నా జీవన యానంలో- రెండవభాగం- 44

-కె.వరలక్ష్మి

          కథ 2007 ఆవిష్కరణ ఆ సంవత్సరం నందలూరులో జరుపుతున్నామని ఆహ్వానం వచ్చింది. జూన్ 12 సాయంకాలం సామర్లకోట వెళ్ళి తిరుమల ఎక్సప్రెస్ ట్రెయిన్ ఎక్కేను. దాంట్లో వైజాగ్ లో ఎక్కిన మల్లీశ్వరి, వర్మ, వేణు, చలం, జాన్సన్ చోరగుడి ఉన్నారు, నా టిక్కెట్ కూడా వాళ్ళే రిజర్వేషన్ చేయించేరు. అప్పటికి మా ఇంట్లో అగర్వాల్ స్వీట్స్ వాళ్ళు అద్దెకుండడం వల్ల నేను రకరకాల స్వీట్స్, హాట్స్ పేక్ చేయించి పట్టుకెళ్ళేను. ఇంకా ఇలాంటివి పాటిస్తున్నారా అంటూ జాన్సన్ సంతోషంగా అన్నాడు. సాయంకాలం స్నాక్స్ గా అందరూ హేపీగా తిన్నారు. రాత్రికి విజయవాడలో జాన్సన్ గారు తెప్పించిన వేడి వేడి ఇడ్లీ, జూస్ కడుపునిండా పట్టించాం. తెల్లవారి 5 గం.కి తిరుపతి స్టేషన్లో దిగేం, ముందే ఏర్పాట్లు చేసి ఉండడం వల్ల శ్రీనివాసం రూమ్ నె. 420 లో రిఫ్రెష్షై 9 గంటలకి నందలూరు బస్సులో వెళ్ళేం. డైరెక్ట్ గా ఆవిష్కరణ సభకు చేరు కున్నాం. వాసిరెడ్డి నవీన్, దాసరి అమరేంద్ర ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించేరు. సభలో కేతు విశ్వనాథరెడ్డి, శివారెడ్డి వంటి సీనియర్ రచయితలు, కవులతో బాటు కొత్త రచయితలు చాలా మంది ఉన్నారు. సభ ఏదో చిన్న స్కూల్ కాంపౌండ్ లో జరిగింది. రాత్రికి అందరికీ నందలూరు రాజేంద్రప్రసాద్ గారింట్లో భోజనాలు, ఆడవాళ్ళందరికీ వారింట్లోనే బస. మగవాళ్ళందరికీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసారట. రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి గ్రంథాలయం ఉంది. మేమంతా మామా పుస్తకాలు పట్టుకెళ్ళి ఇచ్చాం. ఆయన యువకులు, అభ్యుదయ భావాలు కలవారు. ఆ తర్వాత కాలంలో ఏదో అనారోగ్యం వల్ల హఠాత్తుగా కాలం చేసారు.

          14 ఉదయం అందరం కారుల్లో నందలూరు సౌమ్యనాథాలయానికి వెళ్ళేం. ప్రాచీన మైన ఆలయం అది, గర్భగుడిలో స్వామి ప్రతిమ అచ్చం తిరుమల శ్రీ వెంకటేశ్వర విగ్రహంలాగే ఉంది. ఆలయ ప్రాకారం, లోపలి వైశాల్యం చాలా పెద్దది. తర్వాత తాళ్ళపాక వెళ్ళి ఇటీవల స్థాపించిన అన్నమాచార్య పెద్ద విగ్రహం, లోపలి ఊళ్ళో ఉన్న చిన్న విగ్రహం, అన్నమయ్య జన్మ ప్రదేశాన్ని చూసాం.

          మధ్యాహ్నం నందలూరులో ఒక చిన్న హోటల్లో భోజనాలు చేసి మా గ్రూప్ ఆరుగురం ప్లస్ ప్రతిమ తిరుపతి బస్సెక్కాం, మేం బస్సులో ఉండగా కోటపురుషోత్తం గారు ప్రతిమకు ఫోన్ చేసి మమ్మల్ని వాళ్ళింటికి డిన్నర్ కి తీసుకురమ్మని చెప్పేరట, తిరుపతిలో వారి ఇల్లు చాలా బావుంది. పురుషోత్తంగారి భార్య సుజాత గారు మమ్మల్ని ఎంతో ఫ్రెండ్లీగా ఆదరించేరు. డిన్నర్ లో వేడి వేడి దోసెలు, చికెన్ కర్రీ, పెరుగన్నం, హల్వా వడ్డించారు. రాత్రి 8.30 కి స్టేషన్ కి చేరుకుని తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కేం. ఇంటికి చేరుకోగానే మర్నాడు అందరికీ ఫోన్లు చేసి థేంక్స్ చెప్పేను.

