నన్ను క్షమించు

(`मुझे माफ़ कर देना’)

హిందీ మూలం – సుభాష్ నీరవ్

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          పోస్టులో వచ్చిన  కొన్ని ఉత్తరాలు టేబిలు మీద పడివున్నాయి. నిర్మల ఒకసారి వాటిని అటూ-ఇటూ తిప్పి చూసింది. కాని వాటిని చదవాలని అనిపించలేదు. ఆ ఉత్తరాలన్నీ పాఠకుల నుంచి వచ్చినవేనని ఆమెకి తెలుసు. నిస్సందేహంగా ఇటీవలనే ఒక పత్రికలో ప్రచురితమైన తన స్వీయచరిత్రలోని ఒక అంశం గురించే అయివుం టాయి. ఎక్కువ ఉత్తరాల్లో తనని ప్రశంసించి ఉంటారు. కొన్నింటిలో తనపట్ల సానుభూతి చూపించే ప్రయత్నం చేసివుంటారు. ఒకటి-రెండు ఉత్తరాల్లో తనపట్ల విమర్శ కూడా ఉండవచ్చు. ఎందుకో తెలియదు కాని, పాఠకుల నుంచి వచ్చే ఉత్తరాల కోసం తను ఒకప్పుడు ఆదుర్దాగా ఎదురుచూసి చదివినట్లుగా ఇప్పుడు చదవడంలేదు. ఆ రోజుల్లో తన రచనల గురించి ఏదయినా ఉత్తరం వస్తే, తన పనులన్నీ విడిచిపెట్టి దాన్ని చదువుతూ కూర్చునేది. మళ్ళీ-మళ్ళీ చాలాసార్లు చదివేది. అందులో ఎంతో ఆనందం కలిగేది. రోజంతా ఏదో తెలియని మత్తు ఆవహించినట్టుగా ఉండేది. తను ఆ ఉత్తరాలకి జవాబు కూడా ఇచ్చేది. కాని ఇప్పుడు అటువంటి ఉత్సాహం ఏదీ తనలో మిగల్లేదు.

          నిర్మల లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. కిటికీ అవతల నీలాకాశంలోని ఒక అంశం చిత్రకారుడి కేన్వాస్ లాగా వ్యాపించి ఉంది. అక్కడక్కడ ఎగురుతున్న పక్షులు ఆ ఆకాశంలో ఒక రేఖని సృజించినట్లుగా అనిపిస్తోంది. కాగితపు ఆకాశంలో పదాల పక్షులని ఎగురవేస్తూ నిర్మలకి ఇంచుమించు ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా కథా సంకలనాలు, కవితాసంపుటాలు, కొన్ని నవలలు… ఇప్పుడు తను తన జీవితంలోని పుటలని గాలిస్తోంది. వయస్సులోని ఈ మజిలీలో తను తన ఆత్మకథని రాస్తోంది. అందు లోని ఒక అంశం ఒక ప్రసిద్ధ పత్రికలో ఈ మధ్యనే ప్రచురితమయింది. ఒకసారి మళ్ళీ తను టేబిలు మీద పడివున్న ఉత్తరాల పై తన దృష్టిని సారించింది. టేబిలు మీద ఉన్న ఆ ఉత్తరాలు తనను తమవైపుకి లాగుతున్నట్లుగా ఆమెకి అనిపించింది. నెమ్మదిగా నడిచివచ్చి ఆమె టేబిలుదగ్గరికి వచ్చి నిలబడింది. ఉత్తరాల పోగుని ఒకసారి మళ్ళీ అటూఇటూ తిప్పి చూసింది. ఉన్నట్టుండి ఒక కవరు మీద ఆమె చూపు నిలిచింది. కవరు మీద పంపినవారి పేరు చదివి ఆమె ఆలోచనలో పడింది. ఆమె త్వరత్వరగా కవరును తెరిచి చూసింది. ఇంత పెద్ద ఉత్తరమా! అది తను కాలేజీలో చదువుకున్నప్పుడు తన స్నేహితురాలైన రంజన రాసిన ఉత్తరం. ఆమె కుర్చీలో కూర్చుంది. వణుకుతున్న వేళ్ళతో పట్టుకున్న ఆ ఉత్తరం తను ఆత్రుతగా చదవసాగింది-

