గిడుగు రామమూర్తిగ్రాంథిక భాషావాదుల గుండెల్లో పిడుగు మన ‘గిడుగు’

( తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా )

-పి. యస్. ప్రకాశరావు

          పర్లాకిమిడి రాజభవనంలో ఓ వింత ఆచారం ఉండేది. భోగి, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా కనుమనాడు పశువుల పండుగ చేస్తూ పశువులకు వాతలు వేసేవారు. పనిలో పనిగా వాళ్ళదగ్గర పనిచేసే ఉద్యోగులకు కూడా వేసేసేవారు. రాజాగారి తమ్ముడికి ట్యూటర్ గా ఉన్న గిడుగురామమూర్తి గారికి కూడా చురకలు వేయడానికి పరికరాలూ నిప్పుల కుంపటీ పట్టుకుని సేవకులు వస్తే ఆయన కోపంతో “ఇతర సంస్థానాలలో పంచెలసాపులో, పట్టుశాలువలో పెడతారు. ఇక్కడ వాతలు వేస్తారా ? సెబాస్ ఈ మర్యాద! అని గిడుగు పిడుగులు కురిపించారు.

          గిడుగు వేంకట రామమూర్తి గారి పేరు వినగానే ఆయన వాడుకభాషావాది, శాసన పరిశోధకుడు అంటారే కానీ ఇలా చాందసభావాల పట్ల తిరగబడిన సంస్కర్త అని చెప్పరు.

          1893లో పర్లాకిమిడి రాజా వారి దగ్గరికి ఒక జ్యోతిష్యుడు వచ్చి అక్కడి వారి జాతక చక్రాలను బట్టి అంకెలు వేసుకుని వారు పుట్టిన తేదీలను చెప్పాడు. అవి  దైవశక్తి వల్ల చెప్పగలిగానన్నాడు. జ్యోతిష్యం పై నమ్మకం లేని గిడుగు వెంటనే ” లేచి దైవ శక్తివల్ల చెప్పగలిగితే పావుగంటసేపు అంకెలు వేసుకుని ఎందుకు చెప్పారు? ఖగోళశాస్త్రం, గణితం నేర్చుకున్న వాళ్ళెవరైనా ఈ తేదీల సంగతి చెప్పగలరు. “నాకు నమ్మకం లేనిది జాతకాల విషయంలోనే కానీ గణితంలో కాదు” అని అతని ఆట కట్టించారు. పరిష్కరించ లేనిదేదైనా కనిపిస్తే ‘ఆ పైవాడికి ‘ అంటగట్టే అలవాటుతో ముఖలింగేశ్వరాలయంలో ఉన్న శిలాశాసనాలు దేవతలు లిఖించినవని స్థానికులు ప్రచారం చేస్తుంటే, గిడుగు వాటిని చదివి అవి మానవులు చెక్కినవే అని తేల్చి చెప్పారు.

          తనవ్యక్తిత్వాన్ని కించపరిస్తే గిడుగు సహించేవారు కాదు. విజయనగరం కోటలో పిల్లలకు ట్యూటరుగా పనిచేసేటప్పుడు సంప్రదాయ పద్ధతిలో కాక కొత్తపద్ధతులతో ఆయన పాఠాలు చెప్పడం రాణీ గారికి నచ్చలేదు.” ఇలా అయితే నెలాఖరు నుంచి రానవసరం లేదు ” అని హుకుం జారీ చేశారామె.” నెలాఖరుదాకా ఎందుకు? రేపటి నుంచే మానేస్తున్నాను ” అన్నారీయన.

          ఆ రోజుల్లో సముద్రప్రయాణం నిషిద్ధం. ఆయన శిష్యుడు ( కన్నెపల్లి వెంకట నరసింహం ) సముద్రప్రయాణం చేసి ఇంగ్లండులో బారిస్టరు చదివి వచ్చిన సందర్బం గా గిడుగు తన ఇంట్లో విందు ఇచ్చారు. సమాజం ఆయన్ని వెలివేసి ‘ కాశీగంగ తీర్ధం పుచ్చుకుంటేనే వెలి రద్దు చేస్తామన్నారు. గిడుగు ససేమిరా అన్నారు. వాళ్ళు రాజీ కొచ్చారు. వీరేశలింగం గారి ప్రభావం గిడుగు మీద ఉంది. బంకుపల్లి మల్లయ్య శాస్త్రిగారు బాల వితంతువు అయిన తన కుమార్తెకు మళ్ళీ పెళ్ళి చేయాలనుకున్నారు. కానీ రెండోసారి కన్యాదానం చేయడానికి ఛాందసులు అంగీకరించలేదు. గిడుగు ఆ అమ్మాయిని దత్తత తీసుకుని వివాహం జరిపించారు. ఇంతకీ వరుడెవరో తెలుసా ?ప్రముఖ భావకవి వేదుల సత్యనారాయణ గారు.

