభంగ్ లు నన్ను తమవాణ్ణి చేసుకున్నాయి. ఎందుకో తులసీ నా మనసును ఆక్రమించటం జరిగింది. ఆ తరువాత ఢిల్లీ వాసంలో ఆ భాషాను రక్తి వల్ల వ్రజ భాష కూడ ఒంటబట్టింది. అరబిందో ఆరాధకుణ్ణి కావటం వల్ల వారి దివ్య దర్శనం కోసం పాండిచ్చేరికి పలుమారు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చే జర్మన్ భక్తులతో పిచ్చాపాటీ వల్ల జర్మన్ భాష రుచి తెలిసింది. ఇంకా సంస్కృత భాషతో ప్రగాఢా నుబంధం వల్ల ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి అంటే భారోపీయ భాషా కుటుంబానికి చెందిన గ్రీక్ లాటిన్ భాషలను స్పృశించే అదృష్టం పట్టింది. కమ్మ్యూనిస్ట్ భావజాల ప్రభావంతో రష్యన్ లో కొంచెం కొంచెం గెలికిన జ్ఞాపకం. ఈ విధంగా నా జీవితంలో ఒక్క క్షణాన్ని కూడ వృధాగా గడిపిన జ్ఞాపకం లేదు, ఏదో తపన, ఏదో అన్వేషణగానే ఇంతవరకూ గడిచింది. ఇప్పుడొక్కొక్కసారి నాకే అనుమానం వస్తుంది, నా భాష ఏది? అని!’

          సభికుల్లో నవ్వులు వెల్లివిరిశాయి. ఆ నవ్వుల్లోంచీ ఒక గొంతు వినిపించింది, ‘మీ శివతాండవం మాకు ప్రాణం కాబట్టి మీరు తెలుగు కవే!’ అని!

          మళ్ళీ నవ్వుల జడి వాన. పుట్టపర్తికీ యీ మాట నచ్చినట్టే అనిపించింది. ‘నిజమే! ఒక విద్వాంసుడుండేవాడట! ఏ భాషైనా అలవోకగా మాట్లాడేవాడట! అతని మాతృభాష ఏమిటో తెలుసుకోవటం కష్టమైపోయినప్పుడు, ఎవరికో తట్టిందట, ఎవరికైనా కష్టం కలిగినప్పుడు ముందుగా వాళ్ళ మాతృభాషలో వాళ్ళ అమ్మను తలచుకుంటారు కాబట్టి, అతనికి వాతలు పెట్టి చూడటమొక్కటే ఉపాయమనుకున్నారట! ఇప్పుడు నా పరిస్థితి… ‘ప్రశ్నార్థకంగా ఆగారు పుట్టపర్తి.

          మళ్ళీ నవ్వులు.