డియర్ నిర్మలా,

          అరే, నువ్వు పెద్ద రచయిత్రివైపోయావు. నీవి ఒకటి-రెండు కథలు నేను ఇంతకు ముందు చదివాను. ఏ పత్రికలోనో గుర్తులేదు. ఆ కథలు రాసింది నా మిత్రురాలు నిర్మలే అని నాకప్పుడు తెలియదు. నీ ఆత్మకథ నీ పరిచయంతోనూ, నీ ఫోటోతోనూ వచ్చిన పత్రికవల్లనే నీ గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే నేను కేవలం కాలక్షేపం కోసం ఆ పత్రిక పేజీలు తిరగేస్తూ ఉంటే నీ ఫోటో చూసి నా దృష్టి అక్కడ నిలిచిపోయింది. ఇంక నీ ఆత్మకథని చదవకుండా నేను ఉండలేకపోయాను. చదివిన తరువాత ఆ రాత్రంతా నేను దిగులుగా ఉండిపోయాను. నిద్ర ఎక్కడ దారి మరిచిపోయిందోనన్నది తెలియదు. నేను నీతో గడిపిన ఆ రోజులు జ్ఞాపకం రాసాగాయి. ఆ కాలేజీ రోజులు నా కళ్ళముందు మళ్ళీ తిరిగి సజీవంగా కనిపించినట్లయింది. నువ్వు నీ ఆత్మకథలో కాలేజీ రోజులని గుర్తు చేసుకున్నావు, నన్నూ రవీంద్రనీ జ్ఞాపకం చేసుకున్నావు. రవీంద్రనీ, నన్నూ నువ్వు ఎలా చూపించావన్నది నీ నిజం. పాఠకులకి కూడా ఇది నిజమనే అనిపిస్తుంది. కాని, నీ విషయంలో ఏం జరిగిందన్నది నీకు అసలు తెలియదంటావా? లేకపోతే నువ్వు కావాలనే ఆ నిజాన్ని కనుపించకుండా అదృశ్యం చెయ్యాలనుకున్నావా? రవీంద్రనీ, నన్నూ నువ్వు నీ ఆత్మకథలో ఎలా చిత్రించావన్నది వాస్తవానికి దగ్గరగా ఉందంటావా? నిర్మలా, మనం ఎం.ఏ. కలిసే చదువుకున్నాం. మనిద్దరం కాలేజీ హాస్టల్లో ఒకే గదిలో కలిసే గడిపాం. మనం మంచి స్నేహితురాళ్ళం. ఒకరిపట్ల ఒకరు అభిమానంగా ఉండే వాళ్ళం. మన మధ్య చిన్నచిన్న జగడాలు కూడా జరుగుతూ ఉండేవి. కాని నేను నిన్ను అర్థం చేసుకున్నంత వరకూ నువ్వు మొదటి నుంచి కూడా మౌనంగా, ఏమీ మాట్లాడ కుండా, మితభాషిగా ఉండేదానివి. నువ్వు ఎప్పుడూ తిరిగి జవాబివ్వడం నేర్చుకోలేదు.  ఎదుటివాళ్ళు చెప్పేదాన్ని ఖండించడం నీకు అసలు తెలియదు.  నీకు దొరికిందేదో నీకు దొరికింది, లేకపోతే సరిపెట్టుకునేదానివి. నీ బాధని, నీ దుఃఖాన్ని, నీ మనోవ్యథని, నీలోపలే దాచుకుని సహించుకునేదానివి. బహుశా ఈ విధంగా సహించుకున్న బాధ నీచేత కలం పట్టించి ఉంటుంది. నువ్వు నోటితో చెప్పకుండా నీ పదాలతో దానికి అక్షరరూపాన్ని ఇస్తూ వచ్చావు. శబ్దస్వరూపాన్ని కల్పిస్తూ వచ్చావు. నువ్వు ముందు ఎలా ఉండేదానివో ఈ రోజున కూడా అలాగే ఉన్నావని నాకనిపిస్తోంది. కాని