నా అంతరంగ తరంగాలు-18
-మన్నెం శారద
గుర్తుకొస్తున్నాయి …….
————————-
(ఇదివరకు ఇది నేను చెప్పిందే. కానీ ఇప్పుడు నాకు చాలా మంది కొత్త స్నేహితులు వచ్చారు. అదిగాక నేను వీటిని పుస్తకరూపంగా తీసుకొస్తే అందులో ఉంటుంది కదా అని మళ్ళీ చెబుతున్నాను. రావి శాస్త్రి గారితో వున్న ఒకే ఒక జ్ఞాపకం ఇది!)
———————– 1994 లో నేను కొందరి ఫెమిలీ ఫ్రెండ్స్ తో కలిసి కేరళ టూర్ వెళ్ళాను . తిరిగి వచ్చేసరికి నా అభిమాన రచయిత రావి శాస్త్రి గారు చనిపోయినట్లు తెలిసి చాలా దిగ్భ్రమకు గురయ్యాను . నాకు ఆయన రచనాలన్నా పతంజలి గారి రచనాలన్నా చాలా చాలా ఇష్టం !
వ్యంగ్యం, హాస్యం. సమాజం పట్ల బాధ్యత ,వున్న రచనలంటే నాకు చాలా ఇష్టం !రావిశాస్త్రిగారు రాసిన ప్రతి అక్షరమూ ఇంచుమించు చదివాను . కొందరి స్నేహితులతో కలిసి ఆ మాండలీకం గురించి చెప్పుకుని మరీ మరీ సంతోషించేదాన్ని. కానీ ఆయనతో వ్యక్తిగత పరిచయం ఏమీలేదు .చూడను కూడా చూడలేదు. అయినా ఆయన గురించి ఏమన్నా రాస్తే బాగుండును అనే కోరిక నన్ను నిలువ నియ్యలేదు .కానీ ఏం రాయాలి !
అప్పటికే వారితో వ్యక్తిగత పరిచయాలున్న సంపాదకులు ,రచయితలు పుంఖాను పుంఖాలుగా వారి గురించి దాదాపు అన్ని పత్రికలల్లో రాసేశారు .
మనసులో రావి శాస్త్రి గారి ఆలోచనలు ముసురుతుండగా ఆఫీసుకొచ్చి కూర్చు న్నాను .ఏదో అన్యమనస్కంగా ఫైల్స్ డీల్ చేస్తున్నానే గాని మనసంతా ఆయన గురించి ఏదన్నా రాసి తీరాలన్న ఆలోచన క్షణక్షణానికి బలపడిపోసాగింది . వెనువెంటనే ఒక ఐడియా మెరపులా మెరిసింది .
రావిశాస్త్రిగారి మరణం గురించి ఆయన సృష్టించిన పాత్రలు ఏమనుకుంటు న్నాయి !
అలా రాస్తేనో…!?
ఇక ఆలోచించలేదు. ఫైల్స్ అవతల పడేసి గబగబా నాకు తోచినట్లు రాసేసి. పర్మిషన్ పెట్టి మయూరి వారపత్రిక ఆఫీస్ కి వెళ్ళాను. ఆ పత్రికకు నేనిచ్చిన కాంట్రిబ్యూ షన్ చాలా వుంది. చాలా సీరియల్స్, కధలూ ఫీచర్స్ ,ఇంటర్వ్యూలు ఇచ్చాను .
వెళ్ళి ఎడిటర్ గారిని రిక్వెస్ట్ చేసాను .
“అప్పుడే వేరే ఆర్టికల్స్ ప్రచురించాం అమ్మా “అన్నారాయన .
“ఇది చూడండి, చాలా చిన్నది ” అన్నాను మెల్లిగా .వెంటనే ఒప్పుకున్నారాయన.
బొమ్మకూడా నేనే వేసుకుని వెళ్ళాను మొదటిసారి . అది చూసి అంత పెద్ద ఆర్టిస్ట్ అయిన చంద్రగారు అలానే వేసిచ్చారు . పబ్లిష్ అయిపొయింది . లోపల భయమే … ఎవరేమంటారో అని .
వంటచేసుకుంటుండగా వాసిరెడ్డి సీతాదేవిగారి కాల్ ! ఆవిడ నుండి ఫోన్ అంటే భయం నాకు ! ఎవరో ఏదో అంటిస్తారు ..ఆమె ముందు తాటాకుమంటలా ఎగసిపడి తర్వాత పన్నీటి జల్లులా కురిసి “వచ్చేయ్ వచ్చేయ్ మనం కబుర్లు చెప్పుకోవాలి” అంటారు .
స్వాభివికంగా నేను చాలా నెమ్మది !కఠినంగా మాట్లాడలేను .ఎవరైనా బాధపెడితే అక్కడ నుండి తప్పుకుంటాను . ప్రతిసారీ ఎంత ఆప్తులయినా జవాబుదారీతనంగా నిల వేస్తే భరించలేను .నా ఆత్మాభిమానం నాకు ఉంటుంది కదా ! ఆమె అటు వయసులోనూ ఇటు సాహితీరంగంలోనూ నా కన్నా చాలా పెద్దవారు ! నన్ను అభిమానించడం నాతో ఆమె స్నేహంగా ఉండడం కొందరికి రుచించక నా మీద ఏదో ఒకటి చాడీలు చెబుతుండే వారు .