          2008 జూలై 20 ఆంధ్రజ్యోతి ఆదివారం స్పెషల్ లో నా కథ ‘శివంగి’ వచ్చింది. డైరెక్టర్ వంశీ, శాంతసుందరిగారు, విజయనగరం నుంచి వెంకట్రావుగారు, నందలూరు నుంచి రాజేంద్రప్రసాద్ గారు, మదనపల్లి నుంచి పుష్పాంజలి, శివలక్ష్మి, కొండేపూడి నిర్మల మొదలైనవాళ్ళు ఫోన్లు చేసి కథ తమకి ఎంత నచ్చిందో, ఎందుకు నచ్చిందో చెప్పేరు. పత్రికలో ఫోన్ నెంబరు ఇవ్వడం వల్ల ఎంత మంది ఫోన్లు చేసారో చెప్పలేను.

          ‘ఓ చిన్న అభినందన ఓ మనిషి జీవితకాలాన్ని, ఓ రచయిత శృజన కాలాన్ని మరికొంత పెంచుతుంది.’

          ఆగష్టు 5న అనంతపురం నుంచి శాంతినారాయణగారు ఫోన్ చేసి ఆ సంవత్సరం కథలకిచ్చే విమలాశాంతి పురస్కారం నా ‘అతడు – నేను’ పుస్తకానికి ఇవ్వబోతున్నట్టు చెప్పేరు. సెప్టెంబర్ 7న తిరుపతిలో జరిగే పురస్కార సభకు రమ్మని పిలుస్తూ అభినంద నలు తెలిపేరు. కాళీపట్నం రామారావు, కేతు విశ్వనాధరెడ్డి, సూర్యసాగర్ జడ్జెస్ అట.

          ఆగష్టు 13 న వరంగల్ సహృదయ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది ‘అతడు – నేను’ పుస్తకం సహృదయ అవార్డుకి ఎన్నికైందని, 31న అవార్డు సభకి రమ్మని. జడ్జెస్ అంపశయ్య నవీన్, ఆడెపు లక్ష్మీపతి గార్లట.

          ఆగష్టు 28 ఉదయానికి హైదరాబాద్ చేరుకున్నాను. 30న తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్న సాహిత్య అకాడమీ సభకి మా అబ్బాయి తీసుకెళ్ళేడు.

          31 మధ్యాహ్నం లంచ్ తర్వాత మా అబ్బాయి కుటుంబం, వాళ్ళ అత్త మామల్తో సహా అందరం ఇన్నోవా కారులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకి వరంగల్ చేరుకున్నాం. రచయిత రామాచంద్రమౌళి తన కారులో మాకు ఎదురొచ్చి వాళ్ళింటికి తీసుకెళ్ళేరు, ఆయన భార్య లలిత గారు ఎదరొచ్చి సాదరంగా ఆహ్వానించేరు. వారింట్లో శాలువా కప్పి చిన్న సన్మానం చేసారు. 6.30 కి సభా వేదిక చేరుకున్నాం. అప్పటికే హాలు నిండిపోయి ఉంది. సహృదయ సన్మాన కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆడెపు లక్ష్మీపతి, అంపశయ్య నవీన్, రామాచంద్రమౌళి నా కథల గురించి బాగా మాట్లాడేరు. సభముగిసేక అశోకా హోటల్లో డిన్నర్ అరేంజ్ చేసారు. అక్కడికి దగ్గర్లోనే ఉన్న నవీన్ గారి ఇల్లు చూసి బయలుదేరాం. మాతో లక్ష్మీపతి గారిని కూడా తీసుకొచ్చి వాళ్ళ కాలనీలో దించి వచ్చాం.