నేను చిన్నతనం నుండి ఇలా ఉండేదాన్ని కాదు. నేను మాట్లాడకుండా ఉండటం అనేది అసలు నేర్చుకో లేదు. నేను చెప్పదలుచుకున్నది గట్టిగా అరిచి చెప్పడం, నేను చెప్పే ప్రతి విషయాన్ని ఎదుటివాళ్ళచేత ఒప్పించడం నా అలవాటుల్లో ఒక భాగమైపోయింది. నాకు నచ్చినది ఏదయినా సరే, దాన్ని స్వాధీనంచేసుకోవడం నాకు తప్పనిసరి అయిపోయింది. నేను ఇష్టపడిన వస్తువు నాకు తేలికగా దొరక్కపోతే దాన్ని లాక్కునేవరకూ వెళ్ళేదాన్ని. చివరకు దాన్ని లాక్కునేదాన్ని. బాల్యంలో తోడబుట్టినవాళ్ళ నుంచి లాక్కునేదాన్ని. ఎదిగిన తర్వాత స్నేహితురాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం నాకు అలవాటైపోయింది. నాకు నచ్చిన వస్తువుని, నాకు కావాలనుకున్నదాన్ని ఇంకెవరైనా తీసుకుపోతే ఎప్పుడూ సహించేదాన్ని కాదు. నాకున్న ఈ అలవాటు నీకు బాగా తెలుసు. నీ దగ్గర ఉన్న వస్తువేదయినా నాకు బాగుందని అనిపించినప్పుడు నేను నిన్ను అడిగేదాన్ని కాదు. లాక్కునేదాన్ని. అది నీ పెన్ను అయినా, హెయిర్ క్లిప్పు అయినా, సూట్ అయినా, చెప్పులైనా సరే. చాలాసార్లు నువ్వు ఒకటి-రెండు రోజులు మూతి ముడుచుకుని ఉండే దానివి. కాని నోటితో తిరిగి ఏమీ అనేదానివి కాదు. ఎప్పుడూ కూడా దెబ్బలాడి నీ వస్తువు నువ్వు తిరిగి తీసుకోలేదు. నీ నోట్లో అసలు నాలుక అనేది లేనట్టుగానే ఉండేదానివి. నిర్మలా, నువ్వు ఎటు వంటి మనిషివని నేను చాలా సార్లు అనుకునేదాన్ని. ఈలోగానే మన జీవితంలోకి రవీంద్ర వచ్చాడు. ఒక అందమైన, స్ఫురద్రూపి అయిన యువకుడు. మా అక్కయ్య స్నేహితురాలికి తమ్ముడు. అతని శరీరంలో ఏం సౌరభం ఉందో కాని, నేను మాత్రం తొలిచూపులోనే అతనిదాన్నైపోయాను. మెలకువగా ఉన్నా, నిద్రపోతున్నా అతని గురించిన మత్తుతో నా శరీరమంతా నిండిపోయేది. ప్రతిక్షణం అతని రూపం నా కళ్ళముందు ఉండేది. అతను నాతో మాట్లాడినప్పుడల్లా నేను ఏదో తెలియని స్వప్న లోకంలోకి వెళ్ళిపోయేదాన్ని. అతడు నాతో అరమరికలు లేకుండా ఉండేవాడు. మేము అన్నిరకాల విషయాలూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆఖరికి సంఘంలో ఓపెన్ గా చెప్పుకోని సంగతులు కూడా. అతను తరచు సినిమాల గురించి, సాహిత్యం గురించి చెబుతూ ఉండేవాడు. ప్రత్యేకించి స్త్రీ పురుషుల అంతరంగ విషయాలను విడమరిచి చెప్పేవి. నాలోని ఒక స్త్రీ ఆకలిగా ఉండసాగింది. నేను ఆమె