భయంగా రిసీవర్ తీసుకుని ‘మేడం’ అన్నాను మెల్లిగా .
” అసలేం పనులు చేస్తున్నావ్ నువ్వు ?” అన్నారామె ఎత్తుకోవడమే .
“ఏంచేసానండి” ఆన్నాను హీనస్వరంతో .
“ఏంచేసావా …ప్రొద్దుట నుండి నాకు ఎన్ని ఫోన్లో .!..మన్నెం శారద రావి శాస్త్రి గారి గురించి రాసింది చదివారా …అని .” ఇప్పుడే పత్రిక తెప్పించుకుని చదివా “అన్నారు .
“ఏదో అలా రాయాలనిపించింది మేడం !నాకు ఆయన గురించి మీలా ఏమీ తెలియదు .” అన్నా నసుగుతూ .
” పుంఖానుపుంఖాలుగా మేం రాసిందంతా నువ్వు చిన్న ఆర్టికల్ తో కొట్టేశావ్ . ఎంత సెన్సేషన్ అయ్యిందో తెలుసా… నీ ఆర్టికల్ !భలే ఐడియాలు వస్తాయ్ నీకు !కంగ్రాట్స్ “అన్నారు .
‘హమ్మయ్య’అని ఊపిరి పీల్చుకున్నాను నేను .
ఎవరో ఆ మధ్య రావిశాస్త్రి గారి బంధువు ఒకరు నన్ను ఈ ఆర్టికల్ ఉంటే ఒకసారి పోస్ట్ చెయ్యమని అడిగారు ,అప్పుడు దొరకలేదు ఇది ! జగద్దాత్రి గారు కూడా కావాలని అడిగారు. నిన్న ఏవో కధలు వెదుకుతుంటే ఇది కళ్ళపడి పోస్ట్ చేస్తున్నాను . చదవండి!
***
మమ్మల్నొగ్గేసి నువ్పెల్లిపోనావా బావూ!
———————————————
నువ్వెల్లి పోనావంతే నాన్నమ్మలేకున్నాను శాస్త్రిరిబావూ!
ఆ అసిరిగాడు, పోలిగాడు, సింవచలం, ముత్తేలమ్మా, రత్తాలమ్మా లుంగసుట్టుకొని ఏడుత్తా వుంటే నమ్మకతప్పింది కాదు.
నమ్మగానే ఎక్కడో గుండెలో సిక్కబడి ఓ మూల నక్కిన మా బడుగోల్ల రత్తం కరిగి నీరయి కళ్ళ నుండి సుక్కలు సుక్కలుగా కారతంది పెబుత్వవోల్ల కొళాయి నీళ్ళ లా…మరి ఏడవటానికి మా ఒంట్లో రత్తవెక్కడిది బావూ!
“ఆయనెల్లి పోతమేంతే పిచ్చిముండకానా, ఆయనకి సావులేదు. మవానుబావుడా యన’ అని ఎంత మంది సెప్పిన యేతో దుక్క మాగతం లేదు. మా దుక్కాలు అయిసు గడ్డలాంతివి బావూ! ఆ సంగతి నీకూ తెల్సు. అవి కరగవు. గొంతులో రాల్లలా అడ్డం బడతా యి. నీ కోసం నేదుక్కవడ్డం ఓ గొప్ప సంగతి కాదు. నీ గురించి తెల్సినోల్లంతా బతికినంత కాలం దుక్కబడతానే వుంతారు. ప్లీడరీ పట్టా పుచ్చుకుని నాబాల కోసమాలోచించకుండా మాలొంటోల్లకి నేయం సేసి పెట్టినావు! ముండలు ఈది గుమ్మాలట్టుకేలాడతారు. నక్కలు గోతులట్టుకే లాడతాయి, ప్లీడర్లు కోర్టులట్టుకేలాడతారని సెప్పిన నువ్వు డబ్బు కోసం ఎప్పుడూ గడ్డి తిన్లేదని మాకు తెల్సు బావూ! డబ్బు కోసం నోకం నోకమంతా పడుసుకుం టుందని ఎంత గొప్పగా నిజాన్ని కుండబద్దలేసినట్టు సెప్పేవు నువ్వు!
నువ్వు కతలు రాశావని- ఆటినిండా మా పేదోల్ల యెతలేనని మా పేట్లో అచ్చరాలు నేర్సిన గౌరి సెప్పింది.
నేనొరెల్లబెట్టేను. సాలా యిసిత్రకమనిపించింది. కలలో కూడా కరీదయినయ్యే సూద్దామనుకునే ఈ నోకంలో నువ్వు కాగితాల్నిండా మా కన్నీల్లు, కట్టాలు పరిసేవని తెలిస్తే యిసిత్రికం కాదా! ఓ మూల కూసుని నువ్వు మా బతుకుల్నే రంగుల సినిమాలా సూసేవని మాకసలు తెల్దు బావూ!!
