ఇది కథ చెప్పే బొమ్మ. ఈ ‘జాగరణ’ చిత్రాన్ని గీసింది యువ అలంకారిక చిత్ర కళాకారిణి జో ఫ్రాంక్. గతంలోని జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ కాలంలోని ఒక క్షణాన్ని చిత్రిస్తుంది. ఆలోచన రేకెత్తించే దృశ్యాలవి ఆమె ఎంచుకున్న వస్తువులు కలుసుకుం టాయి, వాళ్ళ మథ్య మాటలు చోటు చేసుకుంటాయి. తన చిత్ర రచనలో జో ఫ్రాంక్ తాను పరిశీలించిన జీవితం గురించి కథలు చెబుతుంది. తనకు ప్రేరణ డానిష్ చిత్రకారుడు హేమర్షాయ్ అని అంటుంది. ఆమె చిత్రాలలో ప్రధానమైన అంశాలు మాత్రమే ఉంటాయి.
మూడు గదులు ఒక దాని వెనక ఒకటి – ముందు పెద్దగది, మధ్యది చిన్నది, చివరిది అన్నిటికన్నా చిన్నది – సామాన్యంగా, అలంకరణాలేవీ లేకుండా వున్నాయి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇల్లని తెలుస్తోంది. కనిపిసున్న వ్యక్తులు, వాళ్ళ దుస్తులు, ఇంట్లోని ఫర్నీచర్, వస్తువులని అమర్చిన తీరు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ముందుగా కుడివైపు మూలగా దుప్పటి కప్పుకుని మంచం మీదనున్న వ్యక్తి – చిత్రానికి పెట్టిన పేరు మూలంగా – బహుశా అవసానదశలోనున్న వ్యక్తి అని మనం ఊహించవచ్చు. ఇంటి యజమాని పెద్దకొడుకు చీకట్లో చేతులు తొడల పై ఉంచి అభావంగా మంచం మీదున్న వ్యక్తి కేసి చూస్తున్నట్టు చిత్రించబడ్డాడు. అతని పక్కన కుర్చీలో కూర్చున్న ఆమె అతని భార్యో, కూతురో అయిఉండవచ్చు; పుస్తకం చదువుతోంది; మరో పుస్తకం నేల మీదుంది; జాగరణలో దాని అవసరం పడొచ్చు; ఆమె ప్రవర్తన యాంత్రికంగా కనిపిస్తోంది; బహుశా ఎవరి కోసం జాగరణ చేస్తున్నారో ఆ వ్యక్తి పట్ల ఆమెకి అంత ఆప్యాయత ఉన్నట్టు లేదు. మధ్య గదిలో డైనింగ్ టేబిల్ ముందు తన ఇద్దరు కొడుకులు, భార్యతో ఇంటాయన ఉన్నాడు. కొడుకుతో ఏదో అంటున్నాడు. ఒక కుర్రాడి వీపు మన వైపుంది. అందరి చూపు లు నేల వైపే వున్నాయి. నేపథ్యంలోని వంటింట్లోని ఆమె వెనుక భాగం మనవైపునుంది. ఆమె పూర్తిగా వెలుతురులో వుంది.
ఈ చిత్రంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే – కాన్వాస్ మీదున్న పాత్రలు కదులు తున్నట్టు, వాళ్ళ మధ్య ఏదో జరుగుతున్నట్టు, ఒక స్టేజీమీద నాటకం జరుగుతున్న అనుభూతిని, భ్రమను మనకు చిత్రకారిణి కలగజేస్తోంది. ఉద్వేగపూరితమైన పాత్రలను, వారి భావోద్వేగాలు నిండిన సన్నివేశాలను, ఒక కథగా రంగులలో వర్ణించడం తన లక్ష్యం అని జో అంటుంది. ఫిగర్ పెయింటింగ్స్ వేయడం ఒక సవాలు అని భావిస్తుంది. తెలుగు వార్తాపత్రికలలో కథలకు బాపు లాంటి చిత్రకారులు అద్భుతమైన బొమ్మలు గీసేవారు. అయితే అవి తైలవర్ణ చిత్రాలు కావు. రాతలో వున్న కథలు చదివి కథలోని ముఖ్య సన్నివే శానికి అనుగుణంగా బొమ్మలు గీసే వారు. కాగా ఇక్కడ రంగులలో బొమ్మలు గీసి, క్యాన్వాస్ ను నింపి జరిగే కథని మన ఊహలకి వదిలేస్తోంది జో. ఈ అనుభూతి చిత్రంలో దృశ్యమే కథ చెబుతుంది. ఆ కథని కూడా ఎవరికీ తోచినట్లు వారు ఊహించుకోవచ్చు. అంతర్జాతీ యంగా ఈమె చిత్రాలు ఎన్నో బహుమతులు గెలుచుకోవటంతో ఇవి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.