క్షుధాగ్నిని అణచివెయ్య డానికి ప్రయత్నించేదాన్ని. కాని అది ఇంకా ప్రజ్వరిల్లేది. రవీంద్ర సాన్నిధ్యంలో అది తగ్గుతుందేమోనని, అతని స్పర్శతో అది శాంతిస్తుందేమోనని అనుకునేదాన్ని. కాని అది ఇంకా తీవ్రమయ్యేది. నేను మళ్ళీ అనుకునేదాన్ని రవీంద్ర లేనప్పుడు అది చల్లబడు తుందేమోనని. కాని అతను నాకు దగ్గరగా లేనప్పుడు ఈ బుభుక్ష ఇంకా అతిశయించేది. అది నన్ను రవీంద్ర దగ్గరికి పరుగెత్తించి తీసుకువెళ్ళాలనుకునేది. నాలోని స్త్రీ ఈ జ్వలనాన్ని, వ్యథను ఎదుర్కొంటూ ఉండగానే,  రవీంద్రకి నా పట్ల ఉన్న ఆసక్తి తగ్గిపోతోం దని, అతను ఇంక నీ పట్ల ఆకర్షితుడవుతున్నాడని నాకు అనిపించసాగింది. అతను నా దగ్గరికి వచ్చినప్పుడు అతను నన్నుకాదు, నా వంకతో నిన్ను కలుసుకునేందుకు వస్తు న్నాడని నాకు అర్థమయింది. అతని చూపులు ఇప్పుడు నన్ను వెతకటంలేదని, ఇప్పుడ తను నీ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాడని నాకు తెలిసిపోయింది. కాని ఇప్పుడు కూడా అతను నాతో అదేవిధంగా ఓపెన్ గా మాట్లాడుతూ ఉన్నాడన్నది వేరే విషయం. అది నేను సహించుకోలేనిది…. అసలు సహించుకోలేనిది….నిర్మలా….అతడు నన్ను ఇగ్నోర్ చేసి, నన్ను పక్కనపెట్టి నీతో మాట్లాడుతున్నాడంటే నేనసలు తట్టుకోలేని సంగతి. తరువాత నువ్వుకూడా అతన్ని ప్రేమించసాగావని నాకనిపించింది. అతను రాగానే నీ ముఖం సంతోషంతో విప్పారేది. నువ్వు వీలయినంత ఎక్కువ సమయం అతనితో గడపాలనుకునేదానివి. నువ్వు నాకెంతో ఇష్టమైన వస్తువుని నా నుండి లాక్కోవాలను కుంటున్నావని నాకనిపించింది. నేను రవీంద్రని పూర్తిగా నా స్వంతం చేసుకోవాలను కున్నాను. నాలో ఉన్న ఆడది పిచ్చిదైపోయింది. నీ గురించి నేను రవీంద్రతో ఎన్నో అబద్ధాలు చెప్పాను.  నీ నడవడికని…నీ కారెక్టర్ ని దెబ్బతీయడానికి ప్రయత్నించాను. నీ గురించి ఎంతో చెడ్డగా చెప్పాను. కాలేజీలో ఎంత మంది అబ్బాయిలతో నీకు సంబంధం ఉందో రవీంద్రకి చెప్పాను. రవీంద్ర నీతో ఏ విధంగానూ సంబంధం పెట్టుకోకూడదన్నదే నా కోరిక. కాని, నేను రవీంద్రకి ఏయే విషయాలు చెప్పానో అవన్నీ అతను నీకు చెబుతూ ఉండేవాడని నాకు క్రమంగా అర్థమయింది. కాని నువ్వు ఎప్పుడూ దీని గురించి నాతో మాట్లాడలేదు. నాతో ఏమీ తగువు పెట్టుకోలేదు, నా మీద కోపగించుకోలేదు, నాముందు ఏడవలేదు, విహ్వలితురాలివి కాలేదు.