          సెప్టెంబరు 7న జరిగే విమలాశాంతి పురస్కార సభకు అ సాయంకాలం మా అబ్బాయి రవి, నేను నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో ఎక్కి 7 ఉదయం తిరుపతిలో దిగేం. పద్మావతి గెస్ట్ హౌస్ లో శాంతి నారాయణగారు, విమలగారు మమ్మల్ని రిసీవ్ చేసుకు న్నారు. మాకు ఇచ్చిన రూమ్లో రిఫ్రెష్షై ఉదయం 10 కి శ్వేత భవనంలోని సభాప్రాంగణా నికి చేరుకున్నాం. కథా రచయితగా నాకు, కవిగా తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ కి పురస్కా రాలు ఇచ్చి, ఘనంగా సన్మానించేరు. వక్తలంతా బాగా మాట్లాడేరు. మొత్తం రాష్ట్రం నుంచి రచయితలు, కవులు చాలా మంది వచ్చారు, సాయంకాలం రవి హైద్రాబాద్ కి, నేను శేషాద్రిలో మా ఊరికి బయలుదేరాం.

          ఆ అక్టోబర్ 1న నేను అవార్డులు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మా జగ్గంపేట రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు నన్ను సన్మానించేరు.

          అక్టోబర్ 4, 5 తారీఖుల్లో విజయవాడ దగ్గర ఉన్న చిగురు సేవాసదన్ లో రచయితల సమావేశాలు జరగబోతున్నాయి, రమ్మని ఆంధ్రజ్యోతి ఉమామహేశ్వర్రావు నుంచి పది రోజుల ముందు ఫోన్ లో ఆహ్వానం అందింది. అక్టోబర్ మూడు ఉదయం జన్మభూమిలో విజయవాడ వెళ్ళి ఎప్పటినుంచో వాళ్ళింటికి రమ్మని పిలుస్తున్న మా పెద్ద చెల్లెలు పెద్ద కూతురు పద్మకు ఫోన్ చేసాను. వెంటనే పద్మవాళ్ళాయన బైక్ మీద వచ్చి వన్ టౌన్ లో ఉన్న వాళ్ళింటికి తీసుకెళ్ళేడు. పద్మ ఎంతో ఆప్యాయంగా నా కిష్టమైనవి చేసి పెట్టింది. మర్నాడు ఉదయం 9 కి నన్ను ‘చిగురు’కి తీసుకెళ్ళి దిగబెట్టేరు. కృష్ణాబేరేజ్ దాటేక గుంటూరు రోడ్డు నుంచి కుడివైపు ఒక రోడ్డు చీలింది.  ఆ రోడ్డు అమరావతి వెళ్తుందట. ఆ రోడ్డులో 4వ కిలోమీటరు దగ్గర పేద, అనాధ పిల్లల కోసం నిర్మించిన చిగురు అనే సేవా సదన్ అది, అందమైన బిల్డింగ్స్, పక్కనే కృష్ణానది, పచ్చని అరటితోటలతో అద్భుతంగా ఉంది. అక్కడి ఒక పెద్ద హాల్లో రచయితల సమావేశం. తుమ్మేటి, కె. శ్రీనివాస్, ఖదీర్, వి. చంద్రశేఖర్రావు, పి. సత్యవతి, ప్రతిమ, మల్లీవ్వరి, జాన్సన్ చోరగుడి, గొరుసు, వెంకట కృష్ణ వంటి సీరియస్గా రాస్తున్న రచయితలు అంతా వచ్చారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు, భమిడిపాటి జగన్నాధరావు గారు వంటి సీనియర్ రైటర్స్ తో బాటు అక్కడి మినిస్టర్ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు, కథ పైన సీరియస్ చర్చ జరిగింది, రాత్రి 9కి విజయవాడ రచయితలంతా దగ్గరే కాబట్టి వెళ్ళి  పోయారు. నేనూ, ప్రతిమ మాత్రం మాకు కేటాయించిన రూంలో ఉండిపోయాం.

          ఉదయం కాఫీ కోసం వెళ్ళినప్పుడు అక్కడి కొందరు పిల్లల్ని పరిచయం చేసుకుని, వాళ్ళ మధ్యలో కూర్చుని కబుర్లు చెప్పేను, ఒక చిన్న బుజ్జి పాపాయి ఉంది. దాని పేరు స్వీటీ, ఎంతో క్యూట్ గా ఉంది. 9 కి మళ్ళీ సెషన్ మొదలై మధ్యాహ్నం వరకూ నడిచింది. బోజనాల తర్వాత అందరం బై చెప్పుకొని బయలుదేరేం.