          ‘ఆ విధంగా నాకు వాతలు పెట్టవలసిన అవసరం రాకూడదనే ముందుగా శివ తాండవం రచించటం జరిగిపోయింది కాబట్టి నేను ఖచ్చితంగా తెలుగువాడినే, కలకత్తా ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆత్మీయంగా ఆహ్వానిస్తే మీ ముందుకు వచ్చినవాణ్ణే! స్వభాషాభిమానం మంచిదే ఎప్పుడూ! అంతమాత్రాన పరభాషను ద్వేషించరాదు. ఎవరి భాష వారికి కన్నతల్లి వంటిది. ఏ భాషనైనా సాహిత్యాన్నైనా చదవటానికి సహృదయులు కావాలంతే! నిస్పాక్షిక దృష్టితో సాహిత్యాన్ని చదివినప్పుడే ఆయా భాషల్లోని అందం అవగతమౌతుంది. ఉదాహరణకు కన్నడ భాషలో బసవేశ్వరునికి ఉన్న స్థానం అద్భుతం. ఇప్పుడు మనమంతా అంటున్న అంటరానితనాన్ని అంతమొందించాలని ఎప్పుడో 12 వ శతాబ్దంలోనే ఎలుగెత్తి పిలుపు నిచ్చిన క్రాంత దర్శి ఆయన! దేహమే దేవాలయ మన్నాడు. స్త్రీ పురుష భేదమేలనన్నాడు. సత్ప్రవర్తనే జీవితంలో ముఖ్యమన్నాడు. శ్రమను మించిన సౌందర్యం లేదన్నాడు. తాను బ్రాహ్మణుడైనా యజ్ఞోపవీతాన్ని త్యజించి, చిన్నయ్య, కక్కయ్య, కాణయ్య, దాసయ్య వంటి నిమ్న కులాల భక్తులందరినీ తన వారిని చేసుకుని, కేవల శివ భక్తినీ, నీతి, నియమ బద్ధ జీవితాన్ని తన సందేశంగా వినిపించిన బసవేశ్వరుణ్ణి గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇక తమిళంలో శ్రీమద్రామా నుజులు, బసవేశ్వరుని కన్నా ఎంతో ముందే భక్తి ఉద్యమాన్ని కులాలకు అతీతంగా నడిపిన తత్వవేత్త. తన గురువు అత్యంత రహస్యమూ, పరమపవిత్రమంటూ ఉపదేశిం చిన అష్టాక్షరీమంత్రాన్ని వారి ఆగ్రహానికి గురై కూడా భయపడక, గుడిగోపురమెక్కి అందరికీ వినిపించి వారికి కూడ ముక్తిమార్గ ద్వారాలను తెరచిన విశాల హృదయుడు. ఇక, అటు ఉత్తర భారతంలో అయోధ్య రామునిగా శ్రీరాములవారిని ఆరాధించిన తులసీ దాసూ, నిరాకార స్వరూపునిగా రాముణ్ణి కొలిచి ముక్తినందిన కబీరూ- వీళ్ళంతా నాకు తెలిసేవారేకాదు – నేనీ సాహిత్యాలను చదవకపోయి ఉంటే!! ఆ మాటకొస్తే రవీంద్రనాథ్ టాగోర్ రచనలు నాకెంతో ఇష్టం. అరెరే, అనువాదాల మాధ్యమంగా మాత్రమే చదవ గలుగుతున్నాను, బెంగాలీలోనే చదివితే ఇంకా బాగా అర్థమవుతాడు కదా యీ విశ్వకవి! అని బాధపడిన రోజులెన్నో! నేనింతకు ముందు చెప్పిన ప్రాకృత భాషా సాహిత్యంలో విమలసూరి, ప్రవరసేనుడు, పుష్పదంతుడూ ఇంకా ఎంతో మంది అద్భుత రచనలు చేసినారు. వీళ్ళందరి గురించీ చదువుతూ కూర్చుంటే ఒక జీవిత కాలం చాలదు మనకు! వీళ్ళను చదవటం వల్ల మన దృష్టి కూడా విశాలమౌతుంది. బావిలో కప్పలవలె జీవించ టం కంటే, విశాల ప్రపంచాన్ని చూస్తూ, సాహితీ నందనోద్యానంలో వివిధ వర్ణ పుష్ప మరందాన్ని గ్రోలుతూ బ్రదికే కీటకం బ్రతుకే ధన్యం కదా! ఏమంటారు?’

          కరతాళ ధ్వనులు. మళ్ళీ ఎక్కడి నుంచో, ‘అన్నీ నిజమే! కానీ మీ శివతాండవం కావాలి మాకిప్పుడు!’అని గట్టిగా వినిపించింది.

          కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగిపోయింది.

          ‘ఈ శివతాండవం గురించి రెండు ముక్కలు చెబుతాను. మా ప్రొద్దుటూరు అగస్త్యే శ్వర స్వామి దీని నాయకుడు. ఒకసారి మండల దీక్షలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో తటిల్లత వలె మనసులో మెరిసిన యీ భావ ధార, కేవలమా దీక్షా కాలంలోనే ఆవిష్కృతమైంది, సంగీత సాహిత్య, నాట్య కళా సంగమంగా!! అనతి కాలంలోనే తెలుగు నాట మారుమ్రోగిపోయింది. నేను ఎక్కడికి పోయినా నా ఉపన్యాసం తరువాత శివతాండవ గానం అనివార్యమైపోయింది. అతి చిన్న రచన ఇది. దీని కాయమును పెంచుదామని ప్రయత్నించినా రచనాకాలం నాటి ఆ భావావేశం మళ్ళీ నన్ను ఆవహించనేలేదు. శివాజ్ఞ ఇంతవరకే కాబోలు! అని సరిపెట్టుకోవటం నా వంతైంది.’

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.