          నిర్మలా, నువ్వు నీ కథల ద్వారా, నీ రచనల ద్వారా నీ దుఃఖాన్ని, నీ బాధని జనంతో పంచుకునే దారి వెతుక్కున్నావు. నీకు మొదటి నుంచి సాహిత్యంలో అభిరుచి ఉంది. హిందీ సాహిత్యమే కాక, ఇతర భారతీయ భాషల్లోని సాహిత్యం కూడా నువ్వు లైబ్రరీ నుంచి తెచ్చుకుని చదివేదానివి. నీ దగ్గర ఈనాడు ఒక భాష ఉంది, ఒక శైలి ఉంది, నీ మనస్సులోని విషయాన్ని నీ కలం ద్వారా చెప్పే ఒక పద్ధతి ఉంది. కాని, నా దగ్గర నీలాగా భాష కాని, శైలి కాని లేదు. రాసే పద్ధతి ఏదీ నాకు తెలియదు. కాని, నేను ఈ ఉత్తరంద్వారా నీతో నా బాధనే కాక, ఒక నిజాన్ని, ఒక చేదునిజాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నిర్మలా, నేను నిన్నే కాక, రవీంద్రని కూడా మోసం చేశాను. కాని ఈ రోజు ఇప్పుడు నాకనిపిస్తోంది నన్ను నేను కూడా మోసం చేసుకున్నానని. నేను ఎట్టిపరిస్థితిలోనైనా రవీంద్రని నా స్వంతం చేసుకోవాలనుకున్నాను. అతని మనిషినై పోదామనుకున్నాను. అతడు పూర్తిగా నావాడైపోవాలని అభిలషించాను. నేను పందెం ఓడిపోవడం నాకు అసలు ఇష్టం లేదు. మనకి ఎం.ఏ. ఫైనల్ పరీక్షలు అయిపోయాయి. ఒక రోజున నేను నా కడుపులో నీ అంశం పెరుగుతోందని రవీంద్రతో అన్నాను. అతనికి కాళ్ళకింద నేల కదిలిపోయినట్లుగా అనుభూతి చెందాడు. చాలా కంగారు పడ్డాడు. నువ్వు ఒక నెలలోగా నన్ను పెళ్ళి చేసుకోకపోతే ఈ సంగతిని మా యింట్లో చెబుతాను, అంతేకాక నేను విషం తిని మరణిస్తానని అతనితో చెప్పాను. నా బెదిరింపు విని రవీంద్ర భయపడ్డాడు. నేను వదిలిన బాణం సరిగా లక్ష్యాన్ని భేదించింది. అతడు మౌనంగా నేనుచెప్పినదానికి సరే అన్నాడు. మా అమ్మా-నాన్నా కాని, మా అన్నయ్యలు కాని రవీంద్ర విషయంలో ఏమీ అభ్యంతరం చెప్పలేదు. బహుశా దీనికి కారణం రవీంద్ర ఒక మంచి కుటుంబానికి చెందినవాడవటం కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం విజయవంతంగా నడుపుతున్న వ్యాపారసంస్థకి చెందటం కావచ్చు. నేనయితే సంతోషంగా ఉన్నాను. గాలిలో ఎగిరి పోతున్నాను. నా కాళ్ళు నేల మీద నిలవడంలేదు. నా కలలు నిజం కాబోతున్నాయి. ఈ సంతోషాన్ని నేను నీతో పంచుకోవాలని ఉన్నా, పంచుకోలేకపోయాను.