          నవంబర్ 9 మా పక్కింటి వైశ్యకుటుంబం పాపికొండలు చూడ్డానికి వెళ్తున్నాం, వస్తారా అంటే వాళ్ళ కారులో నేనూ వెల్లేను, అప్పుడు రచయిత్రులందరితో కలిసివెళ్ళి  చూసిన వరదగోదావరి, మబ్బులు – వర్షం, కొండల పై నుంచి దూకే సెలయేళ్ళు  – ఆ అందం వేరు, ప్రశాంతంగా ప్రవహిస్తూ ఇసుక మేటలు వేసిన ఇప్పటి గోదావరి అందం వేరు. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్నాం.

          ‘‘అమ్మాయ్, ప్రయాణాలు బాగానే చేస్తున్నావుగా! నా పుట్టిన రోజుకి రాకపోతే మాత్రం ఊరుకోను’’ అని ఫోన్ చేసి దబాయించారు ఆవంత్స సోమసుందర్ గారు, ఆ నవంబర్ 18 న సోమసుందర్ గారి 85 వ పుట్టినరోజు. కొందరు తూర్పు గోదావరి రచయితల్తో బాటు సన్మానితులు సామలరమేష్ బాబు (నడుస్తున్న చరిత్ర), చినుకు రాజగోపాల్, స.వెం. రమేశ్, శీలా వీర్రాజుగారు, సుభద్రా దేవి, రామతీర్థ మొదలైన వాళ్ళంతా వచ్చారు. శీలా వీర్రాజు గారు ఎంతో బాగా పలకరించి, ఆత్మీయంగా బోలెడన్ని కబుర్లు చెప్పేరు. డా. సీతారామస్వామి రాత్రి ట్రెయిన్ కి వెళ్ళే వాళ్ళతో బాటు నన్నూ సామర్లకోటలో దిగ బెట్టేరు.

          ఆ డిశంబరు 8, 9, 10 తేదీల్లో పుట్ల హేమలత నడుపుతున్న మనోజ్ఞ అకాడమీతో కలిసి సాహిత్య అకాడమీ సాహిత్య సభలు ఏర్పాటు చేసింది. వారి ఆహ్వానం మేరకు రాజమండ్రిలో జరుగుతున్న ఆ సభలకు అటెండయ్యాను. ఆహూతులందరికీ అకామడేషన్ సూర్య హోటల్లో ఇచ్చారు. పెద్ద రూమ్స్. చాలా బావున్నాయి. కాని హోటల్ కొంత పాతబడింది. సభలు మాత్రం జాంపేటలోని ఉమారామలింగేశ్వర కళ్యాణమండపంలో జరిగాయి. 9న జరిగిన కవి సమ్మేళనానికి నేను అధ్యక్షత వహించాను. అంపశయ్య నవీన్ గారు, అనసూయగారు అన్నవరం వెళ్తూ మధ్యలో జగ్గం పేటలోని మా ఇంటికి వచ్చారు. ఇద్దరికీ బట్టలు పెట్టి సత్కరించేను.

ఆ సంవత్సరం –

7.5.2008 నవ్యవీక్లీలో ‘కడలి అలలలో కాగితంపడవ’ పోయెమ్ –

11.5.08 ఆదివారం వార్తలో ‘రేపటి పుట’ పోయెమ్ –

4.6.08 ఆంధ్రజ్యోతిలో ‘చేతులు కలవాల్సిన చోట’ పోయెమ్ –

19.6.08 ఆంధ్రభూమి డైలీ సాహితిలో ‘నిశ్శబ్ద అంతరంగం’ పోయెమ్ –

20.6.08 ఆదివారం ఆంద్రజ్యోతిలో ‘శివంగి’ కథ –

ఆగష్ట్ 2008 భూమికలో ‘వివాహ మహోత్సవం’ పోయెమ్ –

సెప్టెంబర్ 2008 పినాకిని లో ‘నదులు వేరైన చోట’ పోయెమ్ –

సెప్టెంబర్ 2008 ప్రస్థానంలో ‘కార్సినోమా కార్సినోమా’ పోయెమ్ –

12.11.08 నవ్య వీక్లీలో ‘తోడు’ కథ –

డిశంబర్ 08 నాని బాలల పత్రికలో ‘వేమన పద్యాల కథలు’ ప్రారంభం-

4.4.08 – 5,4.08 ఎక్స్ ప్రెస్ నెట్ వర్క్ లో ‘అతడు – నేను’ కథలు –

వచ్చాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.