          1863లో జన్మించిన గిడుగు గురజాడతో కలిసి మెట్రిక్యులేషన్ వరకూ చదివి పేదరికం వల్ల చదువు మానేసి పర్లాకిమిడి కొండల ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరి 1936 దాకా అక్కడే ఉన్నారు. అక్కడున్న సవరజాతికి చదువు నేర్ప డానికి సవర భాష, వారి ఆచారవ్యవహారాలు నేర్చుకుని సవర నిఘంటువులూ, వాచకాలూ , వగైరా గ్రంధాలు రాశారు. ఆ ప్రాంతంలో తిరగడం వల్ల ఆయనకు మలేరియా వచ్చింది. మలేరియా మందు ( క్వినైన్ ) ఆ రోజుల్లో పోస్టాఫీసుల్లో వాడేవారు. దాన్ని ఎక్కువగా వాడిన ఫలితంగా చెముడు వచ్చి ఆయన్ని జీవితాంతం వదల్లేదు. ఆయన కూడా తన పరిశోధనలు విడిచి పెట్టలేదు.

          గిడుగు కీర్తికోసం వెంపర్లాడలేదు. ఆయన 15 సంలు కష్టపడి తయారుచేసుకున్న వ్యాకరణం నోట్స్ తీసుకుని ఓక శాస్త్రులుగారు అచ్ఛేసుకుని గిడుగు పేరుకూడా వేయ లేదని ఒక మిత్రుడు ఫిర్యాదు చేస్తే  “అక్షరాలు కనిపెట్టినవాడి పేరు ఎవరికైనా తెలుసా? అలాగే నా పేరు తెలియడం ముఖ్యం కాదు ”  అని మందలించిన సహృదయుడాయన. సవరభాషకు ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రతిఫలం కోరుకోమంటే “నాకేమీ ఇవ్వక్కర్లేదు. సవరల విద్యాభివృద్ధికి తోడ్పడండి. అదే పదివేలు ” అనగలిగిన విశాలహృదయుడాయన. కానీ ఎలాగైనా ఈయన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం “సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ నీ , 1913 లో రావు సాహెబ్ బిరుదునీ ఇచ్చి సత్కరించింది.

          1909-10 సం .లలో ప్రభుత్వం విద్యావిధానంలో మార్పులు చేపట్టినప్పుడు విద్యార్థులు వ్యాసరచనలోనూ అనువాదంలోనూ ఎటువంటి భాష ఉపయోగించాలన్న విషయం చర్చకు వచ్చింది. వాడుక భాషనే ఉపయోగించాలని గిడుగూ ఆయన మిత్రులూ సూచించారు. 1915లో గురజాడ చనిపోయాక గిడుకు ఒంటరిగానే పోరాడారు. గ్రాంథిక భాషకు పట్టంకట్టాలని ఆంధ్రసాహిత్యపరిషత్తు పిఠాపురం రాజా అండ దండలతో  “సూర్యరాయాంధ్ర నిఘంటువు” ప్రచురించింది. దాని నిశితంగా పరిశీలిం చిన గిడుగు ” శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు విమర్శనము” రచించారు. 1940 జనవరి 22న ఆయన మరణించినా ఆధునిక యుగంలో ఆయన ఆశయాలు నెరవేరి ఈనాడు ఇంచుమించు అందరూ వాడుకభాషలోనే రాస్తున్నారు.

(ఈ వేళ తెలుగు భాషాదినోత్సవం, గిడుగు వేంకటరామమూర్తి గారి జయంతి)

పై విషయాలు  ‘మరోసారి గిడుగు రామమూర్తి’   పుస్తకం లోవి.

భాషా శాసన చణుడై

పరగినట్టి  గిడుగు

తెలుగువారి వెలుగుదారి

తెలివెన్నెల మడుగు 

-(శ్రీ శ్రీ)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.