          ఒక నెల తరువాత మా పెళ్ళి అయింది. నేను ఆఖరిసారి నీ ముఖం చూసిన ఆ రోజు నాకింకా జ్ఞాపకం ఉంది. నువ్వేమీ కోపం చూపించలేదు. ఎదిరించి ఏమీ మాట్లాడలేదు. నువ్వు మా యిద్దరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పావు. నీ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. కాని నువ్వు అప్పుడు నిజంగా మనస్సులో సంతోషిస్తున్నావా? లేదు. రవీంద్ర నీకు చేసిన నమ్మకద్రోహానికి నీకు చాలా బాధ కలిగింది. కాని నీ స్వభావానికి తగినట్లుగానే నువ్వు అసలు ఏమీ స్పందించలేదు. నీ బాధని, నీ వ్యథని సహించుకున్నావు. నీలోనే దాచు కుని అణచి వుంచుకున్నావు.

          పెళ్ళి అయిన తరువాత మేము ముంబయికి వచ్చాం. మొదట్లో రవీంద్ర తన తండ్రిగారితోనూ, సహోదరులతోనూ కలిసి బిజినెస్ చేసేవాడు. కాని తరువాత వాళ్ళతో వేరుపడి తన వ్యాపారం వేరే చేసుకోసాగాడు. తన బిజినెస్ విషయంలో తను ఒక పిచ్చి వాడిలా తిరుగుతూ ఉండేవాడు. తను నన్ను ప్రేమిస్తున్నాడా, లేక తన పనినా అన్నది నాకొక విషమ ప్రశ్న. కాని నిర్మలా, నేను నా అబద్ధాన్ని ఎంత వరకూ దాచి ఉంచగలను? పెళ్ళి అయిన మూడు నెలలకి కూడా నాకు ఆశించినట్లుగా జరగకపోయే సరికి నా వ్యాకులతకి హద్దులేకుండా పోయింది. నా అసత్యాన్ని నేను దాచి ఉంచుకోవడం ఎలా? నేను ఒకరోజు ఉన్న వాస్తవమంతా రవీంద్రకి చెప్పేశాను. నేనీ అబద్ధం కేవలం రవీంద్రని నావాడిగా చేసుకునేందుకే ఆడాను. నేను అతన్ని హద్దులేని విధంగా ప్రేమించాను. కాని రవీంద్ర ఈ నిజాన్ని తెలుసుకున్న తరువాత నాతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడలేదు. అతను నిశ్శబ్దపు లోతుల్లో అదృశ్యమైపోసాగాడు. చాలా తక్కువగా మరీ అవసరమైన విషయాలనే నాతో మాట్లాడసాగాడు. తనని తాను అంతకంతకూ ఎక్కువగా తన పని లోనూ, బిజినెస్ లోనూ లీనం చేసుకున్నాడు. ఒక సంవత్సరం గడిచింది. రెండో సంవత్సరం, మూడోది, నాలుగోది కూడా గడిచిపోయింది. నేను తల్లిని కావాలని తపించి పోయాను. డాక్టర్లకి చూపించుకుంటే వాళ్ళు చెప్పింది వింటున్నప్పుడు నా చెవుల్లో ఎవరో సీసం కరిగించి పోసినట్లు అనిపించింది. నేను నా జీవితంలో ఎప్పటికీ తల్లిని కాలేనని చెప్పారు.

          నా ఆశల మీద, అభిలాషల మీద అనుకోకుండా ఏదో పెద్ద పర్వతం వచ్చి పడినట్ల యింది. నా కోరికలు, నా కలలు దానికింద పడి అణిగిపోయి నశించిపోసాగాయి. నేను ఏమీ చెయ్యలేని స్థితిలో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. నాకు ఏవిషయంలోనూ మనస్కరించడంలేదు. తినడంలో, తాగడంలో, మంచి బట్టలు ధరించడంలో…. దేని మీదకీ నా మనస్సు పోవడంలేదు. రాత్రుళ్ళు నేను నిద్రలేకుండా మెలకువగా ఉండే దాన్ని. నాకు నా జీవితంలో అంతా చీకటైపోయింది. వెలుగుకిరణాలని కబళించేసే చిక్కని గాఢాంధకారం.