కలవట్టుకుని పోలిసోల్లనీ, ప్లీడర్లనీ అంతెందుకూ… ఈ దగాకోరు లోకాన్నంత నువ్వు సీల్సి సెండాడేస్తావని, ఆ దెబ్బకి అల్లంతా జెజ్జరిల్లి పోయి తోకలు ముడిసి పరిగెత్తాల్సిం దేనని గౌరి సెబుతుంటే నా కళ్ళు సెలమలయ్యేయి. ఎవురు బావూ, ఈ నోకంలోమాలాంటి దరిద్ర నారాయణుల సంగతులాలోసించేది! పొద్దుటేళ్ళ లెగిసిన కాణ్ణుంచి అద్దరేత్రుల దాకా అంగడిలేని గొంతులు నింపుకోటమే సరిపోయే ఈ నీస నిక్రుష్ట ఎదవ నంజి కొడుకు లకి, ఇంకోడి దుక్కం, ఇంకోడి బాద, ఇంకోడి కన్నీల్లు కావాలా? నయం! ఇంకోడి బొందల మీన ఈల్లు మేడలు కట్టకపోతే అదే వదివేలు!
లంజెలు రోడ్లెంట, రిచాలంట, కార్లంట తిరిగి ఒళ్ళమ్ముకుంతన్నారు. గుళ్ళోకెళ్ళి కొబ్బరి కాయ సెక్క, కాన్టబ్బులిస్తే ఆ దేవుడి దయే అమ్ముతున్నారు. డబ్బుకి సదివిన సదువులే అమ్ముతున్నారు.ఎక్కడ సూసినా అమ్మకం అని ముత్తేలమ్మ నోటితో పచ్చి నిజాలు సెప్పిన నువ్వు సీసాడు మందుకి, కాసిని పచ్చ నోట్లకి కలాలమ్ముకుంతన్న వోల్ల సంగతులు తెలిసే అస య్య మేసి రాయటం మానేసి ఎల్లిపోనావా? ఇంకెవలున్నాలు బావూ, మా సంగతుల్రాయటానికి! అన్నిందాల సెడిన ఈ లోకాన్ని బాగు సెయ్యటం నా తరం కాదని ఎల్లి పోనావా? బంగారలాంతి నీ నవ్వు ఈ పొడల పాము లాంతి బూమ్మీద పడకూడదని ఎల్లిపోనావా? ఎల్తూ ఎల్తూ మమ్మల్ని కూడ తీసికెల్తే ఈ పీడాకారి నోకంలో పాపాలు, మోసాలు సూడకుండా సచ్చి బతికేటోల్లం!
ఇంకెవరికన్నా ఈ సీకాకులం గైరమ్మల సంగతి సెప్పి కనికారం సూపించమని – అల్ల కన్నీల్లు పట్టించుకోమని- ఆల్ల బతుకుల్లోని బుగ్గిని కలంతో బయటకుదియ్యమని సెప్పకుండానే ఎల్లిపోనావా బావూ!
నా పిచ్చిగాని అంత నిజాయితీ ఎవరికుంది బావూ! బూతు కతలు రాయొద్దని సెప్పేవంత నంతోసం ! కాని ‘ఎవురి కలాల్తో అల్లనే ఆల్ల బుర్రలోని ఆలోసనాలు రాసుకోండ్రా దయిద్రుల్లారా’ అని కూడా సెప్పాల్సింది.
ఇంకే వుంది. యిస్వనాద బావూ, నిన్నటి పూల రేకు నొక్క తొక్కతే రాలిపోతన్నాయి. కొత్త మొగ్గలు నేవేలేవు. రేపటి వూల మీన ఆస కూడా లేదు. గుండెలో పొగిలిన ఆవేశాన్ని కలంలో పొంగించగల మడుసులింక లేనేలేరు.
అందుకే ఈ పాడు నోకం ఒగ్గేసి వలసెల్లి పోనావు. అక్కడ ఆ నోకంలో లాగానే నువ్వు నవ్వుతున్న శబద్ధం మా సెవులు యినిపిస్తంది. కల్లాకపట మెరగని నీ నవ్వు లోంచి ఎప్పుడన్నా రాలిన ముత్తేలు మాకు దొరికితే
అదే పదేలు. నువ్వు నిజాయితీగా స్రుష్టిచ్చిన రత్తాలు, ముత్తేలు, నీకెప్పుడూ కన్నీటి ముత్తేల సరాలు గుచ్చుతూనే వుంటారు… నీ మెడలో ఎయ్యటానికి.
మల్లీ ఓ సుక్కలా నువ్వు ఎప్పుడన్నా పై నోకాల్నుండి మెరిసి కనిపిస్తావన్న బోల్డంత ఆసతో ఈ సమ్మం ఓరన నిలబడి నీ కోసమే సూస్తూ…..
– నీ కతల్లోని వేనవేల రత్తాలమ్మలు, ముత్తేలమ్మలు!
*****
(సశేషం)
నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.