          కొడుకు కోసం ఎదురుచూస్తున్న మా అక్కయ్యకి మూడోసారి కూడా అమ్మాయి పుట్టిందని ఒక రోజున తెలిసింది. ఒకనాడు రవీంద్ర, నేను కూడబలుక్కుని మా అక్కయ్య దగ్గర నుంచి ఆరునెలల పిల్లని మా యింటికి తీసుకువచ్చాం. రవీంద్ర దానికి `శ్వేత’ అని పేరు పెట్టాడు. శ్వేత వచ్చాక నాలోని తల్లి జీవితురాలయింది. మేము శ్వేతను పెంచి, పోషించి, చదువుచెప్పించి యోగ్యురాలిగా చేశాం. అది పెళ్ళీడుకి వచ్చాక రవీంద్ర తన నిర్ణయం చెప్పాడు- “మనం మనకూతురి పెళ్ళి ఇల్లరికం వచ్చి మనతో ఉండేందుకు ఇష్టపడేవాడితోనే చేద్దాం.” వరుడిని అన్వేషించడంలో మాకేమీ ఇబ్బంది కలుగలేదు. రవీంద్రకి అభివృద్ధి చెందుతున్న వ్యాపారం ఉంది. మా అమ్మాయి బాగా చదువుకున్నది. అందంగా ఉంటుంది. దానికి మేము పెళ్ళి చేశాము. కుర్రవాడు మాతోనే మా యింట్లోనే ఉంటున్నాడు. రవీంద్రకి బిజినెస్ లో సహాయపడుతున్నాడు.

          మళ్ళీ ఒకసారి నా జీవితంలో మరోసారి చీకటి అలుముకుంది.

          ఒకరోజున పని చేసుకుంటున్న సమయంలో రవీంద్రకి గుండెలో వచ్చిన నొప్పితో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తరువాత జరిగిన నా కథ నీకేం చెప్పను నిర్మలా? నా కూతురుగా భావించి ఎవరిని పెంచానో, అది నన్ను అమ్మ అనడం మాట అటుంచి చివరికి నన్ను తల్లిగా భావించడం కూడా మానేసింది. అత్తయ్యగారూ అంటూవుండే అల్లుడి వైఖరి కూడా మారిపోయింది. ఇద్దరూ రవీంద్ర చేసే మొత్తం బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఒక అపార్టుమెంటుని, కొద్దిపాటి ఆస్తిని నా పేరుతో ఉంచి మిగిలినదంతా అమ్మిపారేసి వాళ్ళు స్టేట్స్ కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళికూడా చాలా సంవత్సరాలయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ ఒక ఫోన్ కాని, ఒక ఉత్తరం కాని రాలేదు. కేవలం నేను, నా ఏకాంతం మిగిలిపోయి ఉన్నాం. అప్పుడప్పుడూ నాకనిపిస్తుంది ఎదుటివాళ్ళ వస్తువులని లాక్కునే నేను ఈ రోజున నా సర్వస్వం కోల్పోయానని. నిర్మలా, నేను రవీంద్రని నీ నుండి లాగేసుకున్నప్పుడు నేను గెలిచానని, నువ్వు ఓడిపోయావని అనుకున్నాను. కాని నాకనిపిస్తున్నది నేను గెలిచి కూడా గెలవలేదని, నువ్వు ఓడిపోయి కూడా ఓడిపోలేదని. రవీంద్ర నిన్నెప్పుడూ తన మనస్సులోంచి తొలగించి నిన్నుమరిచిపోలేదు. నిస్సందేహంగా అతను నాతోనే ఉన్నాడు. లోకం కోసం నన్ను ప్రేమించేవాడు. కాని తన మనస్సునిండా నీ దగ్గరే ఉన్నాడు, నిన్నే ప్రేమించేవాడు. చాలా సార్లు నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడు కూడా నా పేరు మరిచిపోయి `నిర్మలా, నిర్మలా’ అంటూ ఉండేవాడు. ఆ క్షణాలలో నాకనిపించేది అతను నన్నుకాదు, నా ద్వారా నిన్నే తన బాహువుల్లో బంధిస్తున్నాడని…. నిన్నే ప్రేమిస్తున్నాడని. నిజం చెప్పాలంటే నిర్మలా, అతను నావాడు ఎప్పుడూ కాలేదు. వాడు నీవాడు. అతడిని నేను అసత్యాన్ని అడ్డం పెట్టుకుని నీ నుంచి లాక్కున్నాను. నన్ను క్షమించటానికి యోగ్యురాలిగా భావిస్తే నన్ను క్షమించు నిర్మలా! నీ స్నేహితురాలు- `రంజన’.

          నిర్మల చేతుల్లో ఉత్తరం ఇంకా గాలికి రెపరెపలాడుతోంది… ఆమె చేతులు వణుకు తున్నాయి… ఆమె ఆ ఉత్తరాన్ని ముందు తన పెదవులతో ముద్దు పెట్టుకుంది. తరువాత దాన్ని తన హృదయానికి హత్తుకుంది. తను ఆ ఉత్తరాన్ని కాక, రంజననే  కౌగలించు కున్నట్లు అనుభూతి చెందింది. ఆమె కళ్ళలోంచి రెండు కన్నీటి ముత్యాలు రాలాయి. ఆ ఉత్తరానికి చెందిన కాగితాలు ఆ ముత్యాలని తమలో ఐక్యం చేసుకున్నాయి.

***

సుభాష్ నీరవ్ – పరిచయం

27 డిసెంబరు 1953 న మురాద్ నగర్, ఉత్తర ప్రదేశ్ లో జన్మించిన శ్రీ సుభాష్ నీరవ్ (అసలు పేరు : సుభాష్ చంద్ర) హిందీ కథారచయితగా, కవిగా, పంజాబీ-హిందీల మథ్య అనువాదకర్తగా గత 42 సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందినవారు. ఇప్పటి వరకు వీరి 9 కథాసంకలనాలు, 3 మినీకథాసంకలనాలు, 3 కవితాసంకలనాలు, 2  బాలకథా సంకల నాలు, వెలువడ్డాయి. 6 కథాసంకలనాలకి సంపాదకత్వం చేశారు. కొన్ని కథలు విద్యా సంస్థల వేరువేరు స్థాయి కోర్సులలో పాఠ్యాంశాలుగా చోటు చేసుకున్నాయి. వీరు పంజాబీ నుంచి ఇంచు మించు 700 కథలు, 200 మినీకథలు, 500 కవితలను అనువదించారు.

          ఇవికాక వివిధ ప్రక్రియలలో 60 కన్నా ఎక్కువ సాహిత్య గ్రంథాలను పంజాబీ నుంచి అనువదించారు. పంజాబీ కవితలకు ఒక హిందీ అనువాదసంకలనం సాహిత్య అకాడమీ, ఢిల్లీ నుండి ప్రచురితమయింది. ప్రసిద్ధ హిందీ పత్రికలు `కథాదేశ్’, `చేతన’,
`మంతవ్య’ యొక్క పంజాబీ కథల ప్రత్యేక సంచికలకి సంపాదకత్వం మరియు
పంజాబీ నుండి అనువాదం చేశారు. ఉత్తమ సాహిత్యసృజనకు భారతీయ అనువాద
పరిషత్, రాజస్థాన్ పత్రిక, ఇండియా నెట్ బుక్స్ మొ. ద్వారా గణనీయమైన సన్మానాలు పొందారు. కేంద్రప్రభుత్వంలో అండర్ సెక్రటరీ పదవి నుంచి డిసెంబరు 2013లో రిటైర్ అయిన తరువాత పూర్తిగా సాహితీ వ్యాసంగానికి సమయం ఇస్తున్నారు. వీరు న్యూఢిల్లీ
వాస్తవ్యులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.